Jump to content

చాటుపద్యరత్నాకరము/ప్రథమతరంగము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

చాటుపద్యరత్నాకరము

ప్రథమతరంగము

శా. శ్రీసీతాహృదయాబ్జభృంగ! సితరాజీవాభ్రమాతంగగం
   గాసారంగధరాంగజాహితతురంగ క్షీరనీహారతా
   రాసాధారణసాధుకీర్తి రుచిచర్చాభాసురాశాంతభా
   మాసందోహశుభాంగ! భద్రగిరిరామా! దీనచింతామణీ!

క. నిడ్గేడ్గణహర! జీవన
   రాడ్గళగళితాస్త్రపుషితరాజత భూధ్రా
   ధీడ్గిరిజాధిపనుత! ఖగ
   రాడ్గామీ! చల్లగరిగె రామస్వామీ!

సీ. అజనిజాగ్రజభుజానుజసుజాంగ జయజా
            ర్కజయజాంబుజభజాభజనభాజ
   సురవరాధరచరాచరధరాధరచరాం
            తరవరాకరవరత్వర విహార
   ఘనతనాతనజనావనమనావనమన
            స్సునయనాయనధనాధననిధాన
   నతహితాశ్రితనుతాన్వితశతాయుతకృద
            ద్బుతపదాతి..........................

   నవ్యభవ్య మహోత్తమ దివ్యకావ్య
   వీరఘోరభయాపహధారధీర
   శోణకోణసముజ్వలద్బాణతూణ
   ధామభీమశరాసనస్తోమ, రామ!

సీ. మొదటిభూతము మహాద్భుత మైనపెనుబండి
            బండి మోయఁగఁ జాలుబలువుధనువు
   ఇరుభూతమునఁ బుట్టువిరిపట్టి సారథి
            సారథిజనకుండు సరవి శరము
   మూఁడవభూతంబు జోడుబాణము నారు
            నారిని నోడించినట్టి పింజ
   చతురభూతము తిండిశాయి కన్నులుగాళ్ళు
            గాళ్ళుఁ బుట్టినచోటు కౌనుఁ దలయుఁ
   జేసి పంచమభూతమ్ముఁ జేరి యున్న
   త్రిపురసురవైరి వైరి, వైరిమదహరుఁడు,
   హరుఁడు, నేత్రాగ్ని విధ్వస్తమరుఁడు, గురుఁఢు
   ఎపుడు మాపాలఁగల్గ నిం కేమికొదువ?

చ. కమలజకృష్ణశంకరులు, కాంచననీలపటీరవర్ణు, లా
   గమనగచంద్రధారు, లఘకంసపురారులు, హంసతార్క్ష్యగో
   గమనులు, జన్మపోషలయకారులు, వాక్కమలాంబికేశ్వరుల్
   శమకరుణావిభూతి ఘనశక్తులఁ బ్రోతురు మమ్ము నెప్పుడున్.

క. కుముదములు మల్లెమొల్లలు
   ప్రమదంబునఁ గోసి తెచ్చి ప్రాభవ మలరన్
   సముఖమునఁ బూజసేతుము
   సుముఖత మాకిమ్ము బుద్ధి శూలికుమారా!

చ. జనకునకు న్విషం బిడినసాగరుతోయము లన్ని నేలపా
   లొనరఁగఁజేతు నంచుఁ గరమూనిన గౌరియుఁ జూచి “వద్దురా

   తనయ! సురేంద్రుధాటి కిటుదాఁగినమామను బైట వేతురా?”
   యనినఁ గరమ్ముఁ దీసిన గజాస్యునిఁ గొల్తు నభీష్టసిద్ధికిన్.

శా. సాటోపారభటీకఠోరతరసంధ్యానృత్తకేళీనిరా
   ఘాటప్రౌఢనిరూఢగూఢపదరాడ్గ్రైవేయభాస్వజ్జటా
   జూటాంతర్విలుఠత్తరంగసమునస్స్రోతస్వినిన్ నిర్జర
   వ్యాటీకోత్కటచాటువాక్యఘటితన్ వర్ణించెదన్ శారదన్.

ఉ. శంభుజటాటవీతటవిశంకటవిస్ఫుటదివ్యవాహినీ
   శుంభదలర్గళప్రభవశోభితరంగదభంగభంగసం
   రంభవిజృంభమాణదరహాసఘుమంఘుమనాదలీల వా
   గ్జృంభణ మొప్ప నిన్ను మదిఁ జేర్చి నుతింతు మదంబ, భారతీ!

ఆ. అక్షరంబు తల్లి యఖిలవిద్యలకెన్న
   నక్షరంబు లోకరక్షణంబు
   అక్షరంబు లేని యబలున కెందును
   బిక్ష పుట్టఁబోదు పృథ్విలోన.

క. కవితాకవ్యకగుణములు
   కవికన్న రసజ్ఞుఁ డెఱుఁగుఁ గవి యే మెఱుఁగున్?
   భువిలో కన్యకగుణములు
   ధవుఁ డెఱుఁగును గాక కన్నతం డ్రేమెఱుఁగున్?

క. సుకవిత్వము తార్కిక
   నికరంబులలోన నెట్లు నిల్వఁగ నేర్చున్?
   మకరాంకకేళి కోర్చిన
   ముకురానన మల్లయుద్ధమున కె ట్లోర్చున్?

క. మూఢుం డెఱుఁగునె సత్కవి
   గూఢోక్తులసారమెల్లఁ గోవిదునివలెన్?
   గాఢాలింగనసౌఖ్యము
   ప్రౌఢాంగన యెఱుఁగుఁగాక బా లేమెఱుఁగున్?

ఉ. సాగరధీర! సత్కవితఁ జక్కఁగ నేర్చిన సద్బుధావళిన్
   బాగని మెచ్చు సత్కవులపాదరజంబుఁ దలం ధరించెదన్
   దాఁ గడుహీనుఁడై సభలఁ దప్పులు వట్టెడు దుష్కవీంద్రునిన్
   “ఛీ! దగడీ! గులామ!” యని చెప్పున దంతము లూడఁ దన్నెదన్.

ఉ. గొప్పకవీంద్రుఁడైన వినఁగోరుఁ గవిత్వము; తోఁచినంతలోఁ
   జెప్పును దప్పునొప్పు; నిరసింపక దిద్దును; శుంఠ యయ్యెనా
   తప్పులఁబట్టు; యుక్తిఁ బెడదారికిఁ దీయు; గరాసు దానిఁదా
   ద్రిప్పటఁబెట్టు, వాని తలఁదీయ సదాశివసద్గురుప్రభూ!

క. గుణి యెఱుఁగు గుణులగుణములు
   గుణహీనుం డేమి యెఱుఁగు గుణులగుణంబుల్?
   గుణనిధి తుమ్మెద కమలము
   గుణ మెఱుఁగునుగాక కప్ప గుణ మే మెఱుఁగున్?

మ. తొలిత్రోవన్ విడకుండి లోనితమముం దోడ్పాటుగా మూలమూ
   లలఁ జెల్వారుపదార్థముల్ విరసము ల్గావించు చిట్లెల్లచా
   యలదోషాచరణైకవృత్తిఁ గని సూర్యాలోకభీతిం బ్రవ
   ర్తిల్లుచుఁ డాఁగు గరాసు కంఠకలిత శ్రీ కోటి కొక్కొండె కా.

మ. తమి నందందుఁ జరించి కొట్లఁబడి యంతశ్ఛిద్ర మచ్చో లభిం
   పమికిం జింతిలి సాధ్వసమ్మతుల మై బాధింప సత్సూత్రజా
   లములన్ ఖండన సేయుచుం దనకులీలామార్గముల్ సాగకా
   ర్తిమెయిం జిక్కు గరాసు కంఠకలిత శ్రీ కోటి కొక్కొండె కా.

ఉ. కూరకు నుల్లిగడ్డలకు గుమ్మడిపిందెకుఁ జల్లనీళ్ళకున్
   నారకుఁ గట్టెపుల్లల కనాథలకుం గృతులీయ రోసి యా
   భారతి పోయి లక్ష్మికి నుపాయముఁ జెప్పెను ‘కైతకూటికిం
   జేరకుమమ్మ, నేఁ బడిన చిక్కులు పెక్కులు నిక్క మిక్కతల్.’

క. కవులు పొగడువేళఁ గాంతలు రతివేళ
   సుతులు ముద్దువేళ శూరవరులు

   రణము సేయువేళ ‘రా’ కొట్టి పిలుతురు
   పాడి యదియు మిగుల భజన కెక్కు.

ఉ. వీడని మూర్ఖునొద్ద నెఱవిద్యలు రూఢికి రావ దెట్లనన్
   బూడిదహోమమై చవుటఁబూడ్చినవిత్తయి వెఱ్ఱిముండతోఁ
   గూడినకూటమై విధవకొప్పునఁజుట్టినపుష్పమాలయై
   గాడిదవాహమై యడవిఁగాచినవెన్నెలయై వృథాయగున్.

వేములవాడ భీమకవి


ఈయుద్దండకవి శాపానుగ్రహశక్తి గలవాఁడు; శంభువరప్రసాదమును బడసిన మహానుభావుఁడు. ఇతని పుట్టుకను గుఱించియు, నీతనిశక్తినిగుఱించియు ననేకచిత్రగాథలు కలవు. ఈకవి తనశక్తి నిట్లు చెప్పుకొనెను.

సీ. గడియలోపలఁ దాడి కడఁగి ముత్తునియగాఁ
            దిట్టిన మేధావిభట్టుకంటె
   రెండుగడెల బ్రహ్మదండిముండ్లన్నియు
            డుల్లఁ దిట్టిన కవిమల్లుకంటె
   మూఁడుగడెలకుఁ దా మొనసి యత్తినగండి
            పగులఁ దిట్టిన కవిభానుకంటె
   అఱజాములోపలఁ జెఱువునీ ళ్ళింకంగఁ
            దిట్టిన బడబాగ్నిభట్టుకంటె
   ఉగ్రకోపి నేను నోపుదు శపియింపఁ
   గ్రమ్మఱింప శక్తి కలదు నాకు
   వట్టిమ్రానఁ జిగురు పుట్టింప గిట్టింప
   బిరుదు లేములాడ భీమకవిని

ఈతనిగూర్చి వేఱొకకవిచేఁ జెప్పఁబడినపద్యము—

చ. మతిఁబ్రభ నీగిఁ బేర్మి సిరి మానము పెంపున భీమునిన్ బృహ
   స్పతి రవిఁ గర్ణు నర్జునుఁ గపర్ది సుయోధనుఁ బోల్పఁ బూననా
   మతకరిఁ దీక్ష్ణు దుష్కులు నమానుషు భిక్షు ఖలాత్ము నెంచ వా
   క్సతిపు శశిన్ శిబిన్ కొమరుసామిని మేరువు నబ్ధిఁ బోల్చెదన్.

ఈకవి ఏకారణమువలననో కోపము పెల్లుఱేగి కోమటిపైఁ జెప్పిన పద్యములు.

చ. గొనకొని మర్త్యలోకమునఁ గోమటి పుట్టఁగఁ బుట్టెఁ దోన బొం
   కును గపటంబు లాలనయుఁ గుచ్చిబుద్ధియు రిత్తభక్తియున్
   ననువరిమాటలున్ బరధనంబును గ్రక్కున మెక్కఁ జూచుటల్
   కొనుటలు నమ్ముటల్ మిగులఁ గొంటుఁదనంబును మూర్ఖవాదమున్.

ఉ. కోమటి కొక్క టిచ్చి పది గొన్నను దోసము లేద; యింటికిన్
   సేమ మెఱింగి చిచ్చిడినఁ జెందద పాపము; వాసి నెప్పుడే
   నేమరుపాటున న్మఱియు నేమియొనర్చిన లేద దోస మా
   భీముని లింగమాన! కవిభీమునిపల్కులు నమ్మి యుండుఁడీ!

అని యీకవి పద్యమును జెప్పఁగా విని వేఱొకకవి—

ఉ. లేములవాడ భీమ! భళిరే! కవిసన్నుత! పద్యమందు నీ
   వేమని చెప్పినాఁడ వొకయించుక కోమటిపక్షపాతివై
   కోమటి కొక్కటిచ్చి పదిగొన్నను దోసము లే దటందురా?
   కోమటి కొక్కటీక పదిగొన్నను దోసములేదు లేశమున్.

అని పద్యమును జెప్పెను. (వేములవాడ భీమకవికి వేములాడ భీమకవి, లేములవాడ భీమకవి యనుపేర్లుగూడ వాడఁబడి యున్నవి.) ఒకానొకవిప్రుఁడు తనప్రియురాలితోఁ దనకు వియోగము ప్రాప్తమైనవెనుక మరల దానిని సాధింపనేరక మిడుకుచుండ భీమకవి యీక్రింది పద్యము నొసంగెనఁట. ఆపద్యముతో నాబ్రాహ్మణుఁడు తనకార్యమును జక్కఁబెట్టుకొనెనఁట.

ఉ. నవ్యవిలాసరమ్యనలినం బని బాలముఖాబ్జసౌరభా
   భివ్యసనంబునం దిరుగు భృంగకులోత్తమ! తద్వియోగతా
   పవ్యధఁ బ్రాణినిల్వదు; కృపాగుణ మేర్పడ “బ్రాహ్మణో న హం
   తవ్య” యనంగ నొప్పు వచనస్థితిఁ గుంద కెఱుంగఁ జేయుమా.

భీమకవి యొకతఱి నొకకుగ్రామమునకుఁ బోయి యుండి జన్నమాంబయను నొకవిప్రవితంతువును “వంటఁజేసిపెట్టు” మని కోరఁగా నాపె “అయ్యా! నేను గండమాలావ్రణముతో నల్లాడుచున్నాను; నాకిప్పుడు వంటఁజేయశక్తి లే” దని విన్నవించెను. అందుపై భీమన “అమ్మా! యీగండమాలఁ బోఁగొట్టిన వంటఁజేసి పెట్టెదవా?” యని యడుగ “మహానుభావా! తమకంతటి యనుగ్రహము రావలయునుగాని వంటఁజేయుట కేమియభ్యంతర” మనెను. అప్పుడు భీమకవి

క. ఘనరోగంబులబలమా
   కనుఁగొనఁగా జన్నమాంబకర్మపుఫలమా!
   నినుఁ బ్రార్థించెద వినుమా!
   మునుకొని యోగండమాల మునగకుఁ జనుమా.

అను పద్యమును జెప్పఁగా నావిశ్వస్తకంఠముననున్న వ్రణము మునగచెట్టునకుఁ జేర నంతట నామె యత్యంతానందభరితయై కవీంద్రునకు షడ్రసోపేత మగు భోజనముం బెట్టి తనకృతజ్ఞతను జూపెను.

తరువాత మఱికొన్నిదినములకు భీమన మరల నాగ్రామమునకే పనియుండి వచ్చి యా విధవనే వంటఁజేసి పెట్టుమని కోరగా “మాకిదేపని, ఇంకేమి పనియున్నది? ఇప్పుడు మాయింట్లో వీలు గా” దనెనఁట. దానిపై భీమనకుఁ గోపము వచ్చి

గీ. మున్ను జన్నమాంబ మునుకొనియుంటివి
   యేను బొమ్మటన్న యీవుజన్న
   ముండ యేరుగడచి ముదిపెండ్లికతఁసేసె
   మునగగండమాల ముండఁ బట్టు.

ఆ. ఏను భీమకవిని ఇదె నిన్నుఁ బ్రార్థింతు
   మునుపు నీవువచ్చి ముంచఁబట్టి
   మునగకొండ యయ్యె మునుపటిరీతిని
   మునగగండమాల ముండఁబట్టు.

అను పద్యములం జెప్పఁగా జన్నమ్మకంఠము మున్నున్నరీతినే చెందెనట.

బమ్మెర పోతరాజు



పోతరాజకృతభాగవతమ్మునఁ బ్రాసమునందు రేఫఱకారములకు సాంకర్యము కలదనియు నందుచే లాక్షణికులు లక్షణగ్రంథముగా భాగవతము నెత్తుకొనలేదనియు నప్పకవి తన గ్రంథమున

ఉ. బమ్మెరపోతరాజకృతభాగవతమ్ము జగద్ధితమ్ముగా
   కిమ్మహి నేమిటంగొదువ యెంతయు నారసిచూడఁగాను రే

   ఫమ్ములు ఱాలునుంగలసి ప్రాసములైన కతమ్మునం గదా
   యిమ్ముల నాది లాక్షణికులెల్లరు మాని రుదాహరింపఁగన్.

అనుపద్యమును వ్రాసెను. ఈపద్యమును జూచి వేఱొక కవి భాగవతమునందుఁ దనకుఁగల గౌరవమును వెల్లడించుచు నీ క్రిందిపద్యమును రచించెను.

ఉ. బమ్మెరపోతరాజకృతభాగవతమ్ము జగద్ధితమ్ముగా
   కిమ్మహి నేమిటంగొదువ ఎల్లపుడున్ భవనాశహేతుభూ
   తమ్మయి, లోకనాయకకథావినివేశితసర్వసాధుచి
   త్తమ్మయి, గోస్తనీరసయుతమ్మయి యున్కినొ, పాపి విన్కినో?

శ్రీనాథ కవిసార్వభౌముఁడు


ఈకవిసార్వభౌముఁడు పదుమూఁడు పదునాలుగుశతాబ్దములలోఁ గొండవీటిసీమ నేలిన రెడ్డిరాజుల యాస్థానకవి. ఆంధ్రప్రపంచమున నీవిద్వత్కవి నెఱుంగని చదువరి యుండఁడు. మిగుల సమర్థుఁడును, రసికశిఖామణియు నగు నీ పండితకవి శృంగారనైషధాది మహాప్రబంధముల రచించి వినుతి గాంచుటయే కాక నానాదేశసంచరణం బొనర్చి, సుఖదుఃఖంబుల ననుభవించి, తత్తత్సందర్భసూచకములగు ననేకచాటువుల విరచించి, తులలేనియశస్సుఁ జెంది, తుదకు “దివిజకవివరుగుండియల్ దిగ్గు రనఁగ” స్వర్గము నలంకరించెను. ఆమహామహుని చాటువులలో రసవత్తరము లిందుదాహృతములు.

ఇక్కడి పల్నాటిసీమలోఁ బ్రయాణముసేయుతరి నొకనాఁటి పయనమున, మార్గమధ్యమున, దగఁజెంది, దప్పిదీర్చు కొనుటకై చెంతనున్న యొకచెఱువునకుఁ బోఁగా, నందు నీరు లేకపోయెను. అప్పు డీకవి ఈక్రిందిపద్యము నాశువుగాఁ జెప్పెను.

క. సిరిగలవానికిఁ జెల్లును
   దరుణులు పదియాఱువేలఁ దగఁ బెండ్లాడన్
   దిరిపెమున కిద్దరాండ్రా
   పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్.

పల్నాటిసీమలోని మిద్దెలనుగుఱించి చెప్పిన పద్యము.

ఉ. మిద్దెలు మిద్దెలన్న మనమేడలకంటెను సొంపునించి బల్
   నిద్దపుసౌధజాలముల లీలవెలుంగునటంచు నెంచి నే
   నద్దిర! మోసపోతి సకలాభరణమ్ము లమర్చి కస్తురిన్
   దిద్ది కచంబుఁ జెక్కినసతిం బురుడించును మిద్దె లిచ్చటన్.

ఒకానొకసమయమున శ్రీనాథున కేదో జబ్బు సంభవింపఁగా వైద్యు లులిమిరిచెక్కతో నౌషధ మిచ్చి రొట్టె పథ్యము పెట్టి, గాలి తగులనిచోడఁ బరుండవలయు నని చెప్పిరఁట. ఆతఁ డట్లే యొకచీఁకటిగదిలోఁ బాధతోఁ బరుండి, యాసమయమునఁ జెప్పుకొనిన పద్యము.

చ. ఉలిమిరి చెక్కయున్ మిగులనుక్కయుఁ జప్పని రొట్టెముక్కయున్
   మలినపుగుడ్డలున్ నులుకమంచపుఁగుక్కియుఁ జీకటింటిలోన్
   దలచిన రోఁతవచ్చు నొకనాఁటి సుఖం బొకయేఁటి దుఃఖఁమౌ
   బలివెల వారకాంతల .......... బదివేల దండముల్.

శ్రీనాథుఁ డొకమంగలిసుమంగలిని వర్ణించిన వర్ణనము

ఉ. ముంగురు లుంగరాలు, చనుమొగ్గలు బంగరుబొంగరాలు, క
   న్నుంగవ గండుమీలు, సుమనోవృతమై తగువేణిబంధమున్

   నింగులువారు చీరె కటిసీమపయి న్నటియింప వచ్చె న
   మ్మంగలివారికాంత విటమానసమంతయుఁ జూరఁ బుచ్చుచున్.

కంసాలిస్త్రీపైఁజెప్పిన పద్యము

క. అంసాలంబితకచభర
   హంసాలస మందగమన హరిణాంకకళో
   త్తంసాలంబిత కుచభర
   కంసాలవిధూటి యెదుటఁ గానంబడియెన్.

శ్రీకాకుళము తిరునాళ్ళకు వెళ్ళినప్పుడు చెప్పినది.

శా. హైమగ్రావనితంబభూరికచభారభీర లున్మత్తలున్
   గామాంధల్ వెలనాఁటికోడెవిధవల్ కాకుళ్ళతిర్నాళ్లలో
   మామాంధాతయు, భీమసేనుఁడు, హిడింబానందనుం డోపితే
   నేమోకాని తెమల్పఁజాల రితరుల్ హేలారతిక్రీడలన్.

కురువజాతిస్త్రీపైఁ జెప్పిన పద్యము

[1]క. కురువది కంబడిఁ గట్టుక
   కఱకున కోర్వంగలేక గజ్జలదనుకన్
   బరికీ బరికీ బరికీ
   బరికీ మరునిల్లు బట్టబయలుగఁజేసెన్.

కవిత్వముఁ జెప్పుమని తన నూఱక బాధింపఁగా విసికి, త్రోవను బోవుచున్న యొకగాడిదను జూచి యీక్రింది పద్యమును జెప్పెనఁట. అందుపై నాపృచ్ఛకులు సిగ్గిలి శ్రీనాథుని జోలికిఁ బోక మిన్నకుండిరఁట.

ఉ. బూడిదబ్రుంగివై యొడలు పోఁడిమిఁదప్ప మొగంబు వెల్లనై
   వాడలవాడలన్ దిరుగ వారును వీరును జొచ్చొచో యనన్
   గోడలగొందులన్ దిరిగి కూయుచు నుండెదు కొండవీటిలో
   గాడిద! నీవునుం గవివి కావుగదా? యనుమానమయ్యెడున్

ఒకానొకసభయం దీకవికి “అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే” యను సమస్యను సభ్యు లీయఁగా అప్పటి వారియుద్దేశముల నెఱింగి కవిసార్వభౌము డిట్లు పూరించెను.

ఉ. కొందఱు భైరవాశ్వములు కొందఱు పార్థునితేరిటెక్కెముల్
   కొందఱు ప్రాక్కిటీశ్వరులు కొందఱు కాలునియెక్కిరింతలుం
   గొందఱు కృష్ణజన్మమునఁ గూసినవారలు నీసదస్సులో
   నందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే.

ఈకవి యొకనంబికన్నియపైఁ జెప్పిన పద్యము

క. నడినూకలేని బియ్యము
   వడఁబోసిన నెయ్యి బుడమవరుగున్ బెరుఁగున్
   గడుఁబేర్మి మాకు నొసఁగిన
   అడిమాచలనంబిచేడె నడిగితి ననుమీ.

అల్లసాని పెద్దన

ఈయాంధ్రకవితాపితామహునిం గూర్చి యెఱుఁగనివా రుండరుగదా! ఇమ్మహాకవి చాటువు లనేకములు. కృష్ణదేవరాయలు గండపెండేరము నొసంగి తనను గౌరవించినప్పు డీకవి రాజుగారిని దీవించెను. ఆదీవెన యిది

శా. క్షీరాంభోనిధియందు యోగసరణిం జిచ్ఛక్తిఁ బ్రాపించి త
   ద్గోరాజత్కకుబస్థ గోపవిలసద్గోరాజగోలోకతా
   స్ఫారాలోకనతేజగాత్రచలనస్వాంతాద్రిదంభోళి కృ
   త్సారజ్ఞానసనందనాదిమునిబృందాధిక్య సామర్థ్యవాః
   పూరాకారత నిద్రఁ జెందు కరుణాంభోరాశి నిన్ బ్రోవుతన్.

ఒకనాఁడు కృష్ణరాయఁడు భద్రగజంబు నెక్కి వాహ్యాళి వెడలిపోవుచుండఁగా మార్గమధ్యమునఁ బెద్దన యెదురయ్యెను. అప్పు డారాజుగారు తనమదకరీంద్రమును నిల్పి, కవీంద్రునిఁ దనసరసన కూర్చుండఁబెట్టుకొని “యేమి విశేషము” అని యడుగఁగాఁ బెద్దనగా రిట్లనిరి.

మ. గవనుల్ బల్లిదమయ్యె డిల్లికిని, మక్కాకోట మేటయ్యె,
   భువనం బెల్ల నదల్చి పుచ్చెననఁగాఁ బోలేరు సందేరులన్
   రవసం బెక్కె, బెడందకోటపురకాంతాగర్భనిర్భేదన
   శ్రవణంబయ్యె భవత్ప్రతాపజయవార్తన్ కృష్ణరాయాధిపా!

ఇక్కవీంద్రునిగుఱించి వేఱొకకవి వ్రాసిన పద్యము

సీ. కృష్ణరాయనపేరఁ గృతిని నీవొనరించి
            తివి తొల్లి విష్ణుచిత్తీయ మనఁగ
   కాఠిన్యమర్థంబు గ్రాహ్యంబు గాదు సా
            ధారణుల కని భూధవుఁడు పలుకఁ
   దరువాత మనుచరిత్రము రచియించి తు
            త్తమకావ్యము మహాద్భుతముగఁ బిదపఁ
   బెక్కుకావ్యంబులు పెంపెక్క రచియించి
            నుంటివి రాజసమ్మానమునను

   భంగమొందిన యలరామలింగముఖులు
   సాటి రాఁగలవారె నీతోటి; ఔర!
   ఆంధ్రకవితాపితామహ, యల్లసాని
   పెద్దనార్య, విశేషవివేకధుర్య!

ఒకనాఁ డాంధ్రకవితాపితామహుఁడు ఈక్రిందిపద్యమున వ్రాయ నారంభించి

మ. మృదుతల్పంబు వికారలీన దిగి ధమ్మిల్లంబుఁ జేబూని రా
   గద దృగ్జాలముతోడఁ గౌను నులియూఁగన్ మోము మార్వెచుట్టువ్
   వదలం జాఱిననీవిఁ బట్టుకొని యావామాక్షి యట్లేఁగెఁ....

అని యంతవఱకు వ్రాసి పైనెట్లు ముగించుటకుం దోపఁక తాటియాకును గంటము నచటఁ బెట్టి యెచ్చటికో పోయెనఁట. పెద్దనగారి కూఁతు రాయసంపూర్ణపద్యమునుం జదివి యీరీతిఁ బూరించెనఁట

   “ద, త్సదనభ్రాజితరత్నదీపకళికాస్తంభంబు క్రీనీడకున్.”

పెద్దనగా రేదోరీతినిఁ బద్యమును బూర్తిఁజేసి యాయభిప్రాయమును తాటియాకుపై లిఖింపఁబోవఁ బైరీతిని వ్రాయఁబడియుండెను. తన యభిప్రాయమునకన్న నాయభిప్రాయమే రసవంతముగానున్న కతన దాని నట్లే యుంచి, అట్లు పద్యమును బూరించినది తనకూఁతురని యెఱింగి యపరిమితానందమును జెందెనఁట.

తెనాలి రామకృష్ణకవి

పండితమండనుఁడై, కవులలోఁ బ్రౌఢకవియై, హాస్యరసమునకు పుట్టినిల్లై, రాజులచేతను, కవిరాజులచెతను బూజలంది, ఆచంద్రతారార్కమైన కీర్తి సంపాదించి, తనపేరు భూమం డలమున సుస్థిరముగా నెలకొల్పి చనిన యీకవిపుంగవు నెఱుంగనివా రెవరు?

భట్టుమూర్తివలెనే యీతఁడును కృష్ణదేవరాయన యాస్థానకవియె. ఈ యిరువురకును నిరంతరవైరము.

రామకృష్ణకవి స్నానముఁ జేయడనియు, సంధ్యానుష్ఠానముల నెఱుఁగనేయెఱుఁగడనియు, ననాచారుఁడనియు, బట్టుకవి యాక్షేపించెనఁట. దానికి వికటకవి, వచింపరాని వాక్యములతో నొకపద్యపాద మల్లి జవాబు నొసంగెనఁట. అందుచే భట్టుమూర్తి యవమానముఁ జెంది యాసంగతిని రాయలవారికి విన్నవించుకొనెనఁట. దానిపై రాయలు కోపించి “కృష్ణకవీ! ఇట్టిజవాబేనా యొసంగఁదగిన” దనెను. రామకృష్ణుఁడు “మహాప్రభూ! నాయంతటివాని నీశూద్రుఁ డాక్షేపించుట తగవా? వాని కెట్టిజవాబు నొసంగవలయునో అట్టిజవాబే యొసంగితి” ననెను. రాయలు “నేనే యాక్షేపించితి నేమిజవాబు నొసంగెద” వని యాగ్రహముతో ననెను. వెంటనే రామకృష్ణకవి తానల్లిన పద్యపాదములోని పదములనించుక మార్చి పద్యముఁ బూర్తిఁజేసి యీక్రిందిరీతిని వినిపింపఁగా రాజుగారు మనరామకృష్ణుని సామర్థ్యమున కానందించిరి.

శా. శ్రీనీరేజదళేక్షణాహృదయరాజీవభ్రమచ్ఛంచరీ
   కానూనాస్త్రధురంధరుండు హరుఁ డార్యాప్రాణనాథుండు ని
   త్యానందుండు శివుండు నాహృదయపద్మాసనస్థుఁడై యుండఁగా
   స్నానంబా తలకా? జపంబు మడికా? జందెంబు నాతప్పుకా?

భట్టుకవియందు కృష్ణదేవరాయలకు గౌరవము హెచ్చు. అక్కతన రాయలు బట్టుకవికి యర్ధాసనం బొసంగెను. అందులకుఁ దక్కినకవులందఱు నీర్ష్యాసూయాగ్రస్తు లయ్యును, నేమనుటకు ధైర్యము చాలక మిన్నకుండిరి. అప్పుడు రామకృష్ణుఁడు లేచి

ఉ. పండితు లైనవారలు సభస్థలి నుండఁగ నల్పుఁ డొక్కఁ డు
   ద్దండతఁ బీఠమెక్కిన బుధప్రకరంబును కేమి లోటగున్
   గొండొకకోఁతి చెట్టుకొనకొమ్మకు నెక్కినఁ గ్రిందిమత్త వే
   దండ మహోగ్రసింహములు తాలిమినందవె రాజచంద్రమా!

అనుపద్యమును జదివెను. బట్టుకవి యేమియు ననఁజాలక శిరమ్ము వంచుకొనెను.

ఉ. గండము తప్పె నాంధ్ర కవిగానికి నిన్నటిరేయి........
   ........................................
   ...........................................
   ................................................

ఈపద్యమును గృష్ణకవి యాంధ్రకవితాపితామహునిఁగుఱించి చెప్పెనందురు; కాని రామకృష్ణునకుఁ బెద్దనపై నతిగురుత్వము కలదు. ఈవిషయమును రామకృష్ణునిదైన యీక్రిందిపద్యము దృఢపరుచుచున్నది.

క. కవి యల్లసానిపెద్దన
   కవి తిక్కనసోమయాజి గణుతింపంగాఁ
   గవి నేను రామకృష్ణుఁడఁ
   గవి యనునామంబు నీరుకాకికి లేదే?

అయినను రామకృష్ణుఁడు పరిహాసమునకుఁ జెప్పియేయుండునని యెల్లవారికిని దోఁపకమానదు.

వాకిటికావలియగు తిమ్మనికి రాజుగా రెప్పుడో యొక మంచిసేలువ నిచ్చిరఁట. దాని నతఁడు కప్పుకొని క్రుమ్మరుటఁజూచి, మన వికటకవి దానిపైఁ గన్ను వేసి, యెట్లైనను దానిని కాఁజేయవలయునని యూహఁజేసి, యుపాయము గుదుర్చుకొని యొకనాఁడుఁ తిమ్మనిఁ బిలిచి మెల్లఁగా నిట్లు బోధించెను. ఓయీ కృష్ణదేవరాయలవంటి మహారాజుగారి ద్వారపాలకుఁడవై, యొకపద్యమునైనను గృతినందకుండుట నాకిష్టములేదు. అనఁగా అయ్యా తగినంత బహుమానము నియ్యనిదే కవులు పద్యములు చెప్పుదురా యనెను. రామకృష్ణుఁడు తిమ్మా, నే నుపాయముఁ జెప్పెద వినుము ఒక్కొక్కకవి నొక్కొక్కచరణమువంతున నడిగితివేని సులభముగాఁ బదిపద్యములఁ గృతి నందఁగలవు. ఇంతకు వేఱొకయుపాయము లేదని చెప్పఁగా నతఁడు సంతోషించి, మఱునాఁ డుదయమున వాకిట నిలిచి మొదట వచ్చిన పెద్దన్నగారికిఁ దనకోర్కిని దెల్పఁగా నక్కవి నవ్వి, యిట్లొకచరణమును జెప్పి లోపలికిఁ బోయెను.

క. “వాకిటికావలితిమ్మా”

తర్వాత వచ్చిన భట్టుకవి నాశ్రయింపఁగా నాతఁడు—

   “ప్రాకటమగు సుకవివరుల పాలిటిసొమ్మా”

అనుచరణమును వ్రాసియిచ్చిపోయెను. పిమ్మట వచ్చిన తిమ్మకవి కీసంగతిని విన్నవింపఁగా నతఁడు—

   “నీ కిదె పద్యము కొమ్మా”

అని చెప్పి పోయెను. వీరిరాకను గనిపెట్టియుండి నాలుగవవాఁడుగా వచ్చిన మనరామకృష్ణుఁడు—

   “నా కీపచ్చడమె చాలు నయముగ నిమ్మా.”

అని పూర్తిచేయఁగా తిమ్మఁడు మాఱుపలుకనేరక సేలువ నిచ్చివేసెను. ఈకథవిని రాయలు నవ్వి తిమ్మనికి వేఱొకసేలువ నొసంగెనఁట.

ఒకనాఁడు కృష్ణదేవరాయలు తనమంత్రులతోడను, పండితులతోడను, కవులతోడను, మిత్రబృందముతోడను నిండోలగంబుండ నొకపండితుండు విచ్చేసి “రాజచంద్రమా నేఁ జదువఁబోవు పద్యమునకు సంపూర్ణముగా నర్థముఁజెప్ప భవదాస్థానస్థవిద్వత్కవులు ప్రార్థింపఁబడుచున్నారు”. అనెను. అప్పుడు రాజుగారు తనపండితమండలివంక దృష్టిఁ బఱపిరి. ఇదియేమో యసాధ్యవిషయము వచ్చినదని కవులందఱు నొకరిముఖము నొకరు చూచుకొనుచుండిరి. అంత రామకృష్ణకవి లేచి వచ్చినపండితునివంకఁ దిరిగి— “పండితమండనా! తమపద్యమునకు సంపూర్ణార్థమును జెప్ప మేము సిద్ధముగా నున్నాము. మేమడుగు పద్యమున కర్థముం జెప్ప సిద్ధముగా నున్నారా తమరు?” యని యడుగఁగా నతఁడు ‘వ్యవహారము పెడదిరిగిన’ దని నిశ్చయించుకొని యేరీతిని దప్పించుకొనుటకు వీలులేక యెట్టకేలకు సమ్మతిం జూపెను. తరువాత రామకృష్ణకవి “తమపద్యమును జదువుఁ” డని కోరఁగా నాపండితుఁడు చదివిన పద్యము—

సీ. రాజనందనరాజరాజాత్మజులు సాటి
            తలప నల్లయవేమధరణిపతికి
   రాజనందనరాజరాజాత్మజులు సాటి
            తలప నల్లయవేమధరణిపతికి
   రాజనందనరాజరాజాత్మజులు సాటి
            తలప నల్లయవేమధరణిపతికి
   రాజనందనరాజరాజాత్మజులు సాటి
            తలప నల్లయవేమధరణిపతికి
   భావభవభోగసత్కళాభావములను
   భావభవభోగసత్కళాభావములను
   భావభవభోగసత్కళాభావములను
   భావభవభోగసత్కళాభావములను.

ఈపద్యమును విని రామకృష్ణుఁడు చిఱునవ్వు నవ్వు యిఁక నాపద్యమును వినుఁడు అని యిట్లు చదివెను.

సీ. మేఁకతోఁకకు మేఁక తోఁకమేఁకకు మేఁక
            మేఁకతోఁకకు తోఁక తోఁక మేఁక
   మేఁకతోఁకకు మేఁక తోఁకమేఁకకు మేఁక
            మేఁకతోఁకకు తోఁక తోఁక మేఁక
   మేఁకతోఁకకు మేఁక తోఁకమేఁకకు మేఁక
            మేఁకతోఁకకు తోఁక తోఁక మేఁక
   మేఁకతోఁకకు మేఁక తోఁకమేఁకకు మేఁక
            మేఁకతోఁకకు తోఁక తోఁక మేఁక
   మేఁకతొకతోఁక తొకతోఁక తోఁకమేఁక
   మేఁకతొకతోఁక తొకతోఁక తోఁకమేఁక
   మేఁకతొకతోఁక తొకతోఁక తోఁకమేఁక
   మేఁకతొకతోఁక తొకతోఁక తోఁకమేఁక.

రామకృష్ణుని పద్యమును వినఁగానే యాపండితునికి దీర్ఘాలోచన గలిగెను. ఏమనుటకుఁ దోపలేదు. అర్థమును వచింపలేనన మన సొప్పదు. ఈపద్యమున కర్థమే లేదన గుండె చాలదు. అతఁడట్ల కొంతవడి యోచించి యోచించి— “పండితులారా! ఈపద్యమున కర్థమును నేటిసాయంతనపుసభలో జెప్పెదను” అని సెలవు గైకొని బసకేఁగి పద్యార్థము నిశ్చయించుమార్గము తోఁపక తానువచ్చినమార్గమునుబట్టి మెల్లఁగా వెళ్ళెనఁట. ఆవిషయము నెఱింగి రాజుగారును, తక్కినపండితులును రామకృష్ణుఁడు పన్నిన పన్నుగడకు మిగుల సంతసించిరి.

మఱియొకరోజున వేఱొకకవి రాయలవారిని దర్శించి సభలో నిలువంబడి “నేను జెప్పు పద్యమును గంట మాపక వ్రాయువారుగాని, వ్రాయసమున నన్నోడించువారుగాని యీసభామధ్యమునఁ గలరా?” యని ప్రజ్ఞవలుక రామకృష్ణకవి లేచి “నేను పద్యములను జెప్పెదను. నీవు గంటమాపక వ్రాయఁగలవా?” యని ప్రశ్నించెను. అందుల కాతఁడు “గంట కెన్నిపద్యములఁ జెప్పఁగల” వని రామకృష్ణు నడుగ “గంటకొకపద్యమును జెప్పెద” నని బదులు చెప్పెను. ఆక్రొత్తకవి నిర్లక్ష్యాసూయాసూచకముగ మొగముం జిట్లించి—గంటమును దాటియాకును గైకొని “కానిమ్ము నీయోపి నన్నిపద్యముల గుప్పించు” మనెను. రామకృష్ణుఁడు సాధారణరీతిగాఁ బద్యమును బ్రారంభించి మధ్యలో సంతాపార్థక మగు నొక (వ్రాయవీలుగాని) చిత్రోచ్చారణతోఁ బాదమును బూరించి, తక్కుచరణములను సాధారణరీతినిఁ బూర్తిచేసెను. ఆకవి ఆయుచ్చారణ నెట్లు వ్రాయుటకుఁ దోపక—అందుల కొక యఱగంట యోచించి తుదకిట్లు వ్రాసెను.

క. వక్కలు చేరెఁడు నేఁగొని
   చొక్కాలోఁ బోసికొంటి—చొచ్చొచ్చొచ్చొ
   యెక్కడి దొంగలు వచ్చిరొ!
   అక్కఱకును లేకపోయె హరిశ్రీకృష్ణా.

పద్యమును బూర్తిగాఁ జెప్పినపిమ్మట రామకృష్ణకవి చాలసే పూరకుండవలసె. సభ్యులందఱును జప్పటలు గొట్టిరి. వ్రాయసకాని ప్రజ్ఞ గంగఁగలసె. మొగము వెలవెలఁ బోయె. రామకృష్ణునియుక్తి కందఱును శ్లాఘించిరి.

ఈకవి తనకవిత్వమును గూర్చియు తనపాండురంగవిజయమును గూర్చియుఁ జెప్పిన పద్యము.


[2]సీ. ప్రౌఢదీర్ఘసమానసపదములఁ గూర్చి శ్రీ
            నాథుండు కూలార్చె నైషధంబు
   దానితల్లిగ నల్లసానిపెద్దన చెప్పె
            ముదిమదితప్పి యాముక్తమాల్యద
   దూహించి తెలియరాకుండ సూరపరాజు
            భ్రమఁ గళాపూర్ణోదయము రచించె

   నతిశ్లేషవాగాడంబరం బొప్పఁ
            బస ఘటించెను మూర్తి వసుచరిత్ర
   నిట్టికవులకు నేను వాకట్టుకొఱకు
   చెప్పినాఁడ మదీయవైచిత్రి మెఱయఁ
   బాండురంగవిజయమును బటిమ దనర
   విష్ణువర్ధిష్ణుఁ డగు రామకృష్ణకవిని.

రామకృష్ణుని మఱికొన్నిచాటువులు

మ. వరబింబాధరమున్ పయోధరములున్ వక్త్రాలకంబుల్ మనో
   హరలోలాక్షులుఁ జూప కవ్వలి మొగం బైనంత నేమాయె నీ
   గురుభాస్వజ్జఘనంబు క్రుమ్ముడియు మాకుం జాలవే గంగ క
   ద్దరి మే లిద్దరి కీడునుం గలదె యుద్యద్రాజబింబాననా

క. విధుకృతవదనము వదనము
   మధుకరనికరములఁ గేరు మగువచికురముల్
   విధుమధుకరలీలాజయ
   మధురోక్తులు పిక్కలౌర మధురాధరకున్.

మ. సతతోత్సర్జనవార్ధునీసముదితస్వర్ణాద్రిరాట్కర్ణికా
   భ్రతలేందిందిరడింభగుంభితయశోభ్రాజచ్ఛితాంభోరుహా
   తతవిస్ఫూర్తికరోరుదోరుపధిమత్ప్రాగ్రావజాగ్రన్నిజా
   ద్భుతతేజోనవహేళి సంవరణభూభృన్మౌళి యొప్పెన్ భువిన్.

మ. బలవద్దర్పకశస్త్రికానిహతి సైఁపన్ లేక యవ్వేళ న
   య్యలినీలాలక యంబరాంతపరిణీతాత్మీయఖిన్నాననో
   త్పలినీబాంధన యౌచు నేడ్చెఁ గడు భూపాలైకరాగంబునన్
   గలకంఠీకలకంఠనినదైక్యస్ఫూర్తి శోభిల్లఁగన్.

గీ. పల్లవము పూని సకియమే నెల్లఁజేసి
   పద్మగర్భుఁడు లాఁ దీసి వాగుడిచ్చి
   మూ విసర్జించి యప్పు డప్పూవుఁబోఁడి
   డెంద మొనరించె సందేహ మందనేల?

క. తారకములఁ గోరకముల
   వారకములకెల్ల నెల్ల వారకము లిడున్
   శ్రీరమణీహారమణీ
   భారమణీయత్వదీయపదనఖరంబుల్.

క. జలవరము మిడుత మ్రింగెను
   జలచరమును మిడుత మ్రింగె జగతీస్థలిలో
   వలరాజు రాజు మ్రింగెను
   వలరాజును రాజు మ్రింగవచ్చినఁ బడియెన్.

గీ. చాన నెమ్మోము గెల్చుఁ గంజాతములను
   కాంత కంజాతముల గెల్చుఁ గంధరమును
   కంధరంబును సమదశంఖంబు గెల్చు
   శంఖభావంబు నయ్యర్ధచంద్రు గెల్చు.

చ. ఉవిదమిటారిచన్గవకు నోడి గుళుచ్ఛము లీనమౌచు రెం
   డవతను పూనియున్ మొదటినైజగుణంబును వెండి వీఁగి మె
   త్తవడి రజస్స్థితిం దొఱఁగి తా విగతాశ్రయమై యుదాత్తతా
   ధివసతి యయ్యుఁ దద్విధి గతించినఁ జాలక తుచ్ఛమై చనెన్.

గీ. కచకుచాననగళనేత్రకరయుగముల
   కళికుభృచ్చంద్రదరవారిజలత లోడి
   పాఱె ధరఁజొచ్చెను గృశించె వారి మునిఁగె
   బంకమునఁ జిక్కె నిడుదలై బయలుకుఱికె.

క. కమలాకర కమలాకర
   కమలాకర కమలకమల కమలాకారా
   కమలాకర కమలాకర
   కమలాకర మైనకొలను గని రాసుదతుల్.

గీ. నాని నీనాను నేనును నాని నాను
   నాన నేనును నిన్నూని నున్ననన్ను
   నెన్న నున్నను నిన్నెన్న నున్ననాన
   నిన్న నేనన్న నున్న నన్నెన్ను నన్ని.

క. కమలాకమలామోదిత
   కమలా కమలావతంస కమలాకమలా
   కమలా కమలాన్వయవర
   కమలాకమలాస్య రాధఁ గానరె యిచటన్.

ఉ. రాధితరాధిరాధిరధిరాధితదీధితిపూర్వనీయస
   ద్రాధితనాధినాధితరరారితరారితరారిరైరిసు
   భ్రాధితనాధనాయతరరారితకూరితవారితాంబుధి
   స్ఫూరితసాధులోకనుతపూజితరాజితపూర్వశేఖరా!

చ. తవతవతాహితాహయహితారకమాలకమాలచంచరీ
   జవజవజాలజాలనహిజాలకవాలకలీలచుంబినీ
   కవకవకావకావశుకకాహితకాహితలోకసుందరీ
   నవనవనావనావ నివనాహితనాహిత పూర్వశేఖరా!

చ. శరశరకాండకాండహరిచందనచందననాగనాగసుం
   దరదరచంద్రచంద్రశ్రితనారదనారదతారతారభూ
   ధరధరరాజరాజహయదానవదానవకాశకాశస
   త్పురపురమారమారహరభూధరభూధరకాలకాలహా.

క. జలకలకలకులకులకుల
   జలదకలక జలజములుక జలమలకపయో
   పలనిలవలలనయలస
   త్ఫలదాయకఫలితలలితపర్వవివేకా!

   ఈకవిచే రచింపఁబడిన దశావతారస్తోత్రపద్యములు

శా. సాధీయోముఖపూరితోద్వమితతాసత్యోర్ధ్వగోదన్వదీ
   ర్ణోధారాంతరటత్తిమింగిలగిలప్రోద్ధాననిధ్యానల
   బ్ధాధీశప్రభుతాస్వభాగహరణార్థాయాయిహృజ్జాంకధీ
   ప్రాధాన్యాతివిలోలవాగ్దృగబటబ్రహ్మన్ స్తుమస్త్వామనున్.

శా. ద్యూత్తంభద్గిరికల్పితావతరణద్యోవాహినీసంగమో
   పాత్తేందూదయనిష్పితౄణజలదిప్రారబ్ధపుత్రోత్సవో
   దాత్తత్వాత్తగజాశ్వవన్యశనకన్యాగోమణీదానసం
   పత్తిప్రీణితదేవఢుల్యధిపతిబ్రహ్మన్ స్తుమస్త్వామనున్.

శా. ఆద్యాలోకనభక్తిసంభ్రమదనేహఃపూరుషత్యక్తస
   త్పాద్యాంభస్తులసీభ్రమప్రదఖురప్రక్షాళనామాత్రజా
   గ్రద్యోగాంబుధిదంష్ట్రికాగ్రరిపుహృత్కాలామిషప్రాయశుం
   భద్యాదోనిధిసప్తికీస్థలకిరిబ్రహ్మన్ స్తుమస్త్వామనున్.

శా. డింభద్రోహివధోత్కటోత్క్రమణఘృష్టిక్లిష్టతారోమకూ
   పాంభోజప్రభవాండభాండదళనాద్యద్ధ్వానధీకృత్సభా
   స్తంభాంతఃస్ఫుటనస్ఫురత్ఫళఫళధ్వన్యార్తినిశ్చేష్టని
   ర్దంభోద్వోగదిశావశాపనృహరిబ్రహ్మన్ స్తుమస్త్వామనున్.

మ. స్వతలస్వచ్ఛతరారుణత్వరచితస్వస్త్రీట్ పరేడ్భ్రాంతివా
   క్ప్రతికూలత్వదశానుకారిగళగాద్గద్యాక్షమాంభోజభూ

   నుతిహాసన్నఖరోర్ధ్వసారితపదార్ణోరుడ్జగంగాసవా
   ప్రతిమాళీశకపర్దమండలవటుబ్రహ్మన్ స్తుమస్త్వామనున్.

శా. ఆజిప్రౌఢిమదుర్జయార్జునభుజోదగ్రాసృగాస్వాదన
   వ్యాజాపోశనభౌక్తదస్వపహృతిప్రాణాహృతిప్రోల్లస
   ద్రాజాలీనిగసావసానవిఘసప్రాయేందుఫేలాయిత
   భ్రాజద్యక్షకుఠారధారి భృగురాడ్బ్రహ్మన్ స్తుమస్త్వామనున్.

శా. చాపచ్ఛాత్రనిషంగభంగకుపితక్ష్మాభృద్ధనుఃపంచవ
   క్త్రీపంచాలికదృఙ్నియుక్తహుతభుగ్రీవాద్వయీపంచక
   వ్యాపారభ్రమకారిపఙ్క్తిగళగళ్యాఖండనాఖండదో
   ర్నైపుణ్యప్రదరౌఘ రాఘవపరబ్రహ్మన్ స్తుమస్త్వామనున్.

మ. కరిపూరుద్ధరణార్ధలాంగలవిభగ్మక్ష్మాభరాదక్షది
   క్కరిపాతప్రహతస్ఫటస్ఫటిపభోగవ్యావృతగ్రీవసూ
   కరపీఠీకృతష్ఠతాహితమహాగాఢాధికూరమాధిరాట్
   పరికౢప్తప్రళయాంబుగాహన హలిబ్రహ్మన్ స్తుమస్త్వామనున్.

మ. అతిదోఃపీడనశర్కరీఫలితకంఠాభత్వదుద్ధర్తృధూ
   ర్తతృణావర్తదృఢాంగపాతహతగోత్రాభర్తృకోత్పాదిత
   క్రతుభుగ్రాడ్గ్రహణాగ్రహోన్ముఖశతారధ్వస్తమైనాకని
   ష్పతనభ్రాంతికనందగోపకసుతబ్రహ్మన్ స్తుమస్త్వామనున్.

మ. గిరియుష్మద్ధనురస్త్రతాప్రభృతిమోఘీకృద్వధూశీలవి
   స్ఫురణావర్మభిదాఢ్యధార్ఢ్యసఫలీభూతప్రభూతత్రిపూ
   ర్వరదైతేయజిఘాంసశంసనపరోగ్రప్రాప్యసారూప్యని
   ర్భరరమ్యాంగతధాగతాంగకపరబ్రహ్మన్ స్తుమస్త్వామనున్.

మ. స్వమహాబాహుకృపాణకృత్తగళగుచ్ఛమ్లేచ్ఛవీరచ్ఛటో
   త్క్రమణాపాదితపద్మినీరమణమధ్యచ్చిత్రఖశ్యామికో

   ద్గమకౢప్తా౽సమయోపరాగమతికక్ష్మాస్నానగంగానది
   భ్రమకృత్కీర్తిక కల్కిమూర్తికపరబ్రహ్మన్ స్తుమస్త్వామనున్.

విద్వజ్జనకోలాహలుఁడు


ఈతఁడు గొప్పసంస్కృతపండితుఁడు. తెలుఁగుకవన మల్లుటయందుఁ బ్రజ్ఞగలవాఁడు. అనర్గళమగు వాచాలత గలవాఁడు. ఈతనిపేరన్నఁ గవులకు గుండెదిగులు. ఈపండితునకు గుదియలకామి యను నొక యుంపుడుకత్తె కలదు. తాను దిగ్విజయమునకు బయలువెడలునప్పు డావెలఁదినిఁ గూడఁదోకొని పోయెడివాఁడు. తనకు సంస్కృతాంధ్రపాండిత్యమునకు సమ్మానము; దానికో గానాభినయపాండిత్యమునకు సమ్మానము. ఇట్లు వారిరువురును సంస్థానములఁ దిరుగుచుఁ దిరుగుచుఁ గృష్ణదేవరాయల సంస్థానమునకు వచ్చిరి. కోలాహలుని రాక విని యాంధ్రకవితాపితామహుఁడు “వీని జయించుటెట్లు?” అని యోచింపఁ దొడఁగెను. మన తెనాలిరామకృష్ణకవి పెద్దనకు ధైర్యముఁ జెప్పెను. నాఁటిసాయంతనపుసభకు వా రిరువురును వచ్చిరి. పండితులందఱుఁ గూర్చుండియుండిరి. పెద్దనగా రటునిటు పచారు సేయుచుండిరి. కోలాహలపండితుఁ డాసభాముఖమున నిలిచియే

చ. “వదలక మ్రోయు నాంధ్రకవివామపదంబున నున్ననూపురం
   బుదితమరాళకంఠనినదోక్తుల నేమని పల్కుఁ బల్కుఁడీ

అని సమస్య నొసంగఁ దత్క్షణమే రామకృష్ణకవి లేచి

   "గుదియలకామినున్ననిత్రికోణముపైఁగలభాగ్యరేఖ నీ
   నుదుటను లేదటం చమరనూత్నపురంధ్రులతోడఁ బల్కెడున్."

అని పద్యమును బూర్తిఁ జేసెనఁట. అందుపైఁ గోలాహలుఁ “డింక నిందుండుట మనకు మర్యాదకా” దని గిఱ్ఱున వెనుకకుఁ దిరిగి తనదారిం బోయెనఁట.

కందుకూరు రుద్రకవి


ఇతఁడు నిరంకుశోపాఖ్యానమును రచించినకవి యని యీక్రిందిపద్యములవలన నూహింపఁదగియున్నది. ఈరుద్రకవి కొకపరి తాతాచార్యు లనునొకవైష్ణవునితో వివాదము ఘటిల్లఁగా నితఁడు వ్రాసిన పద్యము:

సీ. పరదానయాచకబ్రాహ్మణులరు మీరు
            పరతత్త్వమునఁ బరబ్రహ్మమేను
   భూమిలో సత్పాత్రభూషణాత్ములు మీరు
            కనకకుండలపరిష్కారి నేను
   తరిఁ బెట్టుకున్నట్టి బిరుదవారులు మీరు
            పేషిణీహనుమంతబిరుదువాఁడ
   వరశంఖచక్రాంకగురువులు మీరలు
            గురిమీఱఁగా జగద్గురుఁడ నేను
   నీకు మాకును సాటియే లోకసృష్టి
   కర్త నౌటయుఁ దెలియదా కలియుగమునఁ
   దారతమ్యంబు లేదుగా, తాతయార్య!
   రూఢి కెక్కిన కందుకూర్ రుద్రకవిని.

ఈకవి కమసాలి. ఒకానొకప్పు డితఁడొక సంస్థానపతి దర్శింపనేఁగఁ దదాస్థానమున నున్న భద్రయ్య యనునొకనియోగికవి ‘రుద్రకవిని రానిచ్చినఁ దనపేరు దక్క’ దను తలంపుతో నాతనిరాక రాజుగారికిఁ దెలియకుండ గట్టుబాటుఁ జేసెను. రుద్రకవి కొంతకాల మట్లేకడిపి సంస్థానముం జొచ్చు నుపాయము తోఁపక తుదకు రాజుగారి మంగలియగు కొండని నాశ్రయించెను. ఒకనాఁడు కొండడు వచ్చుట ఆలస్యమయి రాజుగారు కురిచీపైఁ గూరుచుండి యట్లే కూరుకుఁజెందిరి. నిదురఁబోవుచున్న రాజు కదలకుండఁ దనపని ముగించుకొని కొండఁడు ప్రక్కన నిలిచియుండెను. ఒకటి రెండునిమిషములకు రాజుగారు మేలుకని, యెదుటనున్న మంగలిఁ గని “యేమిరా, నేడింతయాలస్య” మన వాఁడు “మహాప్రభూ! నేను వచ్చుచుండఁగాఁ ద్రోవలో నొకకవి తటస్థమయి ‘నేనిట నెలదినములనుండి రాజదర్శనమునకై వేచియున్నాను. భద్రకవి యేకారణముననో నా రాకను రాజుగారికిఁ దెలియనీయకుండఁ జేయుచున్నాఁ’ డని యేమేమో తన సంగతులను జెప్పుకొనసాగెను. ‘అయ్యా! నేను త్వరగాఁ బోవలయు’ నని చెప్పి వచ్చితి” నని మనవి చేసెను. అందుపై ప్రభువు “భద్రకవి యింత యసూయాపరుఁడా? చూచెదముగాక” అనుచు “ఓరికొండా! నీపనిఁ గాని” మ్మనియెను. వాఁడు “మహారాజా! అఱగంట క్రిందనే అయిన” దని మనవి చేయుచు నద్దము నెదుట నిల్పెను. కొండనికౌశల్యముకు రాజు సంతసించి “ఓరీ! నీవేమి కోరెద” వన నా మంగలి “అయ్యా! తమ యనుగ్రహమున నాకేమియుఁ గొదువలేదు. కాన రుద్రకవినిఁ జక్కఁగా సన్మానించి పంపుఁడని మాత్రము మిమ్ముఁ గోరుచున్నా” ననెను. వానిసుగుణసంపద కాసంస్థానాధిపతి మెచ్చి వాని కేదో కొంతబహుమాన మొసంగి పంపివేసెను.

తరువాత రుద్రకవి రాజు దర్శించి, భద్రకవిపై వచ్చిన కోపముం బట్టఁజాలక, మంగలికొండని భూషించుచు నీపద్యముం జదివెను.

క. ఎంగిలిముచ్చుగులాములు
   సంగతిగా గులము జరుప జనుదెంచిరయా
   ఇంగిత మెరిగిన ఘనుడీ
   మంగలి కొండోజి మేలు మంత్రులకన్నన్

ఈపద్యమును విని భద్రకవి మండిపడి

చ. జబగడదష్షు లణ్ణు శషసర్రు కపయ్యుఝభఞ్ఞటంచు వా
   జబజబలెల్లఁ జూపి యగసాలెల, బేలల, బోయపాలెపుం
   బబువుల గెల్చి చేతఁ గలపైకము దోచుటగాదు, రుద్ర నీ
   డబడబ భద్రమంత్రియెదుటం గొనసాగదు పొమ్ముపొమ్మికన్.

అనుపద్యమ్ముఁ జదువఁగా రుద్రకవి

క. భద్రా! శ్వానము మొఱఁగిన
   రుద్రాంకితజంగమయ్య రూఢికిఁ గొదవా?

   చిద్రూపుఁ డితఁడు కేవల
   రుద్రుఁడయా కందుకూరు రుద్రుఁడు ధాత్రిన్.

అనెను. అందుమీఁద నాస్థానపతి యిరువురికయ్య మాపి రుద్రకవిని సమ్మానించి పంపెను. భద్రకవి కిట్టి యసూయ తగదని బుద్ధిచెప్పెను.

నక్కలపాటి సంజీవరాయకవి


మట్లెవేంకటరామరాజుగారికిని వేమల వేంకటరాజుగారికిని నిరంతరవైరము. అట్టి సందర్భములో నీనక్కలపాటిసంజీవరాయకవి యొక్క కందముతోనే యిరువురివలనను బహుమానము లందెనఁట. ఆకందపద్య మిది—

క. స్వామి విను మట్లె వేంక
   ట్రామక్ష్మాజాని నీదురణజయభేరీ
   ఢామద్వని విని జరగఁడె?
   వేమలచిన బసవరాయ వేంకటనృపతీ.

ఇతఁడు ఎవరిని దర్శింపఁబోయినప్పుడు వారిని సంబోధించి సమన్వయించి తనయుక్తిసామర్థ్యములం జూపి వారి మన్ననల నందియుండు. ఇంచుకదోషమున్నను నీతనియుక్తిమాత్రము కొనియాడఁదగియున్నది.

మట్లెయనంతభూపాలుని చెఱకుఁదోఁటను నక్కలు పాడుచేయ నాభూరమణుం డీకవిరాయనిం బిలిచి నక్కలు పోవు నుపాయముం జెప్పుమనెనఁట. అంతట నీకవి పద్యమొకటి తాటియాకుపై లిఖించి యిచ్చి యాయాకుఁ దోఁటవాకిటఁ గట్టించుమని చెప్ప నాతఁ డట్లొనరింపఁగా నక్కలరాక తగ్గెనఁట. ఆపద్య మిది—

క. ఆశీవిషసమ మగు నా
   యాశుకవిత్వంబుచేత నటువంచకముల్
   నాశము గావలెఁ జూడుమ
   హే శాంభవి! చౌడమాంబ! హే శర్వాణీ!

అట్లు నక్కలకు వాకట్టు కట్టుటవలననే రాజుగారు తన కాయింటిపో రొసఁగినట్లు పద్యమునఁ జెప్పికొన్నాఁడు.

ఉ. ఎంచఁగలం డనంతవసుధీశుని యిక్షువనంబు నోళ్ళ ఖం
   డించిన నక్కలన్ విషపటిష్ఠపుఁ బద్యముఁ జెప్పి వాని ని
   ర్జించిన నింటిపేరు దయచేసిరి నక్కలపాటివా రటం
   చు.............................................................

పిండిప్రోలు లక్ష్మణకవి

ఈకవి పదునెనిమిదవ శతాబ్దిలో నున్నవాఁడు. ప్రౌఢకవి. ఇతఁడు రావణదమ్మీయ మను ద్వ్యర్థికావ్యమును రచించెను. ఈతని సమకాలికులగు శిష్టు కృష్ణమూర్తి, మొక్కపాటి పేరిశాస్త్రి మొదలగుకవులతో నీకవికి వివాదము విశేషముగా జరిగెను. కృష్ణకవి కోటరామచంద్రపురము పరగణాజమీన్దారుఁడగు కాకర్లపూఁడి రామచంద్రరాజుగారిపై సర్వకామదాపరి ణయమను ప్రబంధము రచించెను. ఆగ్రంథమును వినుపించునాటికిఁ బలువురు పండితులు, కవులు కృష్ణకవిచేతను, రాజుగారిచేతను నాహ్వానింపఁబడిరి. రాజుగారు మనలక్ష్మణకవికిఁగూడ నాహ్వానపత్రిక నంపవలసినదిని చెప్పినను కృష్ణకవి యట్లొనర్పలేదు సరేకదా, పైగా “పెండ్లిపందిళ్ళసంభవనకుఁ బోఁదగిన లక్ష్మణకవి యీపండితసభకు రాఁదగునా” యని అధిక్షేపించెను. అందునకు జమీన్దారుగారు మిన్నకుండిరి.

తరువాత, కృష్ణకవి తనవిషయమై రాజుసన్నిధి జరిపిన వృత్తాంతమంతయు నెఱింగి కవికి లోఁగి రాజు తన్నుఁ బిలువకపోయినను దప్పక యాసభకుఁ బోయి కృష్ణకవిగర్వ మడంపవలయునని లక్ష్మణకవి సభజరుగునాఁటికి రామచంద్రపురమునకు వచ్చెను. ఆసంగతి నెఱింగి రాజుగారు లక్ష్మణకవి నిప్పుడైన నాహ్వానింపవలె ననఁగా, “తనయూరునుండి యింతదూరము వచ్చినవాఁ డిఁక సభకు రాలేకపోవునా? ఇఁక మనము పిలువనేల?” అని కృష్ణకవి వారించెను. ఆసంగతి నెఱింగి లక్ష్మణకవి తనంతఁదానే సభకు వచ్చెను. రాజుగారు మిగులమర్యాదఁజేసి యున్నతాసన మొసంగి “అయ్యా! మీరును సమయమునకు వచ్చినారు. నాకు మిగులసంతసమైనది. ప్రస్తుతగ్రంథమును విని గుణదోషములఁ బరిశీలించి మాకుఁ గృతియిప్పింపుఁ” డని వినయముగా నడిగెను. అదివిని లక్ష్మణకవి వైముఖ్యమును సూచించుచు “మహాపండితులగు కృష్ణకవిగారు రచించిన గ్రంథమును బరిశీలింపఁగలవాఁడనా? నలువురితోఁ బాటు వినుచుం గూర్చుండెద” నని మాఱుపలికెను.

అది విని రాజుగారు “పండితవర్యా! తమ రట్లు సెలవీయనగునా? తమవంటిపండితులచేఁ బరిశీలింపఁబడనియెడల నీగ్రంథమునకు ఘనత యెట్లువచ్చును” అని యెన్నోవిధములఁ బ్రార్థించెను. “పరిశీలింపుడని మీరు నన్నుఁగోరిన గ్రంథకర్త యంగీకరింపవలయుఁ గదా?” యని లక్ష్మణకవి పలికెను.

ఆపలుకులు విని కృష్ణకవి యాగ్రహించి “మహారాజా! యీస్థానములో లక్ష్మణకవినిఁ బండితుఁడనుట హాస్యాస్పదము. అదియుఁగాక యీపండితసభలో ‘నేనొకపండితుఁడ’ నని యాతఁడొప్పుకొనుట మిగుల నవ్వులచేటు” అనుచు “నాగ్రంథమునఁ దప్పుఁబట్టఁగలవాఁడే యుండిన, నతఁడు లక్ష్మణకవికన్యుఁడు గాని, లచ్చనగాఁ” డని తిరస్కరించెను. లక్ష్మణకవి కృష్ణునిపలుకులు వినివిని కృష్ణకవి నింకను నుడికించినంగాని కార్యము కాదని చిఱునవ్వు నవ్వుచు రాజువంకఁ దిరిగి యటనుండు నొకకుక్కంజూచి


   “ఈశునకము కృష్ణమూర్తియే యెన్నంగన్”

అని యూరకుండెను. ఆమాటవిని కృష్ణకవి మండిపడి

క. “దాశరథీశబ్దంబును
   దాశరథిపరమ్ముఁ జేయుద్వైయర్థికి దు
   ర్ధీశక్తిబిడాలమునకు
   నీశునకము కృష్ణమూర్తియే యెన్నంగన్.

అని పద్యమును బూరించి లక్ష్మణకవి యొకచోఁ బ్రయోగించిన దాశరథీశబ్దప్రయోగము నాక్షేపించెను. యుక్తిశాలియగు లక్ష్మణకవి తనప్రయోగమును సమర్థించి యు ట్లుపన్యసింపఁదొడఁగెను.

“పండితులారా! ఈశు=శివుని, నకము=బాణము, కృష్ణమూర్తి యని నేను నుతింపఁగా ‘నంతటిస్తోత్రమునకు నేను దగ’ నని మనకవివతంసుఁడు శునకసామ్యమున కంగీకరించుచున్నాఁడు. ఇట్టిపండితునిముందు మఱియొకఁడు పండితుఁ డనరాదఁట” అని హేళన చేసెను. లక్ష్మణకవి యుక్తికిఁ బండితులందఱును సంతోషించిరి. కృష్ణకవి వెలవెలఁబోయెను.

పేరిశాస్త్రిగారికిని లక్ష్మణకవికిని వివాదము తటస్థింపఁగా, లక్ష్మణకవికిఁ గవిత్వమేగాని శాస్త్రము తెలియదని శాస్త్రి యాక్షేపించెనఁట! అది విని లక్ష్మణకవి యీక్రిందిపద్యమును రచించి పంపెను.

గీ. ఉక్కుఁ జెద తిన్న దశదిక్కు లొక్కటైనఁ
   జుక్క లిలఁ బడ్డఁ గులగిరుల్ వ్రక్క లైన
   మొక్కపాటింట నోటను ముక్కలేదు
   పేరిశాస్త్రికిఁ గలిగెరా పెదవిపాటు.

ఇటులనే కూరపాటి వేంకటశాస్త్రి యను నొకకవి లక్ష్మణకవిని దిరస్కరింపఁగా నితఁడు వ్రాసినపద్యము.

ఆ. కూరపాటివెంక కుక్కలు దినుకంక
   లేనిపోనిశంక మాను మింక
   ముఖముఁ జూడఁ గుంకముండ వనెడుశంక

   నాకుఁ దోచెఁ జంక నాకు మింక.

ఈలక్ష్మణకవికి మంగన్నయను నొకమేనల్లుఁ డుండెను. అతనికి దాయాదులతో వ్యాజ్యము సంభవింపఁగా శంకరమంచి అనంతపంతులను న్యాయాధికారి లంచము గైకొని మంగన్న నన్యాయముఁ జేసెను. లక్ష్మణకవి పద్యరూపములగా నీసంగతినంతను వెల్లడిచేసెను. ఆపద్యము లివి—

సీ. మహనీయశంకరమంచిగోత్రమునఁ బ్ర
            పాతకుం డన ధరిత్రీతలమునఁ
   బండితుండువలెఁ గల్పడుదు స్థాణుత్వ మే
            ర్పడ నొకసాధులపలుకు వినవు
   పుక్కిట విషమె యెప్పుడు నీకు నుండును
            మది వీడ వెపుఁడు దామసగుణంబు
   భీముఁ డుగ్రుఁఢు ననుపేరు గాంచి నశింతు
            వంబికాపతివి బ్రహ్మఘ్నుఁడవు న
   నంతనాముండ వరయంగ నష్టమూర్తి
   వగుచుఁ బితృవనమందు భస్మాంగుఁ డవయి
   భూతములును బిశాచముల్ ప్రోదిగూడు
   కొనఁగ నుండుదు వండ్రు నిన్ జనములెల్ల.

మ. సరవిన్ శంకరమంచిపండితుఁ డనన్ జానొప్పుఁవా డర్థసౌ
   ఖ్యరుచిన్ జెందియుఁ జింతలూరిమంగామాత్యసాధ్వాత్మమం
   దిరసుక్షేత్రములన్ హరించి కపటాన్వీతుండు నౌ వాది క
   ల్లరికాఁ డంచును దీర్పు చేసి జనముల్ నవ్వం బడున్ దుర్గతిన్.

ఉ. దక్షిణదిక్కునుండియ యుదంతము దెచ్చిన ధర్మరాజు ప్ర
   త్యక్ష మనంతపాతకున కిచ్చెడు మార్గము వోవునట్టుగా

   దీక్ష వహింపవే ధవళదేహుఁడ! శంకరమంచికూళపైఁ
   బక్ష మదేల దుష్టజనభంజన! సజ్జనభావరంజనా!

సీ. పరశురాముఁడు తండ్రిపంపున రేణుకన్
            దనతల్లి యనకయ నఱికివైచె
   జనకజాపతి తండ్రిపనుపున రాజ్యంబు
            వాసి మహారణ్యవాసి యయ్యెఁ
   గుండినముని జనకునియాజ్ఞచే సంశ
            యింపక గోవుల హింసఁ జేసె
   భీష్ముఁడు తండ్రియభీష్టంబుఁ దీర్ప రా
            జ్యశ్రీసుఖాదికార్యములు విడచె
   తండ్రిపంపునఁ దనకన్నతండ్రి పేరుఁ
   జెప్పుకతన నదత్తుఁడే చింతలూరి
   మంగరా జిట్లు శంకరమంచిపండి
   తుండు దీర్చుట జీవన్మృతుండుఁ గాఁడె.

సీ. వసుదేవసుతుఁడన్న వాక్యంబుననె పద్మ
            నాభుండు నందనందనుఁడు గాఁడె
   మాద్రీతనయులన్నమాత్రంబుననె కవల్
            కౌంతేయు లన్నవిఖ్యాతిఁ గనరె
   పార్వతీసుతుఁ డని పల్కినంతనె కుమా
            రుఁడును దాఁ గార్తికేయుఁడును గాఁడె
   బాపిరాడ్సుతుఁ డన్న భాషనె మంగన్న
            ధృతిజగ్గరాడ్దత్తసుతుఁడు గాఁడె
   వేదశాస్త్రపురాణముల్ వినియుఁ గనియు
   నెఱిఁగి యెఱుఁగనివాఁడునై యిట్లు విత్త
   వాంఛ నన్యాయముగఁ దీర్చు పండితుండు
   ఘోరనరకంబులందునఁ గూలకున్నె.

తరువాత లక్ష్మణకవి తనయల్లునిచే నప్పీలుచేయించుటకుఁ దగినయత్నముఁజేసి యప్పుడు జడ్జిగా నుండిన బ్రౌనుదొరను దర్శించి యీక్రిందిసీసపద్యము నొసంగెను.

సీసమాలిక


   మధువైరికిన్ వనమాలికిఁ గౌస్తుభ
            హారునకును సంశ్రితావనునకు
   రాధికాప్రియునకు రామసోదరునకు
            జగదీశునకు దయాసాగరునకు
   శ్రీనాథునకును రక్షితదేవసమితికిఁ
            బ్రౌఢభావునకు నారాయణునకు
   నురగేంద్రతల్పున కరిశంఖధరునకుఁ
            దొగలరాయనిగేరుమొగముదొరకు
   రణనిహతదుష్టరాక్షసరమణునకును
   గానమోహితవల్లవీకాంతునకును
   రిపువిదారికి హరికి శ్రీకృష్ణునకును
   కిల్బిషారికి నే నమస్కృతి యొనర్తు.

తెలుఁగునఁ బండితుఁడగు బ్రౌనుదొర లక్ష్మణకవి రచించిన సీసమాలికను గని చాలసంతసించి మీరాక కేమి కారణమని యడుఁగగాఁ గవి తనయల్లునింజూపి యతనికొరకై వచ్చియుంటి నని తెల్పెవు. అతఁ డేమిపనికై వచ్చెనని దొర యడుగఁగా, నీవు వచ్చినపనిని నీవే విన్నవింపుమని మామ చెప్పఁగా మంగన్న యీక్రిందిపద్యములతో విన్నవించెను.

సీ. చింతలూరికి మిరాసీదారుఁడగు జగ్గ
            రాజుకుఁ బుత్త్రు లౌరసులు లేమిఁ
   దనకును బిన్నయౌ తండ్రివందనునకు
            బాపిరాట్సుతు దత్తభావుఁ జేసి
   కొనుటచే నిదివఱకును తద్గృహక్షేత్ర
            కర్తనై యుండుచ కలకటరు క
   చేరీలెక్కలఁ జిత్తగించినఁ జాలు
            నేదినే నెఱుఁగని యిట్టిపనికి
   బాపిరాట్సుతుఁ డని నేను బల్కినట్లు
   వాది పన్నినకపటభావమె నిజ మని
   పట్టి దత్తుఁడు గాఁడంచుఁ బండితుండు
   చేసెఁ దీరు పుభయభ్రష్టుఁ జేసె నన్ను.

ఉ. అత్తినధర్మశాస్త్రవిధి కడ్డని చూడక కల్కటర్నసం
   సత్తుల లెక్కలారయ విచారము సేయక రాజ్యమేలు భూ
   భృత్తుసభాస్థపత్రలిపిరీతిఁ దలంపక విత్తవాంఛచే
   దత్తు నదత్తుఁ డం చను నధార్మికపండితుఁ డుంట యొప్పునే?

మంగన్నమనవిని విని దొరవారు మరల నొకసారి దర్శనమును జేసికొండని సెలవీయఁగా కవులిరువురు నింటికి వెళ్ళిరి. పిమ్మట దాయాదులు మంగన్నతో రాజీపడి సగభాగ మొసంగిరఁట.

మాగాపు శరభకవి

ఈకవి వత్సవాయిరామభూపతిని దర్శించినప్పు డాశువుగాఁ జెప్పిన పద్యము—

మ. ఇతఁడా రంగదభంగసంగరచమూహేతిచ్ఛటాపానకో
   ద్యతకీలాశలభాయమానరిపురాడ్దారాశ్రుధారానవీ
   నతరంగిణ్యబలాసమాగమసుఖానందత్పయోధిస్తుతా
   యతశౌర్యోజ్జ్వలకీర్తి వత్సవయరాయక్ష్మాతాలథీశ్వరుం; డితఁడా?

ఈరీతిని “ఇతఁడా” యనుప్రారంభముతో నూఱుపద్యములను రచించె ననువాడుక కలదు; కాని తక్కినపద్యము లెచ్చటను లభ్యములు కావయ్యె.

ఏనుఁగు లక్ష్మణకవి


ఈలక్ష్మణకవిపైఁ గూచిమంచి తిమ్మకవి వ్రాసిన పద్యము

గీ. భారతీవదనాంబుజభ్రాజమాన
   కలితకర్పూరతాంబూలకబళగంధ
   బంధురంబులు నీమంజుభాషణములు
   లలితగుణధుర్య! యేనుఁగులక్ష్మణార్య!

శిష్టు కృష్ణమూర్తికవి


ఈకృష్ణకవి పదునెనిమిదవశతాబ్దిలో నున్నవాఁడు. ఇతఁడు సంగీతసాహిత్యములు రెంటియందును మిగులఁ బ్రసిద్ధి వడసినవాఁడు. కాకర్లపూఁడివారిపైఁ జెప్పిన చాటువు—

ఉ. వీరు తెలుంగుసాము లరబీతరబీయతనొప్పుగొప్ప స
   ర్కారువలే జమీలు దరఖాస్తుగ నేలిన రాజమాన్యహం
   వీరులు ఢక్కణీలు తజివీజుకులాహికు లున్నమేటిమం
   జూరు జొహారు యాఖిదుమషూరు ఖరారు మదారు బారు బ

   ర్దారు మీఠార్గురాలపరదారులఠౌరు కడానితేరులం
   బారుమిఠారునౌబతు సుమారు పుకారును బారుకుడ్తినీ
   డారుగుడారుపైకము బిడారు బజారు కొటారులందు నే
   దారు పఠాణిబారు దళవారు సవారు షికారులందు బి
   ల్కూరు సతాసవారు పిలగోలతుపాకులఫైరు లందు లే
   ఖ్యారుగఁ బెక్కుమారులు తయారుగ వీరిహజారులందు వె
   య్యారులు పెద్దపేరుల జొహారులు చూచి హమీరు లెంచి ద
   ర్బారు పసందు మీఱ వహవా యని మెచ్చునవాబుకాను షేం
   షేరు బహాదదుల్ పెఱవజీరుల నూఱులమాఱు కెన్నఁ దా
   ర్మాఱుగ మోది గీములు తమాము వదల్చి మఖాము లెల్ల ఫీ
   ర్ఫా రొనరించి మిక్కిలి మరాతబు లందిరి చేరుమాలు త
   ల్వారులఁ జేరుదారు దళవాయుల చాయలమీఱు చారుకై
   జారు కరారు బాకు నెరజారు తళుక్కున బందుబస్తుగాఁ
   బోరు భుజోరుకాకరలపూడి వజీరులదే యమ న్మహో
   దారులు పూర్ణనిర్మలసుధాకరకాంతికలాపకీర్తివి
   స్తారులు భూరిభూసురవితానమహాహుతిగంధగౌతమీ
   తీరనిసర్గదుర్గపురదీపితహర్మ్యతలాగ్రభాగసం
   చారులు దేవవారవనజాతముఖీసమవారకామినీ
   వారకరాబ్జకీలితసువర్ణమణిద్యుతిదండచామర
   ప్రేరితవాతధూతనవఫేనసమానవితానమంగళా
   కారసువర్ణపీఠపరికల్పితరాజ్యరమామహామహో
   దారులు సేతుశీతవసుధాధరమధ్యతలస్ఫురల్లస
   ద్వీర విశేషసంజనితతీవ్రదవానలబాడబాగ్నిత
   త్వారినృపాలజాలమకుటార్పితపాదపయోజపీఠసం

   స్కారులు రామచంద్రపురసాలనివాసులు రామచంద్రవం
   దారులు రామచంద్రవసుధాపరపౌత్త్రులు రామచంద్రధా
   త్రీరమణాభిధానులు వరిష్ఠవసిష్ఠగోత్రపావనుల్
   కారణజన్ము లబ్ధశశికల్పకమేఘసమానదానదీ
   క్షారతు లిందిరాసుతజయంతవసంతసమానసుందరా
   కారులు బ్రహ్మకల్పము సుఖంబుగ వర్ధిలువార లీధరన్.

కాళహస్తిరాజుపైఁ జెప్పినది—

ఉ. దామెరవేంకటక్షితిప! తావకపాండురకీర్తిదీధితి
   స్తోమము లిందుభాస్తతులతో నెదిరించి తృణీకరించె నౌ
   గాములకేమి యోజనలు కాని యశంబులు మేయుశంబరం
   బేమర కుబ్బు మీఱ వసియించునె డాసి తదంతరంబునన్.

దంతులూరి వేంకటకృష్ణరాజుపైఁ జెప్పినది—

ఉ. పండితమౌళి శిష్టకులవార్నిధిసోముఁడు కృష్ణమూర్తి కా
   ఖండలతుల్యవైభవు లఖండితదానవినోదు లౌర భూ
   ఖండ మొసంగి రిప్పు డది కాపుర ముండమిఁ బోవ దగ్గఁగా
   నుండనిముక్కు తుమ్మిన మఱుండునె? కృష్ణనృపాలకాగ్రణీ!

చ. సలలితలీల నెత్తఱిని సత్యపదస్థితి తప్పకెల్ల సూ
   రులకుఁ బ్రమోదసంతతినిరూఢి తగన్ సమకూర్చి జీవనం
   బులికెడు మర్త్యమూర్తి మముఁ బ్రోవఁడె కృష్ణమహేంద్రచక్రమూ
   ర్తి లసదనంతకీర్తి యవధీరితమామకహృద్గతారియై.

ఉ. పైపయిరంగులం గదిసి పన్నుగబోగపుటన్నువన్నె పెం
   పై పనుపడ్డ కబ్బముల కబ్బురమా? వెరమాను మేలు వాల్
   చూపులప్రాపులన్ వలపుఁజూపుచు నీటగుమాటతేట బల్
   దీపులు పుట్ట నెట్టనఁ బదింబదిగా నెదఁ జిక్కి చొక్కపుం

   బూపచమంగవం గలిపి పోడిమి వేఁడి మిటారపుంగటా
   రీపసమీఱియారు చిగిరించెడి మిం చడరం గడంగి మే
   లీపని యంచు నెంచు మదిహెచ్చుగ మెచ్చుగ నిచ్చవచ్చిన
   ట్లోపినయంతవట్టు బిగియూఁతగ వాతెఱ మార్పు నేర్పులన్
   దాపగు ముద్దుగు మ్మరసి తద్దయు గద్దరి పైడిప్రోదిమేల్
   గోపు లెఱుంగఁజేయు నలకోయిలకూఁకలచాయ నింపు తీ
   రై పొసఁగన్ వలెన్ జవుల నందిన దంటతనాన విచ్చి క
   న్మోపినపేరుటామనిఁ గనుంగొననై కనునీటుతేటలన్
   దు పెడలించి పెంచఁ దగుతోపగుగొజ్జెగపూలబాఱుతీ
   రై పొసఁగన్ వలెన్ జవుల నందిననమ్మరుతేరుదారు లొ
   ప్పౌపవళింపుమేడగదిపందిరి నొప్పెడుపట్టెమంచమం
   దాపని ముందు నూడిగపుటందము చిందఁగ నందగత్తెచేఁ
   జాపి యొసంగువీడెముపసన్ వలపున్ మ్మొలపింపఁగావలెన్
   దేపకు దేప కిప్పగిదిఁ దెన్గొనరించెడుపట్ల; సంస్కృతా
   టోపముఁ జూపుచో నలికుటుంబకఝాంకరణాంకకల్పవ
   ల్లీపరివైల్లనోల్లసదలీవనలీనసదానపాయసూ
   నోపలసత్ప్రభూతపురుహూతవనీభవనిర్జరావనీ
   జోపరిపుష్పనిష్పతదనూనమరందఝరీపరీతసం
   తాపహాంబుపూరపరితస్సరణోత్థఘలంఘలధ్వని
   వ్యాపిసురాపగాంతరసమగ్రతనుగ్రహనాయికాన్యపే
   క్షాపరిహీనచారుతరసౌరభసారభరాతిభాసురా
   ష్టాపదకంజపుంజనవసత్కనకచ్ఛదహంససంసదా
   లాపకాలపసమ్మిళితలాస్యకలావలమానకాంచికా
   నూపురకింకిణీగణవినూత్నతరద్యుతిరత్నకంకణ

   ప్రాపిఝణంఝణక్వణనరంజితమంజులరూపరేఖ పై
   కీపరిగీతతారతరగీతవినూతనజాతమాధురీ
   రూపనిరూపణీయమయి రూఢికి నెక్కవలెం గవిత్వవి
   ద్యాపటిమం బటంచు నను నంతటివానిహ నెంచి నాదుపు
   ణ్యోపచయంబునం బిలిచి యుర్వర సర్వరసజ్ఞు లెన్నఁ జూ
   పోపనివారు చిన్నతన మూనఁగ సన్నిధియందు నిల్పి పృ
   థ్వీపదవిష్ణుమూర్తి యవధీరితకర్ణవితీర్ణనైపుణా
   శాపరిపూర్ణకీర్తి విలసద్గుణసంతతిదంతులూరువం
   శోబధిసింధుబాధవసముజ్జ్వలపూర్ణసుధాంశుమూర్తి యు
   ర్వీపతిచక్రవర్తి యనఁ బేరగువేంకటకృష్ణమూర్తి యా
   శాపరిపూర్తి సేయఁగ విచారమ, నీదుప్రచార మేలగున్?

పిఠాపురసంస్థానికునిపై జెప్పిన పద్యములు—

ఉ. శ్రీరమణీమణీరమణ సింధుసదృక్షకటాక్షవీక్షణాం
   కూరసమృద్ధిసంతతినిగూఢనిగాఢసమస్తభాగ్యపా
   ళీరమణీయదేవనగరీవరమాచిరమాపిఠాపురీ
   భూరిమణీగణాకలితభూరినిరంతరకాంతకాంతివి
   స్తారనిరస్తచిత్రకరసౌధసుధాకరకాంతవేదికా
   చారుచిరత్నరత్నరుచిసాంద్రనగేంద్రమృగేంద్రపీఠి దు
   ర్వారగతిన్ బయోజలధిపన్నగనాథశిరాధివీథికా
   సారరుహాక్షు దీక్షసువిచక్షతతోఁ గొలువుండి మీ రసా
   ధారణవాక్సుధామధురధారల మీ రలఘుప్రచారవా
   చారుచిచాతురిం గలహసాధనరాజవిరాజితారి రా
   డ్దారువిదారణక్రకచదారుణపండితమండలాగ్రభృ

   ద్వీరులఁ బిల్చి కృత్యము సవిస్తరతం దగ నెంచి మంచి యిం
   పారెడుహృద్యవాద్యకలనాకిలగీతకళాకలాపని
   స్తారకులం గవిప్రకరతార్కికశాబ్దికవేదవాదులన్
   గౌరవమొప్ప గొప్పగ నగణ్యధనాదిసనాధులన్ ధృతిన్
   గోరిక మీఱఁ జేయుచు నకుంఠనటత్పదకుంజమంజుమం
   జీరసురత్నపుంజమృదుశింజితము ల్గలరాజహంసికా
   సారససారసధ్వనులసందడులన్ దుడుకందఁ జేయువా
   ణీరభసంబు డంబొదవ నిస్తులభూభృదపాత్తజీవికా
   చారురమాసమాన లగుసానుల జానులు మీరు నాట్యవి
   స్తారపదక్రమాభినయతానవితానవిభాగరాగగో
   ష్ఠీరుతిధీరతిన్ బుధులచిత్తము నత్తగఁ జిత్తగించుచోఁ
   గోరికఁ దెల్పువేళ యని కొంకణటెంకణలాటఖోట సౌ
   వీరశకాదిదేశపృథివీవరు లందఱు ముందుముందుజో
   హారులు చేసి నిల్వ సెలవాయెను మీకిటఁజేర నంచుఁజో
   బ్దారులు దెల్ప జో హుకుమువాదరబాఱుపసందుమీఱు స
   ర్కారు ఖొదాబరాబరుఖరారుమదారులమీరుతీరుద
   ర్బారని యెన్ని పన్నొసఁగి పన్నుగ సన్నుతు లెన్నొ సేయుచో
   మీఱినవేడ్కతోడఁ బుడమిం గడుఁబ్రోచుచు నిత్యసత్యవా
   ణీరతిభారతీరమణునిం బరమాప్తిని మాధవున్ శివా
   చారత నీశు సద్గతిని జంద్రు సదాసుమనఃప్రయుక్తిచో
   సౌరదారావరుం గని యజస్రముఁ గేరుచు మీఱుచుందుగా
   వీరవరేణ్య, రావుకులవేంకటరామమహీపతీ, కృతీ!
   మారసమాకృతీ, సదసమానయశశ్చిరదాననిందిత
   క్షీరపయోధిసౌరమణిశీతకరామరభూమిరుడ్తతీ!
   భూరమణాగ్రగణ్య, మిము బ్రోవుత దేవత లెల్లకాలమున్.

ఈకవి యొకవేశ్యపైఁ జెప్పిన పద్యము

సీ. దురుసానిమై నున్నబురుసాపనిరుమాలు
            కరసారసమున నొక్కపరి విసరి
   కురుదాపడనిలీల పరదా వెడలి వచ్చు
            సరదా తెలియఁ బైట జార విడిచి
   అఱజారుకురులు క్రమ్మఱ జాఱిపడి వ్రాలు
            విరజాజిపువ్వుల విసరి విసరి
   వెఱబాఱుగాలి నౌ పొరబాటు విడ మారు
            దరబారుపావడఁ దార్చి తార్చి
   పకడుగలకమ్మవిలుకానిహుకుమతీమ
   తలబుజాహిరుగాషక్తు తలఁపుఁజేయు
   దీనిఫక్తుతమాషాఖుషీనిషాల
   ఖిలవతురభీకు నయినను దెలియ వశమె?

చెళ్ళపిళ్ళ నరసకవి

ఈప్రౌఢకవి నివాసగ్రామము గోదావరీమండలములోని కడియము. ఈయని పదునెనిమిదవ శతాబ్దిలో నున్నవాఁడు.ఈకవిరచితములగు గ్రంథములు 1. యామినీపూర్ణతిలకావిలాసము, 2. వేంకటేశ్వరవిలాసము, 3. ఏకప్రాసకంద గోపాలశతకము, 4. అహల్యాసంక్రందనవిలాసము, 5. ఏకాంతసేవాకలాపము. ఈకవిచంఢ్రుఁ డాశుకవితారచనయందు మిగులఁ బ్రజ్ఞఁ గలవాఁడు. ఈయన కాదొండకాయలపైఁ బ్రీతిమెండు. ఒకానొకప్పుడు పొలములో నాదొండకాయలు గోయుచుండ వెంట నున్న వా “రయ్యా! తమకు దీనియందుఁ బ్రీతివిస్తారము గదా! ఇప్పు డొకపద్యమును దీనిపైఁ జెప్పు”డని కోరఁగా నీకవి యాశువుగా రచించిన పద్యము—

మ. ఠవణింతు న్నుతి దైవతప్రమదతార్థ్యన్మోహినీనీరభృ
   చ్చ్యవమానామృతశీకరాభనవబీజప్రాంతరౌపమ్యస
   ద్భవనాజాండకు షడ్రసప్లుతసముద్యత్స్వాదుమతఖండకున్
   అవితుంగోద్భవకాండకున్ సరసమోహాఖండ కాదొండకున్.

ఈయనదే వేఱొకపద్యము—

ఉ. రామశరప్రయోగము; సురప్రభువజ్రము; చక్రిచక్రమున్;
   ధామనిధిప్రియాత్మజువిదండము; కామరిపుత్రిశూలమున్;
   భూమినొకప్డు రిత్తయయి పోయినఁ బోవునుగాక, యీకవి
   స్వాములవాక్ ప్రయోగముల బ్రహ్మకునైనఁ దరంబె త్రిప్పఁగన్.

అడిదము సూరకవి

ఈకవి పూసపాటివిజయరామరాజుగారి యాస్థానకవి. విజయరామరాజుగారు విజయనగర ప్రభువులు. విజయనగరము విశాఖపట్టణపుమండలములోనిది. ఇక్కవి నివాసగ్రామము రేగ (రేవ) యను గ్రామము. ఆగ్రామమునఁ జెఱువుక్రింద నతనికి మాన్యము కలదు. ఒకసంవత్సరమున దంతులూరి యన్నమరాజనునాఁతఁడు గ్రామము నంతయు గుత్తకుఁ దీసికొని, చెఱువుఁ బిగఁ గట్టించి, మాన్యమునకు నీ రీయకపోఁగా సూరకవి పద్యములతో రాజుగారికి మనవి వ్రాసికొనెను. ఆపద్యము లివి.

సీ. అవధారు! దేవ! మహాప్రభూ! విన్నపం
            బాశ్రితోత్తముఁడ శుద్ధాంధ్రకవిని
   పేరు సూరన యింటిపే రడిదమువారు
            మాజాగ భూపాలరాజరేగ
   నల్లకృష్ణక్షమానాయకాగ్రేసరుం
            డెఱ్ఱకృష్ణక్ష్మాతలేంద్రు లచటఁ
   గరణీకధర్మంబుఁ గల్పించి మాన్యంబు
            దయచేసి రది యాస్పదంబు మాకు
   అదియు నీయేఁడు దంతులూరన్ననృపతి
   సత్తముఁడు గ్రామ మంతయు గుత్తఁ జేసి
   చెఱువు బిగఁగట్టె ప్రజలు జేజేపడంగ
   ముంచఁ గట్టించె మాపుట్టి ముంచఁ దలఁచి.

సీ. విన్నవించెద నాదువృత్తాంత మది కొంత
            చిత్తగించు పరాకు సేయఁబోక
   పొలములో నొకఁ డూడు పూడ్చంగఁ జాలఁడు
            గంగాభవాని ఢాకాకు వెఱచి
   దుక్కిటెడ్లను గొని దున్నుద మన్నచో
            బదు లీయఁ డొక్కండుఁ బాతనేబు
   నేజోలికినిఁ బోక యింట నుండుద మన్న
            సాలుకు వచ్చు గంటాలపన్ను
   తెరువు తలగాదు పొన్నూరు తెన్ను గాదు
   పంటపస లేదు గంటాలపన్ను పోదు
   మీకు దయరాదు మునుపటి మిసిమి లేదు
   అతులగుణదీప! విజయరామావనీప!

వేఱొకప్పు డాయన్నమరాజు సూరకవిమాన్యమునుండి చెఱువుముఱుగునీరుఁ బోనీక, యడ్డుఁగట్టించి చిక్కులు కలుగఁ జేసెనఁట. అందులకు సూరన, యారాజును బ్రార్థింపక, తనమాన్యమున నిలిచిన మోకాలిబంటిముఱుగునీటిలో నిలుచుండి గంగాభవానినిగుఱించి నాలుగుపద్యములను జెప్పఁగా, నారాజు కట్టించిన యడ్డుకట్ట తెగి, ముఱుగునీ రంతయుఁ గ్రింది పల్లమునకుఁ బోయెనఁట. ఆపద్యము లీక్రిందివే—

సీ. బ్రహ్మాండభాండసంపత్తిఁ గుక్షినిఁ గల్గు
            పద్మనాభునిపదాబ్జమునఁ బుట్టి
   సకలరత్నాకరస్థానమై యుప్పొంగు
            నంబుధీశునిచరణంబుఁ ద్రొక్కి
   పరమతత్త్వజ్ఞుఁడై పరఁగు శంతనుమహీ
            రమణువామాంకభాగమునఁ జేరి
   అఖిలలోకాధ్యక్షుఁడై మించి విహరించు
            శివుజటాజూటాగ్రసీమ నిలిచి
   తనరు నీవంటిధన్య కుత్తమము గాదు
   పూసపాటిమహాస్థానభూమియందుఁ
   గాలు త్రొక్కంగ నోడుఁ జండాలుఁడైన
   గదలు మిటమాని దివిజగంగాభవాని!

సీ. ఆదిబిక్షుం డీతఁ డని రోసి విడియాకు
            గొనివచ్చి యిట నిల్వఁ గోరితొక్కొ
   జగడాలచీలివై సవతితోఁ బోరాడి
            వీఁగివచ్చి యిచట డాఁగితొక్కొ
   నిర్జరాంగన లెల్ల నీఱంకు వెలిఁబుచ్చ
            దూఁబవై యిచ్చోట దూరితొక్కొ

   బీదబాఁపలఁ గష్టపెట్టుటకై మిన్ను
            దొలఁగి యిచ్చోటను నిలిచితొక్కొ
   వలదు ద్విజభూమిఁ గాల్నిల్ప వరుసగాదు
   ఱవ్వ నీకేల తగ దంబురాశి కరుగు
   నాతి యతఁడె కాఁడటె పిన్ననాఁటిమగఁడు
   కదలు మిటమాని దివిజగంగాభవాని!

సీ. భావింప నిలువెల్ల భంగంబులే కాని
            భంగము ల్దొలఁగు టెప్పటికి లేదు
   తిరుగుచో వంకరతిరుగు డింతియ కాని
            తిన్నగాఁ దిరుగుట యెన్నఁ డెఱుఁగ
   మొనసి రేయుపవళ్ళు మొరయుచుండుటె కాని
            మొరయ కూరకయుంట యెఱుఁగ మెపుడుఁ
   బరులకల్మిని రోసి పల్చనగుటె కాని
            పలుచనిగతి మాని మెలఁగు టెఱుఁగ
   మనుచు నీలోన నీవైన యవగుణంబు
   లరసి లజ్జించి దివినుండ కరుగుదెంచి
   నిలువునీరైన నీవిందు నిలిచితొక్కొ
   కదలు మిటమాని దివిజగంగాభవాని!

సీ. కృతకాద్రు లాయెనా కీలోగ్రఫణిఫణా
            నేకఫూత్కారవల్మీకచయము?
   విరిదోఁట లాయెనా కఱకుకంటకకంట
            కాంకురవిస్ఫురితాగచయము?
   పువుఁబాన్పు లాయెనా నవమంజులశ్వేత
            లవణాలవాలమౌ చవుటినేల?

   బొమ్మరిం డ్లాయెనా భూరిభేకాండజా
            ధారమై తనరు కేదారచయము?
   నీకు విహరింప వసతులై నివ్వటిలెనె
   చిన్నపొలములు? బ్రాహ్మణక్షేత్రమునకు
   ఘాతుకత్వంబుఁ జేయుముష్కరులుఁ గలరె?
   కదలు మిటమాని దివిజగంగాభవాని!

ఈసూరకవికిఁ గల్లూరి సోమనాథుఁడను నొకవైదికకవితో వివాదము సంభవింపఁగా నీతఁ డాకవి నిట్లు తిరస్కరించెను.

క. ఏమోమో శాస్త్రంబులు
   తా మిక్కిలి చదివె నంట తద్దయుఁ గవితా
   సామర్థ్య మెఱుఁగనేరని
   సోమునిజృంభణము కలదె! సూరునియెదుటన్.

దానికి సోమనాథుఁ డొసఁగిన జవాబు.

గీ. సోమశబ్దార్థ మెఱుఁగనిశుంఠ వగుటఁ
   పదిరితివి గాక సూర్యునిరదనములకు
   భంగకరుఁ డగుసోముజృంభణములీలఁ
   దెలియవయ్యయొ నీగుట్టు తెలిసెఁ గుకవి!

మరల సూరన చెప్పిన పద్యము

క. చెన్నగు నియోగికవనము
   మిన్నగ వైదికున కబ్బి మిగులునె చెపుఁడీ
   జున్నురుచి వెన్న కబ్బునె?
   తన్నుక చచ్చినను గాని ధరలో నరయన్.

ఈపద్యముపై సోముఁడు వ్రాసిన పద్యములు.

ఉ. త్యాగము విక్రమంబు సుకృతంబు నిగర్వము నీతిబంధుసం
   యోగము పెత్తనంబు వినియోగ మెఱింగి నటింప నేర్చు ని
   య్యోగులు రాజయోగులు కుయుక్తుల మాయల విఱ్ఱవీఁగు ని
   య్యోగు లనాధయోగు లవయోగులు నోగులు జోగు లెన్నగన్.

క. ఇలలో వైదికవిద్వ
   త్తిలకంబుల కేమి దిక్కుఁ దెలిపితి వమ్మా
   జిలిబిలిపలకులవెలఁదీ!
   పలుగాకినకారగుళ్ళపాలైతిగదే.

(సూరకవిధాటి కాఁగలేక సోముఁ డీపద్యముల వ్రాసినట్లు తోఁచుచున్నది.)

ఆ. దేవునాన మున్ను దేశాని కొకకవి
   యిప్పుడూర నూర నింటనింట
   నేగు రార్గు రేడ్గు రెనమండ్రు తొమ్మండ్రు
   పదుగురేసి కవులు పద్మనాభ!

ఈపద్యమును సూరనయే రచించెనందురు. కుత్సితాక్షేపకులంగూర్చి యీకవి రచించిన సీసమాలిక—

సీ. తట్టెఁడంతవిభూతిఁ బెట్టి తాతలనాఁటి
            కుండలా ల్వీనులఁ గునిసియాడ
   మైలఁ గ్రక్కెడు సేలుమడతలు నరసిన
            బోడిబుఱ్ఱలమీదఁ బొసఁగఁజుట్టి

   ప్రాఁతనీరుంగావిపంచెలు ముష్కము
            ల్గనుపింపఁ గా డొల్లుకచ్చఁగట్టి
   యంగవస్త్రంబుల నతికి కుట్టినయట్టి
            దుప్పట్లు పైఁగప్పి తుదలు చినిఁగి
   నట్టిపుస్తకముల కట్టలు చంకలోఁ
            బెట్టి విషంబులు విదులుకొనుచుఁ
   బలుగాకిముండబిడ్డలు శిష్యులని కొంద
            ఱుపచారములు సేయుచుండఁగా స్వ
   యంపాకనిష్ఠుల మని వంట సాగించి
            పదిదినంబుల కొక్కపట్టుఁబట్టి
   సంగీతసాహిత్యసరసవిద్యలవారి
            పాలిటిభూతాలపగిదిఁ దనరి
   యెంత చక్కనిశ్లోక మేని పద్యంబేని
            రస మెఱుంగక ముష్కరత వహించి
   ఇతఁడు పండితుఁడు గాఁ డితఁడు తార్కికుఁడు గాఁ
            డితఁడు శాబ్దికుఁడు గాఁ డితఁడు సత్క్రి
   రసజ్ఞుండు గాఁ డని చుల్క నాడుచు
            ఘనవిత్తహరణదుష్కర్ములగుచుఁ
   బరఁగు దుష్పండిత బ్రహ్మరాక్షసులచేఁ
            గవితారసజ్ఞత కట్టువడియెఁ
   గాన నేరీతిఁ జూచెదో కరుణ మాదృ
   శులకవిత్వ మేరీతిని సూటిఁ జేసి
   రక్షఁ జేసెదొ నీవె సూ! రక్షకుఁడవు
   జానకీరామ! దేవతాసార్వభౌమ!

ప్రౌఢకవి మల్లన

ఈమల్లన బమ్మెరపోతనామాత్యుని కుమారుఁడగు ప్రౌఢకవిమల్లనయే. శ్రీనాథుఁడు తాను తెలిఁగించిన నైషధగ్రంథమును తన బావమఱఁదియగు పోతనకు వినిపించి. తన శక్తిని వెల్లడించి యాతనిచే మెప్పువడయు తలఁపుతో నొకనాఁడు బావమఱఁదియింటికిఁ బోయెనఁట. ఆసమయమునఁ బోతన గ్రామాంతరమున నుండెనఁట. ఇంటిలో మల్లనమాత్రముండెను. మల్లనకుఁ జిన్నతనము. శ్రీనాథుఁ డింటిలోనికిఁ బోయి తాను మోసుకొని వచ్చిన తాళపత్రగ్రంథమును శ్రద్ధతోఁ బదిలముగా నొకచోటఁ బెట్టుకొని కూర్చుండి, యల్లునివంకఁ జూచి ‘వరే, మీ నాయన యెక్కడికి వెళ్ళినాఁడురా” యని యడుగఁగాఁ బ్రస్తుతము గ్రామములో లేఁడనియు, మద్యాహ్నమున కింటికి వచ్చుననియు మల్లన ప్రత్యుత్తరముఁ జెప్పి మామగారిని కుశలప్రశ్న లడిగెను. శ్రీనాథుఁ డల్లునకుఁ జవాబులు చెప్పుచు గ్రంథమును విప్పి పారఁజూచుకొనుచుండెను. మల్లన దగ్గరకుఁ బోయి ‘మామా, అది యేమి గ్రంథ’మని యడిగెను. మామ నైషధమని బదులుచెప్పెను. అల్లుండు ‘శ్రీహర్షకృతమగుసంస్కతకావ్యమేనా’ యనఁగా, శ్రీనాథుఁడు ‘కాదు, కాదు. దానినే నేను తెలుఁగుజేసితి, దీనిపేరు శృంగారనైషధములే’యని గంభీరముగాఁ బల్కెను. మామగారి నాటలు పట్టింపవలయునని యెంచి మల్లన, ‘ఓహో, మామా, దీనిని నీవుకూడ తెలిఁగించితివా’ యనెను. ఆతఁ డట్లనఁగనే శ్రీనా థుఁడు కళవళపడి, చేతనున్న తాటియాకులపుస్తకము నట్ల వడిచి బొమలు ముడివెట్టి, అల్లునివంకఁ జూచి ‘దీని నిదివఱ కెవ్వరు తెలిఁగించితిరిరా’యని యాతురతతో నడిగెను. మల్లన చిఱునవ్వు నవ్వి ‘మానాయనగారు చాలకాలము క్రిందటనే తెలిఁగించియున్నరే’ యనెను. ఆమాట చెవినిఁ బడఁగానే మఱింత కళవళముఁ జెంది, ‘యేమిది? దీని నిదివఱ కెవ్వరును తెలిఁగించియుండలే దనునమ్మకముతే, నా బుద్ధిబలమునంతయు ధారవోసి దీనిఁ దెలిఁగించితిని. పోతనయే తెలిఁగించెనా. తెలిగించెనే యనుకొందము. మాటమాత్రమైన, నాతో ననక రహస్యముగా నుంచునా’ అని యేమేమో యోజించి యోజించి, మల్లనమాటలు గల్లలుగాఁ దలపోసి, దీనితో సర్వముఁ దేలఁగలదని నిశ్చయించుకొని, ‘మీతండ్రిగారినైషధములోని పద్యమొకటి చదువు’మని మల్లన నడుగఁగా, నాతఁడు వెలవెలఁబోక, ‘యేపట్టునఁ జదువుమనియెద’ రనెను. శ్రీనాథుఁడు గొంకుచు, ‘దయయంతి విరహగ్లాని నెట్లు వర్ణించెనో, ఆపట్టునఁ జదువు’ మనెను. అప్పుడు మల్లన యీక్రిందిపద్యము నల్లనఁ జదివెను.

గీ. కాంత కలఁదిన చందనకర్దమంబు
   ఉగ్రవిరహాగ్నిఁ దుకతుక నుడికి చెదరి
   చెంత నున్నట్టి దమయంతి చెలిమికత్తె
   మెఱుఁగుఁబాలిండ్లపైఁ బడి మిట్టిపడియె.

శ్రీనాథుఁ డీపద్యమును విని పోతన నైషధముఁ దెలిగించినాఁడని నమ్మి, యేమియుఁ దోఁపక మిన్నకుండెను. ఇంతలోఁ బోతరా జింటికి వచ్చెను; బావమఱఁదిని క్షేమసమాచారము లడిగెను. కాని శ్రీనాథుఁడు చెప్పీచెప్పనట్లు చెప్పెను. ఈతఁ డెప్పుడును బోతరాజు నెగతాళిఁ జేయుచుండెడివాఁడు. నాఁ డట్టి ప్రసంగ మేమియు రాలేదు. నిష్కళంకహృదయుఁ డగు పోతనామాత్యుఁ డాతనియొద్దనున్న గ్రంథముం జూచి ‘యది యేమి పుస్తక’మని యడిగెను. ఆతఁడు, ‘బావా, నీవు తెలిఁగించినసంగతి తెలియక నైషధమును నేనుగూడ తెలిఁగించితిని. ఈగ్రంథ మదియే.’ పోతన: ‘బావగారూ! తమరు నైషధమును దెలిగించుట నీరీతిగా వెల్లడించుచున్నారా? లేక నన్ను బరిహాసము చేయుచున్నారా?’ శ్రీనాథుఁడు: ‘సరే, ఇఁక నెన్నినాళ్ళు దాఁచెదవు? నీ వబద్ధ మాడవనుకొంటిని. నే డంతయు బయలుపడెను.’ పోతన రిచ్చవడి, ‘ఏమిది? నేను నిశ్చయముగా నాగ్రంథమును దెలిగించియుఁ దనకుఁ జెప్పక దాఁచిపెట్టితినని నొక్కి పలుకుచున్నాడు. నిక్క మెఱుంగవలయు’నని తలఁచి ‘శ్రీనాథకవీ! యీసంగతి నీకెవరైనఁ జెప్పిరా? లేక నీవే కలగంటివా’ యనెను. అంతట తన కీసంగతినంతయు మల్లన చెప్పెననియు పద్యమునుగూడ వినిపించెననియుఁ జెప్పి పైపద్యమును జదివెను. మల్లన నవ్వుకొనుచు నటనుండి లేచిపోయెను. పరమభాగవతశిఖామణి యగు పోతనామాత్యుఁడు నిజముఁ గుర్తెఱిఁగి చిఱునవ్వు నవ్వి ‘కవిసార్వభౌమా! యీపద్యమును నేను వ్రాసితినని, నీయల్లుఁడు చెప్పుటకంటె, నీయల్లుఁడు చెప్పుటకంటె, నీవు నమ్ముటయందు మిగులసారస్యము కలదు. ఇట్టి రసభంగకవిత్వమును నాకెందు కంటఁగట్టెదవు. అది మామలల్లుండ్రగు మీ యిరువురకే తగుఁగాక’ యనెనఁట. శ్రీనాథుఁడు తనతెలివితక్కువ బయటఁబడుటకు విచారపడి యల్లుఁడు చేసిన మోసము నెఱుఁగఁజాలమికి సిగ్గిలి బావగారివలనఁ గలిగిన యవమానముచే మ్రగ్గెను. అప్పుడే యింటికి పోవలయునని యత్నించియు నట్లు వెళ్ళిపోవుట మిగుల యవివేకమగునని యెంచి, యాపూట నిలిచి సాయంతనమున వెళ్ళిపోయెనఁట.

కూచిమంచి తిమ్మకవి

ఈతఁడు రసికజనమనోభిరామమను రచించిన రసికవతంసుఁడు. ఒకవేశ్య యితనిరసికతకు మిగులసంతసించి, తిమ్మకవితో నెప్పుడు సంభాషింపఁ దటస్థింతునా యని చింతించుచుండెనఁట. ఆవేశ్య కవితారచనయందును గడుజాణయఁట. కాకున్న నిట్టితలఁపు కలుగఁబోవునా? తిమ్మకవి యొకానొకనాఁడు వీథినిఁ బోవుచుండెను. (ఆతనిసౌందర్య మంత ప్రశంసనీయము కాదని వాడుక.) ఆసమయమున నావేశ్య హఠాత్తుగా నామార్గమునఁ దిమ్మకవిఁ జూచి, యింతకన్నను మంచిసమయము తటస్థింపదని తలంచి మించినసంతోషమున నాతనిఁ గౌఁగిలించుకొనెనఁట. తిమ్మకవి నివ్వెఱపడి, పెడమోముఁ బెట్టెనఁట. అప్పు డవ్వేశ్య

చ. ‘చతురులలోన నీవు కడుజాణ వటంచును నేను కౌఁగిలిం
   చితి నిట్లు మాఱుమే మిడఁగఁ జెల్లునె?’

అనెనఁట, దానికి సమయానుకూలముగాఁ దిమ్మకవి

   ..................................................ఓ రసికాగ్రగణ్య! య
   ద్భుతమగునట్టి బంగరపుఁ బొంగరపుంగవఁ బోలు నీ కుచ
   ద్వితయము ఱొమ్మునాటి యలవీఁపునఁ దోఁచె నటంచుఁ జూచితిన్.

అని జవాబుఁ జెప్పెనఁట. తిమ్మకవి చూపిన రసికత కావెల్లాటకత్తె మోదమంది, యేమో బహుమాన మర్పించెనఁట.

వూరె నరసకవి

ఈకవి తననెవరో తిరస్కరించి పలుకఁగా నీక్రిందిపద్యముఁ జెప్పెనఁట.

చ. అటు నిసుమంత తిట్టవలె నంచు మదిం దలపోసి చూచిన
   న్జటులనటన్నటాక్షనటజాగ్రదుదగ్రసమగ్రదృక్చమూ
   త్కటలుఠదబ్జజాండతటధట్టనధట్టనచిట్చిటార్భటో
   ద్భటకృదదభ్రశుభ్రచరభాగ్ఘనతుంగతరంగభంగకృ
   త్పటుతరభూమధూమయుతభంగశతాంగపతంబలోపకృ
   త్కుటిలశిఖానికాయభృతకుంఠితతీక్ష్ణకృశానుభావమై
   లొటలొటలై చనంగవలె; రోషముతోడను దిట్టఁజూచినన్
   దటఁదటదంతకుంతకపరస్పరఘట్టన నెట్నెటల్ నెటల్
   పటపటనిర్దళస్థలనభస్థలభూస్థలకాండకాండ ది
   క్తటతటగంధదంతిఘనకాండకరండతదంతభోభువ
   స్తటపటధగ్ధగద్ధగితధగ్ధగధగ్థగభగ్భగల్ భగల్
   రటదనలోత్థహేతిజ్వలలత్పరసత్వరవిస్ఫులింగికా

   పటలతృటద్ధరణ్యకశిపాంగనృసింహకఠోరరంహమై
   యటమట లై చనంగవలె; నాదరణాప్తి నొకింతఁ జూచినన్
   చటుకున సౌరదంతిలసదశ్వశతాంగసువర్ణపేటికా
   పటహధణాంధణాంధణనభాంకరమత్తమరాళగామినీ
   భటపటహారహీరచటబంభమబంభమబంభమారవో
   త్కటకటఝర్ఝరాయితచకాసనదంతనిరంతరంబులై
   కటువులు నిండఁగావలయు; గట్టిగ దీవనఁ జేసి చూచినన్
   బటదురుతల్పమత్స్యగశివంకరశంకరవిశ్వసృట్ఛచీ
   విటవరుణాగ్రమారుతకుబేరయమేందుదినేంద్రదేవతా
   ఘటభవనారదాత్రిశుకగౌతమముఖ్యతపస్విరాడ్వరో
   త్కటకసమస్తధేనుమణికల్పమహీరుహపాళు లెల్ల ముం
   గిటశర ణంచు నిల్వవలెఁ గీర్తినిఁ గోరిన మానవోత్తముల్
   కటువులు పల్కఁగా వలదొ కానొకవేళ నొకించు కేనియు
   న్సటమట లౌదు రూ రెఱుఁగ సాటెద సాటితి జాగ్ర తింక వేం
   కటగిరివాస తప్తమృదుకాంచనవాస రమేశభక్తుఁడన్.

తిరుమల బుక్కపట్టణం తాతాచార్యులు

ఈశ్రీవైష్ణవకవి నివాసగ్రామము గుంటూరుమండలములోని చిఠాపురమను నగ్రహారము. ఆయగ్రహారములో నీయనకును భాగము కలదు. తాతాచార్యులు మంచి యాశుకవియు ప్రబంధకవియునై యశస్సుఁ గాంచిన ఘనుఁడు. తగుపాటిదూరములో నిలుచుండి గోడకుఁ దగులునట్లు రాయివేసి యారాయి క్రిందఁబడులోపలఁ గందపద్యమును జెప్పు ప్రజ్ఞగలవాఁడని వాడుక కలదు. అదియుం గాక యీకవి యుదారస్వభావమును గలవాఁడు.

చిఠాపురాగ్రహారములోనే బొగ్గవరపు పెదపాపరాజనునొకకవి కలఁడు. ఈకవు లిరువురును స్నేహితులు. ఒకకాలమునకు లేమి సంఘటింపఁ గుటుంబరక్షణము సేయనోపక పాపరాజకవి నైజామునకు వెళ్ళి, తనస్నేహితుఁడగు తాతాచార్యకవి కీక్రిందిరీతిగా జాబు వ్రాసెను.

చ. తిరుమలబుక్కపట్టణసుధీవర! యోచినతాతయార్య! నే
   నరుదుగ జ్యేష్ఠశుద్ధవిదియారవివాసరమందు లేచి మీ
   కరుణ హుసేనుసాగరము గాంచితి తన్నిహితత్రయోదశిన్
   నిరతముఁ జిన్నవాండ్రయెడ నీదయ యుంచవయా దయామయా!

తన కీరీతిఁ బద్యము వ్రాసినంతమాత్రముననే తాతాచార్యులు మనస్సు కఱిగి పాపరాజు తిరిగివచ్చుదాఁక నాతనికుటుంబమును దానే పోషించెను.

ఈవిద్వత్కవి విశ్వగుణాదర్శమును దెలిగించి, వడ్లమన్నాటివెంకటచలంపంతులు (డిప్యూటికలెక్టరు) గారికిఁ గృతి యిచ్చెను. వారిదర్శనమునకు వెళ్ళినప్పుడు కవి రచించిన పద్యము.

సీ. వరవడ్లమల్నాటివంశాబ్ధి జన్మించి
            రాకాసుధాకరు రహి వహించి

   ప్రవిమలకీర్తిచే బలికర్ణులను మించి
            సురరాజవిభవంపుసొంపుఁ గాంచి
   సకలవిద్యలయందు సుకవులఁ బ్రేమించి
            నిఖిలరాజక్రియల్ నిర్వహించి
   ధరణీసురోత్తమదారిద్ర్య మెడలించి
            వనతటాకమ్ముల వసుధ నించి
   కృతుల నియమించి సత్వివితతిఁ గాంచి
   ధరణిఁ బాలించి మించిన ధర్మమూర్తి
   భూనుతశ్రేష్ఠ సత్కర్మభూరినిష్ఠ
   చారుమణిహార! వేంకటాచలవిహార!

ఈకవి వలపర్లజమీన్దార్లవద్ద కేఁగినప్పుడు చెప్పిన పద్యము—

ఉ. రోసముచే రణస్థలి విరోధులపెం పడగించువారివిన్
   వేసర కర్థికోటులకు వేఁడిన కోర్కుల నిచ్చువారివిన్
   మీసము లంచు నెన్నఁ దగు మిక్కిలి తాదృశసద్గుణాదులన్
   మీసము లైనవారలవి మీసములంచును నెన్ననౌఁ బరీ
   హాసము సేయువారలకు హాస్యకరంబుగ వాసివన్నెలన్
   బాసి కవీంద్రులీవులకు; వైరులు పోరుకు వచ్చిన న్దృణ
   గ్రాసపుదుష్టబుద్ధులను గైకొనుచుండెడి పీడలోభిభూ
   మీశులమూతులందుఁ గలమీసముల న్సమ మంచుఁ బల్కనా?
   త్రాసము లేక విక్రమధురంధరకుంభయుగాత్థమాంసమే
   గ్రాసముగాఁ జరించు మృగరాజులమూతులయందు భాసి లే
   మీసముల న్బిడాలముల మీసముల న్సమమంచుఁ బల్కనా?
   హాసవిలాసభాసురమహామృగయాదులకన్న మించు మీ

   మీస మొకింత మీటినను మీరిపుకోట్లకు సర్వదావనీ
   వాసభయోపవాసవివిధాన్నరసాదనపాదధావనా
   భ్యాసము లబ్బఁజేయుఁ................................సే
   బాసనఁ దాతయార్యకవివర్యుఁడ మీసభ కేఁగు దెంచితిన్.

తాడువాయి నరసింహమను నియోగిపైఁ జెప్పినపద్యములు

ఉ. హాటకగర్భులీలఁ జతురానన న్గడి వీటిఁబుచ్చి మో
   మోటము లేక వాణి నొకమాటనె నవ్వుచు నోటబుచ్చి యు
   చ్చాటనఁ జేసి గాటముగఁ జాటునుమాటనకొప్పు నీదు వా
   చాటత నెన్నఁగాఁ దరమె సద్గుణరత్నఖనీ! సుధీ! నిరా
   ఘాటపుతాడువాయికులకంధిమణీ! నరసింహధీమణీ!

సీ. అంభోధిసమహిమకుంభినీధరనిభ
           గాంభీర్యధైర్యవిజృంభణంబు
   బంభరీకృతనభశ్శుంభదారంభసం
            రంభాబ్జకీర్తివిజృంభణంబు
   అంభోధికన్యకాదంభకటాక్షలా
            భోంచితసంపద్విజృంభణంబు
   కుంభినీధూర్వహకుంభీనసీనాధ
            సంభావితోక్తివిజృంభణంబు
   కుంభికుంభసదృక్కుచకుంభయువతి
   హృద్యసాకారమారవిజృంభణంబు
   ధరణిలో నీకె తగునౌర తాడువాయి
   వేంకటనృసింహ! సజ్జనవినుతరంహ!

సీ. వివిధవిద్వచ్లాఘ్యవితరణనిస్తంద్ర!
            దానమేదురకళాదానవేంద్ర!
   అసదృశతాడువాయాన్వయాంబుధిచంద్ర!
            పటుతరపాండిత్యపన్నగేంద్ర!
   కమనీయభోగభాగ్యక్రమదివిజేంద్ర!
            సంతతపోషితసత్కవీంద్ర!
   శరణాగతాపన్నజనరక్షణోపేంద్ర!
            హితధైర్యనిర్జితహిమగిరీంద్ర!
   కీర్తనీయమనోహరకీర్తిసాంద్ర!
   మాన్యగుణభూషితాశేషమానవేంద్ర!
   సత్యభాషాహరిశ్చంద్ర! సౌష్ఠవాంగ
   నిరసితరతీంద్ర! వేంకటనరసయేంద్ర!

సీ. నిరతసంరక్షితనిఖిలార్థిసంతాన!
            సంతానసన్నిభసాధుదాన!
   దానాంధనిరసనత్రాణగుణాహీన!
            హీనమానవలూనహృత్ప్రధా
   ధానుష్కవర్ణితోద్యమధర్మసంధాన!
            ఆనతవైరిజనాభిమాన!
   మానసంరక్షణామ్లాన ధీవిజ్ఞాన!
            విజ్ఞానవత్సుధీవినుతమాన!
   మానినీమానహృత్పంచబాణ! బాణ
   వైణికాహీనగానశుభప్రవీణ!
   ధీనిదాన! బుధాధీన! గౌణ! తాడు
   వాయివేంకటనరసింహ! వర్ణితాంహ!

సీ. నీదుభార్యామణి నీరజాక్షునిరాణి
            నవలీల నవలీల నవఘళించు
   నీరమ్య మగుపాణి నిర్జరాగశ్రేణి
            నీవిచే ఠీవిచే నీసడించు
   నీకరస్థకృపాణి నీ మనోజ్ఞకృపాణి
            వలె ధార్మికోద్ధారపటిమ నెసఁగు
   నీచారుతరవాణి నీచారుతరవాణి
            గావాణి వాణీశుఁ గడు హసించు
   ననఁగ సామాన్యులకు నీదుగుణగణముల
   గణన సేయంగఁ దరమె? యగణ్యపుణ్య
   వర్ణ్యశ్రీతాడువాయిసద్వంశచంద్ర!
   వేంకటనృసింహమంత్రీంద్ర! వినుతసాంద్ర!

బొగ్గవరపు పెదపాపరాజు

ఈకవి నిజామురాజ్యమునకు వెళ్ళినప్పు డొకగ్రామములో నీకు భోజనసామగ్రి యేమేమి కావలయుఁ జెప్పుము పంపించెదమని అక్కడివారనఁగా నీతఁ డీపద్యమును జెప్పెనఁట.

క. ముప్పావుశేరు బియ్యము
   పప్పఱసోలెండు నెయ్యివావెఁడు పూబం
   డొప్పారపావుశేరుగ
   నిప్పింపుడి యుప్పుగాయ లింతే చాలున్.

ఈకవికిఁ బోట్లూరనుగ్రామములో మాన్యము కలదు. దాని కిద్దఱు ముగ్గురు భాగస్థులు కలరు. ఆభాగస్థులు యీపాప రాజుభాగమును బంచి యియ్యక తామే యపహరించుచుండ వారికి నీవైనను బుద్ధినిఁ దెల్పుమని బొగ్గవరపు వేంకటరాయుఁడను నాగ్రామకరణమునకుఁ గవి యీక్రిందిపద్యమును వ్రాసి పంపెను.

ఉ. మాన్యపుఁబాలిధాన్యము సమర్థులమంచు హరించువారలన్
   హైన్యముచెందుఁగాని, ‘భళి’ యందురె? భూజను లోయనన్యసా
   మాన్యవివేక! నీవయిన మంచిగుణం బుపదేశమిమ్ము ప్రా
   వీణ్యముతోడ బొగ్గవరవేంకటరాయ! ప్రధాని శేఖరా!

ఈకవి బెజగము నరసయ్యయనునతనిపైఁ జెప్పిన పద్యము

సీ. నీచిఱునవ్వు వెన్నెల బెదరింప నా
            మోము చందురు గేరు టేమి చెప్ప?
   నీకన్ను లంభోజనివహంబు నగ బొమ
            ల్కామువిండ్లను గేరు టేమి చెప్ప?
   నీ వర్థిజనకల్పవృక్షంబు నాఁ జేతు
            లామానికొమ్మలం చేమిచెప్ప?
   నీనడ ల్మదకరికానఁజేయగఁ నూరు
            లిభహస్తనిభములం చేమిచెప్ప?
   చక్కఁదనములకుప్పగా సరవి నిన్ను
   ధాత జనియింపగాఁ జేసె ధరణిలోన
   సకలశ్రీభూసురాశీర్వచనవివర్ధి
   తాన్వయనిధాన! కృతిగర్భితాభిధాన!

ఈపద్యమునం దాతనిపే రిముడ్పఁబడియున్నది.

కొమ్మలపాటి యోబనకవి

ఈయోబనకవికి మంచళ్ళకృష్ణయ్యయను నొకకవి సవ్యాఖ్యానవసుచరిత్రము నొసంగెదనని చెప్పి, మూలము మాత్రమే పంపించనఁట. తరువాత యోబనకవి కృష్ణకవి కిట్లు వ్రాసెనఁట.

సీ. షడ్రసోపేతభోజన మిడి యతిథికి
            నాపోశనము నీక యలఁచుకరణి
   అతిపిపాసార్తున కమృతకూపముఁ జూపి
            ‘చేదలే’ దనుచు వచించుమాడ్కిఁ
   దనరఁ గన్యాదాన మొనరించి తరిని గ
            ర్భాధాన మొనరఁ జేయని పగిదిని
   దర్పణాంతరమున ధనరాశిఁ జూపించి
            కొనుమెంతవలసిన ననువిధమున
   దెలియ నమలక రుచులను దిగక లోతుఁ
   దెలియు నీవేల సవ్యాఖ్యఁ దెచ్చి యీక
   మూల మంపితి రేటికి? మూలధనము
   మూలధన మన్నయట్లు; సమూల మొసఁగు
   పొల్లుపుచ్చకు తృష్ణ? మంచళ్ళకృష్ణ.

రాళ్ళబండి పట్టాభిరామరాజు

ఈబట్టుకవి నివాసగ్రామము గుంటూరుమండలములోని కుంకెళ్ళకుంట (కుంకలకుంట) యనుగ్రామము. ఈతఁడు కొంతకాలము నర్సారావుపేట మల్రాజువారి యాస్థానకవిగా నుండెను. మైదోలురామనమంత్రిపై నితఁడు చెప్పిన పద్యము.

సీ. రాజీవహితవంశరాముఁ డాతండు స
            ద్రాజీవరిపుకాంతిరాముఁ డితఁడు
   సలలితశత్రునాశనరాముఁ డాతండు
            సలలితశత్రుభీషణుఁ డితండు
   సకలవిద్యలమూలసంగ్రహుం డాతండు
            సకలవిద్యలఁ గన్నసరసుఁ డితఁడు
   బహుతారకబ్రహ్మపద మిచ్చు నాతండు
            బహుతారకపుమంత్రపఠనుఁ డితఁడు
   బుద్ధుఁ డాతండు లలితసుబుద్ధుఁ డితఁడు
   శౌరి యాతండు వరకీర్తిశాలి యితఁడు
   కలికి యాతండు నార్వేలఘనుఁ డితండు
   రాముఁ డాతండు మైదోలురాముఁ డితఁడు.

ఈబట్టుకవి యొకనాఁడు సరికొండపాలెమను నొకయగ్రహారమునకుఁ బోయెను. ఆయగ్రహారీకులలోఁ బెద్దపేరుఁ జెందినవాఁడు భాస్కరుని బలరామన్నగారు. నెఱదాత. కాని యీబట్టు యాచనకుఁ బోవునాటికి బలరామన్నగారు మిగులఁ బీదస్థితిలో నుండిరి. బట్టుమొగముఁ జూడఁగనే యేమియు దోఁచక “యీకవి కిప్పుడేమిబహుమాన మిచ్చి పంపఁగలనా?” యని యోచించుకొనుచుఁ గూర్చుండెను. ఆయన యోజనముతో బట్టునకుఁ బనియేమి? ఈరీతిగాఁ బద్యమును జదువ మొదలిడెను.

మ. కరుణా? గౌరవమా? విలాసగుణమా? గాంభీర్యమా? ధైర్యమా?
   సరసశ్రీనయమార్గమా? వినయమా? సత్యవ్రతాచారమా?

   వరవిద్వత్కవు లెన్న నీకె తగురా? వర్ణింతురా? నిన్ను...

అనునంతకు బలరామన్నగారు దిగ్గున లేచి తనశిరోవేష్టనమును దీసి బట్టుచేతులలోఁ బెట్టెను. వివేకియగు పట్టాభిరామరాజు దాతయొక్క మదిని గ్రహించి సంతసించి

   .............................................బ
   ల్లరభీమాహవభీమ! భాస్కరునిబల్రామా! వదాన్యప్రభూ!

అని పూరించెను.

కుడుములరామన యనునాతనిపై జెప్పిన పద్యము

క. నాటికి రాయనిబాచఁడు
   నేటికి వినుకొండసీమనియోగ్యులలో
   మేటివదాన్యుఁడ వీవే
   కోటిమనోజాభిరామ! కుడుములరామా!

కుడుముల వాసయ్య యనునతనిపైఁ జెప్పినపద్యము

సీ. శ్రేయోభివృద్ధ్యస్తు భూయో౽స్తు తే సర్వ
            విద్వజ్జనశ్లాఘ్యవివిధచరిత!
   సౌభాగ్య మస్తు తే సర్వసర్వంసహా
            భరణధురంధరబాహుశౌర్య!
   విభవాదిరస్తు తే విశ్వవిశ్రుతమహా
            వితరణసాహసవిహితసుగుణ!
   శ్రీరమాపాంగవిశేషలాభో౽స్తు తే
            కీర్తనీయానంతకీర్తిభరత!

   ఆయురారోగ్య మస్తు తే హర్షితాఖి
   లావనీవర! సత్సమూహాంతరంగ
   పంకరుహషండ భాస్వత్ప్రభాతిసాంద్ర!
   వైభవసురేంద్ర! కుడుములవాసయేంద్ర!

కోటకోటీశమను నతనిపైఁ జెప్పినది.

సీ. ప్రజలచేఁ గానుకావళినిఁ గాంచునతండు
            హెచ్చుగా దీనుల కిచ్చు నితఁడు
   విషమదృష్టినిఁ గొంత వీక్షించు నాతండు
            సొంపుగా సమదృష్టిఁ జూచు నితఁడు
   ఇల్లిల్లు తప్పక యెలమినేఁగు నతండు
            వన్నెమీరెడు భాగ్యవంతుఁ డితఁడు
   కట్టుపుట్టము లేక కట్టుఁజర్మ మతండు
            కనకాంబరావళుల్ గట్టు నితఁడు
   శూలి యాతఁడు సద్గుణశాలి యితఁడు
   జ్ఞాని యాతఁడు పరమసుజ్ఞాని యితఁడు
   భర్గుఁ డాతఁడు నుతగుణవర్గుఁ డితఁడు
   యీశుఁ డాతండు కోటకోటీశుఁ డితఁడు.

తురగా వెంకంరాజు

ప్రౌఢకవితాధురీణుఁడయిన యీకవి యొకనాఁడు తాళ్ళూరనుగ్రామమునకుఁ బోయెనఁట. ఆరోజుననే యొకకమ్మయింటిలో వివాహము జరుగుచుండెనఁట. ఈకవి ననుబహుమానిం పకపోదురా యనుధైర్యముతో నాయింటికేఁగి, తనరాక యాయింటియజమానునకుఁ దెల్పఁగాఁ బనితొందరలతో విసిగియున్న యాతఁడు త్వరపడి, “యిప్పుడీకవులయేడుపే నాకుఁ బట్టినది. చాలు చాలు వెళ్ళు వెళ్ళు” మనయెనఁట. అందుపై నీకవికిఁ గోపము వచ్చి, యీక్రిందిపద్యమునుఁ జెప్పెనఁట.

సీ. పెండ్లిపేరంటాండ్రు పెనురంకులకు నేడ్వ
            బాజాభజంత్రీలు పప్పు కేడ్వ
   రాజబంధువులంత రంకుముండల కేడ్వ
            బాజారువెలఁదులు పసుపు కేడ్వ
   వచ్చిపోయెడువారు వక్కలాకుల కేడ్వ
            గుగ్గిళ్ళకై పెండ్లిగుఱ్ఱ మేడ్వఁ
   బల్లకిబోయీలు భత్యాలకై యేడ్వ
            బలుపురోహితుఁడు నేబులకు నేడ్వ
   హారతిరూకల కాడుబిడ్డలు నేడ్వ
            కుఱ్ఱవాండ్రందఱుఁ గూటి కేడ్వ
   అల్లుఁ డనాథయం చత్తమామలు నేడ్వ
            కట్నంబుకై గ్రామకరణ మేడ్వ
   పెద్దమగం డని పెండ్లికూఁతురు నేడ్వ
            పిల్ల చిన్న దటంచుఁ బెనిమి టేడ్వ
   చాల్పుగా నిన్నియేడ్పుల సాగెఁ బెండ్లి
   సరస తాళ్ళూరులోపల విరసముగను
   నఱ్ఱపేరయ్య చేసె యీనాటి కహహ
   కమ్మకులమున జన్మించి ఘనులు నవ్వ.

పుల్లకవి

సీ. ఎనుబోతు బలిసి మత్తేభంబువలె నున్న
            భ్రమరంబునకు మదప్రాప్తి లేదు
   బూరుగుమ్రా నెంత పొడవుగాఁ బెరిగినఁ
            జిలుకకు ఫలవృత్తి సేయలేదు
   మసిబొగ్గు కస్తూరిమహిమ దీపించినఁ
            బరిమళానందసౌభాగ్య మీదు
   చవుటియుప్పును కండచక్కెరవలె నున్న
            ననుభవహర్షమ్ము నంద నీదు
   ఒక్కధనలోభి దొరవలెనున్నఁ గాని
   యర్థివరులకు నందేమి యాస లేదు
   మేలుమే లిట్టిమహిమ నిర్మించినాఁడు
   పుల్లకవి నేలు గోపికావల్లభుండు.

సీ. కోతి తా సభయందుఁ గూర్చుండ నేర్చు నే
            కవిసి యొక్కొక్కనిఁ గఱచుఁగాని?
   శ్వానంబు దేవరబోనంబు నెఱుఁగునే!
            చెఱిచి వేగంబె భక్షించుఁ గాని?
   గాడిద యింతేని జ్ఞానంబు నెఱుఁగునే!
            మొగమెత్తి యూరక మొఱుగుఁగాని?
   సింబో తిది తులసి చెట్టని యెఱుఁగునే
            చెలరేగి మోడు గాఁ జేయుఁగాని?
   యెంత యెవరికి ప్రాప్తంబొ యంతె కాని
   యెక్కు వైనగుణంబు ల వెట్లు గల్గు?
   మేలుమే లిట్టిమహిమ నిర్మించినాఁడు
   పుల్లకవి నేలు గోపికావల్లభుండు.

మోచర్ల వెంకన్న

వెంకన్న దత్తప్ప వీరిరువురు నన్నదమ్ములు. తెలుఁగు కవులు. నియోగిబ్రాహ్మణులు. వీరి నివాసగ్రామము నెల్లూరుమండలములోని “తెట్టు” అను గ్రామము.

ఒకనాఁ డొక వైయాకరణుఁడు వెలుగోటి విద్వత్కుమారకృష్ణయాచభూపతిం దర్శింపఁగా నారాజు— “మీరు తెలుఁగు కవన మల్లఁగలరా?” యని యాపండితుని ప్రశ్నించెనఁట. అందులకు వ్యాకరణపండితుఁ “డయ్యా నేను శబ్దశాస్త్రమునఁ బ్రవీణతగలవాఁడను. సంస్కృతమున నించుకకవనధాటియుఁ గలదు గాని యాంధ్రమున నాకుఁ బరిచయము లే”దనెనఁట. ఆరాజున కాంధ్రమున నించుకప్రజ్ఞయు నధికాభిమానమును గలదఁట. అందుచే నాపండితుని పాండిత్యమును గణింపక యాచభూపతి “తెలుఁ గెఱుఁగఁడు సంస్కృతంపు తెన్నే మెఱుఁగున్ అనినట్లు తెనుఁగు తెలియని నీసంస్కృత మెందుకు పొ”మ్మని నిరాదరించెనఁట! పాప మాపండితుఁ డేమిచేయుటకుఁ దోఁపక అప్పు డీవెంకనకవిని దర్శించి తనకుఁ గలిగిన యవమానమును దెలుప నాయవమానము తనకు జరిగినట్లు భావించి వెంటనే రాజసముఖమునకు బయలుదేఱుచు ఆరాజుచేతనే మీకు నూటపదా ర్లిప్పించెద రండీ యని ప్రతిజ్ఞఁ జేసెనఁట. వ్యాకరణపండితుని వెంటఁబెట్టుకొని వెంకన యాచభూపతిసంస్థానమునకుఁ బోయి “తెలుఁగుకవులు వచ్చినా”రని తెలియఁజేసెను. “దయచేయవల సిన” దని యాహ్వానము వచ్చెను. రాజు వెంకనఁ జూచి మీదేగ్రామ మన నాతఁడు మాది ‘తెట్టు’ అని చెప్పెను. అప్పుడు రాజు తెట్టేనా? యని యించుక నిర్లక్ష్యభావమును సూచింపఁగా నీకవి, మహారాజా! తెట్టన నంతచులకనఁగా జూడకుఁడు

ఉ. తెట్టు కుమారకృష్ణజగతీవరవందన! రాజ్యలక్ష్మికిన్
   బట్టు; ధరాంగనామణికిఁ బాపటబొట్టు; రిపూరగాళివా
   కట్టు; సముజ్జ్వలద్ధృతికి గట్టు; బుధాళికి వేల్పుఁజెట్టు; వా
   గ్దిట్టల కున్కిపట్టును మదీయనివాసము యాచభూపతీ!

అని యాశువుగా పద్యముం జదువ రాజు సంతసించి అయ్యా! తమపే రేమన,

క. నాపేరు వేంకనందురు
   భూపాలకమకుటనీలపుంజమిళిందో
   ద్దీపితపాదాంబుజకరు
   ణాపర! వెలుగోటియాచనరనాథేంద్రా!

అని మరల నాశువుగా జవాబు నొసంగ నారా జచ్చెరువంది, అయ్యా! తమ రాశువుగా గంట కెన్ని పద్యములు చెప్పఁగలరని యడుగఁగా గంటకు నూఱుసమస్యల నాశువుగాఁ బూరింపఁగలనని కవి ప్రజ్ఞఁ బలికెనఁట. ఆసమయమున ఆస్థానకవులచే నియ్యఁబడి యీకవిచేఁ బూరిపఁబడిన సమస్యలు చాల కలవు. ఇందు రసోత్తరములుమాత్ర ముదాహరింపఁబడును. ఈసమస్యలను ప్రభువే యొసంగెననువాఁడుకయుఁ గలదు.

సమస్య:—దృఢసత్త్వంబునఁ జీమ తుమ్మెఁ గదరా దిగ్దంతు లల్లాఁడగన్

మ. సఢులీశోర్వి చలింప నిర్జరవరుల్ శంకింప భేరీనికా
   యఢమత్కారత నిద్ర లేచి దశకంఠామర్త్యవిదవత్పరీ
   వృఢసోదర్యుఁడు లేచి రా వ్యథ యొనర్చె న్నాసికాంతస్థమై
   దృఢసత్త్వంబునఁ జీమ తుమ్మెఁ గదరా దిగ్దంతు లల్లాఁడగన్

సమస్య:—గుఱ్ఱానికి నైదుకాళ్ళు కోడికివలెనే

క. మఱ్ఱాకుఁ బాన్పుఁగాఁ గొని
   బొఱ్ఱను బ్రహ్మాండపఙ్క్తిఁ బూనినముద్దుం
   గుఱ్ఱడ! విను, వన్నెలు గుహు
   గుఱ్ఱానికి నైదు; కాళ్ళు కోడికివలెనే.

సమస్య:—కన్నులలోఁ జన్ను లమరెఁ గాంతామణికిన్

క. చిన్నవి ఝషకంబులు గొని
   చెన్నలరఁగ బెస్తవారిచిన్నది రాఁగాఁ
   బన్నుగ ఱొమ్మునఁ గల వల
   కన్నులలోఁ జన్ను లమరెఁ గాంతామణికిన్.

సమస్య:—భార్య లిద్దఱు శ్రీరామభద్రునకును

గీ. రావణుని సంహరించియు రాజ్యమునకు
   నంగనను గూడి యభిషిక్తుఁడై వెలుంగ
   హార తిచ్చిర ప్రేమతో హరునిముద్దు
   భార్యలిద్దఱు శ్రీరామభద్రునకును.

సమస్య:—తలలొక్కేపది నాల్గు కానఁబడియెన్ దద్గౌరువక్షంబునన్

మ. లలితాకారుఁ గుమారు షణ్ముఖునిఁ దా లాలించి చన్నిచ్చుచో
   గళలగ్నగ్రహరత్నదీప్తకళికాగాంభీర్యహేమాంచితో
   జ్జ్వలరత్నప్రతిబింబితాననములన్ శంభుండు వీక్షింపఁగాఁ
   దలలొక్కేఁబదినాల్గు కానఁబడియెన్ దద్గౌరువక్షంబునన్.

సమస్య:—గుత్తఁపుతాపుతారవికకుట్టు పటుక్కున వీడె నింతికిన్

ఉ. అత్తఱిఁ జిత్తజుండు విరహాంగనల న్గనలింప నిక్షువి
   ల్లెత్తి ధనుర్గుణంబు మెఱయించి నిశాతవినూతనప్రసూ
   నోత్తమబాపఙ్క్తిఁ గుచయుగ్మమదాటునఁ దాఁక నేసినన్
   గుత్తఁపుతాపుతారవికకుట్టు పటుక్కున వీడె నింతికిన్.

సమస్య:—ప్రభువుగారు మరల నాసమస్యనే యింకొకరీతిగాఁ బూరింపుమనఁగా

ఉ. ఇత్తఱి రమ్మురమ్మనుచు నింపుగఁ గొల్లలు తన్నుఁ బిల్వఁగాఁ
   దత్తరపాటున న్గదిసి తాండవకృష్ణుఁడు సుందరాంగిఁ దా
   మెత్తనిపూలపాన్పునను మెచ్చి కవుంగిటఁ జేర్చినంత నే
   గుత్తఁపుతాపుతారవికకుట్టు పటుక్కున వీడె నింతికిన్.

సమస్య:—ఇనశశిబింబయుగ్మ ముదయించె దినాంతమునందుఁ దద్దిశన్

చ. ఇనసమతేజ! మీరు సెలవిచ్చినపీఠము హేమరత్నసం
   జననము మేరుప్రస్తరము జక్కఁగఁ దీర్చితిఁ బక్షమయ్యె నే
   ర్పున సురకోటుల న్దిశలఁ బొల్పుగ వ్రాయుచు రాఁగనేఁటికా
   యిన శశిబింబయుగ్మ ముదయించెఁ దినాంతమునందుఁ దద్దిశన్.

సమస్య:—మార్తాండుం డపరాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్నకాలంబునన్

శా. కీర్తింపం దగు రాయసాయకమహాగ్నిజ్వాలశుంభన్నిశా
   వర్తిన్ రావణుఁ గాంచి నారదుఁడు దేవాధ్యక్షుతోఁ బల్కె న
   ట్లార్తిన్ జెంద మిమున్ జయించుఁగద! మున్నత్యుగ్రుఁడై దైత్యరా
   ణ్మార్తాండుం డపరాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్నకాలంబునన్.

సమస్య:—చూతుమెలవుఁడా! యటంచు సుందరి పలికెన్

క. ఖ్యాతిగల రామచంద్రుఁడు
   చేతోమోదంబుతోడఁ జెలఁగుచు నెంతో
   ప్రీతిగ నిటుఁ జనుదెంచును
   చూతుమె! లవుఁడా యటంచు సుందరి పలికెన్.

సమస్య:—అక్కా! రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్

క. రక్కసివలె నేప్రొద్దును
   మెక్కుచుఁ దిరిగెదవు కాలిమెట్టున నిన్నున్
   గుక్కక మానను దసి నీ
   యక్కా! రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్.

సమస్య:—కప్పకు సంపంగినూనె కావలె వింటే

క. ఇప్పుర మేలెడు పార్థివుఁ
   డిప్పుడు నీతావు కనిచె నిదిగో యార్యా
   తెప్పున నంగడితలుపులు
   కప్పకు సంపంగినూనె కావలె వింటే.

సమస్య:—రారా తమ్ముఁడ రార యన్న యనె నారాజాస్య ప్రాణేశ్వరున్

శా. గారాబల్లుఁడు నర్జునుండు శ్వశురాగారంబునం దుండఁగా
   నీరేజాస్య సుభద్ర వచ్చి యతని న్వీక్షించి పెన్సిగ్గున
   న్బారన్ జొచ్చిన సత్య పట్టుకొని యింపారంగ నయ్యర్జునున్
   “రారా తమ్ముఁడ! రార యన్న” యనె నారాజాస్యప్రాణేశ్వరున్.

సమస్య:—రామాయణార్థము వచ్చునట్లు;
   తోఁచునడంగు వెండియును దోఁచునడంగు మెఱుంగుచాడ్పునన్


ఉ. తోఁచకపట్టి తె మ్మనుచుఁ దొయ్యలి వేఁడిన వెంట నంటి చేఁ
   జూచుచు మెల్లమెల్లఁగను జాడల జాడల నాశ లాశలన్
   నాచుకవచ్చు రామరఘునాయకుముందర మాయలేడి తాఁ
   దోఁచునడంగువెండియును దోఁచునడంగు మెఱుంగుచాడ్పునన్.

సమస్య:—వెండియు నాసమస్యనే రామాయణార్థము వచ్చునట్లే పూరించుమనఁగాఁ గవి యిట్లు పూరించెను.

ఉ. పీఁచ మడంచి రాఘవకపిప్రవరాదులు వాల్మగంటి మ
   న్నేఁచఁగ మిన్నుమన్ను దిశలెచ్చటి వచ్చటఁ గాలఁగారవిన్
   గ్రాచు శరాగ్నికీలల జగంబులు ఘూర్ణిల నింద్రజిత్తు తాఁ
   దోఁచు నడంగు వెండియును దోఁచు నడంగు మెఱుంగుచాడ్పునన్.

సమస్య:—మరల దానినే భాగవతార్థము వచ్చునట్లు చెప్పుమనఁగాఁ జెప్పినది.

ఉ. పూచినమాటపట్లఁ దలపోయఁగలేక మనోభవుండు ప్రే
   రేచ గణాలునాలుఁ దనురెప్పలనార్పక చూడఁగా మనం

   బాచఁగలేనియట్టిత్రిపురారిపురస్థలి శౌరి నారియై
   దోఁచునడంగు వెండియును దోఁచునడంగు మెఱుంగుచాడ్పునన్.

సమస్య:—భామాకుచమండలంబు భస్మంబాయెన్

క. కామాతురుఁడై జంగము
   ప్రేమంబున బూతిఁబూసి ప్రియ మలరంగాఁ
   కామిని గౌఁగిటఁ జేర్చిన
   భామాకుచమండలంబు భస్మంబాయెన్.

సమస్య:—కుటిలాలకయెడమకన్ను కుడికన్నాయెన్

క. నిటలమున నీవు దాల్చిన
   పటుతరకస్తూరిరేఖ బహుగతిరతిచే
   నటునిటుజారినచెమటకుఁ
   గుటిలాలక! యెడమకన్ను కుడికన్నాయెన్.

సమస్య:—కామినికుచమధ్యమందు గరుడుం డాడెన్

క. చేమంతిచెట్టుపొంతను
   భామామణి నిదుర వోవఁ బయ్యెద జారన్
   రోమావళి పామోయని
   కామిని కుచమధ్యమందు గరుడుం డాడెన్.

సమస్య:—పాతరలో సూర్యుఁ డుదయపర్వత మెక్కెన్

క. ఈతఱిఁ గాపులఁ బిలువుఁడి
   రాతిరిప్రొద్దెల్ల జాత రాయెను ధాన్యం
   బాతురముగఁ బోయింతము
   పాతరలో సూర్యుఁ డుదయపర్వత మెక్కెన్.

సమస్య:—బడబానలపఙ్క్తిమీఁదఁ బచ్చిక మొలిచెన్

క. పడఁతిరొ! నవమేఘంబులు
   విడిఁబడి జడిముసురుఁబట్టి విలయపువానల్
   కడుఁగొట్టి కురియఁ గోడలు
   బడ బానలపఙ్క్తిమీఁదఁ బచ్చిక మొలిచెన్.

సమస్య:—ధారములేనిహారము నితంబిని! నీ కెవఁ డిచ్చెఁ జెప్పవే

ఉ. భూరివివేకులౌ విటులఁ బూఁబొదరిండ్లను గూడి వారిచే
   గోరిన భూషలెన్నొకొని కోమలి ధారిణివైతి వందులో
   హారము లుల్లసిల్లఁగ మహీప్రవరుల్ వినుతింపఁ బచ్చలా
   ధారములేనిహారము నితంబిని! నీ కెవఁ డిచ్చెఁ జెప్పవే.

సమస్య:—నూఱు న్ముప్పదియాఱు కన్ను లమరెన్ రుద్రాణివక్షంబునన్

శా. రారమ్మంచుఁ గుమారు నంకముపయిన్ రంజిల్లఁగా నుంచి వి
   స్తారోద్యద్ఘనవక్త్రపంచకముతో శంభుండుఁ దత్కాంతయున్
   ఆరూఢిన్ ఘనపంచరత్నపతకం బాలోకనన్ జేయఁగా
   నూఱు న్ముప్పదియాఱుకన్ను లమరెన్ రుద్రాణివక్షంబునన్.

సమస్య:—ఇంకం గస్తురిబొట్టుఁ బెట్టకుము తన్వీ! ఫాలభాగంబునన్

శా. పంకేజానన నేఁటిరేయి వినుమీ పంతంబుతో రాహు వే
   శంకాతంకము లేక షోడశకళాసంపూర్ణు నేణాంకునిం
   బొంకం బార్చెద నంచుఁ బల్కెను తగం బొంచుండి నే వింటి నీ
   వింకం గస్తురిబొట్టుఁ బెట్టకుము తన్వీ! ఫాలభాగంబునన్.

సమస్య:—వర్షాకాలము వచ్చె గ్రీష్మమువలె న్వైశాఖమాసంబునన్

శా. హర్షం బెట్లగు? కృష్ణదేవుఁ డిటకై యబ్జాక్షి! రాఁడాయె సా
   మర్షాహంకృతిఁ జంద్రుఁ డేచుతరి భీమద్వేషసామోగ్రదు
   ర్ధర్షక్రూరనిశాతఘాతనవచూతవ్రాతబాణావళీ
   వర్షాకాలము వచ్చె గ్రీష్మమువలెన్ వైశాఖమాసంబునన్.

సమస్య:—వక్త్రంబుల్పది కన్ను లైదు కరము ల్వర్ణింపఁగా వేయగున్

శా. ఈక్త్రాప్రాసము కష్టమౌననుచు మీ రింతేసివారాడఁగా
   వాక్త్రాసంబది సత్వవీశ్వరులత్రోవ ల్గామినేఁ జెప్పెదన్
   దిక్త్రారాతికిఁ బార్వతీశ్వరులకున్ దిగ్మప్రభారాశికిన్
   వక్త్రంబు ల్పది కన్ను లైదు కరము ల్వర్ణింపఁగా వేయగున్.

సమస్య:—మరుఁడు దొనఁజూపె యముఁడు కింకరులఁజూపె

గీ. భరతకులవీరుఁ డైనట్టి పాండురాజు
   మాద్రిపై దృష్టిఁబఱపిన మగువ యంత
   వలదు వలదని వారింప వాంఛఁగదియ
   మరుఁడు దొనఁజూపె యముఁడు కింకరులఁ జూపె.

సమస్య:—చందురులో నిఱ్ఱి నేల చంగలిమేసెన్

క. కందర్పహరుఁడు నరుఁడును
   పందికినై పోరిపోరి పరిపరిగతులన్
   గ్రిందైవహరుని శీర్షపుఁ
   జందురులో నిఱ్ఱి నేలచంగలిమేసెన్.

సమస్య:—ఉత్తరమున భానుబింబ ముదయం బాయెన్

క. అత్తుగఁ దూరుపుఁబడమరఁ
   జిత్తరువు లిఖించి నిదురఁ జెందితి నౌరా
   చిత్తరువు వ్రాయఁబోవలె
   నుత్తరమున భానుబింబ ముదయం బాయెన్.

సమస్య:—కప్పను జూడంగఁ బాము గడగడ వడఁకెన్

క. కుప్పలకావలి కేగఁగఁ
   జెప్పులు కఱ్ఱయునుఁ బూని శీఘ్రముగాఁగన్
   జప్పుడుఁ జేయుచు జనువెం
   కప్పను జూడంగఁ బాము గడగడ వడఁకెన్.

సమస్య:—రామాయణార్థము వచ్చునట్లు
నిను నిను నిన్ను నిన్ను మఱినిన్నును నిన్నును నిన్ను నిన్నునున్


చ. అనిలజ! జాంబవంత! కమలాప్త తనూభవ! వాయుపుత్ర! యో
   పనస! సుషేణ! నీల! నల! భానుకులుండగు రాఘవేంద్రుఁ డ
   ద్దనుజపురంబు వేగెలువ దైత్యులఁ జంపఁగ వేగరమ్మనెన్
   నిను నిను నిన్ను నిన్ను మఱినిన్నును నిన్నును నిన్ను నిన్నునున్.

అదే సమస్య:—భారతార్థము వచ్చునట్లు;

చ. అనఘసురాపగాతనయ! యర్కతనూజ! విచిత్రవీర్యనం
   దన! గురుపుత్ర! ద్రోణ! కృప! నాగపురీశ్వర! దుస్ససేన! ర
   మ్మనుమనె రాజసూయము యమాత్మజుఁ డిప్పుడు చేయఁబూని తా
   నిను నిను నిన్ను నిన్ను మఱినిన్నును నిన్నును నిన్ను నిన్నునున్.

ఆసమస్యనే:—భాగవతార్థము వచ్చునట్లు పూరించినవిధము;

చ. అనఘసురేశ! వాయుసఖ! అర్యమనందన! రాక్షసేంద్ర! యో
   వననిధినాథ! గంధవహ! వైశ్రవణా! నిటలాక్ష! తాను
   రమ్మనుమని చెప్పె మాధవుఁడు మారునిపెండ్లికి మిమ్మునందఱిన్
   నిను నిను నిన్ను నిన్ను మఱినిన్నును నిన్నును నిన్ను నిన్నునున్.

సమస్య:—పసిఁడిసళాకుతీఁగెకును బర్వతము ల్వికసించి నవ్వఁగన్

చ. విసువక పల్లవాళిఁదిని వేడ్కఁ బికంబులు మ్రోయఁగా వసం
   తసమయహేమకారకుఁడు తద్దయు వేడుక భూషణంబులన్
   బస వనలక్ష్మిఁ గూర్చుకొని భాసిలు సంపగిపువ్వు పేరిమే
   ల్పసిఁడిసళాకుతీఁగెకును బర్వతము ల్వికసించి నవ్వఁగన్.

సమస్య:—ఎలుకలు తమకలుఁగులోని కేనుఁగు నీడ్చెన్

క. ఇలలో నిద్దఱురాజులు
   మలయుచుఁ జదరంగమాడి మాపటివేళన్
   జల మెత్తి కట్ట మఱచిన
   నెలుకలు తమకలుఁగులోని కేనుఁగు నీడ్చెన్.

సమస్య:—మీనాక్షికిఁ గుచములారు మీనశరీరా!

క. సూనశరుఁడు నారసమునఁ
   బూనిక సుమకందుకములఁ బొసఁగించె ననం
   గాను విలసిల్లె నెంతయు
   మీనాక్షికిఁ గుచము లారు మీనశరీరా!

సమస్య:—రండాగమనంబుఁ జేయ రమ్యంబ యగున్

క. కుండినపరమున రుక్మిణి
   చండికకుం బూజసలుపుసమయంబున కా
   యండజవాహనుఁ దోడ్కొని
   రం డాగమనంబుఁ జేయ రమ్యంబ యగున్.

సమస్య:—కమ్మలు మోకాళ్ళు తాఁకి ఘలుఘలు మనియెన్

క. కొమ్మను మదనుం డపుడు జ
   వమ్మున నీలోత్పలముల వడి నేయంగా
   సొమ్మసిలి మోము వంచినఁ
   గమ్మలు మోకాళ్ళుదాఁకి ఘలుఘలుమనియెన్.

సమస్య:—నిప్పున నొకచేరెఁ డంత నెత్తురు గాఱెన్

క. కుప్పించి వెలుఁగుదూఁకిన
   గొప్పములిదె నాటె నిపుడు కోమలి వేగన్
   ఉప్పుఁ గొనిరమ్ము కాతము
   నిప్పున నొకచేరెఁ డంత నెత్తురు గాఱెన్.

సమస్య:—సుగ్రీవుని యెడమకాలు శునకము కఱచెన్

క. అగ్రారపునడివీథిని
   నిగ్రహముగ బొమ్మలాట నేర్పుగఁ నాడన్
   విగ్రహము లెత్తమఱచిన
   సుగ్రీవునియెడమకాలు శునకము కఱచెన్.

సమస్య:—గాడిద యేడిచెఁ గదన్న ఘనసంపన్నా

క. ఆడినమాటకుఁ దప్పిన
   గాడిదకొడు కంచుఁ దిట్టఁ గా విని యయ్యో
   వీఁడా నాకొకకొడు కని
   గాడిద యేడిచెఁ గదన్న ఘనసంపన్నా!

సమస్య:—దుగ్ధపయోధిమధ్యమున దుమ్ములురేగె నదేమి చోద్యమో

ఉ. స్నిగ్ధపువర్ణుఁ డీశ్వరుఁడు చిచ్చఱకంటను బంచబాణునిం
   దగ్ధము జేసె నంచు విని తామరసేక్షణు మ్రోల నున్న యా
   ముగ్ధపు లచ్చి మోదుకొనె మోహనగంధము పిండిపిండియై
   దుగ్ధపయోధిమధ్యమున దుమ్ములు రేగె నదేమి చోద్యమో!

సమస్య:—దోగ్ధ్రీధేనువు గర్భమందు పులి కందుల్వుట్టె నుగ్రాకృతిన్

శా. దోగ్ధ్రీవాంతతపోదయా! గుణనిధీ? తేజస్వి! పాపాటవీ
   దగ్ధ్రాక్ష్మానలుఁ డైనకశ్యపున కుద్యద్గర్వుఁడై యాగభు
   గ్ధగ్ధ్రీశుల్ సుతు లుద్భవించిరి బిడౌజావల్లి వీక్షించితే
   దోగ్ధ్రీధేనువు గర్భమందుఁ బులికందుల్ పుట్టె నుగ్రాకృతిన్.

సమస్య:—మతిలేని నరుండు మిగుల మన్నన నొందున్

క. హిత మాచరించువారికి
   హిత మొనరించుచును సుజనహితుఁ డగుచును దు

   ష్కృత మెప్పుడుఁ జేయను స
   మ్మతి లేని నరుండు మిగుల మన్నన నొందున్.

సమస్య:—అస్ఖలితబ్రహ్మచారి కార్గురుపుత్రుల్

క. ఈస్ఖావ్రాసము దుష్కర
   మస్ఖలనత నీయఁదగునె యది సుకవులకున్?
   సస్ఖలితలయి గుహుం గని
   రస్ఖలితబ్రహ్మచారి కార్గురుపుత్రుల్.

ఈరీతి సమస్యల నిచ్చి యిచ్చి తుదకేమియుఁ దోఁపక— ఇఱుకరాదు; కొఱుకరాదు; నఱుకరాదు; పెఱుకరాదు; అను నాల్గుపదములతోఁ బద్యముఁ జెప్పుమని కోరఁగా కవి—

గీ. ఇఱుకరాదుచేత నిసుమంత నిప్పైనఁ
   గొఱుకరాదు యినుము కొంచె మైన
   నఱుకరాదు నీరు నడిమికి రెండుగాఁ
   బెఱుకరాదు బావి పెల్లగిలఁగ.

అని పూరించెను. సమస్యలు పూర్తియైన పిమ్మట— “షా” యను నక్షరముతోఁ బ్రారంభించి, “క్షా” యను నక్షరముతో ముగించుచు నొక కొన్ని కందపద్యములు శ్రీరామస్తవముగా రచింపుఁడని రాజు గోర తత్క్షణమే వేంకనకవి యారీతి నొకశతకమే రచించెనఁట. కాని ప్రస్తుత మొక నాలుగుమాత్రమే ప్రచురింప నోచితిమి.

షాదిక్షాంతకందములు

క. షాక్షరమాదిగఁ జెప్పెద
   నీక్షణమునఁ గందపద్యనివహము వరుసన్
   వీక్షింపర దయతో నిటు
   రాక్షసహర! రామ! మోక్షరామాధ్యక్షా!

క. షడ్రాజన్యాంబరయుత
   రాడ్రతవర్గస్తుతామరస్సరసీజా
   తేడ్రుడ్యాగారపరి
   వ్రాడ్రీవర! రామ! మోక్షరామాధ్యక్షా!

క. షణ్మిధనాంభస్సంభవ
   రాణ్మానితనూత్నరత్నరాజన్ముకుటో
   ద్యన్మండితాంతరీక్ష వి
   రాణ్మూర్తీ! రామ! మోక్షరామాధ్యక్షా!

క. షట్పదలసితోద్యస్మిన్
   త్రిట్పదలాంగప్రకాశధీరాజితగ్రా
   జట్పదజటిపటనానా
   రాట్పూజిత! రామ! మోక్షరామాధ్యక్షా!

రాజు వెంకనకవికిఁ గల పాండిత్యమును, ఆశుధారాపాటవమును, సమయస్ఫూర్తి చాతుర్యమును గ్రహించి నూటపదార్లు బహుమాన మొసంగి, విలువగల వలువలు కట్టఁబెట్టెను. ఆసభలోనున్న పండితు లంతఱును వేంకనకవి ‘కభినవాంధ్రకవితాపితామహ’యను బిరుద మొసంగి పద్యంబుల స్తోత్రములు చేసిరి. అప్పుడు వేంకన తనయొద్దనున్న నూటపదియాఱు రూప్యముల నాసభలోని పండితుల కొసఁగి పిమ్మట తన కొసంగిన జరీపుట్టములను పేలికలుగాఁ జించి యొక్కొక్కపండితున కొక్కొక్కపేలిక నిచ్చెను. అప్పు డందఱును నివ్వెరపడి చూచుచుండిరి. మంత్రిగా “రయ్యా! ఇదేమి యన్యాయము? అంత విలువగల పుట్టములను గోచులుగాఁ జించినా”రని యడుగఁగా నాకవిచంద్రుఁడు కోపోద్దీపితుఁడై—

క. యాచమనాయునిత్యాగము
   గోచులకే కాక కట్టుకోకలకౌనా?
   రేచర్లగోత్రమందున
   నీచుం డుదయించి కులము నీఱుగఁ జేసెన్.

అను పద్యముం జెప్పెనఁట! అప్పుడు రాజుగారు “కవీంద్రా! తమ రింత రౌద్రమూర్తు లగుటకుఁ గారణమేమి సెలవిం”డని కోరఁగా మఱింతకోపము రేగి

ఉ. తిట్టుదునా భుజంగవిషదిగ్ధదవానలధాగధైగచి
   ట్చిట్టచిటార్భటీప్రకటశీఘ్రమహోగ్రతదుష్టశిక్షణో
   ద్ఘట్టనవిస్ఫులింగలయకారణదారుణలబ్ధలుబ్ధరా
   ట్పట్టణగోపురధ్వజనిపాతహతాహుతి గాఁగ నుద్ధతిన్.

అని పద్యముం జెప్పెనట! తరువాత పండితు లందఱి ప్రార్థనలపై వెంకన శాంతింజెంది తనకోపకారణమును వచించె నఁట. తత్క్షణమే యాచమనాయఁడు తనయపరాధమును క్షమింపుఁడని ప్రార్థించుచు మఱల నాకవికిని ఆవ్యాకరణపండితునకును దగిన బహుమాన మొనరించి కృతార్థుఁ డయ్యెనఁట.

పిమ్మట నొకనాఁ డీవేంకనకవి వినుకొండపురమున కేఁగి శ్రీరాజామలరాజు వేంకటనరసింహారాయప్రభువుం దర్శింపఁగా నాప్రభువు—ఇతఁడేనా వెంకన? అనెనఁట! అపుడు కవి—అయ్యా వెంకన యితఁడే కాని

మ. ఇతఁడేనా? వినుకొండనామకమనోభీష్టార్థకృత్పట్టణ
   స్థితసామ్రాజ్యరమాదయామృతఝరీచంచత్కటాక్షేక్షణ
   ప్లుతసర్వాంగసమస్తశోభనకళాపుంఖీభవత్స్తుత్యసం
   గతమల్రాజవరాన్వయప్రభవవేంకట్నర్సధాత్రీశ్వరుం;
   డితఁడేనా?—ఇతఁడేనా?—

అనెనట! ప్రభువుగారు వేంకనకవీంద్రుని యసాధారణాశుధారాపాండిత్యములకును ధైర్యమునకును సంతోషించి బహూకరించి పంపిరఁట.

బుచ్చయ్యశాస్త్రి

పంచచామరము. అమీరునంతవానికైన నర్థి జంకఁబోవునా?
               ఢమాముబెట్టుకైనఁ గుండటంకి హెచ్చి మోగునా?
               కమానుఁబట్టలేనిగ్రద్దకయ్య మెర్గఁబోవునా?
               కుమానవాచలేంద్ర! తాడిగొట్లచెన్నకేశవా?

  1. ఈజాతివాండ్రు గొఱ్ఱెయున్నితో గొంగళ్ళ నేయుదురు. వారు గట్టుకొనుట కట్టిబట్టలే యుపయోగింతురఁట.
  2. ఈపద్యము శైలినిబట్టియుఁ దెనాలిరామకృష్ణకవితరువాతివాఁడగు సూరనను బేర్కొనుటంబట్టియు, నంత విశ్వసనీయముగఁ దోఁపదు.