ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

GOVERNMENT OF ANDHRA PRADESH

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf
BUDGET SPEECH బడ్జెట్ ప్రసంగము 2019-20
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf

యనమల రామకృష్ణుడు

ఆర్ధిక మంత్రి

Yanamala Ramakrishnudu

Minister for Finance

2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ సమర్పిస్తూ 5 ఫిబ్రవరి, 2019న గౌరవనీయ ఆర్థికశాఖామాత్యులు శ్రీ యనమల రామకృష్ణుడుగారు చేసిన ప్రసంగం

గౌరవనీయ అధ్యక్షా! మరియు సభ్యులారా!

తమ అనుమతితో 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనలు ఈ గౌరవ సభకు సమర్పిస్తున్నాను.

2. నా పదకొండవ బడ్జెట్‌ను, చారిత్రాత్మకమైన అమరావతిలో, వరుసగా మూడవసారి సమర్పించే అవకాశం రావడం గర్వకారణం.

3. అధ్యక్షా! బడ్జెట్ ప్రతిపాదనలను వివరించటానికి ముందుగా జూన్ 2014లో మనం క్రొత్త రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుండి ఈ రోజు వరకు జరిగిన ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్ళను, వాటిని అధిగమించిన తీరును మననం చేసుకోవడం, ముఖ్యాంశం. హేతుబద్దత లేకుండా జరిగిన రాష్ట్ర విభజన వల్ల రాజధాని నగరాన్ని కోల్పోవడం, సరియైన పద్దతిలో ఆదాయ-వ్యయాలను, ఆస్తులు-అప్పులను సక్రమంగా పంపిణీ చేయకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా నిరాశ, నిస్పృహలు ఆవరించాయి.

4. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో, అపారమైన పరిపాలన అనుభవం; జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి; అనేక సవాళ్ళను ధీటుగా ఎదుర్కొనే శక్తి, నూతన రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధి చేయగల సత్తా మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికే ఉందనే గట్టి నమ్మకంతో రాష్ట్ర ప్రజానీకం యావత్తూ ఆయనపై తమ ఆశలను, నమ్మకాన్ని ఉంచారు.

5. ఇప్పటివరకు మనం సాధించిన పురోగతిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. 5 సంవత్సరాల క్రితం ఉన్నప్పటి పరిస్థితులను బేరీజు వేసుకోవడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అప్పట్లో రాష్ట్ర ఆర్థిక మనుగడపై భయాందోళనలు ఉన్నాయి. కనీసం ఉద్యోగుల జీతాలను, సాధారణ ఖర్చులను కూడా చెల్లించలేరన్న అనుమానాలు అనేక మందిలో ఉండేవి.

6. ఆప్పటి పరిస్థితుల్లో:

  • దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో మన రాష్ట్రం ఒకటిగా నిలబడి, వరుసగా మూడేళ్ళు రెండంకెల వృద్ధిని సాధించగలదని ఊహించామా?
  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రగామి రాష్ట్రంగా ఉంటూ, విదేశీ పారిశ్రామికపెట్టుబడులను ఆకర్షించడంలో ముందంజలో ఉంటామని అప్పట్లో అంచనా వేశామా!
  • ప్రపంచ వ్యాప్తంగా అత్యున్నత నమూనాలతో అంతర్జాతీయ వేదికలపై ప్రశంసించబడి,అందరి దృష్టిని ఆకర్షించేలా అంతర్జాతీయ స్థాయి నగరంగా నిలిచే ప్రజా రాజధాని అమరావతిని నిర్మిస్తామని మనం కలగన్నామా?
  • వినూత్నంగా నిర్మితమయే మన రాజధాని నగరం అమరావతికి 28,074 మంది భూయజమానులు భూసమీకరణ విధానం ద్వారా స్వచ్చందంగా తమ భూములను ఇవ్వటానికి ముందుకు వస్తారని; 2,28,559 మంది ఉదారంగా విరాళాలు ఇస్తారని ఆశించామా?
  • 70 ఏళ్ళ ఆంధ్రుల కల, మనరాష్ట్ర జీవనాడి అయిన పోలవరం డ్యామ్ శరవేగంగా పూర్తి అవుతుందని, దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని మనం ఊహించామా?
  • నదుల అనుసంధాన ప్రక్రియలో దేశానికే ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకం అవుతుందనితలచామా?
  • 'మన గడ్డమీద నుంచే మన పరిపాలన' మరియు మన న్యాయవ్యవస్థ అమరావతి నుండే కొనసాగాలన్న కల ఇంత స్వల్ప సమయంలో నెరవేరగలదని అనుకొన్నామా?
  • రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు అభివృద్ధి చేయగలమని అప్పట్లో ఊహించామా?
  • తీవ్ర ఆర్థిక లోటులో కూడా, పెద్ద ఎత్తున రైతులకు సంపూర్ణ ఋణమాఫీ చేస్తామని, స్వయం సహాయక మహిళా సంఘాలకు 'పసుపు-కుంకుమ' అందిస్తామని, పెన్షన్ల మొత్తాన్ని 10 రెట్లు పెంచుతామని, సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకే ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకం అవుతుందని భావించామా?
  • గ్రామీణ జీవన దశలు అన్నింటికీ వర్తించేలా అద్భుతమైన మౌలిక సదుపాయాలను నెలకొల్పే సామర్థ్యాన్ని పెంపొందించి దేశానికే మార్గదర్శకమైన నమూనాని మనం అందిస్తామని అప్పట్లో ఊహించామా?
కానీ, ఇవన్నీ ఈ రోజున నిజంగానే సాధించాము! అందరి కలలను నిజం చేసాము!

Adversity causes some men to break; others to break recods.

-William Arthur Ward, an American author

7. ఎన్నో ప్రతికూలతల నడుమ కూడా అనుకున్న విజయాలను సాధించిన ఈ ప్రభుత్వంలో నేనూ ఒక సభ్యుడిని కావడం నాకెంతో గర్వకారణం. ఇది సాధ్యపడింది అంటే, దానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ముందుచూపు, సమర్థ నాయకత్వమే కారణం. ఆయన సమర్థ నాయకత్వం, అటు రాజకీయ యంత్రాంగానికి, ఇటు ప్రభుత్వ యంత్రాంగానికి మార్గదర్శకంగా ఉంటూ, రాష్ట్ర ప్రజల అపారమైన నమ్మకం పొందేందుకు, కార్యోన్ముఖులు అయ్యేందుకు, స్ఫూర్తినిచ్చింది. కేంద్ర ప్రభుత్వ అరకొర సహాయం, రాష్ట్ర సమస్యలను మరింత జఠిలం చేసినప్పటికీ, నాయకత్వ సామర్థ్యంతో, అధికార యంత్రాంగు తోడ్పాటుతో, అభివృద్ధి పథంలో మన ప్రభుత్వం కొనసాగింది అనేది మనం మరువకూడని అంశం.

8. ప్రజలిచ్చిన బాధ్యతను, వినమ్రతతో, అంకిత భావంతో తన భుజస్కందాలపై వేసుకొని 2022 నాటికి అభివృద్ధి చెందుతున్న మొదటి 3 రాష్ట్రాలలో ఒకటిగా, 2029 నాటికి అభివృద్ధి సాధించిన ఉత్తమ రాష్ట్రంగా రూపొందేందుకు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రిగారు నిర్దిష్టమైన దిశా నిర్దేశం చేసారు. సమాజ వికాసం, కుటుంబ వికాసం మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు అహర్నిశలు కృషి చేస్తూ, రాష్ట్ర ప్రజలందరూ ఆనందంతో, పూర్తి సంతృప్తితో జీవితాన్ని గడపాలన్న లక్ష్యంతో గత ఐదేళ్ల పరిపాలనను ముందుండి నడిపించారు.

9. సమాజంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలపట్ల మా ప్రభుత్వం పూర్తి జాగురూకతతో ఉంది. అందుకే మా ప్రభుత్వం, అన్ని వర్గాల సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమ లక్ష్యంగా, సమానత్వ ప్రాతిపదికను (Gini C0-efficient) అందిపుచ్చుకున్నాము. తల్లి గర్భంనుండి జీవితాంతం వరకు ప్రతి దశలోనూ సంక్షేమాన్ని అమలు చేస్తున్న స్పూర్తిదాయకమైన ప్రభుత్వం ఇది. వ్యాపార, వాణిజ్యాభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించడంతో పాటు సమాజంలో పేదరిక నిర్మూలన, ఆహార భద్రత, సమ్మిళిత అభివృద్ధి, సేవల అందజేత; రైతులు, అసంఘటిత కార్మికులు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, మహిళలు, శిశువులు, యువత, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్ మరియు వయోవృద్ధులకు సాధికారత కల్పించడానికి, మా ప్రభుత్వం చేపట్టిన చర్యలు, పాటించిన విధానాలు, చేసిన కృషి, సత్ఫలితాలను ఇచ్చాయి. నీటిపారుదల, వ్యవసాయోత్పత్తి మరియు ఉత్పాదకత, ఆహార భధ్రత, అందరికీ పక్కా ఇళ్ళు, సురక్షిత త్రాగునీరు, పారిశుధ్యం, నిరంతర విద్యుత్, రోడ్లనిర్మాణం, విద్యా నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య భద్రత, జీవనోపాధి అవకాశాలు, సామాజిక భద్రత, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి రంగాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగవంతమైన అభివృద్ధిని నమోదు చేసింది.

మహిళా సాధికారత మరియు వికాసము

10. పురుషులతో మహిళలు పోటీ పడే (జెండర్ ఈక్విటీ) సమాజం ఏర్పాటే మా ప్రభుత్వ లక్ష్యం. మహిళా సాధికారత మరియు మహిళల్లో శక్తి సామర్థ్యాలను వెలికి తీయటం కోసం వారికి ఆర్థిక స్వాతంత్ర్యం

కల్పించటం, అత్యున్నత విద్య, మెరుగైన ఆరోగ్యం మరియు పోషకాహారాన్ని అందించటం, కార్మిక వర్గాన్ని భాగస్వామ్యం చేయటం మరియు ఇంటా బయటా భద్రత కల్పించటం తదితర చర్యలను విస్తృతపరిచేందుకు మా ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తోంది.

11. గౌరవ ముఖ్యమంత్రిగారు సదా మహిళా సాధికారత కోసం బలంగా వాదించేవారు. రెండు దశాబ్దాల క్రితం ఆయన ప్రారంభించిన 'వెలుగు' పథకం అన్ని వర్గాలతో కూడిన 94 లక్షల మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు విస్తరించి ప్రపంచంలోనే అతి పెద్ద పేదరిక నిర్మూలన కార్యక్రమంగా నిరూపితమైనది. ఈ పథకం ద్వారా లబ్ధిపొందినవారిలో 17 లక్షల మంది షెడ్యూల్డు కులాలవారు, 5 లక్షల మంది షెడ్యూల్డు తెగలవారు, 46 లక్షల మంది వెనుబడిన తరగతులవారు, 5 లక్షల మంది మైనారిటీవారు, 21 లక్షల మంది జనరల్ కేటగిరివారు ఉన్నారు.

12. 2014 సంవత్సరంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి స్వయం సహాయక సంఘాలపై విపరీతమైన ఆర్థిక వత్తిడి ఉంది. మహిళాసాధికారత లేనిదే సమాజ వికాసం మరియు కుటుంబ వికాసం సాధించలేమన్న గట్టి నమ్మకంతో, ఆర్ధిక ఒత్తిళ్ళకు కూడా నెరవకుండా 'పసుపు కుంకుమ” పథకాన్ని మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి స్వయం సహాయక సంఘ సభ్యురాలికి రూ.10,000 చొప్పున ఆర్ధిక సహాయం ఈ పథకం ద్వారా అందచేయడమైంది. రూ.8,604 కోట్ల మేర 86,04,304 స్వయం సహాయక సంఘ సభ్యులకు దీనిద్వారా లబ్దిచేకూరింది.

13. డ్వాక్రా మరియు మెప్మా ఆడపడుచుల అందరి బాధ్యత భుజాన ఎత్తుకున్న "అన్న"గా, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు నడుం కట్టారు. గతంలో ఇచ్చిన దానికి అదనంగా మరోమారు 10,000 రూపాయలు ఇవ్వాలని, 2019 ఫిబ్రవరిలో 2500 రూపాయలు, మార్చిలో 3500 రూపాయలు మరియు ఏప్రిల్లో 4000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. దీని ద్వారా రాష్ట్రంలోని 93.81 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 9,381 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుంది.

14. మా ప్రభుత్వం బ్యాంక్ అనుసంధాన విధానాన్ని 63,283 కోట్ల రూపాయలతో 20,50,794 స్వయం సహాయ సంఘాలకు విస్తరించేసింది. స్త్రీ నిధి ద్వారా లబ్దిదారుల సంఖ్యను రెట్టింపు చేస్తూ 16.77 లక్షల మందికి 4,313 కోట్ల రూపాయల వ్యయంతో 2014-15 నాటికంటే 5 రెట్ల ఋణాలను అందించటం జరిగింది. వడ్డీలేని ఋణాల నిమిత్తం 2,514 కోట్ల రూపాయలు 8.5 లక్షల స్వయం సహాయక సంఘాలకు చెల్లించడం జరిగింది.

15. ప్రామాణిక ఉద్యోగులతో పాటుగా ఒప్పంద ఉద్యోగులు, పొరుగు సేవల ఉద్యోగులకు కూడా 180 రోజుల ప్రసూతి సెలవు వసతిని మా ప్రభుత్వం కల్పించింది. మహిళలు ప్రభుత్వ ఉద్యోగాలలో మరింతగా పాలుపంచుకొనే దిశగా ఈ చర్య దోహదపడుతుంది.

16. ప్రభుత్వ పాఠశాలలో బాలికల నమోదును పెంపొందించి, మధ్యలోనే విద్యను విరమించే వారి నిష్పత్తిని తగ్గించే లక్ష్యంతో 'బడికొస్తా' పథకాన్ని మాప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 1.87 లక్షల బాలికలకు సైకిళ్ళు అందించబడ్డాయి. కిశోరప్రాయంలోని బాలికలను తిరిగి పాఠశాలలో భర్తీ అయ్యే దిశగా ప్రోత్సహించడానికి, వారికి మెరుగైన పోషక విలువలతో కూడిన పౌష్టికాహారాన్ని మరియు ఇతర శిక్షణలను 'సబల' పథకం ద్వారా అమలు చేస్తున్నాము.

17. మా ప్రభుత్వం ప్రారంభించిన 'తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్' పథకం ద్వారా 7.19 లక్షల మహిళలకు ప్రసూతి అనంతరం లబ్ది చేకూర్చింది. 6.91 లక్షల మంది తల్లులుకు ఎన్.టి.ఆర్. బేబీ కిట్లను పంపిణీ చేసాము. అదనపు పౌష్టికాహార కార్యక్రమం ద్వారా 6 సంవత్సరాల లోపు 30.49 లక్షల బాలబాలికలకు; 6.19 లక్షల గర్భిణీ స్త్రీలు, బాలింతలకు; అదనపు పోషకాలతో కూడిన ఆహారాన్ని సమకూరుస్తూంది. మెరుగైన పోషకాహారం అందించే 'అన్న అమృత హస్తం' ద్వారా బరువు తక్కువగా జన్మించే పిల్లల సంఖ్యను తగ్గించటం, ప్రసూతి సమయంలో సంభవించే మరణాలను అరికట్టటం మా ప్రభుత్వ లక్ష్యం.

18. ఇప్పటికే ఉన్న అనుబంధ పోషకాహార కార్యక్రమానికి అదనంగా, 'బాలసంజీవని' ప్రత్యేక ఆహార పథకం పథకం ద్వారా షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల బాలబాలికలు, గర్భిణీ స్త్రీలు బాలింతలు; మరియు సాధారణ తరగతులకు చెందిన పిల్లలలో పౌష్టికాహార లేమిని, రక్తహీనత మరియు ప్రమాదావకాశమున్న గర్భిణీ స్త్రీలను మా ప్రభుత్వం ఆదుకుంటుంది. గిరి గోరుముద్దలు పథకం అమలు ద్వారా 1.45 లక్షల గిరిజన ప్రాంత పిల్లలలోని పౌష్టికాహార లేమిని రూపుమాపే ప్రయత్నం జరుగుతుంది.

19. 'దీపం' పథకాన్ని ఇంధన భద్రతగానే కాక కట్టెలు వాడే సమయంలో వచ్చే పొగ వలన కలిగే ఆరోగ్య సమస్యల నుండి రక్షణ కలిగించే మార్గంగా మరియు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటుగా మా ప్రభుత్వం భావిస్తుంది. ఇంతకు ముందు 15 సంవత్సరాలలో 25.82 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లను ఇవ్వగా, గత నాలుగున్నర సంవత్సరాలలోనే 30.61 లక్షలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 1.55 కోట్ల కనెక్షన్లలతో నూరు శాతం కుటుంబాలకు వంట గ్యాస్‌ను అందిస్తూ కిరోసిన్ మరియు పొగ విముక్తి రాష్ట్రంగా మనరాష్ట్రం ప్రకటించబడింది అని ఈ గౌరవ సభకు తెలియచేయటానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను.

20. 15 లక్షల స్వయం సహాయ సంఘాల మహిళలు మరియు 10 లక్షల ఇతర కౌమార బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత మెరుగుపర్చటానికి మా ప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో రక్ష పథకాన్ని ప్రవేశపెట్టి శానిటరీ నాప్‌కిన్లు పంపిణీచేస్తుంది.

21. మహిళలకోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గురించి వివరించడానికి, హింసకు గురైన మహిళల సహాయార్ధం తక్షణ అత్యవసర ప్రతి స్పందనను అందించడానికి, 24 గంటలు పనిచేసే ప్రత్యేక హెల్ప్ లైన్‌తో పాటు 13 జిల్లా కేంద్రాలలో One Stop Center (OSC) లను మా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.

రైతుల సంక్షేమం

22. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూలవార్షికోత్పత్తిలో 32 శాతం వాటాను వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ శ్రామిక వర్గంలోని షుమారు 58 శాతం అందిస్తున్నారు. ఈ కారణంగా, మా ప్రభుత్వం ఈ రంగాన్ని పరిపూర్వక అభివృద్ది పెంపొందించే క్రమంలో కీలకమైన భాగస్వామిగా పరిగణిస్తుంది. ఋణమాఫి మరియు మెరుగైన ఉత్పాదక రాయితీల ద్వారా వ్యవసాయ వ్యాకులతను ఉపశమింప చేయటం మా ప్రధాన వ్యూహంగా భావిస్తూ రైతుల ఆదాయం స్థిరంగా వృద్ధి చేయటానికి కరువు నివారణ, మెరుగైన పెట్టుబడులు, వ్యవసాయ యాంత్రీకరణ, కౌవులుదారు రైతులకు అరువు సౌకర్యాలను పెంపొందించుట, ధరల హెచ్చుతగ్గుల నుండి రక్షణ కల్పించుట వంటి చర్యలపై దృష్టి సారించటం జరిగింది.

23. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014లో నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని గుర్తించిన మన ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు 'అన్నదాతకి ఆప్త బాంధవుడి'గా 24,000 కోట్ల రూపాయల ఋణభారం నుంచి రైతులను విముక్తుచేశారు. ఆఖరిరెండు వాయిదాలను త్వరలోనే జమచేయడం జరుగుతుంది. ఉద్యాన రంగంలో 2.23 లక్షల మంది రైతులకు 384 కోట్ల రూపాయల ఋణ ఉపశమనం కల్పించాం.

24. మా ప్రభుత్వం రైతులను ఆదుకొనేందుకు మరో వినూత్న పథకం, 'అన్నదాత సుఖీభవ” ప్రవేశపెడుతుంది. 2019-20 సంవత్సరానికి ఈ పథకానికి 5000 కోట్ల రూపాయలను నేను ప్రతిపాదిస్తున్నాను.

25. మా ప్రభుత్వం వివిధ పంటలకు ఇన్పుట్ సబ్సిడీ పెంచి వరి, చెఱకు, ప్రత్తి మరియు వేరుశెనగ పంటలకు ఉన్న రాయితీని 10,000 రూపాయల నుండి 15,000 రూపాయలకు, మొక్క జొన్న పంటకు 8,353 రూపాయల నుండి 12,500 రూపాయలకు, పప్పు ధాన్యాలు మరియు పొద్దుతిరుగుడు పంటకు 6,250 రూపాయల నుండి 10,000 రూపాయలు చేసింది. దీనివల్ల 39.33 లక్షల రైతులు లబ్ది పొందారు.

26. వ్యవసాయ ఆదాయాన్ని స్థిరంగా వృద్ధిచేయుట కొరకు, ఉత్పాదక మెరుగుదలకై సూక్ష్మపోషక రాయితీని 100 శాతానికి పెంచటం మరియు చంద్రన్న రైతు క్షేత్రాలు, పోలం పిలుస్తుంది కార్యక్రమాల ద్వారా వివిధ స్థిరీకరణ చర్యలను బలోపేతం చేయటంపై దృష్టి సారించింది. వ్యవసాయ ఆదాయాన్ని వృద్ధి చేయుటకు, ఆరోగ్యాన్ని ప్రోత్సహించుటకు మరియు పర్యావరణాన్ని పరిరక్షించుటకు మా ప్రభుత్వం 'జీరో బడ్జెట్ సహజ సేద్య విధానాన్ని ప్రోత్సహించింది. ఈ విధానం ఐక్యరాజ్య సమితి మరియు ప్రపంచ ఆర్థిక వేదిక వంటి అంతర్జాతీయ సంస్థలచే ప్రశంసలు అందుకుంది.

27. వ్యవసాయ వ్యయాన్ని తగ్గించటానికి మా ప్రభుత్వం యాంత్రీకరణను ప్రోత్సహిస్తుంది, uberisation ద్వారా యంత్రపరికరాలను పంపిణీ చేస్తుంది. అలాగే, 2.5 లక్షల రూపాయల గరిష్ణ రాయితీతో ట్రాక్టర్లు మరియు rotovator లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించటం జరిగింది. విత్తన పరిశ్రమలో పరిమిత మౌలిక సదుపాయాలను గుర్తించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను విశ్వవిత్తన కేంద్రంగా తీర్చిదిద్ది తద్వారా తక్కువ ధరకు మేలురకమైన విత్తనాలు లభ్యమయ్యే దిశగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన అయోవ (IOWA) రాష్ట్ర విశ్వవిద్యాలయ సౌజన్యంతో కర్నూలు జిల్లాలో 650 ఎకరాల మెగా విత్తన పార్క్‌ను ప్రభుత్వం ఏర్పర్చింది.

28. రాష్ట్రంలో అదనపు భూగర్భ జలాలు లభ్యమయ్యే ప్రాంతాలలో చిన్న, సన్నకారు రైతులనిమిత్తం సోలార్ బోర్ వెల్స్ తవ్వకాన్ని 'ఎన్.టి.ఆర్. జలసిరి Phase-II' కార్యక్రమం ద్వారా మా ప్రభుత్వం 2016-17 సంవత్సరంలో మంజూరు చేసింది. 35,508 లబ్దిదారులకు మేలు చేకూరుస్తూ 88,770 ఎకరాలు సాగులోకి వచ్చాయి.

29. బిందు సేద్యం ద్వారా అధిక రాయితీలను అందిస్తూ, కరువుకు ఆలవాలమైన రాయలసీమను ఉద్యాన సీమగా మార్చటానికి మా ప్రభుత్వం నడుం బిగించింది. తద్వారా వ్యవసాయ GVAలో రాయలసీయ జిల్లాలు అగ్రగామిగా ఎదగటానికి తోడ్పాటులభించి 7.25 లక్షల రైతులకు లబ్ధి చేకూరి 7.3 లక్షల హెక్టార్ల భూమి సస్యశ్యామలమైంది.

30. విలువను జోడించటం ద్వారా రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంపొందించవచ్చు అనే మా ప్రభుత్వ నమ్మకానికనుగుణంగా, ఆహార ప్రక్రియ పరిశ్రమలకు రూ.300 కోట్లు ప్రతిపాదిస్తున్నాను.

31. కనీస మద్దతు లేని పంటల విషయంలో విపణి అనిశ్చితికి రైతులు నష్టపోకుండా ప్రస్తుతమున్న విపణి ప్రమేయ నిధిని 500 కోట్ల రూపాయల నుండి 2019-20 సంవత్సరంలో 1,000 కోట్ల రూపాయలకు పెంచడానికి మా ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది.

32. కౌలు రైతులకు సంస్థాగత ఋణం, పంట భీమా, వ్యవసాయపు పనిముట్లు, ఉత్పాదక రాయితీ వంటి సదుపాయాలు కల్పించడం కోసం భారత దేశంలోనే మొట్టమొదటిసారిగా సాగు ప్రమాణ పత్రాన్ని మా ప్రభుత్వం పరిచయం చేసింది. 2014-15 సంత్సరంలో 1.34 లక్షల కౌలు రైతులు తీసుకున్న ఋణ మొత్తు 272 కోట్ల రూపాయలు కాగా 2018-19 సంత్సరానికి 11.06 లక్షల కౌలు రైతులు 4,957 కోట్ల రూపాయల మేరకు ఋణ సౌకర్యాన్ని పొందారు.

38. పశువుల రంగాన్ని ప్రోత్సహించడానికి, ప్రతి గ్రామంలో పశుగ్రాస ఉత్పత్తిలో స్వయం సాఫల్యతను సాధించేందుకు పశుగ్రాస భద్రతా విధానాన్ని ప్రవేశపెడుతూ 83,396 ఎకరాలలో ఊరూరా పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటు చేయడమైనది. పశుగ్రాసం మరియు ఆహారం అభివృద్దికి గాను 2019-20 సంవత్సరానికి నేను 200 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను. పశువులపై బీమా కొరకు 200 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో నేను కేటాయిస్తున్నాను. మత్స్య పరిశ్రమ రంగానికి ఊతమివ్వడానికి, 2015-16 సంవత్సరంలో యూనిట్ ఒక్కటికి ఉన్న 4.13 రూపాయల చేపల పెంపకంపై విద్యుత్ టారీఫ్ 2018-19 సంవత్సరంలో 2 రూపాయలకు తగ్గించటం జరిగింది.

34. ఈ సంవత్సరంలో 33 శాతం వర్షపాత లోటు ఉన్నప్పటికీ, సమర్థవంతమైన కరువు నివారణ చర్యలు వ్యవసాయ రంగాన్ని 15 శాతం వృద్ధి బాటన నడిపించాయి. రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించటంతోపాటు వారి వ్యాకుల వలసలను ఈ చర్యలు నివారించాయి.

35. గత నాలుగున్నర సంవత్సరాలలో 81,554 కోట్ల రూపాయల వ్యయాన్ని కేటాయించడం, వ్యవసాయాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న శ్రద్దను సూచిస్తుంది. దీని ప్రభావం ఉత్పాదనలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఎదగడానికి తోడ్పడింది. ఉత్పాదకతలో కూడా 2014-15 నుండి ప్రతి సంవత్సరంలో ప్రగతి సాధిస్తున్నాము. మొక్క జొన్న (6,612 కేజీ/హెక్టార్), జొన్న (2,041 కేజీ/హెక్టార్) ఉత్పాదకత సాధించి మొదటి స్థానంలో, వరి (3,540 కేజీ/హెక్టార్) సాధించి రెండవ స్థానంలో నిలిచింది. పాల ఉత్పత్తి 50 శాతం పెరిగి 138.25 లక్షల మెట్రిక్ టన్నులు, మాంస ఉత్పత్తి 45 శాతం పెరిగి 7.08 లక్షల మెట్రిక్ టన్నులు, గుడ్ల ఉత్పత్తి 36 శాతం పెరిగి 1,778 కోట్లకు చేరాయి. సగటున అన్ని రంగాల వృద్ధిరేటు 33.5 శాతంగా ఉన్న మన రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఎదిగింది. చేపల పెంపకం మరియు ఆదాయంలో మొదటి స్థానానికి చేరుకోవటంలో మా ప్రభుత్వం తోడ్పాడందించింది.

యువజన సాధికారత

36. ప్రప్రధమంగా 'యువజన విధానం’ ప్రకటించడం ద్వారా మా ప్రభుత్వానికి యువజన సంక్షేమంపై ఆసక్తిని ప్రతిబింబిస్తుంది. విద్యావంతులైన ప్రతి యువత గౌరవ ప్రదమైన జీవన శైలితో ఉద్యోగాన్ని కలిగి ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రిగారి గట్టి నమ్మకం. ఈ ఉద్దేశ్యానికి అనుగుణంగా, మా ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నెలకు 1,000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి 'యువనేస్తం' పథకాన్ని ప్రారంభించింది. ఇటీవల ఈ భృతిని 2,000 రూపాయలకు పెంచడం జరిగింది.

37. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం క్రింద 4.3 లక్షల మందికి లబ్దిని మంజూరు చేయడం జరిగింది. ఈ పథకాన్ని, ఒక స్థిరీకరణ పద్దతిలో అమలు చేయాలని భావిస్తున్నాము. నిరుద్యోగ భృతిని అందించడంతోపాటు, నిరుద్యోగ యువతను నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో మరియు ఏకీకృత విధానంలో యువజన సంక్షేమం, పరిశ్రమలు, కార్మిక, నైపుణ్యాభివృద్ధి వంటి వివిధ విభాగాలలో ఒక స్థిరమైన ప్రాతిపదికన లాభదాయక ఉపాధిని పొందేందుకు ఈ పథకం దోహదపడుతుంది.

38. SIEMENS సహకారంతో ఒక లక్షమందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యం గల మొత్తు 40 కేంద్రాలను స్థాపించి ఇప్పటివరకు 84,852 అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఉపాధి-ఆధారిత నైపుణ్యాలను అందించడానికి Google, Amazon వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో మా ప్రభుత్వం కలిసి పని చేసింది. పరిశ్రమలతో సన్నిహిత సహకారం కొనసాగించడం ద్వారా వివిధ పరిశ్రమల సంఘాలనుండి ప్రశంసలు అందుకొంటూ CII చే ఉపాధికల్పనలో నెం.1 రాష్ట్రంగా మన రాష్ట్రం గుర్తింపబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఇప్పటివరకు 8.66 లక్షల యువత శిక్షణ పొందారు.

39. మా ప్రభుత్వం ప్రైవేటు రంగాల ద్వారా 7.7 లక్షల ఉద్యోగాలను కల్పించింది. 2.51 లక్షలు ఉద్యోగాలు పెద్ద మరియు బృహత్ ప్రాజెక్టుల నుండి 3.3 లక్షలు మధ్యతరహా, చిన్న సంస్థల నుండి, 1.78 లక్షలు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా, 0.13 లక్షలు APITA ద్వారా సాధించడం జరిగింది. దీనితోపాటుగా, 42,000 పోస్టులకు నియామకాలు జరగడానికి మా ప్రభుత్వం అనుమతులను మంజూరు చేసింది. ప్రభుత్వం చేపట్టిన అనేక నిర్మాణ కార్యకలాపాలు గణనీయమైన సంఖ్యలో ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. సృష్టించబడుతన్న ఉద్యోగాల వివరాలను, నియామకమౌతున్న ఉద్యోగి వివరాలను, పారదర్శకతతో అందరికి అందుబాటులో ఉండే విధంగా online లో ఉంచుతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గౌరవనీయ సభ్యులకు తెలియచేయడానికి గర్వపడుతున్నాను.

సాంఘిక సాధికారత మరియు సంక్షేమం

40. పుట్టుక పరిస్థితులకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు స్వయం సమృద్ధితో, ఆత్మ విశ్వాసంతో ఉండాలనే సంఘటిత విధానాన్ని అవలంభిస్తూ గౌరవ ముఖ్యమంత్రిగారి నాయకత్వంలో మా ప్రభుత్వం సదా కృషి చేస్తుంది. సామాజికంగా వెనుకబడిన - షెడ్యూలు కులాలు, షెడ్యూల్డు తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు - కు శాచురేషన్ పద్దతిలో మా ప్రభుత్వం సంక్షేమ పథకాల క్రింద సహాయాన్ని మరింత విస్తరింప చేస్తుంది.

41. సబ్ ప్లాన్ బడ్జెట్: గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం 32,843 కోట్ల రూపాయలు షెడ్యూల్డు కులాల సంక్షేమానికి, 8,950 కోట్లు షెడ్యూల్డు తెగల సంక్షేమానికి, 28,805 కోట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ఖర్చు పెట్టడం జరిగింది.

42. నూతన కార్పొరేషన్లు: అన్ని వెనుకబడిన వర్గాల సంక్షేమాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం యాదవ, తూర్పు కాపు/ గాజుల కాపు, కొప్పుల వెలమ/పొలినాటి వెలమ, కురుబ/కురుమ, వణ్యకుల క్షత్రియ (వణ్ణ రెడ్డి/వన్ని కాపు/పల్లికాపు/పల్లిరెడ్డి), కళింగ, గవర, చేనేత (పద్మశాలిదేవాంగుల తొగటశాలితొగట-వీర క్షత్రియ/పట్టు శాలితొగట శాలిసేనాపతులశాలివన్), మత్స్యకారులు (అగ్నికుల క్షేత్రయపల్లి/వడబలిజ/బెస్త జాలరి/గంగ్వార్/గంగపుత్ర/గూండ్లనయల/పట్టపు మరియు గండ్ల /తెలికుల /దేవటిలకుల వంటి క్రొత్త కార్పొరేషన్లను ఏర్పరచడం జరిగింది.

43. రజక, నాయీబ్రాహ్మణ, వడ్డెర, సాగర/వుప్పర, కృష్ణ బలిజ/పూసల, వాల్మీకి బోయ, బట్రాజు, కుమ్మరి శాలివాహన లకు ఉన్న కొ-అపరేటీవ్ సొసైటీస్ ఫెడరేషన్ ను, కొ-ఆపరేటీవ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌గా మార్చడం జరుగుతుంది.

44. కల్లు గీత కార్మికుల కార్పొరేషన్లు శెట్టిబలిజ/గౌడ/ఎడిగ/గౌడ్/గండ్ల/శ్రీశయన/కళింగ/గౌండ్ల/ యాదవ కొ-అపరేటీవ్ ఫైనాన్స్ కార్పొరేషన్ గా పేరు మార్చడం జరుగుతుంది.

45. వెనుకబడిన కార్పొరేషన్లకు 3,000 కోట్ల రూపాయలను కేటాయించేందుకు ప్రతిపాదిస్తున్నాను. వివిధ వెనుకబడిన తరగతుల కార్పొరేషన్లకు వారిలో దారిద్ర్య దిగువరేఖ క్రింద ఉన్న జనాభా దామాషాపద్దతిలో ఈ కేటాయింపును పంచడం జరుగుతుంది.

46. 2014 సంవత్సరంలో బ్రాహ్మణ కార్పొరేషన్, 2015 సంవత్సరంలో కాపు కార్పొరేషన్, 2016 సంవత్సరంలో అత్యంత వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ మరియు వైశ్య కార్పొరేషన్ ను స్థాపించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నూర్భాష/దూదేకుల ముస్లిం కోపరేటివ్ ఫెడరేషన్లు కూడా 2018 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఈ సంస్థలు సదరు సామాజిక వర్గాలలో వెనుకబడిన తరగతుల వారి ఉన్నతి కోసం కృషి చేస్తాయి. కాపుల సంక్షేమానికి 1,000 కోట్లు, బ్రాహ్మణల సంక్షేమానికి 100 కోట్లు, ఆర్య వైశుల సంక్షేమానికి 50 కోట్లు, క్షత్రియులు (రాజులు) సంక్షేమానికి 50 కోట్లు ప్రత్యేకించడమైనది.

47. విద్యా పురోభివృద్ధి: పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ పధకం క్రింద అన్ని వర్గాలకు (SC/ST/BC/ EBC/Kapu/MW/DW) చెందిన విద్యార్థులకు స్కాలర్షిప్ రేట్లను ప్రభుత్వం ఈ క్రింది విధంగా పెంచడం జరిగింది. డిపార్ట్ మెంట్ అనుబంధహాస్టళ్లకు 33% వరకు, కళాశాల అనుబంధ హస్టళ్ళకు 131% వరకు, డేస్కాలర్లకు - 150% వరకు 71 లక్షల స్కాలర్షిప్‌లను అన్ని సామాజిక వర్గాల విద్యార్థులకు (14.5 లక్షల మంది SC, 2.8 లక్షల మంది ST, 36.9 లక్షల మంది BC, 11.5 లక్షల మంది EBC/Kapu, 5.4 లక్షల మంది మైనారిటీలు మరియు 2,666 లక్షల మంది దివ్యాంగులు) మొత్తంగా 2,833 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది.

48. హాస్టల్ విద్యార్థులకు సార్వత్రిక పోషకాహార మెనూ ప్రకారం వారానికి 5 రోజులు గుడ్లు, ప్రీమెట్రిక్ హాస్టళ్లలో వారానికి 3 సార్లు చికెన్, రెసిడెన్షియల్ సూళ్ళు మరియు కాలేజీ హాస్టళ్లలో వారానికి 2 సార్లు చికెన్ అందించడం జరుతుగుంది. వీటితోపాటు 200 మీ.లీ. పాలు, రాగి మాల్ట్ మరియు చిక్కని రోజువారి అందించడం జరుగుతుంది.

49. మా ప్రభుత్వం హాస్టల్, రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు చెల్లించే కాస్మోటిక్స్ చార్జీలు, హెయిర్ కట్ చార్జీలు మరియు యూనిఫామ్ కట్టుకూలిని 150% వరకు పెంచడం జరిగింది. మొట్టమొదటి సారిగా కాలేజీ పోస్టుమెట్రిక్ హాస్టళ్ల విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలను మంజూరు చేయడం జరిగింది.

50. మా ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు మైనారిటీ వర్గాలకు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు విదేశీ విద్యా పధకం పరిధికి తీసుకురావడం జరిగింది. అంబేద్కర్ విదేశీ వద్య పధకం క్రింద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన విద్యార్థులకు విదేశాలలో ఉన్న విద్యను అభ్యసించడానికి మంజూరు చేసే స్కాలర్ షిప్ మొత్తాన్ని 10 లక్షల నుండి 15 లక్షలకు పెంచడం జరిగింది. బి.సి. విద్యార్థులకు కూడా విదేశీ విశ్వవిద్యాలయాలలో పోస్టుగ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించేందుకు 10 లక్షల సహాయం అందించడం జరుగుతున్నది. ఈ పధకం క్రింద గత ఐదు సంవత్సరాలలో మొత్తం 4,528 మంది విద్యార్థులు లబ్ధిపొందారు.

51. ఉద్యోగ అవకాశాలు: యుపిఎస్‌సి సివిల్ సర్వీస్ పరీక్షల వంటి పోటీ పరీక్షలకు హజరయ్యే విద్యార్థులకు ప్రైవేట్ సంస్థలలో నిపుణులు మార్గదర్శకత్వాన్ని అందించేందుకు మా ప్రభుత్వం ఎన్.టి.ఆర్ ఉన్నత విద్యాధరణ అనే నూతన పధకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం క్రింద ప్రతి విద్యార్ధికి 1.5 లక్షల రూపాయలను సంస్థాగత రుసుముగాను, 9 నెలల కాలానికి నెలకు 10 వేల రూపాయల చొప్పున స్టైఫండ్‌గాను చెల్లించబడుతుంది. ఈ పథకం క్రింద 9,524 మంది (2,313 మంది షెడ్యూలు కులాలు, 947 మంది షెడ్యూల్డు తెగలు, 542 మంది మైనార్టీలు, 2,816 మంది వెనుకబడిన తరగతులు, 1,443 మంది ఆర్థికంగా వెనుకబడిన తరగతులు మరియు 1,415 మంది కాపులు) విద్యార్థులకు 143 కోట్ల రూపాయల లబ్దిచేకూరింది.

52. షెడ్యూల్ కులాల యువతలో పారిశ్రామికత మరియు ఉద్యోగాలు పొందే సామర్థ్యాన్ని పెంచడానికి మా ప్రభుత్వం చంద్రన్న చేయూత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టింది. ఇప్పటివరకు 31,815 మంది యువతకి దీని ద్వారా ప్రయోజనం పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా 20,000 మంది షెడ్యూల్ తెగల నిరుద్యోగ యువత లబ్ది పొందడమే కాక, 4,000 మంది వివిధ ప్రైవేట్ రంగ సంస్థలలో ఉపాధి పొందడం జరిగింది.

53. జీవనాధారములు: గత నాలుగున్నర సంవత్సరాలలో 3,795 కోట్ల రూపాయల వ్యయంతో 2,66,740 మంది ఎస్సి లబ్దిదారులు జీవనోపాధి సహాయం పొందారు. వీరికిచ్చిన 8,000 వాహనాలు; 2,386 ఎకరాల భూమి, 110 ట్రాక్టర్లు, చర్మకారులకు ఇచ్చిన 6,000 Toolkit లు వంటి ఈ కోవలోనివే.

54. ఎస్‌టిల జీవనోపాధి పెంచడం కోసం మా ప్రభుత్వం 5,42,333, ఎస్టి లబ్దిదారులకు 622 కోట్ల రూపాయల ఖర్చు చేసింది. వీటిలో800 ఎస్టి లబ్దిదారులకిచ్చిన ఋణాలు, భూకేటాయింపులు, కాఫీ తోటల పెంపకం, రైతు ఉత్పత్తిదారు సంఘాల ఏర్పాటు వంటివి ఉన్నాయి.

55. మొత్తం మీద గత ఐదు సంవత్సరాల కాలంలో వివిధ కార్పోరేషన్లు, పెడరేషన్లు, ద్వారా BC Component క్రింద 4,823 కోట్ల రూపాయల వ్యయంతో 6.46 లక్షల లబ్దిదారులకు ఆర్థిక మద్ధతులను అందించాము.

90 శాతం సబ్సిడీతో ఆధునిక పనిముట్లను వివిధ వృత్తికారులకు అందించాము. కాపు తెలగబలిజ/ఒంటరి సామాజిక వర్గాల వారికి బిసిలకు ఎంబిసిలకు, ఐబిసిలకు, ఆర్య వైశ్యులకు ఆయా కార్పోరేషన్ల ద్వార ఆర్థిక తోడ్పాటును అందజేసే కార్యక్రమం విస్తరించాము.

56. మైనారిటీలకు 279 కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. APSMFC మరియు APSCMFC ద్వారా 47,678 లబ్దిదారులకు 264.7 కోట్లతో ఆర్థిక తోడ్పాటు ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఆదాయ వనరులు లేని మసీదులకు చెందిన ఇమాంలకు నెలకు 5000 రూపాయలు, మౌజర్లకు నెలకు 3,000 రూపాయల చొప్పున పారితోషకం ప్రకటించడం జరిగింది. 18.57 శాతం పెంచుతూ మైనార్టీల సంక్షేమానికి 1,304.43 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నాను

57. మా ప్రభుత్వం 4,133 దివ్యాంగుల జీవనాధార సహాయం నిమిత్త 35.87 కోట్ల రూపాయలను కేటాయించింది. దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత నిస్తూ వారికి పునరావాసం మరియు కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేసే కార్యక్రమానికి 2019-20 సంవత్సరానికి కేటాయింపులకు కేటింపు చేస్తూ 70 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను.

58. ఉచిత విద్యుత్ పధకం: జగజ్జీవన్ జ్యోతి పధకం క్రింద నెలకు ఉచిత విద్యుత్ యూనిట్ సంఖ్యను 50 నుండి 100 యూనిట్లకు పెంచడం వలన గత నాలుగున్నర సంవత్సరాలలో సగటున 11 లక్షలు ఎస్సీ కుటుంబాలకు 3440 కోట్ల రూపాయలు, 3.89 లక్షల ఎస్టీ కుటుంబాలకు 97.2 కోట్ల రూపాయల మేర లబ్ది చేకూరింది.

59. మా ప్రభుత్వం 2 లక్షల అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన కుటుంబాలకు 100 యూనిట్లు వరకు నాయీ బ్రాహ్మణ సంక్షేమం కోసం, వారి సెలూన్లకు 150 యూనిట్ల వరకు, రజకుల సంక్షేమంలో భాగంగా పూర్తి ఉచితంగా, స్వర్ణకారులకు 100 యూనిట్లు వరకు, చేనేత కార్మికులకు 150 యూనిట్లు వరకు, ఉచిత విద్యుత్ ను అందించడం జరుగుతున్నది.

60. కమ్యూనిటీ సౌకర్యాలు: ఎస్సీ సబ్ కంపోనెంట్ క్రింద గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో 745 కి.మీ. సీసీ రోడ్లును, 1,225 కి.మీ. బి.టి. రోడ్ల పనులను చేపట్టడం జరిగింది. 930 ఎస్సి నివాస ప్రాంతంలో త్రాగునీటి సదుపాయాన్ని కల్పించడం జరిగింది. నగర పాలక సంస్థల పరిధిలో ఎస్సీ ప్రాంతంలో నూతనంగా రెసిడెన్షియల్ పాఠశాల భవనాల నిర్మాణం చేపట్టాము.2019-20 సంవత్సరానికి మౌలిక సదుపాయాలను సమకూర్చటానికి 600.56 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నాము.

61. గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎస్టీ కాంపోనెంట్లో భాగంగా వివిధ పథకాల కింద 250 కంటే ఎక్కువ జనాభా కలిగిన 248 ప్రాంతాలను కలుపుతూ రోడ్లు వేయడం జరిగింది. గిరిజన గ్రామ పంచాయితీలలో కమ్యూనికేషన్ సౌకర్యాలను మెరుగుపర్చడానికి 184 మెబైల్ టవర్లను ఏర్పాటుచేసాము.

62. బిసి కాంపోనెంట్ క్రింద 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో, అమరావతి 10 ఏకరాల విస్తీర్ణంలో మహాత్మా జ్యోతి బాపూలే స్మారక భవన్ మరియు పార్క్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అంతేకాక, మా ప్రభుత్వం 76 నూతన బిసి రెసిడెన్షియల్ స్కూళ్లను, కేవలు మత్స్యకారుల వర్గానికి ప్రత్యేకంగా 6 సూళ్లను, రెండు రెసిడెన్షియల్‌లో కళాశాలను ప్రారంభించడమే కాకా 12 జూనియర్ కాలేజీలో ఉన్నతీకరించడం జరిగింది. బిసిల సామాజిక సాంస్కృతిక సమైక్యత కోసం జిల్లాలో 5 కోట్ల వ్యయముతో బిసి భవనంను, డివిజన్ స్థాయిలో 50 లక్షల రూపాయల వ్యయముతో కమ్యూనిటీ హాళ్ళను, మండల స్థాయిలో 25 లక్షల రూపాయల వ్యయముతో, 10 లక్షల రూపాయల వ్యయముతో గ్రామ స్థాయిలో కమ్యూనిటీ హాళ్లు మొత్తం 135 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడము జరిగింది. పైన చెప్పిన దానికి అదనంగా 308 కాపు భవనాల నిర్మాణానికి మరో 123 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది.

63. మైనారిటీ భాగం క్రింద విజయవాడ, కడప పట్టణాలలో 23 కోట్లు, 13 కోట్లు వ్యయముతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ హౌస్‌ను నిర్మించడము జరుగుతుంది. అదేవిధంగా చర్చిల నిర్మాణం, రిపేర్లు, పునర్నిర్మాణం కోసం 5 లక్షలు ఆర్ధిక సహాయంతో 817 పనులు చేపట్టబడ్డాయి.

64. దివ్యాంగుల సంక్షేమ పరిధిలో, బధిరుల కోసం అనంతపురం మరియు కాకినాడలో 2 గృహాలు, 100 మంది లబ్దిదారులకు గుంటూరులో ఒక ఆర్థోపెడిక్ కేంద్రాన్ని, గుంటూరులో క్రొత్త Braille ప్రెస్లు, 1,224 మందికి ఒక్కటికి 80,000 వేల రూపాయల చొప్పున పెట్రోల్ స్కూటర్లను అందివ్వడం వంటి కార్యక్రామాలను మా ప్రభుత్వం చేపట్టింది.

65. చంద్రన్న పెళ్ళికానుక / దుల్హన్ పధకం: ఇది మా ప్రభుత్వం యొక్క భావ ప్రధానమైన చర్యల నిరుపేదలు కూడా తమ కుటుంబాలలో జరిగే శుభకార్యాలను హృదయపూర్వకంగా, ఎటువంటి ఒత్తిడులు లేకుండా జరుపుకోవాలని కుటుంబ పెద్దగా గౌరవనీయ ముఖ్యమంత్రిగారు ఎస్సీ, ఎస్టీ, బిసిలు, దివ్యంగులు మరియు కులాంతర వివాహాల సమయంలో లక్ష రూపాయల వరకు ఈ పథకం ద్వారా అందిస్తున్నాము. ఇప్పటివరకు, 139 కోట్ల రూపాయల ఖర్చుతో 68,481 దంపతులకు ఈ వివాహ కానుకలను 282.66 కోట్ల వ్యయంతో ఇవ్వడం జరిగింది. దుల్హాన్ పథకంలో 38,285 దంపతులకు 191 కోట్ల రూపాయల మేర కానుకలు ఇచ్చాము.

66. చంద్రన్న పెళ్ళికానుక పథకాన్ని మా ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన తరగతులవారిక శాచురేషన్ పద్దతిలో ప్రతి పేద కుటుంబానికి విస్తరించింది.

67. పండుగ కానుక /తోఫా: సంక్రాంతి, క్రిస్మస్ మరియు రంజాన్ వంటి శుభ సందర్భాలలో ఆనందాలు వెల్లివిరియాలనే ఉద్దేశ్యంతో ప్రవేశ పెట్టిన చంద్రన్న కానుక, రంజాన్ తోఫాల వంటి పధకాల ఉద్దేశ్యం కూడా అదే. గత నాలుగున్నర సంవత్సరాలలో 1.25 కోట్ల కుటుంబాలకు చంద్రన్న కానుకలు, 11.25 లక్షల ముస్లిం కుటుంబాలకు తోఫా ఇవ్వడం జరిగింది.

68. ఇదే బాటలో పవిత్ర స్థలమైన జెరూసలేం సందర్శించే క్రిస్టియన్ యాత్రికులకు అందించే ఆర్ధిక సహాయాన్ని 20,000 నుండి 40,000 రూపాయలకు పెంచడం జరిగింది. దీని వలన 6.09 కోట్ల రూపాయల వ్యయంలో 1668 యాత్రికులకు లబ్ధిచేకూరింది.

69. ఎస్సీ సబ్ ప్లాన్ కు క్రిందటి సంవత్సరంకంటే 28 శాతం పెంచుతూ 2019-20 సంవత్సరానికిగాను 14,367 కోట్లను ప్రతిపాదిస్తున్నాను. అలాగే, 29 శాతం పెంచుతూ ఎస్టీ సబ్ప్లాన్ కు 5,385 కోట్లు, 33 శాతం పెంచుతూ బిసి సబ్ ప్లాన్ కు 16,226 కోట్లు కేటాయిస్తున్నాను.

70. చేనేత కార్మికుల సమగ్రాభివృద్ధి కోసం 1,004 కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీని ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా వర్ష ఋతువులో ఒక్కొక్క కుటుంబానికి 4,000 రూపాయల చొప్పున వేతన పరిహార ఉపశమనం క్రింద 90,765 చేనేత కుటుంబాలు లబ్దిపొందుతున్నాయి. నెలకు

కుటుంబానికి 150 యూనిట్ల ఉచిత విద్యుత్, ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయల వార్షిక కవరేజితో ఆరోగ్య భీమా పధకం, 5,000 మంది గ్రామీణ చేనేత కుటుంబాలకు 2.81 లక్షల విలువచేసే ఇల్లు మరియు వర్కుషెడ్ల నిర్మాణపథకం, పట్టణాలలో నివసించే చేనేత కార్మికులకు 1.2 లక్షల విలువ చేసే ప్రత్యేక వర్కు షెడ్ల నిర్మాణం ఈ సమగ్రాభివృద్ధి ప్యాకేజీలో ఉన్నాయి.

71. డ్రైవర్ల సామాజిక మరియు ఆర్ధిక శ్రేయస్సు కోరుకుంటూ 150 కోట్ల రూపాయలు కేటాయింపుతో డ్రైవర్ల సాధికార సంస్థను స్థాపించటానికి నేను ప్రతిపాదిస్తున్నాను. ఈ సంస్థని రైతు సాధికార సంస్థ మరియు మహిళా సాధికార సంస్థ తరహాలోనే ఏర్పాటు చేస్తాము.

సాంఘిక భద్రత, పేదరిక నిర్మూలన

The test of our progress is not whether we add more to the abundance of those who have much; it is whether wer provide enough for those who have too little.

-Frankin D. Roosevelt

72. పెంచిన ఫించన్లు, ప్రజా పంపిణీ ద్వారా ఆహార భద్రత, ఎన్.టి.ఆర్. ఆరోగ్య వైద్య సేవ ద్వారా ఆరోగ్య భద్రత, ఎం.జి, ఎన్. ఆర్.ఇ.జి.ఎస్. ద్వారా నైపుణ్యం లేని కార్మికులకు ఉపాధి భద్రత, మెరుగైన గృహ భద్రత, చంద్రన్న బీమా ద్వారా ప్రమాదవశాత్తు మరణం లేదా అంగ వైకల్యం కలిగినప్పుడు ఉపశమనం కలిగించడం ద్వారా మా ప్రభుత్వం అత్యంత బలహీన వర్గాలకు సాంఘిక భద్రత కలిగించడానికి కట్టుబడి ఉంది.

7. ఎన్.టి.ఆర్. భరోసా పెన్షన్లు - అత్యంత బలహీన వర్గాలకు గౌరవప్రదమైన జీవితాన్ని కలిగించడం పెద్ద కొడుకుగా తన భాద్యత అని గౌరవ ముఖ్యమంత్రి గారి విశ్వాసం. అందుకనుగుణంగా, అధికార పగ్గాలు చేపట్టగానే, వృద్దులకు, వితంతవులకు, నేత కార్మికులకు, గీతకార్మికులకు, హెచ్.ఐ.వి. సోకిన వారికి పింఛను రూ.200 నుండి రూ.1000లకు, 5 రెట్లు, దివ్యాంగులకు రూ.500 నుండి రూ.1500 వరకూ, 2 నుండి 3 రెట్లు పెంచడమైనది.

74. అంతేకాక, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకునే వారికి, ఒంటరి స్త్రీలకు, లింగమార్పిడి జరిగిన వారికి, మత్స్యకారులకు పింఛను సదుపాయం వర్తించడమైనది. తద్వారా గత నాలుగు సంవత్సరాలకు రూ.24,618 కోట్ల వ్యయంతో 50.51 లక్షల మందికి లబ్ది చేకూరింది. అంతేకాక డప్పు కళాకారులకు నెలకు 1500 రూపాయల చొప్పున, సాంప్రదాయ చర్మకారులకు 1000 రూపాయల చొప్పున పింఛను చెల్లిస్తున్నాము.

75. కుటుంబ ఖర్చులు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకొని, 'ప్రతి ఇంటి పెద్దకొడుకు'గా తన బాధ్యతను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రిగారు అన్ని సామాజిక భద్రతా పింఛన్లను రెట్టింపు చేసారు. 2019 జనవరి నుండి నెలకు రూ.2000 మరియు రూ.3000కు వరుసగా పెంచారు. దీనితో కలిపి ఈ ఐదేళ్ళ పదవీ కాలంలో పింఛన్లను 10 రెట్లు పెంచినట్లు అయ్యింది.

76. ప్రజా పంపిణీ వ్యవస్థ - కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రజా పంపిణీ వ్యవస్థ కేవలం 2.68 కోట్ల మందికి మాత్రమే లబ్ది చేకూర్చగా, రాష్ట్ర ప్రభుత్వ 24 లక్షల కొత్త కార్డులను జారీ చేసి, ఈ వ్యవస్థలో అదనంగా 1.52 కోట్ల మందిని పరిధిలోకి చేర్చింది. వలసల ద్వారా కానీ, మరే ఇతర కారణంగా ఏ కుటుంబము రేషన్ కోల్పోకుండా రాష్ట్రంలోని ఏ చౌకదుకాణం నుండైనా రేషన్ తీసుకునే అవకాశాన్ని కలగ చేసాము. తద్వారా రేషన్ డీలర్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ తత్వం, జవాబుదారీతో పాటు కార్డుదారులు వారి సౌకర్యాన్ని బట్టి వేరే దుకాణాన్ని ఎన్నుకునే వీలు కుదిరింది.

77. దారిద్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబాల్లో ఆరోగ్య ప్రమాణాలు, పోషకాహార అలవాట్లు మెరుగు పర్చడానికి 2018 అక్టోబరు నుంచి అన్ని జిల్లాల్లోనూ బిపిఎల్ కార్డు ఉన్నవారికి 3 కిలోల రాగులు, 2 కిలోల జొన్నలు ఇవ్వడం జరుగుతుంది. ఐరన్ లోపంవల్ల కలిగే నిడివైన రక్తహీనతను అరికట్టడానికి ప్రతి బిపిఎల్ కార్డుపై డబుల్ fortified ఉప్పును పంపిణీ చేయటం జరుగుతుంది.

78. PDS లకు అదనంగా, పేద ప్రజలకు పరిశుభ్రమైన, సరసమైన ఆహారాన్ని, అందించాలని అన్న క్యాంటిన్లను ప్రారంభించటం రూ.5/-లకే ఒక భోజనాన్ని ఇవ్వడం జరిగింది. 175 అసెంబ్లీ నియోజిక వర్గాలకుగాను 368 క్యాంటీన్లను మంజూరు చేయటం జరిగింది. ఇప్పటికి 216 పట్టణాలలో, 152 గ్రామీణ ప్రాంతాలలో మొత్తు 160 క్యాంటిన్లు, 4 కార్పొరేషన్లతో, 14 మునిసిపాలిటీలలో పనిచేయటం మొదలు పెట్టాయి.

79. మహాత్మాగాంధి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం: 2018-19 సంవత్సరానికి కేంద్రం ఆమోదించిన లక్ష్యం 22 కోట్ల పని దినాలు కాగా మనం ఇప్పటికే 2019 కోట్ల పనిదినాలు నమోదు చేసాము. దీంతో 65.96 లక్షల వేతనకారులు, 40.81 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం క్రింద ఇప్పటివరకు 7,437 కోట్ల రూపాయలు వ్యయం జరిగింది. ఇందులో 4,034 రూపాయలు వేతనాలకు, 3,091 కోట్ల రూపాయలు మెటీరియల్స్ కు వెచ్చించటం జరిగింది.

80. చంద్రన్న బీమా: అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కలిగించే పథకం. దీనిద్వారా వివిధ రకాల బీమాలు ఉపకారవేతనాలు అందించటం జరుగుతుంది. ఇప్పటివరకు 2.6 కోట్ల కార్మికులకు ప్రతి సంవత్సరం సహాయం అందించాము. 2018-19లో 9 లక్షలు రైతులకు రైతు బీమా ప్రారంభించాము. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 7 కోట్ల రూపాయలు చెల్లించాము. ఈపథకానికి కేటాయింపులను 2.5 రెట్లు పెంచుతాము. ఈపథకానికి కేటాయింపులను 2.5 రెట్లు పెంచుతూ 354 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను.

81. హౌసింగ్ పథకం క్రింద వివిధరకాలుగా ప్రోత్సాహకాలను పెంచాము. ఋణ పరిమితిని కూడా తగ్గించాము. 31,793 కోట్ల రూపాయలతో 15.78లక్షల గృహాలను మంజూరుచేసాము. పెండింగ్‌లో ఉన్న 4.40 లక్షల ఇళ్ళను వివిధ పథకాలద్వారా పూర్తిచేయాలని పూనుకున్నాము. పట్టణ ప్రాంతాలలో 10,15,665 ఇళ్ళు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి.

మానవ వనరుల అభివృద్ధి

82. ఆరోగ్యం: ఈ శాఖకు 2018-19 సంవత్సరమునకుగాను 8463 కోట్ల రూపాయలు కేటాయించాము. ఇది 2014-15తో పోలిస్తే దాదాపు రెట్టింపు అయింది. ఎంఎంఆర్ ను 2014-15 నాటికి ఉన్న 83 నుంచి 2018-19లో 65.81కి మరియు అలాగే ఇదే కాలానికి ఐఎంఆర్‌ను 37 నుంచి 10.51కి తగ్గించగలగడం ఈ రంగంలో మేము సాధించిన గొప్ప విజయము.

83. ప్రజారోగ్య మెరుగుదలతో పాటు ఇతర చిన్నపాటి ఖర్చులను తగ్గించే క్రమంలో తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ ఎన్.టి.ఆర్ బేబి కిట్స్, చంద్రన్న సంచార చికిత్స, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ఎన్.టి.ఆర్. వైద్య పరీక్ష, ఎన్.టి.ఆర్. వైద్య సేవ, ముఖ్యమంత్రి ఇ-కంటి కేంద్రం, ముఖ్యమంత్రి బాల సురక్ష (RBSK), ఇ-ఔషది, ఉచిత డయాలసిస్, వంటి కార్యక్రమాలు మా ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆరోగ్యరక్ష, ఉద్యోగుల ఆరోగ్య పథకం, పాత్రికేయుల ఆరోగ్య పథకం మరియు అమరావతి నివాసితుల ఆరోగ్య పథకం వంటి కార్యక్రమాలును కూడా మా ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ కవరేజి క్రింద అమలు చేస్తున్నది. అంతేకాక క్యాన్సర్ సెంటర్లను ప్రతి జిల్లాలో కూడా అందుబాటులోకి తెస్తున్నాము.

84. మేము అమలు చేస్తున్న ఎన్.టి.ఆర్. వైద్యసేవ పథకం ద్వారా 5,330 కోట్ల రూపాయల ఖర్చుతో 12 లక్షల రోగులకు లబ్ధి చేకూర్చగలిగాము. ఈ పథకంలో ప్రతి కుటుంబానికి ఉన్న అవధిని 2.5 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి కేటాయింపులను ప్రస్తుతమున్న 1,000 కోట్ల రూపాయలను 2019-20 సంవత్సరమునకు 1,200 కోట్లకు పెంచుతున్నాము.

85. మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు నాణ్యమైన సేవలు అందించే ఉద్దేశ్యంతో 2016 లో తీసుకువచ్చిన డయాలసిస్ కార్యక్రమంలో భాగంగా పిపిపి పద్దతిలో ఏర్పాటు చేసిన డయాలిసిస్ కేంద్రాలను 14 నుండి 48కి పెంచాము. దీనితోపాటు మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎన్.టి.ఆర్. భరోసా పథకం ద్వారా 2,500 రూపాయలు నెలవారి పింఛనును అందిస్తున్నాము. ఈ పింఛనును ఎన్.టి.ఆర్. వైద్యసేవ పథకంలో నమోదు చేసుకున్న అన్ని ఆసుపత్రులలో డయాలిసిస్ చేయుంచుకుంటున్న రోగులకు కూడా వర్తింపచేశాము.

86. ఈ కార్యక్రమాలన్ని ప్రజల ఇతర ఖర్చులను గణనీయంగా తగ్గించ గలిగాయి.

87. 2019-20 సంవత్సరమునకుగాను, ఆరోగ్య సంస్థలలో సదుపాయాలు అభివృద్ధి కొరకు 329 కోట్లను డ్రగ్స్ మరియు మందుల కొనుగోలు కొరకు ప్రస్తుతమున్న 300 కోట్ల రూపాయల పద్దును పెంచుతూ 402 కోట్ల రూపాయలకు కేటాయింపులు జరుపుతున్నాము. ఈశాఖ కేటాయింపులను 2019-20 సంవత్సరమునకు 10,032 కోట్ల రూపాయలకు పెంచుతున్నాము. ఇది క్రితం సంవత్సరముతో పోలిస్తే 18.53 శాతం అధికం.

88. విద్య: విద్యారంగంలో మధ్యాహ్న భోజన పథకంలో వివిధ రకాలైన ఆహార పదార్థాలను చేర్చడం, బడికొస్తా, మన ఊరు-మన బడి, బడి పిలుస్తుంది వంటి పథకాలతో పాటు, డిజిటల్ క్లాస్ రూమ్లు, ఇ-హాజర్ కార్యక్రమాలను మేళవించి విద్యానాణ్యత పెంచడంతో పాటు, సర్వ శిక్ష అభియాన్ యొక్క ఫలితాలను మెరుగు పరచడానికి బడిలో చేరే విద్యార్థుల సంఖ్యను పెంచడంతోపాటు, వారు బడి మానకుండా చూడడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది.

89. ప్రాథమిక విద్యతో బడిలో చేరే విద్యార్థుల నిష్పత్తి 86 శాతానికి చేరుకోగా, ప్రాథమికోన్నత విద్యలో ఈ నిష్పత్తి 84 శాతానికి చేరుకుంది. మా ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం క్రింద 45,505 పాఠశాలల్లో చదువుతున్న 33,72,372 మంది పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తుంది. ఈ పథకం క్రింద 2018-19 సంవత్సరంలో కేవలం పాఠశాలల్లోనే కాకుండా 450 ఇంటర్మీడియట్ ప్రభుత్వ కాలేజీలలోని 1.75 లక్షల విద్యార్థులకు కూడా ఆహారాన్ని అందించడం జరిగింది. విద్యార్థులకు పోషకాహారం అందించడంవలన వారి గ్రాహ్యశక్తి పెరగడమే కాకుండా, మధ్యంతరంగా బడిమానేసే విద్యార్థుల సంఖ్య తగ్గడం వంటి మంచి ఫలితాలను దృష్టి ఉంచుకుని ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని కళాశాల విద్యకు, పాలిటెక్నిక్ కాలేజీ విద్యకు కూడా విస్తరించడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్న భోజన పథకంలోని ఆహారంలో మాంసకృత్తుల విలువలను పెంచుతున్నాము.

90. ఉన్నత విద్య: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్న విశ్వవిద్యాలయాలలో మౌలిక సదుపాయాల నాణ్యతను పెంపొందించడంతో పాటు, నూతన విశ్వవిద్యాలయాల స్థాపనకు అవసరమైన మౌలిక సౌకర్యాలను కల్పించడంపై మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ చర్య ఫలితంగా జాతీయ స్థాయిలో అత్యుత్తమ విద్యా సంస్థలలో గుర్తింపబడిన 100లో 6 విశ్వవిద్యాలయాలు మన రాష్ట్రంలోనివే. ఆంధ్ర మరియు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలు జాతీయ స్థాయిలో మొదటి 50 విశ్వవిద్యాలయాలలో స్థానం పొందాయి. నూతన విశ్వవిద్యాలయాలలో మౌలిక సౌకర్యాల స్థాపనకు ఒక్కొక్క నూతన విశ్వవిద్యాలయానికి 40 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాము. రాష్ట్ర విద్యార్థులకు ఉన్నత నాణ్యత ప్రమాణాలు కలిగిన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రైవేట్ విశ్వ విద్యాలయాల చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. దీని ఫలితంగా 11 విశ్వ విద్యాలయాలు రాష్ట్రంలో తమ విద్యా సంస్థల స్థాపనకు ముందుకు వచ్చాయి. రాబోయే 10 సంవత్సరాలలో 1,72,982 విద్యార్థులతో 11,360 కోట్ల రూపాయల పెట్టుబడిని ఈ కార్యక్రమానికి రాష్ట్రానికి తీసుకురాగలదని అంచనా వేయడమైనది.

91. 2019-20 ఆర్థిక సంవత్సరానికి మానవ వనరుల విభాగానికి 29,955 కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి. మొత్తం బడ్జెట్లో ఈ కేటాయింపు సుమారు 11.5 శాతంగా వుంది.

పరిశ్రమలు మరియు సేవలు

92. రాష్ట్రంలో ఉపాధి కల్పనాభివృద్ధిలో పారిశ్రామిక, సేవారంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది. దీనిలో భాగంగా ఉద్యోగిత సాంద్రతకు అవకాశమున్న వస్త్ర పరిశ్రమ, ప్రాథమిక ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమలు మరియు పర్యాటక రంగాలలో అభివృద్ధిపై మా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది

93. ఏకగవాక్ష విధానము ద్వారా మేము ఉత్తమమైన సరళీకరణ విధానమును రూపొందించి ఏడు రోజుల సగటుతో అన్ని అనుమతులు మంజూరు చేయుచున్నాము. ప్రపంచ బ్యాంక్ మరియు 'లీ కున్ యా' పబ్లిక్ పాలసీ స్కూలు లాంటి సంస్థలు ఉత్తమ వ్యాపార అనుగుణమైన రాష్ట్రంగా గుర్తింపునిచ్చాయి. ప్రపంచ ఉత్తమ ర్యాంక్ లలో ఉత్తమమైనదిగా సమీప భవిష్యత్తులో మన రాష్ట్రం రూపొందుతుంది.

94. 33.3 లక్షల మందికి ఉద్యోగ కల్పనకు 18 శాఖలలోని 2,633 ప్రాజెక్టులకు రూ.15.77 లక్షల కోట్ల MOUలు ఈ మధ్య కాలములో సంతకము చేయుట జరిగింది. MOUలు పూర్తి స్థాయిలో అమలులో సుమారు 40 శాతం పెట్టుబడుల కార్యాచరణతో మన రాష్ట్రం దేశములో ముందున్నదని గౌరవ శాసన సభ్యులకు తెలియజేయుటకు సంతోషిస్తున్నాను, 820 పెద్ద మరియు మెగా ప్రాజెక్టులు 1.82 లక్షల కోట్లతో ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించి 2.8 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అలాగే 5.27 లక్షల కోట్లతో 7.66 లక్షల మందికి ఉపాధి కల్పించు 1,211 ప్రాజెక్టులు సివిల్ వర్కులు తదనంతర దశలో ఉన్నాయి.

95. ప్రభుత్వము అవలంబించుచున్న సానుకూల విధానాలవల్ల ప్రఖ్యాతి గాంచిన కియా మోటార్స్, ఇసుజు, హీరో గ్రూప్, పెప్సికో, మాండలీజ్ (క్యాడ్బరీస్) జైన్ ఇరిగేషన్, అరవింద్ మిల్స్, షాహి ఎక్స్ పోర్స్, జాకీ మొదలైన సంస్థలు వారి కార్యకలాపాలు మన రాష్ట్రంలో నెలకొలుపుటకు ఉత్సాహము చూపిస్తున్నాయి.

96. మా ప్రభుత్వం ఇటీవల కాలంలో విదేశీ పెట్టుబడి పథకం ద్వారా ఇండోనేషియాకు చెందిన ఆసియా పల్స్ అండ్ పేపర్ ద్వారా ప్రకాశం జిల్లాలో 24,500 కోట్ల రూపాయల మేర పెట్టుబడికి అంగీకారం కుదుర్చుకుంది. దీనివల్ల 4,000 ఉద్యోగాలు నేరుగా, 12,000 ఇతరంగా కలుగుతాయి. అలాగే హల్దియా పెట్రో కెమికల్ తో 62,714 కోట్ల రూపాయల పెట్టుబడి కోసం ప్రయత్నిస్తున్నాము.

97. భవిష్యత్తులో పారిశ్రామిక అభివృద్ధి కొరకు విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ ను (VCIC) మరియు చెన్నై బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ (CBIC) పునాదులు వేస్తున్నాము.

98. MSME సెక్టారు ద్వారా ఒక పెద్ద మెగా పెట్టుబడి సంస్థ కన్నా 10 రెట్లు అధికంగా ఉపాధి కల్పిస్తున్నాము. దీనివల్ల ఆదాయ కల్పనలో, ఉపాధికల్పనలో MSME సంస్థల పాత్ర ముఖ్యమైనదిగా మా ప్రభుత్వం భావిస్తుంది. పోటీ వాతావరణమును సృష్టించి 1,816 కోట్ల రూపాయలు విలువైన ప్రోత్సాహకాలను ఇవ్వడం జరిగినది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో MSME పార్కులను స్థాపిస్తున్నాము. 7,246 ప్లాట్లలో 31 పార్కులు ఇప్పటికే ఏర్పాటు చేయడమైనది.

99. 2014 సంవత్సరం నుండి 14,292 కోట్ల రూపాయల పెట్టుబడితో 30,349 MSME యూనిట్లు స్థాపించి 3.3 లక్షల మందికి ఉపాధి కల్పించబడింది. ఈ MSME సెక్టర్ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తాము.

100. 2019-20 వ ఆర్థిక సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల కేటాయింపును ఈ MSME సెక్టర్ కి ప్రతిపాదిస్తున్నాను. ఇందులో 100 కోట్లు ఒత్తిడిలో వున్న MSME ల పునరుద్దరణ కోసం, 400 కోట్లు కొత్త సంస్థలకు ప్రోత్సాహక రూపంలోను మరియు 500 కోట్లు ఎం.ఎస్.ఎం.ఇ పార్కుల అభివృద్ధికి ఉపయోగిస్తాము.

101. సమాచార సాంకేతిక పరిజ్ఞానము, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్: మా ప్రభుత్వం సమాచార సాంకేతిక పరిజ్ఞానము, ఎలక్ట్రానిక్స్ పరికల్పనను మరియు నూతన సంస్థలు, అంతర్జాతీయ ఇన్-హౌస్ సెంటర్లు, ప్రత్యేక సాంకేతిక పార్కులు, సమీకృత పరికల్పనలు మరియు సాంకేతిక విజ్ఞానము, కృత్రిమ మేధస్సు క్లౌడ్హబ్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్స్ (AVGC) మరియు సైబర్ సెక్యూరిటీల అభివృద్ధికి పోటీతత్వం కలిగిన విధానాలను ప్రవేశపెట్టడం జరిగినది.

102. తిరుపతి పరిసర ప్రాంతాలలో రెండు ఎలక్ట్రానిక్స్ తయారీ కస్టర్స్ ఏర్పాటు చేయడంతోపాటు, మా ప్రభుత్వం తిరుపతిని 'సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా'గా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంది. ప్రస్తుతం ప్రతి నెల 3 నుండి 3.5 మిలియన్లు ఫోన్లు ఆంధ్రప్రదేశ్ నుండి తయారు చేసినవే. భారత దేశంలో తయారైన ప్రతి 5 మోబైల్ హ్యండ్ సెట్లలో ఒక సెట్ మన రాష్ట్రంలో తయారౌతుందని తెలియచేయడానికి చాలా సంతోషిస్తున్నాను. మన రాష్ట్రానికి 13,000 మందికి ఉపాధి కల్పించగల Foxconn లాంటి పెట్టుబడులను ఆకర్షించగలిగాము.

103. ఇప్పటికే స్థిరపడ్డ, సమాచార సాంకేతిక కేంద్రాల నుంచి విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ నిర్ధారిత 3,680 కోట్ల రూపాయల పెట్టుబడితో 286 ప్రాజెక్టులను స్థాపించగలిగాము. ఇది 64,335 ఉద్యోగాల కల్పనకు ఉపకరించింది. 70,000 కోట్ల రూపాయలు ప్రతిపాదిత పెట్టుబడితో విశాఖపట్నంలో ఒక డేటా సెంటర్ ను ఏర్పాటుచేయడానికి అదానీ సంస్థతో ఒక అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకున్నాము.

104. ఫిన్‌టెక్, స్టార్టప్ వంటి ముఖ్యమైన రంగాలలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ప్రాంతము ప్రధాన పోటీదారుగ ఉండటానికి మేము అన్ని జాగ్రత్తలతో చర్యలు తీసుకుంటున్నాము. 2017 సంవత్సరములో ఆసియా బ్లాక్ చైన్ కాన్ఫరెన్స్ కు ఆతిధ్యమివ్వటం, విజువల్ ఎఫెక్ట్స్, క్రీడలు, ఎనిమేషన్ పాలసీ రూపొందించుటకు ప్రత్యేక విధానమును రూపొందించాము. 4.0 టెక్నాలజీకు సంబంధించిన పారిశ్రామిక దిగ్గజములకు సైబర్ సెక్యూరిటి ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్ ఎనలిటిక్స్ మొదలైన వాటిపై ప్రత్యక్ష కేంద్రీకృత దృష్టితో ప్రయత్నిస్తున్నాము.

105. టూరిజం (పర్యాటకం): వివిధ రంగాలలో మాదిరిగానే, పర్యాటక అభివృద్ధి మరియు పర్యాటక వసతుల కొరకు పర్యాటక శాఖలోనూ మా ప్రభుత్వం ఒక టూరిజం పాలసీ తీసుకు వచ్చింది. దీని ద్వారా రాష్ట్రానికి 5300 కోట్ల రూపాయల పెట్టుబడులు కార్యరూపం దాల్చడంతో పాటు దాదాపు 2500 ఉద్యోగాలను కల్పించగలిగాము. ఈ రంగములో మా అడుగులు రాష్ట్రాన్ని దేశములోనే 3 వ స్థానములో నిలిపింది. ఈ రంగములో సాలుకు సరాసరి 15 శాతం అభివృద్ధిని సాధిస్తున్నాము. ఈ రంగంలో సాధిస్తున్న సమగ్ర పర్యాటక అభివృద్దికి గాను, భారత ప్రభుత్వము మన రాష్ట్రానికి 2017 మరియు 2018 సంవత్సరాలలో రెండుమారులు అత్యుత్తమ రాష్ట్ర అవార్డును అందించింది. 2014లో ఉన్న 6,000 హోటల్ గదులను 10,000కు పెంచడం ద్వారా ఈ నాలుగున్నర సంవత్సరాలలో వసతి గదులను రెట్టింపు చేయగలిగాము. ఏప్రిల్, 2019 నాటికీ మరో 2,500 గదులను కూడా అందుబాటులోకి తేబోతున్నాము. 5 నక్షత్రాల హోటళ్లను కూడా 6 నుంచి 10కి పెంచగలిగాము.

మౌలిక సదుపాయాల అభివృద్ధి

106. నీటి వనరుల యాజమాన్యము: వ్యవసాయము మరియు రైతుల అభివృద్ధికి నీటిపారుదల జీవనరేఖగా మా ప్రభుత్వము నమ్ముచున్నది. ఇప్పటివరకు 64,334 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కొరకు ఖర్చుచేయుట జరిగినది. గౌరవ ముఖ్యమంత్రిగారు పోలవరం ప్రాజెక్టును ప్రతివారము వ్యక్తిగతముగా పర్యవేక్షించుచున్నారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టుపై ఖర్చు పెట్టిన 15,587 కోట్ల రూపాయలలో 10,499 కోట్ల రూపాయలు 2014 సంవత్సరం తర్వాత ఖర్చు చేయుట జరిగింది.

107. పోలవరం ప్రాజెక్టు ముందస్తు ప్రయోజనాలు పొందుటకు ప్రభుత్వము గోదావరి జలాలను కృష్ణా నదిలోకి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా మళ్ళించుట జరిగినది. ఇప్పటివరకు గోదావరి నుండి 268 టి.ఎం.సీల నీటిని కృష్ణా నదిలోకి మళ్ళించుట జరిగినది. పోలవరం ప్రధాన ఎడమ కాలువ నుండి గోదావరి మరియు ఏలేరు నదులు పురుషోత్తమపట్నం లిఫ్ట్ స్కీంను ప్రారంభించుట జరిగినది. వంశధార ప్రాజెక్టు, తోటపల్లి రిజర్వాయర్ స్కీం, పులిచింతల ప్రాజెక్ట్, తెలుగుగంగ ప్రాజెక్ట్ మరియు వెలిగొండ ప్రాజెక్ట్‌లను క్రమపద్ధతిలో పూర్తిచేసి అతివృష్టి/అనావృష్టిల వలన కలుగు ఇబ్బందులను వీలైనంత తక్కువ స్థాయికి తగ్గించుటకు ప్రభుత్వము కృతనిశ్చయముతో ఉన్నది.

108.మిగులు నీటిని వృధాగా కాకుండా బదిలీచేయడానికి రాష్ట్రంలోని అనుసంధానించే మహా సంగమం ప్రాజెక్టును మా ప్రభుత్వం చేపట్టింది. నీటి పరిరక్షణకు, త్రాగునీరు లభ్యతకు కరువు నివారణకు పరిశ్రమ అభివృద్దికి ఈ అనుసంధానం ఎంతో దోహదపడుతుంది. ఇప్పటివరకు మా ప్రభుత్వం ఈ రంగంపై 64,334 కోట్లను ఖర్చుచేసింది.

109. ప్రజా రాజధాని, అమరావతిని ప్రపంచంలోనే ఐదు ఉత్తమ నగరాలలోనే ఒకటిగా అభివృద్ధి చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. స్వచ్ఛంద భూసమీకరణ పథకం ద్వారా 28,074 రైతుల నుండి 34,010

ఎకరాలు సమకూరడం ఎన్నో ప్రశంశలకు కారణమైంది. ఈ విధానం అంతర్జాతీయ బిజినెస్ సూళ్ళలో ఒక కేస్ స్టడీగా మారింది.

110. అమరావతి నిర్మాణానికయ్యే ఖర్చు మొత్తం 1,09,023 కోట్లుగా అంచనా వేయబడింది. మొదటి దశలో భాగంగా ఇప్పటికే 39,875 కోట్ల నిర్మాణ పనులు వివిధ దశలలో ఉన్నాయి. సచివాలయము మరియు శాఖాధిపతుల సమీకృత కార్యాలయము ఐదు టవర్లుగా నిర్మింపబడుతూ, అక్టోబరు 2020 నాటికి పూర్తవుతుంది. శాసనసభ్యులు వివిధ ప్రభుత్వ ఉద్యోగులకు నిర్మితమవుతున్న 3840 ఫ్లాట్లు ఈ సంవత్సరంలోనే పూర్తిచేసేందుకు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కళాత్మకమైన వంతెనను అమరావతికి అనుసంధానించడానికి ఇటీవలే పవిత్ర సంగమం వద్ద వంకుస్థాపన చేశాము.

111. విద్య, ఆరోగ్య కేంద్రంగా అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతుంది. వీ.ఐ.టి., ఇస్.ఆర్.ఎం. అమృత విశ్వవిద్యాలయం, ఎక్స్. ఎల్.ఆర్.ఐ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డజైన్లతోపాటు మరో ఎనిమిది విద్యాసంస్థలు అమరావతిలో ఏర్పాటు అవుతున్నాయి. ఇండో-యు.కె ఆసుపత్రులు, బి.ఆర్. షెట్టి హాస్పిటల్స్, బసవతారకం మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు హైదరాబాద్ ఐ ఆన్స్టిట్యూట్ వంటి ప్రముఖ ఆరోగ్య సంస్థలను మన అమరావతి ఆకర్షిస్తోంది.

112. అమరావతి మెరైన్ ప్రాజెక్టు భారత దేశంలోనే పెద్ద మెరైన్ ప్రాజెక్టుగా, పర్యాటక గమ్యంగా మారుతుంది. వివిధ ఐదు నక్షత్రాలు, నాలుగు నక్షత్రాల హోటళ్ళు, హిల్టన్, క్రౌన్ ప్లాజా, Novatel, Holyday Inn, GRT, Green Park, Daspalla వంటి ఐదు నక్షత్రాలు, నాలుగు నక్షత్రాల హోటళ్ళకు ఇప్పటికే స్థలాలు కేటాయించాము. Marriott, ITC, TAJ వంటి సంస్థలకు స్థలాల కేటాయింపు పరిశీలనలో ఉంది.

113. పట్టణ మౌళిక సదుపాయాలు గత నాలుగున్నర సంవత్సరాలలో 4,707 కోట్లు వెచ్చించి వివిధ పట్టణాభివృద్ధి కార్యక్రమాలను మా ప్రభుత్వం చేపట్టింది. 68,084 కోట్ల ప్రాజెక్టు విలువలతో పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయి. గత నాలుగున్నర సంవత్సరాలలో 8,858 కి.మీ.ల రోడ్లు, 668 MLD ల మంచినీటి సరఫరా, 206 MLDల మురుగునీరు సామర్థ్యము తోడయ్యాయి. 3,055 కిలోమీటర్ల మురుగునీటి కాలువలు 2381 కిలోమీటర్ల వరదనీటి కాలువలు వేశాము. విజయవాడ, కాకినాడ, తిరుపతి మరియు అమరావతితోపాటు శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, అనంతపురం కర్నూలు, ఏలూరులను కూడా సుందర నగరాలుగా మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది.

114. మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి పథకము ద్వారా వచ్చే నిధులను 24 ప్రభుత్వ శాఖలకు అనుసంధానించి అనేక ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమాలను గ్రామీణ ప్రాధమిక, మౌలిక సదుపాయల అభివృద్ధికి మా ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ అనుసంధానము ద్వారా బడ్జెట్ కేటాయింపులు 750 కోట్ల నుండి 1000 కోట్లకు పెరిగాయి. పంట సంజీవని, నీరు-చెట్టు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, వాడ వాడలో చంద్రన్న బాట, ఘన వ్యర్థాల నిర్వాహణ, అంగన్ వాడీ కేంద్రాలు, Soak pits బీటీ రోడ్లు, గోకులములు,

స్మశాన వాటికలు, పాఠశాలలకు ప్రహరి గోడలు, ఉద్యాన క్షేత్రాలు, పార్కులు, ఆట స్థలాలు, డిబియం రోడ్లు వంటివి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద మా ప్రభుత్వం చేపడుతుంది.

115. మా ప్రభుత్వం, 25 వేల కిలోమీటర్ల అంర్గత రహదారులను ఇప్పటికీ పూర్తిచేసి మరో ఎనిమిది వేల కిలోమీటర్ల రోడ్లను చేపట్టింది. అన్ని గ్రామాలలోను రాబోవు 2 సంవత్సరాలలో సి.సి. రోడ్లతో అనుసంధానిస్తాము. 2,666 నివాస ప్రాంతాలకు 2,599 కోట్ల రూపాయలతో బి.టి. రోడ్లు ఏర్పరిచాము. మిగిలిన 10,755 నివాస ప్రాంతాలను 2020 నాటికి పూర్తిచేస్తాము.

116. చంద్రన్న కాంతి పథకము ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధిక సంఖ్యలో LED బల్బులను ఏర్పరచింది. ఇప్పటికి 21.21 లక్షల LED బల్బులను ఏర్పాటుచేశాము. ఇవి 1138 కోట్ల విలువచేసే 1,181 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదాచేసింది.

117. జూలై 2018లో మన రాష్ట్రం ODF హోదాను సాధించింది. ప్రజల భాగస్వామ్యంతో 4116 ఖర్చుతో 38.64 లక్షల IHHLలను నాలుగున్నర సంవత్సరాల స్వల్పకాలంలో నిర్మించాము.

118. 2014 నుండి 6,10,711 వ్యవసాయ చెరువులను 1,647 వ్యయంతో నిర్మించాము, ఇంత పెద్ద సంయలో వ్యవసాయ చెరువులు ఉన్న రాష్ట్రం మనదే.

119. గ్రామీణ నీటి సరఫరా: 2024 నాటికి గ్రామీణ ప్రాంతాలలోని గృహనికి తగినంత నీటిని సరఫరా చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యం, దీని కొరకు దాదాపు 22000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులను టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్.టి.ఆర్. సుజల పథకం క్రింద త్రాగునీటి నాణ్యత లోపించి ఇబ్బంది పడుతున్న ప్రాంతాలలో నీటి శుద్ధీకరణ ప్లాంట్లును స్థాపించి నాణ్యమైన త్రాగు నీరు అందుబాటులోకి తీసుకురావలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని కొరకు 103 క్లస్టర్లతో 7787 నివాస ప్రాంతాలను గుర్తించడం జరిగింది.

120. ఇంధన మౌలిక వనరులు: గత నాలుగున్నర సంవత్సరాలలో రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థాపిత సామర్థ్యం రెట్టింపు అయింది. అనగా 9529 మెగావాట్ల నుండి 19,680 మెగావాట్లకు వ్యవస్థాపిత సామర్థ్యం పెరిగింది. పునరుత్పాదక ఇంధన రంగంలో 36,604 కోట్ల పెట్టుబడితో, 13000 మందికి ఉపాధి కల్పించేటట్లుగా వివిధ ప్రాజెక్టుల స్థాపన జరిగింది. ఇవి వివిధ దశలలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయి. మా ప్రభుత్వం కృషివలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ లోటు నుండి బయటకి వచ్చి మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా అవతరించడమే కాక 100 శాతం విద్యుదీకరణను సాధించింది. ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి రోజుకు 7 గంటల ఉచిత విద్యుత్, మిగతా రంగానికి 24X7 నిరంతర విద్యుత్ సరఫరా చేయడం జరుగుతున్నది.

121. గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 999 యూనిట్ల వరకు విద్యుత్తు వినియోగించే వ్యవసాయ, గృహ వినియోగదారులకు ఎటువంటి సుంకం పెంచలేదు. మా ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సుంకాలలో ఎటువంటి పెరుగుదలని ప్రతిపాధించలేదు. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ప్రోత్సహించడానికి ఒక యూనిట్ విద్యుత్ కు 1 రూపాయి సబ్సిడీ ప్రతిపాదించడం జరిగింది. దీనివలన చార్జింగ్ స్టేషన్లకు యూనిట్లకు అయ్యే వ్యయం రూ.6.95 నుండి రూ.5.95 కి తగ్గుతుంది. ఈ ప్రతిపాదన వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అమలులోకి వస్తుంది.

122. ఫైబర్ గ్రిడ్: రాష్ట్ర ప్రభుత్వము యొక్క 5 గ్రిడ్లలో ఫైబర్ గ్రిడ్ ఒకటి. రాష్ట్ర సాంఘిక ఆర్ధిక అభివృద్ధి కొరకు అన్ని గృహములకు గ్రామీణ ప్రాంతాలలోని మారు మూలలకు ఇంటర్నెట్ సేవలను ఎక్కువ స్పీడ్ తో అందుబాటు ధరలో అందించుటకు ఫైబర్ గ్రిడ్ ఏర్పాటుచేయటమైనది. రాష్ట్రములోని మారుమూల మరియు ఏజెన్సీ ఏరియాలకు ఉచిత స్పీస్ ఆప్టిక్ కమ్యూనికేషన్ వ్యవస్థను మన ప్రభుత్వము ప్రారంభించినది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వీడియో కాన్ఫరెన్స్ ద్వార ప్రపంచములోనే తొలిసారి ఒక మారుమూల గిరిజన గ్రామమును, దావోస్‌లో జరిగిన అంతర్జాతీయ ఫారముతో కలిపినది. రాబోవు 5 సంవత్సరాలలో రాష్ట్రంలోని ప్రతి గృహమునకు ట్రిపుల్ ప్లే కనెక్టవిటీని, అన్ని గ్రామపంచాయితీలకు హైస్పీడ్ ఇంటర్నెట్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలకు 3,000 ప్రాంతాలలో వైఫై ఎపిక్స్, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతములలో గల 6,000 అదనపు ప్రభుత్వ తరగతి గదులకు, టెలికం టవర్లు టెక్నాలజీ ద్వార అందించడమైనది. ఫైబర్ గ్రిడ్ ప్రొజెక్ట్‌లో భాగముగా 620 మండలాలలో 4,000 గ్రామములలో 6 లక్షల సంస్థలకు నెలకు రూ.149 చొప్పున ట్రిపుల్ ప్లే సర్వీసులు అందించుచున్నది.

123. విమానాశ్రయాలు: మా ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా రాష్ట్రంలో విమాన ప్రయాణికుల సంఖ్య 5.5 మిలియన్లకు పెరిగింది. విమాన ప్రయాణికులకు సంఖ్యతో జాతీయ సగటులో 12 శాతం వృద్ధి ఉండగా, రాష్ట్రంలో వృద్ధి 38 శాతం గా ఉంది. మా ప్రభుత్వం విమాన ఇంధనంపై పన్నును 16 శాతం నుండి 1 శాతం తగ్గించింది. అంతేకాక, ప్రస్తుత ఉన్న విమానాశ్రయాలను విస్తరించడమే కాక, భోగాపురం, ఓర్వకల్, దగదర్తి వంటి నూతన విమానాశ్రాయల ఏర్పాటుతో పాటు కుప్పం వద్ద పియర్ స్ట్రిడ్ ను నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది

124. నౌకాశ్రయాలు: రాష్ట్రాన్ని తూర్పుతీర ప్రాంత నౌకా వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ పోర్ట్ పాలసీ-2015 ని రూపొందించడం జరిగినది మరియు రాష్ట్రంలో నూతనంగా భావనపాడు మరియు కాకినాడ సెజ్ పోర్ట్లను పి.పి.పి. పద్ధతిలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. 2025 నాటికి భావనపాడు, కాకినాడ, మచిలీపట్నం మరియు రామాయపట్నం వంటి నాలుగు నాన్ మేజర్ పోర్ట్‌లను అందుబాటులోకి తెచ్చేవిధంగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 125. గ్యాస్ మౌళిక సదుపాయములు: నాచురల్ గ్యాస్ ఒక పరిశుద్ధమైన, సహజమైన ఇంధన వనరు. గ్యాస్ కు సంబంధించిన మౌలిక సదుపాయములు అభివృద్ధి కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందెన్నడూలేని విధంగా కొన్ని విధాన పరమైన నిర్ణయములు తీసుకున్నది. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అనుసంధానించే గ్యాస్ గ్రిడ్ ను నెలకొల్పుటకు నిర్ణయించింది. నగరాలలో గ్యాస్ పంపిణీ కొరకు తూర్పు గోదావరి జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలోని అన్ని పట్టణాలలో మరియు నగరాలలో ఉచితముగా పైప్ లైన్ వేయుటకు అనుమతులు మంజూరు చేయటమైనది. గత నాలుగున్నర సంవత్సరాలలో 330 కోట్ల రూపాయల పెట్టుబడితో వివిధ గ్యాస్ సంబంధిత మౌళిక సదుపాయముల కల్పన రాష్ట్ర వృద్ధికి ప్రతక్షంగా ఉపయోగపడింది.

126. రోడ్లు మౌళిక వసతులు: అమరావతి నుండి అనంతపురం వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్స్ వేక్రింద 384 కిలోమీటర్లు రోడ్‌ను సుమారు 20,000 కోట్ల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు నిర్మించుటకు అనుమతి లభించింది. దీని మూలంగా రాయల సీమ ప్రాంతం నుండి రాజధానికి మరియు పోర్టులకు మధ్య దూరం మరియు ప్రయాణ సమయములు తగ్గుతాయి. ఈ జాతీయ రహదారి యొక్క పొడవు 2014 సంవత్సరము జూన్ నుండి 2164 కిలోమీటర్లుగా పెరిగింది. ఇది ప్రస్తుతం ఉన్న పొడవు కంటే 50 శాతం ఎక్కువ. రాష్ట్రములోని నేషనల్ హైవే వింగ్ రహదారులు - భవనముల శాఖ మరియు నేషనల్ హైవే ఆథారిటీ వారిచే నిర్మింపబడి నిర్వహంచబడుచున్న రహదారులను చదును చేసి రెండు లైన్లగా 2020 నాటికి ఆధునీకరించుటకు నిర్ణయించడమైనది. జూన్ 2014 తర్వాత 2400 కిలోమీటర్ల రెండు వైపుల చదును చేసిన దహదారులను 12,729 కోట్ల రూపాయలతో 4 లైన్ల దహదారిగా విస్తరించుట జరిగినది. రాష్ట్ర రహదారుల వ్యవస్థ 41956 కీ.మీ. నుండి 46342 కీ.మీ. కు 2014-15 తర్వాత పెరిగినది. 1800 కీ.మీ. పొడవైన నాన్ బిటి రోడ్లను 1580 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2020 నాటికి బిటి రహదారులుగా మార్చడము జరుగుతుంది. 2000 PCUలకు పైగా ట్రాఫిక్ ఉండే అన్ని సింగిల్ రహదారులను రెండు లైన్లగా విస్తరించుటకు మా ప్రభుత్వము కృషి చేస్తుంది.

127. ప్రకృతి వనరులు - అడవులు: మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ ను స్థాపించిన తర్వాత రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం ఉండేలా 2029 నాటికి ఏర్పాటు చేయుటకు వనం - మనం అను కార్యక్రమమును లక్ష్యముగా పెట్టుకొనుట జరిగినది. ఈ లక్ష్యము దిశగా ప్రచారం నిర్వహించుట జరుగుతున్నది. జీవ వైవిధ్యంతో కూడిన విస్తృతమైన అడవులు మరియు కార్బన్ సింక్ తో కూడిన ఆంధ్రప్రదేశ్‌కు ఇది ఉపకరిస్తుంది. పౌరులకు సురక్షితమైన నివసించు ప్రదేశాలను రాష్ట్రములో కల్పించుట లక్ష్యంగా పెట్టుకొనుట జరిగింది.

శాంతి భత్రలు

128. శాంతి భద్రతల మెరుగుదలకోసం మాప్రభుత్వం చేపట్టిన చర్యలు అన్నిరకాల నేరాలను తగ్గించాము. పౌరుల తోడ్పాటు, ఎలువంటి అసహనం లేకుండా ఉడటంవలన ఇది సాధ్యపడింది. మహిళల పట్ల జరిగే హింసలు, నేరాలను అరికట్టడానికి షీ టీమ్‌లను అన్నిచోట్ల నియమించాము. ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పరచి దాని అక్రమరవాణా అరికట్టాము. కఠినమైన విధానాలవల్ల ఇది సాధ్యపడింది. అడవుల సంపదని, పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది.

ఉద్యోగుల భాగస్వామ్యం మరియు సంక్షేమం

129. అధ్యక్షా! రాష్ట్ర పునర్నిర్మాణములో అంకితభావంతో సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వోద్యోగులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎన్నో దశాబ్దాలు వేరేచోట నివశించి క్రొత్త రాజధానికి తరలిరావడం తేలికైన విషయముకాదు. కుటుంబంతో గడపగలిగే సమయమూ మరియు పిల్లల విద్యపై ప్రభావం చూపినా, అమరావతికి తరలిరావడంలో తమదైన పాత్రను ఎంతో ఉ త్సాహంగా పోషించారు.

130. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం, వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళ స్థలాలు/ప్లాట్లు మంజూరు చేయడానికి నిర్ణయించడమైనది. క్రొత్త ఏర్పాటుతోపాటు న్యూ పెన్షన్ సిస్టంలో మార్పులు సూచించడానికి కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యోగులకు గ్రాట్యుటీ మరియు కుటుంబ పింఛను సదుపాయం కల్పించడం జరిగింది. అదే విధంగా 70 సంవత్సరాల వయస్సు దాటిన పింఛనుదారులకు 10% అదనపు పింఛను, పోలీస్ కానిస్టేబుళ్ళకు పదోన్నతి అవకాశం, నగదురహిత వైద్య సేవలకు ప్రభుత్వోద్యోగులకు హెల్త్ కార్డులు, ప్రభుత్వోద్యోగుల బకాయిల చెల్లింపు, కాంట్రాక్టు లెక్చరర్లకు కనీస టైమ్ స్కేల్ మొదలైన సౌకర్యాలు కల్పించడమైనది.

131 హోమ్ గార్డ్‌లు: మా ప్రభుత్వం హోమ్ గార్డ్‌ల నెలసరి డ్యూటి అలవెన్సును 12,000 నుండి 18,000 వరకు, అంగన్ వాడి వర్క్‌ర్ల పారితోషకాన్ని రాష్ట్ర విభజన సమయంలో ఉన్న 3,000 నుండి 10,000 వరకు, విఆర్ఎల పారితోషకాన్ని 6,000 నుండి 10,500 వరకు మరియు పార్ట్ టైమ్ వీఆర్ఓల వేతనాన్ని 10,500 నుండి 15,000లకు పెంచింది. పార్ట్ టైమ్ విఆర్ఓలకు మొదటిసారి పెన్షన్ సౌకర్యాన్ని మా ప్రభుత్వం ఇచ్చింది.

132. పోలీసు కానిస్టేబుళ్ళకు, ప్రమోషన్ అవకాశాలను పెంచి గవర్నమెంట్ డాక్టర్లకు సమయానికి ప్రమోషన్లు ఇచ్చి కాంట్రాక్ట్ లెక్చరర్లకు కనీస టైం స్కేల్ ఇచ్చి, ప్రభుత్వ ఉద్యోగుల PRC బకాయిలు చెల్లించి, నగదు రహిత వైద్య సేవలకు హెల్త్ కార్డులు ఇచ్చి, మా ప్రభుత్వం వివిధ ఉద్యోగ వర్గాలపై తమకున్న పక్షపాతాన్ని చాటుకుంది. ఉద్యోగుల వైద్య సేవలకై EHS పథకము ద్వారా 860 కోట్ల వ్యయంతో 2.8 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు సహకారాన్ని అందించాము.

133. ఫుల్ టై // డైలీ వెజ్/కన్సాలిడేటెడ్ పే పార్ట్ టైం ఉద్యోగుల వేతనాన్ని 2015 సవరించబడిన వేతన స్కేళ్ళలోని కనీస టైం స్కేల్ కు సమానంగా నిర్ణయించాము. అర్చకులు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, ఆయాలు, ఆశావర్కర్లు, హోమ్గార్డులు, విఆర్ఎలు, విఎఓలు, కాంట్రాక్టు, ఔట్ సోర్స్, ఉద్యోగులు, గోపాలమిత్రాలు, మొదలైన వారందరికి చెప్పుకోదగిన విధంగా వేతన పెంపును కల్పించాము.

134. కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 15 వేల రూపాయల దహన ఖర్చులను విస్తరించాము. కాంట్రాక్టు ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు పెంచాము. ఆలాగే 1.01 లక్షల అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల జీతాలను కేంద్రీకృత విధానం ద్వారా ఇచ్చాము.

135. యువతకు ప్రభుత్యోగ అవకాశాలు కల్పించడం కోసం మా ప్రభుత్వం 42 వేల పోస్టులను నేరుగా భర్తీచేయాలని నిర్ణయించింది. ఇందులో ఉపాధ్యాయ మరియు పోలీసు పోస్టులు ఉన్నాయి. అలాగే కారుణ్య నియామకాల విధానాన్ని సరళించాము.

ఆర్థిక వ్యవస్థ

136. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లక్ష్యాలను పూర్తిగా సాధించే క్రమంలో హేతుబద్దమైన క్రమబద్దీకరణ, సరళీకరణ కావించుకొని ఇ.ఆర్.పీ అప్లికేషన్ ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా మన రాష్ట్రం నిలిచింది. రిజర్వుబ్యాంక్ వారి ఇ-కుబేర్ 2.0ను వినియోగించుకుంటు బిల్లుల సమర్పణ, పరిశీలన, చెల్లింపుల క్రయలను కాగిత రహితంగా పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించే విధానాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రభుత్వం మనదే. ఈ క్రొత్త విధానాన్ని సరయైన మౌలిక సదుపాయాలు మరియు నెట్వర్క్లతో మద్దతు నెలకొల్పేందుకు మా ప్రభత్వం తగిన చర్యలు, కేటాయింపులు ప్రతిపాదిస్తుంది. ఆర్థిక శాఖ నియంత్రణలో పనిచేస్తున్న స్పెషల్ పర్పస్ వెహికల్ ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ ఎండ్ సర్వీసెస్‌చే, ప్రవేశపెట్టబడిన ఈ వ్యవస్థ స్థిరీకరణ దిశగా సాగుతుంది. సి.ఎఫ్.ఎం.ఎస్ ద్వారా పౌరుడు, వ్యాపారి లేదా ఉద్యోగి, ప్రభుత్వంతో ఆన్ లైన్లో ఎండ్ టు ఎండ్ వ్యవహారాలను జరిపే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ వలన ఇంతకు ముందు లాగా ట్రెజరీలకు వెళ్ళే అవసరం లేకుండా ఇంటినుంచిగాని, కార్యాలయం నుంచి గాని వెబ్/మొబైల్/టాబ్లెట్ ద్వారా ఆన్ లైన్లో వ్యవహారాలు తేలికగా జరపగలగడం ప్రధాన మార్పు.ఈ వ్యవస్థ బడ్జెట్, వ్యయాలు, రాబడులను సవర్ధవంతంగా నిర్వహిస్తుంది. సి.ఎఫ్.ఎం.ఎస్ వల్ల కాగిత రహిత కార్యకలాపాలకు ఒక చక్కని మార్గం ఏర్పడింది. రాష్ట్ర ఆర్థిక లావాదేవీలు, హెచ్.ఆర్ మరియు పే రోల్ వ్యవస్థలు పారదర్శకంగా సాగించడానికి ఇది ఉపయోగ పడుతుంది.

187. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వృద్ధి వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో ఎక్కువగా ఉంటుంది. కానీ పరిశ్రమలు సేవారంగాలకన్నా తక్కువ పన్నును అందిస్తాయి. ఇందువల్ల ఆర్థిక వృద్ధితో సమానంగా పన్నుల ఆదాయం పెరగడం లేదు. అయినప్పటికి మా ప్రభుత్వం పన్ను వసూళ్ళను పెంచటానికి కృషి చేస్తుంది. గత ఏడాదికన్న 14.61 శాతం వృద్ధిని వాణిజ్య పన్నులలో సాధించాము. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అక్రమ మైనింగ్ నిరోధించి ఆదాయాన్ని పెంచగలిగాము.

188. వ్యయాలు. వనరులను సమర్థవంతంగా వినియోగించడం వలన సంక్షేమ కార్యక్రమాలను విస్తరించగలిగాము. అర్హత కలిగిన లబ్దిదారులకు సహాయాన్ని అందించడంలో లీకేజీలను అరికట్టడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాము. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థలో ఆధార్ ఉపయోగం ద్వారా 2585 కోట్లను ఆదా చేయగలిగాము.

139. నాణ్యత ప్రమాణాలు: గడిచిన నాలుగున్నర ఏళ్ళలో నాణ్యత ప్రమాణాలు కూడిన వ్యయ నిర్వహణ చేస్తున్నామని సభ్యుల దృష్టికి తీసుకురావడమైనది. రిజర్వు బ్యాంక్ అంచనాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాలపై వెచ్చించే వ్యయములలో 2018-19కి గాను మొదటి మూడు స్థానాలలో వుంది. ప్రత్యేక హోదా లేని రాష్ట్రాల బడ్జెట్ 61.5 శాతం అభివృద్ధి కార్యమాలపై ఖర్చు చేస్తుండగా మన రాష్ట్రం బడ్జెట్లో 72.4 శాతం ఖర్చు చేస్తుంది. సంక్షేమ వ్యయంలో 51.1 శాతం తో అత్యుత్తమ స్థానంలో నిలిచాము. ఇది మా ప్రభుత్వ ఖర్చుల నాణ్యతను సూచిస్తుంది.

140. అప్పుల నిర్వహణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం అప్పులు 2014-15 సంవత్సరమునకు గల 1,48,744 కోట్ల రూపాయలు నుంచి 2017-18 సంత్సరమునకు 2,23,706 కోట్ల రూపాయలు పెరిగాయి. ఇది GSDP 2014-15 లో 28.33 శాతానికి సమానం కాగా 2017-18 సంత్సరమునకు 27.85 శాతానికి సమానంగా ఉంది.

141. నిర్మాణాత్మకమైన సవాళ్ళు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రతిభ చూపడంలో ముందు ఉన్నది. గడిచిన నాలుగున్నర సంవత్సరంలో భారత దేశపు వృద్ధిరేటు 7.3% ఉండగా ఆంధ్రప్రదేశ్ వృద్ధిరేటు 10.66% ఉన్నది ఇక వ్యవసాయ రంగంలో భారతదేశపు సగటు వృద్ధిరేటు 2.4 ఉండగా ఆంధ్రప్రదేశ్ 11% పారిశ్రామిక రంగంలో భారతదేశపు సగటు వృద్ధిరేటు 7.1% ఉండగా ఆంధ్రప్రదేశ్ సగటు వృద్ధిరేటు 9.52%గా ఉంది సేవారంగంలో భారతదేశపు వృద్ధిరేటు 8.8% ఉండగా ఆంధ్రప్రదేశ్ సగటు వృద్ధిరేటు 9.57% గా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో సంపూర్ణమైన వృద్ధిరేటు సాధించినని పై విషయాలు తెలియజేస్తున్నాయి.

142. 2018-19లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 11.5 శాతం వృద్ధిచెందాలనే లక్ష్యం 7.2 శాతంగా ఉన్నది దేశీయ వృద్ధిరేటుకన్నా అధికం. వ్యవస్థాగత లోపాలను సరిదిద్దుకునే సామర్థ్యం మర ప్రభుత్వానికి ఉండటం వలన రాబోవు సువత్సరాలలో సానుకూల ప్రభావంచూపస్తూ మరింత వృద్ధి సాధించగలము.

ఖాతాలు మరియు పద్దులు

143. 2017-18 ఖాతాలు: ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ పరిష్కరించిన ఆర్థిక ఖాతాల ప్రకారం 2017 ఏప్రల్ 1 నుండి 2018 మార్చి 31 మధ్యకాలానికి రూ.16,151.08 కోట్ల రెవెన్యూ లోటు, రూ.32,372.57 కోట్ల ఆర్థిక లోటు కనిపిస్తున్నది. 2017 ఏప్రిల్ 1 నుండి 2018 మార్చి 31 మధ్య కాలానికి రెవెన్యూ లోటు, ఆర్థికలోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వరుసగా 2.01 శాతం 4.03 శాతంగా ఉన్నాయి.

144. సవరించిన అంచనాలు: సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం రూ.1,50,858.53 కోట్లు, కేపిటల్ వ్యయం రూ.25,021.34 కోట్లు, 2018-19 సంవత్సరానికి రెవెన్యూ లోటు దాదాపు

రూ.2,494.12 కోట్లు కాగా ఆర్థిక లోటు దాదాపు రూ. 29,141.72 కోట్లు. ఇవి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వరసగా 0.27 శాతం మరియు 3.14 శాతం.

145. బడ్జెటు అంచనాలు 2019-20: ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,26,177.53 కోట్ల వ్యయాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1,80,369.33 కోట్ల మేరకు అంచనా వేయబడగా, క్యాపిటల్ వ్యయం రూ. 29, 596.33 కోట్లకు అంచనా వేయబడింది. 2018-19 బడ్జెట్ అంచనాల కన్నా 2019-20 బడ్జెట్ అంచనాలు మొత్తం మీద 18.38 పెరుగుదలను చూపిస్తున్నాయి. రెవెన్యూ వ్యయం సుమారు 20.03 శాతం పెరగనుండగా, క్యాపిటల్ వ్యయం 2018-19 ఆర్థిక సంవత్సరం కన్నా 20.03 శాతం ఎక్కువ కానుంది.

146. రెవిన్యూ లోటు రూ.2,099.47 కోట్ల మేరకు ఉండగలదని అంచనా వేయగా, ఆర్థిక లోటు సుమారు రూ. 32,390.68 కోట్ల మేరకు ఉండగలదని అంచనా. ఆర్థిక లోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.03 శాతం ఉండగా, రెవెన్యూ లోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.20 శాతంగా ఉండగలదు.

ముగింపు

147. కొత్తగా ఏర్పడిన దేశాలు, రాష్ట్రాల అభివృద్ధి పథం తొలి 10-15 ఏళ్ళ పునాదులపైనే ఆధారపడి ఉంటుంది అనేది చరిత్ర చెప్పిన సత్యం. ప్రజలు మనపై ఉంచిన అపారనమ్మకాన్ని పదేపదే మా మంత్రిమండలి సభ్యులకు గౌరవ ముఖ్యమంత్రివర్యులు గుర్తు చేస్తుంటారు. రాష్ట్ర ప్రగతి కోసం ప్రజలకిచ్చిన వాగ్దానం మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం ఒక నిర్దిష్ట మార్గంలో పని చేశాము. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలోని వాగ్దానాలు, అప్పటి ప్రధాన మంత్రి రాజ్యసభలో మనకిచ్చిన హామీల అమలు, కేంద్ర పన్నులో మన వాటా, కేంద్ర పథకంలో మనవాటా కోసం మన హక్కుల సాధన కోసం పోరాడటంలో ఎప్పుడు వెనుకంజ వేయలేదు. ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే యాచకులం అంతకన్నా కాదు.

148. ఎన్నో అడ్డంకులు ఎదురైనా మన గమ్యాన్ని చేరే మార్గాన్ని నిజమైన నాయకత్వం సుగమం చేస్తుంది అనేది సత్యం. 2022 నాటికి దేశంలో 3 అగ్రగ్రామి రాష్ట్రాలలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ రూపొందాలని, 2029 నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రం కావాలని, 2050 నాటికి ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఉపాధికల్పనా కేంద్రంగా, ఆంధ్రప్రదేశ్ రూపొందాలన్నదే మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రిగారి ఆకాంక్ష. ఇది కేవలం మాటలకే పరిమితమైంది కాదు. సరైన అభివృద్ధి వ్యూహాలతో భావితరాలకు మార్గదర్శకం చేసే దిక్చూచి. మా ప్రభుత్వం పనిచేస్తుంది కేవలం మాకు ఓటు వేసినవారి కోసమే కాదు, మాకు ఓటు వేయని వారి కోసం మరియు మన బిడ్డలు, వారిబిడ్డల కోసం పనిచేస్తోంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం పని చేయాల్సిన బృహత్తర బాధ్యత ప్రస్తుత తరంపై ఉంది.

149. సమాజంలో ప్రస్తుతం ఎదురయ్యే సవాళ్ళను పరిశీలిస్తే ఆర్థిక అసమానతలు, యాంత్రికత మరియు నిరుద్యోగత, వాతావరణ అనూహ్య మార్పులు, వృద్ధత్వం వంటివి ఎదుర్కొంటున్నాము. ఈ సవాళ్ళన్నింటినీ సమర్థంగా ఎదుర్కోగల, ఆర్థిక అసమానతలను తొలగించే సంక్షేమ పథకాలను అన్వేషించగల పరిపాలన వైపు సాగాల్సిన తరుణం ఇది. పింఛన్లు, రేషన్ కార్డులు, పక్కా ఇళ్ళ నిర్మాణం, ఉపకార వేతనాలు, బీమా, నిరుద్యోగ భృతి మొదలైన వాటిలో సంతృప్త స్థాయికి చేరడమే ఈ దిశగా మన ప్రయత్నం.

150. కియా మోటార్స్ వంటి అంతర్జాతీయ కంపెనీలు ఆకర్షించటం ద్వారా నాణ్యమైన ఉపాధి అవకాశాలను కల్పించే వాతావరణం రాష్ట్రంలో నెలకొల్పాం. ఫిన్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, బిగ్ డేటా తదితర కొత్తతరం సాంకేతికతలున్న సంస్థలపై పెట్టుబడులను రాబట్టి రాష్ట్రాన్ని, దాంతోపాటు మన యువతరాన్ని ప్రపంచంలోనే అత్యున్నత శక్తి వనరుగా రూపొందిస్తున్నాం. ఉద్యోగ భద్రత మరియు స్థానికుల ఉద్యోగాల కోసం మన పారిశ్రామిక విధానాలను మరింత మెరుగు పరుస్తున్నాము.

151. వాతావరణ మార్పుల విషయానికి వచ్చేసరికి “కరువు రహిత వ్యవసాయం” పెద్ద ఎత్తున విస్తృతం చేయటం, దానిని కొనసాగించటంలో మేము విజయం సాధించాం. సుస్థిరమైన మరియు పర్యావరణ హితమైన వృద్ధి సాధనలో “మనం పెట్టుబడి రహిత సహజ సేద్యంలో (ZBNF) అగ్రగ్రామీగా ఉన్నాం. ప్రకృతి విపత్తులనుండి రాష్ట్రాన్ని కాపాడటంలో పోలవరం డ్యామ్ దోహదపడుతుంది. పర్యావరణం మరియు ప్రజారోగ్య పరిరక్షణకు దోహదపడే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో మనమే ముందున్నాము. దీనితో పాటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పచ్చదనాన్ని పెంచుతున్నాము.

152. రాష్ట్ర సంపద ఎప్పటికప్పుడు పెంపొందాలంటే యువతరం జనాభా అత్యధికంగా ఉండాలి. రాష్ట్ర పునరుత్పత్తి రేటు తక్కువగా ఉండటంపై మన గౌరవ ముఖ్యమంత్రిగారు అనేకమార్లు ఆందోళన చెందడాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. పునరుత్పాదక రేటు తగ్గితే అది ఆర్థిక పరిస్థితిపై విషమ ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సవాలును అధిగమించాల్సిన అవసరం ఉంది.

153. అధ్యక్షా! గౌరవ ముఖ్యమంత్రిగారు, నా సహచరులు మరియు నేను మా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించడమే కాకుండా, భావితరాల భవిష్యత్తు కోసం కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మన రాష్ట్ర పునర్ నిర్మాణంలో, యావత్ ప్రజానీకం వెన్నుదన్నుగా ఉన్నారని మరువకూడదు. మన కఠోర శ్రమ, మన ఉద్యోగుల చిత్తశుద్ది, అంకిత భావం వల్లే ఇంత అభివృద్ధి సాధ్యమైంది. అందుకే, మనం సాధించిన ఈ ఘనవిజయాలు అన్నింటినీ మన ప్రజలకే అంకితం చేస్తున్నాము.

154. మన రాష్ట్రం ఆశించిన గమ్యం చేరేందుకు మనందరిలో నైతిక సామర్థ్యాన్ని పెంచిన సమర్థ నాయకత్వంపై రాష్ట్ర ప్రజానీకం యావత్తూ అచంచల విశ్వాసాన్ని ప్రదర్శిస్తుందని ఆశిస్తున్నాను.

Reach high, for stars lie hidden in you. Dream deep,

for every dream precedes the goal.

-Rabindranath Tagore

ఈ మాటలతో నేను ఈ బడ్జెట్ ను గౌరవసభ ముందు పరిశీలనకు మరియు ఆమోదించుటకుగాను సమర్పిస్తున్నాను.

- జై హింద్ -
జై ఆంధ్రప్రదేశ్
జై జన్మభూమి

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf
వెనక అట్ట
This work is available under the Creative Commons CC0 1.0 Universal Public Domain Dedication.

The person or the organisation responsible for this work, associated with this deed has dedicated the work to the public domain by waiving all of his or her rights to the work worldwide under copyright law, including all related and neighboring rights, to the extent allowed by law. You can copy, modify, distribute and perform the work, even for commercial purposes, all without asking permission.