Jump to content

ఆ భా 7 5 301 to 7 5 330

వికీసోర్స్ నుండి


7_5_301

తే. కోలుమసఁగి గురుండు పాంచాల సేన

నేలకును గోలకును దెచ్చె నీవు గడఁగి

కౌరవులఁ బాయవఱపు మేకతమ యైన

నతనిఁ బరిమార్చుఁ బైకొని యబ్బలంబు.


7_5_302

వ. అనుచు నయ్యాచార్యుపైఁ గవిసి రిట్లు పెక్కు బలంబులు గ్రమ్మినఁ బటు ప్రదర జాలంబులు వఱపి పొడిసేయు నమ్మహాత్ము నాలోకించి ధర్మతనయ భీమసేన మాద్రీ తనయులు గూడికొని తమలోన.


7_5_303

మ. కరులం గూల్చుచుఁ దేరులన్ నఱకుచున్ గర్జిల్లి ఘోటమ్ములన్

నరులన్ నెత్తుటఁ దేల్చుచుఁ దొరల నానా రూప ఖడంబు లై

తొరఁగం జేయుచుఁ గుంభజుండు విలసద్దోర్దండ చండాకృతిం

దెరలం బైఁ జనుదెంచు నేవు మనలం దీర్పంగ నోపుం దుదిన్.


7_5_304

వ. ఎవ్వరికిని నిలువరింప నలవి గాదు నరుండును ధర్మపరుం డై యూరకున్న వాఁడు దెగువకుఁ జొరం డనుచుఁ దలంకిరి వారి తెఱంగు గనుంగొని కమన నాభుండు దమ తేరు వారల కడకుం గొనిపోయి కిరీటితో నిట్లనియె.


7_5_305

చ. అని మొన దేవదానవుల కైనను గెల్వ నశక్య మిమ్మహా

త్ముని నొకమందు సెప్పెద సుతున్ హతుఁ డయ్యె ననంగ విన్న యం

తన యితఁ డాయుధంబు దిగఁ ద్రావి యచేష్టతఁ బొందు నప్పు డీ

తనిఁ బరిమార్ప వచ్చు నిది తప్ప నుపాయము గల్గ దెమ్మెయిన్.


7_5_306

వ. కావున నశ్వత్థామ సచ్చె నని యొక్కరుం డతనికిఁ జెప్పుటయ కర్జం బనిన విని యచ్చటి యందఱు నిదియ మే లని రర్జునుండు దాని కొడంబడక యుండెఁ బాండవాగ్రజూండు విషాదంబుతో విచారించెఁ దదనంతరంబ.


7_5_307

క. భీమునిచే నని వశ్వ

త్థామ యనం బరగు భద్రదంతి వడిన ను

ద్దామగతి నన్నెవమ్ముగ

నామారుత పుత్రుఁ డేఁగి యగ్గురు తోడన్.


7_5_308

వ. అశ్వత్థామ సచ్చె నని చెప్పుటయుఁ జిత్తంబు జల్లని చెదర బెదరియు నతండు దన కొడుకు నస్త్ర వీర్యాది గుణంబులు గణుతించి యప్పలుకులు పెడ చెవులం బెట్టి కలంక లేక ధృష్టద్యుమ్నుపైఁ గవిసి పెల్లేసి యతని కడ్డ పడిన పాంచాల రథికుల నిరువది వేవుర వధియించి మాత్స్యు బలంబున కుఱికి యేనూఱు రథంబులఁ బదివేలు మాతంగంబుల నన్నియ తురంగంబులం బొరిగొని తేజరిల్లి రాజులగములకు నాదిగొను నప్పుడు విశ్వామిత్ర జమదగ్ని భరద్వాజ గౌతమ కశ్యప వసిష్ఠాత్రి ప్రభృతి మునివర ప్రకరం బాతని పాలికేతెంచి భారద్వాజా నీవు బ్రాహ్మణుండవు వేద వేదాంగ విదుండవు నీకు సంగ్రామంబు సేయ ధర్మం బగునే యింతకు మున్ను చేసితేనియుఁ జేసితి గాని కాలంబు పూర్ణం బయ్యెఁ గాన నింక సమరంబు నుడుగుట మేలు మా మాటలు వట్టి యాయుధంబులు వెట్టి శాంతిఁ బొందు మని చెప్పి యంతర్ధానంబు సేసిన నవ్విప్ర వరుండు వారల పలుకు లూహించి భీమసేను వచనంబులం దలంచి యగ్ర భాగంబునకు వచ్చియున్న ధృష్టద్యుమ్నుం గనుంగొని వికల చిత్తుండును శోకాయత్తుండును నగుచు నిజ పుత్రుండు సచ్చుట బ్రదుకుట యజాత శత్రు వలన నున్న రూపు దెలియు వాఁడై యతని నడిగె నయ్యవసరంబున వాసుదేవుం డవ్వసుమతీ పతి కిట్లనియె.


7_5_309

తే. ఆడరి యీ దివసము నపరాహ్ణమునకు

ద్రోణుఁ జని నేసినట్లైనఁ ద్రుంగిపోక

యుండ నేర్తురె యిక్కడి యోధు లెవ్వ

రైన విను నుతి గాదు సత్యమ్ము సుమ్ము.


7_5_310

క. మము నీతని కొప్పింపక

సముచితముగఁ గాచికొను మసత్య వచన దో

షము లేదు ప్రాణ రక్షణ

సమయంబున నతని కొడుకు సచ్చెన యనుమీ.


7_5_311

వ. అని పనిచె నట్టియెడ నయ్యుధిష్ఠిరుతో భీమసేనుం డే నప్పుడు కృష్ణుండు సెప్ప నయ్యోధవరు వధియించు నుపాయంబు విని యదియ మనంబున నుండ మాళవేంద్రుం డగు నింద్రవర్మ వారణం బశ్వత్థామ యను పేరిటిది నాచేతఁ జచ్చె నది నెపంబుగ నతనికి నశ్వత్థామ సచ్చె నని చెప్పితిఁ జెప్పిన నొక్కింత విచారించి యమ్మాటదెస ననాదరంబు సేసె నీకు విజయంబు గోరి హితం బుపదేశించు నీ గోవిందుని వాక్యం బుల్లంఘింపక నీవు నట్ల చెప్పుము నీ వచనమ్ము నమ్ము నమ్మి యతండు గయ్యంబు సేయఁ జేయాడక చెడు నని యొత్తి చెప్పుటయు.


- ధర్మజుఁడు ద్రోణునితో నశ్వత్థామ సచ్చె నని యేనుఁగు నెపంబునఁ జెప్పుట –


7_5_312

క,. మది నయ్యిరువుర మాటలుఁ

బదిలంబుగఁ బట్టికొనుటఁ బట్టియు నెట్లుం

దుది నది యట్టుల కాఁగల

యది యై యుండుటను దాని కతఁ డొడఁ బడియెన్.


7_5_313

వ. ఇట్లు సమ్మతించి.


7_5_314

క. అనృత భయము నాజి జయముఁ

గొనియెడు తమకంబు పెంపు గుదియింపఁగఁ బాం

డు నరేంద్రు నగ్ర తనయుం

డనుమానము వాయఁ బెట్టి యస్త్ర గురునితోన్.


7_5_315

తే. వలయుకొలఁది నెలుం గెత్తి వర్ణ సమితి

యచ్చుపడఁగ నశ్వత్థామ సచ్చె ననియె

నని పదంపడి యల్లన యతని చెవికి

వినఁగ రాకుండఁ గుంజర మనియె నధిప.


7_5_316

వ. ఇవ్విధంబునం బలుకుటయు.


7_5_317

క. నేలకు నల్లెఁడు పొడువునఁ

గ్రాలుచు మును మెఱయు గురుని రథ చక్రము ల

క్కాలంబున సమర జయ

శ్రీలోపము దెలియ నంటసిలఁ బడియె నృపా.


7_5_318

వ. అప్పుడు.


7_5_319

క. తనుఁ బాండు తనయులకు ద్రో

హునిఁగా నక్కుంభజన్ముఁ డూహించుచు న

మ్మును లట్టు సెప్పి రటు గా

వునఁ గాకేమి యిది దగ వపుం బొమ్మనుచున్.


7_5_320

శా. ధృష్టద్యుమ్నునిఁ జూచుచున్ రణ సముద్రేకంబు బాహా బలా

వష్టంభంబును శౌర్య నిర్వహణ గర్వ స్ఫూర్తియు దొంటి యు

త్కృష్టత్వంబును దక్కి స్రుక్కి వగ బుద్ధిం బీఁకువీఁ కాడఁగాఁ

జేష్టాహీనతఁ బొంది యగ్గురుఁడు సంక్షిప్తాంగుఁ డై యున్నెడన్.


7_5_321

వ. అతని వధంబునకై పాంచాల విభుని వేలిమిం బుట్టిన వాఁ డగుట నప్పార్షతుండు దత్సమయ జనితోత్సాహ రోష విశేషాయత్త చిత్తుం డగుచు నమ్మహీసుర వరు మీఁదం గవిసి యేసిన ననికి నొల్లని యుల్లంబును బరుని యుల్లాసంబు సహింపలేని తేజంబును బురికొనిన యతండు వోరం దొడంగిన దివ్యాస్త్రంబులు ప్రతిభాసింపక యుండె నట్లయినను మనసు బలిమి కలిమిం బకృతి బాణంబుల నాతని బాణ బాణాసన రథ రథ్య సూత కేతనంబులు వొడినేసె నా ధృష్టద్యుమ్నుండు గద గొనినం దునియలు గావించెఁ బలకయు వాలునుం గొని వచ్చి యవ్వీరుండు సారథి తురంగంబుల యంగంబుల వ్రయ్యనేయఁ దత్కరవాల ఖేట పాటనంబు సేసి తనువునం జండకాండంబులు నించె నట్లు నించి నొంచినం గని శినివరుండు గృప కర్ణ కృతవర్మల తోడం బెనంగు చుండియుఁ గ్రూర నారాచ దశకం బయ్యాచార్యు మేన నిగిడించె నంత నత్యంత రయంబునం జనుదెంచి యనిల నందనుండు ద్రుపద నందనుఁ గుంభ సంభవుం బారికిం దప్పించుకొని పొయినం బో పొమ్మని పలికి డెందం బెప్పటి చందం బగుటయు నిశ్చల భావం బొందె నివ్విధంబున నాలుగు దివసంబులు నొక్క రాత్రియు నేనగు దివసంబులో నిరువది గడియలు నిరువది గడియలు నిరువది యొక్క వే లట్ట లాడ భండనంబు సేసి పాండవ బలంబుల నుఱుమాడి పేరడవి గొని కాల్చి పొనుంగు వడిన కార్చిచ్చు కై వడిం గుదిసి యమ్మహాత్ముండు.


7_5_322

సీ. సంగరంబునఁ దన్వి సని శాంతిఁ బొందిన చిత్తంబుతోఁ దమసేన దిక్కు

గనుఁగొని పెలుచ నో కర్ణ యో కృప యో సుయోధన పోర నన్నొత్తి యెపుడుఁ

జెప్పుదు రేను నాచే నయినంతయుఁ జేసితి నింక నిశ్చింత వృత్తి

సుగతికిఁ జనఁ గోరి తగ నుజ్జగించెద బాణామనంబును బాణములును

తే. దెలివి గలిగి మనుం డని పలికి శర శ

రాసనము లూడ్చి తేరి పై ననఘ మూర్తి

యొప్పఁ గూర్చుండి సంభృత యోగ నిష్ఠ

నొంది తేజోమయాత్ముఁ డై యుండె నధిప.


7_5_323

వ. అట్టియెడ ధృష్టద్యుమ్నుండు గృపాణ పాణియుఁ బాదచారియు నై భారధ్వాజు దెసకుం గవియుటయు నుభయ సైన్యంబుల హాహాకారంబు లెసఁగె నంతం దనువు విడిచి యప్పుణ్య పురుషుండు ప్రకట జ్యోతీ రూపంబున నెగసి పరమ స్థానంబునకుం జనియెఁ దత్తేజోమూర్తి యేను గంటిఁ గృష్ణార్జున ధర్మనందన కృపాచార్యులునుం గనిరి దక్కటి మానవులు గానరు సురలు సూచి సంతసంబునం బొదలి రట్లడరిన యా ద్రుపద నందనుండు.


- ధృష్టద్యుమ్నుఁడు మృతుం డైన ద్రోణుని కంఠంబు దునుముట –


7_5_324

చ. అరదము పైకి దాఁటి కుపితాత్మత ద్రోణు శవంబు కేశముల్

గరమున బెట్టమర్చికొని ఖడ్గహతిన్ మెడ ద్రుంచి వైచె స

త్వరముగ మాను మాను మను వాక్యముతో నరుఁ డేఁగఁ దప్పు సు

మ్ముర యని ధర్మజుండు దివి ముట్టు నెలుంగున బిట్టదల్పఁగన్.

7_5_325

వ. ఇత్తెఱంగునం దునిమి యతం డయ్యట్టయుం దలయును ధరణీ తలగతంబు నేసె నిట్లు శత వృద్ధుం డగు నయ్యస్త్ర గురుండు నీ దుర్మంత్రంబునఁ ద్రుంగి పోయినం బొంగి పాండవానీకంబు పైకొని తఱిమిన మన మొనలు వెఱ చఱచి కనుకనిం బఱచెం బఱచిన మనంబు గలంగి యప్పుడు నీ కొడుకు లేట మొగంబులు వడు దొరల తోడం గూడఁ దిరిగె నట్టియెడ దుర్యోధన దుశ్శాసన కృప కర్ణ కృతవర్ణ మద్రేశ్వరులు మాతంగంబులం దురంగంబుల ముందఱ వెట్టికొని కటకటా యనుచు నింత వుట్టునే యనుచు నింక నేమి గల దనుచు నెట్లు సేయం గలవార మనుచు నేది దుది యచును మరలి మరలి చూచుచుం జనుచుండఁ దక్కిన యలంతిమానుసు లెల్లను దలచీర వాటించు తలంపు లేక యొండొరుల నిలు నిలు మని పలుకుచుం గాలు నిలువక పలు దిక్కులకుం బాఱి రత్తఱి నశ్వత్థామ మున్నొక్క కెలనం గయ్యంబు సేయుచుండి నీ సేన యట్లగుట గనుంగొని యక్కురుపతి కడకు జని యతని కిట్లనియె.


7_5_326

తే. బలము లిది యేమి నలుగడఁ బాఱఁ జొచ్చె

గర్ణ కృప ముఖ్యు లేటికిఁ గలఁగి లేట

మొగము వడి రేల నీవును మున్ను వోలె

నిలువరింపంగ దగియెడు నిలుపు లేవ.


7_5_327

వ. అని యడిగిన నతం డతని మొగంబు సూచి యాచార్యు తెగుట సెప్పం బోయి డగ్గుత్తిక వడి యూరకుండె శారద్వతుండు వెలువెలం బాఱుచు నెట్ట కేలకు నెలుంగు దెచ్చికొని.


7_5_328

సీ. పాంచాల పాండవ ప్రముఖ సైన్యంబుల ద్రోణుండు బలువిడిఁ ద్రుంచుటయును

నుక్కఱి పాండవు లొక్కచోటికి వచ్చి నిలువరింపఁగ లేక తలఁకుటయును

వాయు తనూజుఁ డశ్వత్థామ సచ్చెఁ జు మ్మని కుంభజుని తోడ నాడుటయును

నమ్మాట గొనక ధర్మాత్మజు నవ్వార్త యాచార్యుఁ డేర్పడ నడుగుటయును


తే. భీముచేత నశ్వత్థామ నామ గజము

మున్ను చచ్చుట గతమున నన్నరాథి

పతియు నది నెపముగ నట్ల పలుకఁ జాల

నడలి యతఁ డాయుధంబులు విడుచుటయును.


7_5_329

వ. అప్పుడు.


7_5_330

క. గురుఁ డమల యోగ నిష్ఠం

దిర మై యుండంగ వచ్చి ధృష్టద్యుమ్నుం

డరదము మీఁది కెగసి త

చ్ఛిరోజములు వట్టికొని యసిం దునుముటయున్.