Jump to content

ఎట్లు ని న్నూహసేయుటో యెరుగలేక

వికీసోర్స్ నుండి


ఎట్లు ని న్నూహసేయుటో యెరుగలేక

వంగి వంగి శిరము వాంచి క్రుంగిపోదు!

రాజరాజేశ్వర కిరీటరాజ ఘటిత

రత్న మాణిక్య కాంతినీరాజ నార్చి

తాంఘ్రి నీరేజ యుగళుడ వయ్య! చింపి

పాతలం గట్టికొని జీర్ణ పటకుటీర

పాళికా ప్రాంగణముల నివాస మేల?

శిథిలతర భాజనమ్ము నీ చేత బూని

తూలి సోలుచు నిరుపేద తోడ గూడి

యీవె దెసమాలి నటుల నింటింటి కేగ

నేల? దీనుడవై బిచ్చ మెత్త నేల?

చిత్రములు స్వామి, నీ వింత చేత లెల్ల!

ఎట్లు ని న్నూహసేయుటో యెరుగ లేక

వంగి వంగి శిరము వాంచి క్రుంగిపోదు!

కలుష బాష్ప కల్లోలినీ కణములందు

తళుకు తళు కని నాట్యాలుసలుపు నీ య

నంత రా గాంశుమాలికా కాంతి దేవ!

క్షామ దేవతా నిశ్వాస ధూమపటలి

చల్లగా వెల్లివిరియును స్వామి, నీదు

భవ్య కరు ణార్ద్రవీక్షణ పరిమళములు.

చండ మృత్యు గభీర గర్జారవముల

పల్లవింతువు నవ్య విపంచివోలె

మాధురుల జిమ్ము నీ కంఠ మంజురవము.

చిత్రములు స్వామి, నీ వింత చేత లెల్ల!


మౌనిగానమ్ములకు నించు కేని గాని

మారు మాటాడగా బోవు, మన సొసగవు,

శ్రితజనావళి నమ్ర సంసేవనముల

కలరి తల యూప వీవు,'ఊ' యైన ననవు;

సార్వభౌముల వినయ పూజావిధాన

మెడద మెచ్చవు, వారి కన్నెత్తి కనవు.

ఎట్లు ని న్నూహచేయుటో యెరుగలేక

వంగి వంగి శిరము వాంచి క్రుంగిపోదు!