నా జీవిత యాత్ర-1/ప్రస్తుతి

వికీసోర్స్ నుండి

ప్రస్తుతి

శ్రీయుతులు ఎం. శేషాచలం అండ్ కంపెనీ వారు కీర్తిశేషులు టంగుటూరి ప్రకాశం పంతులు గారి సమగ్ర జీవిత చరిత్రను నాలుగు సంపుటములుగా ప్రకటింప బూనుకొనుట ముదావహము.

మొదటి మూడు సంపుటములు ప్రకాశంగారు స్వయముగ రచించినవి. ఆ కథ 1940 - 41 వరకే సాగినది. అనంతర చరిత్రగల 'అనుబంధ సంపుటి' యను నాల్గవ సంపుటము పంతులుగారి సన్నిహిత అనుచరులగు శ్రీ తెన్నేటి విశ్వనాథముగారు రచించినది.

తెలుగు పాఠకులు హెచ్చుమంది ఈ సంపుటములను సంపాదించుకొని చదివి, ఇంటింట పదిల పరచుకొన గలుగుటకు అనువుగ ఒక్కొక్క సంపుటము వెల రూ. 2-50 లుగ నిర్ణయించిరి. ఆంధ్ర కేసరి శతజయంత్వుత్సవ పురస్కృతిగ ఈ గ్రంథమును ప్రకటించు చున్నందులకు ఈ ప్రకాశకులను నే నభినందించుచున్నాను.

తెలుగు మాటాడు ప్రజల ముఖ్య లక్షణములు ప్రకాశము పంతులుగారిలో పుంజీభవించినవి. రాజఠీవి గల పురుష సింహుడు ఆయన. పాత పద్దతులను అంటిపట్టుకొనని విప్లవవాది. ప్రాచీన దురాచార విరోధి. స్వాభావికముగ ఆయనది విప్లవ ప్రకృతి. 1953 లో ఆంధ్ర రాష్ట్రావతరము శుభసమయమున కారాగారములలో నుండిన బందీ లందరికి విమోచనము కలిగించుచు ఆయన చేసిన ఉత్తరువు చరిత్రాత్మకమైనది. ఆయనయెడల ప్రజల భక్తి విశ్వాసములు ఆయన వైయక్తిక గుణ వైభవ ప్రేరితములు. ఆయన పార్టీలు మారి నను, ఆయనపట్ల ప్రజల అభిమానమున కెన్నడు కొదువలేదు. రాజకీయ రంగమున హాలాహలమును మ్రింగి నిర్వికారముగ నిలిచిన సదాశివు డాయన. అది ప్రకాశంగారి విశిష్టత. ఉదాత్తత, ఔదార్యము గూడు కట్టుకొనిన స్వర్ణహృదయ మాయనది. ఆయన పటిమ సాటిలేనిది. మన రాజకీయ రంగమున ఆయనదొక మహామానవ పాత్ర. బహుముఖ వైభవోజ్జ్వలమైన జీవిత మది. హిమాలయమువలె అత్యున్నతమైన, అతి గంభీరమైన, అక్షయ క్షమాపూర్ణమైన మహౌదార్య మూర్తి అయన. ప్రకాశము ప్రజల ఆప్త బంధువు. ఆంధ్ర ప్రజానీకమున ఆయన పలుకుబడి, అఖిలభారతమున జవహర్‌లాల్ పలుకుబడితో పోలిక చెప్పదగినది.

మన ప్రియ ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధిగారు ప్రకాశముగారిని "ఆధునికాంధ్ర ప్రదేశ పిత" అనియు, "మన జాతీయ ఉద్యమ ప్రముఖ నాయకులలో ఆయన ఒక" రనియు ప్రస్తుతించుట ఎంతయు సముచితముగ నున్నది. పేరునకు దగినట్లు ప్రకాశము ఆంధ్ర దిక్చక్రమున అనుపమోజ్జ్వల తారగ ప్రకాశించెను. ఆయన ఎల్లప్పుడు క్రొత్తబాటలనే తీర్చుకొనుచుండెను. ప్రజల భక్తి విశ్వాసములపై ఆయనకు గల ప్రభుత్వము గాఢమైనది, అగాధమైనది. కనుకనే ఆయనను గూర్చిన విమర్శను లేశమైనను ప్రజలు సహింపకుండిరి. స్వాతంత్ర్యము కొరకు ఆయన చేసిన త్యాగము మహనీయమైన దగుటచే, ప్రజలాయన లోపముల నెన్న నిరాకరించిరి. 1952 లో చెన్నరాష్ట్ర ఉభయ శాసన సభల సంయుక్త సమావేశమున ఉపన్యసించుటకు గవర్నరు అధికారమును ఆయన సవాలుచేయుట పెద్ద సంచలనము కలిగించినది. నాటి మంత్రులపై ఆయన తెచ్చిన అభియోగ ములను వివరించుచు శాసన సభలో ఆయన మూడు దినములు వరుసగ నుపన్యసించుట అది ఒక కొత్త రికార్డు. 1953 లో ప్రత్యేకాంధ్రరాష్ట్రము ఏర్పడినప్పుడు ప్రకాశము పంతులుగారే ప్రథమాంధ్ర ముఖ్యమంత్రిగ నుండవలెనని సూచించుటతో నెహ్రూజీ ప్రకాశముగారికి రాజకీయ చరిత్రలో నెందును కని విని యెరుగని సత్కారము చేసిరి. నిజమునకు ఆనాడు ప్రకాశము గారు ఏ రాజకీయ పక్షమునకు చెందిన వారు కారు. సంఖ్యాధిక్యముగల పక్షమునకు ఆయన నాయకుడు కారు. ఆయన రాజకీయ స్థాయికి, స్వాతంత్ర్యముకొరకు ఆయన చేసిన అనుపమ త్యాగమునకు కృతజ్ఞతా ప్రకటన మది. ప్రకాశము తెలుగు ప్రజల స్వతస్సిద్ద నాయకుడు. ఆయన ప్రజల మనిషి. నిత్యము ప్రజల నాడిని పట్టి చూచుచు, వారికి హితవైన కార్యములనే ఆయన చేపట్టు చుండెను.

ప్రకాశము పంతులుగారి స్వస్థలము ఒంగోలు. ఒంగోలు కేంద్రముగ ప్రత్యేకముగ ఒక జిల్లాను ఏర్పరుప వలెనని ఆయన చిరసంకల్పము. ఆంధ్రప్రదేశ ప్రభుత్వము ఆ సంకల్పమును సఫలము చేయుటయే కాక, దివంగతుడైన ఆ మహానాయకుని యెడ కృతజ్ఞతా సంస్మృతి చిహ్నముగ దానికి "ప్రకాశము జిల్లా" యని నామకరణము చేసినది. ప్రకాశము మిగుల దూరదృష్టిగల నేత. ఆయన ప్రవేశపెట్టిన ఫిర్కా డెవలెప్మెంట్ కార్యక్రమమును ఆనాడు చాలామంది అపార్థము చేసికొనిరి. కాని, అదియే నేటి మన పంచాయతి రాజ్య ప్రణాళికకు మార్గదర్శి అయి, అందరికి కనువిప్పు కలిగించినది. జమీందారీల రద్దు ప్రణాళిక ప్రకాశ కర్తృకము. పేద ప్రజల సంక్షేమమే సదా ప్రకాశముగారి ప్రధానాశయముగ నుండెను. తెలుగు జాతి ఆశయాదర్శములకు రూపు కట్టిన ఉజ్జ్వలమూర్తి, తెలుగు జాతియతకు ప్రతీక, ఆంధ్ర ప్రదేశ నిర్మాత, నవీనాంధ్ర పిత - ప్రకాశము పంతులుగారు. యావదాంధ్ర దేశముతో, అందలి మూల మూలల గ్రామములతో, గూడెములతో, ముఖ్యముగ అందలి బహు వర్గముల ప్రజలతో అంత విస్తృత పరిచయముగల నాయకుడు బహుశ: మరొకడు లేడు. దారిద్ర్యమును, అవిద్యను, మూఢ విశ్వాసములను రూపుమాపవలెనను ఆయన ఆశయ సిద్ధికి దీక్షతో కృషిసేయు సజీవాంధ్ర స్త్రీ పురుష ప్రజానీకమే ఆ మహానాయకునికి ఉత్తమ స్మారక చిహ్నము. అన్యస్మారక చిహ్నమేదియు ఆయనకు అంత సంతృప్తి కల్గింపజాలదు.

హైదారాబాదు,
12-6-72.
(సం.) పి. వి. నరసింహారావు