Jump to content

పలనాటి వీరచరిత్ర

వికీసోర్స్ నుండి
(౧౯. పలనాటి వీరచరిత్ర నుండి మళ్ళించబడింది)


శ్రీరఘునాయకు జిత్తమందెంచి
శ్రీకంఠుపరమేశు శివునాత్మ-దలచి
పార్వతీదేవికి భావించి మ్రొక్కి
శివగణంబులనెల్ల చింతించిపొగడి
ప్రాకటంబుగ విష్ణు ప్రార్ధనజేసి
యిందిరాదేవిని నిచ్చలోనిలిపి
విష్ణుభక్తులనెల్ల వినుతులు సేసి
జలజజుగొనియాడి శారదనెంచి
అఖిలవిద్యలకెల్ల ఆద్యుడైనట్టి
గజముఖవిఘ్నేశు ఘనతకీర్తించి
వీరభద్రుని శౌర్య విభవంబులెన్ని
సంగమేశ్వరునకు చక్కగామ్రొక్కి
గుర్జాలగంగను గోరిప్రార్ధించి
భక్తి గోగులపాటి భైరవుదలచి
నీలమేఘశ్యాము నిజమూర్తియయిన
శీలమ్మనాయుని చిత్తమందెంచి
కడువేడ్క పోతలింగము గొనియాడి
మాచర్ల చెన్నుని మదిలోనదలచి
ఆంధ్రకవుల నుతులమరగావించి
గీర్వాణకవులను కీర్తించి మ్రొక్కి
సంగీతసాహిత్య చాతుర్యకవిత
చెప్పనేర్చినవాడ చెలగి "మాచర్ల"
చెన్నకేశవపాదసేవారతుండ
వలను భారద్వజ వంశవర్ధనుడ
కవిసార్వభౌముడ ఘనతగన్నట్టి
శ్రీనాధుడనువాడ శివభక్తిపరుడ
శాశ్వతంబైనట్టి సద్గ్రంథమొకటి
చెప్పబూనిమనసు చెలరేగియుండ
శ్రీరమ్యవక్షుండు శ్రితవత్సలుండు
వారిజనేత్రుండు వల్లవీవిటుడు
శమితభక్తజనార్తి శాశ్వతకీర్తి
కందర్పజనకుండు కనకాంబరుండు
సురరాజవిహితుండు శుభవీక్షణుండు
కరుణాంతరంగుండు కలుషభంగుండు
ఎల్లజగముల నేలెడుఘనుడు
పాలమున్నీటిపై బవళించువాడు
సోరిదినెల్లప్డు భూసురరక్షకుండు
గిరిధర్ముడగు చంద్రగిరిరంగవిభుని
వేంకటాద్రిపునకు వెలయునొక్కొక్క
సరసునకు రణసాహసాంకునకు
అలరాజుబాకున కవతారమొంది
మలసినూటొక్క బొమ్మలపెండేరంబు
చెలగిడాకాలనుంచిన మహాఘనుడు
చిలుకలపైకోర్కె జిక్కెడివాడు
చేకొన్నమాచెర్ల చెన్నకేశవుడు
నాకలలోవచ్చి నయమొప్పబలికె
వినవోయిసత్కవి వేడ్కనామాట
మనముననాకు సమ్మతమైనదొకటి
అనవిని దేవ మహాప్రసాదంబు
దృఢముగనానతి యిమ్మునాకిప్పు
డనచెన్నకేశవు డప్పుడిట్లనియె
శౌర్యంబుపుణ్యంబు సమకూర్చినట్టి
పలనాటివీరుల భాగవతంబు
ప్రకటితంబుగనీవు రచియించిమాకు
అంకితంబొనరింప ననువొందుసూవె
అనుచును శ్రీకాంతు డరిగినపిదప
మేల్కాంచిమనమున మేలయ్యెననుచు
విలసిల్లు పలనాటి వీరులచరిత
జనులెల్ల భక్తిచే చదువుటకొరకు
మంజరీద్విపదగా మన్నించినేను
చెప్పబూనితి వచః శ్రీమెరయంగ
ప్రకటితంబైనట్టి పలనాటిలోన
భావింపగావిష్ణు భక్తిని మెరసి
నరనాధసింహంబు నలగామరాజు
మహితచారిత్రుడు మలిదేవరాజు
ధారణినేలుచు తమలోనబోరి
కార్యమపూడి శ్రీకదనంబునందు
నరపాలచంద్రుండు నలగాముతాక
పంపిన బాలుండు బాహువిక్రముడు
తోరంపుగజములు తురగచయంబు
మున్నీలబలముల మహితశౌర్యమున
చెదరిపారగబోడ్చి చీకాకుసేసి
నలగాముతమ్ముడు నరసింగునెదిరి
మర్ధించిరణమున మడిసినవిధము
ప్రచురింతువీనుల పండువుగాను.

గణుతింప తత్కథాక్రమమెట్టి దనిన
అరయ మేడపిలోన అలరాజుచావు
వీరవిక్రమతచే వీరసాహసత
పరగిన నాయకుల్ పటుపరాక్రములు
వీరనాయకులెల్ల వినివెరగంది
భావించితలపోసి బాలమాల్దేవు
బిరుదురాజునుదెచ్చి పృథ్వివెలయగ
నయమైనయట్టి లగ్నంబునందతని
పట్టంబుగట్టిరి పరగమేడపిని.
భూమీశసుతునిట్లు పుడమినినిలిపి
భాస్కరసమతేజు బాలునిదెచ్చి
అస్చివకార్యంబున సమ్మతినుంచి
అతకరణపుకార్య మనపోతుకిచ్చి
మాడాచియనునట్టి మగువనుదెచ్చి
రాణివాసముగావ రక్తితోనుంచి
ఆనందమునుబొంది రంతటవారు.

అటమీదభూమీశు డధికోత్సవముల
ఘనకార్యమపూడి కదనరంగంబు
చేరబోవుటకునై చింతించియపుడు
ప్రజలతోమేడపి బదిలంబుసేసి
పరగమువ్వురుపతుల్ పైనంబుగాగ
ఎలమిభూసుర పురోహితులెల్లపూని
జయముహూర్తముబెట్టి చనుమని చెప్ప
తొల్లియేకాదశి దురమౌనటంచు
రణభేరివేయించె రమణీయముగాను
అతులసాహసవృత్తి నాదండువెడలె
గొల్లెనల్ గట్టిన గొప్పలౌబండ్లం
బల్లానిపెట్టెలు పట్టెమంచములు
తరుచైనపీటలు తమ్మిపడిగెలును
వింతమందసములు వెలయుగొడ్గులును
కాశ్మీరకస్తూరి గంధకర్పూర
మాదిగావాసన లమరుపెట్టెలును
బొక్కసంబులబల్వు బోనగావళ్ళు
జవ్వాదిపిట్తలు శారికాకీర
పంజరములువట్టు పరిచారకులును
కోడెకాండ్రదలించి కొట్టెడురెడ్లు
పడివాగెతేజీలు పాలకీజోళ్ళు
అష్టభాగ్యంబుల అంగళ్లవారు
సందడిపడదండు చయ్యనగదలె
పెంపైనపాలకి పెదమల్లుగదలె
పినమల్లుగదలె పృధ్వీశువెనుక
తమ్ముడుగదలెను ధరణీశువెంట
పచ్చలులింగాలు పట్టుగాజెక్కి
బాగుచేసినయట్టి పాలకియెక్కి
పలుమారుపుత్రుకై పలివరింపుచును
కొలువులోనాయుడు కొనరెట్టవట్టి
కులపగదీర్పని కొడుకితడంచు
పెట్టెనాచేతిలో ప్రియతనూజాతు
బాలునితెగువ యేపాటిదోయనుచు
కొమ్మభూమీశుండు గొబ్బునగదలె
అల్లాణరాజులు అచ్చోటినృపులు
అన్నలుదమ్ములు అందరుగూడి
సూర్యవంశమువారు సొంపుతోచనిరి.
వారికివీరికి వరమంత్రియైన
నీలవర్ణుండును నియతచిత్తుండు
బ్రహ్మన్నగదలెను పాయనివేడ్క
పట్టిరిగొడుగులు పాలకినెత్తి
సూర్యతాపంబు పైసోకనియట్లు
పాలకీలకురెండు పార్శ్వంబులందు
అందంబుగాబట్టి రరిగెలజోళ్ళు
వింజామరంబులు వెలయగానెమిలి
కుంచలవారును గూడువీవంగ
నాయడురాజులు నయముతోచనగ
ముందుడమాయీలు మురజసంఘంబు
బూరలుభేరీలు పోటుధారలును
కాహళవంకిణి కాలికొమ్ములును
శంఖసమూహంబు ముఖవీణవితతి
నరగలుతప్పెటల్ నయమైనడోళ్ళు
తమ్మటమ్ములునెంచదగువీరణములు
ఘనమైనరుంజలు కనకతప్పెటలు
చేగంతలును మరి చిరుగంటచయము
ఘనమైనమ్రోతచే గగనంబుగప్ప
కుంభిణివణకంగ కులగిరులెల్ల
మారుమ్రోతలనీదు మనసులుప్పొంగ
ఆవాలవారును ఆణెమువారు
కొండ్లవిందులవారు గోవిందువారు
ముతసానివారును ముయ్యూరువారు
నర్మాలవారును నాయనివారు
పైడిచుక్కల పాలపర్తివారలును
పాలుమూరివారును పాలెమువారు
రేవనూళ్ళవారు రేచెర్లవారు
అట్లూరి ముట్లూరి యాఖ్యలవారు
చెవులవారునుమరి చిల్లరవారు
గురియైననాయకుల్ గూడియేతేర
గుండువారేగురు గదిసినవేడ్క
చనిరిబిరుదులతో సహసమడర
ఒప్పుగానిందరు నురువైనబండ్లు
ఘోటకంబులుమేటి కుంజరావళులు
ఉత్సాహమున హుటాహుటినడువంగ
భట్టువారలమించి బహువిధంబులను
బిరుదుపద్యంబులు పెళ్ళుగాజదువ
ఉద్ధతిమస్టీలు నొనరనిర్వంక
భైరవఖడ్గముల్ పట్టుకరాగ
శీలమ్మతనయుని సంహవిక్రముడు
కరమర్ధికనుకుల కన్నమనడిచె
సకలవీరచయంబు సంతతోత్సాహ
పొరుషంబులుమీర బ్రహ్మకిట్లనియె
"మముజూడునాయుడా మాలావుకొలది
మముజూడుబ్రహ్మన్న మాశౌర్యపటిమ
సింధూరంబులమీద జెన్నుగాదుమికి
కుంభస్థలంబులు క్రుంగజేసెదము
కొదమసింగబుల గూలద్రోసెదము
గండభేరుండాల ఖండింతుమలుక
వాయువుబోనీక వాడినాపగలము
జాతవేదునుబట్టి చమిరివేసెదము
ఘనసముద్రముజొచ్చి కలుగజేసెదము
కుంభినికాళ్ళతో క్రుంగదన్నెదము
కులగిరిలైనను కొట్టివేసెదము
గురిజాలనేలెడు కువలయేశ్వరుని
కులపగకైపట్టి క్రొవ్వణగించి
చలమునవిడువక చంపగాగలము"
అనిపెక్కుపంతంబు లాడుచునడువ
చూచినవారలు చోద్యంబుగాగ
పటువిక్రమాడ్యులు పలనాటివీర
వరులంచుబొగడుచు వర్ణించిపలుక
మలదేవభూతి, మంత్రిబ్రహ్మన్న
కంపింపభూస్థలి కదలిరావేల.

త్రిపురాంతకమునకు తిన్నగావచ్చి
మహితచారిత్రుడు మలిదేవనృపతి
రాజులుమంత్రులు రసికులుదొరలు
పాటించిసుంకర వారితోగూడ
ఆవేళనీశ్వరు నతిభక్తిజూచి
సాష్టాంగదండముల్ చెయ్యనజేసి
హస్తముల్ముకుళించి అనియెబ్రహ్మన్న
గౌరీమనోహర గంగోత్తమాగ
నాగకంకణశివ నందివాహనుడ
కాంచనగిరిచాప కంధితూణీర
గరుడాసనాంబక కైలాసవాస
ఘనగజాసురభంగ కామభస్మాంగ
లాలితశ్రీకంఠ లయకాలకర్త
సకలభూతేశ్వర శభావతార
ఫాలాక్షభూతేశ పరమేశయిపుడు
విన్నవించెదనేను వినుముసత్కరుణ
శివపురిలోనుండి చేర్చినయట్టి
భూతరాట్త్సంభంబు పొందుగానుంచి
మితిచేసిచనితిమి మీనగరంబు
మృతివచ్చెనేటికి మీకృపచేత
కార్యమీడేర్పంగ కర్తలేమీర
యనుచుప్రార్ధనజేసి యచ్చటనున్న
కంబముగనుగొని కడుభక్తిమ్రొక్కి
యినుముపిత్తళికంచు హేమతామ్రముల
పంచలోహంబుల ప్రబలినదాన
నాలుగుముఖముల నయమొప్పమరియు
ఎనిమిదిముఖముల నెన్నికైనావు
ముగురుమూర్తులునొక్క ముఖమందునిలిచి
ఒకటసిద్ధులుమరి మొక్కటమునులు
గంగయుదుర్గయు కాలభైరవుడు
నిలిచిభూదేవియు నీయాననముల
గంధర్వపతులతో కాచుచునుందు
రనుచుప్రార్ధనజేసి ఆబ్రహ్మపలికె
ఘనకార్యమపూడి కలనులోపలను
నలగామరాజుతో నయముగాబోరి
మడియంగవచ్చిరి మన్నెనాయకులు
రణరంగపట్టపు రాజువైనీవు
సాక్షివైయుండవే సర్వభూతేశ
భుక్తినిచ్చెదనీకు భూతేశుడెరుగ
దాహంబుదీర్చుకో తడుచురక్తమున
ఇప్పుడాహారంబ యిదిగికొమ్మంచు
కంబమునకునిట్లు గట్టిగాజెప్పి
పెక్కువిధంబుల పిండివంటలును
పరమాన్నమునుమంచి పప్పుకూరలును
పానకంబులుజున్ను పచ్చళ్ళునెయ్యి
ఖండశర్కరతియ్య కందగడ్దలును
కొనితెచ్చికుంభము కొండలరీతి
కస్తూరికర్పూర కాశ్మీరసహిత
చందనలేపంబు సరివియొనర్చి
మైసాక్షిసాంబ్రాణి మంచిగుగ్గిలము
తోడుగలెస్సగ ధూపమర్పించి
ఘనమైనపోతుతో గావుజెల్లించి
ఆహారమంతట అర్పించిపిదప
కంబముంచినయట్టి ఘనశకట
నిచయంబుదరలింప నిలిచిబ్రహ్మన్న
శకటచక్రంబులు సమ్మతిగావ
నాయకావళినెల్ల నయముతోబిలిచి
వితరణచతురుడై విడియంబులిచ్చి
యెనయంగమనవీట నెసగునెద్దులను
కనుగొనితెప్పించి కాండ్లకుగట్టి
చయ్యనబండ్లను సాగింపుమనియె.

అనివీడుకొలిపిన నంతంతవారు
పేరుపేరునవాని బిలిచిరీరీతి
అందెలబసవన్న అదినాధుండ
నందులపిడిఘంట నాగవాసయ్య
గోవులవిటకాడ గోగుబయ్యన్న
వంటరిపలిజంకు వరపెరుమాళ్ళు
కట్టనికలుకోట కరినందిరంకె
అకలంకగాత్రుండ అంబుధిశయన
బిరుదుగరుత్మంత భీమునిగజమ
గోవర్ధనాచల గోపాలదేవ
కరినందిబసవన్న కంచివరదుడ
నెలబాలచంద్రుండ నీలవర్ణుండ
కల్లులదర్దజ జయకంఠనాద
వైకుంఠవాసుడ వాసుదేవయ్య
పుట్టలభూపతి పెంజెల్గుపెద్ద
ఇంద్రునివజ్రమా ఇప్పగిరీశ
గోగుభైరవమూర్తి గోవిందరాజ
చెంచులయోబయ్య చెన్నమల్లయ్య
కంచియేకామ్రుడా కాళికానాథా
మధురాపురిప్రియ మానందినాథా
కాముడాసోముడా కాయజవరుడ
రాముడాభీముడా రంకెలుసలుపు
మీరీతిపిలిచిన నేపుమీరంగ
వచ్చినయెద్దుల వరుసతోజూచి
వన్నెలుచిన్నెలు వడిజెప్పికొనుచు
నెత్తురుకొమ్ముల నేటైనవాని
గణుపుతోకలుగల కరిబొల్లివాని
అచ్చగాకరివన్నె లమరినవాని
మూపురంబులతోడ మొనసినవాని
నుదుటచుక్కలుగల నునుపైనవాని
తెల్లవన్నెల తెలివైనవాని
పచ్చనివన్నెలు ప్రబలినవాని
ఇటువంటిఎద్దుల నెంతయునేర్చి
గంటలుగజ్జలు గణగణమ్రోయ
గ్రక్కునయెద్దున గాండ్లగట్టించి
మోకులబంధించి ముందుగానపుడు
పంచవన్నెలకూడు పైబారదివిచి
కంబంముదర్లించె కమలనాభుండు
మర్రివేములుదాటి మండలేశుండు
ఘూర్ణిల్లురవముతో గుమ్మడంపాడు
చేరియచ్చటనిల్వ చిత్తంబువిడిచి
గరికెపాటికివచ్చి కాలూనకచట
కంకణంబులపల్లె కడనునాఘనులు
కంకణంబులుగట్తి కదలిరావేళ
పట్టభద్రులు పైడిపాటికివచ్చి
పరగవీరులకెల్ల వైనంబు చెప్పి
మెరసినమన్నీలు మేటినాయకులు
ప్రభువులుదొరలును బంధువర్గంబు
వీరవర్యులుగొప్ప విద్యలవారు
మిక్కిలిబిరుదులు మెరయుసాహసులు
కవులునుజెట్టీలు కలిసియందంద

మేళ్ళవాగుననిల్చె మించినదండు
అందరుగొల్లెన లమరంగనెత్తి
యుండిరినాయకు లుత్తలపడక
అంతలోదినకరు డస్తాద్రికరగె
సాంద్రమైచీకట్లు జగమెల్లగప్పె
విలసిల్లెచుక్కలు వినువీథియందు
గుమిగూడిపక్షులు గూళ్ళలోజేరె
చక్రవాకంబుల సంతసంబడగె
ఘనచకోరంబులు కౌతుకంబందె
కొలకులకమలముల్ కుందుచుమొగిడె
వికసించెకుముదముల్ విచ్చలవిడిని
జారకామినులెల్ల సంతోషమునను
మగలనిద్దురబుచ్చి మనసులుబెదర
కెరలివిటులగూడి గృహములువెడలి
మించిసాహసమున మేరలుమీరి
తోడికోడండ్రును తోడివారలును
గురువులుబంధులు గుర్తెరింగినను
నిందింతురనిశంక నిలుపకమదిని
వాగులవంతల వనములయందు
ఇసుకదిబ్బలయందు నిరవైనపొదల
కుంటెనకత్తెలు కూడికాపాడ
మనసులతమిమించ మదనుడావేళ
పూబాణములువింట బూనిసంధించి
మర్మముల్ నొవ్వంగ మాటికినేయ
మంచిగంధముబూయ మనసుభీతిల్ల
పువ్వులుముడువను బుద్ధియులేక
ఘననఖక్షతదంత ఘాతలువీడి
రతికుంజితంబుల రంతులుమాని
బంధచాతురియందు భావంబువిడక
కొందరునేలను గొందరునిలచి
నయముతోగొందరు నానావిధముల
కలసిరిమేనుల కంపంబులలర
చోరులుసాహస స్పూర్తులతోడ
ప్రాణంబులకుదెగి భార్యలనుమరచి
బ్రతికివచ్చెదమను భావంబువదలి
పట్టణంబులయందు పల్లెలయందు
ధనికులగృహముల తార్కొనిదోచి
సారెకుదిరుగంగ సాగిరావేళ

అంతటబ్రహ్మన్న యానడిరాత్రి
కనుకులదాసుండు ఘనబాహుబలుడు
కన్నమయనువాని గ్రక్కునబిలిచి
వెనకటిరాజులు విక్రమస్ఫూర్తి
పోరాడిసమసిన బూడిదవెంట
యిలభీమమైనట్టి యెముకలపోగు
లెసగినరణమ్హూమి యెన్నికగాను
పావనంబుగజేసి బహుకాలమందు
కనిపెట్టియున్నట్టి ఘనరాజవితతి
దూరములోపలనుండి తొలగింపవలయు
ఇరవుగాకలనిలో ఈరాత్రివేళ
ఎవ్వరెవ్వరుగాచి యెట్లున్నవారో
అరసిరమ్మనిపంప నావీరఘనుడు
వాసనపెల్లైన వనమాలగదల
కరములగుజ్జరి కడియముల్ మెరయ
నేటైనపిడిఘంత నెమలిసొగసులును
నల్లనిదట్టిని నయమొప్పగట్టి
అర్థనారీఝుల్ల కాదులునమర
ఘోరభైరవగద కోరమీసములు
ఎగుభుజంబులుమించు వెరజేరుగ్రుడ్లు
ఘనమైనదేహంబు కాలిపెండెరము
వెరవైనభీకర వేషంబుతోడ
కదలెకన్నెమనీడు కదనభూమికిని
కాటుకకొండయై కదసినయట్లు
గరిమతోచీకటి గ్రమ్మినయట్లు
హరిహరాదులమూర్తి యతనికిగలిగి
నడకలనింజొచ్చి నలుదెసల్ జూచె
అక్కడకాపున్న యఖిలరాక్షసులు
గండభైరవమూర్తి ఘనభూతవితతి
గుంపులైయున్నట్టి కొరవిదెయ్యములు
ఇరవుననున్నట్టి యెరుకలసాని
యున్నతావుకువచ్చి యొయ్యనననియె
వింటివేవార్తలు వినచిత్రంబు
గొల్లెనలచ్చటకుదురుగాజేసి
యీరుద్రభూమికి నీతడువచ్చె
ఏమికార్యమొకాని యెరుగంగరాదు
ముదముననున్నాడు మముజూచివీడు
తెలిసికోవలెవీని తెరగెల్లనిప్పు
డనిఉగ్రకోపాన నార్పులనిగూడ
కత్తులుద్రిప్పుచు గదిసికూయుచును
గట్టిగానిలిచిరి కన్నమమీద
అంతటకన్నమ అధికరోషమున
కాలాగ్నిరుద్రుడై కత్తినిదీసి
మెరపుకైవడినిల్వ మెచ్చెభూతములు
వల్లకాటికిధైర్య వైభవంబెసగ
ఎవ్వడేతెంచెనో యెరుదరాదిప్పు
డీశ్మశానములోన నెసగురుద్రుండొ
బ్రహ్మవిష్ణుడో పాకశాసనుడో
అగ్నిహోత్రుదో లేక యమధర్మరాజొ
అలనైరృతుడొ లేక అంభుదిపతియొ
పవనుడోధనదుడో ఫాలనేత్రుండొ
మునివితతికినెల్ల ముఖ్యుడోయేమొ
తెలియదమంచును దిన్నగాననిరి
ఎవడవురాయోరి యీభూమిజొచ్చి
యేమికార్యముకొర కేతెంచినాడ
వేరాజుబంటువో యెరిగింపుమనిన
పలికెగన్నమనీడు పటుశక్తిమెరయ
సోమవంశమున శోభిల్లుచున్న
అనుగురాజేంద్రున కంగనయైన
విద్యలదేవికి విభవంబుమీర
ముక్కంటివరమున ముగ్గురుసుతులు
మల్లికార్జునుయొక్క మానసరూపు
లనగజన్మించిరి అందులోమేటి
పెదమలిదేవుడు పృథ్వీతలేశు
దారాజునకుమంత్రి ఆదిదేవుండు
దొరసినరేచర్ల దొడ్డనాయునికి
పడతిశీలమయను పద్మనేత్రకును
కలికికృష్ణుండైన కారుణ్యమూర్తి
పుట్టెనుబ్రహ్మన్న భూలోకమందు
అతనికిదాసుడ నౌదునునేను
మాలలకునుబుట్టి మాలనైపోక
విష్ణుపాదముబట్టి విశ్వంబులోన
తెప్పలినాయుడు తెరవయైనట్టి
వికచాబ్జలోచన పెమ్మసానికిని
శ్రీమించుమాచర్ల చెన్నునిమేన
పెంపొందెడుతులసి పెదవనమాల
వరముగన్నట్టి వరపుణ్యసుతుడ
కన్నమనాపేరు కమలాక్షివినవె
కామునికెదిరించి కదనంబుగోరి
పగరపైదండెత్తి బవరంబునకును
వచ్చిరిమావారు వైభవంబలర
భండనక్రియకిది పట్టైనచోటు
వెనకటిరాజులు విక్రమస్ఫూర్తి
పోరాడివచ్చిన పునుకలపెంట
తొలగించిశుచిచేయ వలెనంచుదలచి
కామునిబలముల ఖండించివైచి
మడియంగవచ్చిరి మన్నెనాయకులు
పరభయంకరమైన భందనభూమి
అరసిరమ్మనిపంపె నవతారపురుషు
డైనట్టిబ్రహ్మన్న యనుచుచెప్పంగ
వినియెరుకలసాని విస్మయంబంది
ప్రళయకాలేశుండు పార్వతీశ్వరుని
పాదసేవకులైన ప్రమథులువార
లిప్పుడిటు బెసగెసంతసము
మనసులోకోరిక మాకుసిద్ధించె
బ్రహ్మనాయుడువచ్చి భాండనభూమి
పాదరేణువుచేత పావనత్వమ్ము
వెలయింపవలసిన వేళయేతెంచె
కడువేగరమ్మను కన్నమానేడె
అనినకన్నమవిని యాశక్తికపుడు
దండనమస్కృతుల్ తగజేసిమగిడి
బ్రహ్మనాయునిజూచి పదములకెరగి
కమలవల్లభవిను కంటినివింత
కంతినెరుకసాని కంటిదైత్యులను
జయమగువెంచేయు జలజలోచనుడ

అనుచునచ్చటివృత్త మఖిలంబుచెప్ప
వినిబ్రహ్మనాయుండు వీరధైర్యమున
ద్వాదశసూర్యులు ప్రబలినరీతి
నెవ్వరికెరిగింప కేగెనావేళ
పొలుపొందనారుద్ర భూమికేతెంచె
నాలుగుకరముల నాయుడునిలిచె
ఆరుద్రవసుమతి నాశ్చర్యముగను
కూలినశల్యముల్ కురుచతుండములు
సొక్కినచర్మముల్ చుట్టలైఉన్న
పేగులునరములు పెంటలైఉన్న
యేడుమాసంబుల యెముకలుపగిలి
రాలిదట్టంబైన రాసులుతరుచు
మునిగిదుర్గంధంబు మొనసినమెదడు
గాలికిదూలెడు ఘనశిరోజములు
కాలికుప్పలుబడ్ద కాయవిభూది
చిదిమినశవములు చెదురుకొరువులు
నానావిధంబుల నాట్యముల్ సలుపు
భూతకోటులతోడ పొందుగానుండె
తలకాయపుర్రెల దగుబంతులాడు
శాకినుల్ మొదలైన సకలభూతములు
బెదరకవాదించు భేతాళచయము
పిల్లాటలాడెడు పెనుపిశాచములు
మిణుగురుల్ దిక్కుల ముంచిరాల్పుచును
కొమరొప్పపరుగిడు కొరవిదెయ్యములు
వేదమంత్రంబులు వెసపఠించుచును
బ్రహ్మనాయునిజూచి భయసంభ్రమమున
ఆశీర్వదించుచు నళుకుచుతొలగి
పరుగులుపెట్టెడు బ్రహ్మరాక్షసులు
కలగిబ్రహ్మన్నను కనినంతలోన
పారిభయమున బలుదైత్యవితతి
ఇటువంటిరణభూమి నెసగనీక్షించి
ఘనకార్యములకెల్ల కారణంబగుచు
ఎముకలపెంటయై యేహ్యమైఉన్న
కార్యమాపురిపుణ్య ఖనియగునట్లు
కావింతుదేవతల్ గనిసంతసింప
ధీరతశ్రీవీరతిరుపతిసేయ
వలెనంచునూహించి వైరులపాలి
కాలమృత్యువువంటి ఘనుడుబ్రహ్మన్న
భయదమౌ రణభూమి ప్రబలుడైనిలిచి
మూడుకాలంబుల ముచ్చటలెల్ల
తెలిసినయెరుకల తెరవనీక్షించి
బలువైనబ్రహ్మండ పజ్త్కులనెల్ల
పుట్టింపరక్షింప పొలియింపనేర్చు
బ్రహ్మదేవునివిష్ణు ఫాలలోచనుల
ప్రార్ధించికీర్తించి ప్రణతులచేసి
హరియొక్క పదియైన యవతారములను
మనసునదలబోసి మానంబురోసి
భువనరక్షణచేయ బుద్ధిలోనిలిపి
పరమేశ్వరునిగూర్చి పలికెబ్రహ్మయ్య
"ఓచక్రధర!స్వామి ఓకంజనాభ
జలముపైపవళించు సర్వభూతేశ
ప్రమథావతారులు బలువీరవరులు
ప్రధ్నవసుమతిలోన ప్రాభవమొప్ప
ఇత్తుముప్రాణంబు లీయనినంచు
వచ్చియున్నారదె వైభవంబలర
వీరసింహంబులు వీరనాత్యంబు
చేయుదురిప్పుడు స్థిరబుద్ధితోడ
పూతత్వహీనత పొరయునీభూమి
నిర్దుష్టముగజేయ నిన్నువేడెదము
నీచరణంబున నెరిజనియించి
గంగయై ఖ్యాతినిగాంచి లోకముల
క్షాళతమ్మొనరించెగదా పూర్వమందు
ఆజలరూపమై యమరుమేఘంబు
వర్షించియీభూమి పరమపూతంబు
చేసెడునట్లుగా సెలవిమ్ముతండ్రి"
అనుచుబ్రహ్మనవేడ నాలించిహరియు
ఫణిశాయియైయుండి పంపెదేవేంద్రు
నతడుప్రేరేపింప నానీలమేఘు
మాకాశమెల్లను నల్లినట్లుండి
గాఢాందకారంబు గప్పెభూస్థలిని
ఘూర్ణిల్లుధ్వనులతో కుంభినిమీద
ఉరుములుపిడుగులు నొయ్యనబడగ
తళతళమెరుపులు తరచుగామెరయ
వడగండ్లురాలంగ వాయువువిసర
వాగువంతలనీళ్ళు వరదలైపార
గుంతమిట్టనరాక కుంభినినెల్ల
ముంచెదేవతలంత మూకలైచూడ
జలజనాభునిపాద జనితమైనట్టి
గంగలోకములెల్ల క్రమ్మెనోయనగ
ఏకార్ణవంబుగా హెచ్చివర్షించె
అప్పుడాజలమధ్య మందుండియెక్క
పునుకజలముపైన బొర్లాడికొంచు
పడమరగావచ్చి బ్రహ్మన్నవద్ద
నిల్చిహసించెను నిష్కారణముగ
అప్పుడుబ్రహ్మన్నయు నానవ్వుజూచి
తలపుర్రెతోననె దగువాక్యములను
నవ్వినహేతువు నాతోడజెప్పు
వీనులనిండగా వినగోరినాడ
అనిననాయునితోడ నాపుర్రెపలికె
నాపూర్వమంత విన్నపముచేసెదను
శంఖచక్రాంకిత సకలలోకేశ
ఇందిరామందిరా యినచంద్రనేత్ర
జలజజజనకుండ శార్ఙ్గశరానా
సకలవేదమయాత్మ శ్యామలవర్ణ
సకలధర్మంబులు సమసెడువేళ
తగినరూపముదాల్చి ధరబ్రోతువెపుడు
వేదశాస్త్రంబులు వినుతులుసేయ
చాలగజడనిధిశయనించుచుందు
దనుజేంద్రసంహార తార్క్ష్యవాహనుడ
యెత్తితీయవతార మీయుగమునందు
శోభిల్లునీమేను జూడంగగలిగె
తప్పజూదకవిను తగుమనముంచి
దానవుడనుగాను దయ్యముగాను
భూరిభయంకర భూతంబుగాను
వాసియౌయాకాశ వాణినిగాను
రహిమించగ బ్రహ్మరక్షస్సుగాను
జలనిధికోటయై చక్కనైయుండు
దక్షిణజలనిధి దండనున్నట్టి
రమపురమనుపేర రాజిల్లుచున్న
పట్టణంబేలెడు పరమధర్ముండ
జలనిధిసోముడనేను సర్వజ్ఙ్ఞతిలక
ద్వాపయుగమున ధైర్యంబుతోడ
బహుతరాక్షౌహిణుల్ బలములగూర్చి
ధూర్జటికెదిరించి దూరమొనరించి
కరులుగుర్రంబులు కాలిమానుషులు
హతమైనపిమ్మట నాలంబులోన
పడితినిపగవారి పంతంబుగెలువ
రణధూర్తుడనుగాను రాజునుగాని
సర్వయుగజనులు సమసినకలని
గతిగానకీలాగు కాలంబుబుచ్చు
చెదురుచూచుచునుంటి మెంతయుమేము
వీరాగ్రగణ్యత వెలసిననీవు
కదనవిక్రముడవై కలనికివచ్చి
శోధింపదిరిగితి శూరధర్మమున
పరమాత్మ మాజన్మ పావనంబాయె
వైకుంఠపట్టణ వైభవంబెల్ల
కంటినాయునిమూర్తి కన్నందుచేత
నీపాదములధూళి నెరసినకతన
పావనంబాయెనీ భండనభూమి
ఇటువంటికనిలో నేపునమీరు
కదననాట్యముసల్ప కడుసంతసిల్లి
శంకరుడింద్రుండు సకలదేవతలు
ఎదురుగాచనుదెంచి యిత్తురిష్టములు
ఘనపవిత్రులుగాగ కలియుగమందు
వీరపుంగవులయి వెలయంగగలరు
పరువడిచనిన భూపరులలోగలసి
దివికెగెదముమేము దేవదేవేశ
అనిచెప్పిబ్రహ్మచే నంపించికొనిరి
కరమొప్పపండ్రెండు గడియలతడవు
హుంభవర్షంబయ్యె కుంభినియందు
నీతిచేభూతముల్ నిల్చికొల్వంగ
కలనికికర్త్రియై ఘనమైనశక్తి
గరిమబ్రహ్మన్నను గాంచియునిల్చె
నిలిచినగనిగొని నీలవర్ణుండు
"ఓవిశ్వమయమూర్తి ఓవిశ్వకర్త్రి
ఓలోకపావనీ యోజగద్ధాత్రి
యోశాంభవీదేవి యోలోకసేవ్య
సమరంబునకునీవు సాక్షివైయుండు"
మనుచుప్రార్ధనజెసి యాబ్రహ్మనీడు
మగిడెమనోవేగ మానితగతిని
వేగుజాముకువచ్చి విడిదిలోనిలిచె
తెల్లవారగనప్డు దివిజులుప్పొంగ
చుక్కలకాంతులు శూన్యమైయడగె
కలువలమిత్రుని కాంతులుతగ్గె
చీకటిగుహలలో జేరియుదాగె
గుడ్లగూబలుపోయి (గొందులనణగె)
చక్రవాకంబులు సంతసంబందె
కమలముల్ వికసించె గలువలుమొగిడె
తమతమకార్యముల్ తగజెసికొంచు
మోదంబునొందిరి భూజనులెల్ల
వేదమంత్రంబుల వినుతులుజేసి
అఖిలభూసురతతి ఆర్ఘ్యంబులియ్య
పూర్వపర్వతశిరః పూజ్యాగ్రమందు
ఘనతరమాణిక్య ఖచితసౌవర్ణ
కుంభంబువలెనిల్చి గురుతేజమునను

భానుండుదిక్కుల ప్రబలెనావేళ
తరువాతమలిదేవ ధరణీశ్వరుండు
పొలుపొందకార్యమ పురికేగదలచి
తానుబ్రహ్మగలసి తగవిచారించి
ఘనమైనడెరాలు గట్టినబండ్లు
ఇతరవస్తులుమోసి యేతెంచునట్టి
యెద్దులనొంటెల నెల్లముందుగను
సాగించియంతట సంతోషమునను
కాలిబలంబుల ఘనఘోటకముల
మదమునవిలసిల్లు మంచిఏనుగుల
నాలుగుదిశలను నడువంగజేసి
వీరనాయకులూని వెసజుట్టినదువ
తమ్ముడునాయుడు తగుభందుజనులు
తమతమవాహనోత్తమములనెక్కి
వెంబడియేతేర విభవంబుమీర
తరచుగారత్నముల్ స్థాపించినట్తి
పాలకిలోనెక్కి బట్లునుతింప
ఇరువంకనరిగెల నెత్తిక్రమ్మంగ
పటువేత్రకుల్ బరాబరులొనరించి
"అవధారురాజేంద్ర" యని హెచ్చరింప
పూజ్యుండు మలిదేవభూపతిచనియె
ఐదువిధంబుల నమరువాద్యంబు
లాకాశమంతయు నదిరెడునట్లు
సాంద్రధ్వనుల్ హెచ్చె సంతసంబంది
కదనరంగంబైన కార్యమపూడి
పుణ్యభూమినిజేరి పొందుగాదండు
విడిసెనువైరులు వెక్కసంబంద
వేదశాస్త్రఙ్ఞులు విప్రులందరును
అధిపునాశీర్వాద మమరంగజేసి
సరసంపుభూమి ప్రశస్తంబొనర్ప
చెన్నకేశవదేవు శ్రీపాదజలము
తివిరిపూజారులు దెచ్చుటజేసి
తులసిపత్రంబులతోడ తీర్థంబు
అచ్చోతచల్లించి అలరు లగ్నమున
శంకుసంస్థాపన సమ్మతిజేసి
నిక్సేపముగరత్న నిచయంబులుంచి
తెచ్చినకంబంబు ధీరతతోద
నడికలనిన్నిల్పె నరనాథవరుడు
కాశ్మీరకస్తూరి కర్పూరయుక్త
పరిమళగంధంబు బాగుగాబూసి
మైసాక్షిగుగ్గులు మహితధూపంబు
అర్పించి అటమీద నారగింపంగ
మృగములమాంసంబు మెప్పుగావండి
పంచామృతంబులు పాయసాన్నములు
పేరైనపచ్చళ్ళు పిండివంటలును
భూతరాట్టునకప్డు భోజనంబిచ్చి
అఖిలభూతంబుల కాచారముగను
ఘనమైనపోతుల గావుచెల్లించి
తరువాత సర్పాఖ్య తటినిలోపల
పటుగంగధారనా బరగినమడుగు
పొంతకుజని వీరపుంగవులెల్ల
తమతమనామముల్ ధరలోనదరుచు
ప్రఖ్యాతినొందగ భక్తితోనందు
స్నానంబుజేసి విశాలతీరమున
నిలిపిరి లింగముల్ నేమంబుతోడ
తరువారమలిదేవ ధణీశ్వరుండు
నాయునితోడను నదికినేతెంచి
కాలోచితక్రియల్ క్రమముగాజేసి
నామతీర్థంబులు నయమొప్పదీర్చి
పటకుటీరములకు బన్నుగావచ్చి
సకలనాయకతతి సన్నిథినుండ
కొలువునగూర్చుండె కుధరారిరీతి
అప్పుడూబ్రహ్మన్న అవనీశుతోడ
ఉచితవిచారంబు నొనరించిపిదప
చెలగుచుసమరంబు చేయగావెలెను
తరచైనబలముతో తరలిరమ్మనుచు
పొలుపొందునలగామ భూమీశుకడకు.

భట్టునుపొమ్మన్న పయనమైతాను
వాయువేగముగల వాజిపైనెక్కి
బంగారుగుబ్బతో భాసిల్లుగొడుగు
పట్టుకముందర భటుడొకడేగ
విలసిల్లుజల్లుల వింజామరంబు
లీవలావలనుండి యిద్దరువీవ
గురిజాలకేతెంచి కువలయభర్త
తావుకుముందర తగచెప్పిపంపె
వినికామభూపతి విభవంబుమెరయ
కొలువుశృంగారింప గూర్చినవారి
పంపించెవారలు పరిచారజనుల
రప్పించితీర్చిరి రమణీయముగను
కస్తూరిచేతను గలయంగనలికి
మూత్యాలతోడుత ముగ్గులు వెట్టి
కర్పూరముదకంబు కలిపిముందటను
కలయంపిచల్లి నిష్కల్మషభంగి
శ్రీరామకథలను శ్రీకృష్ణకథలు
పన్నుగావ్రాసిన పటములదెచ్చి
కట్టిరిగోడలు కనుపడకుండ
మౌక్తికమంజీర పంజుపుంజంబు
వ్రేలాడుచుండెడు వివిధవర్ణముల
ఘనవితానమ్ములు కట్టిరిమీద
నిలువుటద్దంబులు నిలిపిరిదిశల
తంతుపటములు విస్తారముగబరచి
వన్నెలపటములు వానిపైబరచి
పరచినవానిపై పంచవర్ణముల
రత్నకంబళములు రంగుగాబరచి
కంచననవరత్న ఖచితమైనట్టి
పీఠమొకటిదెచ్చి పెద్దకొల్వునను
నిలిపిరిదిక్కుల నిగ్గులుదేర
చెలువుగా నీరీతి జేసినవార్త

వినినంత నలగామపృథీశ్వరుండు
సరసంపుపన్నీట జలకంబులాడి
ఘనశుచివస్త్రముల్ కటియందుదాల్చి
చిత్రాసనంబుపై జేరికూర్చుండి
నిలువుటద్దముజూచి నేరుపుమీర
తిలకంబునుదుట సుస్ఠితిమీరదీర్చి
సంధ్యాదికృత్యముల్ సమ్మతిజేసి
భుజియించితరువాత పునుగుజవ్వాజి
కస్తూరిరసమును గలిపినయట్టి
శ్రీచందనమును మేన చెలువుగాబూసి
తగటుకూనంబులు ధరియించితలకు
ఒకవింతయిష్టీష మొప్పుగాగట్టి
నవరత్నమాల కంఠంబునవ్రేల
డంబుగా కర్ణకుండలములు మెరయ
భుజకీర్తులనియెడు భూషలుదాల్చి
మేనికిరక్షయై మించుతాయెతులు
దండచేతులరెంట ధారణచేసి
మురుగులుగొలుసులు ముంజేతులందు
తిరముగావ్రేళ్ళ ముద్రికలనుబెట్టి
నవరత్నఖచితంపు నడికట్టుదాల్చి
గండపెండేరంబు కాలికిబెట్టి
బంగారుదుప్పటి పైననుగప్పి
పావుకోళ్ళనురెండు పదములదొడిగి
కటికివారలుమ్రోల కనుపించిపొగడ
ఈవలావలజేరి హెచ్చరింపంగ
వేత్రహస్తులుగూడి విచ్చలవిడిని
సందడిదూరమై చనునట్లుచేయ
రహిమించ నంతఃపురంబును వెడలి
కొలువునకేతెంచె కుతుకంబుమీర
నిలిచెశృంగారంబు నేర్పునుగనగ
అంతటకింకరు లతివేగమునను
తూలికాతల్పంబు దూర్చినయట్టి
ముఖమల్లుగుడ్డలు మునుకొనితెచ్చి
పరచిపీఠముమీద బాగైనదిండ్ల
ఉంచినగనుగొని యుర్వీశుడైన
కామభూమీశుండు గద్దెపైనుండె
వెనుకను నరసింగవిభుడు గూర్చుండె
నాగమయొకవంక నమ్రతనుండె
బంధుజనముచుట్టు బలిసికొల్వంగ
వేదశాస్త్రఙ్ఞులు విద్వంసులెల్ల
ఆశీర్వదించుచు ఆసీనులైరి
సకలదేశాధీశ సచివపుంగవులు
ముకుళితహస్తులై ముందరనుండ్రి
శాస్త్రపారగులును సంస్కారయుతులు
కవులునుభటులును కనిపెట్టియుండ్రి.

వింతగాగాయనుల్ వీణలబూని
తంత్రులుబిగియించి తగసుతిబెట్ట
సరిగమేళములైన స్వరసప్తకంబు
ఆరోహణావరోహణ భేదములను
బహురాగసంప్రాప్తి పట్టుగాజేర్చి
సంచారిసంస్థాయి సరసభావముల
మృదుతరశబ్ధార్థ మిళితమైనట్టి
ఘనతరాలంకార గతిపరంపరలు
మూర్చనల్ మొదలైన ముఖ్యధర్మములు
జంత్రంబుగాత్రంబు జంటగావించి
చెలగియెండినచెట్లు చిగిరించునట్లు
పాడిరితమతమ ప్రావీణ్యమెసగ
పాకశాసనుకొల్వు పగిదినున్నట్టి
వేళనేతెంచిరి విద్యాధికతను
నాట్యమేళమువారు నవవిలాసముల
వచ్చినమ్రతమ్రొక్కి ప్రక్కగానిల్వ
ఘనవైభవంబున కామభూవిభుడు
నవ్వుచుసెలవిచ్చె నాట్యంబుచేయ
వరమృదంగములెస్స వాయించుమేటి
కుడిభాగమునయందు కుదురుగానిలిచె
తాళమానఙ్ఞులు దాపటిదిశను
నిలిచిరుత్సాహంబు నేరుపుమీర
ముఖవీణవాయించు ముఖ్యుడొకండు
రాగమాలాపించు రమణులిద్దరును
నిండువేడుకతోడ నిలిచిరివెనుక
కంజలోచనయను ఘనమైనపాత్ర
మదనుపట్టపుదంతి మంజులవాణి
భరతశాస్త్రోచిత బహురాగములను
గరిమతోనేర్చిన కంతుబాణంబు
వచ్చిసభాసదుల్ వర్ణించిచూడ
నిలిచినాత్యమునకు నేర్పరియైన
వేత్రపాణికిదగ వినయంబుజూపి
అతడొసంగినగజ్జ లతిభక్తితోడ
పాదములంగట్టి పంచవర్ణముల
కాశగట్టిగగట్టి కడుజపంబడర
మద్దెలతాళాల మధ్యనిల్చుండి
ఓరచూపునరాజు నొయ్యనజూచి
సమపాదయుతమైన స్థానకస్థితిని
తాత్పర్యమున దేవతలకునుమ్రొక్కి
పుష్పాంజలియొసగి ఘనకళాశైలి
కైముడికట్నముల్ కనుపింపజేసి
వెలయంగతొమ్మిది విధములయినట్టి
భూచారినాత్యంబు పొందుగాసలిపి
పదునారువిధములై పరగినయట్టి
ఆకాశచారియు నమరంగనాడి
అంగహారాఖ్యగలట్టి నాత్యంబు
విదితమౌతొమ్మిది విధములనాడి
గతిచారిభేదముల్ గనుపడునట్టు
బ్రమణసంయుతదీప్త పటిమమీరంగ
పాణిభేదములను బాటించిచూపి
స్థానకసంచయ సంయుక్తి అమర
ప్రేరణిదేశిని ప్రేంఖణశుద్థ
దండికాకుందలి తగుబాహుచారి
సప్తతాండవములు సల్పెచిత్రముగ
సభవారలాశ్చర్య సంయుక్తులైరి
తరువాతనిరుమేల దగుచెలులమర
సయుతాసంయుతా చలనసంకుచిత
నానార్ధకరములు నాత్యహస్తములు
శిరమునుచూపులు చెక్కిళ్ళుబొమలు
దంతోష్ఠకంఠముల్ తగు చుబుకంబు
ముఖరాగవక్షముల్ మొదలుగానెన్న
అంగంబులారు ఉపాంగంబులారు
ప్రత్యంగసముదాయం బారునుగూడి
యెనిమిదిపదియగు నెసగునంగంబు
లమరంగనభినయం బాశ్చర్యముగను
మాచర్లచెన్నుని మహిమంబుదెలుపు
ఆంధ్రసంస్కృతవాజ్మయాదిగీతముల
భావంబులెస్సగ ప్రకటంబుచేయ
చూచిరంభాదులు చోద్యంబునొంది
శిరసులువంచి సిగ్గునుచెంది
రపుడుభూమీశు డాదరంబొప్ప
వస్త్రభూషణములు వారలకిచ్చి
భట్టునురమ్మని పంపించెపిదప

తురగంబుపైనెక్కి దుమికించుకొనుచు
వచ్చికొల్వునుజేరి వాజినిడిగ్గి
భూమీశునెదుటను బొందుగానిలిచి
రాజాధిరాజ విరాజితకీర్తి
రాజవేశ్యావిట ప్రభావప్రకట
గండరగండాంక ఘనదానచతుర
ధైర్యనిర్జితమేరు ధరణీధరేంద్ర
శౌర్యవిక్రమకళా సంపూర్ణచంద్ర
భాస్కరసమతేజప్రౌఢగుణాఢ్య
మానదుర్యోధన మైలమ్మసుతుడ
అనుగుభూపతిపుత్ర అంచితగాత్ర
వీరకామనరేంద్ర విభవదేవేంద్ర
రాయబారమునకు రాజుపంపించ
వచ్చిన అల్లుని వధియించినారు
మనసునక్రోధించి మలిదేవరాజు
తమ్ములుతానును దనబంధుజనులు
వీరనాయకతతి విక్యాతిమెరసి
ఖరదూషణాదులు గతమైనచోటు
శ్రీశైలభూమిలో శ్రేష్ఠమైనట్టి
కార్యమపురిభూమి ఘనపుణ్యరాశి
పటుతరవిక్రమ వైభవంబలర
ధాటిమైనిల్చిరి దండుతోగూడ
అలరాజుతోడనే హతమౌదుమంచు
చలమునకోపంబు సంవృద్ధినొంద
వీరనాయకులును వేగిరపడగ
మలిదేవభూపతి మన్నించియిటకు
నన్నుబుత్తెంచెను నరనాధవినుము

పగవృద్ధిబొందించు భ్రష్టులేకాని
అడగించునేర్పరు లవనిలోలేరు
నరసింగభూమీశు నమ్మికమీరు
తమ్ముడా మలిదేవధరణీశుకడకు
పంపుడికయేకమై పగలనునణచి
పలనాడుమొదలైన బహుభూములెల్ల
ఎదురెవ్వరునులేక యేలుడిసుఖిత
శృంగారయుతు నరసింగుభూమీశు
పంపుముమలిదేవ పతిగలయంగ
పోరుమంచిదిగాదు భూమినెక్కడను
పాడౌనుదేశంబు పగమించెనేని
ప్రజలెల్లనశియించి పారిపోవుదురు
బండారమునకును పైకంబులేదు
రాణువ అందుచే రహిచెడియుండు
చేజీతగాండ్లెల్ల జెలగికోపించి
యీగలజీతంబు లిమ్మందురపుడు
పతిబంటుమేరలు పరిహృతమగును
పంపినపనిచేయు పాలుమాలుదురు
తెలిసినశాత్రవుల్ ధీరతతోడ
భూమినిగొనుటకు బుద్ధిపెట్టుదురు
పగవారివార్తలు పరికింపలేరు
మేకొనిమీలొన మీరుపోరాడ
చూచెడువారికి జులకనయౌను
కోరిశాత్రవులుమీ గుట్టెఱుంగుదురు
పలువలుమిముజేరి పగజావనీక
చెప్పుచునుందురు చెనటివాక్యములు
ఐకమత్యముచెడు నద్దానితోడ
చెడునుబలంబును చెడునుభాగ్యంబు
చెడునుయశంబును చెడునుశౌర్యంబు
చెడునురాజ్యంబులు చెడ్డపిమ్మటను
దేశంబు పరనృపాధీనమౌసుమ్ము
పారతంత్ర్యంబు మీపైబడగలదు
పరతంత్రజనముల పాలికష్టములు
చెప్పంగనలవియే శివునకునైన
పంజరంబుననున్న పక్షులరీతి
బంధించిబుట్టలో పాములవాఁడు
వదలకపెట్టిన ఫణులచందమున
గంగిరెద్దులవాఁడు కావరమణచి
ముకుదాడుపొడిచిన పోతెద్దులట్లు
బోనులోనుంచిన పులులవిధంబు
స్వతంత్ర్యహీనఁత బడియుండవలయు
పరికింపగా మనోవాక్కాయములను
ప్రథమమ్ముపట్టగా రానిదిగాన
వాక్కాయములురెండు బంధింపబడును
మనసులోఁబుట్టిన మంచితలంపు
లాచరణమునందు అలవికాకున్న
జన్మఫలంబేమి చచ్చుటేమేలు
అవ్యక్తకీట తిర్యగనేకహీన
యోనులలో నెన్నియోమార్లు పుట్టి
పడయకపడయక పడిసినయట్టి
దుర్లభనరజన్మ దూషితంబగును
పార్థివాయిటువంటి పారతంత్ర్యంబు
కటకటా పగవారికైననువలదు
కుందబృందసితాబ్జ కుముదాప్తతార
హీరడిండీరనీ హారపటీర
ఘనమరాళంబుల కాంతినిమించు
సత్కీర్తివేగమే సరవినశించు
అపకీర్తిజగముల నధికమైయుండు
ఉభయవాదులుమీర లొక్కటైయున్న
సకలకార్యంబుల సమకూర్పవచ్చు
ప్రజలకుసుఖమౌను పంటలుపండు
ధనముసంపాదింప దగియుండునపుడు
సంపూర్ణకాములై సకలసేవకులు
కాపాడుదురుమిమ్ము కనిపెట్టియుండి
పరరాజులనుగొల్వ పైకొనిపోయి
అమితమ్ముగాగ ధనాదులనెల్ల
కొనవచ్చు ధర్మముల్ కూర్పంగవచ్చు
సత్కీర్తిజగముల సాంద్రమైనిల్చు
కలహించి వెనుకటి కౌరవులెల్ల
గతిచెడిపడినట్టి కష్టముల్ వినమె
పగపెరిగించుట భావ్యంబుగాదు
ఉభయవాదులుమీర లొకటికనుక
నయమొప్పజెప్పితి నామాటవినుడి
అనుచుజెప్పిననీతు లాలింపడయ్యె

కామభూపాలుండు కనులెర్రచేసి
కోపంబుమించగా కొలువెల్లజూచి
వింటిరేసభవారు వీరలతలపు
రాణువతో మును రణభూమినిలిచి
తమ్మునంపమటన్న ధర్మమాతమకు
విన్నవారలెల్ల వెరగందగలరు
మగతనంబునబుట్టి మగకాశగట్టి
మగటిమివిడనాడి మానంబువిడిచి
వారున్నతావుకు వచ్చుటతగవె
భటవృత్తివాడవై పల్కితివిట్లు
పూర్వకార్యంబుల పుట్టువుమరచి
ఈరీతిబల్కితి వేమందునిన్ను
అనరాదువినగూడ దామాతలిపుడు
తమభూమినిచ్చిన దక్కించుకొనగ
శక్తిగల్గినజాలు సదయుడనగుచు
ఇచ్చితితమభూమి యేలికొనంగ
అనుచువింతగబల్క ఆమాటలకును
భావం తెలియక పటురోషమంది
వవ్వుచుడగ్గరి నాయకురాలు

ఎవ్వరువినకుండ ఏకాంతమునను
పల్కెకామునితోడ ప్రావీణ్యమొప్ప
విను నరనాయక విన్నవించెదను
బాలరాజులుతాను బ్రహ్మనాయకుడు
కలిగినబలముతో కార్యమపూడి
కలనుప్రవేశించి కదనంబుజేయ
కనిపెట్టియున్నాడు గ్రక్కునమిమ్ము
రమ్మనిపిలిచిన రామనరాదు
కలిగినబలిమియు కలిమియువిడిచి
మగటిమివిడనాడి మానంబుదూలి
పంచిభూమినొసంగ పంతంబుగాదు
కయ్యంబుచేయుట ఘనవిచారంబు
ఇద్దరురాజులై యేర్పడిరేని
అవనిలోపలనాఙ్ఞ కమరికయౌనె
సిరిపొత్తుచేయిట చెల్లునుగాని
ఆఙ్ఞపొత్తిచ్చుట అదినీతిగాదు
చర్చించిచూచిన ఙ్ఞాతియుండంగ
అగ్నితోబనియేమి అన్నవాక్యంబు
వినవెపెద్దలుచెప్ప పృథ్వీతలేంద్ర
పరగకుజోటివ్వ పాదుకొనెదరు
తరువాతబెరుకంగ ధరనసాధ్యంబు
పాండవులకుభూమి పాలిచ్చిపిదప
కౌరవులేమైరి కార్యమర్మజ్ఞ
నీవెరుంగనినీతి నేనెరుంగుదునే
అనవినిభూమీశు డాత్మలోదెలిసి

భట్టునుకోపించి పలికెనావేళ
అలరాజుచావున కాగ్రహమంది
పగతీర్పదమకెంత బలమదిగద్దు
నాతోడబోరాడ సేనలులేవు
బలువైనశూలాలు బండ్లునులేవు
కరితురంగంబులు కాలిమానుసులు
లెక్కింపగానేమి లేవువారలకు
నేనెరుంగనిబల మెప్పుడువచ్చె
కూడిగుంపైయున్న గున్నయౌచింత
చెట్టుక్రిందికిలేదు శిబిరమంతయును
మూకంతవరిమడి మూలకులేదు
యేమనివిచారించి యిటువచ్చినావు
బవరంబొనర్చిన పట్టిబంధించి
రణబలిపెట్టింతు రణభూమియందు
ప్రాణముల్ వలసిన బాలరాజులను
తిన్నగాదోడ్కొని తిరిగిపొమ్మంచు
పటుబుద్ధిగాజెప్పు బ్రహ్మనాయునికి
అనినకోపంబుతో నాభట్టుపలికె


ఉత్తలమేటికి ఊర్వీశనీకు
కాకిమూకరీతి క్రమ్మియున్నట్టి
బలముజూచుకగర్వ పడనేలనయ్య
సంధికేతెంచిన జామాతబట్టి
చంపినవారల జగతిలోగలరె
ఆడుబిడ్డనుజంపి అల్లునిజంపి
హింసకురోయని హీనవర్తనుడ
యెరుగవావీరుల నెరుగవాబ్రహ్మ
పగవారిగుండెలు బ్రద్దలుసేయ
పటుతరవిక్రమ వైభవాఢ్యుండు
పగరాజులబొజుంగు బ్రహ్మన్నతొల్లి
అష్టదిక్కులరాజు లారణగండ్ల
కేతెంచిరణమున నెదిరినవేళ
కుంజరంబులమీద కొదమసింహంబు
దుమికినరీతిని దోర్బలంబొప్ప
కినిసివారలనెల్ల గెలిచియాలమున
మెప్పించిదివిజుల మేటివజ్రంబు
సమమైనకుంతంబు జక్కగాగొనియె
కువలయేశులవద్ద గొనేప్పనములు
ఆదినారయణు నవతారమూర్తి
కృష్ణనీదెడువేళ కేరిగ్రాహంబు
చంపవచ్చిన జూచి జంకింతలేక
ఖండించివైచిన ఘనశూరుడతడు
చుట్టునిప్పులయేరు శోభిల్లుచున్న
నేటైనశివపురి నీరుగాజేసి
భూతరాత్సంభంబు బుచ్చికొన్నట్టి
శూరుడుధీరుడు సుమహితుడెన్న
చెడనాడవారల జెల్లునానీకు
లక్షకొక్కడుసరి లావునయందు
పదికోట్లనైనను బవరంబునందు
తెగవేసిపుత్తురు ధీరతతోడ
ఉగ్రకోపాడ్యులు ఉరుబాహుబలులు
అసహాయశూరులు నరువదేగురును
భండనవిజయుల పటుపరాక్రముల
కన్నులమదమెక్కి గర్వించిపొంగి
కానకనిందింప గలుగునాఘనత
చిరినక్కకొమ్మపై చీదరరేగి
వృక్షంబుపైగెంతు వేసినయట్లు
బలములుగలవని పటుగర్వమేల
యెదురునీబలముల నెన్న నేమిటికి
ఏనుగుల్సింగము నెదిరింపగలవె
కార్చిచ్చుభంగిని గనలికోపించి
యున్నారురణమున కుత్సాహించుచును
వెడలుడుకలనికి వెడలకుండినను
నడుతురుకోటకు నాయకులెల్ల
కరులుసరస్సుని గలచినయట్లు
గురిజాలపురమును కోటతోగూడ
పెరికివైతురు క్రుంగువేరులతోడ
నిన్నునీతమ్ముని నీకైనవారి
నీదునాగమ్మను నీకూర్మిసఖుల
శిక్షింతురోరాజ సిద్ధమీమాట
అనిననారణభట్టు నందరుచూచి
కోరమీసలుదువ్వి కోపించిరపుడు

మంత్రిణినాగమ్మ మండుచుబలికె
భటవృత్తివాడవై పల్కితివిట్లు
కామభూపతిపాద కమలంబులాన
కరిచేతద్రొక్కింతు గట్టిగానిన్ను
భట్టువాదవుగాన బ్రతుకనిచ్చితిని
దైవంబునీపాల దయచేసినాడు
వీరులుఘనులని వెరపింపరాకు
సమరంబులోవారు సమయంగగలరు
మశకాళితేనిలో మడిసినరీతి
మిడుతలుచిచ్చులో మిడిసిపడ్డట్లు
మాచేతజచ్చును మన్నీలబలము
లన్నదమ్ములమేర లడగెసిద్ధంబు
వాజులపైబడి పడితోడబోరి
గురుతుగాశిరములు కుప్పలుచేసి
మత్తకరములచేత మట్టించివిడుతు
పయనమైదండెత్తి వత్తుముమేము
పారకనిలుమని వాక్రుచ్చుపొమ్ము
టంచుకట్నములిచ్చి అతనినినంపె
అనిచినపురికేగ నప్పుడెకదలి

కార్యమపూడికి గ్రక్కునవచ్చి
మలిదేవుబొడగని మన్ననవడసి
కాముడాడినయట్టి కఠినవాక్యములు
వీరులునాయుడు వినిచుండగాను
విన్నవించినరోష వివశులైవారు
కార్చిచ్చిభంగిని కనలికోపించి
గొబ్బుననీవేళ గురిజాలకేగి
కోటలగ్గలకెక్కి కూలద్రోసెదము
పట్టణమంతయు పాడుచేసెదము
అనవుడునాయకు డప్పుడిట్లనియె
దండెత్తివచ్చెడు ధరనీశువిడిచి
తగదుకోటకునేగ ధర్మంబుగాదు
వీరధర్మముదప్పి పెనగుటయేల
అనిబుద్ధిగాజెప్ప నట్లుండిరంత
గురిజాలలోపల కుంభినీశుండు

నలగామభూపతి నాగమబిలిచి
మనవద్దబంట్లును మన్నెవారలును
పఙ్తులనన్నంబు భక్షించువారు
రొక్కజీతంబుల రూఢులౌవారు
క్షేత్రముల్ జేసుక జీవించువారు
పల్లెలుబుచ్చుక బ్రతికెడువారు
నెలగోలుప్రజలకు నెల్లరకిప్డు
పైనమైరమ్మని పరగజెప్పింపు
కరితురగంబుల గదలింపమనుము
బలువైనశూలాలు బండ్లదర్లింపు
సాగింపునీవుండి జాగుసేయకుము
నాపుడుమంత్రిణి నాగమ్మపలికె

వినుముచెప్పెదనీకు వీరకామేంద్ర
పిల్లసైన్యమునకు భీతిలనేల
అరువదేగురెకాని అధికులులేరు
బలములరప్పించి పన్నిపోరాడ
వారికిబలమేది ప్రారంభమందు
గుంపుగానల్లర్ల గూర్చుకవచ్చి
బాలురగొనివచ్చి బ్రహ్మనాయకుడు
భూమిగొనిదెనంచు బూనియున్నాడు
నీబల్మి కల్ములు నీకగోచరము
దేవేంద్రుడునునిన్ను ధిక్కరించునొకొ
వారిబింకములకు వంగగనేల
నీవురాబనిలేదు నృపకులశ్రేష్ఠ
నన్నుబలమునంపు నాయునిగెలిచి
మున్నీలవీరుల మగటిమిదూల్చి
మేదినీభర్తను మేడపిపురికి
వట్టిచేతులతోడ బంపంగజూతు
అనిననాగమతోడ ఆరాజుపలికె
కొడుకుచావునకయి కొమ్మభూవిభుడు

బహుఖేదయుక్తుడై పగతీర్చికొనగ
బాలరాజులుతాను పటిమతోవచ్చి
ఉన్నాడుకలహింప ఉగ్రతేజమున
నాకులక్ష్యములేదు నాగమవినుము
నీతిశాస్త్రంబుల నిర్ణయరితి
పగవారలతులని భావింపరాదు
కొంచపుఫణియైన కొట్టెడుకొరకు
ఘనమైనదందమే కావలెగాని
కూడదుసన్నని కోలలగొట్ట
తప్పెనాతమకాన దరుముకవచ్చు
హెచ్చైనబలముతో ఏగుటనీతి
మరణమైనంజాలు మంచిదియంచు
తగదెంపొనర్తురు దారిద్ర్యయుతులు
వేగిరపడనేల వెలదిరో మనకు
ధనధాన్యబలములు తక్కువలేవు
పట్టజాలవునిండి భండారములును
తరుగవుగాదెలు ధాన్యంబుహెచ్చి
తండ్రినాతిబలంబు తక్కువలేదు
మానాడుగలయది మంచిబలంబు
భందుమిత్రులుచాల పట్టుగాగలుగ
అఖిలభూపతులునా ఆఙ్ఞచేపట్టి
పనులనొనర్తురు భక్తితోనిప్పు
డిటువలెమనలావు హెచ్చియుండంగ
మలిదేవుకార్యంబు మనమునరాదు
కార్యస్వరంత్రత గలదెయాతనికి
భండారమాకొద్ది పగయధికంబు
ప్రకృతసైన్యమునకే ద్రవ్యంబులేదు
బలములగుర్చిన భక్షణమేడ
ఈవిలేకుండిన నెవరువచ్చెదరు
వచ్చినవారలు వశ్యులవుదురె
ఒకనెలమించెనా యోర్వరుబంట్లు
దొరబంతుమేరలు తొలగుచునుండు
కార్యముల్ చెడిపోవు కలిమిలేకున్న
ప్రతిమలనాదగ బట్టినయట్లు
నాటకవిధమున నాయుడుచేసె
కదనరంగంబున గానగనౌను
మున్నీలువీరులు మనశక్తియెరుగ
వేగమెచనిదండు విరియింపవలయు
చుట్టుకవారల శూలాలబొడిచి
తురిగరింఖలచేత ద్రొక్కించుదనుక
నెరయగన్నులనిండ నిద్దురపట్ట
దనియిట్లుపలికిన ఆరాజుతోడ
నాగమపల్కెను నయయుక్తిమెరయ
మనకప్పనముపెట్టు మన్నెవారలకు
పంపించిలేఖలు బలములగూర్చి
పగతులశిరముల బల్మినిగొట్టి
రాలుబరచినట్లు రణమునబరచి
భద్రగజంబుల బంతిగాగట్టి
ముట్టింపవలెనన్న మైలమ్మసూను
డట్టులేయనిచెప్పి అంగీకరించి

వ్రాయించెలేఖలు వసుధేశతతికి
"బ్రహ్మనాయునివద్ద బలివైనకుంత
మున్నదియనిభీతి నూర్వీశులెల్ల
అప్పనాలిచ్చినా రడిగినయట్టు
లేనునుమీరలు నేకమైయిపుడు
విక్రమసంపద విశదంబుగాని
బ్రహ్మనాయునిగర్వ పాటవంబణచి
మనసులోనరమరల్ మానియుమనము
పోరాడిశత్రుల బొరిగొనియెదము
శ్రీగిరీశునియాన చెన్నునియాన "
అనిబాసపత్రిక లపుడువ్రాయించి
మామగుండముకోట మనుజేశునకును
ధరణికోటపురికి దక్షుడైనట్టి
భీమదేవుండను పృథ్వీశునకును
గోలకిభర్తకు ఘూర్జరపతికి
ఉరగసేనుండను ఊర్వీశ్వరునకును
ఏడుమాడెములేలు ఎరుకుకామునికి
పొన్నాళ్ళభూపతి పొదిలెరాజులకు
కటకాధిపతికిని కల్వరాయనికి
దేవాద్రినేలెడు తెలుగుబిడ్డలకు
పెదబాహుభూపతి భీసేనులకు
సూర్యకుమారాఖ్య చోళరాజునకు
సంగ్రామవిజయుడౌ జయదేవునకును
జయసింగునృపతికి చంద్రాద్రిపతికి
ధీరవిక్రముడైన తిరునాళ్ళపతికి
ప్రాభవాడ్యుడు వీరభళ్ళాణునకును
అరవసింగాళ్ళున కర్ణమాపతికి
బంగాళపతికిని పాండ్యేశునకును
మళయాళకర్ణాట మానవేంద్రులకు
వ్రాయించిపంపిన వారెల్లగూడి
చింతించిరీరీతి చిత్తంబులోన
నలగామరాజును నాయనివారు
పగపెట్టుకొనిపోర పయనమైనారు
తనకుసహాయులై తరలిరండంచు
నయలేఖలంపెను నలగామరాజు
సవతిపుత్రులకిప్డు సమకూడెపోరు
తీరదెవ్వారలో తెగటారుదనుక
కాముడుగెల్చిన గలయప్పనములు
లేవనిపంపెను లేఖలుమనకు
కదలుదమిప్పుడు కామునికడకు
వీరకామునిగూడి వీరయుద్ధమున
బలియిచ్చియందరి బ్రహ్మనాయకుని
పొంగెల్ల అణగింప బోలునుమనకు
అనుచువిచారించి ఆప్రొద్దెకదలి
భేరిధ్వనులుమించి పృథ్వికంపింప
కరులుఘోటకములు కాలిమానుసులు
ధ్వజములుగొడుగులు తగుచామరములు
వేలసంఖ్యలగూర్చి వెడలివేగంబె
దిక్కుదిక్కుననుండి తెంపునవచ్చి
తీరైనచోటుల దిగియుండిరప్పు

డంతటనలగాము డధికమోదమున
కొల్వునకేతెంచి గురురత్నమయత
అలరుపిఠంబున ఆసీనుడగుచు
తనమంత్రివరుల మిత్రప్రకరమును
పాలెగాండ్లదొరల బంధువర్గమును
పడవాళ్ళపిలిపించి పైనముల్ చెప్పి
రేవంతతుల్యులౌ దృఢశౌర్యయుతుల
రాహుత్తనిచయమున్ రమ్మనిచెప్పి
విజయునికీడైన విలుకాండ్రగములు
బంతినిభుజియించి పావలుదొడిగి
గర్రునదేంపుచు గరములపైని
పిగిలిపిట్టలునుండ బెద్దసావిళ్ళ
చేరిభాషించుచు జెలగిదుప్పటుల
సొగసొప్పగప్పుక సూరెలనుండ
బొట్టిలువిడియముల్ పొందించియివ్వ
మీసముల్ మెలివెట్టి మీదికెత్తుచును
గడ్డముల్ నివురుచు గంభీరమొప్ప
కదనంబుచేసెడు కధలుసెప్పుచును
మూకలైయుండెడు మూలబలమును
ధాన్యముల్ గొనువారి ధనవేతనకుల
నెలగోలుప్రజలను హెచ్చువంటర్ల
పిలిపించివారికి ప్రియములుచెప్పి
పయనమ్ముకమ్మని పల్కెనంతటను
వారెల్లరోషంబు ప్రకటముగాగ
పంతముల్ మీరంగ బలువిడిమెరసి
సురియలుపరిఘముల్ శూలసంఘంబు
ప్రాసముద్గరములు పటుఖడ్గచయము
పేరైనచక్రముల్ భిండివాలములు
పరశువుల్ బల్లెముల్ బాకుకటార్లు
శార్ఙ్ఞ్గముల్ ధనువులు శరధులుదాల్చి
నియతిచేనందరు నిజశక్తిమెరయ
నలగామరాజుకు నమ్రులైనిలిచి
రటుమీదభూపాలు డానందమొప్ప
దోడువచ్చినయట్టి దోర్బలఘనుల
పటుపరాక్రములను పార్ధివేశులను
పిలిపించివారికి ప్రియములుచెప్పి
మనముచేరగవలె మనవారితోడ
గరిమకార్యమపూడు కదరంగంబు
పైనమైరావలె వడితోడమీరు
ఘనతరసుముహూర్తకాలమునందు
భేరీనికరమును బెద్దడమాయి
నిచయంబుమ్రోగింతు నిఖిలంబెరుంగ
అనిచుజెప్పినరాజు లరిగిరందంద
ఇతరభృత్యసమూహ మెల్లనువెడల
చయ్యనపురిలోన జాటగాబంచి
నలగాముడంతట నాగమతోడ
ఘనవాజిశాలల కడకునేతెంచి
వాజులనెల్లను వరుసనుజూచి
చెలగుసాహిణులను చేరంగబిలిచి
పరగగుర్రాలను భద్రంబుచేసి
పైనమ్ముకమ్మని పలికెనంతటను
కాంచననవరత్న ఖచితమైనట్టి
పక్కెరల్ పైగట్టి బంగారుకుప్పె
కుచ్చులుజల్లులు కూడివ్రేలాడ
శర్ఙ్ఞ్గశరాధిఖడ్గ శరములున్న
వజ్రాలురత్నముల్ ప్రభలదీపింప
ముఖమలుపట్టలు మొగములగట్టి
అందెలుపదముల నాయుత్తపరచి
పుత్తడిగజ్జల పొందికచేసి
గంఠదేశములందు కట్టియీలాగు
సకలజాత్యశ్వాల సవరణచేయ
రౌతులబిలిపించి రమణీయమైన
వస్త్రంబులిప్పించి వారలందరికి
వాజులరౌతుల వన్నెగాదీర్చి
కుంజరతతులను గుంపులుచేసి
పట్టుబొంబులజోళ్ళ బలువైనయట్టి
గజ్జలపేరులు గంతలువచ్చి
గజములకెల్లను కట్టంగజేసి
అంకుశంబులబట్టి అలరుమావతుల
గొనకొనిరమ్మని కోపించిపలికి
ఘనమైనశూలాలు గట్టినయట్టి
శకటసంఉహంబు సాగించిపిదప
పలుగుడారంబులు బరువులుమోయ
ఎద్దులనొంటెల హెచ్చైనయట్టి
వేసడంబులనెల్ల వేగంబపూంచి
తర్లించికొనిపోవ దగిలియున్నట్టి
కొట్టికాండ్రనుబిల్చి గొబ్బునజెప్పి
త్రువాతనలగామ ధరణీశ్వరుండు
జోస్యులబిలిపించి సుముహూర్తమడిగి
భేరీఢమామికల్ పెల్లుగామ్రోగ
చేయింపుమని అంత జెప్పిపంపించె
వాఆనిమ్రోయించెడు వారలుపటిమ
చరచినభేరులు సాంద్రనాదంబు
విన్నవారలకెల్ల వీనులుపగిలె
ఆకాశమంతయు నదరంగగడగె
ధరణీధరంబులు తల్లడంబంది
గుహలనునోళ్ళతో గూయంగసాగె
ఘముగభూస్ఠలి కంపింపదొడగె
దిగ్ధంతలుముడింగె దిక్కులుమ్రోసె
తపనతురంగముల్ తప్పెమార్గంబు
ఎటువచ్చెనోయని ఎల్లదిక్పతులు
తెలియకభ్రాంతిచే దికమకపడిరి
అప్పుడునగరున కరిగియారాజు

కాలోచితములైన కర్మముల్ దీర్చి
పూసియుతొడిగియు బొందించికట్టి
సకలశృంగారంబు సమ్మతిజేసె
సర్వబలంబులు చనుదెంచినిలిచి
తొలగిరిన్ర్పతికి దూరంబుగాను
మావంతులప్పుడు మదముననిలిచి
పగవారలకునెల్ల భయములుచేయు
పటుతరోన్నతమైన భద్రగజంబు
పైనిబల్వన్నెలు పరగుచునున్న
తగటుపటంబులు దంటగాజేసి
కూర్చినగంతలు కుదురుగవెన్ను
పైగప్పిముఖమాలు పరుపులువేసి
పదునారువన్నియ బంగారొతోడ
రచియించిదానికి రత్నముల్ తాపి
తీర్చిన చౌడోలు తెచ్చియుకట్టి
మణిగణతపనీయ మయమైనయట్టి
చప్పరంబొక్కటి సమకూర్చిమీద
పద్మరాగప్రభా పటలిచేమించు
బంగారుశిఖరంబు బాగుగానిలిపి
గంటలుమువ్వలు గట్టిగాగట్టి
చుట్టుముత్యపుచేర్లు శోభిల్లజెసి
మణిమయమంజరి మధ్యవ్రేలాడ
చిరుతగంటలపేర్లు చెలువైనకరికి
కరమందుగూరిచి ఘంతసంధించి
పంచవర్ణంబుల ఫాలమందుంచి
ముత్యాలజల్లుల మొనసినపటము
కుంభస్ఠలంబున కొమరొప్పజేసి
శుభ్రదంతంబుల శోభిల్లునట్టి
తపనీయవలయముల్ దట్టించిమొనల
ఘనశితశస్త్రముల్ ఘటనకావించి
బంగారుగొలుసులు పదములగట్టి
గంతలుప్రక్కల గణగణమ్రోయ
తొండంబుగొలుసుల తోడరంజిల్ల
శృంగారమీరీతి శీఘ్రమేచేసి
మావంతుడెక్కియా మనుజేశునకును
చేయించెవినతిని జెలువంబుమించ
కూర్చుందజేసెను కుంభినినప్పు
డంతటానుచరు లతివేగమునను
పుత్తడీనిచ్చెన బొందికసేయ
సేవకుడొకడు చేదండయివ్వ
ఘనకరీంద్రమునెక్కె కామభూవిభుడు
వెనుకనొక్కరుడుండి వినయంబుతోడ
విడియంబొసగుచు వింజామరములు
వీచెశీతానిలాన్వితుని జేయంగ
తరువాతలేచెను దంతావళంబు
హేమదండంబుల ఎసగుచునుండు
మౌక్తికచ్చత్రముల్ మనుజేశునెదుట
పట్టిరిబహుకాంతి పటలిమిన్నడర
ధ్వజములసందడి తరచుగానొప్పె
అయిదివిధంబుల అమరువాద్యంబు
లధికరవంబుల ఆనందమొసగె
దళములతోగూడ ధరణీశవితతి
దిక్కులెల్లనుక్రమ్మి తిన్నగనడిచె
తరువాతనెలగోలు దలములుకదలె
కదలిరిదండును గైజీతగాండ్రు
బలమునల్దిక్కుల పటిమతోనడిచె
బహుమిత్రవర్గంబు బంధుజనంబు
మంత్రిపురోహితుల్ మన్ననరాగ
పచ్చలుతాపిన పాలకినెక్కి
నరసింగుడరిగెను నాథునివెనుక
పడవాళ్ళుబలములు పదపదమనుచు
పటుతరధ్వనులచే బలికిరిహెచ్చి
వేత్రహస్తులుచేరి విదళింపగాను
సందడియెడగల్గి జరుగంగసాగె
మొనయుచుశతదండములు సరిచుట్టు
పోతుటీగకునైన బోవీలులేక
అధికమౌబలమెల్ల అరుగుచునుండె
గుర్రముల్ గజములు గుంపులుగూడి
పక్షభాగంబుల వచ్చుచునుండె
మధ్యరాజెక్కిన మత్తగజంబు
సందుగానివ్వక జరుగంగసాగె
తురహహేషారవ స్ఫూర్తులుమించె
గజములుఘీంకార గాఢంబులాయె
ఘనతరోత్సాహులు కాలిమానుసులు
అట్టహాసంబుల సమరిరావేళ
గొప్పగుర్రంబెక్కి కుడిభాగమందు
జగడంబుచేసెడు చాతుర్యమెల్ల
నయగతిదెల్పుచు నాగమచనియె
నగరంబువెల్వడి నలగామరాజు
దక్షిణదిశయందు దనరెడుబయల
దూబచెర్వనెడు నుత్తుంగభూస్థలిని
నిలిపించెగజమును నిండినవేడ్క
వెంబడివచ్చిన విప్రులనెల్ల
వినయానబొమ్మన్న వేడ్కతోవారు
పగవారినెల్లను బలిమిమైగెల్చి
సకలరాజ్యములు వశంబుచేసికొని
ఏకాధిపతివౌచు నేలుభూస్థలము
అనుచుదీవెనలిచ్చి అరిగిరివేగ
విశ్వాసపాత్రులై వెలసినయట్టి
బలములో బెరైన ప్రౌఢనాయకుల
పిలిపించివారికి ప్రియములుపల్కి
కస్తూరికాగంధ కలితులజేసి
తాంబూలములనిచ్చి ధైర్యంబుచెప్పి
నగరంబుకోట క్రన్ననమీరలంత
పగలురేయియు పొరపాటులులేక
కలవారుమీరలేగద మాకుపూని
కాపాడవలెనన్న కదలిరివారు
పిమ్మటనాగమ పేరుపేర్వరుస
అధికారులనుబిల్చి అనియెవారలకు
గొల్లెనల్ మొదలయిన గురుతరభార
నిచయంబులెల్లను నించినబండ్లు
శస్త్రాస్త్రచయమయ శకటసంఘంబు
సకలవస్తువులచే సాంద్రమైనట్టి
నానావిధంబుల నాణెంబులుండు
మందసంబులుగట్ట మసలకమోయు
వేసడంబులిచ్చి వీరసేవకుల
జీతపురొక్కముల్ చేతిలోవేసి
వెంటనెపంపుడి వేగంబెమీర
లనవినివారలు అరిగిరివేగ
తరువాతకాముడు తరలించెకరిని
హయములుకాల్బలం బాఙ్ఞతోనడిచె
బలపాదసంఘాత భవధూళిచయము
మేగమార్గబందు మేదురంబాయె
తపనునిహయములంధతవహియించె
అఖిలదిక్కులయందు నమరెజీకట్లు
బలములునడుచుట బహుకష్టమాయె
జళిపించుకత్తుల సాంద్రతేజంబు
మణిగణభూషణ మంజుదీధితులు
అంతటంతట మార్గమట్టెచూపించె
అవనీస్ఠలముక్రుంగ ఆదిశేషుండు
సిగ్గుచెందినయట్లు శిరములువంప
దిగ్గజంబులుమ్రొగ్గ దిశలుగంపింప
భటులుబిరుదముల పద్యముల్ చదువ
అఖిలయాచకకోటి కానందముగను
దానంబులిచ్చుచు దరలియాప్రొద్దు

కొదమగుండ్లకుచేరె కుంభినీశుండు
పేరైనపల్లెల బెద్దలౌరెడ్లు
కోమటిజనములు కూడియేతెంచి
కామభూమీశుని కనుగొనిమ్రొక్కి
విన్నవించిరిమహా వినయంబుతోడ
మామాటవినదగు మైలమ్మసుతుడ
వైరంబుమీకేల వసుదాధినాథ
అన్నదమ్ములుపూర్వ మవనియెరుంగ
కలహించిమడిసిరి కదనంబులోన
పగలేకయేలుట బలిమిమీకెల్ల
ప్రజలకుసుఖమౌను పరులుతగ్గుదురు
బిడ్డలవిధమున బ్రీతితోమమ్ము
రక్షించుచున్నారు రాజులుమీరు
కలహించిమడిసిన కదనంబులోన
ఇతరరాజులుమాకు నేరువచ్చెదరొ
మీరురాజ్యముచేయ మేదినియందు
దుష్టులనిర్భయోత్సుకతనశించె
శిష్ట్లకుమేలు చేకూరుచుండె
ప్రాణముల్ భద్ర ముపద్రవమడగె
కరములు హెచ్చుగ గైకొంతలేదు
అనుకూలులైమీర లవనియేలంగ
కనుగొన్నమాకెల్ల కలుగుశుభంబు
హితులముగనుకమీ కెరుగజెప్పితిమి
శక్తిచాలదుమాకు సారెకుదెల్ప
అనివిన్నవించిన అనియెవారలకు
మదమునగర్వించి మలిదేవరాజు
రనముచేయగదర్లి రమ్మనిమాకు
భట్టునుబంపెను బలమెరుంగకయె
పైనమైవచ్చితి బవరంబుచేయ
వీరులనాయుని వెసమలిదేవు
బంధుమిత్రాదుల పోరిపోదోలి
వేగమేవత్తుము విభవంబుమెరయ
ఎలమితోనుండుడి యిండ్లలోనిలిచి
ఈరీతివారికి హితములుచెప్పి
పొమ్మన్నవారలు పోయిరావేళ
మరునాడునలగామ మండలేశుండు
మనమునరోషంబు మల్లడిగొనగ
కాలోచితంబైన కర్మముల్ దీర్చి
ఘనతరశృంగార కలితుడైవెడలి
భద్రకరీంద్రముల్ పైనిగూర్చుండె
తమ్ముడునరసింగ ధరనీశ్వరుండు
ఎలమితోపాలకి నెక్కివెంబడిని
స్థిరగతిబలములు చెలగంగనేగె
అర్పులబొబ్బల అవనికంపింప
సాగరముప్పొంగి చనుదెంచినట్లు
మేఘముల్ వినువీధి మేదురంబగుచు
పరువులుపెట్టెడు భంగినిదోప
క్రమ్ముకకార్చిచ్చు కదసినరీతి
పవనుండుదట్టమై పరగినమాడ్కి
వివిధబలంబులు వేగమెనడిచె
చక్కగామిరియాల సరిహద్దుదాటి
ప్రజలమేలిచింత పల్లెయుదాటి
కౌరవుల్ పాండవుల్ కలహంబొనర్చి


కూలిచచ్చినయట్టి కురుభూమిరీతి
రౌద్రగుణోద్వీర రక్తసిక్తంబు
పావనచరితంబు పలనాటిపేర
పొలుపొందుచుండెడు పుణ్యదేశమున
కాశికిసమమైన కార్యమపూడి
రణరంగభూమిని రాజుదానిల్చి
భద్రదంతినిడిగ్గె పదిలంబుగాను
చచ్చౌకమేరడ సరసంపుభువిని
హేమకుంభంబుల నెసగుచునున్న
పటకుటీరంబులు పన్నుగాగట్టి
మూలబలంబులు మొనగాండ్రువచ్చి
కూర్చున్న ఘనమైన గొల్లెనల్ కూర్చి
స్వర్ణసింహాంకంబు పరగెడునట్టి
నెరిధ్వజస్తంభంబు నిల్పిరిమ్రోల
కప్పురపువిడెంబు గావించివచ్చి
కొల్వుకూటంబున కూర్చుండెరాజు
దాపట నరసభూధవుడునుదొరలు
కొండమన్నెమరాజు కోటకేతుండు
కుడిదెసరెడ్డియు గురియైనయట్టి
చేరువకాండ్రును జేరికనలర
వీరఘంతలుగట్టి విలసిల్లుచుండు
సోమదేవరరౌతు శూరులైనట్టి
వీరరాహుత్తులు వెలయమున్నూట
అరువదిమందిదా మట్టహాసముల
రణశూరులైనట్టి రాజపుత్రులును
పోటుబంట్లనుబట్టి పొడిచెడువారు
ఊడిగలందంద యొనరికొల్వంగ
దేవతాగణయుత దేవేశురితి
భూపతిసభమందు పొల్పొందుచుండె
రాజువెంకంజేరి రమణినాగమ్మ
కార్యఖడముల ప్రఙ్ఞావిషేషముల
తెలుపుచుగూర్చుండె ధీరతతోడ
ఇతరబలంబులు హెచ్చువేగమున
తర్లెడువారును తగనడ్చువారు
విడిచెడువారునై వెరవైనచోట్ల
తగినతావులయందు తప్పకనిల్వ
మూడుసహస్రముల్ ముఖ్యులౌబంత్లు
కలనికంగణముల్ కనఏడునూర్లు

లలిమీర వీరభళ్లాణుండువచ్చె
పటువిక్రమాఢ్యులు పండ్రెండువేలు
గడలవారొకవేయి గజచరమమర
పొన్నాళ్లవిభుడు సముద్వృత్తివచ్చె
పదినూరువేల కాల్బలములతోడ
కూడిముప్పదివేల కుంజరావళుల
కదిసెమాళవపతి కామభూవిభుని
కదగితొమ్మిదివేల కాలరిబంత్ల
నమ్మదగినయట్టి నాయకచయము
ఒకవేయి అశ్వాల నొనర ప్రతాప
రుద్రుండుపంపించె రూఢసంగతిని
పదివేలకాలరి బలములతోడ
ముదమున ప్రాచిదేవుండునుగలసె
నీలిటెక్కెంబుల నేటైనబంట్లు
వెంతరాబంగాళ విభుడునుగలసె
గజములుపదివేలు ఘనమైనబలము
ఇరువదివేలతో నేతెంచెనొడ్డె
భూవినెలు బలదేవపురుషోత్తముండు
పదివేలతురగముల్ బంట్లొకలక్ష
కూడిరాకల్యాణ ఘూర్జరపతులు
కామునిగదిసిరి గౌరవమొసగ
ధనరథాస్యుడువచ్చె దర్పంబుమీర
మహిదేవిదాసుడు మదకరుల్ వేయి
శకటసహస్త్రముల్ చనువునగొలువ
ఏతెంచెసాహస మెల్లవారెరుగ
దశలక్షబలము లుత్సవమునరాగ
ద్రావిడకేరళ ధరణీశవరులు
వచ్చిరినలగామ వసుధేశుకడకు
పద్మసేనుండును పరువడివచ్చె
గురుసహస్రద్వయ ఘోటకయుతుడు
గుండమదేవుడు గొబ్బూరిరాజు
మొదలైనరాజులు ముఖ్యులౌబంట్లు
ఏనూరుతోగూడ నెనుబదిమీద
ఎనుబదివేలతో నేతెంచిరపుడు
తక్కినరాజులు తమతమబలము
లెసగగనేతెంచి రివ్విధంబునను
వచ్చినబలముల వరుసగణింప
బుద్ధిమంతులకైన పొసగదునేర్పు
సంతోషములచేత చనుదెంచినట్టి
మనుజేద్రులకునెల్ల మంచికత్నములు
తెప్పించియిచ్చిన తిన్నగానుండి
రంతటనాగమ్మ అశ్వంబునెక్కి
తగినయిరవుచేసె ధరణీశతతికి
మిగిలినవారికి మేలైనఠావు
లమరించివిడియించె ఆనందమొంద
ఎక్కడచుచిన నెడలేకకదిసె
ఇసుకజల్లిననైన ఇలమీదబడదు
చొరదువాయువుదండు చొచ్చినరాదు
సుపథంబుదొరకదు చోద్యమైయుండు
ఆదండులోపల అఖిలవణిజులును
సకలధాన్యంబులు సకలరత్నములు
బంగారువెండియు బహుదానవితతి
సరిగవస్త్రంబులు సరసంపుబట్టు
పటములుఘనతంతు పటములుమరియు
కాంస్యతామ్రశ్వేతకమ్రభాండములు
రసవర్గములనెల్ల రంజనంబొప్ప
క్రయవిక్రయమ్ముల కావింతురెపుడు
సౌందర్యఘనతచే సంపన్నమైన
వేశ్యవాటికలొప్పు విశిదంబులగుచు
దారిద్ర్యమనునది దండులోలేదు
ధనధాన్యవృద్ధిచే దనరెడులక్ష్మి
వేలంబులోపల విలసిల్లుచుండు
అంతటబహువిక్రమాఢ్యమానసులు

భండనవిజయులు పటుపరాక్రములు
వీరులుతత్సైన్య విధమెల్లజూచి
బ్రహ్మనాయునితోడ వాక్రుచ్చిరిట్లు
నలగామభూతల నాథుండుమదిని
తనకెవ్వరెదురని ధైర్యంబుపూని
భండవిజయత ప్రబలుదునంచు
భువనభయంకర భూరిప్రతాప
పటిమగల్గినయట్టి బ్రహ్మనునిన్ను
విజయోద్ధతాటోప వీరులమమ్ము
తలపకమాత్స్ర్య దర్పముల్ మీర
వీపునకెదురెక్కి వెరుపకనిలిచె
కనియూరకుండుట కార్యంబుగాదు
పందలవెలెనుంట పంతంబెమనకు
అనివార్యమైనమీ యాఙ్ఞాఖలీన
బద్దులమైనిల్వ బడితిమిగాక
కత్తికిమొక్కొక్క కండనుదీసి
పరిపంథిగణముల పట్టిమర్ధించి
కుమ్మరామమునందు కుటిలతగచ్చ
ఫలమువేసినభాండ పటలంబుపగిలి
పెంకులైపడ్డట్లు పెనుకంపమంది
విడిబడియేనుగుల్ వీథులబార
సకలబలంబుల సమయించియముని
పురికంపియుండమే భుజసౌర్యమొప్ప
సెలవిచ్చిపంపుము శీఘ్రమెమమ్ము
నాపుడుశీలమ నాయుడుపలికె

వినరయ్యవీరులు విశదంబుగాను
విదితస్వశక్తిపై విశ్వాసమున్న
ఎదిరిసామర్థ్యంబు తృణముగాదోచు
సహజగుణంబది జంతులకెల్ల
కానకామేశుండు కదిసెనుమనల
నలగామునిందింప న్యాయముగాదు
రణకేళిసల్పుట రాజధర్మంబు
మనకున్నబలముల మనముకూర్చికొని
పోయిశత్రువుల పొరిగొనవలయు
సాహసంబొనరింప చనదన్నిపట్ల
సర్వకార్యములొక్క చాయనరావు
హెచ్చైనతనబల మెదిరిబలముల
కొలదులుపరికించి కొరతలుండినను
సవరించిసకలంబు సన్నిద్ధప`రచి
చిత్తమునందన్య చింతలుమాని
కార్యదీక్షవహించి కదనరంగంబు
చేరంగబోవుట స్థిరవిచారంబు
నేనుమీయుత్సాహ నిర్మలస్ఫూర్తి
తగ్గించినానని తలుపగవలదు
తమకింపగూడదు తఱియుదనుక
నాపుడుకొమ్మ భూనాథుండుపలికె
పలికెదుచల్లని వాక్యంబులిపుడు
కొడుకునుపగరచే కోల్పోయినట్టి
దుఃఖంబుమదిలోన దొరలుచునుండ
నలగాముజంపక నామదిచింత
వాయదు నీవెన్ని పలికిననైన
ఎవ్వరుతనకెదు రీభూమినంచు
జగడంపుడేరాలు సరవినెత్తించి
ఉన్నాడుమనమీద ఉగ్రతేజమున
కమలబాంధవవంశ కర్తయైనట్టి
బలభద్రరఘుపతి పంపుననిప్పు
డరచియునొకశరం బారాజుకడకు
అంపిననిలిచిన నతడునాసాటి
చెడివిర్గిపడెనేని క్షితిభర్తగాడు
పంతమియ్యదియని వాక్రుచ్చిపిదప
గాండీవసమమైన ఘనచాపమెత్తి
వాసుకీకోరల వాడిగలట్టి
దొనలనుమెరయగ తూర్ణంబెతివిచి
వెలయంగముత్యాల పేరులల్లాడ
అలుగునమణిగణం బమరంగముఖము
మధ్యాహ్నభానుని మాడ్కికన్పట్టి
శరముచాపంబున చయ్యనదొడ్గి
కర్ణపర్యంతము గ్రక్కునలాగ
కోపంబుమించగా కోయనియార్చి
కనుగవదృష్టిని కదలకనిలిపి
వీకతోమంటలు వెళ్ళగాయచును
బాణమువిడిచెడు పటిమకావేళ
నక్షత్రములుడొల్లె నాగేశుడులికె
అవనియుకంపించె ఆకాశమదిరె
కనురెప్పపాటున కంటెవేగమున
పిడుగుపడ్డట్లుగా పృథ్వీశుడడర
ఘనమైనగొల్లెన కంబంబుదాకె
అదియంతతునకలై అవనిపైబడెను
పసిడికుండలడొల్లి పడెగుడారంబు
లానందమునవార లరచిరిమించి
విడిబడియేనుగుల్ వీథులబారె
అశ్వముల్ రాహుత్తులరిగిరిచెదిరి
బండ్లతోనెద్దులు పరువిడసాగె
సాలగుర్రంబులు సరభసమంది
కట్లుతెంచుకపారి గట్లపాలాయె
కోల్పడిగెలుపట్టు గొడుగులనెల్ల
పట్టెడువారలు పడవైచిచనిరి
కల్లోలమందుచు కామునిబలము
భయమునజనిచింత పల్లెనిదాటె
వీరకామేంద్రుడు వేత్రప్రాణులును
పడవాళ్ళనంపించి భయములదీర్చి
జనులనుబిలిపింప చయ్యనవచ్చి
తమతమతావుల దగనుండిరపుడు
వీరులందరుతమ వేలంబులోన
నిలిచిరిసంతోష నిర్మలమతుల
ధీవరులైన జ్యౌతీషకులనపుడు
పిలిపించిబ్రహ్మన్న ప్రియములువెప్పి
సమరముచేయగ సరసమైనట్టి
సుముహూర్తమొక్కటి శోధింపుడన్న
ఆరీతిచూచెద మందులకేమి
క్షీరాబ్ధిశయనుడు శ్రీవల్లభుండు
దాసరక్షణమందు దయగలవాడు
చెన్నుడుమీవెంట చేరియున్నాడు
సకలకార్యములు సమకూరుచుండు
అనిదీవించి అరిగిరివార

లంతట మేడపినైన వార్తలను
తెలుపుదుజనులకు దెల్లముగాగ
పరమోత్సుకతచేత బాలచంద్రుండు
సంగడిబాలురు చనవునగొలువ
రమణీయమైనట్టి రాచిల్కచదువు
వినుచువేడుకపుట్టి విచ్చలవిడిని
గుమ్మడికాయలు కొంతసేపాడి
చెరుకులపందెంబు చెల్వొప్పగెలిచి
తనసంగడీలకు దయతోడనిచ్చి
తమ్ములువెంటరా ధామముజేరె

తల్లినిగనుగొని తనయులందరును
మ్రొక్కినదీవించి ముదమునతల్లి
పలికెనీవిధమున వారలతోడ
నాయాత్మసుతులార నాయన్నలార
పద్మనాభునిగర్భ పాథోధియందు
పూర్ణచంద్రులరీతి బుట్టినవారు
ఘనమైనభూషణ కాంతులుమీర
మీరన్నదమ్ములు మేలిమినాదు
ఎదుటనునిల్చి నన్నేమివేడెదరు

చిత్తములోకోర్కె చెప్పుడీయనిన
నవ్వుచుబాలుడు నాతికిట్లనియె
తరుణిరో మేమునీ తనయులమగుట
సకలవైభవములు సమకూరెమాకు
ప్రియముతోమమ్ముల పంపుసేయంగ
ప్రొద్దుపోదేమిట పొసగంగనన్న
ముద్దులకొమారుని మోమువీక్షించి
ప్రొద్దుపోవకయున్న పుత్రరత్నంబ
పోకలాటలచేత బుచ్చుముప్రొద్దు
ఆడుడిముత్యమ్ము లమరుబంతులను
గుంతమాపలనాడి కొనిగెల్చుకొనుము
బైటనాడగవద్దు బడలెదుసుతుడ
కుటిలజంతులదెచ్చి గుడిలోననుంచి
విడిపించిపోరాడు విధమునుచూడు
రూకలకుప్పలు రూఢిగానడు
మనినతల్లిరొవాని నాడితిమమ్మ
వానిపైనిప్డాస పడదుచిత్తంబు
క్రొత్తలపైన మక్కువగల్గియుండు
అనిబాలుడాడిన ఐతమ్మపలికె

ఆటపాటలపైన అలసితివేని
వినవయ్యబాలుడ విశిదంబుగాను
విభుదులవిప్రుల పిల్వగబంచి
వినుముభాగవతంబు విఙ్ఞానమొదవ
భారతరనకథ పాటించివినుము
భీష్ముడొనర్చిన వివిధశౌర్యముల
అచలితబుద్ధితో ఆలింపుపుత్ర
ద్రోణుండునెరపిన దోర్బలగరిమ
మనమునబట్టింపు మానితసుతుడ
కర్ణుండుజూపిన ఘనపరాక్రమము
సూక్ష్మంపుబుద్ధితో జూడుముతనయ
శల్యునియందున్న శాస్త్రచాతురిని
జాగరూకతమెయి చర్చించువేడుక
దుర్యోధనునిమాన ధూర్వహపటిమ
ఆసక్తితోడుత అరయుమాత్మజుడ
చాపంబువిడిచిన సవ్యసాచికిని
కృష్ణుడు చెప్పిన గీతలయందు
కర్మరహస్యముల్ గాంచుకుమార
నేర్చినవానిని నేరుపుమీర
దృఢధైర్యమున ఆచరింపంగవలయు
అనినమాటలువిని ఐతమ్మతోడ
బాలుడిట్లనియె పకపకనవ్వి

వినవమ్మతల్లిరో విమలేందువదన
ధర్మార్థకామ తత్వంబెరుంగుదును
శాస్త్రజాలంబుల చాలగవింతి
మనమునదెలిసితి మర్మంబులెల్ల
ప్రకృతకౌమార చాపల్యంబుకతన
చిత్తవిశ్రాంతికై చేరిఈవేళ
బొంగరాలాడగ బుద్ధిజనించె
సెలవిచ్చిపంపుము శీఘ్రమొమమ్మ
ఈరీతిపలికిన ఏణాక్షికలగి
వెరచియువెరవని విధమునననియె

విశదంబుగాబాల వినుముద్దుతనయ
ఈబుద్ధితలపగ ఇచ్చలోవలదు
వలసలోనెన్నాము పడబొంగరాల
ఆడినజేతప్పి అతివలకైన
తగుబాలురకునైన దాకునుబోయి
పడతులుకోపించి పలుతెరంగులను
శపియింతురీమాట సత్యంబుపుత్ర
శాపింపబడుటకు సాహసమేల
నామాటగడచుట న్యాయంబుగాదు
నావుడుబాలుడు నాతికిట్లనియె

ముదితరోనావంటి ముద్దులసుతులు
పుట్టరాభూమిని పుణ్యాంగనలకు
వారేలశపియింత్రు వనితరోనన్ను
అలిగితిట్టినపాప మనుభూతమగును
పూబోడినాదేహ పోషణార్థంబు
పెట్టనితావుల పెట్టిదాచెదవు
కొదమసింహముతన గురుశౌర్యమమర
ధరవిజృంభింపక దాగునాయొదిగి
ఏటికిభయమంద నింతిరోనీకు
అనవినీబ్జాక్షి ఆత్మలోగలగి

ఏలబాలుడనీకు నింతధైర్యంబు
శాపింపబోరని సంశయమేల
దుష్టలుతులువలు దుర్భాషిణులును
తారతమ్యంబుల తగవెరుంగకయె
కచ్చెకుముందుగ గాలుదువ్వెదరు
భావంబులిట్టివి పడతులకెల్ల
నీమేలుగనిగొని నేనోర్వలేక
పలికుటకాదోయి బాలచంద్రుండ
అనిచెప్పినంతట ఆబాలుడనియె

దుష్టభావుడగాను ధూర్తుడగాను
వెలదులకెల్లను వినతిచేయుదును
దయచేయుదురువారు తనయునిమాడ్కి
తడవాయనేవచ్చి తల్లిరోయిటకు
పుత్రునిమాటలు బుద్ధిలోనుంచి
నాకాంక్షలీడేర్చి నన్నంపవమ్మ
బాలచంద్రుండిట్లు పలికినవేళ
ఐతమ్మనవ్వుచు నపుడునేర్పరుల

ఒజ్జలబిలిపించి యొప్పుగామీరు
బొంగరంబులుకొన్ని పూనిచేయంగ
తగునన్నబాలుండు తనలోననవ్వి
దల్లితోననియెను దయవచ్చునట్లు
శత్రువులబొజుంగు సాంద్రవిక్రముడు
గండుభీమనగర్భకంధిరత్నమవు
లోభమ్మునీకేల లోలాయతాక్షి
ఏడుకోటులసంఖ్య నెసగినధనము
కలిగినఆగండు కన్నమనీని
చెల్లెలువైయుండి సిరులుచెన్నొంద
చెనటిబొంగరములు చేయించుకొరకు
ఏరీతిమనసొప్పె ఏణాక్షినీకు
బీదవాక్యమ్ముల పెదవులపైకి
తేరాదుపెద్దల తీరుకువెలితి
భావంబులోలోభ పటిమమీరంగ
గృహకార్యములు నిర్వహింపజూచెదవు
నీవంటిదానికి నీతియేచెపుమ
నీవెయుంచికొనుము నీతండ్రిసొమ్ము
సకలదేశాధీశ సంఘంబునెల్ల
సమరరంగంబున సాధించిమించి
వారిచేమాతండ్రి వలసినయట్టు
లప్పనంబులుగొన్న అధికధనంబు
పొందుగాదెప్పించి పుటముపెట్టించి
పైడిబొంగరముల పరగజేయింపు
వెండిచేములుకులు వెలయబెట్టింపు
పట్టుచేజాలెలు పన్నిపేనింపు
ముత్యాలకుచ్చులు మొదలగూర్పింపు
తెప్పించియిప్పింపు తీవ్రంబుగాను

దండివిక్రములైన తమ్ములునేను
ఆడుకోవలెనంచు అభిలాషపొడమె
నావంటిబాలుండు న్యాయంబుతప్పి
బీదబొంగరముల వెలది! యెట్లాడు?
చూచినవారలు చోద్యమందుదురు
ప్రజలుదూషింతురు బహువిధంబులను
సకలరాజులగెల్చి జయముచేకొన్న
బ్రహ్మనాయునిగర్భ పాథోథియందు
చంద్రునివిధమున జనియించినట్టి
బాలునికీలేమి ప్రాప్తమౌటహహ
కాలమహిమమని గర్హింపగలరు
కావునలోభమ్ము గాంచనీకేల

కలిములు నిత్యంబుకావు తల్లి
మెరపు మెరయురీతి మేఘంబులట్ల
బుద్బుదంబులభంగి పోవునుజెదరి
ఈరీతిదలబోసి యెరుకచేమించి
సంపదవేళనే సకలభోగములు
పొందంగవలె ధర్మములు చేయవలయు
భోగానుభవముచే పుట్టిసంతృప్తి
వెసటజెనియించి వెగటుగాదొచు
అటుమీదవైరాగ్య మమరుచునుండు
ధర్మముల్ చేసిన తనరు పుణ్యంబు
సజ్జనసహవాస సంప్రాప్తికలుగు
వైరాగ్యమధికమై వర్తించుబిదప
భోగధర్మంబులు పుట్టినయపుడె
సరవివిరాగిత సంసారమెదలు
సద్గురుపదసేవ చెయ్యనగలుగు
అందుచే నిర్వాణమందికయగును
కావున భోగముల్ గైకొనవలయు
శాస్త్రంబులీలాగు చాటిచెప్పెడిని
ధనందులోభంబు తగ్గింపుతల్లి
ప్రాణంబనిత్యంబు భవమనిత్యంబు
ద్రవ్యంబువచ్చు నాతవిలి వెన్వెంట
ఇటువంటి మానవుఁడీదేహమెడలి
పోయికొన్నాళ్ళకు బుట్టునుమరలి
కర్మరహశ్యముల్ గాంచినవారు
ద్రవ్యంబునకు నవస్థాద్వయమిట్లు
తనరింపుచుందురు తద్ ఙ్ఞులుగనుక
నీవెరుంగని మర్మమే నెరుంగుదునె
చనినభూపతులెల్ల సమకూర్చినట్టి
చిత్రమౌధనములో చిన్నమేమైన
గొనిపోయిరావెంత గూర్పంగనేల
ఆశచాలించుటే ఆనందపదవి
చెలిమినామాటలు చిత్తమందుంచి
మాకోర్కెలీడేర్పు మమ్ముమన్నింపు
ధనలోభమందిన దానవుకనుక
ఇంతగాజెప్పితి ఏణాక్షినీకు
నీలోభగుణమును నేవిన్నవింతు

తప్పక మదికిని దార్కాణగాను
నీమేనగోడలి న్నీవడ్గినపుడు
నామేనమామలు నాపెండ్లినాడు
మాకులంబునఓలి మాడలుగలవు
తగినధనంబీక తామీయమనిరి
ఆమాటమీదట నమ్మరోనీవు
మిట్టడివేసితి మూర్ఖతతోడ
అయిదురోజులదాక నంతమామామ
అక్కవైననునేమి అలిగిననేమి
అడిగినధనమీయ కతివనేనీయ
బ్రహ్మవచ్చినగాని భయపడబోను
నియమంబునాకిది నెలతరోయన్న
ఏమికావలె నీకు నిప్పింతునిప్పు
డన్న సందేహింపకకడుగవే యనిన
మాదలు తూమెడు మాకుగావలయు
ఇప్పింపువేగమె యింకొక్కమాట
అఖిలరాకులొసంగినట్టి యప్పనము
లందుదాలువిగల వతివరోవినుము
పొల్లునుతాలును పొసగవుమాకు
తీరైనమాడలదెచ్చి యిమ్మన్న
మదిలోననొవ్వక మగువనీవప్పు
డూడిగీలనుబంపి ఒప్పైనధనము
తెప్పించిరాశిగా దీర్చిపోయించి
కొలిపించికొమ్మన్న కోరిమీయన్న
మెట్టొండు కట్టించి మీదదానెక్కి
హెచ్చుగాతూర్పార నెత్తెనుభువిని
చిందిపోయినవెల్ల జెడుతాలుపొల్ల
అనిరోసి మిగిలిన అర్థమంతయును
అధికమౌ తూమొకటపుడు తెప్పించి
ఎలమితూమునకంటె హెచ్చిగాగొలిచి
కళ్ళమడ్గువితానె కావలెననుచు
తాలునుపొల్లును దానెగోరుచును
ఇండ్లన్నిమాకని హెచ్చినకాంక్ష
కట్టించిమూటలు కైకొని తర్లె
నేనెరుంగుదునుదల్లి నీమనస్సరణి
మించినకీర్తికై మెలగితివప్పు
డన్నపుత్రునిమాట కైతమ్మనవ్వె
హెచ్చుగా నవ్వినారెనమండ్రుసుతులు
గారాబుతనయుల గడుప్రేమండర
గూర్చుండబెట్టియు గూరిమితోడ
మెదలురప్పించిన ముఖ్యులైనట్టి
ఒజ్జలుతనమ్రోల నుండగజూచి
బొంగరంబులుచేయ బొసగునుమీకు
పైడియిప్పించెద బట్టినయంత

పనిముట్లుదీసుక వడిరమ్మటన్న
వారలిండ్లకుబోయి పట్టెడకారు
కమ్మచ్చులును నీరుకార్లు సుత్తెలును
ఘనమౌపడచ్చును కత్తెరల్ మరియు
అలరుముచ్చులుగుదులాదియైనట్టి
పనిముట్లుగొనిదెచ్చి భామకన్నెదుట
భక్తితోనిలిచిరి పటిమదీపింప
ఐతమ్మసెలవిచ్చె నంతటవారు
చదురేర్చికూర్చుండిసరి పనిముట్లు
పరచిముందరకడ పావకున్నిలిపి
పుష్పగంధంబుల పూజకావించి
నైవేద్య తాంబూల నతులొనరించి
కనకలక్ష్మికిదగు కమఠంబు నిలిపి
కడుగొప్పమూసలు గట్టిగాజేసి
నిజమైనబంగారు నిండించిమంచి
పలుకుల గరగించి పరికించునపుడు
కాలహేతువదేమొ ఘనలక్ష్మిమహిమ
కరగువేళలవన్నె కదలకనిల్చె
తరువాత ఆశ్చర్యదంబైచెలంగ
చెదరీంతంతకు చీకాకునొంది
చిదురుపాలాయె విచిత్రంపుభంగి
ఒదిగిచుట్టునున్నట్టి ఒజ్జలందరును
కనుగొనిభీతిల్లి కంపితులైరి
బాలుడావేళను ప్రాభవంబొప్ప

తల్లితోననియెను తననేర్పుమీర
కడనెన్నిచిదురులై కరగిననేమి
కరగినవేళల కళలేమిచెడక
నిలుచుటే శకునంబు నిశ్చయంబిదియ
అటుమీదనగుకార్య మదియేమిలెక్క
చెడనిపదార్థముల్ సీమలోలేవు
చెడునుగట్లును నదుల్ చెట్లును లతలు
సంచారి జీవముల్ సమయుచుండు
సమసినజీవముల్ జనియించుమరల
జడపదార్ఠంబులు చైతన్యమందు
పొలియదొక్కటివిను బొత్తిగానెపుడు
పుట్టదుక్రొత్తది భూమిలోపలను
పోయినదానిని పోయెనటంచు
ఉన్నదానినిజూచి యున్నదటంచు
భావింపగారాదు పదతిరోకనుము
కాలవశంబున గలపదార్ఠములు
రూపభేదంబుల రూఢిగాబొందు
ధరబ్రహ్మవ్రాతలు తప్పింపరాదు
కావునఆశ్చర్య కారణంబేమి
మాయాభవంబిది మాసిపోగలదు
హృదిలోన సంశయమేలనేతల్లి
కావింపుమమ్మ బొంగరములననెను
వేయిమాడలచేత విరచించి అపుడు

మంగలియైనట్టి మాధవుకిచ్చె
కుమ్మరపట్టికి గురుతుగారెండు
వేలకుజేయించి వేగమేయొసగె
సరిమూడువేలతో చాకలచందు
బొంగరంబమరించి పొసగనిప్పించె
అలరునాలుగువేల కమరికచేసి
కంసాలిచందుకు గరుణతోనిచ్చె
అయిదువేలకుజేసి యాకమ్మరికిని
ఇప్పించెమదిలోన నెన్నికొనంగ
వెలమపట్టికి ఆరువేలకుదీరె
పదివేలతోజేసి బాపనికిచ్చె
నారాయణుండైన నాయనికొడుకు
బాలునిచేతికి పండ్రెండువేల
తీరిచివన్నెలు దీరిచిపైన
సకలరత్నంబులు సంఘటియించి
ములుకులువెండితో మొనలగదించి
ఇచ్చెను సంతోషమింపెసగంగ
పిమ్మటనొజ్జల ప్రియముతోజూచి
తగినకట్నంబుల దయమీరనొసగి
పొమ్మనిసెలవీయ పోయిరివార
లంతటాఇతమ్మ ఆనందమునను
చారువర్తనువాడ చక్కనివాడ
గురుతరరేచర్ల కులవర్ధిసోమ
బాలుడనీమది పరిణామమాయె
షడ్రసోపేతమౌ సకలవస్తువుల
వంతయైయున్నది వచ్చిమీరెల్ల
భుజియించిపొండన్న పొందుగాలేచి
బానసశాలలో పక్వవస్తువుల
గరిమతోభుజియించి కరములుకడిగి
వాసశాలకువచ్చి వసియించిమించి
కాశ్మీరకర్పూర కస్తూరులెసగ
తెచ్చినగంధంబు దిన్నగాబూసి
చిత్రవర్ణంబుల చెలగుచునున్న
తగుపట్టువస్త్రముల్ దవిలిధరించి
బహువిధమణులచే భాస్వరమైన
ఆణిముత్యంబుల అమరినయట్టి
మెరుగుభూషణములు మేనులదాల్చి
భాసిల్లి శృంగారభరితులైవచ్చి
తప్పక నిలచిన తనయులజూచి
ఎలమితో ఐతమ్మ యిట్లనిపలికె

మేడపిలోపల మేలైనయట్టి
రచ్చకొట్టంబుల రాజవీథులను
విపణిమార్గంబుల విబుధగేహముల
బొంగరాలాదగ పొసగదుసుమ్ము
కరుణతోనాబుద్ధి గైకొనిమీరు
మేడపిలోనుండి మేలుగావెడలి
ఉత్తరదిశయంది ఒప్పుచునున్న
చాలురావులకాడ సరసమైనట్టి
రమణీయమగుమొల్ల రావిక్రిందటను
ఆడుడిబొంగరాలానంద మొసగ
పొందుగాఈరీతి బుద్ధులుచెప్పి
చక్కనిముత్యాల జాలెలదెచ్చి
అందించి చేతుల కాశీర్వదించె
సేవకుల్ తగరుల శృంగారపరచి

పసిడిపల్లంబులు బాగుగాగట్టి
పట్టుజాలెలుదెచ్చి పరువడిగప్పి
ముందరనిలిపిరి ముద్దుపొట్టేళ్ళ
బాలచంద్రుండును భ్రాతృసంచయము
వేడ్కమీరగవాని వీపులనెక్కి
కమ్మరగరితలు గణములుప్పొంగి
వింజామరలబట్టి విసరుచునుండ
గచ్చకాయలుకొన్ని కలిగినయట్టి
తిత్తులు చిరుతలు తీరైనగొడెలు
జూదమాడుటకయి సొగటాలుకొన్ని
బంతులుపిట్టలు పంజరచయము
పేరైనడేగలు పిగిలిపిట్టలును
శారికావళి కీరసంఘంబు మరియు
ఆటలసాధనాలవి వెంటరాగ
రయమునజనిచాలు రాపులసరస
మొల్లపేరిటిరావి మొదటనుజేరి
తీరైనతగరుల డిగ్గివేదికల
పైనిబరచినట్టి పలువన్నెలమరు
రత్నకంబళముపై రంజిల్లనుండి
బొంగరాలాడగ పూనిరావేళ
సరసమేడపిజనుల్ సంతసంబొప్ప
బొంగరాలాడెడు పొంకమంతయును
పోయిచూడదలంచి బుద్ధులునిలిపి
వనితలుతండ్రుల పతులపుత్రులను

అత్తలమామల అడుగుటమాని
గృహకృత్యభారంబు లెడలచాలించి
ఒకరినొక్కరు ఒగిబిల్చికొనుచు
తమలోనముచ్చటల్ దగజెప్పికొనుచు
రయమునబోయిరి రావులకడకు
ఆపురవరమున అలరారుచునుండు
వరవిప్రకామిని వైశ్యకామినియు
ఎడలేనిపొందుచే ఎగసెడువారు
తరివిచారించిరి తమలోనదాము
నాయనిపుత్రుండు నవమన్మథుండు
బాలుడు సంతోషభరితుడైయిపుడు
తమ్ములుతానును దననేర్పుమీర
బొంగరాలాదగ పూనుయున్నాడు
కనుగొనివత్తము గ్రక్కునబోయి
అనిబల్క బ్రహ్మణి ఆపెతోనపుడు
ప్రకటమ్ముగావైశ్య వనితయిట్లనియె
ఓయమ్మబాలుండు ఉరుమనిపిడుగు
పాపపుణ్యంబుల భావింపడతడు
శకటసమూహంబు చనియెడువేళ
చీలలూడగదీయు జేతులబట్టి
ఆడెడుపాపల అదరంటగొట్టు
వెంగలిదుష్టుండు వీతధర్ముండు
వానిజూడగనేల వాంచజనించె
నాపుడుబ్రాహ్మణనారి యిట్లనియె
నేబోయివచ్చెద నెలతనీవుండు
మనినుడువంగ వైశ్యంగన కూర్మి
పడతినీదగుపొందు పట్టుటమొదలు
ఎడబాసియుండుట యెన్నడులేదు
నేడునిన్నెడబాసి నేనెట్టులుందు
వచ్చెదపదమని వడితోడలేచి
నీరాడికడవను నేర్పుగాబట్టి
అత్తకుమామకు అతిభక్తిమ్రొక్కి
కనుగొనివత్తుము గ్రక్కునబోయి
అననవ్విపెద్దవా రతివలనంప
కదలిరికర్పూర గంధులుచెలగి
చనిదీర్ఘికనుడిగ్గి జలములనంత
కప్పిననాచును గడకేగజేసి
నిర్మలోదకములు నించికడవల
శృంగారమొప్పగ శిరములబెట్టి
దురితబంధంబుల దొలగింపలేక
ఖర్మఫలంబును గడవగలేక
నెలతలు చనుదెంచి నిల్చిరచ్చోట
ఆశ్చర్యవాక్యాల అప్పుడిట్లనిరి
ఈతడేపలనాటి నేలెడుబ్రహ్మ
తనయుడు సఔందర్య దర్పకుండితడె
మార్తాండతేజుండు మహితశౌర్యాఢ్యు
డీచొప్పునీయొప్పు నీచక్కదనము
అలవియేపొగడంగ అజునకునైన
బంగారుకలశాల పన్నీరుతెచ్చి
మదనారినభిషేక మాడించెదొల్లి
మాంచాలకాకున్న మానితయశుడు
కలితసౌందర్యుండు కందర్పసముడు
పతియేలయౌనని పాయనివేడ్క
ముచ్చటలాడిరి మూకలైచేరి
ఆసమయంబున అనపోతులేచి
పట్టుగాగిరివ్రాసి పైడిటంకంబు
నిల్పిబాలునిజూచి నెనరొప్పననియె
ఊరకయున్నాడ వోబాలచంద్ర
బొంగరాలాడెడు బుద్ధితోతమ్ము
లెల్లనుగనిపెట్టి యిపుడున్నవారు
నీవుముందాడక యెవరాడరాదు
మొదలిడుమనిచెప్ప ముదమున అతడు
తోరంపుసందడి తొలగింపుమనెను
బద్దలవారంత పరుగునవచ్చి
చెలఁగిబరాబరుల్ చేసిరిమ్రోల
తంత్రఙ్ఞులగుమేటి తమ్ములులేచి
చేరిఆటలనాడ చిరునవ్వునవ్వి

బలపరాక్రముడైన బాలచంద్రుండు
ఘనతరమాణిక్య ఖచితమనట్టి
బొంగరంబరచేత బూనుకయుండి
నేరుపుచూడుడి నిలిచిమీరెల్ల
తిరిగింతుచేతిలో డీటులేనట్టు
లవనిపైబడకుండ అనంతరమందె
పట్టియాడించెద బహువిధగతుల
అనిచుట్టునున్నట్టి అతివలజూచి
అత్తమామలభక్తి అమరినవారు
పతిమాటలకెదు పలుకనివారు
వినయమౌనామాట వినుడిమీరెల్ల
దూరాననుండుడి తొలగికంగొనుడి
అనిచెప్పిబొంగరం బరచేతబట్టి
ముత్యాలజాలెను ముదమునజుట్టి
చేయెత్తిహుంకించి స్థిరబలంబునను
వేసినవడిమీర వేగమెపోయి
సంయమీశుందను చట్రాతిదాకి
మింటిమీదకెగసి మెరుగులుక్రమ్మ
అన్నమ్మయనుపేర నలరుచునున్న
చక్కనికోమటి జలజాయతాక్షి
మీఁగాలికిందాకి మించినములికి

అరకాలుదిగివచ్చి అవనికిదాకె
తాకినఆవశ్య తరుణిభీతిల్లి
గగనంబుపైబడ్డ గతికంపమొంది
కరిగినఖర్జూర తరువుచందమున
తటుకునమూర్చచే ధరమీదనొరిగె
చెదరికుంతలములు చిక్కులనొందె
మిక్కిలిచెమటచే మేనివస్త్రంబు
తడిసెనుగుండియ దడదడమనియె
మేదినీరేణువుల్ మేనెల్లగప్పె
ఈరీతిబడియున్న యేణాక్షికడకు
పొక్కుచుజేరెను పొలతులగుంపు
కప్పిరివలువలు కర్ణంబులందు
కర్పూరరజమును గలయంగనూరి
పదతలంబులయందు పాణులయందు
కస్తూరిగంధంబు గలిపిపట్టించి
చానలుశైత్యోపచారముల్ సలిపి
చింతింపబోకుడి చెలిలేచునిపుడె
అనిపల్కునంతలో ఆమూర్చదెలిసి
ముకుళితహస్తుడై ముందరనున్న

బాలునుగనుగొని బలుకోపమునను
కన్నులెర్రగజేసి కాంతయిట్లనియె
ఓరిదురాత్ముడ ఓరిదుర్మార్గ
క్రింమీదెరుగక కెరలుచున్నావు
గర్వమేటికినీకు కాంతలయెడను
కలిగినదినవలె గట్టంగవలయు
ఎరుకమాలినచేష్ట లేలచేసితివి
మురియంగనేలనీ పొంగెల్లనణగ
ముదిరెమదంబునీ మురిపెంబుక్రుంగ
తగమల్లభుపతి ధనమెల్లనీదు
సదనంబుజేరిన సత్తువనుండి
త్రుళ్లుచున్నావు దుష్టచిత్తుండ
సమరంబులోనిన్ను శత్రులుగ్రుమ్మ
నడిచెడుపదముల నారసాలేయ
చూచెడుకనులకు సూదులుగ్రుచ్చ
మీయయ్యలెల్లను మించినబలిమి
చేరివైరులతోడ శ్రీయుద్ధభూమి
ఉప్పొంగుచున్నావా రుర్వీశునెదుట
వారిలోగలయు నీవడికానవచ్చు
పోతిసింహమురీతి పొదలుచున్నావు
మదముపట్టినగిత్త మాడ్కిమేడపిని
ఉన్నవుకావర ముడిగెడుగాక
అనితూలనాడిన అధికరోషమున
కలుషించీనపోతు కనులెర్రచేసి
పట్టుజాలెనుబూని భామలనెల్ల
పరమసాహసమున పారంగదోలె
అప్పుడాఅనపోతు నమరంగజూచి
పలికెబాలుడునీతి పటిమచెలంగ
వనితలనదలింప వచ్చునామనకు
అందుచేపాతక మంటునుమనల
అనిచెప్పితరువాత ఆవైశ్యవనిత

కాదరమొప్పగ ననియెబాలుండు
"నొప్పికల్గుటచేత నోరాపలేక
అనరానిమాటల ఆడితిగాని
నీమీదపగచేత నేనేయలేదు
బాలులకాటలు పథ్యంబుగనుక
ఆడితిబొంగరం బదినిన్నుదాకె
దైవకృత్యంబని తలపకాడితిని
నిన్నింకనేమందు నీరజనేత్ర
అబలవునిన్నేమి యనవలదైన
నాతప్పుమన్నింపు నయభావమునను
కరుణింపు" మనుచును కాంతకావేళ
పచ్చవన్నెలపట్టు పటములేచించి
ఘన్మైనమందులే కాలగట్టించి
మాంపికొనుటకును మాదలేనూరు
ప్రియముననిప్పించి వెలదితోననియె
అమ్మమాతల్లి నీనైతమ్మమారు
మాయయ్యలెల్లరు మలసిదండెత్తి
పోయియేదిక్కున బూనియున్నారు
తలపోసిచెప్పవే తరుణిరోనేడు
నాపుడుకోమటి నారియిట్లనియె
కదలింపకుమునన్ను గన్నమాయయ్య
కాలికయిననొప్పి ఘనమాయెగనుక
కోపించిపలికితి గురుతెరుంగకయె
మీయయ్యచనిన సమిద్రంగమరయ
ఇలమీదనెచటనో యేనునెరుంగ
ఐతమ్మయెరుగు నన్నడుగకుమన్న
ఆటలజాలించి అనుజులుదాను

మేలైనవీథుల మేడపికేగి
వేగమె యిలుచొచ్చి వినయంబుతోడ
తల్లికిమ్రొక్కిరి తనయులందరును
మ్రొక్కినదీవించి మురియుచునున్న
తల్లితోబాలుండు తానిట్లుపలికె
వెలదిరోమేడపి వెలవెలబోయి
కళదప్పియున్నది కారణంబేమి
నయమొప్పనాయుడు నాయకులెల్ల
ఎక్కడికరగిరో యెరిగింపవమ్మ
అనుడునావాక్యంబు లతివకర్ణముల

ఘనతరలరముల గతినేచనులికి
తరిగినకదళికా స్తంభంబురీతి
గుండెలువరియలై కుంభినినొరగె
చంద్రమండలమందు సాంద్రంబుగాను
జలదంబుకప్పిన చందంబువెలయ
సలలితకుంతల జాలంబుచెదరి
కప్పినవదనంబు కనుపింపదాయె
కన్నులనీరాని కాటికచెదరె
గళబద్ధనవరత్న కాంచనయుక్త
హారజాలములెల్ల నటునిటుదొలగె
జమిలిముత్యపుచేర్లు చక్కనైయున్న
పాపిటబొట్టూడి ప్రక్కనబడియె
వేనలిదురిమిన విరులెల్లజారి
పడెనుభూస్థలిమీద బరచినయట్లు
కొంతసేపునకామె గొబ్బునలేచి
ఘనమైనదుఃఖంబు గ్రమ్మంగబలికె

చేసినధర్మముల్ చెడిపోయెనిపుడు
వరపుణ్యజాలంబు వరదనుగలసె
నాభాగ్యమునకెల్ల నాశంబుదోచె
ఇటువంటికార్యంబు నిచ్చలోదలచి
నాలుకెట్లాడెను నన్నడ్గనీకు
బాలుడానీకేమి భారంబువచ్చె
వినగననిటువంటి వెర్రినెక్కడను
కాలంబుననవలె గానినిన్నన్న
ఫలమేమియని చాలభయముబొంది
పుత్రుడువిడనాడి పోవకయుండు
బొంకుమాటలదల్లి పొరిపొరిననియె
తనయుడావినునీదు తండ్రులుమామ
లెల్లవిచారించి యేకభావమున
మలిదేవుమన్నన మట్టాయెగనుక
ఇచ్చొటువిడనాడి యేగిరివార
లేదిశబోయిరో యెరుగనుసుతుడ
అనినబాలుడు తల్లి కప్పుడిట్లనియె
ఎన్నడసత్యంబు లెరుగనినీవు

తగవటేనాతోడ దబ్బరలాడ
చెలగికార్యమపూడి శ్రీయుద్ధభూమి
మలిదేవసహితులై మాయయ్యలెల్ల
చలముననున్నారు సమరంబుసేయ
ఆవలశాత్రవచయ మతివిక్రమమున
మూకలైబ్రహ్మన్న మొదలైనవారి
గహనమున్ దావాగ్ని కాలిచినట్లు
దగ్ధంబుచేయగ దలచినవార
లీసమయంబున నేనేగకున్న
అపకీర్తిపాలౌదు హానియువచ్చు
తండ్రికష్టంబును దప్పింపలేని
పుత్రుడుండిననేమి పోయిననేమి
జనకుడెపుత్రుడై జనియించునంచు
గొల్లునవేదముల్ ఘోషించుచుండు
తల్లిరోకావున తనయునిబలిమి
తనబల్మియేయని తండ్రిదలంచు
పితకుపుత్రునికిట్లు భేదంబులేదు
కార్యమపురికేను గదలంగవలయు
కదలననీవల్ల గానున్నదేమి?
అనివిచారించుట అబ్బబ్బతగదు
తల్లిరోనాకసాధ్యంబిలలేదు
బ్రహ్మండములబట్టి బంతులాడుదును
మృత్యుదేవతనైన మెదిపివేసెదను
హరిహరుల్ మెచ్చగా అనిచేసిమించి
కామభూవిభునకు గలబలంబెల్ల
ఖండించివైచెద కలియుగమందు
వీరచరిత్రలు వెలయచేయుదును
తల్లిపంపుమునన్ను తడయంగనేల
చిత్తంబుచెడిపోవ చింతింపబోకు
మనినపుత్రునిమాట కైతమమ్మపలికె
తమకంబుకూడదు తాళుముతనయ
తెలిసివిచారించి తెలిపెదనీకు
ఉండుమీవనిచెప్పి యొయ్యననేగి

అత్తయౌశీలమ్మ అతిభక్తిజూచి
కరములు ముకుళించి కార్యమంతయును
వినిపింపచిత్తంబు వెరగునుబొంది
తలపోసిశీలమ్మ దైవఙ్ఞవితతి
పిలిపించి బాలునిపేరటలెస్స
గ్రహగణభావంబు గ్రహియించిపిదప
ఐతమ్మతోడుత ననియెనీరీతి
పటుపరాక్రముడైన బాలచంద్రుండు

పదునేనుదినముల పరిణామమొందు
చెప్పంగబడెనిట్లు సిద్ధంతమందు
ఎడలేకడలెద వింతిరోనీవు
నీవెంత అడలిన నిల్వడాతండు
కాలమెవ్వారికైన గడవగరాదు
బ్రహ్మవ్రాసినవ్రాలు వశమెతప్పింప
నీమాటకాతడు నిలువంగబోడు
కన్నకడుపుగాన కాంతరోనీవు
పడవల్సినపాట్లు పడవలెగాని
ఊరకయుండుట ఉచితంబుగాదు
శంబరాసురవైరి జాయహస్తమున
చెలువందనిల్చిన చిలుకకుసమము
మంచాలతద్రూప మహిమగన్గొన్న
చాలింపగలడమ్మ సకియనీసుతుడు
నావిని ఐతమ్మ నాతికిమ్రొక్కి
వీడనిచింతచే వెడలితావచ్చి
తనకుమారునిజూచి దయనిట్టులనియె

ఓయయ్యబాలుడా ఒప్పుగావినుము
పరరాజ్యసైన్యమ్ము పైకొనిరాగ
వాద్యసమూహంబు పడితోడమ్రోయ
ఘనకరీంద్రముల ఘీంకారరావంబు
సాంద్రతురంగ హేషావిజృంభణము
రథనేమిసంకుల ప్రభలశబ్ధంబు
లమితపదాతిచ యాట్టహాసంబు
భేరీడమాముల ఫెళ్ళనుమ్రోత
యేకమైమించిన నెట్లుతాళెదవు
విలుకాండ్రుచెలరేగి విచ్చలవిడిని
జడివానపట్టిన చందంబుతోప
దట్టమౌశరవర్ష ధారలుగురియ
తప్పించికొనలేవు ధైర్యంబుమీర
అలుగులవెలుగులు అవనిపైనిండ
కన్నులచీకటి గ్రమ్మగజేయు
బద్దెలఈటెలు పట్టుకతూరి
పైబడ్డధైర్యంబు బట్టగలేవు
కత్తులుజళిపింప గనుగొనినీవు
తాళెదవేరీతి తందరపడక
నీవేడరణమేడ నీబలమేడ
బాలులతోనాడు పగిదిగాదోయి
చెక్కులుమీతిన జిందునుపాలు
నుదురుమీటినగడు నూనెవెళ్లేడును
గండ్రతనంబుల గైకోకుతనయ
పిన్నవునీకిట్లు బిరుదులువలదు
ననువీడిపోవుట న్యాయంబుగాదు
నాపుడుబాలుండు నాతికిట్లనియె

భయమేలచెప్పెదు భామనాకిపుడు
పుత్రమోహంబున బొంకెదుకాని
యెరుగవేనాబల్మి యిందీవరాక్షి
నలగాముడెరుగును నాదుశౌర్యంబు
ప్రళయకాలమునాటి భైరవురీతి
సైంధవవధవేళ సాహసస్పూర్తి
విజయుడురణములో వెలసినకరణి
కౌరవసేనలో గదబట్టితూరి
వడిముడియనిలోన వ్రలినవిధము
వాయుపుత్రుడు లంకవడితోడ జొచ్చి
భస్మంబుగాగాల్చి ప్రబలినభంగి
రాక్షసరణములో రామచంద్రుండు
వీరపరాక్రమ విధిజెందినట్లు
జలధిమధ్యంబున చరియించినట్టి
మందరమనియెడి క్ష్మాధరమ్మట్లు
ఫాలాక్షుడతిరౌద్ర పటిమమీరంగ
త్రిపురంబులను సంహరించిన గరిమ
కాలాగ్నిలోకముల్ గాల్చినపోల్కి
స్థావరజంగమజగతినుద్ధతిని
ప్రళయంబుముంపగ పరగినరీతి
కామభూపతిసేన గడగడవణక
విక్రమక్రమశక్తి విడివడజొచ్చి
పృథ్విపైపీనుగు పెంతలుగాగ
విహరింతుమదిలోన వేడుకకొలది
ఊర్వీశుదళముల కురుమనిపిడుగ
గర్వించుపగవారి కంటిలోనెరస
ఎదురెవ్వరేనాకు నీభువిలోన
నలగాముబలముల నలినలిచేసి
పండంగతరిగిన వడుపుననరికి
నెత్తురుమడుగులు నిండనొనర్తు
దహనునికడ్డంబె దట్టమౌవనము
బడబాగ్నినార్చునే పాదోథిజలము
భయదంపుపులికిని పశుగణంబెదురె
జింకలకదుపులు సింహముకీడె
బాలుడననినన్ను భావింపవలదు
చిన్నమిరియమందు చెడునెకారంబు
నావిని సుతునకు నాతియిట్లనియె

వినవయ్యబాలుడ వీరశేఖరుడ
కన్నకడుపుగానఁ గాంక్షమిక్కుటము
పుత్రమోహమువంతి మోహంబులేదు
దశరథప్రముఖ భూతలనాథవరులు
పడిరిపుత్రులకయి పదరానిపాట్లు
పుత్రులులేనట్టి పురుషభాగ్యంబు
విపినంబులోఁగాయు వెన్నెలరీతి
కొడుకులులేనట్టి కోమలిబ్రతుకు
పూచికాయనియట్టి భూజంబువిధము
పునంజామనరకంబు పొందకుండంగ
తల్లితండ్రులఁగావ తనయుఁడెకర్త
బాలుడాననునీవు పాయుదువేని
నిముషకాలంబైన నిల్వంగనోప
సంతానమేలేక చాలకష్టించి
అవనిలోగల నోములన్నియునోచి
తరచుగాజేసితి దానధర్మములు
తాంబూలములను సభక్తిదక్షిణల
కూర్చిచూరవిడిచి కుమ్మరామముల
ఆడెడుగానుగ లనికొల్లపెట్టి
పెండ్లిండ్లుచేసితి పేదవిప్రులకు
పాడైనదైవత భవనంబులందు
పూజాదికంబుల పొందించి భక్తి
ఆమడామడమీద అన్నసత్రముల
వెలయంగజేసితి విస్తారమైన
వనములోపల చలిపందిళ్ళనుంచి
శ్రీగిరికేగెడు శివభక్తతతికి
చెలగైచ్చితిరాగి చేనిర్మితముల
ఘనకమండలువులు కప్పెరచయము
శ్రీభ్రమరాంబకు శ్రీశైలపతికి
రజితకాంచనముల రంజిల్లునట్టి
కూష్మాండఫలముల గూర్చిదక్షిణలు
కానుకలిచ్చితి కడుభక్తితోడ
గౌరిమహేశ్వర ఘననామశిఖరి
ఎక్కియునోమితి నేలేశ్వరంబు
దిగివచ్చినోచితి తిలపర్వతమున
మొగివిష్ణుకాంత నోమును సలిపితిని
తగనొనర్చితిని సంధ్యావర్తినోము
అలయకనోమితి ఆజగజ్జ్యోతి
ఏగురువనితలనింపుగగూర్చి
యేకబాణమునోము నెలమినోచితిని
పదుగురువనితల బాగుగాగూర్చి
పచ్చవిల్తినినోము పట్టినోమితిని
నందికిపులగంబు నయతనిచ్చితిని
శ్రీశైలపథమున చెలువంబుమీర
అశ్వత్థపఙ్ఞ్తుల అభివృద్ధిచేసి
రజతకాంచనమయ రమ్యతంతువుల
అశ్వత్థతరువుల కలరజుట్టించి
పెంటిపోతులకును పెండ్లిచేసితిని
చీకటింటనునోము చేసితిభక్తి
నియతికేదారేశు నిల్పినోమితిని
గొనకొనికనుగొన్న గుంటికినెల్ల
చేయెత్తిమ్రొక్కితి చెప్పనేసిగ్గు
కరమెత్తిమ్రొక్కితి కాట్రేనికేను
పలునోములీరితి భక్తొతోజేయ
ఏదేవుడైనను ఇచ్చలోమెచ్చి
వరమీయడాయెనా వ్రాతకేమందు
అనిచింతచేయుచు అసురుసురంచు
దైవంబుదూరుచు దలకెడువేళ

వింటినివచనంబు వినువీథియందు
గజనిమ్మనోమిన గలుగుసంతాన
మనువాక్యమునకప్పు డానందమొంది
పెద్దలౌవిప్రుల పిల్వగబంపి
ముకుళితహస్తనై మ్రొక్కిఆమీద
వారితోజెప్పితి వాక్యలక్షణము
వినివారుసంతోష విశ్రాంతమతిని
వ్రతకల్పములనెల్ల వడివిచారించి
శోధించిచెప్పిరి శుభముహూర్తమున
శాస్త్రమందున్నది చానఈవ్రతము
సంవత్సరమునిండ సల్పగావలయు
ఇదివిష్ణుదేవును కింపైనవ్రతము
శాస్త్రోక్తదినమున స్నానకృత్యమును
వాక్రుచ్చుచున్నది వ్రతవిధానమ్ము
చంద్రభాగానది సదృశశైవలిని
కలుగదుపలునాటి గడ్డయందెల్ల
కృష్ణకుసమమిది కీర్తనీయంబ
ఎదమభాగమ్మున నెనయుచెన్నునికి
దాపుగాబారు ఉత్తరముఖంబుగను
స్నానమానదిజేసి సరిగంచుపట్టు
కోకలుధరియించి కుంకుమపసుపు
తాల్చినగంధంబును తనువునబూసి
సంతోషమునబోయి స్వామియైనట్టి
చెన్నకేశవునకు జేసిజోహారు
దీపనైవేద్యముల్ తీరుగానిచ్చి
వైకుంఠశృంగార వనములోపలను
చెన్నారుఆనిమ్మ చెట్టునకేగి
చుట్టులెస్సగజేసి శుద్ధిచేయించి
అలికించిముగ్గుల అచటబెట్టించి
వనదేవతను భక్తి వర్ణనచేసి
నయముగఆవాహ నంబుగావించి
పలకలబావిలోపల నీరుముంచి
పాదులోపల గడుభక్తితోబోసి
సకలప్రకారోపచారముల్ చేసి
భూసురులందరు భుజియించుకొరకు
తగినవస్తువులిచ్చి తప్పకయుండ
ఫలములఆహార పటిమతగ్గించి
పరమేశుచెన్నుని భావించికొనుచు
ఎదపకదినముల నీలాగుజరుప
కొన్నాళ్ళకానిమ్మ కొమ్మలిగిర్చి
ఫలతతుల్గన్పించి పరిపక్వమౌను
వర్షాంతమందనివార్యంపుభక్తి
చెట్టుఫలంబుల చెన్నునికిమ్ము
సంతానమబ్బును సంశయపడకు
మనుచుభూసురులెల్ల ఆడిరిగనుక
సంవత్సరమునిండ సల్పితివ్రతము
కడపటిదినమున కడుమోదమునను
పూజాదికంబుల పొందుగాతీర్చి
విప్రభార్యలనెల్ల బిల్వంగబంచి
సకలోపచారముల్ సమ్మతిజేసి
చెట్టుఫలములను జిదిమిదెప్పించి
పసిడితోజేసిన పళ్ళెరంబందు
పోయించిభయభక్తి పూర్వంబుగాను
చేతులబట్టుక చెన్నునికడకు
వెడలితిచెల్లెండ్రు వేడుకతోడ
కానుకల్ మొదలగు కలవస్తువులను
కొనివెంటజనుదేర కూరిమిమీర
సర్వవాద్యంబులు సాంద్రతమ్రోయ
వారకాంతలునాట్య వశతచేజనగ
బహువిధగీతముల్ పాఠకుల్ చదువ
వివిధవిద్యలవారు వెన్వెంటరాగ
చనిజమ్మివృక్షంపు సవ్యభాగమున
చెన్నునికెదుటను చిత్తముప్పొంగ
నిలిచితిమపుడేము నిశ్చలమతిని
పూజారివార లప్పుడుచనుదెంచి
తలుపులుతెరచిరి తాళముల్ దీసి
చిత్తజుజనకుని చెన్నునిరూపు
కన్నులపండువు గాగజూచితిమి
ఫలములుంచినజాలవల్లికస్వామి
కర్పించిశరణంబు నందెదమనుచు
చనువేళచెన్నుడు సత్కృపమాని
పడమటిముఖమాయె భావమెట్టిదొకొ
తపియించెచిత్తమ్ము తత్సమయమున
సంచెలించెనుగుండె ఝల్లునగదలె
గద్గదస్వరములు గళములగలిగె
తడడాటునడలకు దార్కొనెమేన
చెమటలుజారగ చీకట్లుగ్రమ్మె
పరవశంబున మహిబడితిమావేళ
తెలివొందియంతలో ధీరతనిల్పి
పటుతరరౌద్రంబు భావమందలర
పలికినిబ్భంగి భయమింతలేక
అదియేమిస్వామి మాఅపరాధమేమి
తల్లియు దండ్రియు దైవంబు గురువు
నీవకాకితరంబు నెరుగమెవ్వారి
ఇహపరంబులకెల్ల ఇంటిదేవతవు
తనువులుప్రాణముల్ ధనధాన్యవితతి
పశుపుత్రమిత్రులు పరిజనంబంత
నీకధీనులు మేము నీసేవజేయు
వారముమాకెల్ల ప్రభుడవునీవు
మరవవుదాసుల మదిలోననెపుడు
నీవాడననుచును నిశ్చలబుద్ధి
శరణన్నమాత్రాన సంరక్షచేయు
వ్రతమునాకంచును రామరుపమున
ఆనతియిచ్చితి వఖిలమువినగ
సకలధర్మంబుల సరవిత్యజించి
నన్నొక్కనినె శరణంబందితేని
సర్వపాపంబుల సమయజేయుదును
వగవకుమదిలోన వలదుభయంబు
సత్యమీమాటని సవ్యసాచికిని
దయతోడ కృష్ణావతారంబునందు
పలికినాడవుగాన భక్తితోనీవె
శరణనియంటిమి చానలమేము
పడతులుమొరపెట్టపాలనగలదు
వనితలరక్షించు వాడవునీవు
గౌతమభామిని కాంచెపూతతను
శ్రీమించునీపాద రేణువుచేత
కరుణచేకుబ్జకు కాంక్షదీర్చితివి
వల్లవీజనముల వాంచదీర్చితివి
ద్రౌపదిమానము దక్కజేసితివి
కాచితివుత్తర కడుప్రేమతోడ
పూనికాంత్యలనిట్లు పోషించినావు
ప్రాణులపోషింప భారంబునీది
మిక్కిలిదయగద్దు మొలతలయందు
యిట్లునీమది యినుమాయెనేమి
కటకటానీకింత కాఠిన్యమేల
నీశరణంబులె నెరనమ్మినాము
తిరిగిచూడవుమాకు దిక్కెవరయ్య
కరుగదునీమది కాసంతయైన
ఈజీవనంబేల ఈదేహమేల
నీకైనప్రాణముల్ నీకేర్పింతు
మబలలమనియెంచ అర్హంబుగాదు
నెత్తురునీమీద నిండజల్లెదము
చూడుమాసాహస స్ఫూర్తులననుచు
ఆగకరోషసమావేశమొసగ
ఒరలమట్టుకుకత్తు లురవడిదూసి
వక్షఃస్థలంబుల వదలకయుంచ
మారుముఖంబాయె మగిడిచెన్నుండు
ఫలములపళ్ళేంబు స్వామిసన్నిధిని
ఉత్సాహముననుంఛి ఒయ్యనమ్రొక్కి
చేతులుదట్టించి శిరములువంచి
కమలామనోహర గజరాజవరద
కాంచనాచలధీర కందర్పజనక
పక్షీంద్రవాహన పన్నగశయన
శశిరవిలోచన జలజాతనాభ
పరమదయాకర పాపవిదూర
కామితమందార ఘననీలవర్ణ
మాకాంక్షలీడేర్పు మాచర్లచెన్న
అనిసన్నుతులుచేసి అబలలమెల్ల
కనుచూపుపదముల గట్టిగానిలిపి
నియమంబుతోడుత నిల్చినవేళ
అర్చించువైష్ణవు నంతరమందు
ఆవేశమైపల్కె అందరువినగ
కోపింపమీమీద కూరిమిగలదు
మనసులనిల్కడ మర్మంబుదెలియ
అరయంగదలచి నేనటుమళ్ళినాడ
భక్తికిమెచ్చితి భయమందగూడ
దనిపల్కునంతలో అధికవేగమున
పళ్ళెంబులోపలి ఫలమొక్కటెగిరి
వచ్చినాచేతుల వ్రాలినచిత్త
ముప్పొంగిజోహారు లొయ్యనజేసి
గుడినుండివెల్వడి కోర్కెలుమీర
విజనమౌదెసకేగి విప్రభామినికి
ఫలమిచ్చిమాకెల్ల పంచియిమ్మన్న
ఎనిమిదిఖందంబు లేర్పడజేసి
ఆర్వురుకాంతల కారుఖండములు
మేరతోడుతనిచ్చి నాతితానొకటి
పుచ్చుకొన్నప్పుడు పొలతితోనంటి
బ్రఆహ్మణకులమున ప్రభవించినావు
సర్వజనముమీకు సాటిరాదగదు
పొలతినీవుముందర భుజియింపవమ్మ
అటుమీదమేమెల్ల ఆరగించెదము
నావినిబ్రాహ్మణ నారియారీతి
చేసినతర్వాత చెలగిమేమంత
ఫలఖండములగొని భక్షణచేసి
కరముఖపాదముల్ కడిగిఆమీద
పోయిస్వామికిప్రొక్క పూజారివచ్చి
పొలుపొందతీర్ఠమ్ము మొదలైనవిచ్చి
చెలువైనపదపీఠి శిరములబెట్ట
వెనుకకునడచుచు వేడుకతోడ
మామాగృహములకు మరలినయప్డు
గర్భంబులాయెను కంటినినిన్ను
చాలకష్టముమీద జనియించినావు
ననుబాసిపోవుట న్యాయమానీకు

ఎలమితోబొక్కనా డెదుటలేకున్న
ప్రాణంలేభంగి పట్టంగగలను
చనియెనుమీతండ్రి సమరంబొనర్ప
తోడునీవుండిన దుఖఃంబులేదు
పోషింతువీవని బుద్ధినమ్మితిని
పడ్డకష్టంబెల్ల పరులపాలాయె
సంతానహీననై చాలదినములు
బహుళదుఖఃంబుల పాలైతి కొడుక
స్వామికరుణచేత జనియించినాడ
వానాటనుండియు అడగెఖేదంబు
వేములుపూసెను వేములుకాసె
కడసారిఫలములు కాకులకాయె
మనుజరక్షనలేని మల్లెపూదోట
వడిచూరపోయిన వడుపయ్యెదండ్రి
జలముడ్కు పెనముపై చల్లిన భంగి
కప్పినకుంపటి గాల్చినరీతి
అణిగినవగపెల్ల అధికమైపొరలె
నీదనిధానంబు నిలిచికన్నట్లు
వద్లలోవజ్రంబు వడిగన్నమాడ్కి
గుడిజొచ్చిదేవు గన్గొనినవిధంబు
కంతినిపుత్రుడ కాంక్షతోనిన్ను
తాడెక్కుపురుషుని తల్లికీట్లె
గడమీదనాడు కర్కశుతల్లికిని
శూరునితల్లికి సుఖమేమిలేదు
పందలపుట్టిన బ్రతుకంగగలరు
ముందరనీవున్న మురిపెంబుమీరు
దూరాననిల్చిన దొదరునుజాలి
కుంతాలవారికి గురుదేవకృపను
సంతతికలిగెను చక్కంగనంచు
సకలభూములజనుల్ సంతోషపడిరి
తప్పజూచెనుగదా దైవమీవేళ
బవరంబునకునేగ పైనమైనావు
వీరమాతలకును వీరభార్యలకు
విషమిచ్చియేగుట విహితంబునీకు
తరువాతమీతండ్రి దగ్గరకరుగు
మనియిట్లువగచెడ్య్ ఐతమ్మజూచి
బాలుదీగతి బల్కెపటుశౌర్యమలర
అమ్మరోయిబ్భంగి అదలగనేల

కార్యమపురమందు ఘనపరాక్రమత
తండ్రులునిల్చుండి దండుచేయంగ
నేనింటనుండుట నీతియేతల్లి?
ఉండుమంతకునీకు ఒప్పునామనసు?
నీవెరుంగని ధర్మ మేనెరుగుదునె
ప్రాక్ర్తభామల పగిదిపల్కెదవు
వెర్రితనంబేల వీరమానినికి
కాయమనిత్యంబు కల్మిహుళక్కి
జలబుద్భుదవిధంబు క్షణభంగురములు
షట్చక్రవర్తులు సకలభూపతులు
చనిరిబ్రహ్మేంద్రాది సర్వదేవతలు
భూతంబులైదును పొలియుచునుండు
శౌర్యసత్కీర్తులు సమయవెన్నటికి
సకలపురాణముల్ సద్ధర్మకథలు
నీతిశాస్త్రంబులు నీవెరుంగుదువు
పౌరుషాధికతచే బ్రతుకుటలెస్స
జననమరణములు జనులకునిక్క
మాలయంబుననున్న అడవిలోనున్న
తప్పకతార్కొను తధ్యంబుగాను
పుణ్యలోకంబును బొందుమార్గముల
వినిపింతునెతల్లి విశదం<బుగాను
సజ్జనసంగతి సంసారమెడల
గురువుభోదించిన గురిమీదమనసు
నిలిపిమరణమొందు నిశ్చలుండొకడు
ప్రాజ్యసామ్రాజ్య సంరక్షణమందు
ఘనరణమ్మునరొమ్ము గాయాలనొంద
మనసుచలింపక మరణంబునొందు
శౌర్యపరాక్రమ సంపన్నుడొకడు
వీరులిద్దరిలెస్స వినువీథికేఁగి
ఆదిత్యమండలం బరుదారచించి
పోయిపుణ్యంబుల భూమిజెందుదురు
మొదటికార్యముబూను ముఖ్యతలేదు
శౌర్యంబుచేమాకు సంపాద్యమగును
వినిపింతు నికనొక్కవిహిత ధర్మంబు

చిత్తంబునిల్పియు చెవియొగ్గివినుము
ప్రప్రథమంబున బ్రహ్మనిర్మించె
వరవిప్రరాజన్య వైశ్యశూద్రలను
వేదవిద్యలయందు విప్రులనుంచె
రణకార్యముల యందురాజులనుంచె
క్రయవిక్రయాది కార్యంబులయందు
వైశ్యులనియముంచి పశులగా జేసె
చర్చింపనీమూడు జాతులవారి
శుశ్రూషవులజేసె శూద్రులనెల్ల
సరవినాలవజాతి జననంబుమాకు
వెలమలమైతిమి వీరజీవనత
విప్రులసేవింప విఙ్ఞానమొదవు
క్ష్తియసెవచే శౌర్యంబుగలుగు
కడువేశ్యసెవచే గలుగు సంపత్తి
మేమురాజులగొల్చి మెరయుచుండుదుము
విక్రమక్రమరూఢి వెలయుటజేసి
తమసరిగా మమ్ముదయచేయుచుంద్రు
శస్త్రధారులకెల్ల సమరంబు కూడు
శౌర్యంబుచాలించి సకలధర్మములు
చేసినసత్కీర్తి చెందదుమాకు
మనువుబోధించిన మార్గమేయిదియు
పరమాత్మకృష్ణుండు బంఢనభూమి
సవ్యసాచికిదెల్పె సకలధర్మముల
అటుమీదజేయించె అధికరణంబు
జనులకుకష్టంబు సమకూరునపుడు
శ్రీవీరవీర్యంబు చెదరంగచేయు
దేశంబు పరనృపాధీనమౌనపుడు
శ్రీవీరసత్వంబు చిక్కంగబట్టు
సామ్రాజ్యతరువెండి చచ్చెడునపుడు
శ్రీవీరరక్తంబు చిగిరింపజేయు
రాజసేవకులకు రణమేసుఖంబు
ఇదిగాకయింకొక్క హేతువువినుమి
అలరాజుకాముచే హతుడైనవెనుక
కొమ్మభూమీశుండు కోపించినపుడు
అనఘుడునాతండ్రి నాచేయ్యిబట్టి
కొనిపోయిఒప్పించె కొమ్మభూపతికి
తీర్చునుమనపగ ధీరుడితండె
యిల్లడచేసితినే బాలచంద్రు
అనిపల్కెనోయమ్మ అరమరలేక
ఆనాటనుండియు ఆఒప్పగింత
నాటియున్నదిసువ్వె నామదియందు
ఆహారనిఫ్రల కరుగదుమనసు
కార్యమీవేళను గదిసెనుపూని
ప్రాణమైననునిత్తు పగయైనదీర్తు
తప్పితేవారికి దాసుండనగుదు
మనసొప్పదిందుకు మముగన్నతల్లి
అరలేకచెప్పితి అంతరంగంబు
బిరుదుశూరుడగాని పిన్ననుగాను
మగువలుండెడు నట్టిమందిరంబందు
ఉండుటశూరుల కుచితకార్యంబె
యెక్కువపల్కకయిక నూరకుండు
జననమరణములు చాలుపుమనకు
పుట్టుపుట్టువునకు పుత్రులునీకు
జన్మజన్మంబున జననులునాకు
కలుగుచుండుదు రిదికమలజునియతి
దుఃఖింపబనిలేదు తోయజగంధి
భయమందకీలాగు బాలుడుపలుక

ఐతమ్మకొడుకుతో అనియెనీరీతి
సమరంబునకునేగు శౌర్యవంతులకు
తల్లిదీవెనబొంది తగభార్యచేత
దీవనగొనిపోవ తేజంబుసుమ్ము
నడిచిరిపెద్దలీ నయమార్గమునను
మనసుంచినామాట మన్నింపుసుతుడ
అనవిని ఐతమ్మకనియె బాలుండు
తల్లినీదీవెన తరుగదుమాకు
కులకాంతదీవెన కొనుటయేలాగు
నాగుర్తెరుంగదు నాతిమాంచాల
యేనాపెపోలిక యెట్టిదోయెరుగ
మన ఇల్లెరుంగదు మగువమాంచాల
చానయింటికినేను చనుటయేలేదు
నీమాటవినకున్న నీతికాదనుచు
వేగంబుపోయిన ప్రియురాలుకినిసి
తప్పులెన్నును చిన్నతనమగునాకు
సాహసముల్ మూర్ఖలు సకియలెల్లెడల
మాటమంచిదిగాని మనసుకత్తెరయె
పూర్వజన్మఫలంబు పొందికబట్టి
ఆలుమగలజెసె అజుడుమమ్ములను
నాభాగ్యమేమియు నాతియెరుంగ
దింతికిదుఃఖంబు హెచ్చుగనుండె
అపరాధమధికంబె అమ్మనాయందు
ఈసమయంబున నేనేగరాదు
నాతులభావముల్ నమ్మగలేను
నావినిసుతునకు నాతియిట్లనియె

అతజనివృత్తాంత మారసివత్తు
ఇచటనేయుండు మెచటికిబోక
అనుచునేరాండ్రు తానందలాలెక్కి
గండువారింటికి గ్రక్కునజనిరి
ముత్యాలలఘువమ్మ ముందరనేగె
ఘనయైనపేర్నేని గౌరమ్మయరిగె
దంటగావెన్వెంట దాదులువెడలి
రైతమ్మయీరీతి ఆనందగరిమ
వచ్చుటగ్రహియించి వారనిప్రీతి
చెలువందరేఖాంబ చెల్లెండ్రనెల్ల
వివరించిపిలచెను వేడుకతోడ
వెలమనాయునిభీమ వేగమేరమ్ము
మలినేనియాచమ మముజేరరమ్ము
పినమలినాయుని ప్రియురాలవైన
చందమ్మయిచటికి చయ్యనరమ్ము
గోపినాయునికూర్మి కులకాంతలక్ష్మి
ననుజేరరావమ్మ నాతియటంచు
పిలచినవచ్చిరి ప్రియమొసలార
వారునూ దానునూ వాంచలుమీర
ఐతమ్మకెదురుగ అరిగికొంపోయి
కనకపీఠంబుల గరిమతోఉంచ
అప్పుడూమేడపై అలరుచునున్న
మాంచాలదిగివచ్చి మర్యాదయొసగ
అత్తకకెల్లదానమరంగమ్రొక్కి
కస్తూరిపునుగును గలిపినయట్టి
చందనమ్మునలందె సకియలకపుడు
చేకట్లుకడియముల్ చెలువుగనిచ్చె
మరియును మాణిక్యమయమైన భూష
లందరికినొసంగి హర్షమొందింప
కోమలులందరు కూర్చున్నవేళ
వదినయౌ ఐతమ్మవదనంబుచూచి
వినయంబుతోడుత వెలదిరేఖాంబ
అక్కలుచెల్లెండ్రు అత్యంతకరుణ
ఆందోళికారూఢలగుచుమీరెల్ల
మముజూడవచ్చుట మాభాగ్యమరయ
మీరువచ్చినపని మీకోడలైన
మరునుపట్టపుదంతి మాంచాలయెరుగు
తక్కినవారికి తరముకాదనెను
తనతల్లిమాటకు తనయమాంచాల
నవ్వుచువాక్రుచ్చెనయభావమునను
మాఅత్తతనకొడ్కు మగటిమిచెలగ
ఆజిరంగంబున కరిగెదనన్న
ఆలుదీవెనగొని అరుగుమాయనెను
మెగముచెల్లమిరాక మెగిదలవంచె
పిలిపింపుమనివచ్చె వేగనాకడకు
బ్రహ్మగూర్చెనుమమ్ము బాల్యంబునందు
సమరానఆతడు సమసినవెనుక
వెంతనేగదాత్త విడువుమీమాట
పంపుము పుత్రుని బవరంబుచేయ
అనినభీతిల్లుచు ఐతాంబపలికె
పరమపాతివ్రత్య పావనమూర్తి
పతిభక్తిగల్గిన పద్మాయతాక్షి
నేనువచ్చినకార్య మీవెరింగియును
ఇబ్భంగిబల్కుట యేటిక్రమంబు?
పతినెడబాయుట భావ్యంబెనీకు
నేరంబులతనివి నిలుపకుమదిని
రట్టుచేసితివేని రాడువాడిటకు
నిన్నువీక్షించిన నిలువంగనోపు
అనియిట్లుపలికిన అత్తకుమ్రొక్కి
వాక్రుచ్చెమాంచాల ప్రొఢభావమున
ఇసుమంతనాసౌఖ్య మెరుగడునీదు
తనయుడో అత్తరోదైవంబుకెరుక
పాపపుమాటలు పలుకంగవలదు
వెలయుభుజించుట వేశ్యగేహమున
విడియంబుచేయుట వెలయాలియింట
సౌఖ్యంబుపొందుట సానిధామమున
నానోముఫలమేమొ నలినజునియతి
చేసినన్ విడిపింప చేసెనానాతి
భోగంబునొందెడు పొలతులువారు
చావనోచినయట్టి సకియనునేను
సరిచేసియీమాట సభనెన్నరాదు
నీపుత్రునడవడి నీచిత్తమెరుగు
నీవుకర్త్రివిమాకి నేమివాక్రుత్తు
ఆడవలయుమాట లాడితిగాని
నీబుద్ధికెన్నడు నేవెలిగాను
తెరవరోమదిని సందియమునువదిలి
పంపుముబాలుని పగతీర్చుటకును
పోయెడుపయనంపు బుద్ధిమాంపింతు
ఏడేండ్లనుండితా నేమారనట్టి
వేశ్యపైమోహంబు విడువనొనర్తు
నీయానసిద్ధంబు నేకల్లలాడ
అనిపల్కుకోడలి నాలింగనంబు
చేసిపుత్తడికమ్మి చీరలురత్న
కాంచనమయమైన ఘనభూషనములు
పెట్టికోడలికప్డు ప్రియమేపుమీర
కొల్వులోపలినుండి గొబ్బునలేచి
వియ్యపురాలిని వెసకౌగిలించి
కోర్కెతోశీలాంబ కోడండ్రుతిరిగి
అందలంబులనెక్కి అతులమోదమున
తమతమయిండ్లకు దారేగిరప్పు
డైతాంబసుతుజూచి అనియెనీరీతి
రావయ్యబాలుడ రాజులదిగుల
గండువారింతికి కదలంగవచ్చు
ఆలిచేదీవెన నందంగవచ్చు
అనిచెప్పిపుత్రుని కధికధనంబు
మాదలుచిరలు మణిభూషణములు
సురభియైనట్టి కస్తూరిచందనము
బాగాలుచక్కని పక్వపర్ణములు
తగువారిచేనంపె తనయునివెంత
బ్రాహ్మణజనులకు భట్రాజులకును
ఆటపాటలవారి కఖిలార్ఠితతికి
దాసజనాళికి దాదులకెల్ల
దానంబొనర్పుము తగినమార్గమున
అత్తలుమొదలుగ అంగనాతతికి
వినయంబుతోనిమ్ము వేర్వేరసొమ్ము
రాజుకుమంత్రియై రంజిల్లుచున్న
బ్రహ్మన్నసుతుడవు పటుదాతవరయ
అర్థంబుగలవారి కల్లుడవీవు
కీర్తిసంగ్రహబుద్ధి కీలింపుమదిని
అనిచెప్పిచనుమన అధికసాహసుడు
పొమ్మన్నమాటకు పూనెహర్షంబు
వృద్ధశీలాంబకు వేడ్కతోమ్రొక్కి
ఐతాంబమొదలైన అమ్మలనెల్ల
తిన్నగాసేవించి దీవెనవడసి
యెలమినితమ్ముల నిరుదెసగొలువ
బ్రాహ్మణుల్ దీవింప భట్టులుపొగడ
ఆటపాటలవార రాడుచురాగ
సానిగేహమునకు చయ్యననెగి
వాకిటముందర బాలుండునిలచె
శ్యామాంగియప్పుడు సకియనుజూచి
బడలియున్నదటంచు పలుకుముపోయి

అనగనాసకియ బయటకినేతెంచి
తలనొప్పిచేజిక్కి తమమొక్కనేడు
పానుపైబొరలుచు భాదనొందుచును
ఉన్నదియంచును ఒయ్యనజెప్ప
బాలచంద్రుడువిని పలికెనీరీతి
గరిమకార్యమపూడి కలనికినేను
పోవుచుధనమిచ్చి పోవలెనంచు
వచ్చితినింతలో వనితగర్వించి
ప్రేమమైసిరిరాక పెడచేతద్రోసె
భామకిప్పట్టున భాగ్యంబులేదు
దైవమీయడుసొమ్ము తరుణికీవేళ
అనవినిచనిఆపె ఆవార్తచెప్ప
శ్యామాంగితత్తరమంది తాలేచి
త్వరగనాయతమాయె బాలునిబిల్వ
కస్తురిజవ్వాది కలిపినయట్టి
మలయజమోపిక మైనిండనలది
చెలగుచుజాళువా చీరధరించి
రాజిల్లుహోంబట్టు రవికనుదొడిగి
కుంతలంబులదువ్వి కొప్పునుబెట్టి
అలరుచునవరత్నహారచయంబు
వక్షోజయుగళంబుపై చిందులాడ
గళమునదాలిచి కరములయందు
హేమకంకణములు హెచ్చుగామెరయ
చక్కనిముత్యాల జల్లులునమర
సఔందర్యఖనియైన శ్యామాంగియపుడు
వివిధచిత్రంబుల వెలయుచునున్న
సౌధంబుపైకెక్కి స్వప్రతిబింబ
మద్దంబులోజూచి అటునిటుదిద్ది
అంతటదిగివచ్చి హర్షముప్పొంగ
వీరులందరికిని విడియముల్ గొనుచు
కడువేడ్క బాలుని గానగబోయి
పన్నీరుదెప్పించి పదములగడగి
యెనమండ్రకప్పుడ యిచ్చివిడ్యములు
వెలదిబాలునిరెట్ట విడువకపట్టి
మేడపైకెక్కించె మెలతసౌందర్య
మహిమచూచిరణంబు మరచెబాలుండు
ద్వారసమీపాన తమ్ములందరును
కనిపెట్టియుండిరి కడుభక్తిమీర
బాలుడుపవళించె పట్టెమంచమున

చెలియప్రేమపరీక్షచేయుటకొరకు
తలవాంచియుండెను దరుణినంటకయె
బాలునిభావంబు పల్లటిల్లుటను
తెలిసిఆశ్యాంఆంగి తిన్నగననియె
నినుబాసిదినములు నేటికైదాయె
ఐదేండ్లవలెదోచె అక్కటనేను
నీకుసంతసమిచ్చు నెలతనుగాను
కరుణనాపైదప్పె కాంతుడనీకు
దయతప్పినప్పుడెంతగ వచించినను
నీమదికెక్కదు నేనేమొనర్తు
నామనంబెరుగును నావికారంబు
విరహతాపముదొట్టి వేసటపుట్టి
పదియవస్థలుమేన ప్రాప్తించిమించ
బహువేదనలబడి పారంబులేక
ఉసురసురంచును నుడుగనిజాలి
భావంబులోనుండి భయమునుబొంది
తనువుకంపింపగ తగుమాటమరచి
యెప్పుడునీరూపు నేజూతునంచు
వాక్యంబుపలికిన వగరుపుపుట్టు
నిట్టూర్పువిడుచుచు నిన్నెచింతించి
పొరిసిగ్గువిడిచియు భుజియింపమాని
తపియింపదేహంబు తరచైనకాక
తడబడనాలుక తల్లడంబంది
జీవంబుదొలగంగ చింతయొనర్చి
పరవశంబుననుంటి పానుపుమీద
తలనొప్పిఘనమాయె తాపంబుహెచ్చె
నీవువచ్చుటజేసి నీమాటవింటి
అడగెనుతలనొప్పి ఆనిమేషమున
ఎంతగనీమీద నేమోహపడిన
నీమదిదయలేదు నేనేమిచేయ
అనితలవాలిచి శ్యామాంగియపుడు
కన్నీటిబిందువుల్ గ్రక్కునజారి
వక్షస్థలంబున వరదలైపార
విహ్వలభావయై విలపింపదొడగె
బాలుడుముందరి పాటెరుంగకయ
వట్టిదుఃఖంబని భావింపలేక
కామాంధకారంబు కన్నులదట్టి
శ్యామంగినతిప్రేమ అక్కునజేర్చి
కాటుకచెదరంగ కన్నీరుతుడిచి
చెదరినకురులను చిక్కులుదీసి
సీమంతమొగిదీర్చి చేర్చుక్కనిలుపి
కౌగిటబిగియించి కాంచనరత్న
హారంబులెదమీద నమరికచేసి
కెరలిమోహమున చెక్కిళ్ళుముద్దాడి
యేనూరుమాడల నిచ్చెకామినికి
బాలునిగనుగొని పల్కెనాలేమ
పైనమైవచ్చిన భావంబుతోచె
తెలుపగావలెనాకు తిన్ననికరుణ
అనవిని వాక్రుచ్చె అపుడుబాలుండు
చెలగికార్యమపూడి శ్రీయుద్ధభూమి
వీరులగలయంగ వెసబోవుచుంటి
ప్రియురాలివని నిన్నుబిలువవచ్చితిని
పరువడినీవును పైనమైరమ్ము
జాగుచేయకుమన్న సకియతానవ్వి
బాలుడనీకేల పట్టెనువెర్రి
యెక్కడిమోహం బదెక్కడిపొందు
సరసుడవఔదువు సాటినీకెవ్వ
రీయెడనీబుద్ధి యెక్కడికేగె
కాని సొమ్మునకీవు కాంక్షచేసెదవు
జగములోనిటువంటి సమయంబుగలదే
అడవిలోగాసిన ఆమ్లఫలంబు
ఉదధిలోవనణంబు నొగిగూడినట్లు
జరిగెనీకునునాకు సంగతివినుము
సరిలేని ఇహసౌఖ్య సాధనాలేము
పరసౌఖ్యమునకు నీపడతిసాధనము

అనిపల్క విని బాలుడాగ్రహమొప్ప
సరవిముందరనున్న శ్యామాంగిజూచి
కుటిలాత్మురాల నీ గుణములుదెలిసె
మటుమాయచేజిక్కి మానముధనము
నీపాలుచేసితి నెగాననైతి
కామాంధకారంబు కష్టపువిద్య
నీతిమాలినచర్య నేటికిదెలిసె
ఇంటిలోభోజనం బిచ్చకురాక
పరులయెంగిలికాస పడితినిగాదె
అనిదూరికోపించి ఆమహామహుడు
కాలాగ్నిరుద్రుడై కనలుచులేచి
పోవగశ్యామాంగి పోనీకపట్టి
పకపకనవ్వుచు బాలునికనియె
నీబుద్ధిపేదది నినునమ్మరాదు
నీమదినిల్కడ నేగాంచగోరి

పలికితప్పుగ భావించనేల?
పురుషులనమ్మంగబోలదటంచు
మాతికిజెప్పిరి మాపెద్దలెల్ల
పర్ణాగ్రములయందు పట్టుకవ్రేలు
కలబింబుతతివలె చలనంబునొందు
మనసొకచందంబు మాటొకతీరు
స్వాధీనుడంగన పార్శ్వమందున్న
ఇల్లువెళ్ళినవాని నెవరుపట్టెదరు
క్రొత్తలపైలెస్స కూరిమినిలిపి
ప్రాతలవిడనాడు భావముంచుదురు
తమతప్పులేమియు తలుపరులోన
ఒకరితప్పులనెన్న నోడరుసుమ్ము
కరుణకుమూలంబు కాంతకోపంబు
సాహసంబొనరింత్రు శౌర్యసంపన్ను
లందుచేమనమున అలుగంగరాదు
మనలోనభేదంబు మానుటరీతి
నరికితేజలములు నడిమికిదెగవు
తరువును లతయును దంటగానుండ
చెట్టువినాశంబు చెందినయపుడు
తీగెకాధారంబు తిన్నగజెడును
తీగెనాశంబున చెడిపోదుచెట్టు
మనసున నీ భంగి మరువగవలదు
తగదీగెనేనౌదు తరువవునీవు
భూమిలోకాంతకు పురుషుడాదరువు
మాయక్కకంటెను మరివేగమునను
నీతోడవైకుంఠ నిలయంబుజూతు
అనినబాలుడుమెచ్చె అంగననపుడు
చయ్యన అగసాలచంద్రుని బిలిచి
వేయిమాదలనిమ్ము వెలదికిననిన
ఇచ్చెను గైకొనె ఇందీవరాక్షి
మాపెద్దలకునీవు మక్కువనోలి
యిప్పింపుమనిచెప్పి యింతిశీఘ్రముగ
దాసిచేబిలిపించె తమతల్లినపుడు

కోతివంటిది వృద్ధ గురుకొపయుక్త
కోలపట్టుకవచ్చె కూతురుకడకు
విరిగినరొండియు వ్రేలుచన్దోయి
ఉరిసిపోయిన ఒళ్ళు నూచలుకాళ్ళు
వంగిననడుమును వదలినపండ్లు
పీలచెతులుగూని పీనుగుమోము
చిక్కగనరిసిన చింపిరితలయు
వ్రాలినబొమముడి వదిలినమేను
మెడమీదకణతియు మూగాళ్ళపూత
పలుచనిగడ్డంబు పైనిపుల్పిరియు
మూతిమీసపుమొల్క ముక్కురోమములు
తలవడంకును మాట తబ్బిబ్బుమరపు
కంపుగొట్టుచు చొల్లుగారెడునోరు
కన్నులపుసులును కాంక్షమిక్కుటము
సొక్కుచునీల్గుచు సోలుచువచ్చి
చేవెలుంగునబాలు చెచ్చెరజూచి
ఒరుగుపోయిననోటి నొయ్యనదెరచి
పలికె కంపముమీర బాలునితోడ
దొరలజూచినయంత తొలగంగవలయు
వారితోపొందైన వడిసుడివచ్చు
మాసరివారితో మాలిమిమేలు
తగినాతడుమాకు దక్కినయెడల
చేనికికాపగు చెప్పినపనుల
భక్తిమైచేయును పశువులునెరయ
అలసిసొలసినప్పు డాదరువగును
ముక్కుకుగానట్టి ముత్యంబువలదు
నామాటవినుమని నాశక్తికొలది
వెప్పినవినదాయె చెలియనేమందు
కడసారిదయచేయు కలవారిపొందు
నీవేమిచేసితో నీకేమరగెను
నిశ్చయించెనుభామ నీవెంటజనగ
బ్రతుకుమాదెవ్వరి పాలుచేసెనకొ
ఒకనాడుమాయింటి కొయ్యనవచ్చి
వేడినసొమ్మిచ్చు విటకానినైనా
చిక్కులబెట్టుదు చీకాకొనర్తు
సంప్రదాయంబిది సకలవేశ్యలకు
మనసునీపాలాయె మమ్మెల్లవిడిచె
అనుకొన్నఫలమేమి ఆపెకెతెలియు
మెల్లనిమాటకు మీరదునీకు
నేనుగద్దించిన నిలువదుమ్రోల
తెలిసియేయుండు నాతీరులోకమున
సర్వకాలమునేను సాకినదాన
సత్యంబునీవెంట సాగిపోనీయ
కెరలిననాతోడ గెల్వరెవ్వారు
అనుచుతొడచరచి ఆగ్రహమంది
అడిగినద్రవ్యంబు నలరనాకిమ్ము
నీవెంటపంపింతు నెలతనునేను
సమ్మతిదీవింతు సర్వేశునాన
వెలయగబండ్రెండు వేలరొక్కంబు
ఎలమినుంకువగాగ ఇప్పింపుమన్న
అవిచారముగబాలు డందుకుఒప్పి
వెలమలదోర్నీని వేగంబిలిచి
ఏడువేలధనంబు నింతికినిమ్ము
కూరిమితమ్ముడ కుమ్మరిపట్టి
మూడువేలధనంబు ముదిదానికిమ్ము
కంసాలిచందన్న కడమవిరెండు
వేలమాడలనిమ్ము వృద్ధభామినికి
అనిచెప్పియిప్పింప అతివదాకొనియు
కరములుముకుళించి గ్రక్కునమ్రొక్కి
ముదివానరమువంటి ముదుసలిపలికె
చక్కదనముకుప్ప సరసంపుతెప్ప
మదనునిబాణంబు మాకుప్రాణంబు
దక్కించుకొంటివి తగనిటువంటి
పుత్తడిబొమ్మ నీపుణ్యముకతన
చేరినదూరక సిద్ధించునట్లు
పట్టుపచ్చడమిమ్ము భక్తితోనాకు
నీమారుగాజూతు నేపెద్దదాన
అనుచువేడిననిచ్చె అప్పుడునవ్వి
యింతిదాబుచ్చుక యింటికినేగె
ఈరీతిదనతల్లి యేగినవెనుక
బాలచంద్రునితోడ పల్కెశ్యామాంగి
ఉల్లంబుచల్లనై ఉత్సాహమొదవె
ఎల్లికార్యమపూడి కేగంగవలయు
మల్లభూమీశుని మన్ననపడసి
గొల్లెనలోపల కొలువులోనుండి
మదిలోననన్గూర్చి మరిచిపోయెదవు
రాజులుసెలవీక రారాదుమరలి
యెన్నినాళ్ళగునొకో యీకార్యసరణి
అన్నపుఖర్చున కాకుపోకలకు
ఈనున్నదేమైన ఇప్పుడేయిప్పింపు
మనినబాలుడువిని హర్షంబునొంది
చయ్యనకంసాలి చంద్రునిబిలిచి
ఈపెకునాల్గువేలిమ్ముతమ్ముండ
అనినమంచిదియంచు నందరివద్ద
అరసిద్రవ్యంబు నంతయునిచ్చె
తరువాతబాలుండు తరుణినిజూచి
ఓఇనమైయుండుము పద్మాయతాక్షి
ఘనతకార్యమపూడి కదనరంగంబు
చూపంతునీమది చోద్యమందంగ
అనిచెప్పిఒప్పించి అనుజులుదాను
శ్యామాంగిసదనంబు చయ్యనవిడిచి
పంచవాద్యంబుల పటలిమ్రోయంగ
బ్రాహ్మణుల్ దీవింప భట్లుపొగడగ
ఆనందమునవీథి కపుదరుదెంచి
గుంపులైయున్న భిక్షువులనుగాంచి
వీరికందరిని వేడినధనము
కూరిమినొసగుము కుమ్మరిపట్టి
అనిపల్కబాలుని నాతడుచూచి
తల్లి ఇచ్చినయట్టి ద్రవ్యమంతయును
వ్యయమయ్యెనేభంగి ఆర్థులకిత్తు
అనిచెప్పతమ్ముల నందరిబిలిచి
ఆడిగినవారెల్ల ననిరివ్విధమున
ఆసమయంబున అనపోతులేచి
పటుకోపమునబల్కె బాలునితోడ
ఇంతగర్వంబేల యీమదమేల

కామాంధకారంబు కన్నులదట్టి
క్రిందుమీదెరుగక కేరుచున్నావు
కలధనమెల్ల భోగముదానికిచ్చి
చేసితిపాపంబు చెడ్డవెచ్చంబు
ఇహపరదూరపు టీవృత్తియేమి?
శ్యామాంగిపైప్రేమ సర్వనాశంబు
సోలిదానికిమ్రొక్కి సొమ్మెల్లనిచ్చి
యిందరినడిగిన నేమిలాభంబు
వారకాంతలరీతి వర్ణింపరాదు
బిడ్డలకొసగక ప్రియురాలికీక
చీమలుగూర్చిన చెలువునగూర్చి
ధనవంతులగువారి ధనమెల్లదోచి
ముంజికాండ్రనుజేసి మురిపెమడంప
వ్యర్థులైవిటవృత్తి వసుమతిమీద
పోయిరిబ్రతికెడు పొందికలేక
ఊర్విపైవేశ్యల కోలియిచ్చుటలు
వినలేదుకనలేదు వేడబంబిద్ది
అమిదూరిపలికిన ఆబాలుడరసి
తలవంచిమరుమాట తానాడలేక
వెలమలదోర్నీని వేగమెపిలిచి
మలిచుట్టుతప్పించి మాణిక్యఖచిత
కనకమయాంచిత కటిసూత్రమపుడు
తీసిచేతికొసంగి దీనిమూల్యంబు
బ్రాహ్మణులకునిమ్ము భట్టులకిమ్ము
బీదవారలకిమ్ము భిక్షులకిమ్ము
నావుడాతండు ధనంతెప్పించి
సకలార్థులకునిచ్చె సంతుష్టులైరి
తరువాతబాలుండు తాత్పర్యమొప్ప

వైభవంబునగండు వారింటికేగ
విపణిమార్గంబుల వెలయుచురాగ
వరవిప్రకాంతలు వడితోడవచ్చి
హారతులిచ్చినా రానందమొదవ
పలుకానుకలొసంగె బ్రాహ్మణజనము
బాలుడుశృంగార భరితమైయొప్పు
గండువారిగృహము కదిసిఆవేళ
మానిక్యతోరణ మండితంబైన
ద్వారమునంజొచ్చి దాటుచుజూచె
ఘనచిత్రకర్మసంకలితపటాలి
గోడలుకనరాక గుత్తమౌనట్లు
చేసివితానంబు చెలువొప్పగట్టి
సరసంబొనర్చిన చవికెలోపలను
రక్తకంబళముల రామణీయకము
అరసిచూచుచు బాలుడాసీనుడయ్యె
తమ్ములందరువచ్చి తగినతావులను
వసియించిరచ్చట వైభవంబలర
ద్రాక్షాగుళుచ్చముల్ దాడిమ్మపండ్లు
నారికేళాదులు నారింజపండ్లు
జాలవల్లికలతో సరగునదెచ్చి
ముందరనిల్పిరి ముదముమీరంగ
వింజామరంబులు విసరిరిలెస్స
బాలుడు సురరాజు భంగిగన్పట్టె
కనుగొన్నవారల కన్నులకప్పు
డలరంగచెలికత్తె లమితహర్షమున
మాంచాలననువుగ మక్కువతోడ
శృంగారమొనరించు చిత్తంబులుంచి

సంపెంగతైలంబు చయ్యనదెచ్చి
మగువకుశిరసంటి మంచిగంధమున
ఆతకలిరాచియు ఆనూనెపోవ
బంగారుబిందెల పన్నీరుతెచ్చి
స్నానమాడించిరి సంతసంబొప్ప
తడితీర్చిరపుడు తగినవస్త్రమున
ఒకపొడివసనంబు నొప్పుగగట్టి
కూర్చుండబెట్టిరి గురుహేమపీఠి
బంధరచయమును భయమందజెసి
కాటుకకాకచే కందగాజెసి
చీకటిగుహలలో జేరగదించి
కాలాంబుదంబుల గట్టులజేర్చి
దీర్ఘమైనునుపులై తీరైనకురుల
కూర్చినిన్నగదువ్వి కొప్పుగీలించి
బంగారుపూచేర్లు బాగుగాజుట్టి
మదనుకుంతముకు సమంపుపాపటను
మణిహేమమౌక్తిక మండితంబైన
చేర్చుక్కజేరిచి చిత్రంబుగాను
పొలుపొందశశిరవి భూషణయుగము
పాపటకిరువంక భాసిల్లనిలిపి
మాణిక్యహాటక మయబింబమొకటి
తలవెంకమెరయగ దట్టించిరెలమి
సగముచంద్రునితోడ సమమైనయట్టి
ఘనఫాలదేశంబు కాంతులుగ్రక్క
నిఖిలజగత్తుల నిర్జించునట్టి
కందర్పువిండ్లను ఖండించివైచు
బొమలురెంటికిమధ్య పొందికగాను
కస్తూరిబిందువు ఘటనకావించి
ముక్కునముత్యంబు ముంగరనిలిపి
చంద్రఖండంబుల సారెకుదూరు
గండభాగంబుల కస్తూరితోడ
మకరికాపత్రముల్ మానుగావ్రాసి
శ్రీనవసంఖ్యల చిరునవ్వునవ్వు
వీనులుమితిలేని విభవంబునొంద
దీపితరత్నమౌక్తిక హేమయుక్త
తాటంకభూషణ స్వయముగీలించి
ముత్యాలకుచ్చులు మునుకొనివ్రేలు
బవిరలు కుంటేండ్లు పసమీరబెట్టి
కర్ణాగ్రదేశముల్ కాంతులనీన
కుప్పెలముత్యాల కుచ్చులురెండు
ఘనకుంతలంబుల గదయించిమరియు
కాశ్మీరకర్పూర కస్తూరులెసగు
మలయజంబలర హేమసమంపుమేన
విశదంబుగాపూసి విసరిరంతటను
పువ్వులగుత్తుల బొంగరంబులను
మానితకందుక మాలూరతతుల
చెయ్యననిరసించు చన్నులపైన
బంగారుపువ్వుల పట్టుకంచుకము
తొడిగినేరుపుతోడ దూముడివేసి
ముత్యాలరత్నాల మెరిపెంపుపేర్లు
పతకాలుపవడాలు బన్నసరాలు
వక్షఃస్థలమ్మున వరుసగవేసి
కంబుసన్నిభమైన గళభాగమందు
ముత్యాలపట్టెడ ముదముతోబెట్టి
మర్రియూడలతోడ మార్కొనిగెల్చి
సుమమాలికలసొంపు చూరలుపుచ్చి
చెలువొందుచుండెడు చేతులరెంట
రత్నాలుచెక్కిన రమ్యాంగదములు
దండకడియములు దంటతాయెతులు
మక్కువతోగట్టి మనికట్టునెగువ
నీలాలగాజులు నేర్పునదొడిగి
పచ్చలకంకణాల్ భాసిల్లబెట్టి
చామలాకడీయముల్ సంధింపజేసి
సొబగైనచేకట్లు సొమ్ములుదాల్చి
మాణిక్యతపనీయ మంజులోర్మికల
అంగుళములకెల్ల అమరంగగూర్చి
పాపటసవరించి బంగారుతగటు
ముయ్యంచుచేలంబు మోహనమొప్ప
కటియందుసంధించి గజ్జలువ్రేలు
తపనీయకాంచిని దట్టించిముడిచి
పయ్యెదరొమ్మున బాగుగాజేర్చి
అందెలుగొలుసులు నమరగబెట్టి
భర్మవినిర్మిత బహువిధదీప్త
భూషణంబులువ్రేళ్ళ పొందుగాబెట్టి
పదములలత్తుక ప్రకటంబుచేసి
పద్మపాఠీనాల భ్రమనొందజేసి
చెవులపర్యంతము చెలగునేత్రముల
కాటుకవెలయించి కాంతలీరీతి
శృంగారమొనరింప చెలగిమాంచాన
తల్లికిమ్రొక్కిడి దయరాగననియె
అమ్మనీయల్లుని నసలెరుంగ
ఏరీతిదెలియుదు నేయుపాయంబు
పతియనియితరుల భావింపగూడ
దాభంగిజేసిన అపరాధమగును
హాస్యంబుచేయుదు రక్కడివారు
పంపుముగురిచెప్పి పణతిరొయనిన
మాంచాలకప్పుడు మాతయిట్లనియె
నీవటుపోయిన నినుజూచినపుడు
లేతురుమరుదులు లేవడువరుడు
గురుతుచెప్పితినేగు కూతురా అనిన
తల్లినిసేవించి తానేగెనపుడు

భూదేవితనరూపు పొలతినిజేసి
బాలునిభ్రమియింప బంపెనోయనగ
సౌందర్యఖనియైన చానమాంచాల
నిల్చివారలజూచి నివ్వెరపదగ
మరదులార్వురుగూడి మక్కువతోడ
వేగమేలేచిరి వెలదింగాంచి
పతిలేవకుండెను బ్రహ్మణోత్తముడు
లేచినపాపంబు లేమకుజెందు
అనుచులేవకపోయె అపుడుమాంచాల
యిద్దరిలోభర్త నెరుగగలెక
కాంచనవర్నప్రకాశుడైనట్టి
బ్రాహ్మణుడనపోతు పాదంబుబట్టి
పన్నీటగడుగంగ భావనచేయ
భయమున అనపోతు పలికెవేగంబ
నేనుబాలుడగాను మగువనానామ
మనపోతునాబిల్తు రందరుజనులు
విప్రుడీరితిని వెలదితోబలుక
అనపోతుతోననె అపుడుమాంచాల
మరదియోయెరుగను మగడొకోయెరుగ
భయమందనేటికి బ్రహ్మణోత్తముడ
అనిపల్కుమాంచాల కావిప్రుడనియె
అమ్మనీపెనిమిటి యత@డు; నామంబు
బాలుండు; శాత్రవ భయదుండుసుమ్ము
నీమనోహరుసేవ నియతిమైజెసి
తరువాతమమ్మెల్ల దయనాదరింపు
మనినంతనతనితో ఆలేమపలికె
వినవయ్యవిప్రుడ విన్నపంబొకటి
ఇద్దరికిమీర లెలమితోపెండ్లి
చేసెడునాడొక చెనటివిప్రుండు
చూడగాలేక అసూయపెంపొంద
సౌందర్యమన్నది చానకుసున్న
యెట్లుగావించి నారీవివాహంబు
అనిపల్కెనోయేమొ యటుకాకయున్న
బాలుడివ్విధమున భావంబువిడిచి
నన్నేలవిడనాడు నయమార్గమెడలి
పరిచయమేలేదు పతికినినాకు
బాలచంద్రుండిప్డు వచ్చెనుగనుక
నేనుపూర్వమ్నందు నియమంబుతోడ
చేసినతపమంత సిద్ధించెననుచు
హర్షంబునొందితి ఆత్మలోపలను
బాలుడుమిమ్మిక పాయకయున్న
మాభాగ్యమిల అసమానంబుగాదె
బ్రహ్మకులంబున ప్రభవించినావు
వేదాదివిద్యల విఙ్ఞానివనుచు
నీచరణంబులు నేనుపూజింప
పట్టితినాకన్య భావంబులేదు
మనసునిశ్చయమిది మరిదినాకంచు
అనువొప్పగాబల్కి ఆత్మేశుజూచి
పన్నీరుదెప్పించి పాదముల్గడిగి
వచియించెనిబ్భంగి ప్రౌఢవాక్యముల
ప్రాణాంగనలగన వచ్చెడునప్పు
డితరులదెచ్చుట యేపాటినీతి?
అనినబాలుడుపంపె అనుజులనెల్ల
పోవుచుచెప్పిరి పొసగనవ్వుచును
బవరంబునకునేగు పయనంబునిలిచె
మనసుభయంబందె మక్కువమీర
కులవైరముందీర్చు కోర్కెయేమాయె
బవరంబునకునేగు పైనమేమాయె
నవ్వరాయీమాట నాయకుల్విన్న
కలనిలోనున్నట్టి ఘనులెవ్వరయ్య
యీసుఖమేదక్కె నెవరునాకేల
అనిచూడగూడునా అపకీర్తివచ్చు
అనిపల్కువాక్యంబు లాలించియపుడు
బాలచంద్రుడుపల్కె భ్రాతలతోడ
ఇంతగానాకు మీరేలచెప్పెదరు
బవరంబునకునేగు పైనంబుమరువ
కులవిరోధములోన కుములుచునుండె
కాయమిచ్చటబుద్ధి కలనిలోపలను
నివసించియున్నది నిశ్చయంబిదియు
శ్రీగిరీశునియాన చెన్నునియాన
మాయమ్మమాతకు మారాడలేక
యిటువచ్చినాడ మీరేమిచెప్పెదరు
రయమునవచ్చెద రమ్మందురేని
మీరెల్లనిలుమన్న మీరకనిల్తు
ఎన్నినాళ్ళుందునే నెరిగింపుడనిన
ఏడుజాములదాక నిచ్చోటనుండు
మంతటమితివచ్చు అరుగంగవలయు
సర్వఙ్ఞుడవునీవు జడులముమేము
వచ్చెనాఅపకీర్తి వచ్చునందరికి
ఒత్తిచెప్ప్టలుమాకుచితధర్మంబే
అనిపల్కిశీఘ్రమే ఆకొల్వువెడలి
తమతమయిండ్లకు తమ్ములుచనిరి
తరువాతమాంచాల తనభర్తయైన

బాలచంద్రునితోడ భావముప్పొంగ
మేడమీదికిబోయి మేలైనయట్టి
చిత్తర్వుజూపుచు చిలుకలచదువు
వినిపించిశృంగార విపినంబుజూపి
పెద్దలుతనమీద ప్రియమీరంగ
ప్రొద్దుపోవుటకునై పొందించినట్టి
ఘర్మపాంచాలికావ్రాతముజూపి
అందులోనొకబొమ్మ నాడుంగజెసె
అందుకాతడు కరమానందమొందె
అటుమీదనిద్దరు నధికమోహమున
చిత్తర్వుమేడకు జేరబాలుండు
హంసతూలికాపాంపు నందుపరుండె
ప్రియురాలుముత్యాల పీటపైనుండి
తాంబూలమిచ్చుచు తనమదిలోన
బాలునిభావంబు బాగుగనెరిగి
ఆయత్తపడివత్తు ననిమ్రొక్కిలేచి
జననియొద్దకుబోయి జలకంబులాడి

ప్రతిమలువ్రాసిన పట్టువస్త్రంబు
కటియందుధరియించి కనకమాణిక్య
మౌక్తికసంయుక్త మంజులంబైన
భూషణవితతిని పొందుగాదాల్చి
చెలగిపాదముల మంజీరయుగంబు
సంధించిముత్యాల జల్లులువ్రేల
బహువిధశృంగార భరితురాలగుచు
బిడ్డలయాశలఁ బ్రియమునఁదీర్ప
జననితోసమమైన జంతువులేదు
కావునదనకున్న కష్టంబులెల్ల
పోగొట్టుననియెడు బుద్ధితోనాపె
కాంచకకాంచక కాంచితిఁబతిని
కాంచితినేకాని కలలోనివార్త
కదనరంగమునకుఁ గదలుచున్నాఁడు
చిరవియోగముమాకు సిద్ధించునొక్కొ
దైవమీలాగున దయదప్పినన్ను
పుట్టింపగానేల భూస్థలిమీద
అదవిగాసినవెన్నెలాయె నాబ్రతుకు
తల్లిరోనేనెటు తాళగలాను
బాలునిఁబోకుండఁ బట్టుటయెట్లు
దరియేమినాకని తల్లడంబంద
తరుణియిట్లనిపల్కెఁ దనయనుజూచి

ముద్దులమాంచాల ముదమునవినుము
జన్మవృక్షమునకుఁ జవిగలయట్టి
పటుతరకమనీయ ఫలములురెండు
కెరలుభోగములొండు కీర్తిరెండవది
తొలిపండుచవిచూచి తొలఁగునొకండు
మలుపండు చవిచూచి మలఁగునొకండు
వీరలిద్దరికిని భేదంబు హెచ్చు
మొదటిఫలంబున మొనసెడురసము
క్షరభగురంబది సమసిపోగలదు
రెండవఫలమున రెక్కొనురసము
శాశ్వతంబౌచు దిశల్ గలదాఁక
సవితృఁడుగలదాఁక శశిగలదాఁక
తారలుగలదాఁక ధరగలదాఁక
వారధిగలదాఁక వరలుచునుండుఁ
బ్రకటఫలద్వయ రసమునుగ్రోలి
యనిభవించెడు వారలరుదుభూస్థలుని
ప్రాకృతజనములు ప్రథమఫలంబు
ప్రాపించిసంతృప్తి వడయంగఁగలరు
వీరాంశమునఁబుట్టి వెలయువారలకు
మొదటిఫలంబది ముఖ్యంబుగాదు
మహిమాస్పదంబయి మనసుజ్వలింప
బరుగెత్తుదురు రెండవఫలంబుకొఱకు
వెలదిరోనీభర్త వీరశేఖరుడు
కీర్తికాముకుఁడయి కేరుచున్నాఁడు
నీవుభోగములపై నిరతిఁద్యజించి
బాలచంద్రును భద్రభావంబెఱింగి
భావిమానవుల హృద్భావనంబులందు
తావకీనయశోల తానివర్ధనము
సేయంగఁగోరుము చెలువరోయిపుడు
బాలచంద్రునినాగఁ బట్టంగవలదు
నావుడుమాంచాల నమ్రతతోడ
జననికిఁదా నమస్కారంబుచేసి
భర్తదగ్గరకేగి భక్తితోనిల్వ
దనమదిబాలుండు తలపోసెనిట్టు
లెక్కడిసౌందర్య మెంతయొయ్యార
మేమనియెన్నుదు నీయింతిచెలువు

నరలోకసురలోక నాగలోకముల
సరిలేరుభామకు సౌందర్యగరిమ
ఇటువంటికాంతపై నిచ్చబోవిడిచి
పశుబుద్ధితోడనే భావంబుమరచి
నిందపాలైతిని నిఖిల్లరాజ్యముల
పరలోకసౌఖ్యంబు పారదోలితిని
మిత్రులుచుట్టాలు మేటిబంధువులు
తిట్టిదూషింతురు తెలియలేనైతి
ఆశ్రితజనముల అరయుటమాని
పరియాచకముచేయ వారలకిచ్చు
భష్టులపోలిక భర్యనుబాసి
వెలయాలిప్రేమించి వీరిడినైతి
ఏగతి చింతింతు నేమందువిధిని
నాకర్మఫలమేమొ నాగతియేమొ
తరమెనాకెరుగంగ దైవంబెయెరుగు
అనితలపోసెడు ఆబాలుజేరి
మాంచాలగూర్చుండె మక్కువతోడ
బాలుండుమోహంబు ప్రకటంబుచేయ

చేవేగమునచీర చెంగునునొడిసి
పట్టినఆచీరపై నున్నయట్టి
ముత్యాలచేరులు మొదటికితెగెను
చెదరిరాలినగని చెలియభీతిల్లి
చిన్నబోయను మోముచెలువెల్లదొలగ
వెలదివెల్వెలబోవ విభ్డప్పుడనియె
చింతింపబనిలేదు చిత్తంబులోన
అంతకుబాగుగ అమరింతుచీర
అనిలేచిసంభ్రమ మచ్చుపడంగ
చెక్కులుకరముల చెన్నుగనిమిరి
తగునేర్పుతోడ ముత్యంబులనెత్తి
చీకాకుపడచేసి చిక్కులబెట్టి
కాలంబునీరీతి గడుపంగమించి
జాములేడునుదాటె తరుణిమాంచాల
బాలునితోననె భావంబెరిగి
నాతోబెనంగిన నయమేమిలేదు
కడువడికలనికి గదలుడిమీరు
కులవైరముందీర్ప గురుసాహసుండు
పరికించిచూడ నెవ్వరుమీరుదక్క
అనిపల్కుచుండగ ఆసమయమున

అటశూరులైన యనుజులువచ్చి
గండువారింటిదగ్గర జేరనిలిచి
ధ్వనియెనర్చిరి హెచ్చు తమకంబుమీర
వినిబాలుడడిగెను వెలదినిజూచి
మేడపిచెన్నుని మేలైనసేవ
అనితెల్పగా బాలుడాసక్తితోడ
మౌక్తికమాలల మరుపగడంగె
తమ్ములందరునప్డు తత్తరపడుచు
ఘనరౌద్రముగనుండు కత్తులదూసి
వెడలినకోపాగ్ని వీరులేడ్వురును
మారెరుంగకకేరు మదకరులట్లు
పురముతల్లడమంద భూధ్రముల్ కదల
భీకరంబుగనార్చి పెడబొబ్బలిడిరి
అదిబాలుడాలించి ఆయుధమంది
ఓడకోడకుమంచు ఉవిదలబలికి
పెబగొన్నకోపాన పెరికికటారి
అట్టహాసముచేసె అనుజులమీద
పలికిరితమ్ములు బాలునితోడ

త్రుప్పుపట్టినకత్తి దూయుటతగవె
ఘనమైనశౌర్యంబు గలవాడవౌర
ప్రబలుచున్నట్టి వైరులవిడిచి
అనుజులమీదనా? ఔద్ధత్యగరిమ
బోరునకార్యమ పురమునకేగు
సమరకార్యమునీవు చాలించినావు
కొలువులోమీమామ కొమ్మభూపతికి
ఇల్లెడచేసెని న్నెలమిబ్రహ్మన్న
అలరాజుపగరచే హతుడైనవెనుక
పెండెంబునందెయు భేతాళమనెడు
ఖడ్గంబుమొదలైన కలబిరుదముల
ఒసగుమంచునునీకు నుర్వీశుడంపె
వినుమినుమునురాగి యిత్తడికంచు
పెట్టిచేసినయట్టి బిరుదులుకలవు
రజతజాంబూనద రచితమైనట్టి
వెలలేనిసొమ్ములు వెసనీకుదక్కె
సన్నితికెక్కెనీ సరసత్వమెల్ల
కట్టిడివాడవు కరుణలేదాయె
మనాక్కవెలలేని మాణిక్యమరయ
వచ్చికైలాస శైలంబునందు
అలరాజుగలసిన దాశ్చర్యసరణి
సరసిజలోచన చావువిన్నపుడు
దరికొనదా? మదిదావాగ్నిరీతి
అన్నమెట్టులులోని కరుగునునీకు
కంటికినిదుఏ యేగతివచ్చునయ్య
బంటితనంబును పాడియువిడిచి
కులవైరంబుదీర్చు కోరికవదలి
ఇంటికాసించుట యేనీతియగును?
బాలుడా! మమ్మంపు బవరంబునకును
కులవైరముందీర్చి గురుశౌర్యమమర
తక్కించెదమునీకు దరిలేనికీర్తి
అనినబాలుడువిని అడకువమీర
సిగ్గుచేతలవంచె శీఘ్రమెతిరిగి
మాంచాలమందిర మార్గంబుపట్టి
పురుషునిరాకడ బుద్ధిగ్రహించి
వాకిటిపొంతకు వడినెదురేగ
అతివచేతికిబాలు డాయుధమిచ్చె

నవ్వుచుదీవించె నలినాయతాక్షి
రతిరాజసుందరా రణరంగధీర
కమలబాంధవతేజ కరుణాలవాల
వినతాత్మజునిలావు వెసనీకుగలుగు
సామీరికుండిన సాహసంబబ్బు
కృష్ణునికీడుగా కీర్తిఘటిల్లు
రవికాంతియుతుడవై రంజిల్లుచుండి
అలరాజుపగదీర్పు మనుజులతోడ
పటుతరవిక్రమ వైభంబలర
శ్రీగిరిలింగంబు చెన్నకేశవుడు
వరములొసగంగ వర్తిల్లగలరు
శాత్రవవిజయంబు సమకూరుమీకు
ఈయాయుధము వడినిచ్చునుజయము
కలియుగంబునమీకు ఘనపూజలమరు
అనిప్రాణనాథుని ఆశీర్వదించి
ఆయుధంబిచ్చిన అతడుగైకొనియె
బాలినితోపల్కె పడతిమాంచాల
కలహంబునకుమీరు కదలుచున్నారు
జయమపజయము నీశ్వరునకుదెలియు
విప్రుడాఅనపోతు వెంటరాదలచు
బ్రహ్మహత్యఘటిల్లు పాపమువచ్చు
బహుజన్మములకైన పాయదాకీడు
పరమేశ్వరుండైన గార్వతీగానీ
పాపికొనగలేక పలుపాట్లుపడియె
మనుజులెంతటివారు మదివిచారించి
మగుడంగబంపుము మాయచేనైన
అనిసమ్మతమొంది ఆపుడుబాలుండు

మాంచాలవీడ్కొని మనసుచలింప
తనైంటికేతెంచి దండిశూరుండు
తల్లిచేనన్నంబు తానారగించి
చందనపరిలిప్త సర్వంగుడగుచు
తగటువస్త్రంబులు తగజుట్టితొడిగి
భర్మమౌక్తికరత్న బహుభూషణములు
తగిన అంగములందు దాలిచిమించి
తల్లికిమ్రొక్కిన తనరదీవించి
సురనాథువిభవంబు సొంపొప్పగలుగు
వీరభద్రునికట్లు విజయంబుగలుగు
రఘునాయకులయొక్క రాజసమొప్ప
పవనపుత్రునిమహా బలముసిద్ధించు
విచ్చేయుమనితల్లి వేడుకబలికె
తగినట్టిదీవెన తల్లిచేనంది
దట్టమౌకోపాన తనమొగసాల
కరుదెంచిఆబాలు డానందమొంది
భూమండలపుకోట పొందుగగెలిచి
పాండ్యులజేకొనె పటువిక్రమమున
బలువైనజగజంపు భద్రసాలేయ
మదిపంపుమని వార్తనంపెతల్లికిని
తనయునివాక్యంబు తామీరలేక
తెప్పించియిప్పించె దీవెనతోడ
రాచబిరుదులంది రణరంగమైన
కార్యమపురిచేర గదలగదలచి
మేడపివెడలెను మితిలేనిపటిమ

తొడిబడి బాలచంద్రుండూహాచేసి
తమ్ములకెరిగించి తనమర్మమెల్ల
కనుచూపుమేరను గదలకనిలిచి
తమకంపైనాన దగుమోసమాయె
ఏమిచేయుదునింక నితమీదనేను
మసలియీపైనంబు మానితినృని
దుశ్శకునంబగు దొడరునుగీడు
కుమ్మరపట్టినా కూర్మితమ్ముండ
వడితోడజనుము మీవదినెనుగనుము
ముత్యాలగళమాల ముద్దుటుంగరము
మరచివచ్చితిదెమ్ము మసలకయిప్పు
డనినకుమ్మరిపట్టి అతనితోననియె
అనఘాత్మనాదేహ మలసటనొందె
నడువనోపగలేను నరకుంజరంబ
అరసిచాకలచందు నాలాగుపలికె
కమ్మరపట్టియా కరణివచించె
మేడపికేగెద మెలతజూచెదను
రయమునమిముజేర రాలేనుసుమ్ము
వెలమలదోర్నీని వేడనిట్లనియె
నీప్రొద్దుతిరిగిరా నేనలసితిని
కలియవచ్చెదరేపు కలనిలోపలికి
కొదువయిద్దరవేడి కొనినంతవారు
పోలేమటంచును బొంకిరివేగ
అంతనవ్వుచుబాలు దనపోతుకనియె
నమ్మినతమ్ముడ నయశాస్త్రవిదుడ
పేరమ్మతనయుడ పెద్దనపొత్ర
ఒడ్డిమల్లపరాజు నొయ్యారిపట్టి
అందనితరువుల యాకులుదీసి
వ్రాయుదులెక్కలు వసుధేశతతికి
బ్రహ్మవంశకలోక పావనమూర్తి
నా ఆత్మసఖుడవు ననుజేరరమ్ము
గ్రక్కునవదినెను కనుగొనివేడి
ముత్యాలగళమాల ముద్దుటుంగరము
కొనితెమ్ముతమ్ముడ గురునీతిపరుడ
అన అనబోతు చిహ్నంబులనడిగె
పెనగొన్నవేడ్కతో పీటపైనుండి
ముత్యాలుగూర్చిన మొనచీరకొంగు
చేపట్టియీడ్చిన చెదరెముత్యములు
కనికూర్పగాబోవ గనుపట్టదాయె
ఇదియానవాలని యింతితోపలుకు
హితవొప్పసానివా రింటికిబోయె
అడుగువారానవా లడిగినజెప్పు
అరటిఫలంబుల అమరుచర్మంబు
ఫలమనియిచ్చెను పడతియావేళ
ఇదియానవాలని యెరుగకపల్కు
మనిచెప్పిపొమ్మన్న నప్పుడెకదలి
వడీపాదఘట్టన వశమునధూళి
చనివేగవినువీథి సాంద్రమైపర్వ
అసహాయశురుడయి అనపోతుపోయె
బాలుడూబ్రాహ్మణు బలునేర్పుమెరయ
మాయామతంబున మగుడబంపించి
తమ్ములుదానును తాత్పర్యమునను
కడువడి త్రిపురాంతకమునకువచ్చి
అచట ఆసక్తితా నాసీనుడగుచు
తెప్పించెఘంతంబు తీరైన ఆకు
వ్రాసినాడొకయుత్తరము స్వహస్తమున
అదిరావికొమ్మల కంటగట్టించి
వీరులేగినత్రోవ వెంబడినడచె
పల్లెలవారెల్ల బాలునిజూడ
చనుదెంచిరెంతయు సంతసంబొప్ప
మటుకూరికాపులు మ్రొక్కుచుననిరి
విందారగింపుడు విశ్రమింపుండు
తరువాతదరలుట తగుశకునంబు
వినుమన్నవారితో వీరుడుపలికె
కార్యమపురమున కదిసెనుబోరు
నిల్వరాదియ్యెడ నిల్వుడిమీర
లీరీతిననిబాలు డేగినవేళ
గరికెపాటనుగల కాపులువచ్చి
కనిమ్రొక్కినంతట ఘనుడువారలకు
పోకలాకులొసంగి పొమ్మనిపంపె
మేళ్ళగువాగునుజేరి మితిలేనియట్టి
పోటుమూకలువెంట బొబ్బరింపంగ
ఘనశైలగహనముల్ కనుమలుగడచి
తార్య్క్షుండుగిరులపై దాటినయట్లు

భానుకైరాహు పరువెత్తినట్లు
భయవర్జితుండయిన బాలుడార్చుచును
పరదళంబులువిన్న పెరుగెత్తిపోవ
నరసింగభూతల నాథుచిత్తమున
కులవిరోధమునకై గురిచేసినిల్పి
కొదమసింగంబులు గూడినభంగి
అనుజులువెనువెంట అరుగుదేరంగ
కురువకునేతెంచె గురుశౌర్యమమర
ఎక్కెనా నలగొండ యెదురేమిలేక
కుంజరసైనిక ఘోటకావళుల
బృంహితభాషిత హేషితంబులు
పటహరావంబులు ప్రబలుచునున్న
కార్యమపూడిశ్రీ కదనరంగంబు
బాలుఁడంతశ్శక్తి ప్రజ్వలింపంగ
నలగొడశిఖరంబు నన్నిల్చిచూచి
కుమ్మరపట్టిపై కుడిహస్తముంచి
వెలమలదోర్నీని వెసజేరబిలిచి
ప్రథితుడా అలరాజు పగదీర్పవచ్చి
ఒక్కడనేగుట యుచితంబుగాదు
వెనుకజిక్కినయట్టి వీరపుంగవులు
కలయవచ్చినదాక గడియకాలంబు
విశ్రమింతమటంచు వేడ్కతొనుండె
అటమున్నెకలనిలో నైనకార్యంబు
వివరింతుజనులకు విశిదంబుగాను
నలగాముకొల్వులో నాయకురాలు

తలపోసిమదిలోన తగినవారలను
వాసిగాబ్రహ్మన్న వద్దకుబంపి
బవరంబుగాకుండ పట్టుటకార్య
మనిపెద్దలనదగు ఆప్తవర్గమును
కొండ అన్నమరాజు కోటకేతుండు
హరిమిహితుడు మాడ్గులవీరరెడ్డి
పరమాప్తుడౌచింత పల్లిరెడ్డియును
మెదలయినసువిచార ముఖ్యులైనట్టి
చనవర్లబిలిపించి సమబుద్ధిననియె
బాహుపరాక్రమ ప్రాభువులైన
వీరులురాజులు వెలయశోభిల్లు
కొల్వులోనికిబోయి కూరిమిమీర
సమరంబుగాకుండ సంధియౌనట్లు
మాటాడీతమీద మాచెర్లభాగ
మేలుకొమ్మనిచెప్పు మింకొకమాట
నాయునివద్దకు బరసింగుదెచ్చి
కులవైరమదతుము కోరిమీరం
రొక్కటికమ్మని యొప్పించిరండు
మడీగిపోవలయును మనదేశమునకు
అనివీడుకొలిపిన నంతటవారు
పైనమైయేతెంచి పట్టపురాజు

మలిడేవుదర్శించి మన్ననవడయ
చెలువొందజోహారు చేసిరందరును
కూర్చుండనియమించె కుంభినీశ్వరుడు
వచ్చినవారలు వారితోననిరి
ఇదియేమికలనిలో నిన్నిదినములు
తడసితిరిచటికి తడవాయెవచ్చి
యేమికార్యంబొమా కెరిగింపుడనిన
మీరెరుగనికార్య మేదియియ్యెడల
తెలిసియునడిగిన దెలుపగవలయు
సంధికార్యమునకు జనులెరుగంగ
అలరాజునంపిన నామహీశ్వరుని
హేయమనకపట్టి హింసించుటెల్ల
తీర్పరులౌమీకు దెలిసినమేలు
నలగాముతమ్ముడు నరసింగురాజు
తలగోసికొనగ పంతంబొనరించి
కులవైరముందీర్ప కుతుకంబుతోడ
విఖ్యాతయశులగు వీరపుంగవులు
నిలిచిరిరణభూమి నిశ్చలప్రఙ్ఞ
ఎత్తివచ్చినవార లికబోవరాదు
సమరంబుచేయుట సంతోషకరము
బ్రతుకులస్థిరములు పడుతసిద్ధంబు
సంపదల్నిలువవు జలబుద్బుదములు
సత్కీర్తియెక్కటి సమయదెన్నటికి
వెరగందిపందలై వెనుదీయకుండ
అనిచేయమీరెల్ల నాయుత్తపడుచు
పరగునరమ్మని బ్రహ్మన్నపలికె
వినికోటకేతుండు వివరించిచెప్పె
వినవయ్యనాయుడ విన్నపంబొకటి
అతివివేకులుమీర లఖిలరాజ్యముల
మీదృశులయినట్టి మేటివిక్రములు
నీతిమంతులులేరు నిశ్చయంబిదియు
గొంతుగోయగమీరు కోరినయట్టి
నరసింగరాజును మయమునదెచ్చి
యిచ్చెదమామీద నేమైనలెస్స
సరవిరక్షించిన సంహరించినను
భారంబుమీపైన పాదుకయుండు
మునుపటిరీతిని ముదమొప్పమీరు
మాచర్లభాగంబు మక్కువనేలి
సంరక్షణముచేయ జనములనెల్ల
ఉభయరాజులుమీర లొక్కటైయున్న
మావంతివారికి మానసంబలరు
అఖిలాధిపతులుమీ ఆఙ్ఞచేయుదురు
మీరెరింగిననీతి మేమెరుగుదుమె
ఉభయసంస్థానంబు లొక్కటిమాకు
అనుగురాజేంద్రుడు హరిపురికేగు
సమయానతనపుత్రచయమునుచూపి
మీకుసమర్పించి మేనుత్యజించె
తర్వాత నిర్వాహదశయెల్లనీది
ఒకైల్లు రెండుగానొప్పనొనర్చి
తడ్డుమూటాడె నేయపుడెవరైన
మతిచెడీయీలోన మనసులుగలగె
అందుచేపగహెచ్చె నీర్ష్యజనించె
కోడీపోరాడుట కూడదటంచు
ఇచ్చతోజెప్పిన నెవ్వారువినిరి
గురిజాలపురికిని కోడిపోరాడ
ఎవ్వరువచ్చినా రిదియేమిమాయ
ఐనట్టికార్యంబులన్నియునీకు
తెలిసియేయున్నవి తేటతెల్లముగ
గతజలంబుల కడ్డుగట్టినరీతి
జరిగినదానికి జర్చలేమిటికి
అవలీవలివారి నరసిరక్షింప
భారంబునీయది బ్రహ్మనాయుండ
కౌరవతతినెల్ల కదనంబునందు
కూకటివేళ్ళతో గూల్చియామీద
బహులార్తినడవుల పాలైరిగాక
పాండవులేమేలు వడసిరిచెపుమ?
చేరిమీరొక నరసింగుకొరకు
సకలభూపతులను సమయంగజేసి
పాడైనరాజ్యంబు పైనిబెట్టుకొని
చివరకుఫలమేమి చెందంగగలరు
పొందికగలహంపు బుద్ధులుమాని
సవతిపుత్రులకిప్డు సంధియొనర్చి
అనుకూలముననుంత యర్హంబుమీకు
అరయనితియుకార్య మనుగురాజున
నీయానమేమింక నిలవమిచ్చోట
నావినిఆవీర నాయకులనిరి

పాపంబుచేసిన పగవాడువచ్చి
కనుపట్టశిక్షింప కర్తవ్యమగును
సహనంబొనర్చిన జనులుదూషించి
భయపడిరంచు పరిహసించెదరు
హతమొనర్చుట మంచిదనువైనవేళ
భాండమునెగబెట్టి బలురాతిమీద
వేసిపగిల్చిన విధమునమించి
తరిచూచిశత్రుని దండింపవలయు
హస్తగతుండైన యట్టిశాత్రవుని
పొమ్మనిసెలవిచ్చి పోరాడుటెంచ
చెట్టెకిఫలమును చేనటిచూచి
వేగమేదిగి రాతవేసినట్లగును
తెంపునవీరిలీ తీరునననిన

చెవులురెండునుమూసి శ్రీకంఠుదలచి
నయమునకొమ్ము భూనాథుడిట్లనియె
చేతికిచ్చినవాని చేదించినట్టి
పాపంబునెబ్భంగి పాపికోవచ్చు
చిన్నరహస్యంబు సెప్పెదవినుము
చతురంగబలముల చందమట్లుంచి
మానసంబైనట్టి మర్మంబుకనుము
ప్రజ్వరిల్లెడు వీరభావంబుమీద
స్వకృతాపరాధంబు ప్రాబల్యమొంది
తొడిబడజల్లని తుంపురుల్ చల్ల
జ్వలనంబుక్షీణించి చల్లారగడగి
ధర్మతత్పరుడైన తద్ ఙ్ఞానియెదుట
మలుగబోయెడి చిరుమంటయైయుండు
సైరించితలవంచి శరణనివేడి
సగముక్షీణించిన శత్రునిబట్టి
చంపుటయేనీతి? సర్వఙ్ఞులార
అలరాజుజంపిన యట్టినేరంబు
మహితుడౌనలగాము మానసమందు
చురుకుచురుక్కున సూదియైపొడువ
తానొనర్చినయది తప్పనితెలిసి
సిగ్గుచేదలవంచి చేరియున్నాడు
శరణనివచ్చిన శత్రువునైన
కాచిరక్షించుటే ఖండించుటరయ
కాదనికసిపోవ ఖండింతుమేమి
ఇహముననిందింతురెల్లవారలను
పరముననరకంబు ప్రాప్తించుసుమ్ము
పగవానితమ్ముడు పాదంబుబట్ట
రక్షింపడా? మును రామభూజాని
అని భానుకులనాథుడాడుమాటలకు
మనసులోకోపంబు మానినాయకులు
సంధికార్యమునకు సమ్మతులైరి
అటవీరవరులకు హర్యక్షుడైన

బల్లరగండడు బాలచంద్రుండు
నలగొండపైనుండి నాలుగుదిశలు
పరికించికనుగొని భావముప్పొంగ
వెలమదోర్నీనితో వివరించిపలికె
ఎరిగియుండుదువే నీవీశిఖరంబు
అడిగెదగురుతుల ననిచెప్పవలయు
అనినదోర్నీడనె ఆతనితోడ
చెప్పశక్యముగాదు సేనలతెరగు
వెలయ అంబుధివెల్లి విరిసినరితి
నలగామభూమీశు నమ్మినసేన
ఉన్నదినామది ఉత్తలపడగ
ఇసుకచల్లినబడనెడమేమిలేదు
నేలయీనినరీతి నిండియొసంగు
చుట్టుకొండలు నిల్వజూదనొప్పుచును
రణరంగభూమి విరాజిల్లసాగె
వెనుకటిరాజులు విక్రమస్పూర్తి
గట్టునచెలరేగి కదనంబుసల్ప
వీరులరక్తంబు విసువకత్రాగి
మత్తిల్లియల్లన మలయుచునున్న
నాగులెరల్లదే నాయునిసుతుడ
పాలేటిఉరుముచే పగిలిభూధరము
నాగాధిపతి ప్రాణనాశంబుచేసి
నడుముగాపారిన నాగులేరాయె
కన్నులపండువై కంపించెచూడు
ఉభయపక్షంబుల ఒప్పైనబలము
నివసించియున్నది నిశ్చలమతిని
హద్దులుచెప్పెద నవిచిత్తగింపు

జువ్వలకల్లను సొగసైనపల్లె
సన్నెగండ్ల అనంగ జవరనియూరు
తూరుపుదిక్కుకు తుదుమేరసుమ్ము
దక్షిణదిశహద్దుతగ వివరింతు
నాగులేటికి తూర్పు నలగొండకాని
చెలువైన ఆవప్పిచెర్లచెలంగు
పడ్మటికినిహద్దు బాలచంద్రుండ
కొదమగుండ్లయనెడి గురిగ్రామమొకటి
ప్రజలమేలిమి చింతపల్లెయునొకటి
ఉత్తరదిశయెల్ల లొయ్యనగాంచు
ఇకగొన్ని గురికొండ్లనేర్చెదవినుము
జన్నిదేవరగుళ్ళు సవనాలమేడ
వంగతోటలబైలు వన్నియకెక్కు
సింగభూపతిచెర్వు శ్రీకరమైన
సంగడిగుళ్ళును సర్వేశుడైన
ఉత్తరేశునిగుళ్ళు నూర్జితాకృతిని
ఉయ్యాలకంబంబు నున్నట్టితావు
గరుడకంబముదాకి కలజువ్విచుట్టి
నలగొండనుహత్తి నాగులేరంటి
విడిసియున్నదిదండు విభవంతోడ
ఆశ్చర్యమైతోచె అదియేమొమదికి
నరనాథుడైనట్టి నలగామరాజు
గొల్లెనచుట్టును గూడికాపాడు
సేనాధిపతులను చెప్పెదవినుము
పడమటిదిక్కున పౌజులబ్రహ్మ
సంకోజిగణపతి సరవితూర్పునను
నాయకురాల్ దక్షిణంపుదిక్కునను
దంటలైయుండిరి దక్ష్తమెరయ
అందెలరాముండు నానెమలిపురి
ముమ్మడీరెడ్డియు మొనతీర్చినట్టి
పొందుగలనేలు భూరివిక్రముడు
వీరమల్లనునట్టి విఖ్యాతుడొకడు
ఉత్తరభాగాననుండిరివేడ్క
ఇందరినెల్లను హెచ్చరించుచును
తిరుగుచునరసింగ ధీవరుడుండె
విక్రమసింహంబు వీరకామేంద్రు
డబ్భంగిసేనతో నచ్చటవిడిసె
మాన్యబలుండైన మలిదేవుసేన
మార్కొనియున్నది మనసుంచికనుము
ఘనమైనతురగముల్ కాలిబలంబు
బల్లానిపెట్టెలు పటువీరవరులు
మహితనాగానది మడుగండచేసి
వరలురేవంతుని బైలులోపలను
దీపించుపడమటి తీరంబునందు
పరవీరభయదమై బలమెల్లవిడిసె
చాలుపుతేరులు సమదేభములును
మనవారికెనయైన మానవుల్ గలరె
ఒక్కకవీరుడే యొక్కొకలక్ష
దళమునుసమయింప దగియున్నవాడు
చెలువైననలగాము సేనకునెదిరి
కడలికిచెలియలికట్ట చందమున
మనబలమున్నది మహిమమీరంగ
అనితెల్పుదోర్నిని కనియెబాలుండు

మలమెల్లసాంద్రమై వ్యాపించిదిశల
కిక్కిరిసిచెలంగు కేరివీక్షింప
ఎక్కడసందులే దిసుమంతయైన
మార్గంబుగానదు సూక్షంపుచూడ్కియును
రాడాయెనంచును రాజుచింతించు
ఆలస్యమిచ్చటనాయెను మనకు
అపకీర్తిపాలౌదు ఆడికవచ్చు
తెంపుననొకదిక్కు తెగటార్చికొనుచు
శౌర్యసంపదమీర చయ్యనబోయి
కలసినవీరుల కలహించిమనల
ఎంతకోపింతురో యేమిపల్కుదురొ
ఆరువదేగురునుతా మటులుండగానె
పడుచుతనంబున బాలుడువచ్చి
యెంగిలిచేసి నాడెదుటిబలంబు
నేమందమీపట్ల నీపిన్నవాని
అనినిందచేయుదురల జడియగును
తెగనికార్యంబాయె తెలియదుమనకు
ఇరుగడవారల ఇచ్చలీవేళ
ఎబ్భంగిదెలియుద మెవరుచెప్పెదరు
సంధికార్యంబింత సమకూడెనేని
విచ్చిన్నమైపోవు వేడుకతగ్గు
పొందినకార్యంబు పొసగంగనీక
పగతెచ్చెవీడని ప్రజలాడగలరు
నవ్వుదురవనిపుల్ నామోముచూచి
చీకొట్టగలరిక సిగ్గెల్లబోవు
నాతండ్రికొడుకని నన్నుచేపట్ట
డనిపలువిధముల హర్షంబుతగ్గి
పలుకంగచెలికాండ్రు బాలునికనిరి
వినుబాలచంద్రుడ విద్విషద్భయద

పరశురాముడవీవు బాహులబల్మి
పరగజహర్యక్ష పావనమూర్తి
శౌర్యగంగాధర సర్వఙ్ఞచంద్ర
కదనగాండీవికి కడుపునబుట్టి
ఈనిందపొందుట కేమికారణము
కులవైరముదీర్చి కొనవలెభూమి
పోనివ్వగూడదుపోరు నిశ్చయము
కూర్మితోమలిదేవు కొల్వులోజొచ్చి
వీరులగనుగొని వేడ్కమైమ్రొక్కి
కలనిలోమీరున్న కారణంబేమి
ఆనతిందనివారి నడుగంగవలయు
కామునితో సంధికార్యంబుచేయ
ఉన్నార మితరంబులొప్పవుమాకు
అని మాటలాడిన ఆవలికేగి
దర్శింతమప్పుడు ధరణీశవరుని
రాజుపంపంగబోయి రణమొనరింప
ప్రాప్తమౌ దేవేంద్రపట్టణవాస
మనిపల్కబాలుండు హర్షంబునొంది
శైలంబుపైనుండి సాహసంబొప్ప
బిట్టుర్కెభూమిపై పృథ్విపుల్వడక
బలువైనమందర భ్రమణంబుకతన
కలతచెందినయట్టి కంథిచందమున
తరితీపుప్రాపించి ధైర్యంబువదలి
బలమెల్లభయపడి పారగసాగె
తురగముల్ గజములు ధూళిమిన్నలను
బంధములూడ్చుక పరువులుపెట్టె
దండెల్లనీరీతి దత్తరమొందె
తమ్ములుబలమును తనవారలెల్ల
కలసిరిబాలుని ఘనమోదమలర
అంతట ఆబాలుడధికశౌర్యమున
పరిఘముల్ టెక్కెముల్ బలుసాధనములు
శస్త్రమైతగు భద్రసాలేయమనెడు
జగజంపుచత్రంబు జయమునగొన్న
సకలమౌబిరుదులు సరసరంజిల్ల
భయదమై నరసింగుపాలిటిమృత్యు
వీరూపమునవచ్చి యెదిరించెననగ
బ్రహ్మన్నతనయుడు పటుసాహసుండు
డెదుటనిలకుడంచు హెచ్చరించుచును
బలములన్నిటి పాయదోలుచును
మలిదేవు గొల్లెనమార్గంబువట్టి
వచ్చెడుచందంబు భావించిచూచి
సంధికార్యమునకు చనుదెంచినట్టి
దొరలమొగంబుల తొలగెతేజంబు
వెలవెలబారుచు వేడుకలుడిగె
ఒకరిమొకంబొక్క రొయ్యనజూచి
ఇకనేమిచక్కటి యేమికార్యంబ
దితడురాకుండిన నెసగునుసంధి
ఇకసాగదెవ్వరి హితవిచారంబు
దైవకృతంబేరు తప్పింపలేరు
అనిచింతసేయుచు నక్కటాయనుచు
కళతప్పినిలిచిరి కడుచిన్నపోయి
మలిదేవభూపతి మంత్రియైనట్టి
బ్రహ్మనీడాతని బంధువర్గంబు
సమరసంతోషులఒ సకలవీరులును
కొల్వుకూటంబున కూర్చుండిరెలమి
బాలచంద్రుండంత ప్రాభవంబొప్ప
రాచబిరుదులతో రంజిల్లుచుండి
తమ్ములుకొల్వగ దరగనివేడ్క
వనజాప్తసుతురీతి వచ్చెనాసభకు

వీరులుకైతవ విభవంబెసంగ
కార్చిచ్చుభంగినికనలి కోపించి
భూవరుదర్శింప బోవసందీక
ఉన్నభావము బాలుడొయ్యనదెలిసి
సౌందర్యసాంద్రరాజ సభాస్థలంబు
కనుగొంటి సంతోషకలితుడనైతి
విష్ణుసన్నిబుడైన విభునిజూచెదను
తెరువీయవలెమాకు ధీరాత్ములార
అనదానిఆలింప మెప్పుడుకినిసి
బాసదబ్బరగండ బ్రహ్మన్నసుతుడు
మండుకారడువుల మంటచందముల
రణరంగమునయందు రాజిల్లువాడు
ప్రారబ్ధకార్యంబు వదలనివాడు
కొరుగానికోరులు కోరనివాడు
సుఖదుఃఖభేదంబు చూడనివాడు
తనదేహకష్టంబు తలపనివాడు
పరులకార్యములకై పనిచేయువాడు
పల్నాటివారికి బ్రాణహితుండు
మహివీరవరులకు మార్గదర్శకుడు
వాసిగరేచర్ల వంశవర్ధనుడు
ప్రయతచిత్తుండగు బాలచంద్రుండు
పదములుదట్టించి బాహువులెత్తి
సాహసోత్సాహుడై శౌర్యంబుమెరయ
కలికిసింగపుపిల్ల గంతుకొన్నట్లు
కుష్పించిదుమికెను గురుజవమొప్ప
వసుధేశుసన్నిధి వ్రాలెనువేగ
పిడుగుపడ్డవిధంబు పృథివికంపించె
సన్నిథినిల్చుండి జగదీశుజూచి
అతిభక్తిమ్రొక్కిన నటుమొగమాయె
కడుభయభ్రాంతుడై కరములుమోడ్చి
ఏమిచేసితిరాజ యేలకన్గొనవు
నాయందుతప్పేమి నన్నేలువాడ
అనిప్రార్థనముచేయ ఆకొల్వులోన

గాసిల్లుకన్నమ కడురోషవశత
ఉలికిపాటునలేచి ఉగ్రుడైమెరసి
ఘనరౌద్రభరితుడై కడ్గంబుదూసి
చయ్యనకళిపించి సభజూచిపలికె
కంతిరాబాలును గద్దరిపనులు
తనసాటిబలియుడు ధరలేడటంచు
మత్తిల్లిమరచెను మావంటివారి
చులకనైతిమి వీనిచూపులకేము
దండిశూరులచూడ దట్టించినిన్ను
ఖండించివైచెద గనియలుగాగ
ఏపాటిదంటవు నీవుమాకన్న
మాపేరువిన్నంత మదిలోనబెగడి
ఉభయదళంబులు నులుకుచునుండు
సభలోననీవుంట సహ్యంబుగాదు
సరసుడవగుదువు చయ్యనచనిన
అనవినియాబాలు డప్పుడిట్లనియె
బంట్లుమీరలుగాక బవరంబునందు
మేమేడబంట్లము మీసాటిగాము
సరిగబంచినయూళ్ళు సర్వంబువిడిచి
విపినశైలంబులు వేసటలేక
తిరిగితిరెవ్వరు దీటులేరైరి
వాగులనీళ్ళును వనములబండ్లు
తినుచునుమితియైన దినములన్నియును
జరగగాజేయుచు సమరంబుమరచి
ఉన్నందుచే వీరయోధులౌమీదు
స్థూలఖడ్గములకు త్రుప్పులుపట్టె
పాపికొనగమీకు బవరంబులేదు
పగవారుకన్నుల బడకున్నవారు
పగచేసిమముగూల్చి పాపికోత్రుప్పు
సభలోననేనిట్లు చౌకళించితిని
పార్థివుబొదగాంచ వచ్చినయప్పు
డెవ్వరునెడమీయరే నీతిచెపుమ?
పంతంబుచెడినేను బ్రతిమాలలేక
ఒయ్యనమీదుగా నురవడిజనితి
తప్పేమినాయందు దగవర్లనడుగు
కులవైరముందీర్ప గూర్చుండుటేమి?
పరభూములందెల్ల పరువులువారి
వనములకృశియించి వచ్చినందునను
మేనునబడలికల్ మించెనోయేమొ
ఆరీతిబడలికలంటెనా మీకు
పగవారివిస్తరి బండికన్నగును
భావించికొనదగు ప్రౌఢులుమీర
లనినకన్నమపల్కె నాబాలుతోడ
పడుచువాదవునీవు పలుమాటలేల
కొలువులోవిషయంబు గురుతెరుంగకయ
ఈతేపపలికిన నీకత్తిచేత
తలతెగవేయుదు ధరణీశునెదుట
అనినతామసపడి అపుడుబాలుండు
కులశైలధీరత గొబ్బునపలికె
కడలిమధ్యంబున గడ్డయున్నట్లు
వ్రాలియున్నారు శాత్రవులమధ్యమున
మున్నీరుపెరిగినా మునుగునుదిన్నె
శాత్రవబలములు సమయంబుచూచి
నల్దిక్కులనుద్రొక్కి నడచినవేళ
ఏమౌదురోమీర లెరుగకయుండి
రిదివిచారింపక యేలవచ్చితిరి
మీరుమాత్రమేరాక మేదినీశ్వరుని
ఏటికిదెచ్చితి రీస్థంబుకు
ప్రజలాడికొనుటలు పరికించివినరు
గొల్లెనలోజేరి కోపంబుచేసి
పదరినమాత్రాన ఫలమేమిచెపుమ
బ్రహ్మనాయుడు నీకుబంధువుడెట్లొ
వినిపింపుకన్నమ వివరంబుగాగ
అనినకన్నమపల్కె నాతనితోడ
నాయుడువిష్ణువు నారాయణుండు
ప్రకటదయాంబుధి వరములొసంగె
తగజనించితినేను తల్లిగర్భమున
పరమపావనమూర్తి బ్రహ్మనాయునికి
పాదసేవకుడనై పరిగినవాడ
భుజముద్రలు పూనినవాడ
క్షుద్రమార్గులనెప్డు చూడనివాడ
ప్రాసాదజీవినై ప్రబలినవాడ
జేష్టపుత్రుడనంగ చెలగినవాడ
పుట్టితివీవెంక పురుషోత్తమునకు
దట్టించిపలికెదు ధరణీశునెదుట
పడుచువాడవునీకు వాగ్గర్వనేల
అనవినిఆబాలు డప్పుడిట్లనియె
చెలగిబ్రహ్మన్నకు జేష్టపుత్రుడవు
తలదన్నిపుట్టిన తమ్ముడనేను
కదిసీగ్రజుతొడల్ గద్దెలుచేసి
త్రొక్కుచుబోవచ్చు తొడరినకూర్మి
ధరణీశుబొడగన దాటితినన్న
అంతమాత్రమె సుమ్మ హంకారమెరుగ
అనిపల్కకన్నమ అటతలవంచి
భైరవఖడ్గంబు పడవైచిధరణి
చిరునవ్వునవ్వుచు చేరిసోదరును
ఒనరంగనెత్తుక ఉర్వికిదించి
తప్పునాయెడనుండె తమ్ముడాయనెను
బాలచంద్రుడు హర్షభవమునొంది
భ్రాతలునుందాను రాజునుజూచి
జోహారుచేసిన చూడకాభూపు
డూరకతలవంచియుండెను బాలు
డందుకువెరగంది అనుజులకనియె

తెలిసెనా? ధరనీశు తెరగెల్లమీకు
పగతీర్చికొనుటకు బవరంబుచేయ
మితిమూడునెలలని మేకొనిచెప్పె
మదిలోననామితి మరచనొయేమొ
యెండకన్నెరుగని యీరాజవంద్రు
దవనిశాత్రవులకు నర్పించిపెక్కు
కానలద్రిమ్మరి కాయంబుడస్సి
నీడలనిలచిన నీళ్ళెల్లద్రావి
పొలపుకూరలుచాల భుజియించెగాన
పసరుకన్నులకెక్కి పలుకకున్నాడు
మంచిమందిచ్చిన మానునువేగ
అనిపల్కుమాటల కదరుచుగండు

కన్నప్పయల్లుని గనికోపకలన
భర్జించీనువైన పల్కులననియె
ఇటువంతిమాటల నేమిఫలంబు
తప్పంతమనయందు దట్టమైనిల్చె
ఏరీతిననియెదవే నెరిగింతు
పగవారిచర్యలు భావమందెరిగి
కులవైరమునుదీర్చికొనుటకు మనము
వచ్చుచుతగవుకు వసుధాతలేంద్రు
తెచ్చుటయొకతప్పు త్రిపురాంతకమున
కలహమేర్పరచక కలనుకంబంబు
తర్లింపరెండవ తప్పనియెరుగు
కంకణంబులపల్లె కడహస్తములను
కంకణధారణ కాంచమూడవది
తెగిరణభూమిలో దిగిటనాల్గవది
తరిమిశత్రులువచ్చి తార్కొన్నపిదప
కలయవిచారించు కార్యమైదవది
యీయైదునేరము లెవ్వరివగును?
పంచాపరాధముల్ వైరులయందు
కలవవిచెప్పెద గ్రహియింపగడగు
సరిరాజ్యమోర్వక సంగ్రహబుద్ధి
కోడిపోరునగెల్చుకొనుట మొదటిది
వనులకుపంపుట వరుసరెండవది
జామాతజంపుట సరవిమూడవది
భట్టునుమనవారు పంపించినపుడు
వెళ్ళదోలించిన విధమునాల్గవది
కూతువమూకల గూర్చుకవచ్చి
గర్వించినిల్చిన కార్యమైదవది
ఎక్కువతక్కువ లీరీతినుండ
తెలియకధరణీశు దెగిమాటలాడ
అపరాధమంతదా యదినీతియౌనె
యెక్కువమాటల నికనాడబోకు
మనసురాకుండిన మగిడిపోవేగ
అనిపల్కుమాటల కాబాలుడనియె

మేరతప్పెనటంచు మీరిపల్కితివి
మేటిబ్రహ్మన్నవాకు మితితప్పరాదు
చుక్కలురాలిన సూర్య్డుతప్పి
పడమటబొడిచిన పాథోథిమించి
చెలియలికట్టపై చెంగలించినను
చల్లనైననువహ్ని సత్యసంధుండు
నాయునిమాటకు నమ్మికగలదు
పగవారికలుకుచు పలికితివయ్య
ఇటువంటికార్యము లెందుకుజరుగు
పగవానిసేనళొ బల్విడిజొచ్చి
కరములుశిరములు ఖండించివైతు
దగ్ధముచేయుదు దావాగ్నిరీతి
చిన్నవాడంతివి చెలగియీకలన
అలనాడుగురిజాల నయినట్టిపగకు
చేపట్టియిల్లడ చేయగాలేదె
అప్పుడుబాలుడనౌదు అఖిలభూపతుల
కెదిరియుద్ధముచేయు నేనిల్చినప్పు
డపకీర్తిమాటల నాడుటతగవె
వినగూడదీమాట విడువుముచాలు
అనిచెప్పిసభలోన నందరువినగ
వీరులవేర్వేర పిలిచిరోషమున
మలిదేవుసన్నిధి మండుచుబలికె
ధీరాగ్రనీవంకి దేవరాజేశ

వీరుడనిపేరు వెట్టుకనివి
బ్రతికియుందంగనే పగరునీసుతుని
పట్టిచంపిరిగదా భయమింతలేక
శౌర్యంబునీయందు చచ్చెనాయేమి?
ముక్కుదూలముమీద బొడిచినయపుడు
గుర్రుమనగలేని కోపమెన్నటికి
శంకింపగానేల సమరంబుకదిసె
తీరనిసుద్దుల దెగజాలవేల
ధనువుశింజినిలాగి ధ్వనిచేసితేని
బ్రహ్మండభాండము ల్పగిలినట్లుండు
ఎనలేనివిలుకాడ విటువంతినీవి
తనయునిచావుకు తాళెదవెట్లు?
ఆవాలనాయుడా అపుడుపంతములు
పలికిననీవేల పరవశుడైతి
తలపోయగా వీరధర్మంబుమరచి
నిద్రించుచుండుట నీతియెనీకు
విముఖతలేనట్టి వీరుడవీవు
కట్టితివిదెకాశ కత్తిపట్టితివి
పగయీదలేనట్టి పౌరుషమేమి?
మితిమూడునెల్లాయె మెదలకున్నావు
నీవంటిజగజట్టి నేజూడలేదు
మామకన్నమనీడ మగటిమియేది
కదలనికంబంబు కాలిసంకెలలు
పొందించిచావుకై పూనినిల్చితిరి
కంబంబుచెదలంటె కదలించిచూడు
సుంకరరాముడా చుట్టుడొంకెనలు
త్రుప్పులుపట్టెను దొడరవదేల
చెవులనాయకులార చెరగెడుబంటు
లిచ్చగించరుమది నెంగిలిపోటు
మేటిశూరులనాటి మెచ్చనియట్టి
నమ్మినజంగిలి నాయకులార
తగుజల్లికేడెముల్ దండచక్రములు
పోగొట్టిపోరయ్య పోరుమీకేల
వీరయోధులుగదా పెనుమలవారు
గాయగోవాళాఖ్య గలబిరుదములు
పగతురుగనకుండ పాతుడిభూమి
బాదన్నరాహుత్త పాటవమేడ
సంపెటనారన్న జయమగుబిరుద
మెక్కెడికేగెనీ వెందుదాగితివి
జడతనిద్రించెడు శౌర్యాత్ములారా
యుద్ధతయుద్ధ సూర్యోదయంబయ్యె
తరచుగాగల్య కర్తవ్యముల్ గలవు
లెండుకాలంబయ్యె లెండులెండిక
అనిబాలుడుగ్రుడై అదలించిపలుక
వినిబ్రహ్మనాయుడు వేగమేలేచి
తనయునికెదురేగి తాగారవించి
అర్ధాసనంబున ఆసీనుజేసి
వలనొప్పదంటగ వచ్చినవారి
కొల్వుకుబిలిపించి కూర్చుండుడనిన
కూర్చుండిరందరు కూరిమిమెరయ
కూర్చినవారల కుశలంబులడిగి
తనకార్యమంతయు దగవినిపింప
వినిబాలుడీర్ష్యతో వివరించిపల్కె
శాత్రవులలరాజు చంపినయట్టి
కోపంబుమదిలోన గూర్చుటమాని
పందమాటలుపల్క పంతమామీకు
ఉద్వేగభరజనితో గ్రరోషాగ్ని
భస్మీకృతాఖిల పరరాజవిపిన
బ్రహ్మన్ననాతోడ బల్కకుమయ్య
వదలకరాజును వంచించినపుడె
నాచేతికత్తితో నాయకుల్ జూడ
తలతెగగొట్టుదు ధరణీశునెదుట
సత్యంబుపల్కితి శంకనాకేల

అనకొమ్మభూపతి అల్లునిడాసి
వినయంబుతో రెట్టవిడువకపట్టి
నాయన్నవినుమయ్య నలినాప్తతేజ
సంధికార్యంబేగి శత్రులచేత
పరగజచ్చినవాడె బాలుడుసువ్వె
అరయమాసుతుడైన అలరాజువీవె
వచ్చిమనలజూచి వారనిభీతి
బిరుదులుత్యజియించి పిరికిపారుచును
అనుజునిలోబడి అర్చించినపుడె
క్షత్రియజాతికి చచ్చుటసుమ్ము
చలమునబోరాడ సారస్యమేమి
చేతికిచ్చినశత్రు చెలగివధింప
పలుపాతకంబని పల్కెవేదంబు
లెన్నిజన్మములకు నేక్రియనైన
పాయదుపాపంబు పట్టిపీడించు
అనియితిహాసంబు లతనికిజెప్పి
కౌగిటజేరిచి కడుబుజ్జగించి
మనసుపెట్టకుమన్న మసలకుమన్న
మామాటవినుమన్న మన్నింపుమన్న
వినిబాలచంద్రుడు వినయుడైయుండె
చలమెల్లవిదనాడి సంధిమేకొనిరి
తరువాతకొందరు దర్పముల్ మీర
నేచేటుపాటైన నేమిమాకేల
విందులుభుజియించి వేగమెపురికి
పోవలెజాడ్యంబు పూనకుడనిరి
ఇరుపక్షములవారు నింపుసొంపెసగ
పొదలిన సంతోషముననాడుచుండి

రంతటమేడపి కనపోతుచేరి
మాంచాలమేడకు మక్కువనేగి
వినయంబుతోడ ఆవెలదిజూచి
పల్లవమృదుపాణి బంభరవేణి
కంజాతలోచన కరిరాజగమన
శంబరరిపుబాణ సాధుసమ్మాన
గంధఫలీనాస కౌముదీహాస
పావనగుణసీమ భామాలలామ
అధరనిర్జితబింబ అధికనితంబ
వరవసంతునివీక వనములచిలుక
లావణ్యవదన ఓరాకేందువదన
రమణినేవచ్చిన రాకనాలింపు
అన్నబాలుడుపంపె అతివనీవద్ద
ముత్యాలహారంబు ముద్దుటుంగరము
కలవవితెమ్మన్న గదలివచ్చితిని
మరచినవస్తువుల్ మాచేతికిమ్ము
త్వరగబోవలెనేను బాలునికడకు
అన అనపోతుతో ననియెమాంచాల
యేమానవాలయ్య యీపదార్థముల
కనబ్రాహ్మణోత్తము దావెనుజూచి
కూరిమిపాంపుపై కూర్చుండితాను
పైటకొంగయ్యన బట్టిలాగినను
ముత్యపుచేరులు మెదటికితెగిన
అవికానలేకుంట ఆనవాలమ్మ
అనవినిమాంచాల అవునయ్యతత్వ
శస్త్రముల్ వేదముల్ చదివినవాడ
వెరుగవైతివిగదా యీరహస్యంబు
తమ్ములుపిలిచిన తరితీపుతోడ
విడివడ్డముత్యముల్ వెదకికూర్పంగ
వ్యవధిలేకుంటచే బాలుడువెడలె
మాటతెల్విడినీవి మదివిచారింపు
కారణమేలేదు కలనికిబోవ
మీయన్నబాలుని మితిచేసినారు
పొసగపట్టము గట్టమూడుమాసములు
మితివెళ్ళెగావున మీవారిగలయ
చనియెనుమీయన్న సమరంబుకదకు
వీరమేడపినీవు వెలయరక్షింప
బాలచంద్రుడునీకు పట్టముగట్టె
అందుచేరణమున కరుగంగగూడ
దనవినిబ్రహ్మణు డత్యుగ్రుడగుచు
విముఖుడైయచ్చొటు వెడలియేతెంచి

శామంగియింటికి చయ్యనవచ్చి
పలికెనాయనపోతు భామతోనపుడు
ముత్యాలగళమాల ముద్దుటుంగరము
మరచివచ్చితినేను మగిడినీవేగి
అడిగితెమ్మని పంపెనానవాలడిగె
కదళీఫలాలపైకల్గుచర్మంబు
యిచ్చితిఫలమని యిదియానవాల
టన్నభామినినవ్వి అనపోతుకనియె
ఆసలేనట్టియీ ఆనవాలంది
యెందుకువచ్చితివిది పొల్లుమాట
మరచుటదాచుట మావద్దలేదు
మాయమాతలుచెప్పి మరపంపించె
కనలేకవచ్చితిగద భూసురేంద్ర
అనిపల్కబ్రహ్మణు డమితరోషమున
వెడలుకోపాగ్నిచే వెడలెనువేగ

కదలిఆత్రిపురాంతకమునకువచ్చి
బాలునితెరగెల్ల ప్రజలనునడిగె
ఆతీరుమేమేమి అరయుటలేదు
మూకలుగూడెను ముందరిదెసను
తెలిసికొమ్మనివారు తెల్పదీవ్రముగ
అచ్చటికేగియా అవనీసురేంద్రు
డశ్వత్థతరువున కమరించినట్టి

పొందైనపత్రిక పుటనెగనెత్తి
తిన్నగాజదివె నీతీరునదాని
శ్రీగిరీశునియాన చెన్నునియాన
మలిదేవరాజాన మాతండ్రియాన
అర్వదార్గురువీరు లందరియాన
త్రోసివచ్చితివేని ద్రోహమంటెడును
బాలునిమిత్రుల ప్రాణంబులకును
తప్పినలాగౌను తరలితివేని
ఆనలుమీరుట అదినీతిగాదు
తనసంగడీలతో తరలెబాలుండు
సాహసముననీవు సాగిరాగూడ
దనునట్టికఠినంపు టానలుచదివి
చండాగ్నిపైనూనె చల్లినరితి
భీకరకోపాగ్ని పెనగెచిత్తమున
అప్పుడుభూసురు డధికదుఃఖమున

దంతనౌననువీడ ధర్మమానీకు
మంచితనంబున మన్నించినన్ను
పొమ్మన్నపనులకు పోయితిగాని
తప్పానవాలని తలపకపోతి
నిజమనిచెప్పిన నీయానవాలు
తబ్బిబ్బటంచెగ తాళిసలిపిరి
నిజమువిచారించి నీవున్నకడకు
వచ్చితివిదనాడి వడినెగినావు
వగవనేనందుకు వరగుణశాలి!
నీనాతిమాంచాల నీపొందుకత్తె
హాస్యంచేసినారానవాలెరిగి
వెంగలినైతిని వెలమలవద్ద
కలిమికోసమువచ్చి కలియుటలేదు
కులమునకొదవని కూడుటలేదు
తల్లినిదండ్రిని దాయాదజనుల
ఎడబాసినీపొందు నేనమ్మియుంటి
పగవాడనైతిని బాంధవతతికి
పాసిపోదగునయ్య బ్రహ్మన్నతనయ
కెళ్ళుగాబోయితి ఖిన్నునిజేసి
న్యాయంబువిడనాడి నమ్మినవాని
ఒంటరిగానుంచ నొప్పెనాచిత్త
మెన్నడునాలావు నిసుమంతైన
కనుగొనవైతివి కట్టిడివాడ
బ్రహ్మణుడితడు బవరంబుచూచి
భయపడునంచును భావించితకట
అటులైనజూచితే అనిలోననన్ను
బ్రహ్మణమరణంబు పాపమటంచు
చనితివిదయలేక సర్వఙ్ఞచంద్ర
ధర్మశాస్త్రంబుల దారినీకెరుక
తనునేలినట్టి ఆధ్రణీశునెదుట
స్మరంబులోపల చచ్చినయపుడు
పాపమనగరాదు బలిమినిబట్టి
ఖండించివైచిన కలిషంబువచ్చు
ద్రోణుండుకృపుడును ద్రోణసుతుండు
సమరంబుచేయరా సాహసమొప్ప
గురువైనద్రోణుండు కూలెయుద్ధమున
ఆకిల్బిషమ్మంటె నాయేరికైన
ఈవెరుగుదుదీని నింతిమాటలకు
నన్నెడబాసితి నాకర్మమేమొ
కామునుబలములు కదిసినమీద
బల్లియములవారి బవరంబునందు
గెలువగవెలెనంచు కేరుచునుంటి
ఈతెరగాయెను హితమైనవాంచ
యేమిసేయగలాడ నేమందువిధిని
అడవిపాల్చేసితివన్న! సోదరును
వీరవిక్రమయుద్ద విభవంబుగనగ
భగ్యంబులేదాయెపాపినినేను
పూర్వజన్మంబున పొందులుదీసి
యెవ్వరెవ్వరినినే నెడబాసినానొ
అనుభవింపగవచ్చె నాఫలంబిప్పు
డీవుపాసినయట్టి ఈదెహమొల్ల
జన్మమెత్తితిగాని సఫలంబుగాదు
సఫలంబుకాని యీజన్మంబదేల
తనవారిరక్షింప దరివచ్చినపుడు
వినియోగపడనట్టి వీరరక్తంబు
రక్తమే కలుషనీరంబగుగాక
ఉప్పొంగుచున్నది యుజ్వలశక్తి
అడగదునెనెంత అడచిననైన
దహియించుచున్నది దావాగ్నిరీతి
ప్రాణంబులికనేను బట్టగజాల
తివిరివ్యర్థంబైన దేహంబువిడుతు
స్వర్గలోకమునందు బాలునిరాక
కెదురుచూచుచునుందు నెంతయోవేడ్క
పుణ్యనివాసంబుపొందియునుందు
అనిచింతసేయుచు నయ్యయోయనుచు
ఉన్నంతలోపల నొయ్యననపుడు
గరిగెమాడచియను కాంతయొకర్తు
వీరమేడపినుండి వీరులగలయ
చనుదానినచ్చోట చయ్యనజూచి
అంజలిచేసినా డనపోతుతెలిసి
బ్రఆహ్మణుడాయిట్లు పలుకంగరాదు
తగమునీవొనరించు దండముగొనగ
ఏలయిచ్చటనుంతి రెరిగింపుడనిన
అనపోతుమాడచి కనియెనావేళ
బాలునికలనికి పంపియిచ్చోట
నిల్వగారణమయ్యె నెలతరోనాకు
అన్నబాలునికిదే అంజలిచేసి
విన్నవించెదనేను వినిపింపవమ్మ
నామాటగాచెప్పు నాసోదరునికి
కూరిమితమ్ముల గూడుకనన్ను
వలదనిపోయితి వగచినవాడ
ఆలస్యమికచేయ నాయత్తపడితి
ఇందులకిల్బిషం బెనయదునీకు
నీరాకచూచెద నెస్వర్గమందు
ననుగూడరావయ్య నాబాలచంద్ర
అనిచెప్పిమదిలోన నథికనీయతిని
ఈషణ్త్రయమునం దిచ్చనివదలి
ఇంద్రియదశకంబు నేర్పడనిల్పి
తల్లిదండ్రులనెంచి దండంబుపెట్టి
పరమాత్ముమదిలోన పాయకతలచి
అడపంబువారిని అతిప్రీతితోడ
గొడుగువారినిప్రేమ గూడగబిలిచి
వెరతురురక్తంబు వెడలుటచూచి
యీదెసనిల్వక యేగుడుతొలగి
పాపమనుచునున్న పట్టంగబోకు
అనిచెప్పిబ్రాహ్మణు డత్యంతభక్తి
ఇంటివేల్పులనంగ నేర్పడియున్న
శ్రీగిరిలింగంబు చెన్నకేశవుల
భక్తితోప్రార్థించి ప్రభుడైనయట్టి
బ్రహ్మన్ననామంబు భావించియెంచి
సంగడీలనుచాల సన్నుతిచేసి
బంగారుజందెంబు పాదంబుబిరుదు
మాడచికినొసంగి మన్నించినీవు
బాలునికిమ్మని పణతికిజెప్పి
తనతలగోసుకధరమీదవ్రాలె
తలఆవలించెను దటుకుననెగితి
కన్నువువిప్పెను ఘనముగనవ్వె
ఎటువంటిభావంబొ యీశ్వరుడెరుగు
వెస అడపమువారు వెతగొడ్గువారు
తద్గతితెల్పిరి తల్లితండ్రులకు
వినిమూర్చనొందిరి వేగమెవారు

కొంతసేప్టికిని కొంచముతెలిసి
కుందుచుజనుదెంచి కొడుకుపైవ్రాలి
రొమ్ముగ్రుద్దికొనుచు రోలుచుబడుచు
తనయుడామాపుణ్య దశయిట్టులాయె
మాయచావయ్యెను మాముద్దుకొడుక
ఇచ్చోటనుండెనా మృత్యువునీకు?
చెలువుడామమ్మేమి చేసిపోయితివి
చెలికాండ్రకేమేమి చెప్పిపోయితివి
మాకోర్కులెల్లను మంటగల్పితివి
కటాకటాకడుపును కాల్చిపోయితివి
మూడుకాళ్ళముసళ్ళ ముంచిపోయితివి
బాలచంద్రునెపుడు పాయగలేవు
నాల్గువేదంబులు నయమొప్పజదివి
అఖిలదేశముల విఖ్యాతిగాంచి
చెల్లితివానేడు చెలికానివిడిచి
దైవమానీకెంత దయలేకపోయె
అనిచింతనొందుచు నయ్యయోయనుచు
కంతికిగడవెడు గాగనేద్చుచును
విలపించుచుండగ విప్రబాంధవులు
కాలంబునేటితో గడచెనీతనికి
నిప్పుడోయెప్పుడో యీశరీరములు
పడిపోవగలవు శాశ్వతములుకావు
జన్మించువానికి చావునిక్కంబు
చైతన్యమెడలిన శవమునుగూర్చి
విలపింపబ్రతుకునా వెఱ్ఱితనంబు
దహనకార్యముచేయ దగునంచుబలుక
గంధపుచెక్కలు ఘనకాష్ఠవితతి
తెప్పించిపేర్పించి తీర్చిరివేగ
తగుశాస్త్రమార్గంబు తప్పిపోకుండ

కాయవెంజడిరాగ సమ్మతిరాగ
దంపతులిద్దరి దహనునికిచ్చి
చనిరిగేహములకు స్నానముల్ చేసి
అంతటమాడచి ఆయత్తపడుచు
తరచునెత్తుటిచేత దడిసినయట్టి

బిరుదునుజందెము పెట్టెలోబెట్టి
ఆందోళికారూఢయై త్వరితముగ
చనుదెంచిధరణీశు సన్నిధినిలిచె
విందులుభుజియింప వివరంబుగాను
వీరులుదొరలును వేడుకమీర
పఙ్తినిగూర్చున్న బానసీలపుడు
వండినవస్తువుల్ వడ్డించినపిదప
చమురులువడ్డించు సమయమునందు
మాడచియటయేగి మదిదలపోసి
తెలిసిమేడపినుండి తెచ్చినయట్టి
మధురవస్తువులెల్ల మరవకైచ్చి
పలికెబాలునిజూచి పడతిధైర్యమున
వీనికంటెను కడుప్రియమైనమేలు
వస్తువులివిగొన వలయునటంచు
తరచురక్తంబున దడిసినయట్టి
జందెంబుబిరుదంబు చయ్యననిచ్చె

చూచినయంతనే చూరికాగ్రనను
పక్షంబుబొడిచిన వడువుంగలగి
బాలచంద్రుండులేచి పగరువునంగ
పెడబొబ్బపెట్టెను పృథ్వీశులదర
ఒప్పినవారునువిరు నొక్కటియైన
శంకింపకెదురెక్కి శాత్రవచయము
బారులపైబడి ప్రకటశౌర్యమున
బ్రహ్మప్రముఖ వీరవరులనుగదిసి
అనిలోనముందుగ హతముగావించి
తరువాతకాముని దళముపైదుమికి
కాలిబలంబుల గజవాజివితతి
పీనుగుపెంతలు పెల్లుగాజేసి
తమకించి నరసింగు తలనుఖండించి
కొమ్మభూపతికిచ్చి కులవిరోధంబు
తీరిచిపంతంబు దీర్చెదజూడు
అనిబాలుడాడిన అప్పుడుతెలిసి

వీరులుదొరలును వేగమెలేచి
సంధికార్యముమాని జాహ్నవికేగి
ఆమడ్గులోవేసి రన్నమంతయును
చివరకుకార్యంపు స్ఠితివిచారించి
రాయబారులతోడా రాజులిట్లనిరి
కాకున్నకార్యంబు కాకపోదిప్పు
డెక్కడిబంధుత్వ మెక్కడిచెలిమి
బాలునితమకంబు పట్టలేరెవ్వ
రనివీడుకొల్పిన ఆరాయబార్లు
కామునుకడకేగి కరములుమోడ్చి
వినిపింపసాగిరి విషయమంతయును
మమ్మంపితిరిమీరు మలిదేవుకడకు
విన్నవించితిమంత వీరులయెదుట
ఒనరంగసంధికి ఒప్పియావేళ
విరులురాజులు వేడ్కనుప్పొంగి
విందులుభుజియింప వివిధవస్తువులు
పచనంబుచేసిరి పఙ్తులుసాగె
ఇరుపక్షములవారు నింపుమీరంగ
కూర్చుండిరరలేని కూరిమితోడ
బానసీలన్నంబు పట్టుకవచ్చి
వడ్డించిచమురులు వడ్డించువేళ
గరిగెమాడచివచ్చి కలవరపడగ
అనపోతుతెరగెల్ల అపుడుబాలునికి
తెలుపగనాతడు తెంపునలేచి
ఇడినట్టీన్నంబు ఏటిలోగలిపి
ఉగ్రుడైరణమున కుద్యుక్తుడయ్యె
మలిదేవరాజును మన్నెనాయకులు
మముబంపిరంతట మడిగివచ్చితిమి
కాగలకార్యంబు గతిమీకెయెరుక

అంతటనబ్బాలు డతికోపమునను
భుజములనెగబెంచి పొడవుగానిక్కి
ఉదుటుపంతములాడు చున్నంతలోన
గురుతరరణలక్ష్మి గొబ్బునవచ్చి
ఆవేశమైనిల్చె నాతనియందు
కేరితమ్ములతోడ కిలకిలనార్చి
నిండుధైర్యముమీర నిశ్శంకుడగుచు
కనుగొనుచుండెను కామునిదళము
తమకంబుహెచ్చంగ దాలిమియొసగ
బవరంబునకుతాము పైనమైపోవ
సుముహూర్తమొక్కటి చూడగనపుడు
దైవఙ్ఞులను సమ్మతంబుగనడిగె
వీరాగ్రగణ్యుండు వినుతసద్గుణుడు
హాటకాచలధీరు డబ్ధిగంభీరు
డరిజయసంశీలు డైతమ్మసుతుడు
సంగడీలకు ప్రాణసఖుడైనవాడు
నిర్మలుడగు బ్రహ్మనిజతనూజాత
భగవదంశముగల బాలచంద్రుండు
పులినిదండంబుతో పొడిచినయట్లు
కొల్వులోపలినుండి గొబ్బునలేచి
తనప్రాణసఖులను దగ్గరజేర్చి
వెన్నిచ్చిపరగకు వెనుకాశపడవు
విరిగినవిరుల వెన్నాడిచనవు
కులమునవెలమవు క్రోధంబుహెచ్చు
సకలశాత్రవులకు సమవర్తివీవు
వన్నెతెచ్చితివౌర వంశమంతకును
ననుజేరరావయ్య నమ్మినవాడ
మేటియొజ్జలలోన మేటివైనట్టి
కమ్మరపట్టి నాకడకురావయ్య
తగవింజమోజుకు తనయుడవైన
కంసాలచందు ! దగ్గరకురావయ్య
గురువైనబిరుదుల కుమ్మరపట్టి
మరియుచాకలచందు మంగలమల్లు
నమ్మినమిత్రులు ననుజేరరండి
అనియిట్టులార్వుర అతిభక్తిబిల్వ
సంతోషమునబాలు సన్నిధికేగి
వరుసతోమ్రొక్కిరి వదనముల్ వాంచి
తరువాతబాలుడు ధైరచిత్తమున

వీరనాయకులను వేడుకజూచి
విన్నవించెనుశౌర్య విభవంబెసంగ
దేవతల్ చూడంగ తీక్ష్ణతమెరయ
మనసునశంకలు మట్టుగాజేసి
బ్రతుకులపైనాశ పారగదోలి
పిరికిప్రేవులువీడి బెగడుటమాని
లోభమోహంబుల లోలతద్రెంచి
సూర్యతేజంబున శూరతమీర
కామంబుక్రోధంబు కడకేగనెట్టి
కామభూపతిగెల్తు గదనంబునందు
సత్యవ్రతోత్సాహ సాహసులార
నిర్మలగుణయుక్త నిశ్చలులార
జయులారదేవాంశ సంభూతులార
ధర్మమర్మవిచార తత్పరులార
సజ్జనావనులయి జగములలోన
వీరకార్యంబుల వెలసినయట్టి
అరువదేరుగురుమేటి అయ్యలుమీరు
మీబంటుబ్రహ్మన్న మితిలేనిగరిమ
పూర్వమొనర్చిన భుజవిక్రమములు
విందుముమీరెల్ల వినిపించుచుండ
బ్రహ్మన్నకెదిరెడు పగవాడుకలడె
అటువంటిబ్రహ్మన్న కనుగుపుత్రుడను
భీతిచేబగరకు బెదరనునేను
తాతతండ్రులకును దగుమామలకును
కడుపిన్నననిమీరు గారాబమలర
ఎత్తిముద్దాడుట యీమేలుమీది
కన్నెకయ్యమునందు గలిగెపుణ్యంబు
స్వర్గంబుగొనుటకు చాలినవాడ
నాపంతమరయుడి నాయకులార
కామునితమ్ముని కలనిలోవంపి
తలదెచ్చిమీకిత్తుధరణీశునెదుట
చంపుదురణమందు సకలశాత్రవుల
పత్యినతీర్పకయున్న బాలుడగాను
నావుడువిని వీరనాయకులనిరి

వలదుబాలుడ పిన్నవాడవునీవు
సన్నపుపనికాదు సమరకార్యంబు
దళమువిస్తారంబు తగదుశౌర్యంబు
పడుచువాదవునీవు పటిమకొంచంబు
వలనొప్పశీలము వారికందరికి
సంతానమేలేక సంతోషమెడలి
పండ్రెండువర్షాల పరిమితిగడచె
మాచర్లచెన్నుని మన్ననవడసి
ఐతాంబనినుగనె అధికమోహమున
సంతతివృద్ధియై జరుగంగనిమ్ము
సమరంబునకునేగు సాహసమేల
మీతలితండ్రుల మిగులమన్నించి
మమ్మాదరించియు మామాటవినుమ
తంచుబల్కినవారి కనియెబాలుండు
కడుతెంపుమీరగ గలకలనవ్వి

ఈరీతిపల్క మీకిదిధర్మమౌనే
అసహాయశూరులౌ అయ్యలుమీరు
తనరినయీగంగధారకువచ్చి
అనఘులు మడుగులో అందరౌమీరు
షానముల్ చేసి ప్రశస్తివహించ
భక్తిలింగముల పట్టుకవచ్చి
ధరణిప్రతిస్ఠించి ధైర్యసంపత్తి
అన్నంబువెసముట్టి ఆరాజుచేత
విడియముల్ గొన్నట్టి విరులుమీరు
ప్రథమతాంబూలంబు పట్టితినేను
వీరులునాయకుల్ వేడుకజూచి
శ్రీరనమొనరింతు చెన్నుడుమెచ్చు
ఎంగిలిపోటగు నిప్పుడుమీకు
సురలోకవైభవస్ఫూర్తినాకగును

బాలిడీతండని పలుకగరాదు
నాపూర్వమంత విన్నపమొనరింతు
వీరనాయకులార విఖ్యాతులార
వినుడుచెవులనొగ్గి విశదముగాగ
ఉరుతరనగరమయోధ్యబాలించి
చనినట్టియాహరిశ్చంద్రభూపతికి
చంద్రమతికినేను జనియించిమించి
లోహితాస్యుడనైతిని లోకములెరుగ
నాడుబాలుడగానె నాయకులార
కనకకశిపునకు కాంక్షలుహెచ్చ
ప్రహ్లాదుదనుపేర పరగపుట్టితిని
చేసితిదుర్ఘట చేష్టలుకొన్ని
అతులమున స్థైర్యమగపరచితిని
నాడుబాలుడగానె నాయకులార
యేలెడూశివకంచి యేకామ్రపతికి
చిరుతొండనంబినా చెలగుభక్తునికి
శెంకెలశిరువను సీమంతికిని
సిరియాళుదనబుట్టి చెన్నొందినాడ
తలిదండ్రులపుడు నిర్దయతమర్ధించి
యిష్టభోజనముగానే మీశ్వరునకు
నిన్నియ్యనుంటిమి నీవేమియందు
వనినన్నుప్రశ్నింప నౌనుగాదనక
సమ్మతించివారి సత్కారమునకు
జీవముతోడనె శివునితోగూడ
కాంచీపురంబున కాపురమున్న
ఏడువాడలవారి కింపుదళ్కొత్త
ఘనపుణ్యవాసంబు కైలాసమునకు
కొనిపోయితినినేను గురుతరభక్తి
నాడుబాలుడగానె నాయకులార
కిష్కిందనేలెడు సీశాధిపతికి
తారకంగదుడనైధరబుట్టినాడ
రామచోదితుడనై రావణుకడకు
రాయబారిగనేగి రాక్షసుల్ గ్రమ్మ
వారినిఖండించి వడిచూపినాడ
నాడుబాలుడగానె నాయకులార
రఘువంశమునందు రామచంద్రునకు
కుశుడనైపుట్టితి గురుశూరుడైతి
నాడుబాలుడగానె నాయకులార
పాండుభూవరునకు పౌత్రుడనగుచు
అభిమన్యుడనుపేర అవనిజన్మించి
వీరధర్మముచూపి వెలసినవాడ
నాడుబాలుడగానె నాయకులార
ఇటువంటిజన్మంబు లెన్నియోకలవు
చెప్పశక్యముగాదు చెన్నునియాన
ఒక్కక్కజన్మం దొప్పువిక్రమము
శ్రీపురాణంబులు చెప్పుచునుండు
కలియుగంబుననిప్డు కడసారికేను
కుంతాలవారింట కూరిమిమీర
బ్రహ్మనాయునికిని పడతి ఐతమకు
బాలునిపేరిట పల్నాటిలోన
జననమొందినవాడ సమరశూరుండ
పేరెబాలుడుగాని బిరుదుమగండ
పగవారిగొట్టని బ్రతుకదియేల?
తలిదండ్రులనుబ్రోవ తనయుడేకర్త
మానంబుదక్షత మగటిమిమించ
ప్రబలింపగలవారు బాలురెసుమ్ము
బాలురెపెద్దలు బల్లిదుల్ వారె
బాలురకే వృద్ధిపరికించిచూడ
పెద్దలుమతిచెడి పిరికిపారుదురు
పాంచభౌతికదేహ పటిమక్షీణించు
మనసుచలించును మాటిమాటికిని
ధైర్యంబుతగ్గు నుత్సాహంబులుడుగు
వయసుమీరినవేళ వచ్చునాబలిమి
కీర్తికైనను నపకీర్తికినైన
బాలురపైనుండు భారమంతయును
మైలమకాముని మడియంగచేసి
నాయకురాలిని నయహీనచేసి
పరదళంబులజంపి పంతంబుతీర్తు
పడుదునురణభూమి బవరంబుచేసి
చూచిఆస్వర్గంబు చూరలుగొందు
అనియిట్టులాబాలు డాడినమాట

వినితండ్రులెల్లరు విశ్వాసమునను
గాఢంగాగ్రుచ్చి కౌగిటజేర్చి
బాదన్నమొదలైన భ్రాతృవర్గంబు
వేరుచింతలుమాని వినుచుండగాను
బాలచంద్రునితోడ బ్రహ్మన్నపలికె
నా ఆత్మనందన నాకూర్మిపట్టి
పుట్టినదాదిగా బుధులనుగొల్వ
ఇట్టిధీరత్వము నీదిట్టతనము
ఏరీతినీకబ్బె నిదియేమివింత
ఒకబుద్ధిచెప్పెద ఒప్పుగవినుము
ఘోటకంబులుమేటి కుంజరావళులు
కాలిబలంబులు ఘనఖడ్గవితతి
కుంతంబులుగండ్ర గొడ్డండ్లుగదలు
ముసలముద్గరములు శార్జ్గసంఘంబు
చూరికలుబాణముల్ శూలచయమ్ము
మొదలైనశస్త్రాస్త్రములనెల్లజూచి
భావంబుచెదరిన పంతముల్ గావు
పలికినరీతిని బవరంబునందు
విక్రమంబుననిల్చు విధమద్భుతంబు
సమరకాలంబున సకలదేవతలు
కనిచిత్తచలనంబు గావించుచుంద్రు
గణపతిభైరవుల్ కాళికాదేవి
విఘ్నమొనర్తురు వినురణవేళ
పార్థుడంతటివాడు ప్రధనరంగమున
కర్ణునిరాకడ గనిభీతినొంది
బ్రతికిశుభములు పడయంగవచ్చు
అరదంబుమరలింపు మయ్యశ్రీకృష్ణ
అనివిన్నపముచేసె ఆశ్చర్యభంగి
ఇతరులమాతలికేల వచింప
ఆమీదపొరుష మంతయుబోవు
అనిపల్కవిని బాలుడల్లననవ్వి

తండ్రితోననియెను ధైర్యంబుమీర
పిడ్గుచిన్నదికాదె భేదించుకొండ
చిన్నమిర్యమునందు చెడునెకార్యంబు
ఘనకపాలముకెక్కి కాకనొందించు
మానకమోరంత మండునులెస్స
కాలుదావాగ్నికి కారడవెదురె
హనుమానుడెగురు నాఆచౌటిపడేలు
వారథిలంఘించి వడీదాటుగాక
బాలుడుచిల్లర బలముపైబడడు
కామునితమ్ముని గదిసిమర్ధించి
తలగోసితెచ్చును ధైర్యంబెసంగ
అనుచుబాలుడుపల్కె నందరువినగ
తరువాతనాయుడు తనయునిజూచి

వినుబాలచంద్రుడ విశదముగాగ
ధరలోననాపేరు దశదిశలందు
ప్రఖ్యాతినొందెను బ్రహ్మనాయుండ
మండలేశులకెల్ల మదితల్లడమయి
చెల్లినమనపేరు చెడిపోవనీకు
పృథ్విబిరుదముల పెంపునొందింపు
ఘనమైననాపేరు కల్లచేయకుము
మల్లుచూశౌర్యంబు మొక్కపోనీకు
మిలలోనమనలావు నెన్నలేరెవ్వ
రాజియనంగ నేమనితలంచెదవు

శౌర్యంబునకు బాదుస్వర్గంపుద్రోవ
యెల్లసుఖంబుల కిదిపట్టుగొమ్మ
యిదిముక్తిసోపాన మిదిమూలధనము
ఆగర్భుశురుల కాటప్రదేశ
మిదిదేవవితతుల నెన్ననౌమేలు
హెచ్చైనవీరుల కిదిపుట్టినిల్లు
ధర్మసంరక్షణార్థంబయి బుధులు
కదలకరక్తంబు కార్చెడుచోటు
పటుకీర్తినొందించు బ్రహ్మండమందు
ఇదిసమరావని యిదిపుణ్యభూమి
శ్రీకంఠుశిరసంటి చెప్పెదనీకు

కామన్ర్పాలుండు కల్మిపెంపొంద
సకలభూమీశుల సంగ్రామమునకు
పిలిపింపవచ్చిరి పేర్మినిజూప
భండనపటిమచే ప్రబలినవారు
చతురంగబలములు చాలుపచ్చోట
పూర్వంబుమనతోడ పోరాడలేక
చిక్కిచెప్పినయట్లు చేయుచునుండి
పగవారిలోచేరి పరతెంచినారు
జడియకనిల్తురు సమరంబునందు
కన్నెకయ్యంబిది కనిపెట్టిపోరు
సలుపంగవలయును సత్కీర్తివచ్చు
తలపడునప్పుడు తలకకుమన్న
అలుగులుదీప్తికి అలుకకుమన్న
వారణధ్వనివిని వడకకుమన్న
శరములదీప్తికి జడియకుమన్న
సమరకాలంబున జంకకుమన్న
మెనచెడరణములో మురియకుమన్న
బిరుదులుజారిన బెదరకుమన్న
ఘనఖడ్గహతులకు గతిమాలవలదు
బలములుముట్టిన భంగంబుగాకు
సందడిరణమున శంకనొందకుము
పైకొనినైపుణ్య పటిమచెలంగ
పరదళంబులనొంచి బవరంబుచేయ
కాముడురణమున కంపంబునొంద
నరసింగుపైకేగు నాకూర్మిసుతుడ
జయముచేకొనదగు సాహసస్ఫూర్తి
అనినీతిగాజెప్పి అపుడుబ్రహ్మన్న
తగినట్టికర్పూర తాంబూలమిచ్చి
శంఖతీర్థమొసంగి జయమొందుమంచు
పంపింపతనతండ్రి బ్రహ్మనాయునికి

దండనమస్కృతుల్ తాజేసివెడలె
ఆవేళరణభేరు లధికమైమ్రోసె
ఢక్కాఢమామికల్ డంగురంబులును
పటహశంఖంబుల పటుతరధ్వనులు
బహుళమైమిన్నంద బాలచంద్రుండు
సమరభూస్థలినుండి సంతోషమలర
సూర్యభైరవులాది సురలకుమ్రొక్కి
దిక్పాతులార ఓ దేవతలార
కనుగొనుచుండుడి కదనరంగంబు
చేసెదసమరంబు చిత్తముప్పొంగ
అనివిన్నపముచేసి ఆయుధమంది
ఒరతీసిజళిపించి ఉగ్రుడైనిల్చె
తరువాతనరసింగ ధరణీశ్వరుండు

ఘనమైనగజముపై గ్రక్కుననెక్కి
సమరరంగమునకు చనుదెంచువేళ
చొక్కచువ్వలవారు సూరెలవారు
నిల్చిరిపదివేలు నిండుశౌర్యమున
బల్లెముల్ పట్టుక బలువైనబంట్లు
గజముముందేగిరి గాఢధైర్యమున
విలికాండ్రు నాలుగువేలసాహసులు
బానతూణీరముల్ పరగధరించి
వడితోడరణరంగ వసుధదార్కొనిరి
అశ్వమ్ములైదువే లరుదెంచెధాటి
భూరిమాతంగముల్ భూధ్రంబులట్లు
బృంహితధ్వనులతో పెల్లుగనడిచె
శూలశరోద్వృష్టిశోభిల్లుచుండు
వీరులువచ్చిరి విచ్చలవిడిని
కడమబలంబులు కాదులెక్కింప
పటువిక్రమస్ఫూర్తి బలమిట్లువెడలె
ధ్వజములుపడిగెలు దట్టమైకదల
బిరుదుచత్రంబులు పెద్దటెక్కెములు
సాంద్రమైయుండెను జగదీశునెదుట
ప్రబలమైవాద్యంపు పటలిమ్రోయంగ
పిక్కటిల్లెదిశల భేరీరవంబు
కాహళల్ బూరలుకనకతప్పెటలు
ధ్వనులచేజనతతి దల్లడపరచ
భయదమై చెలగిన పరిపంధిసేన
బాలచంద్రుండుచూచి భ్రాతలుతాను
శుష్కటవులనగ్ని సుడిసినయట్లు
కోయనియార్చుచు కుప్పించియురికి
బలముపైవ్రాలెను పొరుషాధికత
కుంతముల్ చేనంది గుదులుగాబొడిచి
కత్తులచే తలల్ ఖండించివైచి

మణికట్లదునుమాడి మస్తకవితతి
ధరమీదనొరగంగ దట్టించినరకి
మోచేతులెడచేసి ముక్కులుచెక్కి
ఫాలంబులంజింపి ప్రక్కలగోసి
దౌడలూడగనూకి దండముల్ ద్రుంచి
కనుగ్రుడ్లుపగులంగ కర్ణముల్ వ్రాల
బలువైనరొమ్ములు పరియలుగాగ
తొడలెల్లతునుకలై తూగాడుచుండ
జానువులూడంగ జంఘలువిరుగ
చీలలుపట్టేది చీకాకునొంద
ఈరీతిగొంతసే పీప్సితమదర
అనుజులతోగూడ ననిచేసిపిదప
దంతావళంబుల దట్టంబుచూచి
బాలుడుకోపంబు ప్రకటంబుగాగ
కొదమసింహముభంగి కుప్పించియెగిరి
బలిమిమై కుంభముల్ పగులగమోది
తొందముల్ తోకలు తునియలుసేసి
మావంతులనుగొట్టి మరణమొందించి
పైనున్నదొరలను పడిపోవపొడిచి
దంతముల్ ముక్కలై ధరవ్రాలజిదిమి
చెవులనుకత్తితో చీలికల్ చేసి
పిల్లదంతంబుల బెకలిచివైచి
ఘనపదంబుల దున్మికంఠముల్ నరికి
కొంతనేపిమాడ్కి గురుశౌర్యమలర
సమరంబుగావించి జవనాశ్వవితతి
చుక్కాడపైబడి సాహసగరిమ
ఖడ్గకుంతంబులు కరములబట్టి
పైనున్నరాహుత్తపటలిని చంపి
తొడగినజోడంగి తుక్కుగాజెసి
సింగణివిండ్లను చిదుకలొనర్చి
బాణతూణీరముల్ భగ్నముచేసి
ఖడ్గఖేటకములు ఖండించిమించి
మెడలురెండుగజేసి మేనులుచించి
యెదురురొమ్ములలెస్స యీటెలగ్రుచ్చి
కొంకులుతెగగొట్టి ఖురములుచెక్కి
చాలసేపీగతి సమరంబొనర్చె
బలమెల్లనీలాగు భంగంబునొంది
కంఠముల్ దెగిపడ గ్రక్కుననురికి

పడితన్నికొనిచచ్చు బలసమూహంబు
మస్తకంబులుపోయి మహిమీదమడిసి
కన్నులుతెరచుచు గంతులువైచి
ప్రాణముల్విడిచెడు వారునుమరియు
పాదముల్ విరుగగ బవరంబుచేయ
పండ్లుగీటుచు నేలపైగూలువారు
కరములుతునిసిన గత్తులువదలి
బాలునిగనివచ్చు భయదోగ్రభటులు
ప్రేవులువెడలిన పెడచేతనెత్తి
కడీమిచేబల్లెంబు గట్టిగాబట్టి
అహమహమికతోడ అరుదెంచగడగి
సంచలింపనిదీర్ఘ సాహసఘనులు
మూల్గుచుచచ్చెడు ముదియోధవరులు
బాలునికనుగొని భయమందిబెగడి
పారిపోయెడుపంద భటసమూహంబు
పారిపోవగలేక బ్రతుకుపైనాశ
బ్రతిమాలిచుండెడు బలనిచయంబు
లిటువంటిజగడంబు లెన్నడెరుంగ
మేలాగుపోదు మనేడ్చెడువారు
ఆలుబుడ్డలబాసి అన్నంబుకొరకు
వచ్చితిమీనేల వ్రాసెనుమృత్యు
వనిదుఃఖమొందుచు నసురసురంచు
వేగమేప్రాణముల్ విడిచెడువారు
బహుదినంబులు మేము పాలేరుచేసి
మునికొల్లలేల్లను ముంజూర్లదోపి
పణతులుదిట్టిన పడలేకవచ్చి
చచ్చుచుంటిమీ సమరరంగమున
పారిపోనిచ్చిన బ్రతుకుదుమయ్య
అనిమ్రొక్కుచుండెడు అతిదీనభటులు
బోయవారముమేము పూర్వమునందు
బుజములకాయలు పూనికంగొనుడి
పగవారుమముగని పారిపోవుదురు
మీకేమిభయమని మెలతనాగమ్మ
బాగుగానమ్మించి పంపవచ్చితిమి
జీవముల్ దక్కిన చిన్నలగలిసి
బలుసాకుదినియైన బ్రతుకగగలము
మీరుపిల్చినవేళ మేమరుదెంతు
మనియంజలియొనర్చి యవమానమొంది
మగసిరివిదచిన మానహీనులును
వీలుచిక్కినరణ వీరులవదలి
పోయెడునట్టి దుర్భుద్ధియుక్తులును
చచ్చినవిధమున సమరోర్వియందు
పలుకకయూరక వ్రాలెడువారు
చనలేకభయమున చచ్చినవారి
మీదద్రోసుకయుండి మెదలనివారు
చచ్చినగజముల చాటునడాగి
పందతనంబున పడియుండువారు
పెండ్లాలదలచుక బిట్టేడ్చువారు
వాల్మీకములమీద వసియించువారు
గడ్డిలోజొరబడి కదలనివారు
వ్రేళ్ళుచీకెడివారు వెన్నిచ్చువారు
వెండ్రుకల్ విప్పుక విదలించువారు
నీవారమనిపల్కి నిల్చుండువారు
ఆయుధాల్ పడవైచి యలికెడువారు
పడలేకచతికిలబడి యుండువారు
బవరంబులోగూలి ప్రాణజాలంబు
విడిచిఖడ్గముల్ విడువనివారు
భయదమైయిబ్భంగి పరికింపరాక
సమరరంగము భయజనకమైయుండె

కొ0ందరువిలుకాండ్రు గుంపులుగూడి
బాహుబాణములుమీద బరపెడువేళ
తమ్ములనందర తగనిల్వజేసి
పరిఘమొక్కటిచేత పట్టుకతూరి
తనువునబాణముల్ దాకకుండంగ
భ్రమణనైపుణ్యంబు బల్విడిజూపి
పరతెంచువిశిఖముల్ పాయగొట్టుచును
ఖడ్గమాడించుచు గర్జలొనర్చి
అట్టహాసమున నావిలుకాండ్ర
పైకేగిధనువుల భంగముచేసి
శింజనులెల్లను జిదురుపల్ చేసి
తూనముల్ శరములు తుమురుగాగొట్టి
చుట్టుపేరమువారి శూరతమెరయ
వండతరిగినట్లు వడిమేనులెల్ల
ఖండించియముజేర గ్రక్కుననంపె
చొక్కచువ్వలవారు శూరతహెచ్చ
వంచుకపైకుర్కి వచ్చుటసుచి
బాలుడువెసనార్చి పకపకనవ్వి
తమ్ములుతోడు రాదంటయైతొడరి
కుప్పించిపైబడి గొడ్డండ్లతోడ
చెరకులునరికిన చెలువుఘటిల్ల
అలుగులనీటెల నన్నింటిదునిమి
శూలంబులంబొడ్చి సురియలగ్రుమ్మి
గండ్రగొడ్డండ్లతో గనెలుగాగొట్టి
బాకులరొమ్ముల పరియలుచేసి
గదలచేశిరముల గడునుగ్గొనర్చి
భాదించిపొట్టల పటిమచేజించి
కత్తిలమేనుల కండలుడుల్చి
పంపించెజముజూడ బలములనెల్ల
సంగ్రామమీరీతి జరిగినవేళ
పారిరిమిగిలిన బంటులుగూడి
ఆవేళనరసింగు డధికకోపమున

పారెడువారికి బలుకంగసాగె
విరిగిపోవుట యిట్లవీరధర్మంబె
బాలురకనుగొని పరువిడనేల
మిమ్ముగాచినవారి మేలెత్యజింప
బలిమిమీనరముల బారురక్తంబు
రాజాన్నవర్ధిత రక్తంబుగాదె
ధూర్తులైనృపునకు ద్రోహంబొనర్చి
నమ్మినరాజును నట్టేటముంచి
పోవుటయేనీతి పుణ్యాత్ములార
తనువులస్ఠిరములు ధనములుకల్ల
కీర్తియొక్కటి భువిఖిలముగాకుండు
ధైర్యహీన వీరధర్మంబుమాని
భంగురమై మలభాండమైనట్టి
దేహంబుకొరకు సత్కీర్తిపోనాడి
విరిగిపోయెడునట్టి వెఱ్ఱులుగలరె
వీరసింహములకు వినుతినిగాంచు
సమరరంగములే సంచారవనులు
చచ్చినబ్రతికిన సౌఖ్యమచ్చటనె
బుద్ధులుచెడి పాఱిపోవుదెరేని
భుక్తిముక్తులు రెండుపోవునుదొలగి
బబుబాసిపోవుట న్యాయంబుగాదు
తప్పునామరణంబు తలచెడిపార
మృత్యుదేవతవచ్చి మేనులనిల్చి
బంటుపంతంబులే పారిపోవుటలు
పరికింపపెండ్లికి వచ్చుటలేదు
సమరకార్యమునకై చనుదెంచినాము
వచ్చినకార్యంబు వరదలోగలిపి
బంధులుమిత్రులు పగవారునవ్వ
పోవుటనీచత పుట్టదన్నంబు
పోవద్దురాజాన పోయితిరేని
అనియిట్లుపల్కిన ఆబలంబెల్ల
పారిపోవకరోష భరితమైనిల్చె
బాలచంద్రుడంత భ్రాతలగూడి

అట్టహాసముచేసె అరిసేనలపుడు
జడిసిగుండెలు వ్రీలచలనంబునొంది
ధైర్యంబువహియించి దర్పముల్ మీర
కదలుచక్రంబులు గండ్రగొడ్డండ్లు
పెద్దవిసురియలు భిండివాలములు
బల్లెముల్ కుంతముల్ పరుశూలచయము
కొనికరంబుల తీవ్రకోపులైవచ్చి
మిడుతలుమంటపై మిడిసిపడ్డట్లు
బాలునిదాకిరి భయదూరులగుచు
విక్రమాటోపత వెలసిబాలుండు
జలధిలోమందర శైలంబుతిరిగి
కలకనొందించిన కైవడిమీరి
కాలాగ్నిలోకముల్ కాలిచినట్లు
దవవహ్ని విపినంబు దార్కొన్నభంగి
మనుజులలోమారి మరిగినరీతి
శత్రుసైన్యంబుపై చయ్యనగదిసి
వారుప్రయోగించు వరశస్త్రవితతి
బహువిధంబులద్రుంచె భంగముగాగ
ఒకబంటునొకకాలు నొయ్యనబట్టి
యొకబంటుతొడవట్టి హుంకరించుచును
ఇద్దరముగ్గుర నేకకాలమున
కుంతంబులంజిమ్మి కూలజేయుచును
బాణంబులంగ్రుచ్చి పట్టిఎత్తుచును
కత్తులతోతలల్ గట్టిగానరకి
వ్రయ్యలైతనువులు వసుధపైబడగ
కటిదేశములయందు కత్తులువేయ
తునకలైభూస్ఠలి దొరగుచునుండె
కుంతంబులెడ గ్రుమ్మికూల్చెడువేళ
నెత్తురుభూమిపై నిండుగపారె
ఎదురులేక సమరమీగతిచెల్ల
కనుగొనినరసింగు కంపంబుగదుర
తలయూచిశ్రీహరి దలచినెమ్మదిని
వ్రేలిడిముక్కుపై వెరగందికుంది

ఇతడుబాలుందని యేలాగుపలుక
శూరతదళముల సుడివడగొట్టె
ఇతనితోపోరుట కేదినాబలము
గ్రక్కునమాయన్న కడకేగుదెంతు
అనిభయముననేగె అవనీశ్వరుండు
తరువాతబాలుడు తనరోషవహ్ని
అధికమైజ్వలింప ఆపగలేక
చిత్రంబుగాగూల్చె సేనలనెల్ల
కొందరఖండించి కొందరదరిమి
గుదిగ్రుచ్చెగొందరగూల్చె కొందరను
సంగరమీరీతి జరుగుటకతన
భందనరంగంబు బయలగుచుండె
మదగజవ్యూహంబు మావంతులపుడు
తివిరిధీరతతోడ దీకొల్పియార్చి
దట్టంపుశరవర్షధారలుగురియ
బాలచంద్రుడుకోపభారముతొ అపుడు
అనుజులతోగూడి అధికవేగమున
కదిసిఖండించెను గజసమూహమును
తునుమాడిదంతముల్ తుండెముల్ చేసి
శూలంబులంగ్రుమ్మి సురియలబొడిచి
పట్టిసంబులగొట్టి బాకులమొత్తి
గదలచేకుంభముల్ ఘాతలుచేసి
చరణముల్ తెగిపడ శాతఖడ్గముల
కొట్టినకూలెను కొండలరీతి
వినువీథిదేవతల్ వేడుకచేచి
ఆశ్చర్యమొందిరి హర్షంబులెసగ

ఘనముగనొకవెల్ల గజముపనెక్కి
నేర్పుమైయొకడుండ నిర్భయుడగుచు
అనుజులనందర నటబుచ్చివచ్చి
కొదమసింహముమాడ్కి కుంభిపైదుమికి
వక్షముంబాకున వడితోడపొడువ
వాలంబునకువెళ్ళి వచ్చెనుతిరిగి
కదగిగుంజగ నెత్రుకాలువలయ్యె
ఖండించిమదగజ ఘనమస్తకంబు
కూల్చెనుభూమిపై కొండచందమున
పైనరుడెవ్వడో భావింపలేక
నరసింగుడనినమ్మి చిత్తమున
తమకంబుచేవాని తలతెగగొసి
తనచేతబట్టుక తమతండ్రికదకు
బాలుడువిచ్చేసె ప్రజ్వరిల్లుచును
సమరరంగముచూడ చక్కగనుండె
ఘనమైననెత్తురు కాల్వలైనిలిచె
తెగిపడ్డగజములు దీవిలైయొప్పె
నరికినతురగముల్ నక్రంబులాయె
పొర్లాడుశిరములు బుద్భుధపటలి
ట్Yఎక్కెముల్ గొడుగులు డిండీరవితతి
కలిగినపుచ్చముల్ కచ్చపరాజి
మేతినేత్రంబులు మీనవారంబు
దీర్ఘశిరోజముల్ తీరైననాచు
మెదడునుమాంసంబు మించినబురద
తరచైనయీటెలు దర్వీకరాళి
పొడియైనభూషణ పుంజములెల్ల
సైకతనిచయంబు సరవివర్ణింప
ఇటువంతిరణరంగ మీక్షించికొనుచు
చనుదెంచిసోపాన సంయుక్తమైన
మేడమీదకినెక్కి మేటివిక్రముడు
బాలుడాశిరమును బ్రహ్మకర్పించె
నాయకావలిజూచి నాయుడిట్లనియె
చెలువైననరసింగు శిరమిదికాదు
రహివెంకుశిరమౌట గ్రహియింపలేక
చనుదెంచెనేమయ్య జగదీశుతమ్ము
డైనట్టినరసింహు డన్నదగ్గరకు
తరలెనుబలముల తాదెత్తునంచు
తెలియలేవైతివి ధీరాగ్రగణ్య
అనిపల్కగాబాలు డాగ్రహమంది
వీరులకెల్లను వినతిగావించి
కడువేగమునవచ్చి కలిసెతమ్ములను

అటమున్నెనరసింహు డధికబలమ్ము
తెచ్చుకమొనచేసె ధీరతనెదుట
మదగజంబులపైకి మత్తసింహంబు
లరుదెంచువిధమున ఆశ్చర్యలీల
పౌజుపైనడచిరి బాలురార్వురును
వసుధేశుతమ్ముడు వారలజూచి
తనవారికెల్లను తాసైగజేసె
క్రమ్మిరివిలుకాండ్రు ఘనులపైనపుడు
బాలుడుమొదలైన బాలవీరులును
నారులవిండ్లను నలినలిచేసి
తొనలునుబాణముల్ తునుకలుచేసి
వెరువకయుండిరి వీరులపైకి
కదిసిమూకలువచ్చి కదనమధ్యమున
సాంద్రవంశాటవి చందముదోప
క్రమ్మిరిసాధ్వస కరముగనపుడు
తలకకవారలు ధైర్యంబునొంది
చేగదల్ త్రిప్పుచు చెలగిఆర్చుచును
కొక్కెరగుంపుపై కుప్పించియురికి
సాల్వంబుఢీకొన్న చందంబుగాగ
కరులపైసింహంబు కదిసినరీతి
వ్యాఘ్రంబుగోవుల వడిదాకినట్లు
సేనలపైకేగి చెండాడిమరియు
చెక్కులముక్కుల చేతులమెడల
కన్నులవెన్నుల గడ్డాలతలల
ఘనమైనకత్తుల ఖండించిమించి
కుంతములంబోడ్చి కూలంగత్రోసి
చక్రసంఘముచేత చక్కుగాచేసి
రెదురెవ్వరునులేక యీతీరుసల్ప
చాపకట్టుగగూలె సకలబలంబు
అంతకంతకుయుద్ధ మగ్గలంబాయె
అప్పుడుబాలుడా యనుజులకనియె
దళముపైబోకుడి దట్టించిమీరు
కామేశుతమ్ముని కనుగొనివత్తు
అనుచునాతడుబోయె నడుగుచురిపుల

అనుగుభూపతిపుత్రుడా నరసింహు
డెక్కడనున్నవా డేడిరావాడు
బాలచంద్రుడువచ్చు పటిమవీక్షించి
ఢాకకుభయపడి డాగెనోలేక
పందతనంబున పారెనోచెప్పు
డనివిచారించుచు అపుడుబాలుండు
గజముపైసింగంబు గమకించురీతి
పర్వతమ్ముననబిడ్గు పడ్డట్లుగాను
తగగొంతుగొనెకాము తమ్మునిమీద
చుట్టువారలు శూరతనపుడు
ఘనపరాక్రమముచే కదియంగజూచి
గరిమబ్రహ్మన్నపట్టి ఘనకుంతమునకు
ప్రతివచ్చు సామంతరాగోలపట్టి
కటియందుగట్టిగా కాసెబిగించి
ఆంజనేయునిభంగి అటచౌకళించి
కిలకిలనార్చుచు కేరళవిభుని
పొడిచిత్రోసెనువేగ భూమిపైబడగ
కర్ణాటభూమిశు కలనిలోజంపె
మాలవమహినేలు మనుజేశుశిరము
చిదిమినట్టుగద్రుంచె చిత్రంబుగాగ
బర్బరధరణీశు బాహులనరికి
సమవర్తికడకంపె శౌర్యంబువెలయ
కరిపైనినుండిన ఘననరసింగు
పైబడెసాహస పాటవమొప్ప
దంతినికవియించె ధరణీశ్వరుండు
బాలచంద్రుడు కోపభారముతొ పిదప
తండ్రినిబోలిన తనయుడుగాన
కడు ఉన్నతంబైన కరిపైకివడిగ
కుప్పించిదుమికి ఆకువలయేశ్వరుని
బుజమునపొడిచెను భూమీశుడలిగి
ఐతాంబపుత్రుని అసిధారగొట్టె
తప్పించుకొనియంత ధరణీశునేసె
నరసింగరాజును నాయునిసుతుడు
కర్ణుండువిజయుండు కలహించినట్లు
వృత్రుడునింద్రుండు పెనగినభంగి
రామరావణులు పోరాడినరితి
హెచ్చియుద్ధముచేసి రిరువురుజాము
విక్రమస్పూర్తిమై వెలయబాలుండు
కామునితమ్ముడు కదిసియావేళ
అంకుశంబునపొడ్చె అదిబాలచంద్రు
భేదింపబైటికి ప్రేవులువెడలె
బాలచంద్రుడురోష పాటవమెసగ
సామంతరాగోల చక్కగబట్టి
వక్షఃస్థలంబున వడితోడగ్రుచ్చె
గాడివీపునవెళ్ళె గ్రక్కునాలుగు
మొగలిపూభంగిని మొనచందమమర
అప్పుడునరసింహు డాత్మనిశ్చలత
మాచర్లచెన్నుని మదిలోనదలచి
అనుగుభూతలనాథు నాత్మలోనెంచి
శీలమ్మనాయుని చింతించిపొగడె
ఊర్ధ్వమార్గంబుల నొయ్యననెక్కి
బ్రహ్మరంధ్రంబున ప్రాణంబులేగె
కుంభికుంభముమీద కూలెనారాజు

కనిబాలచంద్రుడు కడుదుఃఖమొంది
వలగొనిముమ్మారు భక్తితోమ్రొక్కి
అనుగుభూవరపుత్ర అంగజగాత్ర
ఉర్వీశతనయ అయోధ్యనివాస
మానదుర్యోధన మైలమ్మసుతుడ
ఓతండ్రినరసింహ ఓరాజవిభుడ
అపరాధిగానునే నపకారిగాను
పాపమించుకలేదు పట్టపురాజ
మిమ్ముగట్టంద్రాళ్ళు మీరెతెచ్చితిరి
మీపాలిమృత్యువు మెలతనాగమ్మ
అలరాజుజంపిన ఆపగదీర్ప
పట్టిచంపితిగాని పాపంబెరుంగ
అనిఖేదమొందుచు ఆయుత్తపడుచు
కత్తితోతలగోసి కరములబట్టి
అనుజులతోనిట్టు లపుడువచించె
నరసింగుతలనిత్తు నరనాథునెదుట
ఇచ్చోటనిల్వుడి యెచటికిపోక
అనిచెప్పితమ్ముల నచ్చటనిలిపి
ఒకచేతప్రేవుల నొయ్యననెత్తి
సామంతరాగోల చంకనబెట్టి
తనతండ్రితావుకు తలగొనిపోయి

సోపానములమేడ చులకగనెక్కె
నాయుడుగనిలేచి నయముకంపట్ట
నరసింగువచ్చెను నాయకులార
యెదురుకొందమటంచు నేతెంచిభక్తి
నరసింగుశిరమును నమ్రతగొనియె
తపనీయపీఠిపై తలయుంచిమంచి
గంధముకస్తూరి కలయంగనలది
తగటుపచ్చడముపై తలయుంచిపిదప
కొలువెల్లమ్రొక్కిరి కోపంబులణచి
బ్రహ్మన్నయునుమ్రొక్కి వాక్రుచ్చెనిట్లు
బావలజూచితే ప్రాణంబువిడిచి
మరదులజూచితే మరణంబునొంది
తమ్ములజూచితే దైవముగలసి
ఘనదేహభవనముల్ కట్టించినట్టి
ధర్మసేనుండు మీతండ్రిపాదముల
కడకేగమీకిట్లు కారణమాయె
అనుచుశోకమునొందె అనఘుడుబ్రహ్మ
విలపించూతని విధమువీక్షించి
తనమదిఖేదంబు తాబట్టలేక
నరసింగుశిరమును నయముగబట్టి
కన్నుల ఆశ్ర్య్వుల్ గడ్డానజార
ప్రబలశోకముపొందె బాదన్నరౌతు
తండ్రిచచ్చినవెన్క దంటయేకూర్మి
ఉండమికొన్నినా ళ్ళుర్వీశతనయ
వెగటుమృత్య్వుమన వెంబడిబడియె
చెన్నుడుకులమును చెల్లించెనేటి
కనిబాదరాహుత్తు డడలెచింతించి
కొమ్మరాజువగచె కొలువెల్లనడలె
సుంకర్లువగచిరి శూరులేడిచిరి
గండువారలవంత ఘనమయియుండె
కమ్మవారందరు కడుచింతపడిరి

నాయుడాతరికూర్మి నందనుజూచి
రమ్మనినినుపిల్వ రాజింపలేదు
వచ్చియూరకయున్న వాదవుకావు
చూరగొంతివిసేన శూరుడవగుచు
చెల్లెబోనీవిట్లు చేసినక్రమము
విభునకుసేనకు విధివైతివకట

అనిపల్కవినిబాలు డతులరౌద్రమున
పలికెనందరువిన బ్రహ్మన్నతోడ
వెడవెడయేడ్పులు వేగచాలింపు
కొల్వులోమామామ కొమ్మభూపతికి
అలరాజుపగకయి అప్పగించితివి
నీస్వభావంబింక నేవివరింతు
పోగొట్టితివికోడి పోరునభూమి
నినునమ్మివచ్చిన నీమేనమరిది
ప్రాణంబుకొన్నట్టి పాపాత్మకుడవు
చెలువుచూడగబంప చెవులరాయనను
చండకర్ముడవయి చంపించితీవు
ఘనువేంకజోదును కలనికిబంపి
మందలోచంపితి మాయయొనర్చి
యింటువంటినీచేష్టలెన్నివర్ణింతు
అనినమాటలుబ్రహ్మ కలుగులైతోచి
బాలచంద్రునికనె ప్రకతముగాగ
వెన్నిచ్చివచ్చితి నిమతులకీవి
వెన్నిచ్చివచ్చెడు వీరుడగాను
సుమ్మనిపల్కిన శూరవాక్యములు
విదితమైతోచెను వీరులకిప్పు

దనబాలచంద్రుడ హంకారగరిమ
తెంపుచేకలనికి తిరిగిధైర్యమున
రయముగనేతెంచి రణములోనిలిచె
అప్పటిరణకర్మ మలవియేపొగడ
వాణీశుడైనను వర్ణింపలేడు
కమ్మరకాచన్న కడుశౌర్యఘనుడు
కాంక్షించితనపాలి కామాక్షిగలచి
పరదళంబులమీద వ్రాలిఖండించి
కడసారిమృతినొంది కలనిలోగూలె
శత్రుసైన్యమునకు సమవర్తియైన
మంగలకులమల్లు మహితవిక్రముడు
తురగసంఘంబును తునుకలుచేసి
కదనంబులోబడి కాలునిజేరె
కోరాడుచుండిన కుమ్మరపట్టి
విశ్రుతంబుగజాత వెదునిబోలి
పరదళవిపినంబు భస్మంబుచేసి
గురుదేవతలమది గూర్చిప్రార్థించి
హతశేషభటులచే అనిలోనమ్రొగ్గె
చాకలచందన్న సాహసాఢ్యుండు
పాతాళగంగను భావమందుంచి
ప్రకటధైర్యవిలయ పవనునిచేత
దుష్టశత్రువులను తూలికలత్లు
ఆకాశపథమున కరుగంగజెసి
బవరంబులోవ్రాలి ప్రాణముల్ విడిచె
సమరంబులోజొచ్చి చలనంబులేక
బాలునీనుజుడ బాహుబలుండ
అనిచెప్పికొంచు బిట్టడరోషమున
పేరైనదళముల పెల్లుగబొడిచి
గడలమూకలజొచ్చి ఖండముల్ చేసి
బల్లెపువారిని భంగంబొనర్చి
తురగాలిపైకేగి తుమురుగాగొట్టి
మదదంతిచయముల మరణమొందించి
తరచుగాయంబుల తాళగలేక
మాచర్లచెన్నుని మదిలోదలంచి
వెలమలదోర్నీడు విడిచెప్రాణంబు
తమ్ములపాటంత తప్పకచూచి
బాలుండురోషంబు పట్టగలేక
చండవిక్రమమున సాహసంబెసగ
వ్రేలాడుప్రేవులు వేగమెపెరికి
గంగాధారంగల్పి కలనికివచ్చి
తమ్ములదలచుక తావిలపించి
మిముబాసియుండుట మేరయెనాకు
నాదురాకడమది నమ్ముడిమీర
లనిచాటిచెప్పుచు ఆయుద్దభూమి
నిర్భయవృత్తిచే నిలిచెబాలుండు
కనిగొనిపరసేన కడుభీతినొంది
మృత్యువుతౌముక మీదికివచ్చె
ఎట్లుజీవించెద మీతనియెదుట
అనిపారిపోయెడు నాసేనజూచి
పోవద్దుభటులార పుణ్యకాలంబు
చనుదెంచెదేవేంద్ర సభకెగవలెను
మీరెల్లనిలువుడి మేలిమిగనుడి
అనిపల్కవారిలో నధికవిక్రములు
చొక్కచువ్వలవారు శూరులైమించి
వచ్చుటగనుగొని వడిమీరనెదిరి
ప్రబలయుద్ధముచేసి బాలచంద్రుండు
చాపకట్టుగగూల్చె సకలసైన్యంబు
ఆసమయంబున అతులసాహసులు
కుంతంబులంబూని కోయనియార్చి
గదలువంచుకవచ్చి కదిసిరిబాలు
వెనుకడ్గువేయక విక్రమాధికత
అలుగులపైవ్రాలె ఐతాంబసుతుడు
గ్రుచ్చిపట్టిరియెత్తి గురుశౌర్యఘనుని
వేంచేసిదివియందు వీరులగలసె
అంతటభాస్కరు డస్తాద్రికేగె
సాంద్రమైచీకట్లు జగమునగ్రమ్మె
జంగమస్థావర సకలవస్తువులు
కాటుకపట్టిన కైవడినొప్పె
సత్యంబుగా చరాచరమైనజగము
విష్ణుమయంబన్న వేదవాక్యంబు
నిశ్చయంబాయెను నీలిమనంది
శివుడేడి కైలాసశిఖరంబునెది
సోముడువృషభంబు సురనదియేడ
యెక్కడికెగెనో యెరుగంగరాదు
సంశయస్వాంతయై శైలజవెదకె
ఇభమునుగానక యింద్రుడువెదకె
వానినివెదకెను వనజాసనుండు
తెలియకఈరీతి దేవతలెల్ల
చెలగిరి విభ్రాంతచిత్తుల అపుడూ
అతులముదంబున ఆసమయమున

ఘనభూతభేతాళ గణములుగూడి
సమరరంగముచూచి సంభ్రమమంది
తగవిచారించిరి తమమానసముల
ఎక్కడియుద్ధంబిదేమిచోద్యంబొ
యింతకాలంబయ్యె నెరుగమెయహహ
అనివెరగందుచు నాశ్చర్యపడుచు
కలనుగాచుకయున్న కాళినిజూచి
మీదయచేతనే మేముతనియగ
అధికభోజనమాంస మబ్బెనుమాకు
అనిమ్రొక్కితేంపుచు ఔత్సుక్యమడర
బాలుడుమనపాలి పరమేశ్వరుండు
చేయంగ అతడిట్లు సిద్ధించెమనకు
అనికొందరాదినా రానందగరిమ
నాయకురాలైన నాగమ్మనుండి
మనకాంక్షతీరెను మాటలకేమి
అనికొందరాడిరి హర్షంబుమీర
నిబ్భంగిమెచ్చుచు నింతులుతమరు
చల్లులాడుచురక్త సాగరమందు
మునుగుచునీదుచు మూకలుగట్టి
జలకమాడిచెదరి చౌకలింపుచును
కుప్పించిదుముకుచు గొబ్బునమునిగి
దూరానదేలుచు దూగివచ్చుచును
మదమెక్కిసోలుచు మరిస్రుక్కిపడుచు
ఎవ్వరురామూద నెక్కినవారు
దిగిరారతులువ మర్ధించెద నిన్ను
అనివెక్కిరించుచు హాస్యమొనర్చి
భటకళేబరములు పట్టుకవచ్చి
చచ్చినగజముల సంధించినిల్పి
కదనమాడుమటంచు కత్తులబొడిచి
పడియున్నగజముల పైనిగూర్చుండి
అంకుశంబులతోడ నదలించువారు
వాజిశవంబుల వడిమీరనెక్కి
చబుకులగొట్టుచు చనుమనువారు
గజములవాజుల కాలిమానుసుల
పట్టుకవచ్చి ఆపాథోధియందు
ఘనమైనసేతువు కట్టుదమంచు
సంతోషమొందెడు శాకినీగణము
గుండెలునమలుచు గుంపులుగూడి
పెల్లుగపాడెడు పెద్దఢాకినులు
ఎదురుమాకెవ్వారలీయుద్ధభూమి
మిగ్లినదళముల మీరిమర్ధింప
క్రొత్తునెత్తురుమాకు గూడునటంచు
బొబ్బలువెట్టుచు బొండుగల్ దినుచ
హంకారమండెడూ హాకినీచయము
దిక్కులనంతట తేజంబుహెచ్చ
మిణుగురుల్ రాల్చుచుమింతికిజనుచు
కూడిపర్వులుపెట్టు కొరివిదెయ్యములు
పొరిపొరి ఆయుద్ధభూతలమందు
విహరించియీగతి వేడుకకొలది
తమనెలవులుచేర తామేగిరపుడు
సకలజనంబులు సంతసమంద
భానుండుపూర్వాద్రి పైకేగుదెంచె
ఘనుడైనశ్రీనాథ కవిరాజరాజు
చెన్నునికృపచేత చిత్తముప్పొంగి
బాలునివిక్రమప్రావీణ్యమెల్ల
జనులకువివరించె సక్తితోదీని
పాటించి చదివిన వ్రాసినవినిన
బంధులు పుత్రులు పౌత్రులు హెచ్చ
సకలశుభంబులు సమకూరుచుండు
శ్రీయు ఆయుస్సును స్థిరముగాగలుగు

బాలచంద్రయుద్దము
సమాప్తము