తిరుమల తిరుపతి యాత్ర/అధ్యాయము 1

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తిరుమల తిరుపతి యాత్ర

అధ్యాయము. 1.

తిరుపతి:--

శ్రీపురమని సంస్కృతనామముచే వ్యవహరింపఁబడు తిరుపతి యనెడి పట్టణము చెన్నపురి రాజధానిలోఁ జిత్తూరు జిల్లాలోని మ్యునిసిపల్ పట్టణము. తిరుపతికొండలకును కార్వేటినగరము జమీందారిలో కొండలను వేఱుపఱచుచు మధ్యన నుండు విశాలమైన కనుమలో నీపురమున్నది. తిరుమలకుఁబోవు యాత్రికులు సదా ఉండుటచే నీపట్టణము జనముచే నిండియుండును. ఇప్పురము 1886వ వత్సరమున మ్యునిసిపల్ Municipal పట్టణముగా నియమింపఁబడెను. ఇక్కడ కొన్ని దేవస్థానములు గలవు. ఇవియు శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానము వలెనె శ్రీమహంతువారి విచారణకర్తృత్వములో నున్నవి. శ్రీవిచారణకర్తలవారిఖచేరియు, దేవస్థానము వల్ల నిర్మింపఁబడిన ఆయుర్వేద వైద్యశాలయు, పాఠశాలయు, సంస్కృత కాలేజియుఁ గలవు. ఇంకను మ్యునిసిపల్ హాసుపత్రియు, సబుమేజస్ట్రేటు ఖచేరి, జిల్లా మున్సిఫ్‌కోర్టు, సబ్ రిజిష్ట్రార్ ఖచేరి, పోలీస్ సర్కిల్ ఖచేరీలు గలవు. బాటసారులకు తాలూకా బోర్డువారి బంగళా (Travellers, bangalow) గలదు. అమెరికమిషన్ హైస్కూలు కట్టడములు గలవు. ఊరుబయట రీడింగ్ రూముగలదు. యాత్రికులకు సౌకర్యార్థముగ ననేక సత్రములుగలవు. ఇక్కడ తిరుపతి తూర్పు అనియు, తిరుపతిపడమర అనియు రెండు రయుల్వేస్టేషన్లు గలవు. తిరుపతి తూర్పుయాత్రికులు దిగుటకు సుఖము. ఈ స్టేషన్ పురమును చేరియున్నది.

2. యాత్రికుల నాదరించువారు:-

శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనము కొఱకు వచ్చుయాత్రికులు గూడూరు, రేనిగుంట పాకాల కాట్పాడి రయిల్వే జంక్షన్ల ద్వారాతిరుపతికి రావల్సినందున వీరిలోననేకు లాజంక్షన్లుకు పోయి యాత్రికులు రయిలు బండిలో నుండగనే యూరుపేరులు హెచ్చరించి తమ బసలకు రమ్మనివేఁడెదరు. వీరల మాటలన్నియు స్వబుద్ధితో యాత్రికులు యోచించి విశ్వాసముంచవలెను. వీరలయిండ్లకు వెళ్లిన బసపాత్ర సామాను లిప్పించెదరు. బియ్యము మొదలగు సామానుల నంగడి (లేక దుఖాన్) లోగొనునప్పు డంగడివా రింకొకరికి నీసామానులకు గాను రుసుమియ్యకుండగఁ జూచుకొనవలెను. ముడుపు లింకను తక్కిన సొమ్ములు యాత్రికులు భద్రముగా గాపాడుకొనవలెను. నమ్మి యితరులకియ్యఁగూడదు.

3. సత్రములు:-

"పుష్పతోట" అనువిశాలమైన దేవస్థానపు సత్రముగలదు. మిగుల శుభ్రముగను, బందోబస్తుగనుండును. ఇచ్చటగుమాస్తా జవానులు (అనగా భంట్రోతులు) గలరు. బసపాత్ర సామానులు నాల్గు జాతులవారికియ్యఁబడును. రయిల్వేస్టేషన్ వద్ద నుండి 2 లేక 3 అణాలకు బండి బాడుగ (అనగాఅద్దె) కు దొరకును. ఇది బజారుకుఁ జేరికొండకుఁ బోవుమార్గములో సున్నది.

మైసూరు గవర్నమెంటువారి సత్రము. క్రొత్తపల్లి రామాచార్లుగారి సత్రము రయిల్వే స్టేషన్ కు 4 ఫర్లాంగుల దూరమున నున్నవి. బండిబాడుగ స్టేషన్ నుండి రు 0-1-6 కూరగాయలు మార్కెట్ కు దగ్గఱగాను బజారుకు దూరముగాను శుభ్రముగను బందో బస్తుగనుండును. బ్రాహ్మణులకుమాత్రము బసలిచ్చెదరు. రామాచార్లుగారి సత్రములో పాత్రసామానులిచ్చెదరు. రెండుసత్రముల యొద్దను గుమాస్తాలుండెదరు. డాక్టర్ రామస్వామినాయుడు గారి సత్రము రయిల్వే స్టేషనుకు చేరి యున్నది. నాల్గుజూతులవారికి బసలిచ్చెదరు. నర్రావారిసత్రము పురమునకు పశ్చిమ భాగములో గలదు. నాల్గుజాతులవారు దిగవచ్చును.

శ్రీహత్తిరాంజి మఠమువారి ధర్మశాలపురమునకు మధ్య నున్నది. మార్కెట్ కు బజారుకు సమీపముననున్నది. నాల్గు జాతులవారు దిగవచ్చును.

వైశ్యుల సత్రములు క్రొత్తవీధిలో రెండుగలవు. సౌరాష్ట్రుల సత్రమొకటి శ్రీరాములవారి సన్నిధి వీధిలో గలదు.

N B: యాత్రికులు కూడ ఒక మంచి బీగము లేక కప్పు తాళము దెచ్చుకొనవలెను. డోలీలు సాధారణముగా ప్రతి సత్రమువద్ద దొరకును గాని పుష్పతోటవద్ద విశేషము, 

4. శ్రీకపిలతీర్థము.

ఈతీర్థము మిగుల ప్రాచీనము. ఇచ్చట భూలోకములోఁ బార్వతీ పరమేశ్వరులు కపిల మహాఋషికి ప్రత్యక్షమయిరి. ఈలింగము పాతాళములో సురలుచేతను, కపిలమహాముని చేతను బూజింపఁబడి జనుల నుద్ధరింప భూలోకమున కేతెంచెను. శ్రీవేంకటేశ్వర స్వామివారు వకుళమాలిక దేవిని శ్రీ పద్మావతిదేవి వివాహరాయబామునకు మొదటఁ బంపునపుడు నీతీర్థములో స్నానము చేసి కపిలేశ్వర స్వామివారి దర్శనము జేసికొని తమవివాహమును గుఱించి ప్రార్థించ వలెనని చెప్పిరి.

శ్లో|| అస్మాదేవరాన్మార్గదవరుహ్యగిరేస్తటాత్|
త్వంగచ్ఛాధః ప్రదేశేచకాపిలం లిఙ్గము త్తమమ్||
శ్లో|| తత్రాస్తే తీర్థ రాజా యః కపిలేశ్వరసన్నిధౌ|
తత్రస్నా త్వాయథాయోగ్యంమధర్థం తీర్థపుంగవే||
శ్లో|| కపిలేశ్వర మాసాద్యయాచ్చతాం పరమవ్యయమ్|
శ్రీనివాసేన బాలేనస దాకల్యాణ కాంక్షిణౌ||
శ్లో|| ప్రేషితాహంతర్ధం వై కురుమే భీప్సితం ప్రియమ్|
ఏవముక్త్వాశివం దేవి ! తతఃపద్మతటంగతా||

భవిష్యోత్తర పురాణము.

ఈతీర్థము తిరుపతికి ఒకటిన్నర మైలు దూరముననున్నది. శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనమునకు గాను కొండనెక్కక మునుపే ఈతీర్థమునకు తిరుపతినుండి యాత్రికులు వెళ్లి స్నానము చేసికొనెదరు. కొందఱు హిరణ్యము లేక తీర్థవిధి లేక తీర్థ
శ్రాద్ధ మిచ్చట జరిపించెదరు. ఈతీర్థములో స్నానము చేయునప్పుడు సంకల్పాదులు, దానధర్మములు, తీర్థ శ్రాద్ధములు మొదలగువానిని జేయవలయునని నిర్బంధము లేదు. ఇష్టమున్న వారు తమశక్త్యనుసారము చేయవచ్చును, ఒనర్చిన తీర్థవిధుల సాఫల్యమునకై ఇంతకు తక్కువగాక బ్రాహ్మణులకు భోజనమిడవలయు ననియు ఆయాదానములు విధ్యుక్తముగాఁ జేయవలయుననియు నటుల నాయావిధులఁ జేయనియెడలఁ బెద్దలు మోక్షముఁ బొందరనియుఁ జెప్పుమాటలు విశ్వాసార్హములుగావు. యాత్రికుల నిర్బంధించుట కధికార మెవరికిని లేదు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ముడుపులలోని ద్రవ్యముచే నీ తీర్థమువద్ద వ్యయము చేయవచ్చునను పల్కులాలింపఁ గూడదు. ఈతీర్థము నొద్ద పితృలకు పిండప్రదానము చేసినంతట తరించెదరు. మృత్పిండ ప్రదానము చేసినను పితృ దేవతలు తరించిరి.

శ్లో|| ప్రాపనర్ప గిరింరాజన్ దైవయో గేణకర్మణా|
తేరాజాన స్త త్రగత్యాతీర్థే కపిలసంజ్ఞికే||
శ్లో|| స్నాత్వాభక్తి సమోపేతావపనంచక్రురాదరాత్|
మాధవస్స్వయ మప్యేత్యవాపయామాసవైశిరః||
శ్లో|| పార్వణాని ప్రకుర్వంత స్తత్ర రాజన్ క్షితీశ్వరాః |
పిండానిచ సుసంహృష్టా శ్రాద్ధీయాని దదు స్తదా||
శ్లో|| మాధవోపి శుభేతీర్థే స్నాత్వాత దృచ్చ సార్వణమ్|
కుర్వన్పిండా న్మృదాకృత్వాపితృభ్యశ్శ్రద్ధయాదద||
శ్లో|| దైవాత్త త్కర్మణే వాసౌ తదాభూద్గత కల్మషః|
తస్మాద్యోమానవోభక్త్యాకుర్యాత్తీర్థావగాహనమ్



శ్లో||పితృశ్రాద్ధం పిండదానం ముక్తిస్తస్యనసంశయః|
మృత్పిండ కృతవాంవిప్రఃపుణ్యక్షేత్రే పురాతనే||
శ్లో|| కింవర్ణ యామఃపురుషోత్తమ, స్య
క్షేత్రస్యతీర్థస్యచపుణ్యశక్తిమ్,
మృత్పిండదానా త్పితరశ్చ తస్య
ముక్తిం ప్రపన్నాముర వైరిశాసనాత్

భవిష్యోత్తర పురాణము.

ఈతీర్థ సమీపమున నమ్మాళ్వార్ దేవస్థానము గలదు. ఇది శ్రీ కపిలేశ్వర స్వామి వారి దేవస్థానమువలె వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునకు సంబంధించినది కాదు. ఈ తీర్థము వైష్ణవు లాళ్వారు తీర్థమందురు.

5. డోలి. మూటల వాండ్రు.

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనమునకు గొండ నెక్కలేని వారు డోలిలో వెళ్లెదరు. డోలి అనగా చిన్న ఉయ్యలతొట్టి వలె నొకచిన్న మంచమొక (ఒక అడుగు వెడల్పు రెండు అడుగులు పొడుగు) బొంగునకు వ్రేలాడకట్టి యిద్దఱచే మోయఁ బడునది. బుర్కా డోలి, మేనాసవారి దొరకును. డోలికి సాధారణముగా ర్పు 2-0-0 పుచ్చుకొని తిరుపతినుండి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునకు ఒక్క పర్లాంగు దూరమున నూరుబయట (కొండమీద) వరకు మోసెదరు. యాత్రికులు డోలీలను గుదుర్చుకొను నప్పుడు బాడుగ హెచ్చు గాకుండఁ జూడవలెను. ఇందులో కమీషన్ ఏజంట్లు గలరు, ఎవరి అవసరము లేకుండ కొండ మొదటికిఁ బోయ డోలీలను గుదుర్చుకొన వలెననీ పోవుచు మార్గములో డోలీలను హెచ్చరించి డోలి కుదుర్చుకొన వచ్చును. ఒకప్పుడు హెచ్చరించిన బేరము కుదరక పోయినను వాడు వెంటాడించు నంతట వేరే డోలివాడు సులభముగా రాఁడు. డోలి కుదిరిన తర్వాత కూర్చుండఁ బెట్టుకొని కొండ దూరము తీసికొని వెళ్లి అదుగో కొండయనియు నొకప్పు డింతవరకె డోలిలో తీసికొని వచ్చుట కేర్పర్చు కొనెననియు, సొమ్ము తెమ్మనియు కొండకు వెళ్లి వచ్చి నంతట నింకను సొమ్మియ్య వలెననియు డోలి వాండ్రు కొందఱు చెప్పుట తఱచు. ఇట్లు చిక్కులు పడకుండగ నేర్పరుచుకొనవలెను. లేదా యాత్రికులు దిగిన సత్రము గుమాస్తాల ద్వారా లేదా యాత్రికుల నాదరించు వారి ద్వారా యేర్పాటు చేసికొనవలెను. ఉదయము డోలీలు దొరకును. మధ్యాహ్నము కొండకుఁ బోవుటకు తిరుపతిలో డోలీ దొరకుట దుస్తరము.

సామానులు మోయుటకు బిడ్డలనెత్తుకుని వెళ్లుటకు కూలీలు దొరకుదురు. వీర్లను మూటలవాండ్రందరు. మనిషి 1_కి ర్పు 0-8-0 చొప్పున కూలి తీసికొనెదరు. వీర్లను యాత్రికులు కూడ తీసికొని వెళ్ళవలెను. బిడ్డలను విలువగల సామానులను మీడ్రవద్దనిచ్చి కూడా రమ్మనవలెను గాని దూరముగా నుంచుట నంత క్షేమకరము గాదు.

6. కొండమార్గము

తిరుపతినుండి కొండకు పోవు మార్గమున కలిపిరి రస్తాయనియు తిరుపతిరస్తాయనియు వాడెదరు. ఇది సుమారు ఏడు మైళ్ళ దూరము గలదు. మొదటి కొండ నెక్కుట నిండాకష్టము. తర్వాత ఒక మైలు కొంచెము కష్టముగానుండి యటుపైన రెండు మైళ్లు ఎక్కుడు లేక నుండును. అనంతరము మోకాళ్లెక్కుడు దిగుడుగలి తర్వాత శ్రీ వేంకటేశ్వరస్వామి వారు దయచేసి యున్న గ్రామము వరకు మార్గము తేలికగా నుండును. మోకాళ్లెక్కుడు దిగుడు అనున దొక పర్వతము దిగి యింకొక పర్వత మెక్కుట. అనగా నొక కనుమ దాటుట.

అలిపిరి అనగా కొండ పాదము. ఇచ్చట పాదరక్షలు గల మంటపము గలదు. ఈ పాదరక్షలు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వనియు నిక్కడ మ్రొక్కి కానుక లొసగ వలెననియు యాత్రికులకుఁ జెప్పెదరు. ఇచ్చట శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ముడుపులు చెల్లింపఁ గూడదు, ఆట్లు చెల్లించిన యెడల శ్రీ స్వామి వారికిఁ జేరవు.

కొండ మార్గమున బిచ్చగాండ్రనేకులు గలరు గాని వాండ్ర వలన బిచ్చ మడుగుబాధ తప్ప నెట్టి బాధయుండదు. వీర్లలోఁ గొందఱు సాముద్రికము చెప్పునట్లును, మరికొందఱు కాళ్లుండియు లేనట్టుగుడ్డలు చుట్టుకొని నటించుచు నుందురు. ఇదంతయు దరిద్ర దోషముచే బిచ్చము కొఱకు వేషములు.

ఠాణాలు

శ్రీ లక్ష్మీ నృశింహ స్వామి వారి దేవస్థానం మొదలు భాష్య కార్ల గుడి వరకు ఎక్కుడు దిగుడు గలదు. ఇదియాత్రి కులకు కష్టముగా నుండును. అనగా ఒక్క పర్వతముదిగి ఇంకొక పర్వత మెక్కవలెను. ఈ రెండు పర్వతములకు మధ్యను కనుమకు అవాచారికొన యనిపేరు. ఇచ్చట యాత్రికుల క్షేమమునకు దేవస్థానము వారొక ఠాణా ఉంచి భటులను పెట్టియున్నారు. దీని కోన ఠాణా అనెదరు. ఇది తిరుపతికి 5
మైళ్ల దూరమున నున్నది. ఇదే మాదిరిగ తిరుపతికి 3 మైళ్ల దూరమున మామండూరు మిట్ట ఠాణా అనియు నాల్గు మైళ్ల దూరమున ముగ్గుభావి ఠాణాయు గలవు. మూడు ఠాణాల వద్దను భావులు గలవు. ఠాణాలలోని భటులు యాత్రికులకు మిగుల సహాయముగ నుండెదరు.

ఇదిగాక అలిపిరి మొదలు మామండూరు మిట్ట వరకు కావలిగా నిద్దఱు దేవస్థానపు భటులు తిరుపతి సబ్ మేజస్ట్రేట్ స్వాధీనములో నుందురు.

7. చలివేంద్రలు - భావులు.

ఈ మార్గమున చలివేంద్రలు మెండు. ముగ్గుబావి ఠాణా యొద్దను మామండూరు మిట్ట ఠాణా సమీపమున దేవస్థానపు చలివేంద్రలు గలవు. నాల్గవజాతి వారు మంచి తీర్థము దాహమిచ్చెదరు. తిరుపతినుండి పోవునప్పుడు కోన ఎక్కుడు దాటిన తర్వాత రెండు పర్లాంగుల దూరమున నొక దేవస్థానపు చలివేంద్ర గలదు. ఇచ్చట మజ్జిగ మంచి తీర్థము బ్రాహ్మణు డొకడు శూద్రు డొకడుండి దాహమిచ్చెదరు. ఈ మూడు చలివేంద్రల వద్ద దాహమునకుగా నేమియునియ్యనక్కఱలేదు.

శ్లో|| వేంకటాఖ్యే మహాపుణ్యే తృషార్తానాం విశేషతః|
జలదాన మకుర్వానః తిర్యగ్యోని మవాప్నుయాత్.

స్కందపురాణం.

మామండూరు మిట్ట, ముగ్గుభావి, కోనఠాణాల వద్ద భావులు గలవు. యాత్రికులిందలి నీరుపయోగించు కొనవచ్చును.



8. శ్రీ లక్ష్మీనృశింహ స్వామి వారిగుడి.

ఇదలిపిరిరస్తాలో తిరుపతికి నాల్గు మైళ్ల దూరమున ముగ్గుభావి సమీపమున నున్నది. ఇది శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునకుఁ జేరినదిగాదు. ఇది శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము యొక్క అర్చకునికిఁ జేరినది. శ్రీ వారి ముడుపు లిచ్చటనియ్యఁ గూడదు.



9. శ్రీభాష్యకార్ల వారి గుడి.

శ్రీ వారికొండంతయు శేషాంశమనియు నందువలన వైష్ణవమతోద్ధారకుడైన శ్రీరామానుల వారు పాదములతో త్రొక్క గూడదని మోకాళ్లతో నడచి వెళ్లుచు మార్గములో నలసి కొంచెము సేపాగిన ప్రదేశమున శ్రీభాష్యకార్లవారి గుడి కట్టఁబడినది. ఇది శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవస్థానమునకుఁ జేరినది. ప్రతిదిన మచ్చట నుండి నివేదన వచ్చును. ఇచ్చట శ్రీవారి ముడుపు లియ్యఁ గూడదు. ఇచ్చట శ్రీభాష్యకార్లు వారికి కానుకలు మొదలగున వియ్యవలెనంటె శ్రీవేంకటేశ్వర స్వామి వారి దేవస్థానములో పారుపత్యదారు ఖచేరిలో చెల్లించవలెను గాని నిచ్చట నియ్యఁ గూడదు.



10. అలిపిరి గోపురము.

అలిపిరివద్ద నిండా పురాతనమైన గోపురముగలదు. ఇది శిధిలమైనందున నెవరు దగ్గఱకుఁబోవకుండ చుట్టు దూరముగ కటాంజనము వేయఁబడినది. ఈ గోపురమందలి ప్రాచీన శిల్పమునకు గాను భద్రముగా కాపాడఁబడుచున్నది.


గాలిగోపురము

ఇది అలిపిరి రస్తాలో అలిపిరివద్దనుండి ఒక్క మైలుదూరమున నున్నది. అలిపిరినుండి గాలిగోపురమునకు మార్గము నిండా ఎక్కుడు. యాత్రికులకు కష్టముగానుండును. ఈ గోపురము చాలాదూరమునకు కనబడును. రాత్రులందు గాలిగోపురము వరకు మార్గమునను, గోపురము పై భాగములోను దేవస్థానము వారు దీపములు వేయించెదరుగాన నా దీపము చాలాదూరము కనబడును.

ఈ గోపురమునుచేరి ఒక్క మఠముగలదు. దీనిని గాలిగోపుర మఠమనియు, వైకుంఠదర్వాజామఠమనియు వాడెదరు. ఇచ్చట కొందఱు ఉత్తర హిందూస్తాన్ సాధువులుగలరు. సదావృత్తిచ్చెదరు. ఈ మఠము తిరుపతిలోనుగలదు. తిరుమలలో నొక కట్టడముగలదు.

సారెపెట్టెలు

భాష్యకార్ల వారి దేవస్థానము దాటినతర్వాత కొన్ని గజములదూరములో పెట్టెలుపేర్చినటుల శిలలుగలవు. ఆ పెట్టెలకు నాలుగుప్రక్కల ఆంజనేయవిగ్రహములుగలవు. శ్రీపద్మావతమ్మ వారు సారె తెచ్చుకొనుచు అక్కడకు రాగా నామె కోపము వచ్చినందున నాపెట్టె లచ్చటనుంచి ఆంజనేయులను కావలిపెట్టి పద్మ సరోవరమునకు వెళ్లినట్టు చెప్పెదరు. కోపమునకు కారణము పలువిధములు జెప్పెదరు. అయితే శ్రీవారికి కావల్సిన వస్తువులు కొన్ని తేలేదని శ్రీవారు నిరాదరణ చేసినందువలన కోపముగల్గెనని చెప్పెదరు. ఇచ్చట శ్రీ అమ్మవారి అడుగు జాడలు కనబడును. ఆ జాడలను మార్గస్తులు పూజించెదరు.

పంచములు మొదలగువారు

నాలుగుజాతుల హిందువులుతప్ప నితరులు గొండనెక్కఁగూడదు. అలిపిరివద్ద శిలామనుజుడు సాష్టాంగముగఁ బడియున్నాఁడు. అదిదాటి రాఁగూడదు. 1871-వ సంవత్సరములోని గవర్నమెంటువారి ఉత్తరవు ప్రకారము మెజస్టీరియల్, పోలీసు యూరోపియన్ ఉద్యోగస్థులప్పుడప్పుడు పోయెదరు. పంచములు గపిలతీర్థమునకు సమీపమున మాదిగవాని గుండములో స్నానముచేసి తిరుపతిలో దేవస్థానపు విచారణకర్తలవారి ఖచేరిలో ముడుపులఁ జెల్లించి రసీదుఁబొందెదరు. మహమ్మదీయులు గూడ నీ ఖచ్చేరీలో ముడుపులు చెల్లించుటగలదు.