పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొందరు కేతన షష్ఠ్యంతకందములమధ్య దూలము వంటి శార్దూలమును వేసెనని విమర్శించిరి" - అని యీ వ్యాసకర్త వ్రాశారు.

ఇందులో యీ వ్యాసకర్త వెల్లడించదలచినభావం సువ్యక్తం కాలేదు. సామాన్యంగా షష్ఠ్యంతాలు కందపద్యాలుగానే నన్నెచోడాదులు వ్రాయడం చూచి "షష్ఠ్యంతాలు కందపద్యాలుగానే ఉండా" లన్న అభిప్రాయానికి వచ్చినవారు కొందరు షష్ఠ్యంతాలలో శార్దూలం కేతన వెయ్యడం బాగుండలేదని విమర్శించారు. తర్వాతి వారనేకులు షష్ఠ్యంతాలుగా కందాలనేకాక యితర వృత్తాలను సైతం వ్రాశారు. పోతన షష్ఠ్యంతాలన్నీ ఉత్పలమాలలుగానే వ్రాశాడు గదా! ఆశ్వాసాంతపద్యాలలో మొదట ఉత్పలమాల - చంపకమాల - శార్దూల - మత్తేభాలలో ఒక పద్యం, ఆ తర్వాత కందం - ఆ తర్వాత మాలిని మూడూ వరుసనే వెయ్యాలని కేతన నియమంగా పెట్టుకొన్నట్లు కనిపిస్తుంది. అందువల్ల తాను వేసిన యేడు షష్ఠ్యంతాల తర్వాత షష్ఠ్యంతాలుగా - శార్దూలం - కందం - మాలిని మూడుపద్యాలనూ వేసి ప్రథమాశ్వాసం ముగించాడు. ఆశ్వాసాంతంలో కేతన పెట్టుకొన్న మూడు పద్యాల నియమాన్ని గమనించనివారు చివరి మాలినివృత్తాన్ని ఒక్కదానినే ఆశ్వాసాంతపద్యంగా గ్రహించి మాలినికి పైనున్న "దేవేంద్రవిభునకు" ఇత్యాది కందపద్యాన్ని కూడా మామూలు షష్ఠ్యంతకందాలమధ్య దూలంవంటి శార్దూలం వేశాడని కేతనను విమర్శించారు.

పింగళి సూరన్న ప్రభావతీప్రద్యుమ్నంలో ఆశ్వాసాద్యంతపద్యాలు సంబోధనాంతాలుగా వ్రాయకుండా విభిన్నవిభక్త్యంతాలుగా వ్రాయడానికి కారణం కృతిపతి అయిన మారన తండ్రి మృతి పొందినందువల్ల అతనిని శ్రోతగా యెంచడానికి అవకాశం లేకపోవడమేననడం కేవలం పొరపాటు. శ్రోతగా యెన్నుకొనడానికి బ్రతికి నిజంగానే వింటూ ఉండనక్కరలేదు. మృతి పొందిన మానవునికూడా శ్రోతగా భావించి సంబోధించి కృతి చెప్పవచ్చును.

నన్నయ రాజరాజును శ్రోత గావించి భారతరచన చేశాడంటే అది భావంలోనే నిజంగానే ప్రతిమాటా ప్రతిపద్యమూ అతనికి వినిపిస్తూనే వ్రాశా డనడం, రాజరాజుసమక్షంలోనే భారతం వ్రాశా డనుకొనడం పొరపాటు - కొంతకొంతభాగం వ్రాసి రాజరాజుకు వినిపించుతూ వ్రాశా డనడం సమంజసంగా ఉంటుంది. శ్రోతగా యెంచుకొనడమనేది దృగ్గోచరుడు కాని భగవంతుని పట్లే చెల్లగా చనిపోయిన మానవునిపట్ల యెందుకు చెల్లదు? శ్రోతగా యెన్నడమనేది హృద్గతభావమే గాని యిరవై నాల్గుగంటలూ శ్రోత యెదురుగా కూర్చుని వ్రాస్తున్నదల్లా వింటూ ఉండాలనుకొనడం సరికాదు. సూరన విభిన్నవిభక్త్యంతాలుగా ఆశ్వాసాంత్యపద్యాలు వ్రాయడం