పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ఖట్వాంగుఁడను రాజర్షి ముహూర్తాయుఃప్రమాణం బెఱింగి సర్వంబు విసర్జించి హరిం జెందె. పరీక్షితుండు సప్తాహంబు జీవితావధిగాఁ దెలిసి నిఖిలంబుం బరిత్యజించి యపవర్గంబు గాంచె నట్లగుట న్యాసవిద్య సర్వఫలప్రద." (నార. 340 పు. 95. వ) అని ద్వాపరయుగాంతంలో వున్న పరీక్షిత్తుగురించి పేర్కొని 'అపవర్గంబు గాంచె" అని భూతకాలక్రియను ప్రయోగించడం రూపంగా యీ నారదీయపురాణం పరీక్షిత్తుకు తరువాతనే అంటే కలియుగంలో రచించబడిందన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాడు. ఇదేవిధంగా అనేకసందర్భాలలో కలియుగంలో బాగా ఆధునికా లనుకొన్న విషయాలను సైతం "అంగవేదియైన పాణిని యజిధాతువును దేవపూజయందు విధించెను." (నార. 400. పు. 49. వ.) అని "విధించెను" అనే భూతార్థకక్రియను వాడడంద్వారా నారదీయపురాణం పాణినికి తరువాత రచింపబడిందన్న అభిప్రాయాన్ని కలిగించాడు. ఈ నరసింహకవే శౌరిసనకాదులకు కర్మకాండాదివిషయాలు తెలిపేసందర్భంగా "అనీశ్వరాత్ములై కర్మములందు స్వతంత్రులు గానివారికిఁ గర్తృత్వ మెక్కడిది? పాణిని స్వతంత్రః కర్తా యనఁడు గాన," (నార. 409. పు. 63. వ.) అని 'అనఁడు' అను భవిష్యదర్థకమైన క్రియను ప్రయోగించడంద్వారా "భవిష్యత్తులో పాణిని చెప్పడు" అని శౌరి పేర్కొన్నట్లు స్పష్టంగా ఉటంకించాడు. "వేదాంతమతమునకంటె నన్యమగు మతము మంచిదికాదని తెలియక యీ వేదాంతమతము నాదరించక యీ ప్రకారమునను స్వగోష్ఠినిష్ఠులైన ఛాందసులైనవారి మనస్సులను నల్పులైనవారల నతికల్పనులైన మోహంబు నొందించి రప్పుడు.

మహిని సురాచార్యమతము లోకాయత
         మతమును సౌగతమతము భార
తీశమతంబు మిహేశమతంబును
         జైమినిమతమును జైనమతము
కాణాదమతమును గౌతమమతమును
         గపిలమతంబును ఘనత కెక్క
నంతకంటెను బ్రశస్తంబె వేదాంతమ
         తంబు సభాసమ్మతంబె తెలియ
నభ్రపుష్పోపమంబు వేదాంతమతము
తన్మహాసౌరభాఘ్రాణతత్పరాభి
మానమాయామిళిందాయమానమాన
మానవులు గొంద రంద్రు దుర్మత్సరమున.