పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రుతి, స్మృతుల ప్రసక్తులుగాని వాటి ప్రామాణికతలుగాని పురాణోపపురాణాల్లో పేర్కొనబడడంలో విశేషంలేదు. సంస్కృతవేదాలకంటే ఆధునికమైన ద్రావిడవేదాన్నిపురాణోపపురాణాల్లో - ప్రత్యేకించి వైష్ణవపురాణాల్లో నైనాసరే ప్రామాణ్యంగా ఉదాహరించకపోవడంతో అసలే విశేషంలేదు. వివిధదృక్కోణాలలోను ప్రామాణికత అప్రామాణికతలు సహజంగానే మనకు ప్రత్యక్షమవుతాయి. కాగా పురాణోపపురాణవాఙ్మయందృష్ట్యా చూచినా ద్రావిడవేదానికి ప్రామాణ్యత కాని విశిష్టపరిగణన గాని లేదని స్పష్టపడుతున్నది. కాగా ఆర్యభాషాకుటుంబేతర మైన ద్రావిడభాషాకుటుంబవాదం త్రోసిరాజనబడక తప్పదు.

గతంలో వేదాల ఉత్పత్తి గురించి కొంత చర్చించడం జరిగింది. మామూలుగా మనం వేదాలు నాలుగూ బ్రహ్మ చతుర్ముఖాలనుంచే వెలువడ్డాయని అనుకొనడం జరుగుతున్నది. అయితే అసలు 'త్రయీవేదాః' అన్న వాక్యం వేదవాక్యంగానే మొదట వేదాలు మూడేనన్న సంగతిని స్పష్టపరుస్తున్నది. అయితే మొట్టమొదట ఋగ్యజుస్సామవేదాలు మూడూ బ్రహ్మ త్రిముఖాలనుంచి వెలువడ్డాయనీ కాగా ఈమూడు వేదాలు బ్రహ్మ మూడుముఖాలనుంచే వెలువడిన ఈ వేదాలలోనే ఉన్న వివిధ అస్త్రప్రయోగమంత్రాలను వినియోగించడానికి బ్రహ్మ తన నాలుగవముఖాన్ని ఉపయోగించాడని తద్రూపంగా వివిధ అస్త్ర మంత్ర తంత్ర యంత్ర విషయాలకు ఆలవాలాలైన వేదమంత్రాలతో అధర్వవేదం రూపొందిందనీ మనం భావించవచ్చును. కాని త్రేతనుడైన పురూరవుడు మొట్టమొదట ఏకైకంగా ఉన్న వేదాన్ని మూడువేదాలుగా విభజించినట్లు భాగవతం పేర్కొంటున్నది. అయితే వేదాలు తొలివాక్కులుగా పేర్కొనబడడంవల్ల అవి బ్రహ్మ చతుర్ముఖాలనుంచి అవతరించాయనే దృష్టితో చూస్తే భాషోత్పత్తికి మూలదేవత బ్రహ్మగా మనకు గోచరిస్తాడు. కాని మన గ్రంథాలు సరస్వతిని విద్యలన్నింటికి మూలభూతురాలుగా పేర్కొనడంకూడా కద్దు. అయినప్పుడు భాషామూలదేవతావ్యవస్థ బ్రహ్మనుంచి సరస్వతికి సంక్రమిస్తుంది. సరస్వతి బ్రహ్మముఖవాసినిగా వర్ణింపబడడంవల్ల - ఒకవేళ నాలుగువేదాలూ బ్రహ్మ చతుర్ముఖాలనుంచే వెలువడినా అవి వాణీముఖస్థాలుగా అవతరించినట్లుగా చెప్పకతప్పదు. అయితే వీటికి విరుద్ధంగా అసలు భాషలకు మూలకర్త మహేశ్వరుడే నన్న వాదం మరొకటి ఉన్నది.

"నృత్తవసానే నటరాజరాజో ననాద ఢక్కాంసవ పఞ్చవారమ్।
ఉద్ధర్తు కామస్సనకాది సిద్ధానేతద్విమర్శే శివసూత్రజాలమ్॥"

అన్న ప్రాచీనసంప్రదాయసిద్ధమైన శ్లోకం ప్రకారం మహేశ్వరుడు సనకాది మహర్షులను అనుగ్రహించే ఉద్దేశ్యంతో నృత్తావసానంలో పధ్నాలుగుసార్లు తనఢక్కాను వాయించగా భాషకు మూలభూతాలైన అక్షరసముచ్చయాదులు అవతరించినట్లు తేటతెల్లమవుతున్నది. ఈదృష్ట్యా భాషకు మూలభూతుడు మహేశ్వరుడు