Jump to content

కలగు సుషుప్తి నొత్తిగిలగా

వికీసోర్స్ నుండి

కలగు సుషుప్తి నొత్తిగిలగా

పడి లేచు ప్రభాతకాల శీ

తల హృదయంపు టూరుపులు తాక.

నిశా నిట లాంతసీమ శ్యా

మల లలి తాల సాలకలు

మందముగా నటియింప, రాలెనో

యలసెనొ స్వప్న మొం డవశ యై

పడె నా కనురెప్ప సెజ్జలన్.


నిన్న రాతిరి చికురంపు నీలికొనల

జారిపడిన స్వప్నమ్ము నిజమ్మొ, యేమొ!

కోమ లామోద కౌముదీ కోరకమ్మొ!

సుర విలాసవతీ ప్రేమచుంబనమ్మొ!


నిదురపొదిగిళ్ళ మెయి మెయి నొదిగి యొదిగి

వెడలినా మంట నందనవీథు లంట,

ఎరుగరాని దెదో కోర్కెబరువు వలన

తడబడి పెనంగు సోమరినడలు సడల!


అపుడు కావలి మొగసాల నా వనాన

నళికుమారుల హెచ్చరికలును లేవు;

అలరు టంతఃపురాలలో వలపు టెడద

నెగయబోదు నిడుదయూర్పు సెగయు కూడ.


మందాకినీ మందమంద గీతానంద

మధు మాధురీ శీత లహరీ పరిష్వంగ

మందు పులకించి, పుష్పించి, జీవించి యా

నంద నారామ మా వేళ నిదురించు.


రాసులుగాగ నేలపయి రాలుచు

పూవుల దూదిదారులే

చేసి నిశా సమీరణము చీలుచు

తావుల పారునేరులే

వోసి, సుకమ్ముగా నిదురవోవు

లతా లలితాంగి నోర్తుకం

డాసితి మంట; ప్రేయసియు

నా కయి గైకొనె నంట ఆగగాన్!


ఎదురుగా నిల్చి యెద నెద నదుము కొనెనొ,

కనులు కన్నుల కౌగిలి కరగ గనెనొ,

రెప్పపాటు తెర యయి నా హృదయపుటము

దెరచి నిలిచిన దొక బాష్ప తరళకణము!


మాయు నిశీథి కుచ్చెళుల మాదిరి

ప్రాకు వనీ మహీజపుం

జాయల కోమల ప్రణయ చంచలయౌ

వ్రతతీ సతీ గతిన్

ప్రేయసి వాలి, నిండు తెలివెన్నెల

వన్నెల మల్లెపూవులన్

దోయిలి చించి, నా చరణధూళుల

నౌదల నుంచి జాలిగాన్ -


"ప్రియతమా, దాసి యక్షయ ప్రేమసేవ

కీ లతాంతాల మొత్తాలు చాలు నోయి?

నింగి మూలలె నీలి పందుళ్ళు పరచి

యెంత తెలిమల్లెతోట వేయించినానొ!"


అడుగుల నడంగి జీవిక నరయ లేక

పిలుచు సెలయేటి నిస్పృ హోచ్చలిత కంఠ

కరుణ మాలింపగా లేక కరగ లేక

యచల పాషాణ హృదయ మే మౌనొ, పైన?


కోరిక లెల్ల ధూళి పడ

కోల్పడి దిక్కుల శూన్యదృక్కులం

జీరి, యెటో వృథా శిశిర

జీవితభారము బుచ్చుచున్న భూ

మీరుహ మేను; నా మొరడు మేన

నవ ప్రసవాల జాలులే,

ధారలు ధారలై పదము

దాక హిమాంబు తరంగ పాళులే!


కనుల వికసింతునేగదా గగన మలమి

చెలియ నాటిన తోటలో నలరు లేమొ!

కాక నా పాదముల మస్తకమ్ము తోడ

పూజకై పారబోసిన పూవు లేమొ!


విడని వాసన పదములు విరులె యయ్యె;

ఆననమ్మున నశ్రులే యార వయ్యె;

నిలిచినాడ నేటికి కూడ తొలి వసంత

కాలపు ప్రభాత తరుణ వృక్షమ్ము కరణి!