పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాగా భాషామయమైన వేదాలకు మహేశ్వరుడే మూలకారకుడు కావలసి ఉన్నది. భాష లేనిదే వేదం లేదు కదా. భాష మహేశ్వరపరమైనప్పుడు వేదమూలకత్వం బ్రహ్మకు చెందడంలో ఔచిత్యం కనపడదు. లేదా వేదమూలకత్వం చతుర్ముఖబ్రహ్మకు చెందినప్పుడు భాషామూలకారకత్వం మహేశ్వరునికి చెందడానికి వీలు లేదు. ఈవిషయాల గురించి కొంతవరకు నేను నా "మార్గదేశి" పరిశోధనారచనలో వివరంగా చర్చించి వున్నాను.

అయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో విష్ణువు కొకవిశిష్టమైన ప్రత్యేకత ఉన్నదని గతంలోనే నేను సాధికారంగా ఉటంకించాను. దీనికి తగినట్లు వేదాలమూలకారకత్వాన్ని అటు మహేశ్వరులకు గాని ఇటు వాణీచతుర్ముఖులకు గాని చెందనివ్వకుండా నారదీయపురాణంలో వేదాలకు మూలభూతుడు శ్రీ మహావిష్ణువే నని విష్ణువే బ్రహ్మకు వేదవిద్యలను నేర్పాడని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. శ్రీహరి నాభికమలం నుంచి చతుర్ముఖబ్రహ్మ ఉదయించినతరువాత బ్రహ్మ "హరిఃఓమ్" అని వేదానికి ఆదిభూతమైన అక్షరాలను ఉచ్చరించగా మహావిష్ణువు "ఇట్లు ప్రణవంబు పలుకు నాత్మజుం గృపాదృష్టిం జూచి భగవంతుడు హర్షించి నాల్గువేదంబులు నర్థంబుతో నభ్యసింపఁజేసె రహస్యం బెద్దియుఁ బ్రథమపుత్రునకుఁ బ్రియశిష్యునకు నెఱిగింపరానిది లేదు గావున సర్వంబు బోధింపవలయు" (నార. 97పుట. 18వ) అని విష్ణువు బ్రహ్మకు అనేకరహస్యాలు చెపుతాడు. నారదీయపురాణంలోనే వేరొక సందర్భంలోకూడా "వైకుంఠనాథునిచే సాక్షాత్కారంబున శ్రుత్యంతక్షీరసాగరమువలన సముద్భూతసారంబై విధాతకు నుపదేశంబయ్యె" (నార. 378 పుట. 247 వ.) అని శ్రుతిసారాన్ని విధాతకు విష్ణు వుపదేశించినట్లు మరొకసారి వక్కాణించడం జరిగింది. అంతేకాదు. బ్రహ్మ విష్ణోపదిష్టమైన వేదవిజ్ఞానసంభరితుడై సృష్టికార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నా ప్రళయాంతంలోనో మరొకప్పుడో రాక్షసుల బాధకు గురైకాని యితరవిధాలగాని బ్రహ్మ వేదవిజ్ఞానాన్ని కోల్పోయి సృష్టికర్మను నిర్వర్తించడంలో పెక్కుసార్లు నిస్సహాయు డయ్యాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు మత్స్య, హయగ్రీవాది అవతారాలను యెత్తి వేదాలను అపహరించిన రాక్షసులను సంహరించి తిరిగి బ్రహ్మకు వేదవిజ్ఞానబిక్ష పెట్టి బ్రహ్మచేత సృష్టికర్మను యథావిధిగా నిర్వర్తింపచేసినట్లు పెక్కుపురాణాలు పేర్కొంటున్నాయి.

ఈదృష్ట్యా వేదాలు బ్రహ్మ చతుర్ముఖాలనుంచి మొదట వెలువడనే లేదని బ్రహ్మకు సార్థకంగా మహావిష్ణువు వాటిని ఉపదేశించాడని స్పష్టపడుతున్నది. కాగా వేదవాఙ్మయమూలకత్త్వం ఇటు బ్రహ్మసరస్వతులకుగాని అటు మహేశ్వరునకు