Jump to content

రామదాసు కీర్తనలు

వికీసోర్స్ నుండి

రామదాసు కీర్తనలు

కొన్ని ఇక్కడ:

పలుకే బంగారం....

[మార్చు]

పల్లవి:పలుకే బంగారమాయెనా కోదండపాణి
కోదండపాణి పలుకే బంగారమాయెనా

అనుపల్లవి:పలుకే బంగారమాయె పిలచిన పలుకవేమి
కలలో నీనామ స్మరణ మరువా చక్కని తండ్రి

చరణం1:ఇరువుగా ఇసుకలోన పొరలిన ఉడతాభక్తికి
కరుణించి బ్రోచితివని నెరనమ్మితి నిన్నే తండ్రి

చరణం2:ఎంత వేడినా నీకు సుంతైనా దయరాదు
పంతము సేయగ నేనంతటి వాడను తండ్రి

చరణం3:శరణాగతాత్రణ బిరుదాంకితుడవు గాన
కరుణించు భద్రాచల వరరామ దాస పోషక

శ్రీరామ నామం ....

[మార్చు]


శ్రీరామ నామం మరువాం మరువాం
సిధ్ధము యమునకు వెరువాం వెరువాం
గోవిందునేవేళ గొలుతాం గొలుతాం
దేవుని గుణములు దలుతాం దలుతాం

విష్ణు కధలు చెవుల విందాం విందాం
వేరె కధలు చెవుల మందాం మందాం
రామదాసులు మాకు సారాం సారాం
కామదాసులు మాకు దూరం దూరాం

నారాయణుని మేము నమ్మాం నమ్మాం
నరులనింకా మేము నమ్మాం నమ్మాం
మాధవా నామము మరువాం మరువాం
మరి యమభాదకు వెరువాం వెరువాం.

అవనిజపతి సేవ మానాం మానాం
మరియొక జోలంటే మౌనాం మౌనాం
భద్రగిరీశుని కందాం కందాం
భద్రముతో మనం ఉందాం ఉందాం

ఇదిగో భద్రాద్రి ....

[మార్చు]


పల్లవి:ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి

చరణం1:ముదముతో సీతాముదిత లక్ష్మణులు
కలసి కొలువగ రఘుపతి యుండెడి

చరణం2:చారుస్వర్ణ ప్రాకార గోపుర
ద్వారములతొ సుందరమై యుండెడి

చరణం3:అనుపమానమై అతి సుందరమై
ధనురు చక్రము ధగధగ మెరసెడి

చరణం4:కలియుగమందున నిల వైకుంఠము
నలరుచున్నది నయముగ మ్రొక్కుడి

చరణం5:పొన్నగ పొగడల పూపొదరిండ్లను
చెన్నుమీరగను శృంగారంబగు

చరణం6:శ్రీకరముగ శ్రీరామదాసుని
ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము

తక్కువేమి మనకూ....

[మార్చు]

పల్లవి: తక్కువేమి మనకూ రాముం
డొక్కడుండు వరకూ

చరణం1: ప్రక్కతోడుగా భగవంతుడు
మన చక్రధారియై చెంతనె ఉండగా

చరణం2: మ్రుచ్చుసోమకుని మును జంపిన ఆ
మత్సమూర్తి మనపక్షమునుండగా

చరణం3: భూమిస్వర్గములు పొందుగ గొలచిన
వామనుండు మనవాడై యుండగ

చరం4: దశగ్రీవుముని దండించిన ఆ
ధశరధ రాముని దయ మనకుండగ

చరణం5: దుష్టకంసునీ దుంచినట్టి శ్రీ
కృష్ణుడు మనపై గృపతో నుండగ

చరణం6: రామదాసుని గాచెడి శ్రీ
మన్నారాయణి నెరనమ్మియుండగ

ఏతీరుగ నను దయజూచెదవో

[మార్చు]


పల్లవి: ఏతీరుగ నను దయజూచెదవో యినవంశోత్తమరామా
నాతరమా భవసాగరమీదను నళినదళేక్షణరామా ఏ..

చరణం1: శ్రీరఘునందన సీతారమణా శ్రితజనపోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిను కన్నదికానుపు రామా..

చరణం2: మురిపెముతో నాస్వామివి నీవని ముందుగ దెల్పితి రామా
మరువక యిక నభిమానముంచు నీమరుగు జొచ్చితిని రామా ఏ..

చరణం3: క్రూరకర్మములు నేరకచేసితి నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారముచేయవె దైవశిఖామణి రామా ఏ..

చరణం4: గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా
గురుదైవంబని యెరుగక తిరిగెడు క్రూరుడనైతిని రామా ఏ..

చరణం5: నిండితి నీవఖిలాండకోటి బ్రహ్మాండములందున రామా
నిండుగ మది నీనామము దలచిన నిత్యానందము రామా ఏ..

చరణం6: వాసవకమల భవాసురవందిత వారధి బంధన రామా
భాసురవర సద్గుణములు గల్గిన భద్రాద్రీశ్వర రామా ఏ..

చరణం7: వాసవనుత రామదాస పోషక వందన మయోధ్యరామా
దాసార్చిత మాకభయ మొసంగవె దాశరథీ రఘురామా ఏ..

అంతా రామమయంబీ జగమంతా రామమయం

[మార్చు]


పల్లవి: అంతా రామమయంబీ జగమంతా రామమయం అం..

చరణం1: అంతరంగమున నాత్మారాముం డ
నంతరూపమున వింతలు సలుపగ అం..

చరణం2: సోమసూర్యులును సురలును తారలును
ఆ మహాంబుధులు నఖిల జగంబులు అం..

చరణం3: అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగ అం..

చరణం4: నదులు వనంబులు నానామృగములు
విదితకర్మములు వేదశాస్త్రములు అం..

చరణం5: అష్టదిక్కులును నాదిశేషుడును
అష్టవసువులును నరిషడ్వర్గము అం..

చరణం6: ధీరుడు భద్రాచల రామదాసుని
కోరిక లొసగెడి తారకనామము అం..

ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా

[మార్చు]


పల్లవి: ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్ను
రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా ఇ..

చరణం1: చుట్టుప్రాకారములు సొంపుగ చేయిస్తి రామచంద్రా
ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ..

చరణం2: గోపురమంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్రా నను
క్రొత్తగ జూడక నిత్తరిబ్రోవుము రామచంద్రా ఇ..

చరణం3: భరతునకు చేయిస్తి పచ్చలపతకము రామచంద్రా
ఆ పతకమునకుబట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ..

చరణం4: శత్రుఘ్నునకు నేను చేయిస్తి మొలత్రాడు రామచంద్రా
ఆ మొలత్రాడునకు బట్టె మొహరీలు పదివేలు రామచంద్రా ఇ..

చరణం5: లక్ష్మణునకు జేయిస్తి ముత్యాలపతకము రామచంద్రా
ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ..

చరణం6: సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా
ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ..

చరణం7: వాహనములు మీకు వరుసతో జేయిస్తి రామచంద్రా జగ
న్మోహన సంకెళ్ళు వేసిరి కాళ్ళకు రామచంద్రా ఇ..

చరణం8: కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా
నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా ఇ..

చరణం9: మీ తండ్రి దశరథమహారాజు పెట్టెనా రామచంద్రా
లేక మీమామ జనకమహారాజు పంపెనా రామచంద్రా ఇ..

చరణం10: అబ్బా తిట్టితినని యాయాసపడవద్దు రామచంద్రా
ఈ దెబ్బలకోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్రా ఇ..

చరణం11: సర్కారు పైకము తృణముగనెంచకు రామచంద్రా
దెబ్బలకోర్వను యప్పుదీర్చుమయ్య రామచంద్రా ఇ..

చరణం12: ఏటికి జల్లిన నీళ్ళాయె నా బ్రతుకు రామచంద్రా
నేను అధములందరికంటె అన్యాయమైతిని రామచంద్రా ఇ..

చరణం13: కౌసల్యపుత్రుడ దశరథతనయుడ రామచంద్రా
కావు క్షేమముగ భద్రాద్రి నెలకొన్న శ్రీరామచంద్రా ఇ..

చరణం14: భక్తులందరిని పరిపాలించెడి శ్రీరామచంద్రా
నీవు క్షేమముగ రామదాసుని నేలుము రామచంద్రా ఇ..