చిరస్మరణీయులు, మొదటి భాగం/మీర్జా బిర్జిస్‌ ఖదీర్‌

వికీసోర్స్ నుండి

73

28. మీర్జా బిర్జిస్‌ ఖదీర్‌

(1845-1893)

మాతృభూమిని పరాయిపాలకుల పెత్తనం నుండి విముక్తం చేసేందుకు పన్నెండు సంవత్సరాల చిన్న వయస్సులో అనునిత్యం నీడలా వెంటాడుతున్న ఆంగ్లేయ శత్రువును ఎదుర్కొంటూ స్వతంత్రపాలన సాగించిన అవధ్‌ రాజ్యాధినేత మిర్జా బిర్జిస్‌ ఖదీర్‌.

1845లో బేగం హజరత్‌ మహల్‌, అవధ్‌ చివరి నవాబు వాజిద్‌ అలీషా లకు జన్మించిన బిర్జిస్‌ ఖదీర్‌ అసలు పేరు మొహమ్మద్‌ రంజాన్‌ అలీ బహదూర్‌. ఆంగ్లేయులు అక్రమంగా చేజిక్కించుకున్న అవధ్‌ రాజ్యాన్ని తల్లి మారదర్శ కత్వంలో పునరాక్రమించుకుని స్వదేశీయుల అంగీకారంతో 1857 జూలై 7న ఆయన స్వతంత్ర పాలకుడయ్యారు. మాతృభూమి కోసం ప్రాణాలు త్యజించడానికి సిద్ధమైన ప్రజలు, స్థానిక నాయకులు, సిపాయీల సహకారంతో 1,80,000 మందితో కూడిన బలగాలను సమకూర్చుకున్నారు. తల్లి హజరత్‌ మహల్‌ సమర్థవంతమైన మార్గదర్శకత్వం, స్వదేశీయుల శౌర్యప్రతాపాల ఫలితంగా లక్నోనుండి ఆంగ్లేయాధికారులు పలాయనం చిత్తగించగా 10 మాసాల పాటు అవిచ్ఛిన్నంగా మీర్జా బిర్జిస్‌ ఖధీర్‌ పేరిట స్వతంత్ర పాలన సాగింది.

ఆ సందర్భంగా 1858 నవంబర్‌ 1న విక్టోరియా మహారాణి విడుదల చేసిన ప్రకటనకు ధీటుగా స్వదేశీయులలో ధైర్యాన్ని ప్రోదిచేస్తూ, విదేశీయుల కుయుక్తులను

చిరస్మరణీయులు 74

బహిర్గతం చేస్తూ బిర్జిస్‌ ఖదీర్‌ పేరిట 1858 డిసెంబర్‌ 31న చారిత్రాత్మక ప్రకటన విడుదల చేశారు. అతి పిన్న వయస్కుడైన బిర్జిస్‌ ఖదీర్‌ బలగాల చేతిలో కలిగిన ఘోర పరాభవాన్ని ఆంగ్లేయులు జీర్ణించుకోలేకపోయారు. సత్వరమే లక్నోను పట్టుకోవలసిందిగా లార్డ్‌ కానింగ్ జారీ చేసిన ఆదేశాల మేరకు బ్రిటిష్‌ సైన్యాధిపతులు కోలిన్‌ క్యాంప్‌బెల్‌, జనరల్‌ హ్యావ్‌లాక్‌, జనరల్‌ ఓట్రాంలు భారీ సైనిక బలగాలతో లక్నోను చుట్టుముట్టారు. అత్యంత కీలక సమయంలో సిక్కులు, గూర్ఖాలు ఆంగ్ల బలగాలకు అండగా నిలిచారు. లక్నో ప్రజలు, స్వతంత్ర అవధ్‌ సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడినా కంపెనీ సైనిక బలగాలను జయించటం అసాధ్యమయ్యింది. చివరకు సహచరుల ఒత్తిడి మేరకు మీర్జా ఖదిర్‌తో సహా బేగం హజరత్‌ మహల్‌ నేపాల్‌ పర్వతాలలోకి నిష్క్రమించారు.

నేపాల్‌ పర్వతసానువుల్లో ఎదురైన ప్రతికూల వాతావరణం, అనారోగ్యం మూలంగా తన సెన్యాధికారులు, సైనికుల సంఖ్య త్వరితగతిన తరిగిపోగా 1874లో హజరత్‌ మహల్‌ మరణించారు. ఆర్థికంగా అతి క్లిష్ట సమయాన్నిఎదాుర్కొంటున్న సమయంలో కలకత్తాలో బ్రిటిషర్ల నిర్భంధంలో ఉన్న ఖదీర్‌ తండ్రి నవాబు వాజిద్‌ అలీషా కన్నుమూశారు. ఆయన మరణంతో అవధ్‌ వారసుడిగా బిర్జిస్‌ ఖదీర్‌ రూపంలో మిగిలిన ఏకైక అడ్డును తొలగించుకునేందుకు ఆంగ్లేయులు కుటిల యత్నాలను ప్రారంభించారు. బిర్జిస్‌కు ఆశ చూపించి లొంగదీసుకునేందుకు విఫలప్రయత్నాలు చేస్తూ, అనుయాయుడైన నేపాల్‌ రాజు జంగ్ బహుదూర్‌ ద్వారా బిర్జిస్‌ ఖదీర్‌ మీదఒత్తిడి పెంచారు.

చివరకు గత్యంతరం లేక బిర్జిస్‌ ఖదీర్‌ అజ్ఞాతం నుండి బయటకు వచ్చారు. రాజ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కలకత్తా రావాల్సిందిగా కంపెనీ అధికారులు ఆయనకు ఆహ్వానం పంపారు. కుటుంబ సమేతంగా ఆయనను అంతం చేయాలన్న దురుద్ధేశ్యంతో కూడిన ఆంగ్లేయుల కుట్రను గ్రహించలేకపోయిన బిర్జిస్‌ పూర్తి పరివారంతో కలకత్తా వచ్చారు. 1893 ఆగస్టు 13న కుమారుడు ఖుర్షీద్‌ ఖదీర్‌, కుమార్తె జమాల్‌ ఆరా బేగంతోసహా ఆంగ్ల అధికారులిచ్చిన విందులో ఆయన పాల్గొన్నారు. ఆ విందులో విషాహారాన్ని ఆరగించటంతో బిర్జిస్‌ ఖదీర్‌ తన ఇరువురు బిడ్డలతో సహా ప్రాణాలు విడిచారు. భార్య మొహబత్‌ ఆరా బేగం, చిన్నకుమార్తె హుస్నా అదా బేగం ఆ విందుకు రాకపోవటంతో ఆ ప్రాణాంతక కుట్ర నుండి బతికి బయపడ్డారు. ఈ విధంగా చివరి వరకు స్వతంత్ర అవధ్‌ కోసం తపించి, ఒంటరి పోరాటం సాగించిన మీర్జా బిర్జిస్‌ ఖదీర్‌ 1893 ఆగస్టు 13న ఆంగ్లేయుల భయానక కుట్రకు బలయ్యారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌