పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/భాగవత దశలక్షణంబులు
తెభా-2-257-సీ.
అవనీశ! నీవు న న్నడిగిన పగిది నా-
తఁడుఁ దండ్రి నడుగఁ బితామహుండు
భగవంతుఁ డాశ్రితపారిజాతము హరి-
గృపతోడఁ దన కెఱింగించి నట్టి
లోకమంగళ చతుశ్శ్లోక రూపంబును-
దశలక్షణంబులఁ దనరు భాగ
వతము నారదున కున్నతిఁ జెప్పె; నాతఁడు-
చారు సరస్వతీ తీరమునను
తెభా-2-257.1-తే.
హరిపదధ్యాన పారీణుఁ డాత్మవేది
ప్రకటతేజస్వి యగు బాదరాయణునకుఁ
గోరి యెఱిఁగించె; నమ్మహోదారుఁ డెలమి
నాకు నెఱిఁగించె; నెఱిగింతు నీకు నేను.
టీక:- అవనీశ = రాజ, పరీక్షితా; నీవున్ = నీవు; నన్నున్ = నన్ను; అడిగినన్ = అడిగినట్టి; పగిది = విధముగ; ఆతఁడుఁన్ = అతడు, నారదుడు; తండ్రిన్ = తండ్రిని, బ్రహ్మదేవుని; అడుగన్ = అడుగగ; పితామహుండు = తాత, విష్ణువు; భగవంతుఁడున్ = భగవంతుడు {భగవంతుడు - సమస్తమైన మహిమలు కలవాడు}; ఆశ్రిత = ఆశ్రయించిన వారికి; పారిజాతమున్ = కల్పవృక్షము; హరి = హరి; కృపన్ = దయ; తోడఁన్ = తో; తనకున్ = తనకు; ఎఱింగించినట్టి = తెలిపినట్టి; లోకన్ = లోకములకు; మంగళ = శుభకరమైన; చతుస్ = నాలుగు; శ్లోకన్ = శ్లోకముల; రూపంబునన్ = రూపములో; దశ = పది; లక్షణంబులున్ = లక్షణములతో; తనరు = అలరారు; భాగవతమున్ = భాగవతమును; నారదున్ = నారదున; కున్ = కు; ఉన్నతిఁన్ = ఉదారబుద్ధితో; చెప్పెన్ = చెప్పెను; ఆతఁడు = అతడు; చారు = పవిత్రమైన; సరస్వతీ = సరస్వతీనదీ; తీరమునన్ = తీరములో;
హరిన్ = హరి యొక్క {హరి - సమస్త బంధనాలను హరింపజేయు వాడు}; పద = పాదముల ఎడ; ధ్యాన = ధ్యానము చేయుటలో; పారీణుఁడు = బహు నేర్పరి; ఆత్మ = ఆత్మవిద్య; వేది = తెలిసిన వాడు; ప్రకటన్ = ప్రసిద్ది పొందిన; తేజస్విన్ = తేజస్సు కలవాడు; అగున్ = అయిన; బాదరాయణున్ = వేదవ్యాసుని {బాదరాయణుడు - బదరీ వనపు ఋషి, బాదర (ప్రయోజనములను) ఆయణుడు (లేనివాడు), వ్యాసుడు}; కున్ = కి; కోరి = ఇష్టంగా; ఎఱిగించెన్ = తెలిపెను; ఆ = ఆ; మహ = మిక్కిలి; ఉదారుఁడు = ఔదార్యము కలవాడు; ఎలమిన్ = ప్రేమగా; నాకున్ = నాకు; ఎఱిఁగించెన్ = తెలిపెను; ఎఱిగింతున్ = తెలిపెదను; నీకున్ = నీకు; నేనున్ = నేను.
భావము:- ఓ పరీక్షిన్మహారాజ! నువ్వు నన్ను ఎలా అడిగావో, అదేవిధంగా పూర్వం నారదమహర్షి తన తండ్రి బ్రహ్మదేవుని అడిగాడు. అంతనా చతుర్ముఖబ్రహ్మ తనకు విష్ణుమూర్తి దయతలచి తెలియజేసిన లోకకల్యాణకరమైన నాలుగు శ్లోకాల రూపంలో, పది లక్షణాలు కలిగిన భాగవతాన్ని నారదునికి చెప్పాడు. ఒకనాడు సరస్వతీతీరంలో పరమ హరిభక్తుడు, గొప్ప ఆత్మజ్ఞాని, బహుళ తేజశ్శాలి అయిన వేదవ్యాసునికి ఆ నారదమహర్షి తెలియజెప్పాడు. ఆ వ్యాసులవారు నాకు చెప్పారు. నేను నీకు చెప్తాను. శర్ద్ధగా విను. అని శుకబ్రహ్మ పరీక్షిత్తునకు లెలిపి ఇంకా ఇలా చెప్పసాగాడు.
తెభా-2-258-వ.
అదియునుంగాక యిపుడు విరాట్పురుషునివలన నీ జగంబు లే వడువునఁ బొడమె ననునవి మొదలయిన ప్రశ్నంబులు గొన్ని నన్నడిగితివి ఏను నన్నిటికి నుత్తరం బగునట్లుగా నిమ్మహాభాగవతం బుపన్యసించెద నాకర్ణింపుము; అమ్మహాపురాణంబు చతుశ్శ్లోక రూపంబును దశలక్షణంబునునై సంకుచిత మార్గంబున నొప్పు; నందు దశలక్షణంబు లెవ్వి యనిన "సర్గంబును, విసర్గంబును, స్థానంబునుఁ, బోషణంబును, నూతులును, మన్వంతరంబులును, నీశానుచరితంబులును, నిరోధంబును, ముక్తియు, నాశ్రయంబును, ననం బది తెఱుంగు లయ్యె; దశమాశ్రయ విశుద్ధ్యర్థంబు తక్కిన తొమ్మిది లక్షణంబులుఁ జెప్పంబడె నవి యెట్టి వనిన.
టీక:- అదియునున్ = అంతే; కాకన్ = కాకుండగ; ఇపుడున్ = ఇప్పుడు; విరాట్పురుషునిన్ = విరాట్పురుషుని {విరాట్పురుషుడు - విశ్వము అంతా తన రూపముగ కలవాడు, విశ్వరూపుడు}; వలనన్ = వలన; ఈ = ఈ; జగంబున్ = లోకములు; ఏ = ఏ; వడవునన్ = వడుపుతో, విధముగ; పొడమెన్ = రూపములను పొందెను, పుట్టినవి; అనునవి = అనే; మొదలయిన = లాంటి; ప్రశ్నంబులున్ = ప్రశ్నలు; కొన్ని = కొన్ని; నన్నున్ = నన్ను; అడిగితివి = అడిగినావు; ఏను = నేను; అన్నిటి = అన్నిటి; కిన్ = కిని; ఉత్తరంబున్ = సమాధానము; అగునట్లుగాన్ = అయ్యే విధముగ; ఈ = ఈ; మహా = గొప్ప; భాగవతంబున్ = భాగవతమును; ఉపన్యసించెదన్ = వివరించెదను; ఆకర్ణింపుము = వినుము; ఆ = ఆ; మహా = గొప్ప; పురాణంబున్ = పురాణము; చతుస్ = నాలుగు; శ్లోకన్ = శ్లోకముల; రూపంబునన్ = స్వరూపములో; దశ = పది; లక్షణంబునున్ = లక్షణములును; ఐ = కలిగినదై; సంకుచిత = సంగ్రహమైన, చిన్నదైన; మార్గంబునన్ = విధముగ; ఒప్పున్ = ఒప్పి ఉండును; అందున్ = దానిలోని; దశ = పది; లక్షణంబులున్ = లక్షణములు; ఎవ్వి = ఏవి; అనినన్ = అంటే; సర్గంబునున్ = సర్గమును; విసర్గంబునున్ = విసర్గమును; స్థానంబునున్ = స్థానమును; పోషణంబునున్ = పోషణమును; ఊతులునున్ = ఊతులును; మన్వంతరంబులునున్ = మన్వంతరములును; ఈశానుచరితంబులును = ఈశ్వరునిచరిత్రములు; నిరోధంబునున్ = నిరోధము; ముక్తియున్ = ముక్తి; ఆశ్రయంబునున్ = ఆశ్రయము; అనన్ = అనే; పది = పది; తెఱంగులు = విధములు; అయ్యెన్ = అయినవి; దశమ = పదవది అయిన; ఆశ్రయన్ = ఆశ్రయము; విశిద్ధి = పరిశుద్ధి; అర్థంబున్ = కోసము; తక్కిన = మిగిలిన; తొమ్మిదిన్ = తొమ్మిది; లక్షణంబులుఁన్ = లక్షణాలు; చెప్పంబడెన్ = చెప్పబడినవి; అవి = అవి; ఎట్టివి = ఎలాంటివి; అనినన్ = అంటే.
భావము:- పరీక్షిత్తు! విష్ణుమాయ గురించే కాకుండ, విరాట్పురుషుని నుండి ఈ లోకాలు అన్నీ ఎలా సృష్టింపబడ్డాయి మొదలైన ప్రశ్నలు అడిగావు కదా. వాటన్నిటికి సమాధానంగా శ్రీమద్భాగవతమును చెప్తాను. శ్రద్ధగా విను. దశలక్షణాలు చెప్తు నాలుగు శ్లోకాల రూపంలో సంగ్రహంగా ఉంటుంది. ఆ దశలక్షణాలు ఏవంటే 1) సర్గము 2) విసర్గము 3) స్థానము (స్థితి) 4)పోషణము (వృద్ధి) 5)ఊతులు 6)మన్వంతరములు 7) ఈశానుచరితంబులు 8) నిరోధము 9) ముక్తి మరియు 10) ఆశ్రయము.
గమనిక: -చతుశ్శ్లోకి గా ప్రసిద్ధమైన గ్రంథభాగము:-
1. యావానహం యథా భావో యద్రూపగుణకర్మశః|
తథైవ తత్త్వవిజ్ఞాన మస్తుతే మదనుగ్రహాన్||
2. అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్సదసత్పరమ్|
పశ్చాదహం యదేతచ్ఛ యో2వశిష్యేత సో2స్మ్యహమ్||
3. ఋతే2ర్థం యత్ప్రతీయేత న ప్రతీయేత చాత్మని|
తద్విద్యాదాత్మనే మాయాం యథా22భాసో యథా తమః||
4. యథా మహాంతి భూతాని భూతేషూచ్చావచేష్వసి|
ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు న తేష్వహమ్””
ఈ పదిలక్షణాలను ఇకపై క్రమంగా వివరించబడతాయి.
తెభా-2-259-తే.
మహదహంకార పంచ తన్మాత్ర గగన
పవన శిఖి తోయ భూ భూతపంచ కేంద్రి
యప్రపంచంబు భగవంతునందు నగుట
సర్గ మందురు దీనిని జనవరేణ్య!
టీక:- మహత్ = మహత్తు, మనసు; అహంకార = అహంకారము; పంచతన్మాత్ర = పంతన్మాత్రలు {పంచ తన్మాత్రంబులు - శబ్దము, స్పర్శము, రూపము, రుచి, వాసన వాని మూల తత్వములు (5)}; గగన = ఆకాశము; పవన = వాయువు; శిఖి = అగ్ని; తోయ = నీరు; భూ = భూమి; భూత = భూతముల; పంచక = ఐదును; ఇంద్రియ = ఇంద్రియములు {ఇంద్రియ ప్రపంచము - పంచేంద్రియములు - కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అను ఇంద్రియములు}; ప్రపంచమున్ = సమస్తమును; భగవంతున్ = భగవంతుని; అందున్ = అందు; అగుటన్ = కలుగుట; సర్గము = సర్గము; అందురు = అంటారు; దీనిని = దీనిని; జన = మానవులలో; వరేణ్య = ఎంచదగ్గవాడా.
భావము:- ఓ పరీక్షిన్మహారాజ! మహత్తు, అహంకారం, పంచ తన్మాత్రలు అనెడి శబ్దము, స్పర్శము, రూపము, రుచి, వాసన అయిదు, పంచభూతములు అనెడి ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి అయిదు పంచేంద్రియములు అనెడి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అయిదు, విరాట్పురుషుని నుండి సృష్టింపబడుటను సర్గము అంటారు.
తెభా-2-260-క.
సరసిజగర్భుండు విరా
ట్పురుషునివలనన్ జనించి, భూరితర చరా
చర భూత సృష్టిఁ జేయుట
వరువడిని విసర్గ మండ్రు భరతకులేశా!
టీక:- సరసిజగర్భుండు = బ్రహ్మదేవుడు {సరసిగర్భుడు - సరసు లందు పుట్టునది (పద్మము) అందు పుట్టు వాడు, బ్రహ్మదేవుడు}; విరాట్పురుషునిన్ = విరాట్పురుషుని {విరాట్పురుషుడు - విశ్వమే తన స్వరూపమైన వాడు}; వలనన్ = వలన; జనియించి = పుట్టి; భూరితర = మిక్కిలిపెద్దదైన {భూరి భూరితరము భూరితమము}; చర = చరించగల; అచర = చరించలేని; భూత = జీవుల; సృష్టిఁన్ = సృష్టింప; చేయుటన్ = చేయుటైన; పరువడిని = క్రమమును; విసర్గము = విసర్గము; అండ్రున్ = అందురు; భరత = భరతుని; కుల = వంశపు; ఈశ = రాజా.
భావము:- ఓ భరత వంశ మహా రాజ! పరీక్షిత్తు! బ్రహ్మదేవుడు నారాయణుని నాభి పద్మనుండి జనించి, బహు విస్తారమైన ఈ చరాచర జగత్తు సమస్తమును క్రమముగ సృజించుటను విసర్గము అంటారు.
తెభా-2-261-క.
లోకద్రోహినరేంద్రా
నీకముఁ బరిమార్చి జగము నెఱి నిల్పిన యా
వైకుంఠనాథు విజయం
బాకల్పస్థాన మయ్యె నవనీనాథా!
టీక:- లోక = లోకములకు; ద్రోహి = ద్రోహము చేయునట్టి; నర = నరులకు {నరేంద్రుడు - నరులకు ఇంద్రుడు, రాజు}; ఇంద్ర = ప్రభువ, రాజ; అనీకమున్ = సమూహమును; పరిమార్చి = సంహరించి; జగమున్ = లోకములను; నెఱిన్ = చక్కగ; నిల్పినన్ = నిలబెట్టిన, రక్షించిన; ఆ = ఆ; వైకుంఠనాథున్ = వైకుంఠనాథుని {వైకుంఠనాథుడు - వైకుంఠమునకు ప్రభువు}; విజయంబున్ = విజయముతో; ఆకల్ప = కల్పాంతము వరకు ఉండేది; స్థానమున్ = స్థానము; అయ్యెన్ = అయినది; అవనీ = భూమికి {అవనీనాథ - భూమికి ప్రభువు, రాజు}; నాథా = ప్రభువ, రాజ.
భావము:- ఓ రాజా పరీక్షిత్తు! లోకద్రోహులైన రాజులను సంహరించి లోకాలను సంరక్షించుటలోని ఆ వైకుంఠుని విజయాలను స్థానము అంటారు. ఈ స్థానము అనే విష్ణు మహిమ కల్పాది నుండి కల్పాంతాలవరకు సాగుతూనే ఉంటుంది.
తెభా-2-262-క.
హరి సర్వేశుఁ డనంతుఁడు
నిరుపమ శుభమూర్తి సేయు నిజభక్త జనో
ద్ధరణము పోషణ మవనీ
వర!యూతు లనంగఁ గర్మవాసన లరయన్.
టీక:- హరి = హరి {హరి - బంధనాలు హరింప జేసి ఉద్దరించు వాడు, భగవంతుడు}; సర్వేశుఁడు = సర్వేశుడు {సర్వేశుడు - సర్వమునకు అధిపతి, భగవంతుడు}; అనంతుఁడు = అనంతుడు {అనంతుడు - అంతము లేని వాడు, భగవంతుడు}; నిరుపమ = సాటిలేని {నిరుపమశుభమూర్తి - సాటిలేని శుభమూర్తి, భగవంతుడు}; శుభ = శుభములు; మూర్తి = మూర్తీభవించిన వాడు; చేయున్ = చేసే; నిజ = తన; భక్త = భక్తుల; జన = సమూహముల; ఉద్ధరణము = ఉద్ధరణమును; పోషణము = పోషణము; అవనీ = భూమికి {అవనీవర - భూమికి వరుడ - రాజు}; వర = భర్త, రాజ; యూతులు = ఊతులు {ఊతులు - కర్మమముల వాసనలు (దూర ప్రభావములు) భవిష్య ప్రాప్తంబులకు ఊతములైనవి కనుక ఊతులు}; అనంగన్ = అంటే; కర్మ = కర్మముల; వాసనలు = వాసనలు; అరయన్ = తెలిసికొంటే.
భావము:- రాజ్యంలోని ప్రజలను పోషిస్తుండే పరీక్షిన్మహారాజా! ఇక పోషణ అంటే విశ్వేశ్వరుడు, శాశ్వతుడు, సాటిలేని శుభమూర్తి, పాపాలను హరించువాడు అయిన విష్ణుభగవానుడు తన భక్తు లను ఉద్ధరించుట, పోషించుట. మరి జీవుల జన్మజన్మలకైన విడువని కర్మల వాసనలను ఊతులు అంటారు.
తెభా-2-263-తే.
జలజనాభ దయాకటాక్షప్రసాద
లబ్ధి నఖిలైక లోకపాలక విభూతి
మహిమఁ బొందిన వారి ధర్మములు విస్త
రమునఁ బలుకుట మన్వంతరములు భూప!
టీక:- జలజనాభ = పద్మనాభుని {జలజనాభుడు - జల (నీట) జ (పుట్టిన, పద్మము) నాభుడు (బొడ్డున కలవాడు), విష్ణువు}; దయా = దయతోకూడిన; కటాక్ష = అనుగ్రహ; ప్రసాద = ప్రసాదము; లబ్ధిన్ = లభించుటచే; అఖిల = సమస్తమైన; ఏక = ముఖ్యమైన; లోక = లోకములను; పాలక = పాలించుటాది; విభూతిన్ = వైభవములు, ఐశ్వర్యములు; మహిమన్ = గొప్పతనములు; పొందిన = పొందిన; వారిన్ = వారి; ధర్మములు = ధర్మములు, విధానములు; విస్తరమునన్ = విస్తారముగ; పలుకుటన్ = తెలుపుట యే; మన్వంతరములున్ = మన్వంతరములు; భూప = భూమికి పతి, రాజా {భూప - భూమికి పతి, రాజు}.
భావము:- నరవరేణ్య పరీక్షిత్తు! పద్మనాభుడు, విష్ణుమూర్తి కటాక్షవీక్షణలతో అనుగ్రహ ప్రసాదంతో సర్వ లోకాధిపతులు అధికారాన్ని అందుకోగలుగుతారు. అలా హరి అనుగ్రహ ప్రసారంతో లోకపాలనాది మహావైభవములు, మహత్వములు విస్తరించుటను మన్వంతరములు అంటారు.
తెభా-2-264-క.
వనజోదరునవతార క
థనముఁ దదీయానువర్తితతి చారిత్రం
బును విస్తరించి పలుకం
జను నవి యీశానుకథలు సౌజన్యనిధీ!
టీక:- వనజోదరు = పద్మనాభుని; అవతార = అవతారముల; కథనముఁన్ = కథనములు; తదీయ = అతని; అనువర్తిత = అనుచరుల; తతిన్ = సమూహముల; చారిత్రంబున్ = చరితములు; విస్తరించిన్ = విస్తరించి; పలుకన్ = పలుకుతు; చనునవిన్ = ఉండెడివి; ఈశానుకథలున్ = ఈశానుకథలు; సౌజన్య = మంచితనమునకు {సౌజన్యము - సుజనత్వము, మంచితనము}; నిధీ = నిధి అయిన వాడా.
భావము:- ఓ సజ్జనచంద్ర పరీక్షిత్తు! ఆ శ్రీహరి అనంతపద్మనాభుని యొక్క అతని భక్తగణముల యొక్క కథలు చెప్పుతుండేవాటిని ఈశానుకథలు అంటారు.
తెభా-2-265-సీ.
వసుమతీనాథ! సర్వస్వామి యైన గో-
విందుండు చిదచిదానందమూర్తి
సలలిత స్వోపాధి శక్తిసమేతుఁడై-
తనరారు నాత్మీయ ధామమందు
ఫణిరాజ మృదుల తల్పంబుపై సుఖలీల-
యోగనిద్రారతి నున్నవేళ
నఖిల జీవులు నిజవ్యాపారశూన్యులై-
యున్నత తేజంబు లురలుకొనఁగ
తెభా-2-265.1-తే.
జరుగు నయ్యవస్థావిశేషంబు లెల్ల
విదితమగునట్లు వలుకుట యది నిరోధ
మన నిది యవాంతరప్రళయం బనంగఁ
బరఁగు నిఁక ముక్తి గతి విను పార్థివేంద్ర!
టీక:- వసుమతీ = భూమికి {వసుమతీనాథుడు - భూమికి ప్రభువు, రాజు}; నాథ = ప్రభువ, రాజ; సర్వ = సమస్తమునకు; స్వామి = యజమాని; ఐనన్ = అయిన; గోవిందుండున్ = గోవిందుడు {గోవిందుడు - గోవు (దిక్కు, శరణము) ఇచ్చు వాడు, గోవులకు అధిపతి, కృష్ణుడు}; చిత్ = సచేతన; అచిత్ = అచేతన; ఆనంద = ఆనందముల; మూర్తి = స్వరూపము అయినవాడును; సలలిత = మనోజ్ఞము కలిగిన వాడును; స్వ = స్వంత; ఉపాధిన్ = ఉపాధులుగ ఉండగల; శక్తి = శక్తి; సమేతుఁడు = కలిగి ఉన్నవాడును; ఐ = అయ్యి; తనరారున్ = ఒప్పి ఉండును; ఆత్మీయ = స్వంత; ధామ = నివాసము; అందున్ = అందు; ఫణిరాజ = ఆదిశేషుడు అను {ఫణిరాజు - సర్పములలో రాజు, శేషుడు}; మృదుల = మెత్తనైన; తల్పంబున్ = పానుపు; పైన్ = పైన; సుఖ = సుఖమైన; లీలన్ = విధముగ; యోగనిద్ర = యోగనిద్రలో; రతిన్ = ఆనందిస్తు; ఉన్న = ఉన్న; వేళన్ = సమయములో; అఖిల = సమస్తమైన; జీవులు = ప్రాణులు; నిజ = తమ; వ్యాపార = వర్తనలు అన్నీ; శూన్యులు = లేనివి; ఐ = అయ్యి; ఉన్నత = ఉన్నటువంటి; తేజంబులున్ = తేజస్సులు; ఉరలుకొనఁగాన్ = జారిపోవుట;
జరుగున్ = జరిగే; ఆ = ఆ; అవస్థా = స్థితి యొక్క; విశేషంబులున్ = వివరములు; ఎల్లన్ = అన్నీ; విదితమగు = తెలియు; అట్లు = విధముగ; పలుకుటన్ = చెప్పబడే; అది = అది; నిరోధము = నిరోధము; అనన్ = అనగా; ఇది = ఇదియే; అవాంతర = అవాంతర; ప్రళయంబున్ = ప్రళయము; అనఁగఁన్ = అని; పరగు = ప్రసిద్ధమైనది; ఇఁకన్ = ఇంక; ముక్తి = ముక్తి; గతిన్ = విషయమును; విను = వినుము; పార్థివ = పృథివికి; ఇంద్ర = ప్రభువ, రాజ.
భావము:- ఓ పరీక్షిత్తు భూపతి! సర్వేశ్వరుడు, గోవిందుడు, చిదచిదానంద స్వరూపుడు నారాయణుడు. ఆయన స్వయంభూతుడు ఇతరేతర ఉపాధులు లేక ఉండగలవాడు. కల్పాంతమున శ్రీమన్నారాయణుడు తన స్వస్థానమైన పాలసముద్రమున ఆదిశేషుని పాన్పుగా చేసికొని సుఖంగా యోగనిద్రా ముద్రలో ఆనందిస్తు వసించి ఉంటాడు. ఆసమయంలో జీవకోటి సమస్తము తమ తేజస్సులు నశించి నిర్వ్యాపారులై ఆయనలో లయమైపోతాయి. ఆ అవస్థా విశేషములు తెలుపనది నిరోధము అంటారు. దీనినే అవాంతర ప్రళయము అని పేరుపడింది. ఇక ముక్తి అంటే ఏమిటో తెలుసుకుందాం.
తెభా-2-266-సీ.
జీవుండు భగవత్కృపావశంబునఁ జేసి-
దేహధర్మంబులై ధృతి ననేక
జన్మానుచరితదృశ్యము లైన యజ్జరా-
మరణంబు లాత్మధర్మంబు లయిన
ఘన పుణ్య పాప నికాయ నిర్మోచన-
స్థితి నొప్పి పూర్వసంచితము లైన
యపహత పాప్మవత్త్వాద్యష్ట తద్గుణ-
వంతుఁడై తగ భగవచ్ఛరీర
తెభా-2-266.1-తే.
భూతుఁడై పారతంత్ర్యాత్మ బుద్ధి నొప్పి
దివ్య మాల్యానులేపన భవ్య గంధ
కలిత మంగళ దివ్య విగ్రహ విశిష్టుఁ
డగుచు హరిరూప మొందుటే యనఘ! ముక్తి
టీక:- జీవుండు = మానవుడు {జీవుడు - జీవము ఉన్నవాడు, మానవుడు}; భగవత్ = భగవంతుని; కృప = దయ; వశంబునన్ = చిక్కుట; చేసి = వలన; దేహ = శరీర; ధర్మంబులున్ = దర్మములు; ఐ = అయ్యి; ధృతిన్ = ధరింపబడిన; అనేక = అనేకమైన; జన్మ = జన్మలలోను; అనుచరితన్ = జరుగుతు; దృశ్యములు = చూడబడినవి; ఐన = అయినట్టి; ఆ = ఆ; జరా = ముసలితనము; మరణంబున్ = మరణములును; ఆత్మ = తన; ధర్మంబులున్ = లక్షణములు; అయిన = అయినట్టి; ఘన = బహుమిక్కిలి; పుణ్య = పుణ్యములు; పాప = పాపములు యొక్క; నికాయ = సమూహముల నుండి; నిర్మోచన = విడుదలైన; స్థితిన్ = స్థితిలో; ఒప్పి = చక్కగనుండి; పూర్వ = పూర్వ కాలము నుండి; సంచితములు = పోగుపడినవి; ఐనన్ = అయిన; అపహత = తొలగిన; పాప్మవత్త్వ = పాపము కలిగి ఉండుట; ఆది = మొదలగు; అష్ట = ఎనిమిది; తత్ = అతని (భగవంతుని); గుణవంతుఁడు = గుణములు కలవాడు; ఐ = అయ్యి; తగన్ = తగినట్లుగ; భగవత్ = భగవంతుని; శరీర = శరీరము;
భూతుఁడు = తనదైన వాడు; ఐ = అయ్యి; పారతంత్ర్య = (భగవంతుని) పరమైన తంత్రము కల; ఆత్మ = తన; బుద్ధిన్ = బుద్ధితో; ఒప్పి = కూడిన వాడై; దివ్య = దివ్యమైన, శ్రేష్ఠమైన; మాల = మాలలు; అనులేపన = మైపూతలు; భవ్య = శుభములైన; గంధ = గంధములతో; కలిత = కూడిన; మంగళ = శుభకరమైన; దివ్య = దేవతా, శ్రేష్ఠమైన; విగ్రహ = స్వరూపముచే; విశిష్టుఁడు = విశిష్టమైన వాడును; అగుచున్ = అగుచు; హరి = విష్ణువు యొక్క; రూపమున్ = స్వరూపమును; ఒందుటే = పొందుటయే; అనఘ = పాపములు లేని వాడ; ముక్తి = ముక్తి (అను ఉన్నది).
భావము:- మానవుడు జన్మజన్మాంతరాలలో తన దేహధర్మాలను పాటిస్తు అనేక పాప పుణ్య కర్మలు చేసి ఫలితాలు అనుభవిస్తుఉంటాడు. జనన జరామరణాదుల చక్రంలో పడి కొట్టుకుంటు ఉంటాడు. ఈ అనంత పాప పుణ్యచయాలనుండి భగవత్కృపతో కూడిన బహుళసాధనల వలన విడివడతాడు. భగవంతుని అష్టైశ్వార్యాలతో కూడి ఆ పరాత్పరుని సామీప్యం, సాయుజ్యం సంపాదించుకొని, సాక్షాత్భగవస్వరూపం పొందుతాడు. ఆయా దివ్యమైన మాలలు, మైపూతలు మున్నగు వైభోగములన్నీ పొందుతాడు. ఇలా శోభనకరమైన విశిష్ఠ దివ్యదేహంతో హరిస్వరూపం పొందుటను ముక్తి అంటారు.