ఆ భా 7 4 271 to 7 4 300

వికీసోర్స్ నుండి


7_4_271

వ. మీరందఱు నట్ల కాదే యధర్మపరు లయి యభిమన్యు ననుచితంపుఁ

జంపు చంపితి రని నిరుత్తరుం జేసి యప్పుడు దన్ను నీ కొడుకులుం గొందఱు

రాజులును నిందించిన నత్తెఱంగునన పలికి వారల పలుకుల నుడిపి యా

సౌమదత్తి నుపలక్షించి శోకించి యతని కుందు మాన్పం దలంచి.


7_4_272

తే. క్షత్త్ర ధర్మంబు కీడునఁ గటకటా మ

హాత్మ నీ యట్టివాని కిట్లధిక పీడ

సేయ వలసె నా ప్రతిన చర్చింపు మెల్ల

పనులకును మూల మా సుయోధనుఁడ సూవె.


7_4_273

వ. అన్నరపతి నరకంబునం బడంగలవాఁడు నీవు సద్గతిం బొందు

మనవుడు నతండు శైనేయు విడిచి యపసవ్యకరంబున శరంబులు

వఱుచుకొని ప్రాయోపవేశన మతి నుండి ప్రాణాయామ పరాయణుం డై

యోగయుక్తుం డయ్యె నంత నొడలి కుత్సాహంబు వచ్చి లేచి సాత్యకి

గరవాలం బమర్చికొని మాధవ ధనంజయ భీమాశ్వత్థామ కృప కర్ణులు

వలదు వల దని యెలుంగెత్తి వారింపఁ గ్రోధోన్మాదంబున శిరచ్ఛేదనంబు

సేసిన భూరిశ్రవుండు సిద్ధచారణ గణాభినందితుం డగుచుఁ బుణ్య

లోకంబున కరిగె నాళిని వరుండు దన్ను వారించిన వారల నుద్ధేశించి

యభిమన్యు వధ ప్రకారం బుపన్యశించె నప్పుడు మన సైనికు లిట్లు

దగునే యను వారును గోపం బేమి సేయింప దనువారును నతనిచేతఁ

బడిన వాఁ డుడుగునే యనువారును నిది విధి వశంబు

పొమ్మనువారును నై రనిన విని ధృతరాష్ట్రుండు సంజయున కిట్లనియె.


7_4_274

క. గురు కృతవర్మాది రథిక

వరులకు నవిజయ్యుఁ డైనవాఁడు శినివరుం

డరయఁగ మహాద్భుతం బ

క్కురు వరుచే నాతఁ డిట్లగుట సూతమతా.


–సంజయుఁడు ధృతరాష్ట్రునకు సాత్యకి పరాభవ కారణంబు చెప్పుట–

7_4_275 వ. అనవుడు నతఁ డమ్మహీపతి కిట్లను దీనికిం గారణంబు

గల దాకర్ణింపుము సోమవంశ పరుండగు యయాతి నందనుం

డయున యదుని కులంబున జనియించిన దేవమీఢునకుఁ

బుట్టిన శూరుని కొడుకు వసుదేవుండు రూపగుణంబులం

బ్రసిద్ధుండై పెరుఁగుచుండ దేవకుం డను వల్లభుండు దనపుత్రికి

దేవకీ దేవికి స్వయంవర మహోత్సవం బాచరించిన

నవ్వసుదేవునకై యయ్యాదవాన్వయజాతుం డగు శిని

యవ్వనితఁ బరాక్రమంబునఁ దేరఁగుడిన రాజలోకంబుఁ దొడరి

పోరంజాలక నిలిచిన సోమదత్తుం డొక్కరుండును బోక పెనంగె

నయ్యిరువురు నొండొరుల చేత విరథులై కృపాణంబులు గొని

ధరణికి లంఘించి పోరునెడ నయ్యదువీరుం డాక్రమించి బాహ్లిక

తనయుం గొప్పు వట్టి యొఱగం దిగిచి యనుకంప పెంపునం

జంప నొల్లడ తన్ని విడిచినం బోయి సిగ్గు పెంపునఁ దల యెత్తి

తిరుగ నేరక పనంబున గరిగి హరు నుద్దేశించి పెద్దకాలంబు

దపంబు సేసిన నప్పరమేశ్వరుండు ప్రత్యక్షం బై వరంబు వేఁడు


మనినఁ దత్కాలంబునకు శినియును దదీయ సుతుండును

గడచనుటం జేసి శినిమనుమని ననిం బడ వైచి తన్నం జాలు

తనయు నీవలయు నని యడిగిన నద్దేవుం డట్ల యగు గాక

యని యానతిచ్చి యంతర్హితుం డయ్యెఁ దద్వర ప్రభావంబున

భూరిశ్రవుండు సాత్యకి నిట్లు సేసె నని చెప్పిన నాంబికేయుండు

గయ్యం బటమీఁద నెట్లు సెల్లె ననుటయు సంజయుం డతని కిట్లనియె.


7_4_276

ఆ. సౌమదత్తి యిట్లు సచ్చిన దదనంత

రంబు రథము సింధురాజు దెసకు

నరుఁడు నడపఁ బంచె నారాయణు నపుడు

గురు సుతాది రథిక వరులు నృపుఁడు.


7_4_277

వ. బరవసంబు సేసి యడ్డపడి రట్టియెడఁ గర్ణ సాత్యకులకుఁ

గయ్యం బయ్యె నత్తెఱంగు వివరించెద వినుము కృష్ణుండు

త్రికాలవేది యగుటఁ దన తమ్మనికి భూరి శ్రవుని వలనం బుట్టు

నెడరు తెఱం గెఱంగి తొలునాఁటి రాత్రి నిజసారథి యగు

దారుకునితోడఁ బార్థుని ప్రతిన నెరపం బూని పలుకు నెపంబున

మనయరదం బయితంబు సేసికొని యెల్లి గయ్యంబునకుం గొని

రమ్మని చెప్పె నప్పు డెట్టి యడియాలంబులతోఁ బాంచజన్యంబు

పూరింపం గలవాఁడై పలికె నా చందంబున నంతకు మున్ను

యా సూతునకు నేతేరవలయు తడవు గనుంగొని శంఖంబు

పూరించిన వాఁడును శైబ్య సుగ్రీవ మేఘ పుష్పవలాహకంబు

ను వాహంబుల వేగంబు నెఱయ మెఱయం బొలుచు గరుడ

కేతనంబు గ్రాలఁ దేరు తత్కాలంబు కొదవ నాలంబులోనికిం

దెచ్చిన నయ్యచ్యుతుండు మెచ్చుచు నా శైనేయున కిచ్చినం

జూచి కౌంతేయుం డచ్చెరు వందిన నతనికి నవ్విధంబు గొంత

సూచించె నిట్లు సాత్యకి సన్నద్ధుండై.


7_4_278

తే. ఏచి నరునకు సాహాయ్య మాచరించు

కౌతుకంబున నేతేరఁ గర్ణుఁ డతని

నధిక సంరంభమునఁ దాఁకె నక్కిరీటి

కని జనార్ధను తోడ నిట్లనియె నగుచు.


7_4_279

క. భూరిశ్రవుండు సచ్చుట

సైరింపక సూత సుతుఁడు సాత్యకి తోడం

బోరం దొడంగె మనము వి

చారింపక యెయ్ద వలయు సరిగొనకుండన్.


7_4_280

ఆ. అనుఁడు నతడు సాలు నతనికి నా చక్ర

రక్షకులు గడంగి రయము మెఱయఁ

గదిసి తోడు పడిరి కావున నక్కడి

చింత వలవ దని మురాంతకుండు.


7_4_281

వ. తేరు సైంధవుని దెసకుం దఱిమె నప్పుడు శైనేయ

రాధేయుల పోరెల్ల వారును వెఱఁగు పడి చూచుచుండి

రత్తెఱంగు సంగరంబు సురాసుర గంధర్వుల యందునుం

గలుగదు విను మట్లు పోరిపోరి యన్నారాయణానుజుండు.


- కర్ణుఁడు సాత్యకితో యుద్ధంబు సేసి యోడి పోవుట –

7_4_282

చ. నిరుపమ శక్తిఁ గర్ణుమెయి నెత్తురు వఱ్ఱుగఁ జేసి సూతునిం

దురగములన్ సిడంబు వెసఁ ద్రుంచి రథంబును నా పత్రముం

దర మిడి నుగ్గు సేసె వసుధావర తమ్ములు రాజుఁ జూడ న

ప్పరుషత సూచి చేయఁ గల పార్థివు లాతనిఁ జుట్టు ముట్టినన్.


7_4_283

క. శరవేగము రథ గమన

స్ఫురణ విచిత్రతయు మెఱయఁ బోరి యతం డ

య్యరదములగములు సుడివడఁ

దెరల మరలఁ బఱవఁ జేసి దీపెంచె నృపా.


7_4_284

క. అనుటయు ధృతరాష్ట్రుఁడు గృ

ష్ణుని రథమును రథ్యములును సూతుఁడు నగుటన్

శినివరునకు నుత్సాహం

బనూన మయి చూవె యంత యధికుం డయ్యెన్.


7_4_285

వ. అనిన విని సంజయుం డతని కిట్లను నట్టియెడ మున్ను

దారకుండు దేరుదెచ్చు సంరంభంబు సూచి యది కృష్ణుని పను

పని యెఱుంగని వాఁ డగటఁ గయ్యంబు గజిబిజిగాఁ దలంచుచు

వాని పిన్న తమ్ముండు మేలిమి రథంబునం దగు తురంగంబులం

బూన్చికొని వివిధాయుధంబు లమర్చికొని కేతనోద్ద్యోతితంబు సేసి

యారథంబు వచ్చినజాడ నేతెంచి సన్నిహితుం డగుటయు

సాత్యకి సముచితంబుగా నయ్యరథం బెక్కి విక్రమాటోపంబు

సూపుచుండ రథాంగ ధరుని సారథి రథ సహితంబుగా నతని

కడకుం జనియె నీ కొడుకులు కర్ణుం గల్పిత రథోదీర్ణుం గావించి

రనవుడు నాంబికేయుం డట్లు కిరీటిం గలసి భీముం డేమి సేసె నని యడిగిన.


7_4_286

తే. ఆతనికి సంజయుం డిట్టు లనియెఁ గర్ణు

చేత నవమానితుం డయి చిన్నఁ బోయి

పార్థు పాలికి నరిగియుఁ బలుక కుండెఁ

గినుక నెరియు మనంబుతో మనుజ నాథ.


7_4_287

వ. పదంపడి తన్నా సూత పుత్రుండు పలికిన పలుకు లా

ఫల్గునుతో నుగ్గడించి వానిం దొడరి యే నెల్ల భంగులం బరిమార్తు

ననిన నాతం డవి నా చెవి సోఁక నాడుట నన్నుఁ బలుగుట గాక

నీకుం బని యేమి నీ వటుండు మని పలికి రాధేయు రథంబున

కభిముఖుం డై.


7_4_288

ఉ. ఏమిర కర్ణ భీము నటు లేటికిఁ దిట్టి తతండు దోల సి

గ్గేమియు లేక పాఱునెడ నెవ్వరు దిట్టిరి నిన్ను గెల్పు సం

గ్రామములోనఁ దప్పిదము గల్గిన యంతన యింత గర్వ మే

లా మును ని న్నెఱుంగమె చలంబున సాత్యకి యిప్డు గెల్వఁదే.


7_4_289

క. గెలుపును నోటమి యును ననిఁ

గలుగవె యెడపెట్టి యెట్టి ఘనులకు నిమ్మైఁ

బలుగురే తగు వారిం

దులువా నీ కులము గుణముఁ దోఁచెం బ్రజకున్.


7_4_290

వ. ఇంత వట్టును వెలారింతు నీ మాటలు మఱవకుండు

మిదియునుం గాక నాయసన్నిధి నధర్మంబున నభిమన్యు

విల్లు దునిమితివి దానికి నీవు గనుంగొనుచుండ ధర్మ ప్రకారంబున

వృషసేనుతల దునుదుము మఱియు నీ తోడం గూడ నప్పు

డప్పావం బాచరించిన వారిని నిన్నును నెట్లు సేసెదనె యటు

చూడు మని పలికి తఱిమిన మన సైన్యంబు లఱిముఱి నతనిపైఁ

గవిసినఁ దత్సమర విహారంబు దారణ ప్రకారం బయ్యె

మిహిరుండును మంద రశ్మి యగుచు వచ్చెనా సమయంబున

సుయోధనుండు రాధేయున కిట్లనియె.


7_4_291

సీ. శైనేయుఁడును భీమసేనుండు నిరుదెస రా నర్జునుఁడు సింధు రాజు దెసకు

నేడ్తెఱఁ దఱిమెడు నింక నొక్కించుక ప్రొద్దాఁగి పెనఁగినఁ బ్రొద్దు దాను

సప్తమించెడును నీ యట్టి జోదునకు శల్యుండును గురు నందనుండు గృపుఁడు

దుశ్శాసనుఁడు నేనుఁ దోడ్పడ నతనికిఁ జేయార్ప వచ్చునె చేటుకాల


ఆ. మైనఁ బ్రతిన వట్టె నంతియ తనతోడి

వార సోదరులును వీరు సనిన

నేల యెల్ల మనమ యేలుద మిత్తఱి

నలువుఁ జలముఁ జూపవలయు నీవు.


7_4_292

వ. అనిన సూత నందనుం డమ్మానవపతి నాలోకించి.


7_4_293

చ. అనిల తనూజు బాణముల నంగము లెల్లను జాల నొచ్చె నై

నను నను మీఱ వచ్చునె రణంబునఁ గ్రీడికి మేదినీశు మ

న్నన గల మేటి బంటు ప్రథనంబున నింతలు సేయకున్న నొ

ప్పునె యనిఁ బేర్చువాఁడ నట భూవర దైవమ నేర్చు నావుడున్.


7_4_294

వ. ఆతండు ప్రీతుం డయ్యె నయ్యవసరంబున భీమ సాత్యకి

మహాయుండగు నా సవ్యసాచి గాడ్పు తోడు గల యగ్ని

దేవుండునుం బోలె దేజరిల్లి భల్లాది బాణంబులు నీ బలంబుల

పై నిగిడింపఁ జతురంగంబల యవయవంబులుఁ జామర్చ

ఛత్త్రకేతు శకలంబులుఁ గోదంబు గదా దండాది హేతి

ఖండంబులు గీడ్పెరసి పాఱు నెత్తురుటేఱులఁ దెట్టువలు

గట్టె నట్టియెడ దుర్యోధన కర్ణ వృషసేన శల్య కృపాశ్వత్థామలు

గడంగి తమతోడన తఱుము జయద్రథుం బిఱిందికిఁ

ద్రోచికొని ప్రొద్దు లావునం జేవ యెక్కి యక్కిరీటిం దాఁకి తీవ్ర శరంబులు

వరగించిన నవి యతం డొక్కొక్కటిం బెక్కు తునియలు సేయం

దఱిమి యందఱు నొక్కుమ్మడి నొక్కొక్కరుండు పెక్కమ్ము

లమ్మధూసూదన ధనంజయుల తనువులం బఱపిన నన్నరుం

డుఱుక యొక్కొక్కరినిం బెక్కు నారాచంబుల స్రుక్కించి.


- కర్ణార్జునుల ద్వంద్వ యుద్ధము –

7_4_295

క. సింధుపతి దెసకు మదవ

త్సింధుర గతిఁ గవియఁ జూచి ధీరోద్ధతిఁ గో

పాంధ మతి నడ్డిపడియె వ

సుంధర గ్రక్కదల సూతసూనుం డథిపా.


7_4_296

వ. అప్పుడు.


7_4_297 ఆ. పదియు నేను నిశిత బాణంబు లర్జునుఁ

డనిల నందనుండు శినివరుండు

మూఁడు మూఁడు మెఱుఁగు వాఁడి తూపులు

మేను గాఁడ నేయ నొచ్చి కర్ణుఁ డలిగి.


7_4_298

క. అఱువది యఱువది యమ్ముల

నెఱఁకులు నోనాడ నేసి నిలిపి తన రయం

బెఱిఁగించె మువ్వురకు న

త్తెఱఁ గద్భుత రసము వెల్లిఁ దేల్చ జనములన్.


7_4_299 ఆ. నరుఁడు నూఱు తీవ్ర శరముల నయ్యోధ

వరుని తనువు రక్తవారిఁ దోఁప

నాతఁ డట్టి నూఱు లై దడరించె న

వ్వేగమునకు రోష వివశుఁ డగుచు.


7_4_300

క. ఆ విజయుఁడు గర్ణుని విలు

వావిరిఁ దునుమాడి విపుల వక్షము నవ బా

ణా విద్ధము సేసి యతని

జీవము గొనునట్టి ఘన విశిఖ మేసె వడిన్.