నీతి చంద్రిక/కథా ప్రారంభము

వికీసోర్స్ నుండి
(కథా ప్రారంభము నుండి మళ్ళించబడింది)


గంగా తీరమందు సకల సంపదలు గలిగి పాటలీపుత్ర మను పట్టణము గలదు. ఆ పట్టణమును సుదర్శనుడను రాజు పాలించుచుండెను. ఆత డొకనాడు వినోదార్థము విద్వాంసులతో సల్లాపములు జరుపుచుండగా నొక బ్రాహ్మణుడు -

క. పరువంబు, కలిమి, దొరతనః

మరయమి యనునట్టి వీనియం దొకడొకడే

పొరయించు ననర్థము నా

బరగినచో నాల్గు జెప్పవలయునె చెపుమా?


క. పలు సందియముల దొలచును

వెలయించు నగోచరార్థ విజ్ఞానము, లో

కుల కక్షి శాస్త్ర మయ్యది,

యలవడ దెవనికి వాడె యంధుడు జగతిన్.


అని ప్రస్తావవశముగా జదివెను. ఆ పద్యములు రాజు విని, చదువులేక మూర్ఖులయి సదా క్రీడాపరాయణులయి తిరుగుచున్న తన కొడుకుల దలచుకొని యిట్లని చింతించె;


"తల్లిదండ్రులు చెప్పినట్లు విని చదువుకొని లోకులచేత మంచి వాడనిపించు కొన్నవాడు బిడ్డడు గాని, తక్కిన వాడు బిడ్డడా? మూర్ఖుడు కలకాలము తల్లిదండ్రులకు దుఃఖము పుట్టించుచున్నాడు. అట్టివాడు చచ్చెనా తల్లిదండ్రులకు దుఃఖము నాటితోనే తీరుచున్నది. కులమునకు యశము తెచ్చినవాడు పుత్రుడుగాని తల్లి కడుపు చెఱపబుట్టినవాడు పుత్రుడు గాడు. గుణవమ్తులలో బ్రథమ గణ్యుడుగాని కొడుకును గన్న తల్లి కంటె వేఱు గొడ్రాలు గలదా? గుణవంతు డయిన పుత్రుడొకడు చాలును. మూర్ఖులు నూఱుగుర వలన ఫలమేమి? ఒక రత్నముతో గులకరాలు గంపెడయినను సరిగావు. విద్యావంతులయి గుణవంతులయిన పుత్రులను జూచి సంతోషించుట యను సంపద మహాపుణ్యులకు గాని యెల్లవారికి లభింపదు." అని కొంత చింతించి యుంకించి, తల పంకించి "యూరక యీ చింతయేల? నా పుత్రులు చదువమనిరా? పరామరిక మాలి తగిన విద్యాభ్యాసము చేయింపనయితిని. బిడ్డలకు విద్యాభ్యాసము చేయింపమి తల్లిదండ్రుల దోషము. తల్లిదండ్రుల చేత శిక్షితుండయి బాలుడు విద్వాంసుడగును గాని, పుట్టగానే విద్వాంసుడు గాడు. పురుషకారము చేత గార్యములు సిద్ధిమ్చును రిత్తకోరికల చేత సిద్ధింపవు. నిద్రించు సింహము నోర మృగములు తమంత వచ్చి చొరవు కాబట్టి యిప్పుడు నా పుత్రులకు విద్యాభ్యాసముకయి వలయు ప్రయత్నము చేసెద" నని చింతించి యచటి విద్వాంసులతో నిట్లనియె: "నా పుత్రులు విద్యాభ్యాసము లేక క్రీడాసక్తులయి తిరుగుచున్నవారు. ఎవ్వరయిన వీరిని నీతిశాస్త్రము చదివించి మంచిమార్గమునకు ద్రిప్ప జాలినవారు కలరా?" అనిన విష్ణుశర్మయను బ్రాహ్మణు ట్లనియ:


"రాజోత్తమా! ఇది యెంతపటి పని? మహావంశజాతులయిన దేవరపుత్రులను నీతివేదులను జేయుట దుష్కరము గాదు. కొంగను మాటలాడించుట దుష్కరము గాని, చిలుకను బలికించుట దుష్కరము గాదు. సద్వంశమందు గుణహీనుడు పుట్టడు. పద్మరాగముల గనిలో గాజు పుట్టునా? ఎట్టి రగ్నమయినను సానపెట్టక ప్రకాశింపనట్లు బాలు డెట్టివాడయినను దేవర పుర్తులను నీతికోవిదులను జేసి మీకు సమర్పించెదను." అనిన రాజు సంతోషించి యిట్లనియె: "పూవులతోగూడిన నారకు వాసన గలిగినట్లు సజ్జనులతోడ సావాసించు మూర్ఖునకు మంచిగుణము గలుగుట సాజము. అంతేకాదు, సాధుసాంగత్యము సర్వశ్రేయములకు మూలము" అని సాదరముగా వచియించి, యాతనికి బసదన మిచ్చి, తన కొడుకులను రప్పించి చూపి, "విద్యాగంధము లేక జనుషాంధులవలె నున్నారు; వీరిని నన్ను దెఱిపి రక్షించుట మీ భార" మని చెప్పి యొప్పగించెను.


అనంత మా బ్రాహ్మణుడు వారల నొక రమణీయ సౌధమునకు దోడుకొనిపోయి కూర్చుండ బెట్టుకొని యిట్లనియె. "మీకు వినోదార్థమొక కథ చెప్పెద. అది మిత్రలాభము, మిత్రభేదము, విగ్రహము, సంధియు నని నాలుగంశముల చేత నొప్పుచుండును-వినుండు.