పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నది వియల్లింగ మన దశహస్తమిత మ
హోచ్చతయు నిన్మడి వెడల్పు నొనరి వెలయు.

(నార. 211. పు. 106, 107, 109. ప.)

ప్రహ్లాదుడు హరిస్మరణమహిమను ప్రశంసించే సందర్భంలో "స్వభిన్నునింగా నీశ్వరుని వేరుగాఁ దలంచినవాడు విషయార్థప్రత్యగాత్మయైన యీశ్వరు నెట్లు సేవించు? యామ్యదిశకుం బోయినవాఁడు మేరునగంబు విలోకించునే?" (నార. 475. పు. 140. ప) అని మేరుపర్వతం యామ్యదిశలో లేదని సూటిగా పేర్కొన్నాడు. అయితే గతంలో కొందరు పరిశోధకులు మేరుపర్వతం భూమిమీదనే వున్నదని అభిప్రాయపడడంలో వాస్తవికత లేదని "శ్రీ విరూపాక్ష-శ్రీరామశాసనములు-ఆరవీటివంశచరిత్ర"[1] అన్న నా పరిశోధనాగ్రంథంలో సవివరంగా 'శ్రవణానక్షత్రానికి అత్యంత ఉన్నతస్థానంలో వున్న విష్ణుస్థానానికి కొంత దిగువుగా యీ మేరుస్థానం వున్నట్లు" తెలియజేశాను. (చూ. CXV-CXVL. పు.)

మామూలుగా వైజ్ఞానికదృక్పథంతోనేకాక, సంప్రదాయసిద్ధంగా కూడా సూర్యోదయసమయంలోని యెండ ఆరోగ్యకరం కాదని, సూర్యాస్తమయకాలంలోని వృద్ధాతపం చాలా ఆరోగ్యప్రద మయినదని, భావించడం జరుగుతున్నది. నారదీయపురాణంలో నృసింహావిర్భావం తరువాత "సదా సూర్యుండు బహుయోజనసహస్రంబు లక్షణంబునఁ బోవుచు వేగంబున జనుల యాయువు చయింపంజేయు నార్తప్రమత్తసుప్తవ్యాదితులైన వారి నుష్ణధాముండు హ్రాసంబు నొందించుంగాని విడంబంబు సేయందు" (నార. 509. పు. 273. వ) అని అసలు సూర్యుడే మానవుల ఆయుర్దాయాన్ని క్షయింపచేస్తాడని నరసింహకవి యే మూలగ్రంథం ఆధారంగానో పేర్కొంటున్నాడు. ఆర్షవిజ్ఞానదృక్పథంలో వున్న యీ విషయాన్ని ఆధునికవైజ్ఞానికులు పరిశీలించవలసి వున్నది.

నరసింహకవి యుగాదినిర్ణయవివరణాసందర్భంలో సూర్యుడు ఉత్తరాయణాన్ని విడిచి దక్షిణాయణంలో ప్రవేశించే మధ్యకాలం విషమకాలమని, దాన్ని ముక్తకకాలం అంటారని యీక్రింది పద్యంలో తెలియచేశాడు.

"ఉత్తరాయణ ముడిగి సూర్యుండు వేగ
దక్షిణాయనమున కేఁగుతఱి మెలంగు
మధ్యకాలంబు విషమమై మహిఁ జెలంగు
నదియె ముక్తకనామధేయము వహించు."

(నార. 194. పు. 24. ప.)

  1. ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ అండ్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రచురణ.