Jump to content

3. నారదుండు బ్రహ్మను బ్రపంప ప్రకారం బడుగుట

వికీసోర్స్ నుండి


వ. నారదుండు బ్రహ్మ కిట్లనియె. ( 72 ).

మ.చతురాస్యుండపు వేల్పు పెద్దవు జగ త్సర్గానుసంధాయి వీ

శ్రుతిసంఘాతము నీ ముఖాంబుజములన్ శోభిల్లు శబ్దార్ధ సం

యుతమై సర్వము నీ కరామలకమై యుండుం గదా! భారతీ

సతి యిల్లా లఁట నీకు నో జనక! నా సందేహమున్ బాపవే! ( 73 )


శా. ప్రారంభాది వివేక మెవ్వఁడొసఁగున్? బ్రారంభ సంపత్తికా

ధారం బెయ్యది? యేమి హేతువు ? యదర్ధం బే స్వరూపంబు సం

సారానుక్రమ మూర్ణనాభి పగిదిన్ సాగింతు వెల్లప్పుడున్

బారం బెన్నఁడు లేదు నీమనువు దుష్ప్రాపంబు వాణీశ్వరా! ( 74 )


శా. నాకుం జూడఁగ నీవు రాజ వనుచున్నాఁడన్ యథార్థస్థితిన్

నీ కంటెం ఘనుఁడొక్క రాజు గలఁడో నీ వింతకున్ రాజవో

నీ కే లాభము రాఁదలంచి జగముల్ నిర్మించె దీ చేతనా

నీకం బెందు జనించు నుండు నణఁగున్ నిక్కంబు భాషింపుమా. ( 75 )


మ.సదస త్సంగతి నామ రూప గుణ దృశ్యంబైన విశ్వంబు నీ

హృదధీనంబు గదా! ఘనుల్ సములు నీ కెవ్వారునున్ లేరు నీ

పద మత్యున్నత మిట్టి నీవు తపముల్ ప్రావీణ్య యుక్తుండవై

మది నే యీశ్వరుఁ గోరి చేసితివి త న్మార్గంబు సూచింపవే. ( 76 )


శా. అంభోజాసన! నీకు నీశుఁడు గలం డంటేనిఁ ద త్పక్షమం

దంభోజాతభవాండ మే విభుని లీలాపాంగ సంభ్రాంతిచే

సంభూతంబగు వర్తమానమగు సంఛన్నంబగున్ ద ద్విభున్

సంభావింపఁగ వచ్చునే తలఁప నే చందంబు వాఁ డాకృతిన్. ( 77 )


క. తోయజ సంభవ ! నా కీ, తోయము వివరింపు చాలఁ దోఁచిన నే నా

తోయము వారికి నన్యుల, తోయములం జెందకుండ ధ్రువ మెఱిఁగింతున్. ( 78 )


వ. దేవా! భూత భవిష్య ద్వర్త మానంబులగు వ్యవహారంబులకు నీవ విభుండవు. నీ వెఱుంగని యర్థం బించుకయు లేదు. విశ్వప్రకారంబు వినిపింపు మనిన విని వికసితముఖుండై విరించి యిట్లనియె. ( 79 )

క. రారా? బుధులు విరక్తులు, గారా? యీరీతి నడుగంగా నేరరు వి

స్మేరావహము భవ స్మిత, మౌరా ! నా పైడి! మర్మ మడిగితి వత్సా! ( 80 )


శా. నానా స్థావర జంగమ ప్రకరముల్ నాయంత నిర్మింప వి

న్నాణం బేమియు లేక తొట్రుపడఁగా నాకున్ సమస్తాను సం

ధానారంభ విచక్షణత్వము మహోదారంబుగా నిచ్చె ము

న్నే నా యీశ్వరు నాజ్ఞఁ గాక జగము ల్నిర్మింప శక్తుండనే. ( 81 )


మ. అనఘా! విశ్వమునెల్ల దీప్తముగఁ జేయన్ నే సమర్థుండనే?

యిన చంద్రానల తారకాగ్రహ గణం బే రీతి నా రీతి నె

వ్వని దీప్తిం బ్రతిదీప్త మయ్యె భువనవ్రాతంబు, దద్దీప్తిచే

ననుదీప్తం బగు నట్టి యీశ్వరున కే నశ్రాంతమున్ మ్రొక్కెదన్. (82 )


మ. వినుమా యీశ్వరు దృష్టిమార్గమున నావేశింప శంకించి సి

గ్గున సంకోచము నొంచు మాయవలనం గుంఠీభవ త్ప్రజ్ఞచే

నను లోకేశ్వరుఁ డంచు మ్రొక్కు మతిహీన వ్రాతముం జూచి నే

ననిశంబు న్నగి ధిక్కరింతు హరిమాయా కృత్యమంచున్ సుతా! ( 83 )


వ.మఱియు దేహంబునకు ద్రవ్యంబులైన మహాభూతంబులను, జన్మనిమిత్తంబు లైన కర్మంబులును, కర్మక్షోభకంభైన కాలంబును, కాల పరిణామ హేతువైన స్వభావంబును, భోక్తయైన జీవుండును, వాసుదేవుండుగా నెఱుంగుము. వాసుదేవ వ్యత్తిరిక్తంబులేదు, సిద్ధంబు. ( నారాయణ నియమ్యంబులు లోకంబులు). దేవతలు నారాయణ శరీర సంభూతులు. వేద యాగ తపో యోగ గతి విజ్ఞానంబులు నారాయణపరంబులు. (జ్ఞానసాధ్యం బగు ఫలంబు నారాయణాధీనంబు). కూటస్థుండు, సర్వాత్మకుండు, సర్వద్రష్టయునైన యీశ్వరుని కటాక్ష విశేషంబున సృజియింపంబడి, ప్రేరితుండనై, సృజ్యంబైన ప్రపంచంబు సృజింపుచుండుదు. నిర్గుణుం డైన యీశ్వరుని వలన రజస్సత్త్వతమో గుణంబులు ప్రభూతంబులై యత్పత్తి స్థితి లయంబులకుఁ బాలుపడి, కార్యకారణ కర్తృత్వ భావంబులందు ద్రవ్యంబులైన మహాభూతంబులు, జ్ఞానమూర్తులైన దేవతలు, క్రియారూపంబులైన యింద్రియంబులు, నాశ్రయంబులుగా నిత్యముక్తుండయ్యును, మాయ సమన్వితుండైన జీవుని బంధించు. జీవులకు నావరణంబులై యుపాధిభూతంబులైన మూఁడు లింగంబులంజేసి పరులకు లక్షితంబుగాక తనకు లక్షితంబైన తత్వంబు గల యీశ్వరుం డి వ్విధంబునం గ్రీడించుచుండు. ( 84 )


క. ఆ యీశుఁ డనంతుఁడు హరి, నాయకుఁ డీ భువనములకు నాకున్ నీకున్

మాయకుఁ బ్రాణివ్రాతము, కేయెడలన్ లేదు నీశ్వ రేతరము సుతా! ( 85 )


వ. వినుము మాయావిభుండైన యీశ్వరుండు దన మాయంజేసి దైవయాగంబునం బ్రాప్తంబులైన కాల జీవాదృష్ట స్వభావంబులు వివిధంబులు సేయ నిశ్చయించి గైకొనియె. ఈశ్వరాధిష్త్హతంబైన మహత్తత్త్వంబు వలన ( నగు కాలంబున గుణ వ్యతికరంబును స్వభావంబునఁ బరిణామంబును, జీవాదృష్ట భూతంబైన కర్మంబున జన్మంబును నయ్యె. రజ స్సత్త్వంబులచే నుపబృంహితమై వికారంబు నొందిన మహాత్తత్త్వంబు వలనం) దమ:ప్రధానంబై ద్రవ్య జ్ఞానక్రియాత్మకంబగు నహంకారంబు గలిగె. అదియు రూపాంతరంబు నొంచుచు ద్రవ్య శక్తియైన తామసంబుఁ క్రియాశక్తియైన రాజసంబు, జ్ఞాన శక్తియైన స్వాతికంబును నన మూఁడు విధంబులయ్యె. అందు భూతాదియైన తామసాహంకారంబు వలన నభంబు గలిగె. నభంబునకు సూక్ష్మరూపంబుఁ ద్రష్టృ దృశ్యంబులకు బోధకం బైన శబ్ద్ంబు గుణం బగు. నభంబు వలన వాయువు గలిగె. వాయువునకుఁ బరాన్వయంబున శబ్దంబు స్పర్శంబు నను రెండు గుణంబులు గలిగి యుండును. అది దేహంబునందుండుటం జేసి ప్రాణరూపంబై యింద్రియ మన శ్శరీరపాటవంబు లైన యోజస్సహోబలంబులకు హేతువై వర్తించు. వాయువు వలన రూప స్పర్శ శబ్దంబు లనియెడి గుణంబులు మూఁటి తోడఁ దేజంబు గలిగె. తేజంబు వలన రసరూప స్పర్శ శబ్దంబు లనియెడు నాలుగు గుణంబులతోడ జలంబు గలిగె. జలంబు వలన గంధ రస రూప స్పర్శ శబ్దంబు లనియెడి గుణంబు లయిదింటితోడం బృథివి కలిగె. వైకారికంబైన సాత్త్వికాహంకారంబు వలనఁ జంద్ర దైవతంబైన మనంబు గలిగె. మఱియు దిక్కులు, వాయువు, అర్కుండు, ప్రచేతస్సు, అశ్వినులు, వహ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుండుఁ ప్రజాపతియు ననియెడి దశ దేవతలు గలిగిరి. తైజసంబైన రాజసాహంకారంబు వలన దిగ్దైవతంబైన శ్రవణేంద్రియంబు, వాయుదైవతంబైన త్వగింద్రియంబు, సూర్యదైవతంబైన నయనేంద్రియంబు, ప్రచేతోదైవతంబైన రసనేంద్రియంబు, అశ్వినీదైవతంబైన జ్ఞాణేంద్రియంబు, వహ్నిదైవతంబైన వాగింద్రియంబు, ఇంద్రదైవతంబైన హస్తేంద్రియంబు, ఉపేంద్రదైవతంబైన పాదేంద్రియంబు, మిత్రదైవతంబైన గుదేంద్రియము, ప్రజాపతిదైవతంబైన గుహ్యేంద్రియంబు, ననియెడి దశేంద్రియంబులను బోధజన కాంత:కరణైక భాగంబైన బుద్ధియుఁ, గ్రియాజన కాంత:కరణంబైన ప్రాణంబును గలిగె. ఇట్టి శ్రోత్రాదులగు దశేంద్రియంబులతోఁ గూడిన భూతేంద్రియ మనోగుణంబులు వేర్వేఱుగ ( బ్రహ్మాండ శరీర నిర్మాణంబునం దసమర్ధంబులగు నపుడు భగవచ్ఛక్తి ప్రేరితంబులగుచు నేకీభవించి సమిష్టి వ్యష్ట్యాత్మ కత్వంబు నంగీకరించి) చేతనా చేతనంబుల గల్పించె. అట్టి యడంబు వర్షాయుత సహస్రాతంబు దనుక జలంబునం దుండె. ( కాల కర్మ స్వభావంబులం దగులు వడక సమస్తమును జీవయుక్తముగఁజేయు నీశ్వరుండ చేతనంబున సచేతనంబుగ నొనర్చె.) అంతఁ గాలకర్మ స్వభావ ప్రేరకుండైన పరమేశ్వరుండు జీవరూపంబున మహావరణ జలమధ్య స్థితంబైన బ్రహ్మాండంబులోను బొచ్చి సవిస్తరంబు గావించి ( యట్టి యండంబు భేదించి నిర్గమించె . ఎట్లుంటేని.) ( 86 )


క. భువనాత్మకుఁ డా యీశుఁడు, భవనాకృతితోడ నుండు బ్రహ్మాండంబున్

వివరముతోఁ బదునాలుగు, వివరంబులుగా నొనర్చె విశదంబులుగన్. ( 87 )


మ. బహు పా దోరు భుజాస నేక్షణ శిర: ఫాల శ్రవో యుక్తుఁడై

విహరించున్ బహుదేహి దేహగతుఁడై విద్వాంసు లూహించి త

ద్బహురూ పావయవంబులన్ భువన సంపత్తిన్ విచారింతు రా

మహనీయాద్భుతమూర్తి యోగిజన హృన్మాన్యుండు మేధానిధీ! ( 88 )


వ. వినుము చతుర్ధశ లోకంబులందు మీఁది యేడు లోకంబులు, శ్రీ మహావిష్ణువు నకుం గటిప్రదేశంబున నుండి యూర్ధ్వదేహ మనియును, గ్రింది యేడు లోకంబులు జఘనంబున నుండి యధోదేహ మనియునుం బలుకుదురు. ప్రపంచ శరీరకుండగు భగవంతుని ముఖంబు వలన బహ్మకులంబు, బాహువుల వలన క్షతృయ కులంబు, ఊరువుల వలన వైశ్యకులంబు, పాదంబు వలన శూద్ర కులంబు జనియించె నని చెప్పుదురు. భూలోకంబు గటి ప్రదేశంబు, భువర్లోకంబు నాభి, సువర్లోకంబు హృదయంబు, మహర్లోకంబు వక్షంబు, జనలోకంబు గ్రీవంబు, తపోలోకంబు శిరంబు, కటిప్రదేశం బతలంబు, తొడలు వితలంబు, జానువులు సుతలంబు, జంఘలు దలాతలంబు, గుల్ఫంబులు మహాతలంబు, పాదాగ్రంబులు రసాతలంబు, పాదాతలంబు పాతాళంబు నని (లోకమయుంగా ) భావింతురు. కొందఱు మఱియుం బాదతలంబు వలన భూలోకంబును, నాభి వలన భువర్లోకంబును, మఱియుం బాదతలంబు వలన భూలోకంబును, నాభివలన భువర్లోకంబును, శిరంబు వలన స్వర్లోకంబును గలిగె నని లోక కల్పనంబు నెన్నుదురు.

                                                                 ==అధ్యాయం - ౬==

పురుషోత్తముని ముఖంబు వలన సర్వజంతు వాచాజాలంబును దదధిష్టాత యగువహ్నియు నుదయించె. చర్మ రక్త మాంస మేదశ్శల్య మజ్జా శుక్లంబులు సప్తధాతువు లందురు. పక్షాంతరంబున రోమ త్వ జ్మాం సాస్థి స్నాయు మజ్జా ప్రాణంబులను సప్తధాతువు లని యందురు. అందు రోమంబు లుష్ణిక్ఛందం బనియు, త్వక్కు ధాత్రీ ఛందం బనియు, మాంసంబు త్రిష్టుప్చందం బనియు, స్నాయు వనుష్టుప్చందం బనియు, ఆస్థి జగతీఛందంబనియు, మజ్జ పంక్తిచ్చందంబనియు, ప్రాణంబులు బృహతీ చందం బనియు నాదేశింతురు. హవ్య కవ్యామృతాన్నంబులకు మధురాది షడ్రసంబులకు రసనేంద్రియంబునకు రసాధీశ్వరుండైన వరుణునికిని హరి రసనేంద్రియంబు జన్మస్థానంబు. సర్వ ప్రాణాదులకు వాయువునకు విష్ణు నాసికా వివరంబు నివాసంబు, సమీప దూర వ్యాపిగంధంబులకు నోషధులకు నశ్వనీదేవతలకు భగవంతుని ఘ్రానేంద్రియంబు నివాసంబు, దేవలోక సత్య లోకంబులకుఁ దేజంబునకు సూర్యునికి సకలచక్షువులకు లోక లోచను చక్షురింద్రియంబు స్థానంబు, దిశలకు నాకాశంబునకు శ్రుతి భూతంబులైన యంశంబులకు శబ్దంబులకు సర్వేశ్వరుని కర్ణేంద్రియంబు జన్మ స్థానంబు, వస్తుసారంబులకు వర్ణనీయ సౌభాగ్యంబులకుం బరమపురుషుని గాత్రంబు భాజనంబు. స్పర్శంబునకు వాయువునకు సకల స్నిగ్ధంబులకు దివ్యదేహుని దేహేంద్రియంబు గేహంబు, యూప ప్రముఖ యజ్ఞోపకరణ సాధనంబులగు తరుగుల్మ లతాందులకుఁ బురుషోత్తముని రోమంబులు మూలంబులు. శిలా లోహంబులు సర్వమయుని నఖంబులు, మేఘజాలంబులు హృషీకేశుని కేశంబులు. మెఱుంగులు విశ్వేశ్వరుని శ్మశ్రువులు, భూర్భువ స్సువర్లోక రక్షకులైన లోక పాలకుల పరాక్రమంబులకు, భూరాది లోకంబుల క్షేమంబునకు, శరనంబునకు, నారాయణుని విక్రంబులు నికేతనంబులు. సర్వకామంబులకు నుత్తమంబు లైన వరంబులకుఁ దీర్ధపాదుని పాదారవిందంబు లాస్పదంబులు. జలంబులకు, శుక్లంబునకు, పర్జన్యునకు, ప్రజాపతి సర్గంబునకు, సర్వేశ్వరుని మేడ్రంబు సంభవ నిలయంబు. సంతానంబునకుఁ గామాది పురుపార్థంబులకుఁ జిత్త సౌఖ్యరూపంబులకు నానందంబులకు, శరీర సౌఖ్యంబునకు నచ్యుతుని యుపస్థేంద్రియంబు స్థానంబు, యమునికి, మిత్రునికి, మలవిసర్గంబునకు భగవంతుని పాయ్మింద్రియంబు భువనంబు, హింసకు నిరృతికి మృత్యువునకు నిరయంబునకు నిఖిలరూపకుని గుదంబు నివాసంబు. పరాభవంబునకు నధర్మంబునకు నవిద్యకు ననంతుని పృష్ట భాగంబు సదనంబు. నద నదీ నివహంబునకు నీశ్వరుని నాడీ సందేహంబు జన్మ మందిరంబు. పర్వతంబులకు నధోక్షజుని శల్యంబులు జనక స్థలంబులు. ప్రధానంబునకు నన్నరసంబులకు సముద్రంబులకు భూవలయంబునకు బ్రహ్మాండ గర్భుని యుదరంబు నివేశంబు. మనోవ్యాపార రూపంబగు లింగ శరీరంబునకు మహా మహిముని హృదయంబు సర్గభూమి యగు. మఱియు. ( 89 )

ఆ. నీలకంధరునకు నీకు నాకు సనత్కు, మార ముఖ్య సుత-సమాజమునకు

ధర్మ సత్త్వ బుద్ధి తత్త్వములను నీశ్వ, రాత్మ వినుము పరమమైన నెలవు. ( 90 )


సీ. నర సురాసుర పితృ నాగ కుంజర మృగ గంధర్వ యక్ష రాక్షస మహీజ

సిద్ధ విద్యాధర జీమూత చారణ గ్రహ తార కాప్సరోగణ విహంగ

భూత తటి ద్వసు పుంజంబులను నీవు మూక్కంటియును మహామునులు నేను

సలిల నభస్స్థల చరములు మొదలైన వివిధ జీవులతోడ విశ్వమెల్ల

ఆ. విష్ణు మయము పుత్ర! వేయేల బ్రహ్మాండ, మతని జేనలోన నణఁగి యుండు

బుద్ధి నెఱుఁగరాదు భూత ద్భవ్య, లోకమెల్ల విష్ణులోన నుండు. ( 91 )


క. మండలములోన భాస్కరుఁ, డుండుచు జగములకు దీప్తి నొసఁగెడి క్రియ బ్ర

హ్మాండములోపల నచ్యుతుఁ, డుండుచు బహిరంతరముల నొగి వెలిఁగించున్. ( 92 )

ఉ. అట్టి అనంతశ క్తి జగదాత్ముని నాభి సరోజమందు నేఁ

బుట్టి యజింపఁగా మనసు పుట్టిన యజ్ఞ పదార్ధ జాతముల్

నెట్టిన గానరామికిని నిర్మలమైన తదీయ రూపమున్

గట్టిగ బుద్ధిలో నిలిపి కంటి నుపాయము నామనంబునన్. ( 93 )


సీ. పశు యజ్ఞవాట యూపస్తంభ పాత్ర మృద్ఘట శరావ వసంత కాలములను

స్నేహౌషధీ బహు ళోహ చాతుర్హోత్ర మత నామధేయ సన్మంత్రములును

సంకల్ప ఋగ్యజు స్సామ నియుక్త వషట్కార మంత్రాను చరణములును

దక్షిణల్ దేవతా ద్యనుగత తంత్ర వ్రతోద్దేశ ధరణీసురోత్త మాదు


తే. లర్పణంబులు బోధాయనాది కర్మ సరణి మొదలగు యజ్ఞోపకరణ సమితి

యంతయును నమ్మహాత్ముని యవయవములు, గాఁగఁగల్పించి విధివత్ప్ర్ కారమునను. ( 94 )


క. యజ్ఞాంగి యజ్ఞఫలదుఁడు, యజ్ఞేశుఁడు యజ్ఞభోక్త యగు భగవంతున్

యజ్ఞపురుషుఁగా మానస, యజ్ఞముఁ గావించితిం ద దర్పణబుద్ధిన్. ( 95 )


క. అప్పుడు బ్రాహ్మణు లెల్లం, దప్పక ననుఁ చూచి సముచిత క్రియ లగుచో

న ప్పరమేశున కభిమత, మొప్పఁగఁ దగు సప్తతంతువును గావింపన్. ( 96 )


చ. మనువులు దేవదానవులు మానవనాథులు మర్త్యకోటి దా

రనయము వారివారికిఁ బ్రియంబగు దేవతలన్ భజింపుచున్

ఘనతరనిష్ఠ యజ్ఞములు గైకొని చేసిరి తత్ఫలంబు ల

య్యనుపమ మూర్తి యజ్ఞమయుఁడైన రమావరునందుఁ జెందఁగన్. ( 97 )


క. సువ్యక్త తంత్రరూపకుఁ, డవ్యక్తుఁ డనంతుఁ డభవుఁ డచ్యుతుఁ డీశుం

డవ్యయుఁడగు హరి సురగణ, సేవ్యుఁడు గ్రతుఫలదుఁడగుటఁ జేసిరి మఖముల్. ( 98 )


క. అగుణం డగు పరమేశుఁడు, జగములు గల్పించు కొఱకుఁ జతురత మాయా

సగుణుండగుఁ గావున హరి, భగవంతుం డనఁగఁ బరఁగె భవ్యచరిత్రా! ( 99 )


క. విశ్వాత్ముఁడు విశ్వేశుఁడు, విశ్వమయుం డఖిలనేత విష్ణుం డజుఁ డీ

విశ్వములోఁ దా నుండును, విశ్వము దనలోనఁ జాల వెలుఁగుచు నుండన్. ( 100 )


చ. అతని నియుక్తిఁ జెంది సచరాచర భూతసమేత సృష్టి నే

వితతముగా సృజింతుఁ బ్రభవిష్ణుఁడు విష్ణుఁడు ప్రోచుఁ బార్వతీ

పతి లయ మొందఁజేయు హరి పంక రుహోదరుఁ డాదిమూర్తి య

చ్యుతుఁడు త్రిశ క్తియుక్తుఁ డగుచుండు ని టింతకుఁ దాన మూలమై. ( 101 )


క. విను వత్స! నీవు న న్నడి, గిన ప్రశ్నకు నుత్తరంబు గేవల పరమం

బును బ్రహ్మం బీ యఖిలం, బున కగు నాధార హేతు భూతము సుమ్మీ! ( 102 )


క. హరి భగవంతుఁ డనంతుఁడు, గరుణాంబుధి సృష్టికార్య కారణ హేతు

స్ఫురణుం డ వ్విభుకంటెం, బరుఁ డన్యుడు లేఁడు తండ్రీ! పరికింపగన్. ( 103 )


సీ. ఇది యంతయును నిక్కమే బొంక నుత్కంఠ మతిఁ దద్గుణ ధ్యాన మహిమఁజేసి

పరికింప నే నేమి పలికిన నది యెల్ల సత్యంబు యగు బుధస్తుత్య! వినుము

ధీయుక్త! మామ కేంద్రియములు మఱచియుఁ బొరయ వసత్య విస్ఫురణమెందు

నదిగాక మత్తను వామ్నాయ తుల్యంబు నమరేంద్ర వందనీయంబు నయ్యెఁ

తే. దవిలి య ద్దేవదేవుని భవమహాబ్ధి, తారణంబును మంగళ కారణంబు

నఖిల సంపత్కరంబునై యలరు పాద, వనజమునకే నొనర్చెద వందనములు. ( 104 )


ఉ. ఆ నలినాక్షు నందనుఁడ నయ్యుఁ బ్రజాపతినయ్యు యోగ వి

ద్యానిపుణుండ నయ్యను బదంపడి మ జ్జనన ప్రకారమే

యేను నెఱుంగ న వ్విభుని యిద్ధ మహత్త్వ మెఱుంగ నేర్తునే!

కానఁబడున్ రమేశ పరికల్పిత విశ్వము గొంతకొంతయున్. ( 105 )


మ. విను వే యేటికిఁ దాపసప్రవర! యవ్విశాత్ముఁ డీశుండు దాఁ

దన మాయా మహిమాంతముం దెలియఁగాఁ దథ్యంబు దాఁ జాలఁ డ

నన్ను నేనైనను మీరలైన సురలైనన్ వామదేవుండునై

నను నిక్కం బెఱుగంగ జాలుదుమె! విజ్ఞాన క్రియాయుక్తులన్. ( 106 )


వ. ఆ మ్మహాత్ముండైన పుండరీకాక్షుండు సర్వజ్ఞుం డంటేని, ( 107 )


క. గగనము దన కడవలఁదాఁ, దగ నెఱుఁగని కరణి విభుఁడు దా నెఱుఁగఁడనన్

గగన ప్రసవము లేదన, నగునే సర్వజ్ఞతకును హాని దలింపన్. ( 108 )


చ. తలకొని య మ్మహాత్మకుఁడు దాల్చిన య య్యవతార కర్మముల్

వెలయఁగ నస్మదాదులము వేయు విధంబుల సన్ను తింతు మ

య్యలఘ ననంతునిం జిదచిదాత్మకు నాద్యు ననీశు నీశ్వరున్

దెలియఁగ నేర్తుమే ! తవిలి దివ్యచరిత్రున కేను మ్రొక్కెదన్. ( 109 )


మ. పరమాత్ముం డజుఁ డీ జగంబు ప్రతికల్పంబందుఁ గల్పించుఁ దాఁ

బరిరక్షించును ద్రుంచు నట్టి యనఘున్ బ్రహ్మాత్ము నిత్యున్ జగ

ద్భరితున్ గేవలు నద్వితీయుని విశుద్ధజ్ఞాను సర్వాత్ము నీ

శ్వరు నాద్యంతవిహీను నిర్గుణుని శశ్వన్మూర్తిఁజింతించెదన్. ( 110 )


చ. సరసగతిన్ మునీంద్రులు ప్రసన్నశరీర హృషీక మానస

స్ఫురణ గలప్పు డ వ్విభుని భూరికళా కలిత స్వరూపముం

దరమిడి చూతు రెప్పడు కుతర్క తమోహతి చేత నజ్ఞతన్

బొరసిన యప్పు డ వ్విభుని మూర్తిఁగనుంగొనలేరు నారదా! ( 111 )


వ. అని వెండియు నిట్లను. అనఘా! ఇ మ్మహనీయ తేజోనిధి మొదలి యవతారంబు సహస్ర శీర్షాది యుక్తంబయి ప్రకృతి ప్రవర్తకం బగు నాది పురుషు రూపంబగు. అందుఁ గాల స్వభాషంబులను శక్తు లుదయించె. అందుఁ గార్య కారణ రూపంబైన ప్రకృతి జనించెఁ. బ్రకృతివలన మహత్తత్త్వంబును దాని వలన నహంకార త్రయంబును బుట్టె. అందు రాజసహంకారంబువలన నింద్రియంబులను, సాత్త్వికాహంకారంబువలన నింద్రియ గుణప్రధానంబు లైన యధిదేవతలును, తామసాహంకారంబువలన భూతకారణంబులైన శబ్ద స్పర్శ రూపరస గంధ తన్మాత్రంబులను బొడమె. పంచతన్మాత్రంబులవలన గగనానిలవహ్ని సలిల ధరాదికమైన భూత పంచకంబు గలిగె. అందు జ్ఞానేంద్రియంబులైన త్వక్చక్షు శ్శ్రోత్ర జిహ్వఘ్రాణంబులును, కర్మేంద్రియంబులైన వాక్పాణి పాద పాయూపస్థలును, మనంబును జనియించె. అన్నింటి సంఘాతంబున విశ్వరూపుండైన విరాట్పురుషుండు పుట్టె. అతనివలన స్వయంప్రకాశుండైన స్వరాట్టు సంభవించె. అందుఁ జరాచర రూపంబుల స్థావర జంగమాత్మకంబైన జగత్తు గలిగె. అందు సత్త్వరజస్తమో ( గుణాత్మకులమైన విష్ణుండును హిరణ్య గర్భుండ నైన యేనును రుద్రుండును గలిగితిమి.) అందు సృష్టి జనన కారణుండైన చతుర్ముఖుండు పుట్ట, వానివలన దక్షాదులగు ప్రజాపతులు దొమ్మండ్రు గలిగిరి. అందు భవత్ప్రముఖులైన సనక సనందాది యోగీంద్రులును, నాగలోక నివాసులైన వాసవాదులును, ఖగలోక పాలకులగు గరుడాదులను, నృలోకపాలకు లగు మనుమాంధాతృ ప్రభ్రుతులును, రసాతలలోకపాలకు లగు ననంత వాసుకి ప్రభ్రుతులును, గంధర్వ సిద్ధ విద్యాధర చారణ సాధ్య రక్షో యక్షోరగ నాగలోక పాలురును, మఱియు ఋషులును, పితృదేవతలును, దైత్య దానవ భూత ప్రేత పిశాచ కూశ్మాండ పశు మృగాదులు నుద్భవించిరి. ఇట్టి జగ త్ప్రథమోద్భవంబు మహత్తత్త్వసృష్టి యనంబడు. ద్వితీయం బండ సంస్థితం బనం దగు. తృతీయంబు సర్వభూతస్థం బన నొప్పు. అందైశ్వర్య తేజోబల సంపన్నులైన పురుషులు సర్వాత్ముండైన నారాయణుని యంశసంభవులుగా నెఱుంగుము. అ ప్పుండరీకాక్షుని లీలావతారంబు లనంతంబులు, తత్కర్మంబులు లెక్కవెట్ట నెవ్వరికినలవి గాదు. ఐనను నాకుం దోఁచినంత నీ కెఱింగించెద. వినుము. ( 112 )