Jump to content

శ్రీ గీతామృత తరంగిణి/మోక్షసన్యాస యోగము

వికీసోర్స్ నుండి
శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు)

శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952)

గీతా మకరందము(తెలుగు తాత్పర్యము)

శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979)

అర్జున ఉవాచ|
అనుష్టుప్ .
సంన్యాసస్య మహాబాహో !
తత్త్వమిచ్ఛామి వేదితుమ్|
త్యాగస్య చ హృషీకేశ !
పృథక్కేశినిషూదన|| 18-1 ||

అర్జును వాక్యము .
తేటగీతి .
త్యాగ , సంన్యాసముల భావ మఱసి కొనఁగ ,
వివరముగఁ దెల్పు నాకు సంవేద్యముగను ,
వేరు వేరుగ నర్థంబుఁ బేరుకొనుచు ,
సాంగముగఁ జెప్పుమయ్య ! కృష్ణా ! వినంగ . ౧

అర్జునుడు చెప్పెను ( ప్రశ్నించెను )-

గొప్పభుజములు గలవాడవును , ఇంద్రియముల యొక్క నియామకుడవును , కేశ యను రాక్షసుని సంహరించినవాడవునగు ఓ కృష్ణా ! సన్న్యాసము యొక్కయు , త్యాగము యొక్కయు యథార్థమును తెలిసికొనగోరుచున్నాను . కావున ఆ రెండిటిని వేఱు వేఱుగా నాకు జెప్పుము .

శ్రీభగవానువాచ|
అనుష్టుప్ .
కామ్యానాం కర్మణాం న్యాసం
సంన్యాసం కవయో విదుః|
సర్వకర్మఫలత్యాగం
ప్రాహుస్త్యాగం విచక్షణాః|| 18-2
అ.
త్యాజ్యం దోషవదిత్యేకే
కర్మ ప్రాహుర్మనీషిణః|
యజ్ఞదానతపఃకర్మ
న త్యాజ్యమితి చాపరే|| 18-3 ||

శ్రీ భగవానుల వాక్యము .
తేటగీతి .
నాల్గు విధముల మతము వినంగ నగును ;
కామ్య కర్మ సంన్యాస మొకండు ; కర్మ
ఫలము త్యజియించుటగు రెండు ; పార్థ ! సర్వ
కర్మలను త్యజించుటగు మూడు ; కర్మ లెల్ల
బంధ దూషితమయ్యు తపంబు దాన
యజ్ఞ కర్మల విధియించుటగును, నాల్గు . ౨

శ్రీ భగవంతుడు చెప్పెను.

( ఓ అర్జునా ! ) కామ్యకర్మలను వదులుటయే సన్న్యాసమని కొందఱు పండితులు చెప్పుదురు . మఱికొందఱు పండితులు సమస్త కర్మములయొక్క ఫలమును త్యజించుటయే త్యాగమని వచించుదురు . కొందఱు బుద్ధిమంతులు (సాంఖ్యులు ) దోషమువలె కర్మము విడిచిపెట్టదగినదని చెప్పుదురు . మఱికొందఱు యజ్ఞము, దానము, తపస్సు - మున్నగు కర్మములు విడువదగనివనియు చెప్పుదురు .

అ.
నిశ్చయం శృణు మే తత్ర
త్యాగే భరతసత్తమ|
త్యాగో హి పురుషవ్యాఘ్ర !
త్రివిధః సమ్ప్రకీర్తితః|| 18-4 ||

తేటగీతి .
త్యాగ శబ్దార్ధమును నిశ్చయముగ వినుము ;
త్యాగములు కూడ త్రివిధమ్ము , తనరుచుండు ;
దాన యజ్ఞ తపమ్ముల మాన రాదు ,
ఫలము వర్జింప నవ్వియె పావనములు . ౩

భరతకులోత్తముడవును , పురుష శ్రేష్ఠుడవు నగు ఓ అర్జునా ! అట్టి కర్మత్యాగవిషయమున నాయొక్క నిశ్చయమేదియో చెప్పెదను వినుము . త్యాగము మూడు విధములుగా చెప్పబడియున్నదిగదా !

అ.
యజ్ఞదానతపఃకర్మ
న త్యాజ్యం కార్యమేవ తత్|
యజ్ఞో దానం తపశ్చైవ
పావనాని మనీషిణామ్|| 18-5 ||

తేటగీతి .
కర్మ ఫలము త్యజింప త్యాగమ్మటంద్రు ,
ఫలము త్యజియించి , కర్మలు సలుప వలయు
నని , మదీయ నిశ్చిత మతమని యెఱుంగు ;
కర్మ బంధమ్ము సడలించు మర్మ మిదియ . ౪

యజ్ఞము , దానము , తపస్సు అనెడి కర్మములు త్యజింపదగినవి కావు ; చేయదగినవివే యగును . ఏలయనిన ఆ యజ్ఞ దాన తపంబులు బుద్ధిమంతులకు పవిత్రతను ( చిత్తశుద్ధిని ) గలుగ జేయునవై యున్నవి .

అ.
ఏతాన్యపి తు కర్మాణి
సఙ్గం త్యక్త్వా ఫలాని చ|
కర్తవ్యానీతి మే పార్థ !
నిశ్చితం మతముత్తమమ్|| 18-6
అ.
నియతస్య తు సంన్యాసః
కర్మణో నోపపద్యతే|
మోహాత్తస్య పరిత్యాగ
స్తామసః పరికీర్తితః|| 18-7 ||

ఆటవెలది .
నిత్య కర్మ లుడుగ రాదేరికి ,
మోహమంది యుడుగఁ బూనుకొన్న ,
త్యాగమనఁగఁ బోవ రద్దాని బుధవరుల్ ;
తామసం బటంచుఁ దలతు రయ్య ! ౫

అర్జునా 1 ఈ యజ్ఞ దాన తపః కర్మలనుగూడ ఆసక్తిని , ఫలములను విడిచియే చేయవలెనని నాయొక్క నిశ్చితమగు ఉత్తమాభిప్రాయము . ( వేదశాస్త్రాదులచే ) విధింపబడినట్టి కర్మముయొక్క పరిత్యాగము యుక్తము కాదు . అజ్ఞానముచే అట్టి కర్మమును ఎవడైన విడిచిపెట్టునేని అది తామసత్యాగమే యగునని చెప్పబడుచున్నది .

అ.
దుఃఖమిత్యేవ యత్కర్మ
కాయక్లేశభయాత్త్యజేత్|
స కృత్వా రాజసం త్యాగం
నైవ త్యాగఫలం లభేత్|| 18-8 ||

కందము .
శారీర దుఃఖ భయమున ,
కారియములఁ జేయు టుడుఁగగా , త్యాగ ఫలం
బేరికిని లేదు వ్యర్థం
బై రాజస మగును , ఫల్గునా ! యవి యెల్లన్ . ౬

ఎవడు శరీరప్రయాసవలని భయముచేత దుఃఖమును గలుగజేయునదియనియే తలంచి విధ్యుక్త కర్మమును విడిచిపెట్టునో , అట్టివాడు రాజసత్యాగమును గావించినవాడై త్యాగఫలమును బొందకయే యుండును .

అ.
కార్యమిత్యేవ యత్కర్మ
నియతం క్రియతేऽర్జున ! |
సఙ్గం త్యక్త్వా ఫలం చైవ
స త్యాగః సాత్త్వికో మతః|| 18-9 ||

తేటగీతి .
కార్యముల ఫలాశక్తి లేకయె గడంగి ,
నిత్య నైమిత్తికంబుల నెఱప వలయు ,
ఫలము త్యజించుటనె త్యాగమలరు
నట్టి త్యాగంబె , సాత్త్విక మనగఁ బఱగు . ౭

ఇది చేయదగినదియే యని తలంచి శాస్త్రనియమితమగు ఏకర్మము , అభిమానము , ఫలము విడిచిపెట్టబడి చేయబడుచున్నదో అట్టి ( కర్మమందలి సంగఫల ) త్యాగము సాత్త్విక త్యాగమని నిశ్చయింపబడినది .

అ.
న ద్వేష్ట్యకుశలం కర్మ
కుశలే నానుషజ్జతే|
త్యాగీ సత్త్వసమావిష్టో
మేధావీ ఛిన్నసంశయః|| 18-10 ||

ఉత్పలమాల .
మంగళమో , యమంగళమొ , మత్సర భావము నందకుండ నే
భంగి నిమిత్త కర్మల శుభా శుభ మెంచక , నాచరించు వాఁ
డుం గడు పండితుండయి , విలోలుఁడు గాఁడు ఫలంబులందు దు
ష్టిం గికురింపకన్ మెలగుఁ , జిన్మయ సత్త్వ గుణ ప్రధానుఁడై . ౮

సత్త్వగుణముతో గూడినవాడును , ప్రజ్ఞాశాలియు , సంశయములను బోగొట్టుకొనినవాడును నగు త్యాగశీలుడు , అశుభముము , కామ్యమును దుఃఖకరమును నగు కర్మను ద్వేషింపడు ; శుభమును , నిష్కామమును , సుఖకరమునగు కర్మయందు ఆసక్తుడుకాడు ( అభిమానము గలిగి యుండడు ) .

అ.
న హి దేహభృతా శక్యం
త్యక్తుం కర్మాణ్యశేషతః|
యస్తు కర్మఫలత్యాగీ
స త్యాగీత్యభిధీయతే|| 18-11 ||

కందము .
దేహాభిమానియగు నరుఁ
డూహింపఁగ లేఁడు కర్మ లుడుగుట కెపుడున్ ,
దేహము కర్మాగారము ,
దేహి ఫలత్యాగముననె ధీమంతుడగున్ . ౯

కర్మములను పూర్తిగా విడుచుటకు దేహధారియగు జీవునకు సాధ్యము కాదు . ఎవడు కర్మలయొక్క ఫలమును విడుచుచున్నాడో అట్టివాడే త్యాగియని పిలువబడుచున్నాడు .

అ.
అనిష్టమిష్టం మిశ్రం చ
త్రివిధం కర్మణః ఫలమ్|
భవత్యత్యాగినాం ప్రేత్య
న తు సంన్యాసినాం క్వచిత్|| 18-12 ||

తేటగీతి .
కర్మ త్రివిధమ్ములయి తిరుగాడుచుండు ,
నిష్టము , ననిష్టమును , మిశ్రమీ విధములు
త్యాగ శూన్యుల కివి రజ్జు లగుచు నుండు ;
త్యాగమూర్తికి కర్మ బంధములు లేవు . ౧౦

దుఃఖకరమైనదియు , సుఖకరమైనదియు , సుఖదుఃఖములు రెండును గలసినదియునగు మూడువిధములైన కర్మఫలము కర్మఫలత్యాగము చేయనివారలకు మరణానంతరము కలుగుచున్నది . కర్మఫలత్యాగము చేసినవారికన్ననో అవి యెన్నటికిని కలుగ నేరవు .

అ.
పఞ్చైతాని మహాబాహో !
కారణాని నిబోధ మే|
సాఙ్ఖ్యే కృతాన్తే ప్రోక్తాని
సిద్ధయే సర్వకర్మణామ్|| 18-13 ||

తేటగీతి .
కర్మ సిద్ధికిఁ గల వైదు కారణములు ,
వేద వేదాంతముల యందు విదిత మగును ;
సకల కర్మ ఫలప్రద సరణి నెఱపు
కారణమ్ముల వచియింతు , కవ్వడి ! విను . ౧౧

గొప్పబాహువులుకల ఓ అర్జునా 1 సమస్త కర్మలు నెరవేఱుటకు కర్మకాండయొక్క అంతమును దెలుపు సాంఖ్యశాస్త్రమునందు చెప్పబడిన ఈ ఐదు కారణములను నావలన తెలిసికొనుము .

అ.
అధిష్ఠానం తథా కర్తా
కరణం చ పృథగ్విధమ్|
వివిధాశ్చ పృథక్చేష్టా
దైవం చైవాత్ర పఞ్చమమ్|| 18-14 ||

కందము .
కారణములైదు వినుమీ ,
శారీరము , కర్త , కరణసంఘము , చేష్టల్ ,
దోరమగు దైవమైదవ
కారణమె బలాఢ్యమైన కారణము , సుమా ! ౧౨

ఈ కర్మచరణ విషయమున (1) శరీరము (2) కర్త (3) వివిధములగు ఇంద్రియములు (4) పలువిధములుగను , వేఱు వేఱుగను నుండు క్రియలు (వ్యాపారములు ) ఐదవదియగు (5) దైవమును కారణములుగా నున్నవి .

అ.
శరీరవాఙ్మనోభిర్య
త్కర్మ ప్రారభతే నరః|
న్యాయ్యం వా విపరీతం వా
పఞ్చైతే తస్య హేతవః|| 18-15
అ.
తత్రైవం సతి కర్తార
మాత్మానం కేవలం తు యః|
పశ్యత్యకృతబుద్ధిత్వా
న్న స పశ్యతి దుర్మతిః|| 18-16 ||

ఉత్పలమాల .
న్యాయసమన్వితంబు లయినన్ , మఱి న్యాయవిరుద్ధమైనఁ దాఁ
జేయు సమస్త కర్మముల సిద్ధికి నైదు కతంబు లుండఁ ; దా
నే యఖిల మ్మటంటని వచించు , సమస్తమునందు గర్త దా
నేయని , దుర్మతిన్ దలచి , ఈశు నెఱుంగడు సుంతయేనియున్ . ౧౩

మనుజుడు శరీరము , వాక్కు , మనస్సు అను వీనిచేత న్యాయమైనట్టిగాని ( శాస్త్రీయమైనట్టిగాని ) , అన్యాయమైనట్టి ( అశాస్త్రీయమైనట్టి ) గాని ఏకర్మమును ప్రారంభించుచున్నాడో దాని కీ యైదున్ను కారణములై యున్నవి . కర్మవిషయమందిట్లుండగా ( పైన దెల్పిన అయిదున్ను కారణములై యుండగా ) ఎవడు సంస్కరింపబడని బుద్ధిగలవాడగుటచే , నిరుపాధికుడగు ఆత్మను కర్తగా తలంచుచున్నాడో , అట్టి అవివేకి కర్మముయొక్కగాని , ఆత్మయొక్కగాని వాస్తవస్వరూపమును ఎఱుఁగకున్నాడు .

అ.
యస్య నాహంకృతో భావో
బుద్ధిర్యస్య న లిప్యతే|
హత్వాऽపి స ఇమాఁల్లోకా
న్న హన్తి న నిబధ్యతే|| 18-17 ||

చంపకమాల .
ఎవని కహంకృతుల్ సడలు , నెవ్వఁడు వీడును కర్తృ భోక్తృతల్ ,
యెవఁడు హృదంతరంబు విషయేచ్ఛలనుండి మరల్ప గల్గు , న
య్యవిరళ పండితుండెవని హత్య యొనర్చియుఁ , బాప మేనియున్
దవులడు , కర్మబంధములఁ దాకఁడు సుంతయు నేని ఫల్గునా ! ౧౪

ఎవనికి ' నేను కర్తను ' అను తలంపు లేదో , ఎవనియొక్క బుద్ధి విషయములను , కర్మలను అంటదో అతడీ ప్రాణులన్నిటిని చంపినను వాస్తవముగ ఏమియు చంపుట లేదు . మఱియు నతడు ( కర్మలచే , పాపముచే ) బంధింపబడుటయు లేదు .

అ.
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా
త్రివిధా కర్మచోదనా|
కరణం కర్మ కర్తేతి
త్రివిధః కర్మసంగ్రహః|| 18-18 ||

తేటగీతి .
జ్ఞానమున్ , జ్ఞాత , జ్ఞేయమ్ము లౌను త్రివిధ
కర్మ చోదనలని యెఱుగంగ వినుము ;
కరణములు , కర్మ , కర్తయుఁ గాగ త్రివిధ
ముల నుపాదేయములు వినగలుగు , పార్థ ! ౧౫

కర్మమునకు హేతువు తెలివి , తెలియదగిన వస్తువు , తెలియువాడు అని మూడు విధములుగ నున్నది . అట్లే కర్మకాధారమున్ను, ఉపకరణము ( సాధనము ) , క్రియ , చేయువాడు - అని మూడువిధములుగ నున్నది .

అ.
జ్ఞానం కర్మ చ కర్తాచ
త్రిధైవ గుణభేదతః|
ప్రోచ్యతే గుణసఙ్ఖ్యానే
యథావచ్ఛృణు తాన్యపి|| 18-19 ||

తేటగీతి .
సాంఖ్య తాంత్రజ్ఞులగు వారు , జ్ఞాన కర్త
కరణముల్ త్రివిధమ్ములను గాగను వచింత్రు ;
గుణ విభాగమ్ములెల్ల బాగుగ నెఱుంగ ,
నీకుఁ జెప్పెద వినుము , దానినిఁ గిరీటి ! ౧౬

గుణములనుగూర్చి విచారణచేయు సాంఖ్య శాస్త్రమునందు జ్ఞానము , కర్మము , కర్త అనునివియు సత్త్వాదిగుణములయొక్క భేదముననుసరించి మూడువిధములుగనే చెప్పబడుచున్నవి . వానినిగూడ ( శాస్త్రోక్త ప్రకారము ) చెప్పెదను వినుము .

అ.
సర్వభూతేషు యేనైకం
భావమవ్యయమీక్షతే|
అవిభక్తం విభక్తేషు
తజ్జ్ఞానం విద్ధి సాత్త్వికమ్|| 18-20 ||

కందము .
నానా విధముల ప్రాణుల
న్యూనాధిక దేహముల్ గనుంగొన నయ్యున్ ,
లోనున్న భావమొక్క డె
గా నెంచెడి నదియె సాత్త్విక జ్ఞానమగున్ . ౧౭

విభజింపబడి వేఱువేఱుగనున్న సమస్త చరాచర ప్రాణులందును , ఒక్కటైన నాశరహితమగు ఆత్మవస్తువును ( దైవముయొక్క ఉనికిని ) విభజింపబడక ( ఏకముగ నున్నట్లు ) ఏ జ్ఞానముచేత నెఱుఁగుచున్నాడో అట్టి జ్ఞానము తాత్త్వికమని తెలిసికొనుము .

అ.
పృథక్త్వేన తు యజ్జ్ఞానం
నానాభావాన్పృథగ్విధాన్|
వేత్తి సర్వేషు భూతేషు
తజ్జ్ఞానం విద్ధి రాజసమ్|| 18-21 ||

కందము .
నానావిధముల దేహుల ,
నానావిధ భిన్న భావనా లోకమునన్
బూని చరించెడు జ్ఞాన
మ్మౌనుఁ జుమా ! రాజసం బటంచుఁ దెలియగన్ . ౧౮

ఏ జ్ఞానమువలన మనుజుడు సమస్త ప్రాణులందును వేఱు వేఱువిధములుగనున్న అనేక జీవులను వేఱు వేఱుగా నెఱుఁగుచున్నాడో , అట్టి జ్ఞానమును రాజస జ్ఞానమని తెలిసికొనుము .

అ.
యత్తు కృత్స్నవదేకస్మిన్
కార్యే సక్తమహైతుకమ్|
అతత్త్వార్థవదల్పం చ
తత్తామసముదాహృతమ్|| 18-22 ||

చంపకమాల .
ఎదియొ , వివేక శూన్యముగ , నీప్సితముంగనఁ బిచ్చి నమ్మకం
బొదవ , న హేతుకంబుగ , నయుక్తముగాఁ బరమార్థమైన పె
న్నిధి వలెఁ జూచి , యల్పముల నింద్యములం బ్రసరించు తామస
ప్రదమగు జ్ఞాన మియ్యది , పరంతప ! దీని నెఱుంగు మియ్యెడన్ . ౧౯

ఏ జ్ఞానము వలన మనుజుడు ఏ దేని ఒక్క పనియందు ( శరీర , ప్రతిమాదులందు ) సమస్తమును అదియే యని తగిలియుండునో , అందులకు తగిన హేతువు లేకుండునో , తత్త్వమును ( సత్యవస్తువును ) తెలియకనుండునో , అల్పమైనదిగ ( అల్ప ఫలము గలిగినదిగ ) యుండునో , అట్టి జ్ఞానము తామసజ్ఞానమని చెప్పబడినది .

అ.
నియతం సఙ్గరహిత
మరాగద్వేషతః కృతమ్|
అఫలప్రేప్సునా కర్మ
యత్తత్సాత్త్వికముచ్యతే|| 18-23 ||

తేటగీతి .
ద్వేషరాగ ముడిపి , ఫలతృష్ణ లేక ,
నిత్య నై మిత్తికంబుల నియతి నెఱపు ,
కర్మ లెల్లను సాత్త్విక కర్మలనుచుఁ
దెలియఁబడు చుండు నీ జగతిని , గిరీటి ! ౨౦

శాస్త్రముచే నియమింపబడినదియు , ఫలాపేక్షగాని , ఆసక్తి ( సంగము ), అభిమానముగాని , రాగద్వేషములుగాని లేకుండ చేయబడునదియు సాత్త్వికకర్మమనఁబడును .

అ.
యత్తు కామేప్సునా కర్మ
సాహంకారేణ వా పునః|
క్రియతే బహులాయాసం
తద్రాజసముదాహృతమ్|| 18-24 ||

ఆటవెలది .
లౌకికంబుగ బహుళ ప్రయాసము , నహం
కార జనిత కర్మకాండ లెల్ల ,
రాజస ప్రధాన భాజనమ్మగు కర్మ
లనుచుఁ దెలియ వలయు , ననఘ చరిత ! ౨౧

ఫలాపేక్షగలవానిచేతగాని , మఱియు అహంకారముతో గూడినవానిచేగాని అధిక ప్రయాసకరమగు కర్మ మేది చేయబడుచున్నదో , అది రాజసకర్మయని చెప్పబడినది .

అ.
అనుబన్ధం క్షయం హింసా
మనపేక్ష్య చ పౌరుషమ్|
మోహాదారభ్యతే కర్మ
యత్తత్తామసముచ్యతే|| 18-25 ||

తేటగీతి .
తగుల , మిగులమ్ములను మదిఁ దలచకుండ ,
ప్రాణిపీడ పౌరుషమును పాటిఁ గొనక ,
మోహవశమునఁ జేసెడి మూర్ఖ కర్మ ,
తామసంబని నుడువగాఁ దగును , పార్థ ! ౨౨

తాను చేయు కర్మకు మున్ముందు కలుగబోవు దుఃఖాదులను ( ధనాదుల ) నాశమును , ( తనయొక్క , ఇతరులయొక్క శరీరాదులకుగల్గు ) బాధను , తన సామర్థ్యమును ఆలోచింపక , అవివేకముతో ప్రారంభింపబడు కర్మము తామసకర్మయని చెప్పబడుచున్నది .

అ.
ముక్తసఙ్గోऽనహంవాదీ
ధృత్యుత్సాహసమన్వితః|
సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః
కర్తా సాత్త్విక ఉచ్యతే|| 18-26 ||

తేటగీతి .
ధృతియు , నుత్సాహముల , కార్యగతిఁ గడంగి ,
కర్మఫలముల సక్తి స్వోత్కర్ష లుడిపి ,
సిద్ధ్య సిద్ధుల సమమైన చిత్తమలరు
నట్టి , కర్తను సాత్త్వి కుండని యెఱుంగు . ౨౩

సంగమును ( ఆసక్తిని ) , ఫలాపేక్షను విడచినవాడును , ' నేను కర్తన ' ను అభిమానము , అహంభావము లేనివాడును , ధైర్యముతోను , ఉత్సాహముతోను గూడియున్నవాడును , కార్యము సిద్ధించినను , సిద్ధింపకున్నను వికారమును జెందనివాడునునగు కర్త సాత్త్విక కర్త యని చెప్పబడును .

అ.
రాగీ కర్మఫలప్రేప్సు
ర్లుబ్ధో హింసాత్మకోऽశుచిః|
హర్షశోకాన్వితః కర్తా
రాజసః పరికీర్తితః|| 18-27 ||

తేటగీతి .
పరధనాపేక్ష , లుబ్ధత ప్రబలి , ప్రాణి
పీడకైన సుంతయు వెనుకాడ కుండ ,
హర్ష శోకంబులకు మనం బవియఁ జేయు
కర్తను నెఱుంగు రాజస వర్తనునిగ . ౨౪

అనురాగము ( బంధ్వాదులం దభిమానము ) గలవాడును , కర్మఫలము నాశించువాడును , లోభియు , హింసాస్వభావము కలవాడును , శుచిత్వము లేని వాడును , (కార్యము సిద్ధించినపుడు ) సంతోషముతోను , ( చెడినపుడు ) దుఃఖముతోను గూడియుండువాడునగు కర్త రాజసకర్త యని చెప్పబడును .

అ.
అయుక్తః ప్రాకృతః స్తబ్ధః
శఠో నైష్కృతికోऽలసః|
విషాదీ దీర్ఘసూత్రీ చ
కర్తా తామస ఉచ్యతే|| 18-28 ||

తేటగీతి .
స్వీయ కార్యము లేమియుఁ జేయలేక ,
పరుల కార్యమ్ము లెల్లనుఁ జెరచుచుండు ,
దీర్ఘసూత్రి మాయావి రోదించు కర్త ,
తామసుండని తెలియగఁ దగును , పార్థ ! ౨౫

మనోనిగ్రహము ( లేక చిత్తైకాగ్రత ) లేనివాడును , పామరస్వభావము గలవాడును ( అవివేకము ) , వినయము లేనివాడును , మోసగాడును , ఇతరులను వంచించి వారి జీవనములను పాడుచేయువాడును , సోమరితనముగలవాడును , ఎల్లప్పుడు దిగులుతో నుండువాడును , స్వల్పకాలములో చేయవలసినదానిని దీర్ఘకాలమునకైనను పూర్తిచేయనివాడును నగు కర్త తామసకర్త యని చెప్పబడుచున్నాడు .

అ.
బుద్ధేర్భేదం ధృతేశ్చైవ
గుణతస్త్రివిధం శృణు|
ప్రోచ్యమానమశేషేణ
పృథక్త్వేన ధనఞ్జయ|| 18-29 ||

కందము .
ధృతి , బుద్ధులు త్రివిధంబులు
గతిని బ్రవర్తిల్లుచుండుఁ గవ్వడి ! వినుమా ,
గతి భేదమ్ముల నందుఁ దొ
లుత బుద్ధి విశేషముల్ బలుకుదుఁ గిరీటీ ! ౨౬

ఓ అర్జునా ! బుద్ధియొక్కయు , ధైర్యముయొక్కయు భేదమును గుణములనుబట్టి మూడు విధములుగా వేఱ్వేఱుగను , సంపూర్ణముగను చెప్పబడుచున్నవానిని ( నీ విపుడు ) వినుము .

అ.
ప్రవృత్తిం చ నివృత్తిం చ
కార్యాకార్యే భయాభయే|
బన్ధం మోక్షం చ యా వేత్తి
బుద్ధిః సా పార్థ సాత్త్వికీ|| 18-30 ||

తేటగీతి .
మంచి చెడుగుల మది విభాగించు నేర్పు ,
బంధ మోక్షమ్ములును , భయాభయము లరయు
విజ్ఞతయు , యుక్త కార్య వివేచనమ్ము
నెఱపు బుద్ధియె , సాత్త్విక సరణి గనుమ , ౨౭

ఓ అర్జునా ! ఏ బుద్ధి ధర్మమందు ప్రవృత్తిని ( లేక ప్రవృత్తిమార్గమగు కర్మమార్గమును ) , అధర్మమునుండి నివృత్తిని ( లేక నివృత్తిమార్గమగు సన్న్యాసమార్గమును ) , చేయదగుదానిని , చేయదగనిదానిని , భయమును , అభయమును , బంధమును మోక్షమును తెలుసుకొనుచున్నదో అట్టిబుద్ధి సాత్త్వికమైనది యగును .

అ.
యయా ధర్మమధర్మం చ
కార్యం చాకార్యమేవ చ|
అయథావత్ప్రజానాతి
బుద్ధిః సా పార్థ రాజసీ|| 18-31 ||

కందము .
కార్యా కార్య విచక్షణ ,
ధుర్యతఁ గనకుండ దుర్మదోద్ధతి గనుచున్ ,
పర్యాలోకన మెఱుగని
చర్యల గను బుద్ధి , రాజసంబగు పార్థా ! ౨౮

ఓ అర్జునా ! ఏ బుద్ధిచేత మనుజుడు ధర్మమును , అధర్మమును చేయదగినదానిని , చేయరానిదానిని , ఉన్నదియున్నట్లుగాక ( మఱియొక విధముగ , పొరపాటుగ ) తెలిసికొనుచున్నాడో ఆ బుద్ధి రాజసబుద్ధియై యున్నది .

అ.
అధర్మం ధర్మమితి యా
మన్యతే తమసావృతా|
సర్వార్థాన్విపరీతాంశ్చ
బుద్ధిః సా పార్థ తామసీ|| 18-32 ||

కందము .
ధర్మము నధర్మమ్మని ,
దుర్మేధనుఁ గనుచు , సకల దురిత క్రియలన్
ధర్మమను యెంచు బుద్ధిని ,
ధర్మ సుతానుజ ! యెఱుంగు , తామస మనుచున్ . ౨౯

ఓ అర్జునా ! ఏ బుద్ధి అవివేకముచేత కప్పబడినదై అధర్మమును ధర్మమనియెంచునో , మఱియు సమస్తపదార్థములను విరుద్ధములుగా తలంచునో , అట్టి బుద్ధి తామస బుద్ధియై యున్నది .

అ.
ధృత్యా యయా ధారయతే
మనఃప్రాణేన్ద్రియక్రియాః|
యోగేనావ్యభిచారిణ్యా
ధృతిః సా పార్థ సాత్త్వికీ|| 18-33 ||

కందము .
చలనమ్మెఱుగని ధృతి , ని
శ్చలతను సకలేంద్రియములు స్వాధీనములై ,
వలయునటు నిలువరింపఁగఁ
గల ధృతిఁ దెలియనగు సాత్త్వికంబని పార్థా ! ౩౦

ఓ అర్జునా ! చలింపని ( విషయములందు ప్రవర్తింపని ) ఏ ధైర్యముతో గూడినవాడై మనసుయొక్కయు , ప్రాణముయొక్కయు , ఇంద్రియములయొక్కయు క్రియలను యోగసాధనచేత ( విషయములనుండి త్రిప్పి ఆత్మధ్యానమున , లేక శాస్త్రోక్తమార్గమున ) నిలువబెట్టుచున్నాడో , అట్టి ధైర్యము సాత్త్వికమైనది .

అ.
యయా తు ధర్మకామార్థాన్
ధృత్యా ధారయతేऽర్జున ! |
ప్రసఙ్గేన ఫలాకాఙ్క్షీ
ధృతిః సా పార్థ రాజసీ|| 18-34 ||

కందము .
నాలుగు పురుషార్థములన్ ,
నాలవదగు మోక్షము వినా త్రివిధములన్ ,
గ్రోలి , మహోత్కర్షమునన్
దూలెడు ధృతి , రాజసమ్ముతో నిబిడమ్మౌ , ౩౧

ఓ అర్జునా ! ఏ ధైర్యముచేత మనుజుడు ఫలాపేక్ష గలవాడై ధర్మమును , అర్థమును , కామమును మిగుల యాసక్తితో అనుష్ఠించుచుండునో , అట్టి ధైర్యము రాజసమై యున్నది .

అ.
యయా స్వప్నం భయం
శోకం విషాదం మదమేవ చ|
న విముఞ్చతి దుర్మేధా
ధృతిః సా పార్థ తామసీ|| 18-35 ||

తేటగీతి .
భయము , శోకమ్ము , మదము , స్వప్నములు గనుచు
నెపుడు దురపిల్లు దుర్మేధ ధృతి , కిరీటి !
తామసగుణ ప్రధానమై తనరుచుండు ,
నిదుర సుఖముగ గనుచుండు మదిని నెపుడు . ౩౨

ఓ అర్జునా ! ఏబుద్ధిచేత దుర్బుద్ధియగు మనుజుడు నిద్రను , భయమును , దుఃఖమును , సంతాపమును (దిగులును ) , మదమును విడువకయుండునో , అట్టి ధైర్యము తామసమై యున్నది .

అ.
సుఖం త్విదానీం త్రివిధం
శృణు మే భరతర్షభ|
అభ్యాసాద్రమతే యత్ర
దుఃఖాన్తం చ నిగచ్ఛతి|| 18-36 ||

తేటగీతి .
దుఃఖ జాలమ్ము లెల్లనుఁ దొలగిపోవ ,
నే సుఖమ్మునుఁ గోరెడు నా సుఖమ్ము ,
త్రివిధ రూపమ్ములై యనుభవము గాంచు ;
పురుషుఁ డభ్యాస వశుఁడౌచు నెఱిగి కొనును . ౩౩

భరతకుల శ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! దేనియొక్క అభ్యాసముచే మనుజుడు ఆనందము నొందుచుండునో , దుఃఖశాంతినిగూడ లెస్సగ బడయుచుండునో , అట్టి సుఖ మిపుడు మూడు విధములుగా నాచే తెలియబడుచున్నది .వినుము --

అ.
యత్తదగ్రే విషమివ
పరిణామేऽమృతోపమమ్|
తత్సుఖం సాత్త్వికం ప్రోక్త
మాత్మబుద్ధిప్రసాదజమ్|| 18-37 ||

తేటగీతి .
తొలుత కష్టమ్ముగాఁ దోచి , తుదకు నమృత
తుల్యమై , స్వీయబుద్ధినిఁ దోగు సుఖము ,
సాత్త్విక గుణ ప్రధానమ్ము , సవ్యసాచి !
నిరతి శయమగు సుఖమది , నిర్మలమ్ము , ౩౪

ఏ సుఖము ప్రారంభమునందు విషమువలెను , పర్యవసానమందు అమృతమును బోలినదిగను నుండునో , తన బుద్ధియొక్క నిర్మలత్వముచే గలుగునట్టి ఆ సుఖము సాత్త్వికమని చెప్పబడినది.

అ.
విషయేన్ద్రియసంయోగా
ద్యత్తదగ్రేऽమృతోపమమ్|
పరిణామే విషమివ
తత్సుఖం రాజసం స్మృతమ్|| 18-38 ||

తేటగీతి .
అమృత తుల్యమగుచు , నవల విషప్రాయ
మగుచు , సంకటముల కాకరమ్ము
లౌ , సుఖమ్ము లింద్రియారామజనితముల్ ,
రాజసములు పాండు రాజ తనయ ! ౩౫

ఏ సుఖము విషయేంద్రియసంబంధమువలన మొదట అమృతమును బోలియు , పర్యవసానమందు ( అనుభవానంతరమున ) విషమువలె నుండుచున్నదో అట్టి సుఖము రాజసమని చెప్పబడినది .

అ.
యదగ్రే చానుబన్ధే చ
సుఖం మోహనమాత్మనః|
నిద్రాలస్యప్రమాదోత్థం
తత్తామసముదాహృతమ్|| 18-39 ||

కందము .
సోమరిపోతు తనమ్మున ,
మైమరపున నెల్ల యపుడు మత్తిలు సుఖమున్ ,
వ్యామోహ నిద్ర జనితము ,
తామస సుఖ మనుచు దెలియ దగును , కిరీటీ ! ౩౬

నిద్ర , సోమరితనము , ప్రమత్తత - అనువానివలన బుట్టినదై , ఏ సుఖము ఆరంభమందును , అంతమందును ( అనుభవించిన మీదటను ) తనకు మోహమును

( అజ్ఞానమును , భ్రమను ) గలుగజేయుచున్నదో అది తామససుఖమని చెప్పబడినది .

అ.
న తదస్తి పృథివ్యాం వా
దివి దేవేషు వా పునః|
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం
యదేభిః స్యాత్త్రిభిర్గుణైః|| 18-40 ||

కందము .
పలు మాట లేల త్రిజగం
బుల నున్న సమస్త వస్తువుల్ త్రిగుణములౌ ;
తలదన్న నేరవా గుణ
కలితములే గాని , వేరుగావు , కిరీటీ ! ౩౭

ప్రకృతి ( మాయ ) నుండి పుట్టినవగు ఈ మూడుగుణములతో గూడియుండని వస్తు వీ భూలోకమునగాని , స్వర్గమందుగాని , దేవతలయందుగాని , ఎచటను లేదు .

అ.
బ్రాహ్మణక్షత్రియవిశాం
శూద్రాణాం చ పరన్తపబ్వ్ ! |
కర్మాణి ప్రవిభక్తాని
స్వభావప్రభవైర్గుణైః|| 18-41 ||

తేటగీతి .
ప్రకృతి జనితమ్ములగు గుణ క్రమము వడయు
కర్మల విధానమున , విభాగమ్ముఁ గాంచి ;
బ్రాహ్మణ క్షాత్ర వైశ్య శూద్రాళి చెలగు
నిజ గుణమ్ముల కనువగు నీతిఁ దవిలి . ౩౮

శత్రువులను తపింపజేయు ఓ అర్జునా ! బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య , శూద్రులకు వారివారి ( జన్మాంతర సంస్కారము ననుసరించిన ) స్వభావము ( ప్రకృతి ) వలన పుట్టిన గుణములనుబట్టి కర్మలు వేఱు వేఱుగ విభజింపబడినవి .

అ.
శమో దమస్తపః శౌచం
క్షాన్తిరార్జవమేవ చ|
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం
బ్రహ్మకర్మ స్వభావజమ్|| 18-42 ||

తేటగీతి .
దమము , శమము , తపము , శుచి
త్వము , లార్జవ , శాస్త్ర నియతి , తాలిమి , విజ్ఞా
నము , మొదలగు నైజ గుణ
క్రమ కర్మలు బ్రహ్మజాతి కర్మ లనఁబడున్ . ౩౯

అంతరింద్రియ నిగ్రహము ( మనోనిగ్రహము ) , బాహ్యేంద్రియ నిగ్రహము , తపస్సు , శుచిత్వము , ఋజుమార్గవర్తనము , శాస్త్రజ్ఞానము , అనుభవజ్ఞానము , దైవమందు గురువునందు , శాస్త్రమందు నమ్మకము గలిగియుండుట స్వభావమువలన పుట్టిన బ్రాఙ్మణకర్మయై యున్నది .

అ.
శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం
యుద్ధే చాప్యపలాయనమ్|
దానమీశ్వరభావశ్చ
క్షాత్రం కర్మ స్వభావజమ్|| 18-43 ||

కందము .
అని వెన్నుఁ జూపకుండుట ,
యనిశమ్మును దైవ భావ , మర్థి జనుల మ
న్నన సేయుట , శౌర్య ధృతియు ,
ననువగు గుణకర్మ క్షత్రియాళికి బార్థా ! ౪౦

శూరత్వము , తేజస్సు , కీర్తి , ప్రతాపము , ధైర్యము , సామర్థ్యము , యుద్ధమునందు పాఱిపోకుండుట , దానము ( ధర్మపూర్వక ) , ప్రజాపరిపాలనాశక్తి , ( శాసకత్వము ) - ఇయ్యవి స్వభావమువలన పుట్టిన క్షత్రియధర్మమై యున్నది .

అ.
కృషిగోరక్ష్యవాణిజ్యం
వైశ్యకర్మ స్వభావజమ్|
పరిచర్యాత్మకం కర్మ
శూద్రస్యాపి స్వభావజమ్|| 18-44 ||

తేటగీతి .
కృషియు , గోరక్ష , వాణిజ్య , పృథుల కర్మ
వైశ్యులకు నైజమగు కర్మలౌ కిరీటి !
సకల జనులకు బరిచర్య , సంఘసేవ
శూద్రులకు నైజకర్మ , యశోవిశాల ! ౪౧

వ్యవసాయము , గోసంరక్షణము , వర్తకము వైశ్యునకు స్వభావజనితములగు కర్మలై యున్నవి . అట్లే సేవారూపమైన కర్మము శూద్రులకు స్వభావసిద్ధమై యున్నది .

అ.
స్వే స్వే కర్మణ్యభిరతః
సంసిద్ధిం లభతే నరః|
స్వకర్మనిరతః సిద్ధిం
యథా విన్దతి తచ్ఛృణు|| 18-45 ||

ఆటవెలది .
ఎవ్వరెవరి ధర్మ మేరీతి విధియింపఁ
బడెనొ , యనుసరింప వలయు దాని ;
స్వీయ కర్మనిరతినే యలవడి , చిత్త
శుద్ధి నిడును , విను , విశుద్ధ చరిత ! ౪౨

తన తన స్వాభావిక కర్మమునం దాసక్తి ( శ్రద్ధ ) గల మనుజుడు జ్ఞానయోగ్యతారూపసిద్ధిని బొందుచున్నాడు . స్వకీయకర్మయం దాసక్తిగలవాడు జ్ఞానయోగ్యతారూపసిద్ధిని యెట్లు పడయగల్గునో దానిని చెప్పెదను వినుము .

అ.
యతః ప్రవృత్తిర్భూతానాం
యేన సర్వమిదం తతమ్|
స్వకర్మణా తమభ్యర్చ్య
సిద్ధిం విన్దతి మానవః|| 18-46 ||

కందము .
ఏమనుజుండు స్వధర్మము
నీమమున స్వకర్మ నిరతి నెఱపఁ గలుగునో ,
యా మనుజుఁడె సర్వాంత
ర్యామినిఁ గనఁ గల్గుఁ జిత్తమందు , సతంబున్ . ౪౩

ఎవనివలన ప్రాణులకు ఉత్పత్తి మొదలగు ప్రవర్తనము ( ప్రవృత్తి ) కలుగుచున్నదో , ఎవనిచేత ఈ సమస్త ప్రపంచము వ్యాపింపబడియున్నదో , అతనిని ( అట్టి పరమాత్మను ) , మనుజుడు స్వకీయ కర్మముచే నారాధించి జ్ఞానయోగ్యతారూపసిద్ధిని పొందుచున్నాడు .

అ.
శ్రేయాన్స్వధర్మో విగుణః
పరధర్మాత్స్వనుష్ఠితాత్||

కందము .
పరధర్మములను లెస్సగ
నెఱపంగాఁ గల్గు కంటె , నియమిత కర్మన్
నెరపవలె , దోషమయ్యును ;
దరియంగా రావు పాపతతు లవ్వానిన్ . ౪౪

తనయొక్క ధర్మము ( తన అవివేకముచే ) గుణము లేనిదిగ కనబడినను ( లేక , అసంపూర్ణముగ అనుష్ఠింపబడినను ) చక్కగా అనుష్ఠింపబడిన ఇతరుల ధర్మముకంటె ( లేక , ఇతర ధర్మములకంటె ) శ్రేష్ఠమైనదే యగును . స్వభావముచే ఏర్పడిన ( తన ధర్మమునకు తగిన ) కర్మమును చేయుచున్నయెడల మనుజుడు పాపమును పొందనేరడు .

అ.
స్వభావనియతం కర్మ
కుర్వన్నాప్నోతి కిల్బిషమ్|| 18-47
సహజం కర్మ కౌన్తేయ !
సదోషమపి న త్యజేత్|
సర్వారమ్భా హి దోషేణ
ధూమేనాగ్నిరివావృతాః|| 18-48 ||

చంపకమాల .
తగదు స్వధర్మమున్ విడువఁ దప్పులు కుప్పలుఁ గాగఁ దోచినన్ ,
వెగటుఁ గనంగరాదు ; పృథివీ స్థలిగల్గు సమస్త ధర్మముల్
పొగ సెగ లట్లు సమ్మిళితముల్ సుమ ! కావున , స్వీయధర్మ మె
న్నగ దురితాలవాల మయినన్ విడువంగనురాదు , ఫల్గునా ! ౪౫

ఓ అర్జునా ! స్వభావసిద్ధమగు కర్మము దోషయుక్తమైనను ( దృశ్య రూపమైనను , లేక , త్రిగుణాత్మకమైనను ) దానిని వదలరాదు . పొగచేత అగ్ని కప్పబడునట్లు సమస్తకర్మములును ( త్రిగుణములయొక్క ) దోషముచేత కప్పబడియున్నవి కదా.

అ.
అసక్తబుద్ధిః సర్వత్ర
జితాత్మా విగతస్పృహః|
నైష్కర్మ్యసిద్ధిం పరమాం
సంన్యాసేనాధిగచ్ఛతి|| 18-49 ||

ఆటవెలది .
విషయ వాంఛలుడిపి , విగతస్పృహుండయి ,
యింద్రియములను బిగియింప గలిగి ,
సకల కర్మలందు సంన్యాస భావమ్ము
నింపి , సిద్ధి నధిగమింపఁ గలఁడు . ౪౬

సమస్త విషయములందును తగులుబాటునొందని ( అసక్తమగు ) బుద్ధిగలవాడును , మనస్సును జయించినవాడును , కోరికలు లేనివాడు నగు మనుజుడు సంగత్యాగముచే ( జ్ఞానమార్గముచే ) సర్వోత్కృష్టమైన నిష్క్రియాత్మస్థితిని బొందుచున్నాడు .

అ.
సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ
తథాప్నోతి నిబోధ మే|
సమాసేనైవ కౌన్తేయ !
నిష్ఠా జ్ఞానస్య యా పరా|| 18-50 ||

చంపకమాల .
తనదు స్వధర్మ కర్మ నిరతం బొనరించి , పరాత్పరున్ బ్రపూ
జన మొనరించు , నాతఁ డెటు జ్ఞాన సమృద్ధియుఁ జిత్తశుద్ధియున్
గని , పరమాత్మ తత్త్వమునుఁగాంచఁ గలాడొ , యెఱుంగఁ జెప్పెదన్
వినుము , సమాప్త , మియ్యది వివేక పథంబగు బ్రహ్మనిష్ఠకున్ . ౪౭

ఓ అర్జునా ! కర్మసిద్ధిని ( నిష్కామకర్మలచే చిత్తశుద్ధిని ) బడసినవాడు పరమాత్మ నేప్రకారముగ పొందగలడో ఆ విధమును మఱియు జ్ఞానముయొక్క శ్రేష్ఠమైననిష్ఠ ( లేక పర్యవసానము ) ఏది కలదో దానినిన్ని ( జ్ఞాననిష్ఠను , లేక జ్ఞాన పరాకాష్ఠను ) సంక్షేపముగ నావలన దెలిసికొనుము .

అ.
బుద్ధ్యా విశుద్ధయా యుక్తో
ధృత్యాత్మానం నియమ్య చ|
శబ్దాదీన్విషయాంస్త్యక్త్వా
రాగద్వేషౌ వ్యుదస్య చ|| 18-51
అ.
వివిక్తసేవీ లఘ్వాశీ
యతవాక్కాయమానసః|
ధ్యానయోగపరో నిత్యం
వైరాగ్యం సముపాశ్రితః|| 18-52
అ.
అహంకారం బలం దర్పం
కామం క్రోధం పరిగ్రహమ్|
విముచ్య నిర్మమః శాన్తో
బ్రహ్మభూయాయ కల్పతే|| 18-53 ||

సీసము .
ధృతి బుద్ధి బలముతో నింద్రియ విషయేచ్ఛ ,
           బాహ్యశబ్దాదుల బందొనర్చి ,
ద్వంద్వమ్ములన్ సమాధానంబు నొందుచు ,
           హర్షశోకాదుల నవలద్రోసి ,
త్రికరమ్ములను స్వీయ కరాంచిత మొనర్చి ,
           సర్వ వైరాగ్యమ్ము సంతరించి ,
విజన స్థలంబున సంప్రీతిని వసియించి ,
           అల్ప ఖాద్యమ్ముల నారగించి ,

తేటగీతి.
క్రోధ కామ దర్పమ్ములుఁ గుదియఁ గట్టి ,
దేహ జీవితరక్తినిఁ దెగడి విడిచి ,
సర్వ కార్య కర్తృత్వమ్ము సంన్యసించి ,
శాంతిఁ గనుచుండు ధ్యానియై సంయముండు . ౪౮

అతినిర్మలమైన బుద్దితో గూడినవాడును , ధైర్యముతో మనస్సును నిగ్రహించువాడును , శబ్దస్పర్శాదివిషయములను విడిచిపెట్టువాడును , రాగద్వేషములను పరిత్యజించువాడును , ఏకాంతస్థలములందు నివసించువాడును , మితాహారమును సేవించువాడును , వాక్కును , శరీరమును , మనస్సును స్వాధీనము చేసికొనినవాడును , ఎల్లప్పుడును ధ్యానయోగతత్పరుడై యుండువాడును , వైరాగ్యమును లెస్సగ నవలంబించినవాడును , అహంకారమును, బలమును , ( కామక్రోధాది సంయుక్తమగు బలమును లేక మొండిపట్టును ) , డంబమును , కామమును ( విషయాసక్తిని ) , క్రోధమును , వస్తు సంగ్రహణమును , బాగుగా వదలివైచువాడును , మమకారము లేనివాడును , శాంతుడును అయియుండువాడు బ్రహ్మస్వరూపము నొందుటకు ( బ్రహ్మైక్యమునకు , మోక్షమునకు ) సమర్థుడగుచున్నాడు .

అ.
బ్రహ్మభూతః ప్రసన్నాత్మా
న శోచతి న కాఙ్క్షతి|
సమః సర్వేషు భూతేషు
మద్భక్తిం లభతే పరామ్|| 18-54 ||

తేటగీతి.
బ్రహ్మభావమ్ము నందిన పరమహంస ,
నిర్మల మనమ్ము గాంచి చింతింపడెపుడు ;
కాంక్షి కాబోడు , తనవలెఁ గాంచు నిఖిల
భూతతతి , నన్నె భక్తిని పూజసేయు . ౪౯

బ్రహ్మరూపమును (బ్రహ్మైక్యమును ) బొందినవాడు ( జీవన్ముక్తుడు ) , నిర్మలమైన ( ప్రశాంతమైన ) మనస్సుగలవాడు నగు మనుజుడు దేనిని గూర్చియు దుఃఖింపడు . దేనిని కోరడు . సమస్త ప్రాణులందును సమబుద్ధిగలవాడై ( వానిని తనవలనే చూచుకొనుచు ) నాయందలి ఉత్తమ భక్తిని పొందుచున్నాడు .

అ.
భక్త్యా మామభిజానాతి
యావాన్యశ్చాస్మి తత్త్వతః|
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా
విశతే తదనన్తరమ్|| 18-55 ||

తేటగీతి .
నిత్య భక్తి యుతుండయి , నిరుపమాన
మౌ , మదీయ సత్త్వ రూపాది మహిమ
లెఱిగికొని , బాగుగా గుఱు తెఱింగి ,
నన్నె పొందెడు , నదియె జ్ఞానమున కవధి . ౫౦

భక్తి చేత మనుజుడు ' నేనెంతటివాడనో , ఎట్టివాడనో ' యథార్థముగ తెలిసికొనుచున్నాడు . ఈ ప్రకారముగ నన్ను గూర్చి వాస్తవముగా నెఱిఁగి అనంతరము నాయందు ప్రవేశించుచున్నాడు .

అ.
సర్వకర్మాణ్యపి సదా
కుర్వాణో మద్వ్యపాశ్రయః|
మత్ప్రసాదాదవాప్నోతి
శాశ్వతం పదమవ్యయమ్|| 18-56 ||

తేటగీతి .
సర్వకర్మలు నాకయి నిర్వహించి ,
కర్మయోగియు నిష్కామ కర్మఁ జేసి ,
నాయనుగ్రహా వాప్తిని నన్నె బొందు
నన్యయంబగు నా పథం బఱసి , తుదకు ౫౧

సమస్త కర్మములను ఎల్లప్పుడును చేయుచున్నవాడైనను కేవలము నన్నే ఆశ్రయించువాడు ( శరణుబొందువాడు ) నా యనుగ్రహము వలన నాశరహితమగు శాశ్వత మోక్షపదమును పొందుచున్నాడు .

అ.
చేతసా సర్వకర్మాణి
మయి సంన్యస్య మత్పరః|
బుద్ధియోగముపాశ్రిత్య
మచ్చిత్తః సతతం భవ|| 18-57 ||

కందము .
నా కొఱకు కర్మఁ జేయుచు ,
నా కొఱకే ఫలము లర్పణం బొనరింపన్ ,
నాకృపను సద్వివేకము ,
నీ కొదవెడు ; నన్నె నిల్పు నీ చిత్తమునన్ . ౫౨

సమస్త కర్మములను ( కర్మఫలములను ) వివేకయుక్తమగు బుద్ధిచేత నాయందు సమర్పించి , నన్నే పరమప్రాప్యముగ నెంచినవాడవై చిత్తైకాగ్రతతోగూడిన తత్త్వవిచారణను ( లేక ధ్యానయోగమును ) అవలంబించి ఎల్లప్పుడు నాయందే చిత్తమును నిల్పుము .

అ.
మచ్చిత్తః సర్వదుర్గాణి
మత్ప్రసాదాత్తరిష్యసి|
అథ చేత్త్వమహంకారా
న్న శ్రోష్యసి వినఙ్క్ష్యసి|| 18-58 ||

కందము .
నా చిత్తగతుఁడవైన , ని
కే చెడుగును గాననేర విసుమంతయు ; నీ
వా చొప్పుఁగాక యెగసిన ,
నీచమ్మగు దుర్గతిన్ గణింతువు , పార్థా ! ౫౩

నాయందు చిత్తమును జేర్చినవాడవైతివేని నా యనుగ్రహమువలన సమస్త సాంసారిక దుఃఖములను దాటగలవు . అట్లుగాక అహంకారమువలన నా యీ వాక్యములను వినకుందువేని చెడిపోదువు .

అ.
యదహంకారమాశ్రిత్య
న యోత్స్య ఇతి మన్యసే|||

కందము .
దురహంకారము రేకె
త్తి రణం బొనరింప ననుచు దెగడి పలికినన్ ,
పరతంత్రుఁడవై , ప్రకృతికి
దురపిల్లుచుఁ దుదకు , కత్తి దూసెద వనిలోన్ . ౫౪

ఒకవేళ అహంకారము నవలంబించి ' నేను యుద్ధము చేయను ' అని నీవు తలంచెదవేని అట్టి నీ ప్రయత్నము వ్యర్థమైనదియే అగును.

అ.
మిథ్యైష వ్యవసాయస్తే
ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి|| 18-59
అ.
స్వభావజేన కౌన్తేయ !
నిబద్ధః స్వేన కర్మణా|
కర్తుం నేచ్ఛసి యన్మోహా
త్కరిష్యస్యవశోపి తత్|| 18-60||

తేటగీతి.
ఎముక రక్తమ్ములన్ బ్రవహించు క్షాత్ర
గుణము నైజమ్ము విదిలించు కొనఁగ లేవు ;
కుపిత మోహమ్ములను కొట్టుకొనుచుఁ దుదకు ,
యిచ్ఛ లేకున్న ననికి దూకెదవు , సుమ్ము ! ౫౫

( ఏలయనిన ) నీ ( క్షత్రియ ) స్వభావమే నిన్ను ( యుద్ధమున ) నియోగింపగలదు . ఓ అర్జునా ! స్వభావము ( పూర్వజన్మ సంస్కారము ) చే గలిగిన ( ప్రకృతిసిద్ధమైన ) నీయొక్క కర్మముచే లెస్సగ బంధింపబడినవాడవై దేనిని చేయుటకు అవివేకమున నిచ్చగించకున్నావో దానిని పరాధీనుడవై ( కర్మాధీనుడవై ) తప్పక చేసియే తీరుదువు .

అ.
ఈశ్వరః సర్వభూతానాం
హృద్దేశేऽర్జున తిష్ఠతి|
భ్రామయన్సర్వభూతాని
యన్త్రారూఢాని మాయయా|| 18-61 ||

ఉత్పలమాల .
ఏను సమస్త భూతతతి హృత్కమలాంతరమందు నుందు , నీ
ప్రాణుల యంత్రముల్ పగిది బల్మరు నైజ గుణక్రమమ్ములన్
బూని , శివమ్ము లెత్తఁగఁ బ్రమోహితులై నటియింపఁ జేయుదున్ ;
గాన , మదీయ మాయలకుఁ గట్టడులై వసియింతు రెప్పుడున్ . ౫౬

ఓ అర్జునా ! జగన్నియామకుడు పరమేశ్వరుడు ( అంతర్యామి ) మాయచేత సమస్తప్రాణులను యంత్రము నారోహించినవారినివలె ( కీలుబొమ్మలనువలె ) త్రిప్పుచు సమస్త ప్రాణులయొక్క హృదయమున వెలయుచున్నాడు .

అ.
తమేవ శరణం గచ్ఛ
సర్వభావేన భారత|
తత్ప్రసాదాత్పరాం శాన్తిం
స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్|| 18-62 ||

తేటగీతి.
నన్నె సకలమ్ముగా మననమొనర్చి ,
నాదు శరణమ్ము నొందు మనారతమ్ము ;
నా యనుగ్రహా వాప్తియై నా పథమ్ము ,
శాశ్వతానంద మొందుచు , శాంతిఁగనెదు . ౫౭

ఓ అర్జునా ! సర్వవిధముల ఆ ( హృదయస్థుడగు ) ఈశ్వరునే శరణుబొందుము . ఆతని యనుగ్రహముచే సర్వోత్తమమగు శాంతిని , శాశ్వతమగు మోక్షపదవిని నీవు పొందగలవు .

అ.
ఇతి తే జ్ఞానమాఖ్యాతం
గుహ్యాద్గుహ్యతరం మయా|
విమృశ్యైతదశేషేణ
యథేచ్ఛసి తథా కురు|| 18-63 ||

తేటగీతి.
గుహ్యములలోన పరమ నిగూఢ మెల్ల ,
జెప్పినాడను ; ఇక విమర్శించు కొనుము ,
చేయవలసిన దెద్ది , నిషిద్ధ మెద్ది !
ఎఱిగి కొంచు , యథేచ్ఛను నేగుమయ్య ! ౫౮

ఈ విధముగ రహస్యము లన్నిటికంటెను పరమరహస్యమైనట్టి జ్ఞానమును ( గీతాశాస్త్రము ) నేను నీకు జెప్పితిని . దీనినంతను బాగుగ విచారణచేసి తదుపరి నీ కెట్లిష్టమో అట్లాచరింపుము .

అ.
సర్వగుహ్యతమం భూయః
శృణు మే పరమం వచః|
ఇష్టోऽసి మే దృఢమితి
తతో వక్ష్యామి తే హితమ్|| 18-64 ||

తేటగీతి.
పిన్ననాటి సఖుడవు , ప్రియతముఁడవు,
యిష్టుఁడవు గాన , మఱల వచింతు వినుము ;
సర్వ గుహ్యతమమ్మగు సారమెల్ల ,
నీ హితంబును గోరి కౌంతేయ ! దీని . ౫౯

ఓ అర్జునా ! రహస్యములన్నిటిలోను పరమరహస్యమైనదియు , శ్రేష్ఠమైనదియునగు నా వాక్యమును మఱల వినుము . ( ఏలయనిన ) నీవు నాకు మిక్కిలి ఇష్టుడవు . ఇక్కారణమున నీ యొక్క హితమును గోరి మఱల చెప్పుచున్నాను .

అ.
మన్మనా భవ మద్భక్తో
మద్యాజీ మాం నమస్కురు|
మామేవైష్యసి సత్యం తే
ప్రతిజానే ప్రియోऽసి మే|| 18-65 ||

కందము .
నాయందె మనము నించుము ;
నాయందే భక్తి నిలుపు ; నాకై కర్మల్
జేయుము ; సతత మ్మావల
నాయందే యుందు వెపుడు , నాకుఁ బ్రియుడవై . ౬౦

నాయందు మనస్సునుంచుము , నా యెడల భక్తి కలిగియుండుము , నన్నారాధింపుము , నాకు నమస్కరింపుము . అట్లు కావించెదవేని నీవు నన్నే పొందగలవు . నీవు నాకిష్టుడవైయున్నావు . కాబట్టి యథార్థముగా ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను .

అ.
సర్వధర్మాన్పరిత్యజ్య
మామేకం శరణం వ్రజ|
అహం త్వా సర్వపాపేభ్యో
మోక్షయిష్యామి మా శుచః|| 18-66 ||

చంపకమాల.
విడువుము , ధర్మ మర్మపు వివేక విచక్షణ లెల్ల ; నీవు నా
యడుగుల నాశ్రయంబుగను ; మన్నిట నన్ శరణంబు వేడు ; మే
గడపెద , సర్వపాపములఁ గర్మల బంధములన్ విదల్తు ; గ
వ్వడి ! దురపిల్ల బోకుమ , రవంతయు , నీ కభయమ్ము నిచ్చితిన్ . ౬౧

సమస్త ధర్మములను విడిచిపెట్టి నన్నొక్కనిమాత్రము శరణుబొందుము . నేను సమస్త పాపములనుండియు నిన్ను విముక్తునిగ జేసెదను .

అ.
ఇదం తే నాతపస్కాయ
నాభక్తాయ కదాచన|
న చాశుశ్రూషవే వాచ్యం
న చ మాం యోऽభ్యసూయతి|| 18-67 ||

ఉత్పలమాల .
తగదు వచింప గీతను, వృథాయగు భక్తులు కాని వారికిన్,
తగదు, తపోవిహీనులనుదగ్గర జేరగ నీయరాదు, బొ
త్తుగ వచియింప రాదల మదోన్మద మానసులౌచు నన్న సూ
య గతిని జూచువారలకు, నార్యుల శిక్షణ లేనివారికిన్ . ౬౨

నీకు బోధింపబడిన ఈ గీతాశాస్త్రమును తపస్సు లేనివానికిగాని , భక్తుడు కానివానికిగాని , వినుట కిష్టము లేనివానికిగాని ( లేక గురుసేవచేయనివానికిగాని ) , నన్ను దూషించువానికిగాని ( లేక , నా యెడల అసూయజెందువానికిగాని ) ఎన్నడును చెప్పదగినది కాదు .

అ.
య ఇదం పరమం గుహ్యం
     మద్భక్తేష్వభిధాస్యతి|
భక్తిం మయి పరాం కృత్వా
     మామేవైష్యత్యసంశయః|| 18-68 ||

కందము .
గీతార్థ సంప్రదాయము ,
వ్రాతల , వ్యాఖ్యలనుఁ దెల్పు వారలు సతమున్
నాతుల్య భావ గరిమన్
పూతూత్ములఁ గాంచి నన్నె బొందెదరు జుమా ! ౬౩

ఎవడు అతిరహస్యమైన గీతాశాస్త్రమును నా భక్తులుకు చెప్పునో అట్టివాడు నాయందుత్తమ భక్తి గలవాడై , సంశయరహితుడై ( లేక , నిస్సందేహముగ ) నన్నే పొందగలడు .

అ.
న చ తస్మాన్మనుష్యేషు
కశ్చిన్మే ప్రియకృత్తమః|
భవితా న చ మే తస్మా
దన్యః ప్రియతరో భువి|| 18-69 ||

కందము .
గీతాచార్యుని కంటెను
ప్రీతిని నొనగూర్చువాఁడు పృథివిని లే ; డీ
గీతా రహస్య వేదియె ,
చేతోముద మొదవ జేయు , సిద్ధము నాకున్ . ౬౪

మనుజులలో అట్టివానికంటె నాకు మిక్కిలి ప్రియము నొనర్చువాడెవడును లేడు . మఱియు నాకు మిక్కిలి ఇష్టుడైనవాడు ఈ భూలోకమున మఱియొకడు కలుగబోడు .

అ.
అధ్యేష్యతే చ య ఇమం
ధర్మ్యం సంవాదమావయోః|
జ్ఞానయజ్ఞేన తేనాహ
మిష్టః స్యామితి మే మతిః|| 18-70 ||

కందము .
మన యిరువుర సంవాద
మ్మనయము పఠియింపఁ గల్గునట్టి సుజను , నే
ననితర వాత్సల్యమునన్
గను చుండెద , ననుచుఁ దెలియగా నగు పార్థా ! ౬౫

ఎవడు ధర్మయుక్తమైన ( లేక , ధర్మస్వరూపమేయగు ) మన యిరువురి ఈ సంభాషణమును అధ్యయనము చేయునో అట్టివానిచే జ్ఞానయజ్ఞముచేత నేనారాధింపబడినవాడ నగుదునని నా నిశ్చయము .

అ.
శ్రద్ధావాననసూయశ్చ
శృణుయాదపి యో నరః|
సోऽపి ముక్తః శుభాఁల్లోకాన్
ప్రాప్నుయాత్పుణ్యకర్మణామ్|| 18-71 ||

తేటగీత .
శ్రద్ధ గీతను వినువారు , సవ్యసాచి !
పాపముల నుండి ముక్తులై , వారు కూడ
పుణ్య కర్మలఁ జేసెడి పూజ్యులరుగు
లోకములకుఁ బోయెదరు , సుశ్లోక చరిత ! ౬౬

ఏ మనుజుడు శ్రద్ధతో కూడినవాడును , అసూయ లేనివాడునునై ఈ గీతాశాస్త్రమును వినునో , అట్టివాడును పాపవిముక్తుడై పుణ్యకార్యములను చేసినవారియొక్క పుణ్యలోకములను పొందును .

అ.
కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ !
త్వయైకాగ్రేణ చేతసా|
కచ్చిదజ్ఞానసమ్మోహః
ప్రనష్టస్తే ధనఞ్జయ|| 18-72 ||

కందము .
వింటివె యేకాగ్రత , మొద
లంటఁగ నీ శాస్త్రమున్ , రహస్యము లెల్లన్ ;
గంటివె సుజ్ఞానము , తుద
లంటగ నజ్ఞానమోహ మడుగంటినదే ? ౬౭

ఓ అర్జునా ! నా యీ బోధను నీవు ఏకాగ్రమనస్సుతో వింటివా ? అజ్ఞానజనితమగు నీయొక్క భ్రమ ( దానిచే ) సంపూర్ణముగా నశించినదా ?

అర్జున ఉవాచ|
అ.
నష్టో మోహః స్మృతిర్లబ్ధా
త్వత్ప్రసాదాన్మయాచ్యుత|
స్థితోऽస్మి గతసన్దేహః
కరిష్యే వచనం తవ|| 18-73 ||

అర్జును వాక్యము .
కందము.
నీ కృపను వింటి సర్వము ,
చీకటి దుర్మోహ మడగె , స్మృతి లభియించెన్ ;
చే కొంచు , శిరము దాల్చెద
వాకొన్న విధంబు నడచువాఁడ , ముకుందా ! ౬౮

అర్జునుడు చెప్పెను .

ఓ శ్రీ కృష్ణా ! నీయనుగ్రహమువలన నాయజ్ఞానము నశించినది . జ్ఞానము ( ఆత్మస్మృతి ) కలిగినది . సంశయములు తొలగినవి . ఇక నీ యాజ్ఞను నెరవేర్చెదను .

సఞ్జయ ఉవాచ|
అ.
ఇత్యహం వాసుదేవస్య
పార్థస్య చ మహాత్మనః|
సంవాదమిమమశ్రౌష
మద్భుతం రోమహర్షణమ్|| 18-74 ||

సంజయ వాక్యము .
కందము.
పరమ పవిత్రంబగు నీ
హరి నర సంవాదముల్ స్వయంబుగ వింటిన్ ,
గరు పొడచు నద్భుతంబగు
నరకేశవ వాదముల్ వినంగ నరేశా ! ౬౯

సంజయుడు చెప్పెను .

ఓ ధృతరాష్ట్రమహారాజా ! ఈ ప్రకారముగా నేను శ్రీకృష్ణునియొక్కయు , మహాత్ముడగు అర్జునునియొక్కయు ఆశ్చర్యకరమైనట్టియు , పులకాంకురమును కలుగజేయునదియు నగు ఈ సంభాషణమును వింటిని .

అ.
వ్యాసప్రసాదాచ్ఛ్రుతవా
నేతద్గుహ్యమహం పరమ్|
యోగం యోగేశ్వరాత్కృష్ణా
త్సాక్షాత్కథయతః స్వయమ్|| 18-75 ||

కందము .
హరి పలుకులన్ స్వయమ్ముగ
దరి నిల్చి వినంగ గల్గె ధన్యుఁడ నైతిన్ ;
పరమ రహస్యం బెరిగితి ,
వరదుండౌ వ్యాసు గృపను , పౌరవ ముఖ్యా ! ౭౦

శ్రీ వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహమువలన , నేను అతిరహస్యమైనదియు , మిగుల శ్రేష్ఠమైనదియు నగు ఈ యోగశాస్త్రమును స్వయముగనే అర్జునునకు చెప్పుచున్న యోగేశ్వరుడగు శ్రీకృష్ణునివలన ప్రత్యక్షముగా ( నేరుగా ) వింటిని .

అ.
రాజన్సంస్మృత్య సంస్మృత్య
సంవాదమిమమద్భుతమ్|
కేశవార్జునయోః పుణ్యం
హృష్యామి చ ముహుర్ముహుః|| 18-76
అ.
తచ్చ సంస్మృత్య సంస్మృత్య
రూపమత్యద్భుతం హరేః|
విస్మయో మే మహాన్ రాజన్ !
హృష్యామి చ పునః పునః|| 18-77 ||

కందము .
నర కేశవ సంవాదము
స్మరియించు కొలంది , నాకు సంతస మొదవున్ ;
హరి యత్యద్భుత రూపము
స్మరియింప , స్మరింప రిచ్చ ; సంతస మొదవున్ . ౭౧

ఓ ధృతరాష్ట్రమహారాజా ! ఆశ్చర్యకరమైదియు , పావనమైనదియు , ( లేక పుణ్యదాయకమైనదియు ) నగు కృష్ణార్జునులయొక్క ఈ సంభాషణమును తలంచి తలంచి మాటిమాటికి ఆనందమును బొందుచున్నాను --ఓ ధృతరాష్ట్రమహారాజా ! శ్రీకృష్ణమూర్తియొక్క మిగుల ఆశ్చర్యకరమైన ఆ విశ్వరూపమును తలంచి తలంచి నాకు మహదాశ్చర్యము కలుగుచున్నది . మఱియు ( దానిని తలంచుకొని ) మాటిమాటికిని సంతోషమును బొందుచున్నాను .

అ.
యత్ర యోగేశ్వరః కృష్ణో
యత్ర పార్థో ధనుర్ధరః|
తత్ర శ్రీర్విజయో భూతి
ర్ధ్రువా నీతిర్మతిర్మమ|| 18-78 ||

కందము .
ఎచ్చట యోగీశ్వర హరి ,
యెచ్చట గాండీవి యుందు రేక ముఖులు రై ,
లచ్చి , విభూతి , జయోన్నతు
లచ్చోటనె యుండు సకలమంచుఁ దలంతున్ . ౭౨

ఎచట యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడున్ను , ఎచట ధనుర్ధారియగు అర్జునుడున్ను ఉందురో అచట సంపదయు , విజయమున్ను , ఐశ్వర్యమున్ను , దృఢమగు నీతియు ఉండునని నా యభిప్రాయము .

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
మోక్షసంన్యాసయోగో నామ అష్టాదశోऽధ్యాయః|| 18 ||

ఓమ్ తత్ సత్
ఇట్లు శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రిచే యనువదింపబడిన
శ్రీగీతామృత తరంగిణి యందలి శ్రీ మోక్ష సంన్యాసయోగమను
అష్టాదశ తరంగముసర్వము సంపూర్ణము .
శ్రీ కృష్ణ పరబ్రహ్మార్పణమస్తు .

ఇది శ్రీ వేదవ్యాసముని విరచితమైనదియు , నూఱువేల శ్లోకములు

గలదియును , ఛందోబద్ధమైనదియునగు శ్రీ మహాభారతమున భీష్మపర్వమునగల ఉపనిషత్ప్రతిపాదకమును , బ్రహ్మవిద్యయు , యోగశాస్త్రమును , శ్రీకృష్ణార్జున సంవాదమును నగు శ్రీ భగవద్గీతలందు మోక్షసన్న్యాసయోగమను పదునెనిమిదవ అధ్యాయము సంపూర్ణము.

ఓం
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశమ్|
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాఙ్గమ్|
లక్ష్మీకాన్తం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యమ్|
వన్దే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్||


శ్రీ గీతామృత తరంగిణి
అర్జునవిషాద యోగము | సాంఖ్య యోగము | కర్మ యోగము | జ్ఞాన యోగము | కర్మసన్యాస యోగము | ఆత్మసంయమ యోగము | జ్ఞానవిజ్ఞాన యోగము | అక్షరపరబ్రహ్మ యోగము | రాజవిద్యారాజగుహ్య యోగము | విభూతి యోగము | విశ్వరూపసందర్శన యోగము | భక్తి యోగము | క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము | గుణత్రయవిభాగ యోగము | పురుషోత్తమప్రాప్తి యోగము | దైవాసురసంపద్విభాగ యోగము | శ్రద్దాత్రయవిభాగ యోగము | మోక్షసన్యాస యోగము