పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాస్త్రవాఙ్మయంలో మాత్రం మటుమాయమైపోయింది. ఇదే నాభికాలవిభాగంగురించి మహాకవి కాళిదాసు తన కుమారసంభవంలో పార్వతితపోవర్ణనాసందర్భంగా శ్లేషాత్మకంగా యీక్రిందిశ్లోకంలో ఉటంకించాడు :-

"స్థితాః క్షణం పక్ష్మసుతాడితా ధరాః
పయోధరోత్సేధ నిపాత చూర్ణితాః
వలీషు తస్యాః స్ఖలితాః ప్రపేదిరే
చిరేణ నాభిం ప్రథమోదబిందవః"

(కుమా. 5-సర్గ, 24-శ్లో)

మేఘాలు ఒకదాని నొకటి ఒరుచుకొనడం ద్వారా మొట్టమొదట బృహత్తరబిందువులరూపంలో పైనుంచి వర్షం ప్రారంభమవడం, రానురాను క్రిందికి వచ్చేసరికి చిన్నచిన్నముక్కలుగా విడిపోవడం, వర్షం కురిసిన తరువాత భూమిమీద వివిధప్రదేశాలలో నీరు నిలవడం, తిరిగి అది సూర్యరశ్మికారణంగా ఆవిరిరూపం దాల్చి మూలస్థానానికి అంటే నాభిస్థానానికి చేరుకుంటుందన్న విశిష్టవైజ్ఞానికశ్లేషార్థాన్ని మల్లినాథసూరి గుర్తించకపోవచ్చును గాని వేదవిజ్ఞానప్రతిబింబకమైన యీశ్లోకంలోని శ్లేషార్థాన్ని విశిష్టశబ్దప్రయోగాలను మనం కాదని త్రోసిపుచ్చలేము.

నరసింహకవి శ్రుతులతోపాటు స్మృతులను సైతం ప్రామాణికాలుగా గ్రహించాడు. "ధరశ్రుతి స్మృతి వైరుధ్యతరము చైత్య సేవనాదిక కర్మముల్ సేయుచుంద్రు.........." (నార. 442-పుట. 219-వ) అని కేవల శ్రుతివైరుధ్యకర్మలనే కాక స్మృతివైరుధ్యకర్మలను సైతం ఆచరించే మూఢులను తిరస్కరించాడు. "అఖిలము నేనె నాకంటె నన్యం బెద్దియును లే దన్యంబు గలదనుట వేదోక్తంబు గాదు. ద్విజులమైన మనకు వేద మప్రమాణ మనరాదు. వేదప్రామాణ్యవిసంవాదము బహువాదులకుం గలదని వినంబడియె. లోకాయతనాగతకాణాదులు" (నార. 430-పుట. -69-వ) అని వేదామోదాన్ని తిరుగులేని వేదప్రామాణ్యాన్ని ఒకసారి పేర్కొనడమే కాక "శ్రుతిప్రామాణ్యవిశ్వాసపరత వైదికాచారరుచియు వేదాంతవేద్యుండైన హరియందు భక్తి యనల్పతపము" (నార. 440-పుట. 210-ప) అని వేరొకసారి వేదప్రామాణ్యాన్ని పునరుద్ఘాటించాడు. అంతేకాదు. వేదాలు సత్కార్యపరాలని, సత్ఫలదాయకాలని "సమస్తవేదంబులును గార్యపరంబు, శ్రేయస్సును గార్యపరమే; శ్రుతి తాత్పర్యగోచరమైన శ్రేయస్సు దానికంటె మరియొకటి కాదు;" (నార. 403. పు. 51-వ) అని విస్పష్టంగా ఉగ్గడించాడు.