శివపురాణము/విద్వేశ్వర ఖండము/శ్రీ శివపురాణ మాహాత్మ్యం

వికీసోర్స్ నుండి

సర్వదేవతా సంప్రీతికరంగాను, సర్వ ఋషిగణములకు శ్రవణ పేయంగాను 12 రోజులపాటు సూతమహర్షి శ్రీ శివ మహా పురాణాన్ని వినిపించిన అనంతరం - ఉపసంహారంగా....ఈ మహాపురాణ మహాత్మ్యాన్ని వివరించే రెండు వృతాంతాలను వినిపించి పురాణ పరిసమాప్తి గావించాడు అవి -

1. చంచులోపాఖ్యానం :

ఈ భూమి మొత్తం పైన నీచుల నిలయం - బాష్కలం అనే ఒకానొక గ్రామంలో బిందుగుడనే ముష్కరుడొకడు ఉండేవాడు. అతడు ఓ రోజున సర్వజన సమ్మోహకారియైన ఓ వైశ్యను చూసి, తన ధన సమయాలు మొత్తం ఆమెకే ధారపోయసాగాడు. బిందుగుడి భార్య చంచుల, ఎన్నాళ్లుగానో భర్తకోసం ఎదురు చూసి - చూసి...ఎంతకూ అతడి రాకను గానక చేసేది లేక తానుకూడా పతిని అనుసరించింది. పరపురుషుల్ని కూడి సుఖించసాగింది.

చంచుల జారిణిగా మారిన వైనం బిందుగుడికి తెలిసి భార్యను నిలదీయగా - ఆమె ఎదురు తిరిగింది. తనని సుఖ పెట్టవలసిన బాధ్యతని భర్తగా అతడు విస్మరించి నందున తానీ చర్యకు దిగవలసి వచ్చిందన్నది.

అప్పటికే చంచుల విటులకు బాగా అలవాటుపడినందున, తన బుద్ధీ వేశ్యాలంపట మైనందున బిందుడుగు ఆమెనేమీ అనలేకపోయాడు. జారణికి భర్తకూడా దేనికని, లోకులు తన వెనుక అనుకోవడం చంచుల విన్నది. ఆమెకు భర్త అవసరం - ఈ చాటుమాటు వ్యవహారానికి ఎంతో ఉన్నది. అందువల్ల ఇద్దరూ ఒక ఒప్పందానికొచ్చి 'చంచుల యధేచ్చగా విటులతో సంచరించి ధన గ్రహణం చేసి బిందుగుడికి ఇచ్చేలాగున - దాన్ని అతడు వ్యభిచారానికి వాడుకొనేలాగున - ఈమె సంసారస్త్రీ లాగున - అతడు ఆమెకు అండకలిగిన భర్త లాగున ఉండడానికి నిర్ణయించుకున్నారు.

నిరంతర వ్యభిచారంతో బిందుగుడు సుఖరోగాలపుట్ట అయి త్వరలోనే మరణించాడు. చంచుల మాత్రం జాతర్లంటకుండా తిరుగుతూ జారిణిగానే సంచరించసాగింది.

ఓసారి గోకర్ణక్షేత్రం జాతరలో, ఆమె అప్రయత్నంగానే మహాబళేశ్వరాలయంలో జరుగుతున్న శివపురాణం విన్నది. ఆమె పాపాలన్నీ పటాపంచలయిపోయాయి.

విట సంగమం మానేసింది. కాని ఆమెను విటులు వెంటాడడం మానలేదు. ఒకానొక జారపురుషుడితో పెనుగులాటలో ఆమె మరణించింది.

కేవలం శ్రీ శివపురాణ శ్రవణం వల్ల కల్గిన పుణ్యవశాన ఆమెకు ఈశ్వరసాయుజ్యం లభించింది.

కైలాసం చేరుకున్నాక, చంచుల ఆ మహా వైభవాన్ని స్వయంగా అనుభవించాక, అది తన భర్తకు కూడా అందించాలని ఆరాటపడింది.

అమ్మవారిని ప్రాధేయపడింది. ఆమె పతి భక్తిని మెచ్చుకుంది అమ్మవారు.

పిశాచరూపుడై తిరుగుతున్న బిందుగుడిని - చంచుల, శివదూతల సాయంతో కట్టి పడేసి శ్రీతుంబుర మహర్షిచేత శివపురాణ గానం చేయించేసరికి బిందుగుడి పిశాచరూపం వదలిపోయింది.

ఒక్కరొక్కరుగా సమస్త దేవతాగణం అక్కడికి చేరుకుని తుంబురకృత పురాణగానం విని ధన్యులైనారు. పురాణశ్రవణ మాహాత్మ్యంలో బిందుగుడికీ కైలాసవాస సౌఖ్యం కలిగింది.

ఇంకొక వృత్తాంతం ఆలకించండి -

2. దేవరాజోపాఖ్యానం :

కిరాతనగరంలో దేవరాజనే ఒక అనాచారవంతు డుండేవాడు. వైశ్యవృత్తి చేత ధనాకర్షణే పరమధర్మంగా బతుకుతూ - నమ్ముకున్న వారినే నిలువునా ముంచుతు - అపార సంపదలు ఆర్జించాడు.

ఓ రోజు రాచవీధిలో 'శోభ' అనే విలాసినీ మణిని చూసి, ఆమెపై మనసు పారేసుకున్నాడు. సొమ్ము చూపనిదే, ఎవరి చూపునైనా దరిచేరనిస్తుందా?

ఆమె కోసం ఇంత సంపాదననూ మంచినీళ్లలా ఖర్చు పెట్టసాగాడు. ఓ రోజు రాత్రి ఇంట్లో అయిన వాళ్లందర్నీ హత్యచేసి, ఉన్న సంపదనంతా ఆ వేశ్యాలలన వశం చేశాడు. ఇంతచేసినా ఆమె అతణ్ణి చివరికాసు కూడా లాక్కుని తన్ని తరిమేసింది.

దేవరాజు పిచ్చివానిలా ఊళ్లుపట్టుకు తిరగసాగాడు. చివరికి శీతల జ్వరం క్రమ్మి, లేవలేని స్థితిలో ఓ శివాలయ మంటపంపై పడిపోయాడు. నిస్సత్తువచేత - ఆ మంటపం వద్ద జరుగుతున్న శివపురాణ శ్రవణం కర్ణామృతమై అతనికి సోకింది. శివపురాణం, అతడి ఆయుఃప్రమాణం ఒక్క రోజుతోనే ముగిశాయి.

నిష్కామకర్ముడైన శ్రీ శివపురాణశ్రవణం విన్న ఫలితంగా శివసాయుజ్యం పొందాడు దేవరాజు.

ఓ శౌనకాది మహర్షులారా! మీరు ఇంత వరకు విన్న శ్రీ శివమహాపురాణం అనంత మహిమాన్వితమైనది. ఇందులో మనం సర్వాంశాలూ చర్చించాము. సమస్త రీతులూ దర్శించాము. ఈ ద్వాదశదిన శివపురాణం పారాయణగా నిష్ఠగా ఎవరు చేస్తారో...వారికి ఇహమందు సమస్త సౌఖ్యాలూ కలిగి, పరమందు శివ సాయుజ్యం తథ్యం అని సూత మహర్షి పురాణ పరిసమాప్తిని ప్రకటించాడు.

అనంతరం...

కల్పవృక్ష, కామధేనువుల కరుణవల్ల శ్రీ శివమహాదేవునికి మహానైవేద్యం ఏర్పర్చబడి, అది దైవప్రసాదంగా అందరికీ సంతర్పణ చేయబడింది. శ్రీ శివ పురాణం సర్వం సంపూర్ణము ........ఓం నమః శ్శివాయ