Jump to content

పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/శౌనకుడు సూతు నడుగుట

వికీసోర్స్ నుండి


తెభా-2-281-క.
విని శౌనకుండు సూతుం
నుఁగొని యిట్లనియె "సూత !రుణోపేతా!
నుత గుణసంఘాతా!
పుణ్యసమేత! విగతలుషవ్రాతా!

టీక:- విని = విని; శౌనకుండున్ = శౌనకుడు; సూతున్ = సూతుని; కనుఁగొని = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; సూత = సూతుడా; కరుణ = దయతో; ఉపేతా = కూడినవాడా; జన = జనులచే; నుత = పొగడతగ్గ; గుణ = గుణముల; సంఘాతా = సంఘములు కలవాడా; ఘన = గొప్ప; పుణ్య = పుణ్యములు; సమేత = కూడినవాడా; విగత = విడిచిన; కలుష = పాపముల; వ్రాతా = సమూహము కలవాడా.
భావము:- భాగవతలక్షణాలు, ఫ్రళయాది వివరాలు అన్ని తెలియచెప్పగా విని శౌనకుడు ఇలా అడగసాగాడు. "ఓ సూతమహర్షి! నీవు దయామయుడవు. సజ్జనులచే పొగడదగ్గ సుగుణాలు అనేకం కలవాడవు. సర్వ పాపములను విడిచిన వాడవు. అని ఇంకా ఇలా అడుగసాగాడు.

తెభా-2-282-వ.
పరమభాగవతోత్తముండైన విదురుండు బంధుమిత్రజాతంబుల విడిచి సకల భువనపావనంబులునుఁ, గీర్తనీయంబులును నైన తీర్థంబులను, నగణ్యంబులైన పుణ్యక్షేత్రంబులను దర్శించి, క్రమ్మఱవచ్చి, కౌషారవి యగు మైత్రేయుం గని యతనివలన నధ్యాత్మబోధంబు వడసె నని వినంబడు; నది యంతయు నెఱింగింపు"మనిన నతండు యిట్లనియె.
టీక:- పరమ = అత్యుత్తమ; భాగవత = భాగవతులలో; ఉత్తముండు = ఉత్తముడు; ఐన = అయిన; విదురుండున్ = విదురుడు; బంధు = బంధువులు; మిత్ర = మిత్రుల; జాతంబులన్ = సమూహములను; విడిచి = విడిచిపెట్టి; సకల = సమస్త; భువన = లోకములకును; పావనంబులునున్ = పవిత్రము చేయగలవియును; కీర్తనీయములును = కీర్తింప తగినవియును; ఐనన్ = అయిన; తీర్థంబులనున్ = తీర్థములను; అగణ్యంబులు = లెక్కకు మిక్కిలినవి; ఐనన్ = అయిన; పుణ్య = పుణ్య; క్షేత్రంబులనున్ = క్షేత్రములను; దర్శించి = దర్శించుకొని; క్రమ్మఱన్ = మరలి; వచ్చి = వచ్చి; కౌషారవి = కుషారవుని పుత్రుడు {కౌషారవి - కుషారవుని పుత్రుడు, మైత్రేయుడు}; అగు = అయిన; మైత్రేయున్ = మైత్రేయుని; కని = చూసి; అతని = అతని; వలనన్ = వలన; ఆధ్యాత్మ = ఆధ్యాత్మిక {ఆధ్యాత్మ - ఆధ్యాత్మిక - ఆత్మకు సంబంధించిన జ్ఞానము}; బోధంబున్ = జ్ఞానమును; పడసెన్ = పొందెను; అని = అని; వినంబడున్ = అందురు; అది = అది; అంతయున్ = అంతా; ఎఱిగింపుము = తెలుపుము; అనినన్ = అనగ; అతండున్ = అతడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- శౌనకుడు సూతునితో పుణ్యాత్మా! మహా పుణ్యతీర్థములు సర్వలోకములందును పవిత్రము చేయగలవి. పరమభాగవతశ్రేష్ఠుడు అయిన విదురుడు బంధువులను, మిత్రులను, అందరిని విడిచిపెట్టి లెక్కకు మించిన అట్టి పుణ్యతీర్థములను దర్శించాడు. తిరిగి స్వస్థానానికి వస్తు కుషారవుని కుమారుడగు మైత్రేయుని దర్శించాడు. అతని వలన ఆధ్యాత్మికాది జ్ఞానము అపారంగా తెలిసికొన్నాడు అంటారు కదా. అదంతా మాకు వివరంగా చెప్పు అని అడిగాడు. అంతట సూతుడు శౌనకాది మునులకు ఇలా చెప్పసాగాడు.

తెభా-2-283-క.
"వినుఁ డిపుడు మీరు నన్నడి
గి తెఱఁగున శుకమునీంద్రగేయుఁ బరీక్షి
జ్జపతి యడిగిన నతఁడా
ని కెఱిఁగించిన విధంబుఁ గ నెఱిఁగింతున్.

టీక:- వినుఁడు = వినండి; ఇపుడున్ = ఇప్పుడు; మీరున్ = మీరు; నన్నున్ = నన్ను; అడిగిన = అడిగిన; తెఱంగునన్ = విధముగనే; శుక = శుకుడు అను; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠులచే; గేయున్ = కీర్తింపబడు వానిని; పరీక్షిత్ = పరీక్షిత్తు; జన = జనులకు; పతి = ప్రభువు, మహారాజు; అడిగిన = అడిగిన; అతఁడున్ = అతడు; ఆతనిన్ = అతనిని; కిన్ = కి; ఎఱింగించినన్ = తెలిపిన; విధంబుఁన్ = ప్రకారముగ; తగ = చక్కగ; ఎఱింగింతున్ = తెలిపెదను.
భావము:- "ఆధ్యాత్మికాది జ్ఞానవిషయమై ఓ శౌనకాది మునులారా! ఇప్పుడు మీరు అడిగినట్లే పూర్వం పరీక్షిత్తు అడుగగా శుకమహర్షి వివరించాడు. అదంతా మీకు చక్కగా తెలియ జెప్తాను"అని సూతుడు చెప్పసాగాడు.

తెభా-2-284-వ.
సావధానులరై వినుం"డని.
టీక:- సావధానులరు = శ్రద్ధ కలవారు {సావధానము - అవధరించుటను కలిగిఉండుట, శ్రద్ధ}; ఐ = అయి; వినుండున్ = వినండి; అని = అని.
భావము:- శౌనకాది మునులారా! అలా శుకముని పరీక్షిన్మహారజుకి చెప్పిన విషయం చెప్పబోతున్నాను శ్రద్దగా వినండి."అని సూతమహర్షి చెప్పసాగాడు.