తెలుగువారి జానపద కళారూపాలు/అక్షయంగా వెలుగొందిన యక్షగానం
అక్షయంగా వెలుగొందిన యక్షగానం
ఒకనాడు యక్షగాన వాజ్మయం దక్షిణ భారతదేశంలో అంతటా దేదీప్యమానంగా వెలుగొందిందనటానికి కారకులు మన జక్కులవారే.
యక్షగానాలన్నా జక్కులవారన్నా ఈనాటి వారిలో కొంత హీనదృష్టి వుంది. కాని ఆంధ్రదేశంలో శతాబ్దాల తరబడి యక్షగాన వాజ్మయం, యక్షగాన కళా రూపాలు విచ్చల విడిగా ప్రచారంలో వున్నాయి.
జక్కుల వారు విద్యావివేకాల్లో ఘటికులు. ప్రాచీన జాతుల్లో జక్కులు...బవని వాండ్లు మొదలైన వారు, మేధావి వర్గంగా ఎంచబడేవారు. సంగీత సాహిత్యాల లోనూ, చిత్రశిల్ప కళా ప్రతిభల్లోనూ, అద్వితీయ స్థానాన్ని సంపాదించారు. ప్రతిభావంతులుగా పేరు పొందారు.
ఈనాటి వైదుష్యం:
ఈనాడు కూచిపూడి భాగవతుల కళా వైదుష్యాన్ని మనం ఎలా స్తుతిస్తున్నామో అలాగే నాటి జక్కుల వారిని, బవని వాండ్లనూ స్తుతించేవారు. కాని వంశ పారంపర్యంగా వీరి కళాకౌశలం క్షీణిస్తూ వచ్చింది. ఉన్నతాదర్శాలు నశించాయి. ఆనాటి యక్షగాన వాఙ్మయానికి ప్రతీకగా ఈనాడు, ఆచ్చు గ్రంథాల నైతేనేమి, వ్రాతప్రతులైన తాళపత్ర, సాధారణ పత్ర గ్రంథాలైతే నేమి నాలుగు వందల వరకూ యక్షగాన రచనలున్నాయని వినికిడి.
అయితే కొండవీటి రెడ్డిరాజుల కాలంలోనూ విజయనగర రాజుల కాలంలోనూ, తంజావూరు ఆంధ్రనాయక రాజుల కాలంలోనూ, యక్షగానాలూ యక్షగాన వాఙ్మయం దేదీప్యమానంగా వెలుగొందిన విషయం సర్వసామాన్యంగా అందరికీ తెలిసిందే.
ప్రాచీనంలో ప్రాచీనం: యక్షగానం:
మన ప్రాచీన కళారూపాల్లో అతి ప్రాచీనమైంది యక్షగానం. ఆంధ్ర, తమిళ, కర్ణాటక రాష్ట్రాలలో అతి విస్తారంగా వ్యాప్తిలోకి వచ్చింది. ఈ నాడు మన చూస్తున్న వీథి భాగవతాల మాత్రుకలు ఈ యక్షగానాలే.
యక్షగానాల తరువాత ప్రచారంలోకి వచ్చింది వీథి భాగవతాలు. యక్షగానం అంటే యక్షులచే పాడబడే సంగీత విశేషం అనీ, యక్షగానాలు ఎక్కువగానూ మక్కువగానూ జక్కు జాతివారు ప్రదర్శిస్తారు గనుక యక్ష శబ్దం జక్కు శబ్దంగా మారిందనీ, ఇది
యక్షులతో పాడబడే సంగీత విశేషమనీ , ఇంకెన్నో రీతుల వ్యాఖ్యానించారు. వ్యాఖ్యానించిన వారందరూ వారి వారి రచనల్లో నాటకాలను ప్రస్తావించారు. వారు ఉదహరించిన నాటకాలు, యక్షాగానాలా? లేక యక్షగానాలనే నాటకాలుగా ఉదహరించారా? తెలుసుకోవడం ఎంతైనా అవసరం.
మన అలంకారికులు:
నాటకాంతం హి సాహిత్యం, కావ్యేషు నాటకం రమ్యం, అని మన సంస్కృత అలంకారికులు సాహిత్య ప్రక్రియలో నాటకానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చినా మన పూర్వాంధ్ర కవులెవరూ నాటక రచనకు పూనుకోలేదనీ, సంస్కృత లక్షణ గ్రంథాలను అనువాదం చేసిన పూర్వాంధ్ర లాక్షిణికులు, నాటకాన్ని వదిలి వేస్తూ వచ్చారనీ శ్రీనివాస చక్రవర్తి గారు (నాట్య కళ జానపద సంచికలో వివరించారు)
అయితే తిక్కనగారి విరాటపర్వం చదివినా పింగళ సూరనగారి ప్రభావతీ ప్రద్యుమ్నం చదివినా వారిద్దరికీ, నాటక కళలో ప్రవేశమున్నట్లు మనకు అర్థం అవుతుంది కానీ వీరిరువురూ తెలుగులో నాటకం మాత్రం వ్రాయలేదు. అలాగే, పిల్లలమర్రి పిన వీరభద్రుడూ, నందిమల్లయ్య, ఘంటసింగయ్య, మంచన మొదలైన కవులు "శాకుంతలం" ప్రబోధ చంద్రోదయం విద్దసాల భంజికలను ప్రబంధాలుగానే వ్రాశారు కాని, నాటకాలు మాత్రం వ్రాయలేదు.
తెలుగు కవుల, సంస్కృత నాటకాలు:
ప్రసిద్ధ సంస్కృత నాటక కర్తలైన భవభూతి, "మురారీ" భట్టనారాయణ ఆంధ్రులే, సంస్కృతంలో ఉన్మత్తరాఘవం, మదనవిలాస బాణం "మహాభారతం" నరకాసురవిజయవ్యాయోగం, రత్నపాంచాలిక; రచించిన భాస్కరుడూ. "పశుపతీ" నాగనాథుడూ గంగాధర కవి "ధర్మసూరి" సింగ భూపాలుడు మొదలైన కవులందరూ ఆంధ్రులే.
వేరే కాక ఆంధ్రకవులైన "వెంకటాధ్వరి" "నృసింహకవి" భట్ట భాణుడు మొదలైన ఆంధ్రకవులు. సంస్కృతంలోనే నాటకాలు వ్రాశారు. ఆ విధంగా సంస్కృతంలో నాటకాలు వ్రాసిన వారిలో దేశం మొత్తంమీద అగ్ర తాంబూలం అందుకున్న వారు ఆంధ్ర సంస్కృత నాటక కర్తలే.
అలాగే కాటయవేమూడూ, సుప్రసిద్ధ తెలుగు నాటక రచయిత కోలాచలం శ్రీనివాస రావు మొదలైన వారు ఆంధ్రులైనా, సంస్కృత నాటకాలకు వ్యాఖ్యానాలు మాత్రమే రచించారు.
- నన్నయభట్టూ, నాటకాల ప్రస్వావనా?:
పై వివరాలనుబట్టి తెలుగులో నాటకాలను ఎవరూ రచించక పోయినా, నన్నయభట్టు అవతారికను పరిశీలించి నట్లైతే__
విమల మతిం బురాణములు వింతి ననేకము లర్థధర్మ
శాస్త్రముల తెఱంగెగఱంగితి నుదాత్తరసాన్విత కావ్య నాటక
క్రమముల పెక్కు సూచితి, జగత్పరి పూజ్యములైన యీశ్వరా
గమముల యందు నిల్పితి, బ్రకాశముగా హృదయంబు భక్తితోన్
అని రాజ రాజ నారేద్రుని చేత చెప్పించడం వల్లనూ, అలాగే పాలకురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో__
ప్రమథ పురాతన పటు చరిత్రముల
గ్రమంద బహు నాటకములాడు వారు, అనీ
అలాగే క్రీడాభిరామంలో,
లెస్సగాగ కిరాట యీలేమ చరిత
మాడుదురు నాటకంబుగ నవనిలోన
అనీ విస్పష్టంగా చెప్పటం వల్ల పూర్వం ఎదో ఒక విధమైన నాటకాలాడేవారని నిర్థారణ అవుతూంది. అయితే అవి ఎలాంటి నాటకాలు? అని మనం తెలుసు కోవాలంటే ఈ నాడు కోకొల్లలుగా దొరుకుతున్నయక్షగానాలే ఆనాటి తొలి నాటకాలని చరిత్రకారుల అభిప్రాయం.
ఇంతకీ యక్షులెవరు?
ఇంతకీ యక్షు లెవరో తెలుసుకోవాలనుకుంటే మనకీ క్రింది ఆధారాలు లభిస్తున్నాయి. బౌద్ధ, జైన, బ్రాహ్మణ సారస్వతాలలో "యక్షులను" దేవతాగణంగా పేర్కొన్నారు. వారు నీతి ప్రవర్తకులనీ, కామరూపులనీ, శూరులనీ, జిజ్ఞాసకులనీ వివరించారు.
ప్రారంభంలో వారి నివాస భూమి సింహళమనీ, వారి రాజు కుబేరుడనీ, బలి చక్రవర్తి సేనాని సుమాలి ఈ యక్షులను ఓడించి రాక్షస రాజ్యం స్థాపించాడనీ, మరికొన్ని గ్రంథాలలో రావణుడు లంకను జయించి కుబేరుని వెడలగొట్టి రాక్షస రాజ్యం స్థాపించాడనీ, వివరింప బడింది.
ఓడిపోయిన కుబేరుడు దక్షిణ భారతదేశానికి తన అనుయాయులతో వలస వచ్చాడనీ, చెపుతారు.
యక్షులు "అక్షసీ" నదీ ప్రాంతంవారో లేక "గూచి" అనబడే మంగోలియన్ లో అనీ.
కీ॥శే॥ సురవరం ప్రతాపరెడ్డి గారు తమ అంధ్రుల సాంఘిక చరిత్రలో తమ ఆభిప్రాయం వెలిబుచ్చారు.
ఈయక్షులు ఎవరైనా,
... మేళము గూడి పాడుచుందురు. దిక్పాల సభల (అని పారిజాతాపహరణం)లోనూ. కిన్నెరలు పాట పాడుచుండగా, తాళసంఘ ప్రభేదంబుల గతులనే యక్ష కామినులు నాట్యంబు లాడేవారని (రామాభ్యుదయం) లోనూ,
మంగళమస్తు రమానాథ యని, యక్షు వనితలు కర్ణపర్వముగా పాడేవారని (చిత్రభారతం) లోనూ వివరించడాన్ని బట్టి, యక్షులు నృత్యగానాల్లో ప్రజ్ఞావంతులని వెల్లడౌతోంది.
ఇలా నృత్యగానాలలో ప్రజ్ఙావంతులైన యక్షులు సింహళం వదలి దక్షిణ భారత దేశానికి వలస వచ్చిన జక్కు జాతి వారని పలువురి అభిప్రాయం.
సింహళంలో వాడుక భాష పాళి, సంస్కృత యక్ష శబ్దానికి ప్రాకృతం "ఎక్కులు" తెలుగు తద్భవం "జక్కులు". జక్కుల వారు వలస వచ్చిన వారైనా ఆదిమ వాసులైనా వారు సంగీత నృత్య కళాకారులన్న మాట నిజమంటూ, వీరి పేరనే "జక్కిణి రేకులు" "జక్కిణి దరువు" "జక్కిణి నృత్యం" వెలిశాయని శ్రీనివాస చక్రవర్తి గారు నాట్యకళ సంచికలో వుదహరించారు
నృత్యగానాలలో ప్రజ్ఞావంతులైన యక్షులు జక్కిణి రేకులు, జక్కిణి నృత్యం చేసి నట్లు భామ వేష కథ అనే యక్షగానంలో__
జోకగ గీత వాద్యముల సొంపుగ నింపుగ పంచ
జక్కిణి ప్రాగటమైన నాట్య రసాభాముల వింపించు వేడుకన్.
అనీ
అణునిభమధ్యలాక్రియలు నా పరి భాషలు నొప్ప జిందు
జిక్కిణి, కొరవంజి మేళముల గేళిక సల్పిరి దేవతా నటీ
మణులకు బొమ్మవెట్టు క్రియ మర్తళ తాళ నినాద పద్దతిన్
రణుదురు రత్ననూపుర ఝుణం ఝుణముల్ మెలయం బదాహరతిన్
అనీ కవులు వర్ణించినారు.
అలాగే తంజావూరు ఆంధ్ర నాయకుల దర్బారులో జిక్కిణి నాట్య గోష్టి జరిగేదనీ__ విజయరాఘవుని ఆస్థానంలో మూర్తి జక్కిణి నృత్యం చేసేదని (రాజగోపాల విలాసంలో ఉదహరించబడింది).
అలాగే, విజయ రాఘవరాయలు కొరవంజి శుభలీల, గుజరాతి, దేశి, చౌపదియు "జిక్కిణి.... నాట్యముల్ హవణించు నవరజ్ఞు" అనీ (ప్రహ్లద చరిత్రలో వ్వవహరించారు.)
అలాగే, తంజావూరు "అన్నదాన" నాటకంలో జక్కుల రంగసాని పదకేళిక పట్టినట్లు వర్ణించాడు. వీరి పేరన "జక్కసాని కుంట్ల, జక్కుల చెఱువు" మొదలైన గ్రామాలు కానవస్తున్నాయి.
పారిజాతాపహరణంలోని "యక్ష గ్రామ వాసవ్యులు" అనే ప్రయోగంవల్ల బ్రాహ్మణ అగ్రహారాల వలెనే జక్కులవారు ప్రత్యేకంగా గ్రామాలు నిర్మించుకున్నారని చెప్పుకోవచ్చు. వీరు ఆంధ్రదేశంలో ముఖ్యంగా గుంటూరు, గోదావరి జిల్లాలలో ఎక్కువగా నివసిస్తున్నారని, దక్షిణ భారతదేశంలోని "కులాలు - తెగలు" అనే గ్రంథంలో "ఈథర్ట్సన్" ఇలా ఉదహరించాడు. జక్కుల వారు తక్కువ తరగతి వ్వభిచారిణులనీ, బలిజ కులస్థులనీ, మంత్రవేత్తలనీ, నృత్యనాటకారంగోప జీవనులనీ, వీరు ఎక్కువగా కృష్ణా జిల్లా తెనాలి దగ్గర వున్నారనీ, వీరిలో ప్రతి కుటుంబమూ, ఒక బాలికను వ్వభిచార వృత్తికి కేటాయించటం మామూలని తెలియజేశారు.
శిలప్పదికారంలో:
యక్షగాన వాఙ్మయమూ, యక్షగాన ప్రదర్శనాలూ దక్షిణ భారత దేశంలో అతి ప్రాచీన కాలం నుండీ బహుముఖాల విజృంభించాయి. క్రీ॥ శ॥ 7 వ శతాబ్దానికి ముందుగానో, ఆ తరువాతనో తమిళంలో వ్రాయబడిన "శిలప్పదికార" మనే కావ్యంలో నాటకాలను గూర్చీ, నాట్య శాస్త్రానికి సంబందించిన అనేక శాస్త్రీయ విషయాలు ఉదహరింపబడి ఉన్నాయని శ్రీ నేలటూరి వెంకటరమణయ్య తెలియజేశారు.
పండితారాధ్య చరిత్రలో:
ఇక పోతే 13 వ శతాబ్దంలో వుద్భవించిన పాల్కురికి సోమనాథుడు దేశి నాటక సాంప్ర దాయాలను గూర్చి , శ్రీశైలం శివరాత్రి మహోత్సవాలలో జరిగే నాటక రూపాలను గూర్చి, పండితారాధ్య చరిత్ర పర్వత ప్రకరణంలో "నాదట గంధర్వ యక్ష విద్యాధురాదులై పాడేడు నాడేడువా"రని వివరించాడు. యక్షగానం ఎంతో ప్రాచీన కళా రూపమైనప్పటికీ, పండితారాధ్య చరిత్రలో వివిధ కళారూపాలను చర్చించినంత విపులంగా యక్షగానాన్ని గూర్చి వివరించక పోవడాన్ని బట్టి 1280 కి పూర్వ యక్షగాన కళారూపం అంతగా ప్రచారంలో లేదని తెలుస్తూంది.
చెన్నశౌరి మొదటి యక్షగానం:
చరిత్రను బట్టి చూస్తే 15వ శతాబ్దం ప్రథమ పాదంనుంచే మనకు యక్షగానాల ప్రసక్తి కనబడుతూ వుంది. పదిహేనవ శతాబ్దం నాటి ప్రొలుగంటి చెన్న సౌరి "సౌభరి చరిత్రాన్నీ" ఉదహరించడాన్ని బట్టి తెలుగులో ప్రథమంగా వెలువడిన యక్షగానం అదేనని చెప్పవచ్చు.
ఎందరో చెప్పిన, యక్షగానా వివరణ:
16 వ శతాబ్దంలో రచించబడిన చిత్ర భారతం యక్షగానంలో యక్ష వనితల పాట, యక్షకామినుల నాట్యం పేర్కొనబడ్డాయి. 16 వ శతాబ్దంలో యక్షగానాల ప్రభావం ఎక్కువగా వున్నట్లు తెలుస్తూ వుంది.
సుగ్రీవ విజయం:
కందుకూరి రుద్రయ్య సుగ్రీవ విజయాన్ని యక్షగానంగా వ్రాసి ఆ వూరి జనార్థన దేవునికి అంకిత మిచ్చాడు. సుగ్రీవ విజయం అతి ప్రాచీనమైనది గాను, ప్రాముఖ్య మైనది గాను గుర్తించబడింది. రుద్రయ్య సుగ్రీవ విజయాన్ని యక్షగాన మనే పేర్కొన్నాడు. ఇందులో విశిష్టమైన రగడ భేదాలే గాక, సంవాదనలతోనూ, దరువులతోనూ, సంభాషణలతోనూ, ప్రియదర్శనయోగ్యంగా, వీథినాటకంగా ఆడబడి వుండవచ్చని నేలటూరి వారు వివరించారు.
16వ శతాబ్దపు ప్రాంతపువాడైన చిత్రపౌరి రాఘవాచార్యుని 'విప్రనారాయణ చరిత్ర' 'బాలపాపాంబ అక్కమహాదేవి చరిత్రా' రచనా విధానం కూడ సుగ్రీవ విజయం కోవకే చెందివున్నాయి.
కర్నూలు జిల్లా వాసిమైన పింగళి సూరన ప్రభావతీ ప్రద్యుమ్నంలోనూ, గంగావతరణం నాటకం లోనూ ఆనాటి ప్రదర్శనా పద్ధతిని గూర్చి వివరించాడు.
అహోబిల ప్రాంతంలో గుశదుర్తి ఆగ్రహార వాస్తవ్యుడు కాజవేంకటాద్రి 'వాసంతికా పరిణయం' అనే యక్షగాన ప్రబంధాన్ని వ్రాశాడు.
ఆరోజుల్లోనే నెల్లూరు ప్రాంతంలో కంకంటి పాపారాజు విష్ణుమాయా విలాస మనే యక్షగానంలో అనేక విశేషాలను వివరించాడు.
పేలపురం చేరువలో వున్న వుద్దండమల్ల సముద్రవాసియైన ఎల్లకవి శేషము వెంకటపతి శశాంక విజయాన్ని అనుసరించి 'చంద్ర తారావిలాస' మనే యక్ష గానాన్ని రచించాడు.
ఇప్పటికి షుమారు రెండు వందలఏబై సంవత్సరాల క్రితం సేలం జిల్లా హోసూరు తాలూకా తోగీరయ అనే అగ్రహార నివాసి అన్నదానం వెంకటాంబ రామయణం బాలకాండను యక్షగానంగా రచించింది.
రాయలసీమలో జక్కుల వారి కులదేవతైన అక్కదేవతల కొండ వుండడాన్ని బట్టి యక్షగానానికిది మూలమని చెప్పవచ్చు. ఈ నాటికీ గుంటూరు గోదావరి జిల్లాలో వున్న జక్కులవారు కళావంతుల కోవకు చెంది అభినయ కళలో ప్రావీణ్యం సంపాదించారు.
యక్షగానాన్ని గూర్చి బ్రౌణనిఘంటువులో యక్షగానమంటే ఒక విధమైన పాటగానే నిర్వచించబడింది.
అప్పకవి మెప్పులుగొన్న గొప్పతనం:
అప్పకవీయాన్ని వ్రాసిన కాకునూర్యప్ప కవి తన్ను గూర్చి ఈ విధంగా వ్రాసుకున్నాడు.
లలిత కవికల్ప కాఖ్యాన లక్షణంబు
మహిత సాధ్వీ జనౌఘధర్మ ద్విపదయు
అంబికా వాదనామక యక్షగాన
కృతియు జేసితి కాకునూరి కులప్ప
అని అప్పకవి అంతటి వాడు అంబికావాదమనే యక్షగానాన్ని వ్రాశాడు.
అప్పకవీయంలో "అర్థచంద్రికలు" త్రిపుటజంపె, ఆటతాళము, వీన యక్షకాగ ప్రబంధము లతకవచ్చ అని అప్పకవి వ్యాఖ్యానించాడు. అంటే పాటలు గల ఒక ప్రబంధంగానే అప్పకవి అభిప్రాయంగా మనం తెలుసుకోవచ్చు.
వేషధారణలో అందచందాలు:
ఈనాటి యక్షగాన ప్రదర్శనంలో వేష భూషణ అలంకారాల నన్నిటినీ చూస్తూనే వున్నాం. అయితే ఆ నాటి వేషధారణ ఎలా వుండేదో పాలకురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో ఈ విధంగా వర్ణించాడు.
శిరమున సురమున జెవుల గంఠమున
గరముల గూకటి కాళ్ళ జెల్వార
దవదండలును గనుగవ కదలికలు
సవరంబులును దలశంపు దండలును
భసితంపు బూతపై బరగు వచ్చెనలు
నరరారు చిరు గజ్జియలును నందియలు
సరిరత్న పంక్తుల జలపోషణములు
గరమొప్ప తొంగళ్ళు గల చల్లడములు
బొల్చు దంతావళుల్ పుష్పమాలికలు
దాల్చి యత్యుద్భుతోత్సవ లీలదనర
జనులు హర్షింప నాస్థానముల్ సొబ్బ
యనుకూల వివిధ వాద్య సమ్మేళనమున్
నార్భటం బిబ్బ ల్యెయ్యన జవనికల
గర్భంబు వెడలి యక్కజము వట్రిల్ల.
అని పండితారాధ్య చరిత్రలో ఉదహరించాడు.
యక్షగాన కథానాయకి జక్కుల పురంద్రి
వేషభాషలతోనూ, ముగ్ధ మోహనమైన ముఖాలంకరణతోనూ శ్రుతి పక్వమైన వాయిద్యంతోనూ, వీనులవిందైన సంగీతంతోనూ, తాళలయ సమన్విత మైన నృత్యంతోనూ,జక్కుల పురంద్రి అంటే యక్షగానపు కథానాయకి ఎలా రంగ స్థలాన్ని అలరించేదో శ్రీనాథుడు క్రీడాభిరామంలో ఈ విధంగా వర్ణించాడు.
కోణాగ్ర సంఘర్ష ఘమఘమ ధ్వనితార
కంఠస్వరంబుతో గారవింప
మసిపొట్టు బోనానననలు కొల్పిన కన్ను
కొడుపుచే దాటించు నెడపదడవ
శ్రుతికి నుత్కంర్షంబు జూపంగ వలయు బో
జెవిత్రాడు బిదియించు జీవగఱ్ఱ
గిల్కుగిల్కున మోయు కింకిణీ గుచ్ఛంబు తాళ
మానంబుతో మేళవింప
రాగమున నుంకి లంఘించు రాగమునకు
నురు మయూరు ద్వయంబుపై నొత్తిగిల్ల
కామవల్లీ మహలక్ష్మి కైటభారి
వలపు పొడచు వచ్చె జక్కుల పురంధ్రి.
శ్రీనాథుని వివరణ:
శ్రీనాథుడు దక్షవాటీ మహాపురమును (అంటే నేటి ద్రాక్షారామ) భీమ ఖండంలో వర్ణిస్తూ...
కీర్తింతు రెద్దాని కీర్తి గంధర్వులు
గాంధర్వమున యక్షగాన సరణి.
అని అన్నాడు. అంటే శ్రీనాథుని కాలంనాటికి కూడా యక్షగానాలను మనం పాట గానే గుర్తించ వచ్చు.
అలాగే కాశీఖండంలో
పల్లకి చక్కి కాహళము వంశము ధక్క హుడుక్క ఝుర్ఘరుల్
ఝుల్లరి యాదిగా గలుగు శబ్ద పరంపర తాళ శబ్దమై
యుల్లసిలం బ్రబంధముల నొప్పగ నాడుదు రగ్రవేదిపై
బల్లవపాణులీశ్వరుని బంట మహేశులు పూజసేయగన్.
అని ఉదహరించాడు.
యక్షగాన కలాపం:
యక్షకన్యల నృత్యాని కనువైన ఆహార్యం కాక ఏదో ఒక నాయిక పాత్ర ఆహార్యాన్ని ధరించి ఆడుతూ, పాడుతూ, తన కథను తానే వివిపించే యక్షగాన రూపమే కలాపం.
ఏక పాత్రాభినయానికి సంబంధించిన ఈ కలాపాలు, శ్రీనాధుని కాలం నాటికే వర్థిల్లిన వనటానికి ఉదహరణగా ఈ క్రింది పద్యం వల్ల వెల్లడౌతూవుంది.
విరుల దండల తోడి వేణుకా భరంబు
పొంకంబు పిరుదుల బొరలియాడ
మణితులాకోటి కోమల ఝుణత్కారంబు
రవళి మెట్టెల మ్రోత యవఘళింప
కుదురు నిండిన చిన్ని గుప్పచన్నుల మీద
ముత్యాల త్రిసరంబు మురుపుజూప
వనమాన తాటంక వజ్రాంకురచ్చాయ
లేత వెన్నెల బుక్కిలించి యుమియ
సాని ఈశానియై మహోత్సవమునందు
గేల నవచంద్ర కాంతంబు గిన్నెపూని
వీథి భిక్షాటన మొనర్చు వేళ జేయు
మరులు నృత్యంబు జగముల మరులు కొలుపు
ఆనాడు భీమేశ్వరుని కొలువులో ఎన్నో కళారూపాలు ప్రదర్శింప బడినట్లు శ్రీనాథుడు భీమ ఖండం ప్రథమాశ్వాసంలో ఈ రీతిగా వర్ణించాడు.
అల్లయ వేమ భూపాల రాజ్యభార ధురంధురడై
బెండపూడన్న యామాత్యుడు గట్టించి
మొగసాల వాకిటి మహోత్సవ మండపంబునందు
బేరోలగంబుండి కుండలీదండలాసక
ప్రేరణీ ప్రేంఖణ సింధు కందు కథ మాళిచేల
మతల్లీ హలీ సకాది నృత్యంబు లవలోకింపుచు
జంపూచాటు నాటకోదాహరణ జయఘోష
చక్రవాళ, చతుర్భద్ర చతురాతి ప్రబంధంబు లాకర్ణింపుచు.
అని భీమేశ్వర ఖండంలో శ్రీనాథుడు ఉదహరించిన నాటక ప్రబంధాలు యక్ష గానాలే కావచ్చని చింతా దీక్షితులు గారు (ప్రజావాఙ్మయంలో) ఉదహరించారు.
అయ్యగారి వీరకవి:
అలాగే అయ్యగారి వీరకవి తాను వ్రాసిన చిత్రాంగద విలాసమనే యక్షగానంలో ఈ విధంగా వివరించాడు.
.............నాకుదోచు
నట్టులానంద మొప్ప ధర్మాంగ చరిత
మనగ చిత్రాంగద విలాస మనగ
యక్షగాన మొనరించు వేషముల్ గట్టి జనులు
పాడి వినిపింప బుణ్యసంపద ఘటింప.
ఈ వుదాహరణను బట్టి యక్షగానాలను జనులు వేషాలు గట్టి పాడి వినిపించేవారని తెలుస్తూ వుంది. ఈ రోజుల్లో మాదిరి కాక ఆ కాలంలో ఎవరో ఒకరు వేషాలు వేసుకుని కథంతా వారే పాడేవారని ఊహించవచ్చు. అందుకు ఈ నాటి హరి కథాగానాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు.
కంకంటిపాపరాజు:
ఉత్తర రామచరిత్రను అద్వితీయంగా రచించిన, కంకంటి పాప రాజు "విష్ణు మాయా విలాస" మనే యక్షగానం వ్రాశాడు. అందులో ఇలా వివరించాడు.
కంకంటి అప్పనాగ్రణి కుమారుండు
పంకజలోచన పంచబాణుండు
పాపరా జొనరించె బహుపదార్థముల
వ్యాపించి విష్ణుమాయా విలాసంబు
భూమిని తిలకించి బుధులెల్ల బొగడ
ఆ మిత్ర తారాభమై విభాసిల్ల
అని, ఈ వివరణ బట్టి చూచినా జనులు వేషముల్ గట్టి పాడగా బుధులు చూచి ఆనందించేవారని అర్థమౌతుంది.
కూర్మనాథ కవి:
1624 సంవత్సర ప్రాంతంలో కోకుల పాటి కూర్మనాథ కవి మృత్యుంజయ విలాసమనే యక్షగానాన్ని వ్రాశాడు. అది అతి ప్రౌఢంగా వుందని దీక్షితులుగారన్నారు.
వైకుంఠ వామన వారిజ నాభ
నీ కంకితముగ నా నేర్చిన రీతి
మృత్యుంజయ విలాస మృదుతర కావ్య
మత్యంత భక్తితో యక్షగానంబు
రచియించి నీకు నర్పణ సేయ దలచి
అని ఒక చోట తన గ్రంథాన్ని యక్షగానమన్నాడనీ మరి ఒక చోట నాటకమనీ అన్నాడు.
అత్యంత భక్తితో నంకితంబైన
మృత్యుంజయ అవిలాస మృదుల నాటకము
హరి కంకితంబౌట హరి కథ యౌట.
అని అనడాన్ని బట్టి యక్షగానమన్నా, నాటకమన్న ఒకటి గానే భావించారనడానికి పై ఉదాహరణను తీసుకోవచ్చు.
భామ వేషంలో, యక్షగాన పోకడ:
తరతరాలుగా ప్రదర్శిస్తున్న కూచిపూడి వారి భామ వేషం, యక్షగానమనే నాఊహ అంటున్నారు చింతావారు.
భామ వేషంలో కథ పారిజాత పుష్పానికి సంబంధించిన ప్రసంగానికి సంబంధించింది. తనకు నారదుడిచ్చిన పువ్వును శ్రీకృష్ణుడు రుక్మిణికి ఇవ్వగా సత్యభామ విని కోపించటం, విరహం చెండటం, కృష్ణునికి సందేశం పంపటం; కృష్ణుని కలుసుకోవటం, అలకపాను పెక్కటం, తరువాత విరహ తీరటం. ఉపపాత్రలు:
ఇందులో వేషం కట్టేది సత్యభామ మాత్రమే. ప్రక్కనున్న బ్రాహ్మణుడు, సమయాన్ని బట్టి చెలికత్తె అవటం, వైశ్యుడవటం, హాస్యగాడవటం, ఈ విధంగా ప్రతి పాత్రకూ తానే అవుతాడు. చివరకు మాత్రం కృష్ణుడు ప్రవేశిస్తాడు. కాని మాట్లాడడు. ఈ భామ వేషాన్ని రచించిన సిద్ధేంద్ర యోగి తన గ్రంథాన్ని శృంగార ప్రబంధంగా పేర్కొన్నాడు. యక్షగానాలను ప్రబంధాలనడాన్ని బట్టి, పై భామావేషాన్ని కూడ యక్షగానంగా భావించవచ్చు.
పై వివరాలను బట్టి యక్షగానమంటే పాటలతో కూడిన ఒక ప్రబంధ మనిన్నీ, దానికి ఎవరో ఒకరు వేషం వేసుకుని పాడుతూ, ఆడేవారని బోధపడుతూంది.
సలక్షణ యక్షగానంలో విలక్షణత:
యక్షగాన ప్రదర్శనంలో వున్న విశేషమేమంటే మన వీథి భాగవతాలలో వచ్చే పాత్ర ధారులు ఎవరి పాత్రను వారు ప్రదర్శిస్తారు. యక్షగానంలో ఈ మాదిరి కాక, ప్రదర్శనంలో వచ్చే ప్రతి పాత్రా తన్ను గూర్చి తాను చెప్పుకోవడంతో వుంటుంది. ఇదే యక్షగాన ప్రదర్శన స్వరూపం. ఉదాహరణకు: "రాజు వెడలే యమధర్మ రాజు సభకు" అని తన్ను గూర్చి తాను చెప్పుకుంటాడు. ఈ మాదిరి వీథి భాగవతాలలో సూత్ర ధారుని ప్రవేశంలోనూ, ప్రధాన పాత్రల ప్రవేశ సమయాల్లోనూ యక్షగాన పోలికలు కనబడుతున్నాయి.
- మన్నెకొండవిలాసం:
ఉదాహరణకు మన్నెకొండ విలాసం యక్షగానంలో చిత్రాంగద తన ప్రవేశాన్ని గూర్చి
దేవినే చిత్రాంగద ॥దేవినే॥
దేవినే పాండ్య దేశాధిపునకు
కేవల సుతనై కీర్తి వహించిన ॥దేవినే॥
భామనే, రాజిత గుణధామనే
కామిని సలలిత సోముని సమమగు
మోహము కలిగిన సామజయానను ॥దేవినే॥
ఎరుకలసాని ప్రవేశం:
యక్షగానంలో కథకు సంబంధించిన పాత్రలతో పాటు ఎరుకల సాని పాత్ర కూడ విశేషంగా ప్రవేశింపబడేది. ఎరుకసాని, ప్రవేశంతో__
ఎరుక జెప్పితి వినవమ్మా - ఓ ముద్దులగుమ్మా
కరుణతో కలవే కనకపు బొమ్మా
ఎరుకా, ఎరుకా యేడు జగముల
మురుయుచు నీరీతి జనముచ్చట జెప్పెద.
అంటూ వుండగా కథానాయకి, 'ఇంకా ఎటు వలెనే చెప్పవమ్మా' అనగా ఎరుకసాని,
ఓ తరుణీమణీ - వో వువ్వు బోణి
ప్రీతితో వినవమ్మా - నిత్య కళ్యాణి
కర్ణాట కొంకణ - కాంభోజ ద్రవిడ
కర్ణాట సింధుకు సామీప్యమూన
అంగ - వంగ - కళింగ - వంగ దేశముల
బంగాళ నేపాళ బర్బర శౌరి
ఆంధ్రపు శీంద్రము అంతట దిరిగి
చంద్ర సూర్యుల యందు చరియించి మించి
గరుడ గంధర్వుల గగన మార్గమున
నారద తుంబురు నాట్యంబు జూచి
అన్ని లోకంబులు అంతయు దిరిగి
వున్నాడు జగమంత ఒప్పుగా తిరిగి
అంటూ కథానాయకి చేయి చూచి సోదె చెప్పడం ప్రారంభిస్తుంది.
యక్షగాన బాణి:
సుగ్రీవ విజయం యక్షగానంలో, "యక్షగాన కథాక్రమం బెట్టిదనిన" అని కథా ప్రవేశం చేశాడు. దీనిని బట్టి యక్షగానాలను ప్రబంధాలుగా గుర్తించ వచ్చు.
ఉదాహరణగా కథ:
శ్రీరాముడు లక్షణ సమేతుడై ఋష్య మూకమునకు వెళ్ళటం, సుగ్రీవుడు భయపడి హనుమంతుని పంపటం, హనుమంతుని రాయబారం, సుగ్రీవునితో స్నేహమూ, శ్రీరాముని బల ప్రదర్శనమూ, వాలి సంహారమూ, సుగ్రీవ పట్టాభి షేకమూ.
సీతను వెదకుతూ శ్రీరాముడు లక్ష్మణునితో పంపా ప్రాంతమున సంచరిస్తూ వున్నప్పుడు సుగ్రీవుడు వారిని చూచి ఇలా హనుమంతునితో అన్నాడు.
వీరు మనలను వధియింప వేషమొందె
వాలిపంపున వచ్చిన వారు గాను
నాకు గాన్పించుచున్నది గాకయున్న
తాపసుల కేల శరచాపధారణములు
అప్పుడు హనుమంతుడు ఈ విధంగా చెప్పాడు:
ఈ మనోహర రూపవైఖరు
లిట్టి తేజము గలుగువారికి
భూమి నెటువలె దుష్ట గుణములు
బొడము నయ్యా
ఏను నచటికి బోయి వారల
పూని కంతయు తెలిపి వచ్చెద
భానునందన వెరువ నేటికి
బంపు నన్నూ.
సుగ్రీవుడు హనుమంతుని పంపి భయంతో మలయాద్రి పోయాడు. హనుమంతుడు రామ లక్ష్మణుల సంగతి పూర్తిగా తెలిసి వచ్చి సుగ్రీవునితో వివరాలు చెప్పాడు.
......... ఓ కుపికులాధీశ
ఆ రూఢి నీ కనాయాసంబు కతన
శ్రీరాము డనెడి నిక్షేపంబు దొరకె
నింక నీ యక్కరలెల్లను దీరె
గొంకక రఘురాము కొల్వు కేతెంచి.
దుఃఖిస్తున్న రాముడు:
త్రిపుట
నన్ను విడిచియు నిలువజాలక
నాతి వచ్చితి వడవి దిరుగను
నిన్న విడెచేనెట్టులోర్తును
నీలవేణీ
రమణిరో నిను బాసినప్పుడె
రాతిరే శివరాతి రాయెను
నిమిషమైనను నాదు కంటికి
నిదుర రాక॥
అంటూ విలపిస్తాడు. తరువాత శ్రీరాముడు సుగ్రీవునితో స్నేహం చేసి వాలిని బాణంతో కొట్టాడు. అప్పుడు వాలి శ్రీరామునితో ఇలా అంటున్నాడు:
వాలి విలాపం:
నను బేరుకొని పిలిచి నాముఖాముఖి నిలిచి
జననాథ పోరాడి జంపరే ప్రీతి
పొంచి వేసితి రామ భూపాల! నృపధర్మ
మెంచికోతేవైతి వెంతజేసితివి
శ్రీరామ నీరామ జెరగొన్న రావణుని
వారిధుల ముంచితిని వాలమున జుట్టి
ఒక మాట నాతోడ నొనరంగ దెల్పవై
తట రావణుని దున్మి యా సీతదేనె॥
తార దుఃఖం:
వాలి మూర్ఛనొందిన సంగతి తారకి తెలిసింది. దుర్భర దుఃఖంతో ఆమె వారి వద్దకు వచ్చి విలపించింది. సుగ్రీవుని దూరింది. శ్రీరాముణ్ణి చూచి ఈ విధంగా దెప్పి పొడుస్తూంది.
ఆలి చెరగొని పోయినట్టి దశాశ్యుడుండగ నిర్నమిత్తము
వాలి నేటికి జంపితివి రఘువంశ తిలకా
న్యామమేటికి దప్పితివి నర నాథ జానకీ తోడనే చెర
బోయెనేని రాజనీతియు భూరిమహిమల్.
తేరుకున్న వాలి:
మూర్ఛనుంచి తేరుకున్న వాలి అంగదుణ్ణి ఓదార్చి రామునితో ఈ విధంగా అంటున్నాడు:
ఓ మహాత్మ| దయాపయోనిధీ!రామ
భూమితలేశ నాపుణ్యమెట్టిదియొ
నీచేత మృతినొంద నేడు తుర్యాశ్ర
మాచార పరులకు నందగారాది
వైకుంఠ పదవి నిర్వక్రంబుగాక
గైకొంటి నా పాతకము లెల్ల బాసె
భాను వంశాధీశ భవనాశ రామ
ప్రాణముల్ నిర్వహింపవు మేన నింక
బాణంబు దీయవే పార్థివోత్తంస
అనగా రాముడు చేరవచ్చి__
"........నిజ భుజాఖదుర్వార
త్రైలోక్యారక్షణ ధర్మ ప్రశస్తి
నెలమి పెంపగు నట్టి నిజ హస్తమునను
కపికులాధీశు వక్షము గాడియున్న
విపుల సాయకము బల్విడి పెల్లగింప
వాలి యూర్థ్వలోకానికి పోయెను. కపులప్పుడు సుగ్రీవునకు కనక కుంభముల నభిషేకము జేసి</poem>
అర్థచంద్రికలు ఫాలమున
బంగారు పట్టమును గట్టి
అరుదండ రత్న సింహాసనము మీదన్
పుణ్యాంగనలు ధవళములు పాడిరత.
ఎటువలెను.
శ్రీరాముడు గుణధాముడు వారిజలోచనుడు
శూరత రావణు గూలిచి నారీ మణి దేవలయున్
రాముని గృప కపిరాజ్యము క్షేమంబున బాలించే
శ్రీమంతుడు సుగ్రీవుడు భూమండలి బొగడొందున్
అపుడు సుగ్రీవుడు శ్రీరామునకు కానుకలు తీసుకొని వచ్చెను. ఆ గిరి ప్రాంతాలలో ఉండే చెంచీతలు ఈ విధంగా ఏలలు పాడిరి.
భాను వంశమున బుట్టి
దానవ కామిని గొట్టి
మౌనివరుల సన్నుతించగా ఓ రామ చంద్రా!
పూని మఖము నిర్వహింపవా
రాని నాతి జేసివురా
రాతి చేతి విల్లు విరిచి
భూతలేంద్రు లెల్ల మెచ్చగా! ఓ రామ చంద్రా
సీతను వివాహమాడవా?
పైన ఉదహరింపబడ్డ గ్రంథ బాగములను బట్టి చూస్తే సుగ్రీవ విజయమనే యక్షగానము ఎంత రసవత్తర మైనదో బోధపడుతుందంటున్నారు చింతా దీక్షితులు గారు వారి ప్రజావాఙ్మయంలో.
- యక్షగాన రచనా పసందు:
పూర్వ కవుల కవితా వైభవమంతా వారి రచనలలో పొందు పరిచారు. ప్రతి కార్యాన్నీ శుభముహూర్తంతో ప్రారంభించినట్లే, ప్రతి రచనా ప్రారంభం దైవప్రార్థనతో ప్రారంభించే వారు. అదే విధానాన్ని యక్షగానాల్లో అవలంబించారు. అది భారతీయ సంప్రదాయం.
యక్షగాన రచనలో భగవత్ ప్రార్థన తరువాత ఏ విఘ్నాలు కలుగకుండా, విఘ్నేశ్వర ప్రార్థన, షష్ఠ్యంతాలు తరువాత యక్షగానం పేరు, గ్రంథకర్త పేరు, తరువాత కథా ప్రారంబం. ఈ ప్రారంభానికి ఎవరో ఒకరుండాలి. అయితే మార్గ నాటకాలలో మాదిరి సూత్ర ధారుని ప్రవేశం యక్షగానంలో లేదు.
ఆడుతూ పాడుతూ కథ వినిపించే నటియే ఈ పూర్వరంగం ప్రయోగించేదని తెలుస్తూ వుంది. మధ్య మధ్య కథాసంధి అని పలికి ఉదాహరణకు "భయపడుతున్న సుగ్రీవుని తో హనుమంతు డేమనుచున్నాడు" అని కథా సంధి జరిపేవారు.
చివరకు ఏలలు, ధవళాలు, యాలలు, హారతులు గద్యలో తిరిగి కృతిభర్త, కృతి కర్త పేరు, కవిత్వం చిన్న చిన్న మాటలతో సులభశైలిలో వుంటుంది. శృంగార, వీర, కరుణ ప్రధాన రసాలు. గరుడాచల యక్షగానంలో శృంగారానికి ప్రాధాన్యమిస్తే, సుగ్రీవ విజయంలో విప్రలంభ కరుణ రసాలకు ప్రాధాన్యం. డొంక తిరుగుడు లేని కథతో సాఫీగా నడిచిపోతుంది. కథాశిల్పం పరవళ్ళు తొక్కుతుంది. వీటిలో ఒక్కొక్క పాత్రనూ ఒక్కొక్క వ్వక్తి ధరించే ఆచారం లేదు. నర్తకి మాత్రమే ఆడుతూ పాడుతూ వినిపిస్తుంది.
- యక్షగాన సుందర ప్రదర్శనం:
పూర్వం యక్షగానాలను వ్రాయించీ, ఆదరించీ, ప్రదర్శిప జేసింది చాల వరకు ప్రభువులే. ఆ తరువాతే అవి ప్రజల మధ్య ధారావాహికంగా ప్రదర్శింప
బడ్డాయి. ఆనాడు రాజంతఃపురాలలో శాశ్వత నాటక శాలలుండేవి. అక్కడ ప్రదర్శించే ప్రదర్శనాల నన్నిటినీ ప్రభువు చూసి ఆనందించేవారు.
ప్రజా ప్రదర్శనాలన్నీ గ్రామ మధ్యలో నాలుగు వీధులూ కలిసేచోట ఎత్తు పాటి దిబ్బ మీద పందిరివేసి రంగ స్థలాన్ని ఏర్పాటు చేశేవారు. పందిరికి ఒక తెరను వ్రేలాడ తీసేవారు. ఈ తెరను గురించి పండితారాధ్య చరిత్రలో__
..."యొయ్య జవనికల గర్భంబు వెడలి" అని చెప్పటాన్ని బట్టి ఆనాడు కూడ తెరలు వుపయోగించే వారని అర్థమౌతోంది. అయితే ఆ తెరలు కిందికి పైకి వెళ్ళేవి. ప్రక్కకు లాగేవి కావంటారు శ్రీనివాస చక్రవర్తిగారు.
అలాగే బసవ పురాణంలో "జవనిక రప్పించి" అని ప్రయోగించటం వల్ల ఆనాటి తెర అప్పటి కప్పుడు అడ్డు పెట్టే దుకూలమని తెలుస్తూ వుంది. ఆనాటి దీపాలు కాగడాల వెలుతురే. తెర తొలగగానే నటీ నటులు ముఖం స్పష్టంగా కనిపించటానికి కాగడాల మీద గుగ్గిలాన్ని చల్లి పెద్ద వెలుగు తెప్పించేవారు. ఇక ప్రేక్షకులు రంగ స్థలానికి చుట్టూ కూర్చునేవారు. నటీ నటులు నాలుగు ప్రక్కల తిరుగుతూ, అందరికీ కనిపించేలా ఆభినయించేవారు.
- పలురూపాలూ, పలు పదాలూ:
యక్షగాన వాజ్మయాన్ని దేశి సంప్రదాయంగా పండితులు పరిగణిస్తున్నారు. సంస్కృత మార్గ పద్ధతికి భిన్నమైనదీ, దేశీ పద్ధతి. యక్షగానాలలోని ప్రధానమైన గేయ రచనల్ని రగడలలో కొంత మార్పు జరిపి, త్రిపుట - జంపె -ఏక- ఆట అనే తాళాల కనుగుణంగా కల్పించ బడ్డాయి. యక్షగానాలలో ఇంకా అనేక రకాలైన దేశీ రచనలు ఇమిడి వున్నాయి. ఏల పాటలు__ జోల పాటలు__ ఆరతులు__ధవళాలు__చందమామ పాటలు__ వెన్నెల పదాలు మొదలైనవి వున్నాయి.
విరాళి పదాలు - తుమ్మెద పదాలు - కోవెల పదాలు- చిలుకపదాలూ -అల్లోనేరేళ్ళు -సీస కందార్థాలు - త్రిభంగులు - ద్విపదలు -చౌపదులు -షట్పదులు- మంజరులు -జక్కుల రేకులూ- ఈ మొదలైనవన్నీ అనేక యక్ష గానాల్లో ఉదహరింప
బడినాయని వేటూరి ప్రభాకరశాస్త్రుల వారి వంటి చరిత్ర కారులూ, భాషాకారులూ చెపుతూ వచ్చారు. యక్షగానాల్లో ఇంకా అనేక రకాలైన ఉత్పల మాలలూ, సీసాలు, కందర్థాలు , తేట గీతలూ మొదలైనవి అనేకం వున్నాయి.
- యక్షగానపు అలంకారాలు:
పైన ఉదహరించిన యక్షగానంలోని అలంకారాలు ఈ క్రింద విధంగా వున్నాయి.
- వెన్నెల పాటలు:
నూకాలమ్మను కొలవగానే వెన్నెలాలో
మీద-నూకానికీ పెండ్లియన్నె వెన్నెలాలో
విన్నపాలు
శ్ర్రీరామ జయ రామ శృంగార రామ
గారాము నను బ్రోవు కరుణాసముద్రా?
నాలోని జాలి నీకేలా, తోచదురా?
మనసిచ్చి నాతోను మాటాడవేరా?
ఈ రకమైన విన్నపాలను ఈ నాటికీ మన గ్రామాలలో జేగంట భాగవతులు, హరిదాసులు, హరి భక్తులూ పాడుతూ వుంటారు.
- మేలుకొలుపులు:
తెల్లవారే నమ్మ చెల్లెనేమంచు నల్లని స్వామి లేరా?
మరల పడుకునేవు మసలు చున్నావు మర్యాద గాదింక లేవరా
కోళ్ళుగూసెను అలకదీరెను కోమలులకు
తెల్లనాయెను తేజమణిగెను దీపములకు
కృష్ణా మేలుకొనవే.
- సువ్వి పాటలు:
సువ్వీ సువ్వాలే, సువ్వీ సువ్వాలే
సువ్వి సువ్వి యనుచును, సువ్వి యనుచు
సువ్వీ యనుచూను సువ్వి పాడరారె
సుదతులందారూ
- త్రిభంగులు:
పసుపూ నందరు మేనబూసి
మంచి పాలు నేతులు
మంచీ పాలు నేతులు
చల్ల బోసి
బసరుహాక్షులు గుములుకూడి
దొడ్ల - బడ్డని వాసంతమాడి
- సిందు (చిందు):
భామామణి వినుము
యమపట్టణములోని చట్టములెల్లా
వెయ్యర... దమ్ వెయ్ ఃమరియొయ్యర అమ్మోర్ని
- రగడ:
సిరివరుడు నత్తెరవు
చేరవచ్చిన జూడ
కరము మదమొదద మిది
కలకలన్నియు ద్రోచి॥
రూపారతి, దీపారతులు:
ధూపోయం ఘోర పాపా మారాయితే
సర్వతాపస హృదయ ధ్వాంత దీపాయాతే - హార, హర
మంగళం సీతాకుమారి లోకమాతకూ మంగళం
ఇందిరా వరపుత్రికి, జయ మంగళం నిత్య శుభమంగళం
- త్రిపుటలు ... కురుజంపెలు:
మగని నీవని పల్క కూడదు
మహిత భక్తిని మీరటంచును
తగును బల్కగ నెట్టి యాటలు
దసరి యున్నన్.
- కురుజంపె:
పతిని నరుడనుచునే
మతిహీనమైన దేవ
తలి గొలిగి ఈ నరక
తతిలోన బడితిన్.
కుమత గురువుల మాటకోరి విని పతిని
దైవమని కొల్వక నరక వనధిలో బడితిన్॥
- లాలి పాటలు:
లాలీ పాడుచు నూచారమ్మా
కృష్ణ లీలామృతమూ గ్రోలరమ్మా
లాలీ బాడి లాలించారే బాలకృష్ణుని
భక్తిలోలుడై వర్తింపగదరే శీల కృష్ణునీ.
- జంపె:
శ్రీ రమేస పురారి తిథులను - చేరి కొలుతున్
ముదమున శ్రీరమాసాతి గౌరివాణుల సేవజేతున్.
- కందార్థం:
గురుపరమేశుల భక్తిని
పరగగ మది నిల్పి తత్వ పరాయణులై
పరతత్వ బోధ తెల్పెడు
పరిపూర్ణుల భక్తి దలతు -వరముగ నిల్సీ॥
పరిశిష్ట గానాలు
- ఏలలు:
మొదలు మీదా
కొనలు క్రిందా
మొలచియున్నా
చింతలోనా
పదిలమై పద్మములు
పూచెనె ఓ గొల్లభామా
కదిసిచూడ, కానూపించునే!
- మంగళ హారతులు:
సీతా సమేతాయ
శ్రిత మనోల్లాస నీతి వాఖ్యాయ
అతి నిర్మలాయ
రాతి నాతిగ జేసి రక్షించు జగములను
దాతవై బ్రోచు దశరధ సుతాయ॥జయ మంగళం॥
- అల్లోనేరేళ్ళు:
అల్లోనేరేడల్లో
చలగికృష్ణుండనుచు జెప్పరే మీరు
కరివేల్వు మన దొరకు కలిగెనే నేడు
సిరివరుని వలె నితడు చెలగుచున్నాడు
॥అల్లో నేరేడల్లో॥
- చంద్రికలు, అర్థ చంద్రికలు
పడతికిని పాలిండ్లపై
నలుపు దోచెన్
మట్టిపై రుచికల్గె
మానినీ మణికిన్
సన్నుతాంగియు
భర్త సంగతిని గోరెన్
ఇభరాజ వదన
పతియొడ ప్రేమ హెచ్చెన్॥
- ద్విపద:
నవ్వుచూ దీవించె నలినాయతాక్షి
రతిరాజ సుందరా రణరంగధీర
మకలబాంధవ తేజ కరుణాలవాల
రవికాంతియుతుడువై రంజల్లుచుండి
అలరాజు పగ దీర్పు మనుజుల తోడ.
- ద్విపదార్థము:
కొందరు మందులు కూర్మితో సుతుల యందు
నలరుదు రెప్పుడుగాని బుత్రుల దుఃఖము
వినవయ్య తెల్పెదా పూని కనుగొను మనిశము
- ప్రభువులూ, ప్రజలూ మెచ్చిన యక్షగాన సొబగులు:
యక్షగానాల్లో హాస్యం అతి విస్తారంగా కనిపిస్తుంది. యక్షగానంలోని కటకం వాడు...సింగి సింగడు సుంకర కొండడు మొదలైన సాంప్రదాయక పాత్రలు ఈ నాటికీ ప్రజా హృదయాల్లో నిలిచిపోయాయి. కొన్ని యక్షగానాల్లో ఎఱుకలు గొల్లలు మొదలైన వారి జాతి చరిత్ర, వారి సాంఘికాచారాలు, వారి వాలకాలు, మాటల తీరు వృత్తి ధర్మాలు, కట్టుబొట్టులతో సహా తరగతుల వారీగా ప్రజా జీవిత వివరాలన్నీ తెలుస్తాయి. శృంగార హాస్య రసాలు అందరికీ బోధపడే భాషలో వున్నాయి. రాజులకూ ప్రజలకూ ఆదర్శ పాత్ర మైనాయి ఆనాటి యక్షగానాలు.
ఈ యక్షగానాలు ముఖ్యంగా సర్కారు జిల్లాలలోనూ, తెలంగాణా మండలంలోనూ, ఒరిస్సా సరిహద్దుల్లోనూ, దక్షిణ దేశం తంజావూరు, మధుర, పుదుక్కోట మొదలైన ప్రదేశాల్లో తెలుగు మాట్లాడే ప్రతి చోటా ప్రదర్శించబడ్డాయి. ఆయా ప్రాంతాల మాండలిక శబ్దజాలం ఎంతో ఆ యక్ష గానాల్లో వుంది.
యక్షగాన ఇతి వృతాలు కేవలం పురాణ కథలకే కట్టుబడక తాత్కాలిక విషయాలకు కూడ ప్రాముఖ్యతమిచ్చాయి.
రకరకాల వస్తువులతో ఆ నాటి రాజుల ఆచార వ్వరహారాలు, ఆహార వివరాలు, కొలువూ, సింగారం, వివిధ రాజుల ఉద్యోగుల వేషధారణ, వివాహాది సందర్భాలలో పురోహితుల సంభావన తగవులు, ముత్తైదుల ముచ్చట్లు మొదలైన ఎన్నో విషయాలు తెలుస్తాయి.
ఆంధ్రదేశంలో యక్షగాన ప్రదర్శనాలు బహుముఖంగా ప్రర్శించబడ్డయి. ఆనాటి ప్రదర్శకులైన శ్రీనాథుని జక్కుల పురంద్రి__ ప్రతాప రుద్రుని వుంపుడుగత్తె మాజల్దేవి, భాగోతుల బుబ్బుగాడు, పెందెలనాగి దోరసముద్రపు నటులు, తాయికొండ నాటక సమాజ ప్రదర్శకులు ఆదర్శప్రాయులు.
- కోలాచలం వారి వివరణ:
సుప్రసిద్ధ నాటక రచయిత కోలాచలం శ్రీనివాసరావు గారు 1911 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రతిక ఉగాది సంచికలో యక్షగానాలను గురించి ఈ విధంగా వివరించారని చింతా దీక్షితులుగారు (ప్రజావాఙ్మయంలో) ఉదహరించారు.
నన్నయార్యుని మొదలుకొని 19 వ. శకం అంతము వరకు నాంధ్రమున నాటకుములు లేవని పలువురు పండితులు వాకొనుచున్నారు. ఇది విశ్వసనీయము గాదు. ఆంధ్రనాటక సాంఘికు లనేకులుండిరి. వారు భాగవత, భారత, రామాయణాది గ్రంథసంబంధ కథలను సంపూర్ణముగా నాడుచుండిరి. గోపికాలీలలు, పారిజాతాపహరణము- విష్ణుమాయా విలాసము, సైధవ వధ-కీచకవధ -ద్రౌపదీ వస్త్రాపహరణము - హరిశ్చంద్ర, నలచరిత్రలు -సారంగధరకుమార రామ చారిత్రలు -లేపాక్షి రామాయణము -ధర్మపురి రామాయణము మొదలగు ఆంధ్రనాటకము లనేకము లుండెను. వీనికి యక్షగాన నాటకములని ప్రసిద్ధినామముండెను. వానిని రాజగృహములలో నేమి, ధనికుల ఇండ్లలో నేమి, వీధులలో నేమి చక్కగా ప్రదర్శిచుచుండిరి.
ఈ నాటక సాంఘికులలో అనేకులు పండితులుండిరి. వారి వంశస్థులు ఇప్పటికీ అచ్చటచట నున్నారు. వారు ఘట్టుదేశపువారు, లేపాక్షివారు, ధర్మపురి వారు- భాగవతుల రంగయ్యగారు (కూచిపూడి) మొదలగు వారు దేశ దేశములు సంచరించుచు నాటకము లాడి పొగడిక గని వారని ఉదహరించారు.
- తెలంగాణాలో యక్షగానాలు:
తెలంగాణాలో యక్షగానాలు దాదాపు నూరుకు పైగా వున్నాయని యస్వీ జోగారావు గారు తెలియజేస్తున్నారు. (తమ యక్షగాన వాఙ్మయంలో).
తెలంగాణాలో యక్షగాన రచన 18 వ శతాబ్దంలో విరివిగా సాగింది. యక్షగానాలకు ప్రదర్శన రూపంలో కాక, పురాణ పఠనం మాదిరి పారాయణంద్వారా ప్రారంభ దశలో ప్రచారం జరిగింది.
1780 లో రచింప బడిన, శేషాచలకవి ధర్మపురి రామాయణం, 1834 నాటి ముద్దకవి మంథన రామాయణం ఈ కోవకు చెందినవే.
ఆనాడు ధర్మపురి రామాయణం, ఒక్క తెలంగాణాలోనేకాక సర్కారు ఆంధ్రదేశమంతటా వ్వాప్తిలో వుంది. ఆంధ్రదేశపు ప్రదర్శకులు అందులోని దరువుల్ని చక్కగా వినియోగించు కున్నారు.
ఎటుతిరిగీ 19 వ శతాబ్దపు ఉత్తరార్ధం లోనే యక్షగాన ప్రదర్శనాలు రంగ స్థల మెక్కాయి. ఈ కాలంలో శేషభట్టరు కృష్ణమాచార్యులు, గోవర్ధన నరసింహాచార్యులు, దట్టము పాపకవి మొదలైన వారు యక్షగానాలు వ్రాశారు. ఆ నాడు యక్షగాన కవుల్ని మహారాజులు పోషించారు. ఆత్మకూరు మహారాజులు సంస్థానాధీశుడైన, ముక్కర సీతారామ భూపాలుడు రామదాసనే కవిచేత "తారా శశాంకం."భీమసేన విలాసం". అనే యక్షగానాలను వ్రాయించారు. ఈ సమయంలోనే గోవర్థనంగారి గొల్ల కలాపం, రూప్ఖాన్ పేట రత్నమ్మగారి కురవంజి వెలువడ్డాయి.
- యక్షగాన రచనలో అందెవేసిన చేయి:
20వ శతాబ్దం నాటికి తెలంగాణాలో యక్షగానాలు రచనలోనూ, ప్రదర్శన లోను గణతికెక్కాయి. పల్లె గ్రామాలలో ప్రజలు పదాలు కట్టి పాడుకుంటూ వుండేవారు. "కాంభోజరాజు", "బాలనాగమ్మ " "పెద్దబొబ్బలిరాజు కథ" "అరెమరాఠీల కథ" మొదలైన యక్షగానాలు బహుళ ప్రచారాన్ని పొందాయి. చెర్విరాల భాగయ్యగారు ప్రదర్శన యోగ్యమైన యక్షగాన రచనలో అందెవేసిన చేయిగా పేరు పొందారు. ఈ యన రచించిన యక్షగానాలు 32. ఈయన అనేక మంది యక్షగాన కవులకు గురుతుల్యుడుగా నిలబడ్డాడు. యక్షగాన కవుల్లో ప్రసిద్ధులైన వారు బూరుగు పల్లి సోదరులు. వీరి కృతులను నాటకాలనే వ్వవహరించారు.
పట్లోరి వీరన్నగారి "రైతు విజయం" సామ్యవాద సిద్ధాంతానికి అనుగుణంగా రచించబడింది. తెలంగాణాలో యక్షగాన వాఙ్మయమూ, యక్షగాన ప్రదర్శనలూ ఆలస్యంగా ప్రారంభ మైనప్పటికీ, ఆంధ్రదేశపు యక్షగాన చరిత్రలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నాయి.
- అంధకవి రాసిన వంద యక్షగానాలు:
ఆంధ్రదేశంలో యక్షగానాల యుగం అనంతంగా నడిచింది. కొన్ని వందల సంవత్సరాలు రచనలోనూ, ప్రదర్శనలోనూ రాజ్యమేలాయి. ఎందరో మహామహులు, పండితులు మొదలు జానపద రచయితలవరకూ యక్షగానాలను వ్రాశారు. అయితే ఒకే వ్యక్తి వంద యక్షగానాలను వ్రాసిన కవులు కనబడరు. కాని వంద యక్షగానాలను వ్రాసిన ఒక మహాకవి ఏ వెలుగు చూడంక, అంధకవిగా అజ్ఞాతంగా వుండిపోయాడు.
బెల్లోజు రమణాచారి: సాహిత్యాన్ని మధిస్తే రమణాచారి లాంటివారు ఎందరు కాలగర్భంలో కలిసిపోయారో చెప్పలేం. మెదక్ జిల్లా, దుబ్బాక మండలంలోని రామేశ్వరపల్లి గ్రామం రమణాచారి జన్మస్థలం. 77 ఏళ్లు గల రమణాచారి, 36 సంవత్సరాల నుంచీ కంటిచూపు దూరమైనా పట్టుదలను వీడక రచనను సాగిస్తూనే వచ్చారు.
తెలంగాణాలో అత్యధిక యక్షగానాలను రచించిన వారు చెర్విరాల భాగయ్యగారు. ఆయన 40 యక్షగానాలను రచించారు. ఆయన యక్షగానాలు విరివిగా ప్రదర్శించబడ్డాయి కూడా. కాని వంద యక్షగానాలను వ్రాసిన రమణాచారు యక్షగానాలు, రెండు మూడు తప్ప ముద్రణకు నోచుకోలేదు, కాని విరివిగా ప్రదర్శింపబడ్డాయి. ప్రదర్శనానికి వచ్చిన డబ్బు వారి జీవనాధారానికి సరిపోయింది. భారత, భాగవత, రామాయణాలకు సంబంధించిన గాథలే ఆయనకు యక్షగానాలకు ఇతి వృత్తం.
వీరి యక్షగానాలన్నీ స్థానిక తెలుగు లెక్చరర్ దాశరథుల బాలయ్య వద్ద భద్రపరిచారు. ఉన్నత సాహిత్య విలువలన్నీ, రమణాచారి యక్షగానాల్లో వున్నవంటారు బాలయ్య. ఆయనకు కళ్ళు కనిపించక పోయినా వెంకటేశం అనే తన బంధువుకు చెప్పి వ్రాయించాడు.
ఈనాటికీ రమణాచారి యక్షగానాలు ఒక్క మెదక్ జిల్లాలోనే కాక, వివిధ జిల్లాలలో ప్రదర్శింప బడుతున్నాయి. ఆయన యక్షగానాలు పల్లె ప్రజలకు అర్థమయ్యే భాషలో రచియించటం ఎంతో గొప్ప విషయం.
కొన్ని అంశాలను వాస్తవానికి దగ్గరగా వుండే టట్లు ప్రదర్శిస్తామని ఉదాహరణకు అశోకవనంలోని సీతాదేవి శోకిస్తున్న ఘట్టం - సహజత్వానికి దగ్గరగా వుండేందుకు ప్రదర్శనా స్థలంలో వున్న చెట్టుక్రిందే సీతా దేవిని కూర్చుండ బెట్టే వారమని 'న్యూస్ టుడే ' కి వెల్లడించారు.
- అవి అవే ఇవి ఇవే:
ఆ నాడు కూచిపూడి భాగవతులు ఊరూరా తిరుగుతూ డేశసంచారం చేయడం వలన ఉత్సాహం పొందిన కళా ప్రియులైన అనేక మంది ఏనాదులు, గొల్లలు, మాలలు మొదలైన వారందరూ యక్షగానాలను ప్రదర్శిస్తూ వచ్చారు. కట్టుదిట్టమైన కూచిపూడి వారు యక్షగానాలకూ, ఇతరులు ప్రదర్శించే యక్షగానాలకు సారూప్యం లేదు. కూచిపూడి సంప్రదాయం కంటే వారి ప్రదర్శనాల స్థాయి తక్కువ.
- ఆనాటి మేళాలు:
ఆనాడు ఆంధ్రదేశంలో యక్షగాన ప్రదర్శనాల్లో పేరెన్నిక గన్న మేళాలు, సిద్ధేంద్ర యోగి మేళం. భాగవతుల దశరథరామయ్య గారి మేళం, 18 వ శతాబ్దంలోని భాగవతుల బుబ్బుగాని మేళం, 19 వ శతాబ్దం లో రాయలసీమలో లేపాక్షి, వేములపల్లి, తాడిపాత్రి మేళాలు, నెల్లూరు మండలంలో ఎడకండ్ల రామస్వామిరాయ కవి, త్వరకవి రామకృష్ణయ్యగారి మేళాలు విశాఖ మండలంలో నరసింగపల్లి, కళేపల్లి, కందాళ,చిదంబరకవి మేళాలు మొదలైనవి బహు ప్రసిద్ధి పొందాయి.
- ఆనాటి ప్రాముఖ్యమూ అందుకు దాఖలాలు:
యక్షగాన కళారూపం ఆనాడు ఎంతటి ప్రాముఖ్యం వహించిందో ఈ క్రింది వివరాలు మనకు తెలియజేస్తాయి.
ఆంధ్ర ప్రాంతంలో యక్షగానాలను రచించిన కవులు | 174 మంది. |
దక్షిణదేశపు యక్షగాన కవులు | 36 మంది |
తెలంగాణ యక్షగాన కవులు | 47 మంది |
పరిశిష్టాలు రచించిన కవులు | 65 మంది |
అనుబంధాలు రచించినవారు | 140 మంది |
అందరూ కలిపి 465 మంది కవులు యక్షగాన వాఙ్మయానికి కృషి చేశారు.
ఈనాడు లభ్యమయ్యే యక్షగానాలు 542. అలభ్య యక్షగానాలు 260. మొత్తం 802. యక్షగానాలు వెలువడ్డాయి. ఈ విధంగా యక్షగాన వాజ్యయం దక్షిణదేశంలో ధారావాహికంగా వెలుగొందింది. వీటిలో 19 పారిజాతాలు, 28 భామాకలాపాలు, 14 గొల్ల కలాపాలు, 21 కొరంజులు వెలువడ్డాయని యస్వీ జోగారావు గారు తమ "యక్షగాన వాజ్మయ చరిత్ర" రచనలో వివరించారు. యక్షగాన వాఙ్మయ చరిత్ర ద్వారా జోగా రావు గారు అమూల్యమైన సమాచారాన్ని అందజేశారు.
- యక్షగానాన్ని వెలుగులోకి తెచ్చిన మహామహులు:
యక్షగాన వాఙ్మయ పరిశీధనలో శ్రీయుతులు పంచాగ్నుల ఆదినారయణ శాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, డా॥ గిడుగు సీతాపతి, కళాప్రపూర్ణ జయంతి రామయ్య, శ్రీనివాస చక్రవర్తి. మల్లంపల్లి సోమశేఖరశర్మ, అక్కిరాజు ఉమాకాంత, విద్యాశేఖరులు, చింతాదీక్షితులు, ఆచార్య కోరాడ రామకృష్ణయ్య, ఆచార్య పింగళి లక్ష్మీకాంతం, చింతా దీక్షితులు, డా॥నేలటూరి వెంకటరమణయ్య, ఆచార్య గంటి సోమయాజు, ఎల్లోరా ఆచార్య గంటి సోమయాజి, ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం, డా॥కె.వి.ఆర్.నరసింహం, ఆచార్య రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, ఆచార్య విస్సా అప్పారావు, డా॥ యస్వీ జోగారావు, సురవరం ప్రతాపరెడ్డి, డా॥ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, కొమ్మనమంచి జోగయ్యశర్మ, ముట్నూరి సంగమేశం, ఆచార్య తూమాటి దోణప్ప, ఆచార్య బి.రామరాజు,
ఆదిలక్ష్మి, డా॥ ఆర్వీయస్ సుందరం మొదలైన ప్రముఖులెందరో యక్షగాన వాఙ్మయం గురించీ జానపద విజ్ఞానాన్ని గూర్చీ తెలియజేశారు.