పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కథాక్రమం బెట్టిదనిన" అని యిటువంటివాక్యం యేదయినా ఉంటేనేగాని సమన్వయం కుదరదుకదా! ఈ విధంగానే "శ్రీరమణ....పతిచే...మను వసుమతీవల్లభుచేన్" అని తృతీయాంతపద్యం (5వ ఆశ్వా. 1 ప) ఉన్నది. దీనికి అన్వయ మెక్కడ? మనుమసిద్దిచేత యేమైనట్లు? ఈ విధంగానే కేతన వ్రాసిన ద్వితీయాది విభక్త్యంతపద్యాలు నిరర్ధకాలుగా ఉన్నాయి. కేతన వ్రాసిన సంబోధనాంతాలకు సైతం సమన్వయం కుదరదు. (చూ దశ. 3 ఆ. చివర 4 ఆ. ఆదిని) 4 ఆ. ఆదిపద్యం తర్వాత "తిక్కనామాత్యా! తరువాతికథ నవధరింపు" మన్నట్లుగా ఒకవాక్యం ఉంటేనేగానీ సమన్వయం కుదరదు. భారతరచననాటికి తిక్కన తనఉత్తరరామాయణంలో జరిగిన పొరపాటును గుర్తించబట్టే మాట్లాడకుండా భారతంలో ఆశ్వాసాద్యంతపద్యాలను సంబోధనాంతాలుగా వ్రాశాడు.

మారన మార్కండేయపురాణంలో ఆశ్వాసాద్యంతాలలో సంబోధనాంతపద్యాలే వేసినా, ప్రథమాశ్వాసంచివర మాత్రం ఒక పద్యం అనవసరంగా రచించి, ప్రథమ, ద్వితీయాశ్వాసాల మధ్య సమన్వయం కుదరకుండా చేశాడు. "హరిశ్చంద్రుడు...దివంబు కరిగెనని చెప్పి" అని వచనం ముగించి, ఆశ్వాసాంతపద్యాలు వ్రాయడానికి మారుగా హరిశ్చంద్రకథాశ్రవణఫలాన్ని చెప్పాలని "సమకూర్చున్ వివిధార్థసంపదలు" (మా. పు. 1 ఆశ్వా. 285 ప.) అన్నపద్యం వ్రాసి తర్వాతి ఆశ్వాసంలోని కథతో సమన్వయాన్ని సంబంధాన్ని త్రుంచివేశాడు. ఆ కారణంగా "దివంబున కరిగెనని చెప్పి" అన్నదానిలోని చెప్పి అనే అసమాపకక్రియ రెండవ ఆశ్వాసంలోని "పరమజ్ఞానచక్షు లయిన పక్షులు ఆజైమిని కిట్లనియె" అన్నవాక్యంతో పొంతన కుదుర్చుకోకుండా పోతున్నది. "దివంబున కరిగి" అన్నదానికి పూర్వంలోనైనా యీ పద్యం ఉంచినా సమన్వయం కుదిరేది.

సామాన్యంగా యే కావ్యమైనా ఆశ్వాసాల ఆద్యంతాలలో ఉన్నటువంటి కృతిపతులకో, శ్రోతలకో సంబంధించిన పద్యాలను తొలగించితేనే యేకాశ్వాసకావ్యంగా రూపొందుతుంది. కాని నన్నెచోడుని కుమారసంభవంలో మాత్రం ఆశ్వాసాంతాలలోనూ, ఆదిలోనూ ఉన్న మల్లికార్జునునిమీది పద్యాలను తొలగించినా, తొలగించకపోయినా అది ఏకాశ్వాసకావ్యంగా రూపొందుతుంది. ఇది కుమారసంభవాశ్వాసాద్యంత పద్యాలలోని విశిష్టత.

నన్నెచోడుడు మల్లికార్జునునికి కృతి శ్రోతపరంగా షష్ఠ్యంతాలు వేశాడని మొదటే పేర్కొన్నాను. నిర్వచనోత్తరరామాయణంలో తిక్కన అయిదవ ఆశ్వాసం చివర, ఆరవ ఆశ్వాసం మొదట షష్ఠ్యంతాలు వేశాడు. షష్ఠ్యంతాలు కృతి సమర్పించినప్పుడే (అంకిత మిచ్చినప్పుడే) వ్రాయబడతాయన్న పొరపాటు