Jump to content

దశావతారచరిత్రము/10. కల్క్యవతారకథ

వికీసోర్స్ నుండి

10. కల్క్యవతారకథ

దశమాశ్వాసము

క.

విను మిఁక హరి కల్యంతం
బునఁ గల్క్యవతారభావమున మ్లేచ్ఛుల నె
ల్ల నడంచి ధర్మసంస్థా
పన మొనరింపఁగలఁ డవనిపాలకతిలకా.

1


క.

అని శ్రీవైశంపాయన, ముని దెల్పిన మిగుల మోదమున జనపాలుం
డనఘా కల్క్యవతారము, వినుపింపుమటన్న మౌనివిభుఁ డిట్లనియెన్.

2


క.

శ్రీకృష్ణుఁడు మహి వీడ్కొని, వైకుంఠము సేరినపుడె వచ్చెం గలిరా
జా కల్లోలి న్యధిప, క్ష్మాకోపన నేలఁజాల శఠవల్లభుఁడై.

3


సీ.

బలిని వంచించిన మలినాత్మకునికాళ్లు గడిగిననీళ్లు గంగాస్రవంతి
యందులోఁ గలసిన యమున వేరైయున్న నది యేమిబ్రాతి నైల్యంబు దొరసె
చూడసరస్వతి జొత్తువైఖరి నుండు గుప్తగామిని యది కొఱయె మనకుఁ
బరికింపఁగా సహ్యగిరియూట కావేరి యంబులంటినఁ బడిసెంబువట్టుఁ


తే.

బుష్కరిణులందుఁ గడుఁబ్రాచి పొదలియుండుఁ
జెప్పఁగారాదు వారాశి యుప్పునీళ్లు
మంచిగుంటల జలములే మంచివనుచు
జనులు దెచ్చిరి కల్క్యభిషేకమునకు.

4


క.

అనృతములు వేదమంత్రము, లని బౌద్ధులు స్వైరవృత్తి నభిషిక్తునిగా
నొనరించిరి కలి నిలకుం, గనుఁగొని పాషండగణము గర మలరారన్.

5


సీ.

పరలోకదృష్టికి మఱుఁగైనకైవడి శ్వేతాతపత్త్రంబు చెన్ను మీఱఁ
బరిహృతాహంకారఫణిరాజు మేనుబ్బఁ జామరానిలములు సందడింప
సుగుణహంసములఁ బోఁ జోపుమెఱుంగుల రహివేత్రి కనకనేత్రములు పొదల
సకలపాపోపదేశములచందమునఁ [1]జార్వాకవారముల కైవార మమర


తే.

యవనికీకటశకమలయాళసింధు, పారసీకాదిభూవరు ల్బలిసికొలువ
నలువుమీఱ నధర్మసింహాసనమున, నిండుకొలువుండెఁ, గలినృపాఖండలుండు.

6

మ.

దయ వర్ణాశ్రమధర్మరక్షణము నౌదార్యంబు దాక్షిణ్యము
న్నయముం గల్గిన క్షత్త్రవంశజులచెంత న్నిల్వ కీవెందు ని
ర్దయులౌ మ్లేచ్ఛులఁ దుచ్ఛజాతుల సముద్యత్ప్రీతి వర్తింపు దు
ర్నయులం చెన్నకు లక్ష్మి వారలెకదా నాప్రాణబంధు ల్మహిన్.

7


క.

శిష్టాచారులు లేమిని, కష్టాత్ములఁ జేసి వెనుకఁ గార్పణ్యముచే
భ్రష్టులఁ జేయుము నీ విఁక, జెష్టా పోపొమ్ము సీమసీమలమీఁదన్.

8


సీ.

శాబరమంత్రము ల్సఫలంబులుగఁ జేయు వేదమంత్రము లెల్ల వృథ యొనర్పు
మెన్నెన్నివిధముల హీనజాతులనుండు ముత్తమద్విజులందు నుండవలవ
దుండిన బ్రతుకు నీ కుపయోగముగ నుండు సద్ధర్మభక్తులు సాగనీకు
వివిధశాస్త్రార్థము ల్విశ్వసింపఁగ నీకు ధర్మశాస్త్రంబులు దలఁపనీకు


తే.

కామశాస్త్రంబు ముఖ్యంబుగా ఘటింపు, బౌద్ధచార్వాకజైనకాపాలికాది
మతము లెచ్చింపుము శ్రుతియుతము లుడుపు, తిరుగు మెల్లెడ శారదాదేవి నీవు.

9


వ.

అని మఱియు వారివారిం దగునుద్యోగంబుల నియోగించి శూద్రనృపలక్ష
ణంబుల ముద్రితుండగు కలి మదోద్రేకంబున రౌద్రసమున్నిద్రుం డగుచు
ధర్మపురుషుని కొదవపాదంబు గెంటింప కంటికి నిద్ర రాదని వెదకుచు భాగీ
రథీతీరంబున గోరూపధారిణియగు ధారిణింగూడి నడయాడు ధర్మవృషభంబుఁ
బ్రసభంబునం దన్ని తన్నిరాకరణకుపితభవజ్జనకపరీక్షత్ప్రతిహతుండై తదను
మతంబున స్త్రీద్యూతపానాదుల వసించియున్నవాఁ డింకం గొంతకాలంబు
భవాదృశులగు రాజులకు వెఱచి యీమేర వర్తించు నంత యథేచ్ఛం బ్రవ
ర్తించుఁ దత్క్రమంబుఁ గొంత వినుపించెద నాకర్ణింపుము.

10


క.

జనపతు లన్నము భూసుర, జనములు వేదములు సతులు స్మరగేహములం
బనివడి యమ్ముదు రింకన్, వినువిూ కలియుగము దుష్టవృత్తి నరేంద్రా.

11


క.

ధన మిచ్చు నతఁడె యేలిక, ధన మిచ్చినవాఁడె మగఁడు తరుణులకెల్లన్
ధనవంతు నాశ్రయింతురు,ధనము ప్రధానంబు దుష్టతరకలివేళన్.

12


క.

క్రతుధానవ్రతములకుం, బ్రతివిధు లొనరించికొంద్రు బ్రాహ్మణకులు లే
శ్రుతులు పఠింపరు గీతా, శ్రుతి చదువుదు రదియుఁ బోవు సురనదితోడన్.

13


సీ.

క్షితిని ధర్మంబు మించిన లేదు వాన వానలు లేమి షామంబు బలియు లెస్స
క్షామంబు ప్రబలినఁ గడిచేసి యన్నంబు భుజియింప దొరకమిఁ బ్రజలు నొగిలి
యడవులఁ బడి యాకునలము మెక్కుచు నెవ్వఁడే నపూర్వంబుగా నున్న కాయ
పండు దిన్నను వాని బట్టుక యుదరంబు చించి లోపలిది భక్షించికొనుచు


తే.

హ్రస్వదేహులు హీనాంగు లల్పధనులు
క్రూరు లశనైకతత్పరు ల్కుటిలమతులుఁ

జోరు లన్యోన్యభక్షు లాచారదూరు
లగుదు రటమీఁదఁ గలియుగాంత్యంబునందు.

14


తే.

జగతి ధర్మార్థకామమోక్షంబు లనఁగ, వఱలు నాలుగు గనుపుల చెఱుకుఁగోల
ఆది తుది నీరసంబు మధ్యద్వయంబు, సారమండ్రు కుయుక్తి దుర్జనులు గలిని.

15


తే.

కలియుగము దుష్టయుగమంట కల్లమాట
కలియుగము వంటిమంచియుగంబు లేదు
సతికిఁ బతిభక్తివలన మోక్షంబు గల్గు
శూద్రులకుఁ గల్గు విప్రశుశ్రూషవలన.

16


చ.

కృతయుగ వేళ జ్ఞానమునఁ ద్రేతఁ దపంబున ద్వాపరంబునం
గ్రతువుల గల్గు ముక్తి కలికాలమునం దవిలేకయున్న సం
తతము హరే ముకుంద రఘునాథ యదూద్వహ యందు మించు స
న్మతి నుతియించినం గలుగు మర్త్యులకెల్లను ముక్తి భూవరా.

17


సీ.

నూటిలో నొక్కఁ డేపాటిదానంబు గావింపఁడే యంచును వెదకి వెదకి
వెయ్యింట నొకఁడైన వేదంబు చదువఁడే క్షోణీసురుఁ డటంచుఁ జూచిచూచి
పదివేల నొకఁడైనఁ బట్టెఁడన్నము పరదేశి కిడఁడె యంచుఁ దెలిసితెలిసి
లక్షలోపల నొక్కలలనయైనను సాధ్వి యై యుండదే యని యరసియరసి


తే.

కోటి నొకపుణ్యమైన గన్గొనఁగలేక, సంచరించుచు మ్లేచ్ఛదేశములలోన
ధర్మవృషభంబు కొదవపాదంబు విఱిగి, విబుధపురిఁ జేరె కలి కేక వేసె ననఁగ.

18


సీ.

బాలరండలు గొడ్డుబ్రహ్మచారులు మహావ్రతము లన్వేషింతు రతిశయముగఁ
జక్కనినిజకులసతులకు జారులఁ గూర్తురు సంసారికులు యథేచ్ఛ
శాంతులు గండదోషములుఁ దద్దినములు భూసురు లెంతురు భోజనేచ్ఛఁ
బలుకఁబోయినఁ గొండెములు పల్కుదురు రాజసంసేవకులు దొరచనువుఁ గోరి


తే.

యభ్యసింతురు శ్రుతులు దానార్థు లగుచు
నేరుతురు శాస్త్రములును బాండిత్యమునకె
నైష్ఠికత పూనికొండ్రు ప్రతిష్ఠకొఱకు
ధార్మికులు లేరు కలియుగాంత్యంబునందు.

19


సీ.

బ్రహ్మసూత్రమెకాని బ్రాహ్మణోత్తములకుఁ గలుగదు షట్కర్మగౌరవంబు
పరదారపరధనహరణవృత్తియెకాని ధరణీశులకు లేదు ధర్మబుద్ధి
కపటమార్గమె కాని క్రయవిక్రయంబుల న్యాయంబు లేదు వైశ్యాన్వయులకు
ధర్మశాస్త్రంబులు తారు సెప్పనె కాని వినరు విప్రులచేత వృషలకులులు


తే.

జ్యోతిషము వైద్యసంగీతశాబరములు, నేర్చి చండాలకాదులు నిఖిలపూజ్యు
లౌదు రిల్లాండ్రు త్యజియించి యాత్మపతులు, నర్థవంతులఁ గూడుదు రభిమతముగ.

20

సీ.

[2]అన్నదాతలమంచు యాయజూకులమంచు దొరలచే రూకలు దోఁచువారుఁ
గడుపుకక్కుఱితికిఁ గావికోకలు గట్టి యతులమంచును భిక్ష లడుగువారుఁ
దల్లిదండ్రులఁ జంపి ధన మెత్తుకొనిపోయి చెలఁగి తొత్తులపొత్తు గలయువారుఁ
గాసువీసములకై కలహించి యతిరోషవివశులై ప్రాణము ల్విడుచువారు


తే.

దూరపరదేశి నని పంచఁ జేరి రాత్రి
వేళ యిలు సొచ్చి ధనమెల్ల వెరఁజువారు
నవిరతంబును జూదంబు లాడువారు
నగుచుఁ జెడుదురు కలియుగాంత్యమున జనులు.

21


తే.

అవని నొక్కొకపుణ్యాతురాలు పతినిఁ, జంపకయె జారువెంబడి జరుగుఁ గాని
పిట్టపిడుగున మగనిఁ జంపింప కిల్లు, వెడల దిల్లాలు కలియుగవిలయవేళ.

22


తే.

ఎన్న నైదేండ్లనైన నాఱేండ్లనైన
బిడ్డలను గండ్రు కన్నెక ల్గొడ్డు వీఁగి
పదియు నొకయేఁటఁ బెద్దలుఁ బదియునాఱు
నేండ్లు పరమాయువగుఁ గలి హెచ్చుకతన.

23


వ.

అట్టి సమయంబున.

24


శా.

శ్రీమద్విష్ణుయశోభిధానమున రాజిల్లున్ మహీదేవసు
గ్రాముం డొక్కఁడు సర్వసంపదల విభ్రాజిష్ణువౌ శంబళ
గ్రామాభిఖ్యపురంబులో నతనిభార్యారత్న మబ్జాలయా
హైమగ్రావసుతాభయై తగు సుశీలాబ్జాక్షి శీలంబునన్.

25


సీ.

కలనైన మగవానిఁ దలయెత్తిచూడదు కలకలనవ్వుచుఁ జిలుకబోదు
కులటలఁ గూడదు తొలఁగనీయదు పైఁట మీఁగాళ్లపై కోక మెదలనీదు
విభునితోఁ జెప్పక వెడలదు వాఁకిలి పొరుగిండ్ల నిరుగిండ్లఁ బ్రొద్దు గడప
దధిపుఁడు బిల్చినట్లైన దిగ్గునవచ్చు మమత దేవోపచారములు సలుపుఁ


తే.

బ్రతిదినము నత్తమామల బత్తి సేయుఁ, దోడికోడండ్రఁ గనుసయిదోడుజాడఁ
బరిజనంబులఁ బోషించుఁ బ్రజలరీతి, సరసభాషణసాధ్వి యప్పరమసాధ్వి.

26


క.

ఆపుణ్యసాధ్వి కాత్మజుఁ, డై పుట్టును గల్కి యనఁగ నంభోనిధిక
న్యాపతి పంచగ్రహములు, దీపితముగ నుచ్చసంస్థితిం బొరయంగన్.

27


క.

లౌల్యప్రధానమై తగు, బాల్యము గ్రమియించి తరుణభావము దనరం
బాల్యము భూతల మిఁక నని, లౌల్యంబున గల్కి విజయలంపటుఁ డగుచున్.

28


సీ.

తళుకుబంగరుచెఱంగులయోర తలపాగ తలకుఁ జౌపంచ మిన్నలతురాయి
మొసలివాయొంటుల మిసిమికస్తురిబొట్టు నంగిపైఁ బొసఁగు వజ్రాంగిజోడు

కడవన్నెజిగిపట్టు నడికట్టు పడిదలపట్టంబు నేజయు బాగుదేర
సరసభాగమున బాగైనతూణీరంబు కరమున జీనిసింగాణివిల్లు


తే.

మెఱయ నుచ్చైశ్శ్రవముఁ బోనిమించు తెల్ల, తేజిపై నెక్కి తేజంబు తేజరిల్ల
వెడలు దిగ్విజయార్థియై వేదబాహ్య, గళితధర్మైకజీవాతు కలికిరౌతు.

29


సీ.

జోడన ల్ద్రొక్కించు శూరసేనాంగబంగాళము ల్పంచబంగాళముగను
జుట్టువేడెము వెట్టుఁ జోళమాళవగౌళపాంచాలములు పటాపంచ గాఁగ
రవగాలు నెఱపు సౌరాష్ట్రగూర్జరలాటమత్స్యభూములను దుమార మెగయ
నిబ్బరంబుగ నూకు నిషధమాగధసింధుమేదినీంద్రులు కంచుమించుఁ గాఁగఁ


తే.

గర్కకర్కశతరఖురాఘాతజాత, నూతనస్ఫీతరేఖికాజాతభూత
లోదరీమేదురీభూతసాదరార్పి, తాత్మనఖముఖభంగి మాయాతురంగి.

30


మ.

జవలీలాహసితానిలం బగుజిరాసంజోకగుఱ్ఱంబుమేల్
రవగాల్ జోడన చుట్టువేడెము లొనర్పం బుట్టుకెందూళికై
తవతౌరంగికఖడ్గఖండితసమస్తమ్లేచ్ఛతుచ్ఛాంగర
క్తవిలోలంబయి మించు భూతరుణికిం గాశ్మీరచర్చాకృతిన్.

31


క.

ఈరీతిఁ గల్కి జనసం, హారము గావించి తెలిసి మహిధర్ము వి
స్తారము సేయుననన్ విని, కౌరవముఖ్యుండు మునిశిఖామణి కనియెన్.

32


తే.

విష్ణుయశునకు విష్ణుఁ డావిర్భవింపఁ, గారణం బేమి యతఁ డెట్టిఘనతపంబుఁ
జేసెనొ తదీయచరితంబుఁ జెప్పు మనిన, వ్యాసమునిశిష్యుఁ డిటువలె నానతిచ్చె.

33


సీ.

అవనీశ తొల్లి స్వాయంభువమనువు బ్రహ్మర్షి లోకశరణ్యమైన నైమి
శారణ్యమునఁ దర్పకారి జటావాటి నలరు వేలుపుటేటివలెఁ దనర్చు
గోమతీద్వీపవతీమణితటమున ద్వాదశార్ణమనుమంత్రము జపంబు
సేయుచుఁ గలశాబ్ధిశాయిణ గూఱిచి పూర్ణతమనిష్ఠ మును లద్భుతంబు సెంద


తే.

దశశతాబ్దంబు లతిఘోరతప మొనర్ప
మెచ్చి కనువీనుకవణంబు మెక్కు పక్కి
జక్కిపై నెక్కి తనయిరుపక్కియలను
నలువ మొదలైనవేలుపు ల్బలసి కొల్వ
శౌరి యాతనియెదుట సాక్షాత్కరించె.

34


చ.

కమలదళాక్షుఁ డిట్లు దనకట్టెదుటం గనుపట్టినం బ్రమో
దము మదిఁ గ్రమ్మ నమ్మనువతంసము నేఁటికి నాతపంబు జ
న్మము ఫలియించెఁగా యని నమస్కృతులున్ నుతులున్ ఘటింప వేఁ
డుము వర మెట్టిదైన ననుడున్ విని యాతఁడు శౌరి కిట్లనున్.

35


సీ.

శతపత్రదళనేత్ర జననత్రయంబు మత్పుత్రుఁడవై నీవు పొడమవలయు
నా ధర్మసంస్థాపనము సేయ నీకు నే సుతుఁడనై జనియింప మతిఁ దలంతు
నన దశరథుఁ డయ్యె మనువు దొల్తఁ దదీయ జాయసుశీల కౌసల్య యయ్యె
హరి రాముఁ డయ్యె రెండవపరి దేవకీవసుదేవు లగుటయు వారియందుఁ


తే.

గృష్ణుఁడై విష్ణుఁ డుదయించె నింక విష్ణు, యశుఁడు దేవప్రభ యన గల్క్యంతమునను
వారె యుదయింపఁ గల్కియై శౌరి యవత, రించి కృతయుగచర్యఁ గావించఁగలఁడు.

36


క.

ఈకల్క్యవతారక్రమ, మాకర్ణించిన జను ల్సదారోగ్యశుభ
శ్రీకలితు లగుదు రతులగు, ణాకర జనమేజయక్షమాధ్యక్షమణీ.

37


సీ.

సకలసత్కవినితాష్టాదశవర్ణనాపూర్ణమై నవరసోదీర్ణ మగుచుఁ
గదళికాఫలపాకకమనీయభాషావిశేషమై కృతపరిశోష మగుచు
నశ్వమేధాదియాగాభోగఫలదానదక్షమై కృతిశతాధ్యక్ష మగుచు
భాగవతాగ్రణీపారంపరిభాగధేయమై సజ్జనగేయ మగుచుఁ


ఆ.

దనరు నీదశావతారమహాప్రబం, ధంబు వినినయట్టిధన్యమతులు
ధరణిఁ గృష్ణుకరుణ ధర్మార్థకామము, ల్గలిగి పిదప ముక్తిఁ గాంతు రధిప.

38


క.

అని శ్రీవైశంపాయన, ముని వినుపించినను భక్తి విని వేడుకతో
జనమేజయవిభుఁ డా, మునిసోమునిఁ గమలభవసముని బూజించెన్.

39


శా.

శ్రీమద్వేంకటమాభిధానవరపుత్రీరత్నపుత్రీవివా
హామేయోత్సవసుస్మితాస్యరఘుపత్యాక్యాత్మజాశ్లేషణో
ద్దామప్రేమరసాభిరామసతి సీతానామకన్యామణీ
హైమోదంచితడోలికాకలనవీక్షాయత్తచిత్తాంబుజా.

40


క.

ద్విడ్భోగధవళితాశా, రుడ్యామిన్యధిపకీర్తిరుచిరచిరసుధా
త్విడ్భోగధవళితాశా, కుండ్యాతరధర్మమర్మకోవిదహృదయా.

41


మత్తకోకిల.

హైమభూధరగౌరనీరజహంసమండలజైత్రదో
ర్దామకీర్తిరమాధురంధరరమ్యనీతియుగంధరా
భీమసారహృతాహితావనిభుగ్వసుందరరుగ్యజు
స్సామవేదవిశారదద్విజచాతకవ్రజకంధరా.

42


గద్య.

ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్ట్ర
భాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణీదేవుల నాగ
నామాత్యసుధాసముద్రసమున్నిందరపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతం
బైన దశావతారచరిత్రంబను మహాప్రబంధంబునందు దశమాశ్వాసము.

ఇది పదియవ యవతారంబగు కల్క్యవతారము.

దశావతారచరిత్ర సర్వము సంపూర్ణము.

  1. చార్వాకకైవారముల్ ప్రౌఢినెఱప
  2. అగ్నులు ధరియించి