పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విభిన్నాలైన వేదభాష్యా లేవిధంగా ఉన్నా అనేకార్థదాయకాలై, బహుముఖాలైన వేదవిషయాల అంతర్యాన్ని నరసింహకవి కొంత ఆకళించుకున్నట్లు కన్పిస్తున్నది. వేదాలు గూఢార్థకాలని, చిత్రార్థకాలని, వివిధార్థకాలని, కొన్నసందర్భాలలో విస్పష్టంగా నరసింహకవి వక్కాణించాడు.

సాంగంబులై సరహన్యంబులైన వేదంబులు చదివి వ్యుత్పత్తి లేశజనితతద్వేదార్థవివేకరేఖలు గలవారై తద్బోధశోధననయములను గురుముఖంబులువలనం దెలిసి యశేషమూర్తియైన స్వామిని సుగమార్థంబుగా నెఱుంగంగలరు.

మ.

హరిపాదాబ్జయుగంబు గొల్చి సరహస్యాశేషవేదస్ఫుర
త్పురుషోత్తంసనిజాశయం బెఱిఁగి యుద్బోధామృతాస్వాదులై
పరమోత్కృష్టులఁ జేసి తత్పదరజఃపట్టాభిషేకంబుతో
దురసంతామరు లెన్న డుండెదరొ సాధు ల్మెచ్చ వీతార్థులై.


మ.

అని యీరీతి దయాళుదివ్యనివహాత్యంతైకశోచ్యక్రియా
ఘనదుర్బోధనివిష్టచిత్తుల వృథాగర్వాంధులన్ వేదవి
త్తనిరోధార్థకరాత్ములం గని వినీతత్వంబునన్ మ్రొక్క మ
న్నన నీక్షించి ప్రియంబు వల్కఁ దగదెన్నన్ సజ్జనుం డెన్నఁడున్.

(నార. 406-పుట-51-వ 52, 53-ప)

ఆర్షవిజ్ఞానమయాలైన వేదాలకు తద్విజ్ఞానరహితులైన పండితనామకులు వేదాలకు అప్రామాణికాలైన భాష్యాలు రచించి అసలు మనమహర్షుల వేదవిజ్ఞానానికే యెసరు పెట్టారని నేను గతంలో అనేకసార్లు పేర్కొన్నాను. గత పదిహేనుసంవత్సరాలలోనూ ఆంధ్రప్రభ, గోల్కొండపత్రికవంటి దినపత్రికలలోనూ, అనేకాలైన ఆకాశవాణి ప్రసంగాలలోనూ ప్రాచీనవేదాలలో వున్న పరమవైజ్ఞానికరహస్యాలను బహుముఖాలుగా, సప్రామాణికంగా, తిరుగులేనివిధంగా నిరూపించాను. ఈదృష్ట్యా విద్యారణ్యుల వేదభాష్య మనబడిన సాయణభాష్యం సైతం ప్రత్యక్షరప్రామాణికం కాదని నిర్ద్వంద్వంగా పెక్కువ్యాసాలలో నిరూపించాను. నరసింహకవి ధర్మాధర్మాభిమానదేవతలు, ఆత్మవృత్తిప్రకారం గురించి వర్ణించినసందర్భాన్ని పురస్కరించుకుని వేదాభిమానదేవతాప్రసక్తి తెచ్చి తద్దేవతాతత్వవేది యయిన వ్యాసమహర్షిచేత యీక్రిందివిధంగా పలికించాడు.

"వత్సా! యీ దుర్వాదృగ్యాది జన్మనిమిత్తంబు నీ వెఱింగియును దద్వాక్యంబులకు క్షుద్రనయార్థిత్వప్రసిద్ధికొఱకు నడిగితివి. విను; మిటువలె వాదించు వాదులం బూర్వంబునందు నందికేశ్వరునిచేత శపింపఁబడిన దేవద్వేషులు భూమి