ఎన్నడో మీరు పాడిన దీ వసంత
Appearance
ఎన్నడో మీరు పాడిన దీ వసంత
మధుర జీవనగీతి! హేమంత దీర్ఘ
యామినీ మధ్యవేళయే యైన, నేడు
కూడ, నా యెద, త్రుళ్ళింత లాడుచుండు;
నవ్య భాగీరథీ దివ్యనది విధాన,
నేడు కూడ సోత్సవ నృత్య మాడు లోన.
పొంగి, పరవళ్ళు త్రొక్కి, యుప్పొంగి, పొరలు
ఈ యమృతపూర్ణ సురవాహినీ తరంగ
శిఖరముల నాడు నొక కొన్ని చిన్ని చినుకు
లీ హృదయ గహ్వరము దాటి, యీ గళమ్ము
నతిశయించి, పైపయి చిందులాడుచుండు.
కనులు విచ్చి మనసు విచ్చి కాంచగలుగు
వారి తల యూచి మెచ్చుచున్నారు వాని.