పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహాకల్పవృక్షం వంటిది. "దశదిశో నానాసూర్యాః" అని సౌరమండలాలు అనేకం ఉన్నాయని పేర్కొన్న వేదవాఙ్మయంలో "సూర్యఏకాకీ చరతి చంద్రమా జాయతే పునః" అని సూర్యుడు స్వతంత్రంగా వెలుగొందుతున్నా డని సూర్యతేజఃప్రభావంతో చంద్రుడు ప్రకాశిస్తున్నా డని స్పష్టంగా పేర్కొన్న వేదవాఙ్మయంలో గ్రహగతులు గురించి వర్ణింపబడలేదనడం హాస్యాస్పదమైన విషయం. 1964 సెప్టెంబరు 13 వ తేదీన ఆకాశవాణి హైద్రాబాదు కేంద్రం నుంచి ప్రసారమైన నా ప్రసంగంలో వేదఋషుల ఖగోళవిజ్ఞానంగురించి వివరంగా పేర్కొంటూ ఋగ్వేదఋషి సధ్రి - మామూలుగా మనశాస్త్రాలు చెప్పినట్లు తొమ్మిదిగ్రహాలు కాక - మొత్తం 36 గ్రహాలున్నట్లుగా గుర్తించి ఒక ఋక్కులో స్పష్టపరచినట్లు నేను బయటపెట్టాను.

"షట్త్రింశాంశ్చ చతురః కల్పయన్త
శ్చన్దాంసిచ దధత అద్వాదశమ్।
యజ్ఞం విమాయ కవయో మనీష
ఋక్సామాభ్యాం ప్రరథం వర్తయన్తి॥

(ఋగ్వే-10 మం-8 అష్ట-114 సూక్తం-6 ఋక్కు)

వేదర్షియైన సధ్రి "షట్త్రింశాంశ్చ" ఇత్యాదిగా ఉన్న ఈ ఋక్కులో తొమ్మిదీ, పదీ, ఇరవైకావు మొత్తం 36 గ్రహా లున్నట్లు పేర్కొన్నాడు. ఈ 36 గ్రహసంఖ్యనే సంఖ్యాశాస్త్రానుగుణంగా తరువాత జ్యోతిశాస్త్రవేత్తలు 3+6 = 9 గా- నవగ్రహాలుగా తగ్గించి పేర్కొన్నట్లు స్పష్టమవుతున్నదని అప్పటి నా ఆకాశవాణి ప్రసంగంలో సప్రామాణికంగా నిరూపించాను. యజుర్వేదం శుక్లకృష్ణయజుర్వేదాలుగా రెండుగా విభజింపబడి శుక్లబహుళపక్షపరమై "దశదిశో నానాచంద్రమాః" అన్నట్లు అనేకానేకచంద్రగోళాల రహస్యాలను వాటి వృద్ధిక్షయాలను శుక్లకృష్ణపక్షాలపరంగా ఖగోళవిజ్ఞానప్రతిబింబమై ప్రత్యక్షప్రమాణంగా వెలుగొందుతూ ఉండగా వేదవాఙ్మయంలో తిథుల వృద్ధిక్షయాలగురించి పేర్కొనలేదనడం నరసింహకవి వేద ఖగోళవిజ్ఞాన అనభిజ్ఞతకు గీటురాయిగా గోచరమవుతున్నది. సూర్యచంద్రోదయాస్తమయాలను వర్ణించిన వేదాలు వివిధరాసులనేకాక దశదిక్కులనేకాక అష్టదిగ్గజాలనుసైతం ఖగోళశాస్త్రపరంగా పరమవైజ్ఞానికాలుగా వర్ణించగా లగ్నవిషయాలను వర్ణించలేదనడం కేవలం అజ్ఞానవిలసితమే కాగలదు. ఏమైనా వేదవాఙ్మయంపట్ల నరసింహకవి కున్న అధ్యయనాభివేశాన్ని అభిమానగౌరవాలను మనం హృదయపూర్వకంగా ప్రశంసించవలసిందే.