పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతను తిక్కనాదులను ఆదర్శంగా తీసుకొనడం వల్లనే జరిగిఉంటుంది తప్ప మరివేరుకాదు. నిర్వచనోత్తరరామాయణం, దశకుమారచరిత్రలోని ఆశ్వాసాద్యంతపద్యాలకు పట్టిన నిరర్థకత్వం అనన్వితత్వం ప్రభావతీప్రద్యుమ్నంలోని ప్రథమేతరవిభక్త్యంతాలైన ఆశ్వాసాద్యంత పద్యాలకు సైతం పడుతుంది.

షష్ఠ్యంతాలవిషయమై ఆశ్వాసాద్యంతపద్యాలవిషయమై తుదకు సంబోధనాంతాలవిషయమై కూడా యింతగా చర్చించవలసిన విశేషాలుండగా కృత్యవతారికలు గాని పూర్వ పర పద్య గద్య సమన్వయాలు గాని వేటినీ పరిశీలించకుండా షష్ఠ్యంతాల చరిత్రకు పూర్తిగా విరుద్ధమైన విషయాలను షష్ఠ్యంతాలచరిత్రగా వ్రాయడం విచారణీయమైన విషయం. (ఆంధ్రప్రభ-దినపత్రిక- 3 జూలై 1960)

ఇంతకూ యీ షష్ఠ్యంతాలచరిత్రను దృష్టిలో పెట్టుకొన్నప్పుడు కేశవనామాదులపై ఆధారపడి అవతరించిన షష్ఠ్యంతాలు నరసింహకవి రచించిన నారదీయపురాణంలో శ్రీకృష్ణపరంగా సార్థకమై విరచింపబడ్డాయనే చెప్పవచ్చు. నారదీయపురాణం శ్రీకృష్ణాంకితమైంది కాబట్టి యిందులోని షష్ఠ్యంతపద్యాలుసైతం శ్రీకృష్ణవర్ణనాత్మకాలై ఉండడం రూపంగా షష్ఠ్యంతాల సంజనితత్వానికి సార్థకతను సమకూర్చాయనే చెప్పవచ్చు.

కృష్ణావతారవర్ణనలో అత్యంతశక్తివంతమైన తనసహజకవితామాధుర్యాన్ని, వైదుష్యాన్ని నరసింహకవి బహుముఖాలుగా చూపించాడు. ప్రబంధకవుల పోకడలను మనస్ఫురణకు తీసుకొని రాగలినట్లుగా తన కవితాధౌరంధర్యత్వాన్ని ప్రకటించాడు. మధురాపురవర్ణనాపరమై నరసింహకవి శబ్దశక్తికి ప్రతీకగా నిలువగల యీ క్రింది పద్యాన్ని తిలకించండి.

శ్రీ రాజవశ్యమై శ్రీ రాజవశ్యమై
        యఖిలలోకముల విఖ్యాతిఁగాంచి
కల్యాణ ధామమై కల్యాణ ధామమై
        యఖిలలోకముల విఖ్యాతిఁగాంచి
సుమనోభిరామమై సుమనోభిరామమై
        యఖిలలోకముల విఖ్యాతిఁగాంచి
సత్కళా పూర్ణమై సత్కళా పూర్ణమై
        యఖిలలోకముల విఖ్యాతిఁగాంచి