పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇదికూడా ఆధునికవిజ్ఞానం దృష్ట్యా పరిశోధించవలసిన విషయమే. "సూర్య ఏకాకీ చరతి చంద్రమా జాయతే పునః" అని వేదం సూర్యుడు స్వతంత్రంగా ఏకైకుడై సంచరిస్తున్నాడనీ సూర్యునివల్లనే చంద్రుడు ప్రకాశిస్తున్నాడనీ స్పష్టంగా పేర్కొన్నప్పటికి సూర్యుడు కేవలం ఒక్కడేనని మాత్రం వేదం ఆమోదించలేదు. ఈ సృష్టిలో ఏయే దిక్కుల్లో ఎన్నెన్ని సౌరమండలాలు ఉన్నాయో చెప్పడం సాధ్యపడదన్న ధోరణిలో "దశదిశో నానా సూర్యాః" అని అష్టదిక్కుల్లోనే కాదు దశదిశల్లోనూ అనేకమంది సూర్యులున్నారని వేదం పేర్కొన్నది. అయినా ఈ అనంతమైన వేదవిజ్ఞానాన్ని గుర్తించలేక కొంద రవ్యక్తులు పురాణాలలో సూర్యపరంగా సూర్యు డొక్కడేనని ఆ సూర్యుడే చైత్రాది ద్వాదశమాసాలలోనూ ద్వాదశనామాలతో పేర్కొనబడతాడని అ రూపంగా ఏకైకుడైన ఆదిత్యుడే ద్వాదశాదిత్యులుగా పరిగణనలోకి తీసికొనడం జరిగిందని ఈ క్రిందివిధంగా పేర్కొనబడడం జరిగింది. చైత్రమాసంలో సూర్యుణ్ణి "ధార" అంటారనీ అతనికి కృతస్థలి, హేతి, వాసుకి, రథకృత్తు, పులస్త్యుడు, తుంబురులు పరిజనంగా ఉంటారనీ పేర్కొన్నారు. వైశాఖమాసంలో సూర్యుడు "అర్యముడుగా" పేర్కొనబడి పులహ, భోజ, ప్రహేళి, పుంజకస్థలి, నారద, కంజనీరులు పరిజనంగా వెలుస్తారని ఉటంకించారు. జ్యేష్ఠమాసంలో సూర్యుడు "మిత్ర" నామకుడై అత్రి, పౌరుషేయ, తక్షక, మేనక, హాహా, రథ స్వనులనబడే పరిజనంతో విరాజిల్లుతాడన్నారు. ఆషాడమాసంలో "వరుణుడు"గా పేర్కొనబడే సూర్యుడు వశిష్ఠ, రంభ, సహజన్య, హూహు, శుక్ర, చిత్రస్వనులు పరిజనంగా విరాజిల్లుతాడు. శ్రావణమాసంలో సూర్యుడు "ఇంద్ర" నామకుడై విశ్వానసు, శ్రోత, ఏలాపుత్ర, అంగిరస, ప్రమ్లోచి, చర్ములనబడే పరివారంతో భాసిల్లుతాడు. భాద్రపదమాసంలో "వివస్వంత" నామకుడై సూర్యుడు ఉగ్రసేన, వ్యాఘ్ర, అసార, భృగు, అనుమ్లోజ, శంఖపాల నామకులైన పరిజనంతో విలసిల్లుతాడు. ఆశ్వీయుజమాసంలో సూర్యుడు 'త్వష్ట' నామకుడై అంబళాస్వ, తిలోత్తమ, బ్రహ్మోపేత, శతజిత్, ధృతరాష్ట్ర, ఇషంభరులు పరివారంగా ఉంటాడు. కార్తీకమాసంలో సూర్యుడు "విష్ణువు"గా విరాజిల్లుతూ అశ్వతర, రంభ, సూర్యవర్చస, సత్యజిత్, విశ్వామిత్ర, మఘోపేత నామకులైన పరివారంతో ప్రకృష్టుడై ఉంటాడు. మార్గశిరమాసంలో సూర్యుడు "తుర్యమ" నామకుడై కశ్యప, తార్క్ష్య, ఋతసేన, ఊర్వశి, విచ్యుచ్ఛతు, మహాశంఖనామకులైన పరిజనావృతుడై ఉంటాడు. పుష్యమాసంలో సూర్యుడు "భగ" నామకుడై స్ఫూర్జ, అరిష్ఠనేమి, ఊర్ణ, ఆయు, కర్కోటక, పూర్వజిత్తి నామకులైన పరివారంతో విరాజిల్లుతాడు. మాఘమాసంలో సూర్యుడు "పూష" నామకుడై ధనంజయ,