నా జీవిత యాత్ర-1/పత్రికకు నామకరణం

వికీసోర్స్ నుండి

27

పత్రికకు నామకరణం

ఈ పత్రికకి 'స్వరాజ్య' అని పేరు పెట్టినవారు సి. రాజగోపాలాచారిగారే. 'స్వరాజ్యము' అని నేను చెబితే చివరి 'ము' తీసివేసి 'స్వరాజ్య' అని ఉండాలని చెప్పినవారు కూడా వారే. రాజగోపాలాచారిగారు ప్రథమంలో ఎక్కువ ఉత్సాహంతోనూ, స్నేహభావంతోనూ ఈ ఉద్యమానికి ప్రోత్సాహం ఇచ్చారు. ఇంతేకాక ఒకప్పుడు డాక్టరు పట్టాభి సీతారామయ్యగారు, ముట్నూరి కృష్ణారావుగారు, నేను ప్రాక్టీసు చేస్తూ ఎక్కువగా ధనం సంపాదించే కాలంలో మద్రాసు వచ్చి, నన్ను కలుసుకుని, "మద్రాసులో మీరు ఇంతకాలంనించీ న్యాయవాద వృత్తి సాగిస్తూ ధనం సంపాదిస్తున్నారు గదా! ఒక్క నాలుగు పేజీల పత్రిక ఇంగ్లీషులో అచ్చువేయించడానికి శక్తిలేదా?" అని అడిగారు.

వారు సహాయ నిరాకరణోద్యమ ప్రారంభ కాలంలోనే నాకు ఈ విధంగా సలహా ఇచ్చారు. అప్పటినించీ కూడా నా మనస్సులో అదే ఉండిపోయింది. న్యాయవాద వృత్తి వదలి పూర్తిగా ఉద్యమంలోకి దిగిన తరవాత నగర పరిస్థితులూ, నగరంలో ఉండే పత్రికల పరిస్థితులూ కనిపెట్టి వెంటనే ఇంగ్లీషులోనూ, దేశభాషల్లోనూ దినపత్రికలు స్థాపించడానికి నిశ్చయించుకున్నాను. పైన చెప్పిన స్నేహితులు అంతాకూడా అమితోత్సాహంతోనూ, త్యాగబుద్ధితోనూ ధనసహాయమూ, ఇంకా కావలిసిన ఇతర సహాయాలూ కూడా ఇచ్చి, పత్రిక నడిపించడానికి తోడ్పడ్డారు. అందుచేత ఎల్లాంటి కష్టమూ, లేకుండానే సంస్థ ప్రారంభించి, డబ్బు వసూలు చెయ్యడమూ, డబ్బు అంతా వసూలు కాకముందే కావలసిన సామగ్రి సేకరించడమూ కూడా జరిగాయి. మూడు లక్షలు వసూలు చెయ్యడంలో ఏవిధమైన కష్టమూ ఉండదని నాకు పూర్తిగా నమ్మకం కలిగింది. నా దగ్గిర బాంకులో ఉన్న సొమ్ము కరెంటు అక్కౌంటులో లేకపోయినా, గవర్నమెంటు ప్రొవిన్షియల్ నోట్లు మొదలైనవాటి రూపకంగా ఉండడంచేత అప్పు పుట్టడానికి ఏమీ ఇబ్బంది లేకపోయింది.

ఆ కారణంచేత, కంపెనీ మూలధనం మూడు లక్షలు వసూలు అయ్యేవరకూ కనిపెట్టుకుని ఉండక, నేనూ, టి. వి. వెంకట్రామయ్యరుగారు కలిసి, ఇండియన్ బాంకులో ఒక ప్రామిసరీనోటువ్రాసి, 30 వేల రూపాయలు బదులు పుచ్చుకుని, ముద్రణాలయ స్థాపనకి కావలిసిన సామగ్రి అంతా సమకూర్చుకున్నాము. ఆ సమయంలోనే కాశీనాథుని నాగేశ్వరరావుగారు ఇంగ్లండునించి 25 వేల రూపాయలుపెట్టి ఒక ముద్రాయంత్రం తెప్పించారు. అది ఇంకా ఓడలో ఉండగానే నాగేశ్వరరావుగారిని కలుసుకుని అ 25 వేల రూపాయల రొక్కమూ మా దగ్గిర పుచ్చుకుని ఆ మిషను మాకు ఇవ్వవలిసిందని కోరాము. మాకు మొదటినించీ నాగేశ్వరరావుపంతులుగారు కూడా ముఖ్యమైన ప్రోత్సాహకులుగా ఉండడంచేత, వెంటనే ఆ మిషను మాకు అప్పజెప్పి త్వరలో పత్రిక ప్రారంభించడానికి కారణభూతులు అయ్యారు.

నేను 1921 వ సంవత్సరం ప్రారంభంలో న్యాయవాదవృత్తి వదలివేశాను. వెంటనే స్నేహితులూ, నేను ఈ పత్రిక స్థాపించడానికి పూనుకున్నాము. డబ్బు వసూలు చెయ్యడానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేశాము. అడిగినవారు అందరూ 'లేదు' అనకుండా వారివారికి తోచిన ప్రకారంగా వాటాలు కొని, మూలధనం సేకరించడానికి సహాయపడ్డారు.

ఆ సంవత్సరంలోనే డిసెంబరునెలలో అహమ్మదుబాదు కాంగ్రెసు జరుగబోతూ ఉంది. నాగపూరు కాంగ్రెసు తీర్మానం ప్రకారం 12 మాసాలలో తిలకు స్వరాజ్యనిధికి కోటి రూపాయలు, 20 లక్షల రాట్టాలు సిద్ధంగా ఉన్నాయి. అందుచేత శాసనోల్లంఘనాన్ని గురించిన కార్యక్రమం ఏర్పరచ డానికి అహమ్మదాబాదు కాంగ్రెసు సమావేశం కాబోతూ ఉంది. నేను కాంగ్రెసు సమావేశం అయ్యేలోపుగా స్వరాజ్య పత్రిక స్థాపించి అహమ్మదాబాదు కాంగ్రెసుకి వెళ్ళాలని శపథం పట్టాను. ఆ దీక్షప్రకారం ముద్రణాలయం స్థాపించి, పత్రిక అక్టోబరు 26 వ తేదీని ప్రచురించాను. దేశంలో ఉన్న ప్రజలూ, నాయకులూ అదివరకు ఎప్పుడూ ఇటువంటి కార్యక్రమం ఎరుగరు. ఇంతపెద్ద కార్యక్రమం కాంగ్రెసు ఆశయాల ప్రకారం నడిపించడానికీ, ఆశయాల ప్రకారం పనిచెయ్యడానికీ, ప్రజలచేతకూడా పనిచేయించడానికి పూనుకున్న నాకూ, పత్రికకీ దేశంలో అంతటా మహత్తరమైన బలమూ, సాహాయ్యమూ లభించాయి. పత్రిక ప్రచురణ అయిన మొదటి మాసంలోనే ఐదువేల ప్రతులు అమ్ముడుపోయాయి. రెండోమాసంలో - అంటే మేము అహమ్మదాబాదు కాంగ్రెసుకి వెళ్ళడానికి ముందు - ఎనిమిదివేల పై చిల్లర అమ్ముడు పోయాయి.

అహమ్మదాబాదు వెళ్ళినప్పుడు రాజగోపాలాచారిగారు గాంధీగారికి నన్ను గురించి తెలియజేస్తూ, స్వరాజ్య పత్రిక స్థాపించడానికి ఆలోచించడమూ, స్థాపించడమూ, రెండు మాసాలలోగానే 8, 9 వేల ప్రతులు అమ్మడమూ కూడా చెప్పారు. గాంధీగారికి ఆ విషయం చాలా సంతోషం కలిగించింది. అదివరకు గాంధీగారికీ, నాకూ ప్రత్యేకంగా స్నేహం లేకపోయినా ఈ పత్రిక మూలంగా వారికి ఎక్కువ దగ్గిర స్నేహితుల్లో ఒకణ్ణి అయ్యాను.

అహమ్మదాబాదు కాంగ్రెస్సు సహాయ నిరాకరణోద్యమ కార్యక్రమం మొట్టమొదట తీర్మానించిన కాంగ్రెస్సు, భారతదేశం మొత్తంమీద సహాయ నిరాకరణోద్యం నడిపించడంలోను, కాంగ్రెసు ఆశయాలు ప్రబోధించడంలోనూ ఇంత దృఢంగా కంకణం కట్టుకున్న పత్రిక మరొక్కటి ఏదీ కూడా ఉండేది కాదు. గాంధీగారి ఉద్యమానికి అప్పుడు వారపత్రికలు తప్ప దినపత్రికలు ఏవీ లేవు. అహమ్మదాబాదు కాంగ్రెసుకి వెళ్ళినప్పుడు ఒకరోజున నేనూ, గాంధీగారూ కారులో కూర్చుని వెడుతూ ఉన్నప్పుడు ఆయన దేవదాసు గాంధీకి వివాహము చేయదలచి ఉన్నాననీ, కొన్ని కారణాలచేత ఆ వివాహం జరగలేదనీ చెప్పారు. ఇంకా మాకు, ఆయన గృహ సంబంధమైన విషయాలు కూడా నాతో చర్చించేటంత అన్యోన్యభావం కలిగింది. ఆ దేవదాసు గాంధీకి అప్పటినించీ వివాహము కాకపోవడమూ, తరవాత రాజగోపాలాచారిగారి కుమార్తె లక్ష్మిని ఇచ్చి వివాహం చెయ్యడమూ జరిగాయి. దేవదాసుగాంధీకీ, రాజగోపాలాచారిగారి కుమార్తెకీ వివాహం జరిగిన కాలంలో రాజగోపాలాచారిగారూ, నేనూ ఒకరొకరికి కొంచెం దూరం అయ్యాము.

21, 22 సంవత్సరాల్లో మేమిద్దరమూ ఐకమత్యంగా ఉండి నిర్మాణ కార్యక్రమం మంచి ఉత్సాహంతో నడిపిస్తూ ఉండేవాళ్ళము. 23 వ సంవత్సరము ఫిబ్రవరి, మార్చినెలల్లో అభిప్రాయభేదాలు ఏర్పడి మేము విడిపోవడం తటస్థించింది. 21 వ సంవత్సరంలో కాంగ్రెసు విథానం పూర్తిగా నిర్వర్తించడానికి కంకణం కట్టుకుని బయలుదేరిన పత్రిక 'స్వరాజ్య' ఒక్కటే అని పైన వ్రాశాను. 'స్వరాజ్య' అహమ్మదాబాదు కాంగ్రెసులో చేసిన తీర్మానాల ప్రకారం కాంగ్రెసువారినీ, ప్రజలనీ బ్రహ్మాండంగా ఉద్బోధించింది. అ తరవాత కూడా అల్లాగే ప్రబోధిస్తూ వచ్చింది. మొట్టమొదట ఇంగ్లీషులో 'స్వరాజ్య' పత్రిక ప్రారంభించబడిన తరవాత కొద్దికాలానికి రాజగోపాలాచారిగారి ప్రోత్సాహంచేత అరవంలో కూడా 'స్వరాజ్య' దైనిక పత్రిక ప్రారంభించి తమిళనాడు అంతటా గొప్ప ప్రచారం జరిపాము. అల్లాగే తెలుగులో కూడా పత్రిక ప్రారంభించి జేగీయ మానంగా కాంగ్రెసు ప్రబోధం చేశాము.

ప్రథమ ఖండం సమాప్తం.