పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాని చెందకుండా శ్రీమహావిష్ణువుకే చెందుతున్నది. భాషామయమైన వేదమూలకత్వం విష్ణువుకే చెందినప్పుడు భాషామూలకత్వం మాత్రం విష్ణువుకు చెందదా!

వేదాలకు మూలకర్త మహేశ్వరుడే అయినా, సరస్వతే అయినా, చతుర్ముఖబ్రహ్మే అయినా, ఆ శ్రీమహావిష్ణువే అయునా వేదాలు వేదాలే. వేదాలు దైవీయాలే. "అనంతా నైవేదాః" అన్న వేదవాక్యం ప్రకారం దేవవేదాలు, అనంతశాఖాత్మకాలు. ఈ విషయాన్ని నారదీయపురాణంలో నరసింహకవి ధర్మాధర్మాభిమాన దేవతలు ఆత్మవృత్తిప్రకారం గురించి చెప్పేసందర్భంలో "మాకు సాక్షి యనంతశాఖ వేదాభిమానము గలిగిన నిత్యదేవత. ఈ నిత్యదేవత పలికిన పల్కు శంకించరాదు. నిరామయమైనది." (నార. 399 పుట. 49. వ) అని వేదాలు అనంతాలుగా పేర్కొన్నాడు. ఈ అనంతకాలంలో అనంతవేదవిజ్ఞానం బహుముఖంగా వ్యాప్తిచెందినపుడు అపౌరుషేయమైన అమరవాఙ్మయం పౌరుషేయవాఙ్మయంవలె మానవుల నోళ్ళల్లో పడినప్పుడు వాటిల్లో భ్రమ ప్రమాదాలవల్ల కానివ్వండి, మరొకకారణంచేత కానివ్వండి కొన్ని కొన్నిమార్పులు వచ్చి విభిన్నసిద్ధాంతబోధకాలైన విషయాలు విరుద్ధార్థాలు తొంగిచూడడం అసహజం కాదు. కాగా వేదవ్యాఖ్యానాలలోగాని, స్మృతుల ప్రవచనాలలోకాని భిన్నత్వం గోచరం కావడం అబ్బురం కాదు. ఈ దృష్ట్యానే "హరివాసరంబున భుజింపుమనువారు సత్పురుషులు గారు. భుజింపుమనినవి స్మృతులు గావు. వేదములు గావు." అని నారదీయపురాణం (279 పుట 70 వ) స్పష్టంగా ఉగ్గడించింది. దీనినిబట్టి వేదపాఠాలలోను, స్మృతుల పాఠాలలోను విభిన్నభావాత్మకాలైన పాఠాలున్నట్లు మనకు తేట తెల్లమౌతున్నది. అపౌరుషేయమైన వేదవాఙ్మయం మానవుల నోళ్ళల్లో పడిన తరువాత అది ఎంత దేవవాఙ్మయం అయినా దైవీయాలైన శక్తులులేని మానవుల నోళ్ళల్లో పడినందువల్ల కేవలం అర్ధభావాలలోనే కాక శబ్దస్వరాది విషయాలలో సైతం విభిన్నత్వం మహర్షులకాలంలోనే తొంగిచూచింది. ఈ విషయాన్ని నరసింహకవి "విస్వరంబగు యజుర్వేదంబునుంబోలె స్వరహీనంబగు సామంబునుం బోలెఁ బదహీనయగు ఋక్కునుంబోలె (నార. 308 పుట 191. వ) అని యజుర్వేదంబులో విస్వరత్వం యేర్పడినట్లు, సామవేదంలో స్వరహీనత్వం చోటు చేసుకున్నట్లు, ఋక్కులలో పరహీనత్వం సైతం తొంగిచూచినట్లు స్పష్టంగా పేర్కొన్నాడు. స్వరహీనత్వం వేరు, విస్వరత్వం వేరు. అసలు స్వరమే లేకపోవడం స్వరహీనత్వం కాగా, దుష్టస్వరా లేర్పడడం విస్వరం అనబడుతుంది. పురమే లేనప్పు డంతఃపురం యెక్కడ వుంటుందన్నట్లు, ఋక్కులలో అసలు పదమే లేకపోతే మనం స్వరం గురించి చెప్పగలిగిందేమీ ఉండదు కదా! వేదవాఙ్మయంలో విస్వరత్వమే యేర్పడినా, స్వర