పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కంసునికి నారదుడు జెప్పుట
తెభా-10.1-1149-చ.
ఘనుఁడొకనాడు నారదుఁడు కంసునితోడ యశోద కూఁతు దాఁ
గనుటయుఁ జక్రి దేవకికి గర్భజుఁ డౌటయు మున్ను రోహిణీ
తనయుఁడు రాముఁడౌటయును దద్విభు లిద్దఱు మంద నున్నవా
రని యెఱుఁగంగఁ జెప్పిన మహాద్భుత మంచుఁ జలించి గిన్కతోన్.
టీక:- ఘనుడు = గొప్పవాడు; ఒకనాడు = ఒకరోజు; నారదుడు = నారదుడు; కంసుని = కంసుడి; తోడన్ = తోటి; యశోద = యశోదాదేవి; కూతున్ = పుత్రికను; తాన్ = ఆమె; కనుటయున్ = ప్రసవించుట; చక్రి = విష్ణుమూర్తి; దేవకి = దేవకీదేవి; కిన్ = కి; గర్భజుడు = కడుపున పుట్టినవాడు; ఔటయున్ = అగుట; మున్ను = అంతకుముందు; రోహిణీ = రోహిణీదేవి; తనయుడు = కొడుకు; రాముడు = బలరాముడు; ఔటయున్ = అగుట; తత్ = ఆ యొక్క; విభులు = వైభవములు కలవారు; ఇద్దఱున్ = ఇద్దరు (2); మందన్ = వ్రేపల్లె యందు; ఉన్నవారు = ఉన్నారు; అని = అన; ఎఱుగంగన్ = తెలియునట్లు; చెప్పినన్ = చెప్పగా; మహా = చాలా; అద్భుతము = ఆశ్చర్యకరమైనది; అంచున్ = అని; చలించి = కలవరపడి; కిన్క = కోపము; తోన్ = తోటి.
భావము:- తరువాత ఒకరోజు, మహానుభావుడైన నారదుడు కంసుని దగ్గరకు వచ్చి “అ బాలిక యశోద కన్న కన్నె, శ్రీకృష్ణుడు దేవకీగర్భ సంభూతుడు, బలరాముడు రోహిణి కొడుకు, ఆ రామకృష్ణులు ఇద్దరు నందుని మందలో ఉన్నారు” అని తెలియ చెప్పాడు. ఆయన మాటలు విని, ఆశ్చర్యపోయి, ఆగ్రహావేశాలతో కంసుడు కంపించిపోయాడు.
తెభా-10.1-1150-చ.
"కొడుకుల మందలోన నిడి గొంటుతనంబున మోసపుచ్చె నీ
బడుగునుఁ బట్టి చంపు టిది భావ్య" మటంచుఁ గృపాణపాణి యై
వడి వసుదేవునిం దునుమ వచ్చిన కంసునిఁ జూచి నారదుం
డుడుగుము చంపఁ బోల దని యోడక మానిచి పోయె మింటికిన్.
టీక:- కొడుకులన్ = పుత్రులను; మంద = గొల్లపల్లె; లోన్ = లోపల; ఇడి = ఉంచి; గొంటుతనంబునన్ = దుష్టత్వముతో; మోసపుచ్చెన్ = మోసముచేసెను; ఈ = ఈ యొక్క; బడుగునున్ = అశక్తుని; పట్టి = పట్టుకొని; చంపుట = చంపివేయుట; ఇది = ఇది; భావ్యము = యుక్తమైనది; అటంచున్ = అనుచు; కృపాణపాణి = కత్తి చేతపట్టిన వాడు; ఐ = అయ్యి; వడిన్ = వేగముగా; వసుదేవునిన్ = వసుదేవుడిని; తునుమ = చంప; వచ్చిన = సిద్ధపడిన; కంసుని = కంసుడిని; చూచి = చూసి; నారదుండు = నారదుడు; ఉడుగుము = తగ్గుము, మానుము; చంపన్ = చంపుట; పోలదు = తగినది కాదు; అని = అని; ఓడక = వదలకుండ; మానిచి = మాన్పించి; పోయెన్ = వెళ్ళిపోయెను; మింటి = ఆకాశము వైపున; కిన్ = కు.
భావము:- ఈ బడుగు వసుదేవుడు కొడుకులను నందవ్రజంలో భద్రంగా దాచిపెట్టి, మంచిమాటలతో నన్ను వంచించాడు. ఈ దిక్కుమాలినవాణ్ణి, ఈ మోసగాణ్ణి పట్టి పరిమార్చడం సరైన పని అంటూ ఖడ్గం చేపట్టి వెంటనే వసుదేవుణ్ణి చంపడానికి కంసుడు ఉద్యుక్తుడయ్యాడు. అతణ్ణి చూసి నారదమహర్షి “వసుదేవుడిని చంపవద్దు. ఇది నీవంటి వాడికి తగదు” అని వాడిని వారించి దేవలోకానికి తరలిపోయాడు.