పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భావం సకారణంగా లోగడే త్రోసిపుచ్చబడింది. కావ్యం మధ్యలో వేసినా, కృత్యాదిలో వెయ్యకపోయినా మనుమసిద్ధిపై షష్ఠ్యంతాలను తిక్కన వ్రాశాడు. ఇప్పుడు అంకితమిచ్చినప్పుడే షష్ఠ్యంతాలు రచియింపబడతాయన్న భావం సరికాదని నిరూపించబడింది. కాబట్టి తిక్కన కృతిసమర్పణసందర్భంగా షష్ఠ్యంతాలు వెయ్యకపోయినా తర్వాత మానవపరంగా షష్ఠ్యంతాలు వ్రాసినవాడు తిక్కనే కాగలడు.

"కేతన తన దశకుమారచరితమును తిక్కనకు భక్తితో అంకితము గావించినాడు, కనుక కృత్యాదిని షష్ఠ్యంతములకు ప్రసక్తి కలిగినది." అని యీవ్రాతరి పేర్కొన్నారు.

కేతన వ్రాసిన షష్ఠ్యంతాలు అంకితవిషయమునకు సంబంధించినవి కావని లోగడనే నిరూపింపబడింది గదా! ఇంక కేతన దశకుమారచరిత్రను తిక్కనకు గౌరవంగా అంకితమిచ్చాడని చెప్పడానికి అవకాశం ఉన్నది గాని, భక్తితో యిచ్చాడనడానికి అవకాశం లేదు. "ఆసనార్ఘ్యపాద్యతాంబూలాంబరభరణదానాద్యుపచారంబులఁ బరితుష్టహృదయం జేసి నీవు సంస్కృతాద్యనేకభాషాకావ్యరచనావిశారదుండ వగుట జగత్ప్రసిద్ధంబు గాన నొక్కకావ్యంబు రచియించి నన్నుఁ గృతిపతిం జేయవలయునని సగౌరవంబుగాఁ బ్రార్థించిన" అని కేతన తనను తిక్కన సగౌరవంగా బ్రార్థించాడని స్పష్టంగా చెప్పుతున్నప్పుడు, ప్రార్థింపబడినవారికి ప్రార్థించినవారిపట్ల గౌరవభావం ఉండడానికి అవకాశం ఉన్నది గాని భక్తిభావం ఉండడానికి అవకాశంలేదు. కేతన తిక్కనకు శిష్యుడు కాడన్నవిషయం యీసందర్భంలో జ్ఞప్తి తెచ్చుకోవాలి (చూ-ఆంధ్రభాషాభూషణం - దివ్యప్రభావివరణ సహితం - నా పీఠిక).

"కేతన గూడ నన్నెచోడునివలెనే యెనిమిది షష్ఠ్యంత కందములను వ్రాసినాడు" అని గూడ యీ వ్రాతరి వ్రాశారు.

ఆశ్వాసాంత్య పద్యాలుగా మూడు పద్యాలను తొలగించితే కేతన వేసిన షష్ఠ్యంత కందాలు యేడు మాత్రమే మొట్టమొదటగా వీరేశలింగంగారు ప్రచురించినప్రతిలో యేడు పద్యాలు మాత్రమే ఉన్నాయి. ఆశ్వాసాంత్యపద్యాలై షష్ఠ్యంతాలుగానే ఉన్న తిక్కనవి మూడూ కలిపితే మొత్తం పది పద్యాలు.

"ఎనిమిది షష్ఠ్యంతములకుఁ జివర మూఁడాశ్వాసాంతపద్యములను షష్ఠ్యంతములుగాఁ బ్రథమాశ్వాసము ముగించి ద్వితీయాశ్వాసాదిని గూడ నట్లే కందమును షష్ఠ్యంతముగా వ్రాసెను. ఇది యీతనియందలి ప్రత్యేకత. దీనిని గమనింపక