ఎంత బరు వయ్యెనో గాని యెడద వెలికి
స్వరూపం
ఎంత బరు వయ్యెనో గాని యెడద వెలికి
తొలగి పారని దుఃఖాశ్రు జలము వలన
ప్రావృ డంభోధర స్వామి, నీవు కూడ
నా వలెనె జాలి వొడమ వాపోవుచుంటి
ఒక్క టొక్కటె కన్నీటిచుక్క లొలుక
నేడ్వ లేక యేడ్వ లేక యేడ్చుచుంటి,
నెచ్చెలీ, యే నెరుంగుదు, నీవు కూడ
నొక్కమారు గాటంపు నిట్టూర్పు విడుతు,
తెలియ రాని తెలుప లేని తీక్ష్ణతాప
మెదియ లోలోన నిన్ను వేగించునేమొ!
ప్రావృ డంభోధర స్వామి, జీవనంపు
భారము తొలంగి పోవ నెవ్వారి కేని
కోరి నీ సొదలను జెప్పికొందు వేమొ -
గొణుగు కొనుచుందు వయ్య, యొక్కొక్కవేళ!
ఇట్లె విలపించి కృశియింతు నేను, నీవొ
హోరు హోరున నీ మనసార నేడ్చి
జిలుగు వలిపెంపు వన్నె చీరల ధరించి
కులుకు నవ్వుల పవడాల తళుకుతోడ
పొడుపుచెలి కడకో, సంజపడతి కడకొ
పోయి యాటల పాటల ప్రొద్దు పుత్తు.
ఎడతెగని యాత్ర నిట్లు సాగింప లేక
యేడ్వగా లేక కృశియింతు నే నొకండ!