పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రూఫంబుగా వర్తింపవలయు. తపోయజ్ఞదానయోగార్చనంబులు సేయుట వృథాయాసంబులని తత్త్వంబునం జూచువారిని మహీతలంబున మోహంబు నొందింతురు. కొంద ఱాత్మదేహభిన్నంబని యెఱింగియు నాదేహంబునకు క్షణవినాశత్వంబు తర్కకర్కశులై పల్కుదురు. (నార. 147, 148. పు. 5. ప.) అని ఈ సందర్భంలో నారదుడు మునులకు చెప్పినట్లుగా సూతుడు శౌనకాదులకు చెప్పిన ప్రవచనంలో భవిష్యదర్దకమైన "పల్కుదురు" అన్న క్రియను విస్పష్టంగా ప్రయోగించడం మనం గుర్తించవలసి వున్నది. అనంతరం సరిగ్గా నాలుగుపద్యాల తరువాతనే "శఠునఁ బాషండజనులను సంహరించె" అని శాండిల్యుడనే మహర్షి పాషండజైనులను సంహరించినట్లు భూతార్థకక్రియను సూటిగా ప్రయోగిస్తూ నరసింహకవి యీ క్రిందిపద్యం రచించాడు.

"రూఢి శాండిల్యుఁ డను మునీంద్రుండు మున్ను
పాంచరాత్రప్రమాణప్రభావశక్తి
నాగమార్థంబు వ్యర్థమౌ నట్లొనర్చు
శఠులఁ బాషండజనులను సంహరించె."

(నార. 149. పు. 10. ప.)

ఇదేవిధంగా ప్రహ్లాదుడు సభలో నిలిచి తన పాండిత్యతత్త్వ విష్ణుభక్తి మహత్వాలను వివరించిన సందర్భంలో-

"పాషండమతగర్వపర్వతంబులమీఁద
         దంభోళియై మహోద్ధతి వహించి
చార్వాకమతమహాసాగరావళిమీఁద
         నౌర్వానలస్ఫూర్తి నాక్రమించి
బౌద్ధదంతావళోద్భటఘటార్భటిమీఁద
         సింహరాజంబు ప్రసిద్ధి నెదిరి
జైనమహారణ్యసంఘాతములమీఁద
         నతులదావానలంబై స్ఫురించి
కపిలాక్షపాద కాణాచ వైరించ
మత ఘనాంధరమున మండలార్క
మండలప్రకాండఖండనోద్దండత
నట జయించె నాకయాధసుతుఁడు."

(నార. 445. పు. 5. ప.)