పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైన ఒక భాగమేనని యీ రూపంగా ఆర్యద్రావిడ భాషాకుటుంబ భేదాలకు అవకాశం లేదని విస్పష్టంగా అజేయమైన పద్ధతిలో నా పరిశోధనారచన "మార్గ-దేశి" గ్రంథంలో నిరూపించి ఉన్నాను. ఈ గ్రంథంలోనే "మార్గ-దేశి" భేదాలపేరుతో భాషాపరంగా సైతం ఆర్యద్రావిడ భాషాకుటుంబాల భిన్నత్వాన్ని వక్కాణించే అవకాశం లేదనికూడా నేను సుదృఢంగా సూక్ష్మరూపంలో వెల్లడించాను. భాషాపరమై బహుముఖమైన నా మహత్తరపరిశోధనాగ్రంథం వెలుగు చూస్తేనే తప్ప యీ ఆర్యద్రావిడభాషాకుటుంబభేదాలు రూపు మాయవు. అయితే యీ సందర్భంలో ప్రాచీనకాలంలోనే ఆర్యద్రావిడభాషాభేదాలు లేవన్నదృష్టితో నరసింహకవి నారదీయపురాణ అవతారికలో

"ధరణి వేదంబులు ద్రావిడంబునఁ జేయు
            శ్రీ పరాంకుశయోగి శేఖరులను"

(నార-2 పుట. 7 ప.)

అని ఘంటాపథంగా వక్కాణించాడు. అలౌకికవాఙ్మయంగా అపౌరుషేయాలుగా భావించబడుతున్న సంస్కృతవేదాలను శ్రీ పరాంకుశయోగి ద్రావిడీకరించినట్లు పైపద్యపాదంలో నరసింహకవి సూటిగా వక్కాణించాడు. వైష్ణవమతస్థుడై ద్రావిడవేదాధ్యయనపరుడైన నరసింహకవి ద్రావిడవేదానికి మూలం సంస్కృతవేదమే నన్న సంగతిని విస్పష్టంగా పేర్కొన్నాడంటే దీనిని అంత తేలికగా మనం త్రోసిపుచ్చడానికి ఏమాత్రమూ అవకాశం లేదు. అసలు ద్రావిడవేదాన్ని ప్రాణప్రదంగా భావించే వైష్ణవమతస్థులే సంస్కృతవేదాలను ద్రావిడంగా మార్చారనే అభిప్రాయంలో ఉన్నప్పుడు ద్రావిడవాఙ్మయానికి మూలభూతం శిరోమాణిక్యం వంటిదైన ద్రావిడవేదానికి స్వతంత్రప్రతిపత్తి లేదని యెలుగెత్తి చాటినట్లేకదా! కాగా సంస్కృతవేదాలు మూలంగా అవతరించిన ఆర్యభాషాకుటుంబం ద్రావిడవేదాల మూలంగా అవతరించిన ద్రావిడభాషాకుటుంబం విభిన్నమైనవని మనం చెప్పడం చాలా దుస్సాహసమే కాగలదు. పరాంకుశయోగి వేదాలను ద్రావిడంగా మార్చారని స్పష్టంగా వక్కాణించిన నరసింహకవి వాక్యం కేవలం నరసింహకవి పరికల్పితమని చెప్పడానికి అసలు అవకాశమే లేదు. అందువల్ల ఆర్యద్రావిడభాషాకుటుంబాలు యేకైకాలేనని మనం నిస్సంకోచంగా నిర్ణయించుకొనవచ్చును.

సంస్కృతవేదాలను పరాంకుశయోగి ద్రావిడీకరించారంటే ద్రావిడవేదంకంటే సంస్కృతవేదాలు ప్రాచీనాలన్న సంగతి నిర్ద్వంద్వంగా నిరూపితమవుతున్నది. అయితే సంస్కృత శ్రుతి, స్మృతుల మూలంగా అవతరించిన పురాణాలలో ఆయా