పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ సందర్భంలో 'తునుమన్‌' అని అన్నఁ తార్థకక్రియను 'చరించున్‌' అని తద్ధర్మార్థకక్రియను ప్రయోగించడం ద్వారా యిది భవిష్యత్తులో జరుగబోతుందన్నవిషయాన్ని నరసింహకవి తేటతెల్లం చేశాడు. ఇదేవిధంగా నరసింహకవి రత్నావళి వృత్తాంతవర్ణనాసందర్భంలో భవిష్యద్భారతపురాణవిషయాన్ని భవిష్యత్తులో జరుగనున్న విషయంగానే యీ క్రిందివిధంగా పేర్కొన్నాడు. "భవిష్యద్భారతపురాణంబున హిడింబి యను రాక్షసి భీమసేనుం డను పాండవునకు భార్య గాఁగలదు. అతనికంటె బలాధికుండైన ఘటోత్కచుండను తనయుండు జనియింపఁ గలండు. వాని నేశస్త్రంబుల వధింపఁ దరంబుగాదు. ఇంద్రశక్తిచేత సాధ్యుండు గాఁగలఁడు." (నార. 290. పు. 129. వ.). నిజానికి నారదీయ పురాణం వరాహ నరసింహావతారాలకు పూర్వమే ప్రోక్త మయిందని శౌరి సనకాదులకు మోక్షప్రాప్తివిధానాన్ని యెరిగించిన సందర్భంలో విస్పష్టంగా తేటతెల్ల మవుతున్నది.

"ఔరసపుత్రుఁడై శ్రుతి శిఖార్థము లాడుచు మామకుం డొకం
డీరస మొప్పఁ దండ్రిఁ గవయించఁగ మీఁదనె తీర్చు వాదులన్
సూరల గెల్చి శౌరి నిదె చూపెద నెందు నటంచు నాడినం
జేరి మహోగ్రవీరనరసింహనిజాకృతిఁ గాంచి నిల్చెదన్.

పాటిల్లెడు నీ మాయా
నాటకసూత్రంబునందు నా ప్రతిహారుల్
మేటులు జయవిజయులు ని
త్యాటోపులు మత్ప్రయోజనాయత్తు లిలన్.

(నార. 417. పు. 102, 104. ప.)

ఈ సందర్భంలో విష్ణువు జయవిజయులు హిరాణ్యాక్ష, హిరణ్యకశిపులుగా సంజనితు లవ్వడానికి పూర్వమే తన నరసింహావతారవిశేషాన్ని గురించి విస్పష్టంగా వక్కాణించినట్లు ద్యోతక మవుతున్నది. అంతేకాదు, నారదప్రోక్తమైన యీపురాణంలో నారదుని కంటే అతిప్రాచీనకాలంలోనే జరిగిన చతుర్వేది కథను నారదుడు మునులకు వివరించినపద్ధతి చూడగా నారదీయపురాణప్రాచీనత్వమేకాదు, నారదప్రోక్తత్వంసైతం స్పష్టంగా తేటతెల్లమవుతున్నది. "అనిన మునులం జూచి నారదుండు మద్గురుండు నాకు నానతి యిచ్చిన క్రమంబు వినుం డెఱింగించెదనని యిట్లనియె" (నార. 129. పు. 166. వ) అని నారదుడు తనకు తన గురువు చెప్పిన రాజపురోహితుడైన చతుర్వేది కథ చెపుతాడు. ఈ కథారూపంగా చతుర్వేది బ్రహ్మరాక్షసు డవ్వడం, అనంతరం భాగవతానుగ్రహంతో