ఆ భా 1 3 091 to 1 3 120

వికీసోర్స్ నుండి

1_3_91 కందము

విని దాని నుడుపఁగా బ్ర

హ్మనియుక్తుం డై సనత్కుమారుఁడు మహికిం

జనుదెంచె బ్రహ్మలోకం

బుననుండి యనేక దివ్యమునిసంఘముతోన్.

(ఈ విషయం తెలిసి సనత్కుమారుడు బ్రహ్మనియామకం చేత చాలామంది మునులతో భూలోకానికి వచ్చాడు.)


1_3_92 వచనము

పురూరవుండును రాజ్యగర్వంబున నమ్మునులకు దర్శనం బీనొల్లక పరిహసించిన నలిగి వారలు వాని నున్మత్తుంగా శపియించిన వాఁడు గంధర్వలోకంబున నూర్వశీ సహితుండై యుండె నట్టి పురూరవునకు నూర్వశికి నాయువు ధీమంతుండు నమావసువు దృఢాయువు వనాయువు శతాయువు నను నార్వురు గొడుకులు పుట్టి రం దాయువునకు స్వర్భానవి యను దానికి నహుష వృద్ధశర్మ రజి గయానేనసు లనంగా నేవురు పుట్టిరి వారి యందు నహుషుండు రాజ్యాభిషిక్తుం డై.

(పురూరవుడు వారికి దర్శనమివ్వక వారిని పరిహసించాడు. వారు కోపంతో పురూరవుడు వెర్రివాడిగా మారాలని శపించారు. తరువాత ఊర్వశీపురూరవులకు ఆరుగురు కుమారులు జన్మించారు. వారిలో ఆయువు అనే అతడికి నహుషుడు మొదలుగా అయిదుమంది పుట్టారు. నహుషుడు ప్రభువై.)


1_3_93 మత్తేభము

చతురంభోధిపరీతభూవలయమున్ సద్వీపసారణ్యస

క్షితిభృత్కం బగుదాని భూరిభుజశక్తిం జేసి పాలించుచుం

గ్రతువుల్ నూ ఱొనరించి కీర్తి వెలయంగా దిక్కులన్ నిర్జితా

హితుఁడై యానహుషుండు దాఁబడసె దేవేంద్రత్వముం బేర్మితోన్.

(భూమిని పాలిస్తూ, నూరు యజ్ఞాలు చేసి దేవేంద్రపదవిని పొందాడు.)


1_3_94 వచనము

అట్టి నహుషునకుఁ బ్రియంవద యనుదానికి యతి యయాతి సంయా త్యాయా త్యయతి ధ్రువు లనంగా నార్వురు పుట్టి రందు యయాతి రాజై యనేక యాగంబులు సేసి శుక్రపుత్త్రియయిన దేవయానియందు యదు తుర్వసులును వృషపర్వపుత్త్రియయిన శర్మిష్ఠయందు ద్రుహ్వ్యనుపూరులు ననంగా నేవురు కొడుకులం బడసి రాజ్యంబు సేయుచు శుక్రశాపంబున జరాభార పీడితుండై కొడుకుల నందఱం బిలిచి యిట్లనియె.

(నహుషుడి ఆరుగురు పుత్రులలో ఒకడైన యయాతి రాజై, శుక్రుడి కుమార్తె అయిన దేవయానిని పెళ్లాడి, యదువు, తుర్వసుడు అనే పుత్రులను, వృషపర్వుడి కుమార్తె అయిన శర్మిష్ఠను పెళ్లాడి ద్రుహ్వి, అనువు, పూరుడు అనే పుత్రులను పొందాడు. రాజ్యం చేస్తున్న యయాతి శుక్రుడి శాపం వల్ల ముసలివాడయ్యాడు. అప్పుడతడు తన కుమారులను పిలిచి ఇలా అన్నాడు.


1_3_95 సీసము

విషయోపభోగాభిలషణ మింకను నాకు

వదలక పెరుఁగుచున్నదియుఁ గాన

నందనులార మీ యందొక్కరుండు నా

దగు జరాభారంబు దగిలి తాల్చి

తనజవ్వనంబు నాకొనరంగ నెవ్వఁడీ

నోపు నాతండ సద్వీపసకల

ధారుణీసామ్రాజ్యభారయోగ్యుం డగు

నని యడిగిన నగ్రతనయుఁ డయిన


ఆటవెలది

యదువుఁ దొట్టి సుతులు ముదిమికి నోపక

తలలు వాంచి యున్న వెలయఁ దండ్రి

పనుపుఁ జేసి ముదిమి గొని జవ్వనం బిచ్చెఁ

బూరుఁడను సుతుండు భూరికీర్తి.

(మీలో ఎవరైతే యౌవనాన్ని నాకు ఇచ్చి నా ముసలితనం తీసుకుంటారో వారికే నా రాజ్యం ఇస్తాను అన్నాడు. మిగిలినవారు మౌనం వహించగా పూరుడు అందుకు ఒప్పుకున్నాడు.)


1_3_96 వచనము

అనిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె.

(అది విని జనమేజయుడు వైశంపాయనుడితో ఇలా అన్నాడు.)


-:యయాతి మహారాజు చరిత్రము:-


1_3_97 తేటగీతి

వర్ణధర్మముల్ గాచుచు వసుధ యెల్ల

ననఘచరితుఁ డై యేలిన యయ్యయాతి

భూసురోత్తమ భార్గవపుత్త్రి యైన

దేవయానిని దానెట్లు దేవిఁ జేసె.

("యయాతి మహారాజు శుక్రుడి కుమార్తె అయిన దేవయానిని ఎలా పెళ్లాడాడు?")


1_3_98 తేటగీతి

విపులతేజంబునను దపోవీర్యమునను

జగదనుగ్రహనిగ్రహశక్తియుక్తుఁ

డయినయట్టి యయాతికి నలిగి యేమి

కారణంబున శాపంబు కావ్యుఁ డిచ్చె.

("యయాతిని శుక్రుడు ఎందుకు శపించాడు?")


1_3_99 వచనము

మఱియు నస్మద్వంశకరుం డయిన యయాతిచరితంబు విన వలతుం జెప్పు మని యడిగిన వానికి వైశంపాయనుం డిట్లనియె.

("అంతేకాక మా వంశానికి చెందిన యయాతి చరితం వినాలని ఉంది", అని అడగగా వైశంపాయనుడు ఇలా అన్నాడు.)


1_3_100 కందము

మనుజాధిప వృషపర్వుం

డను దానవపతికి శుక్రుఁ డాచార్యుం డై

యనిమిషవిరోధులకుఁ బ్రియ

మొనరించుచు వివిధ విధినయోపాయములన్‌.

(ఓ రాజా! శుక్రుడు వృషపర్వుడనే రాక్షసరాజుకు ఆచార్యుడిగా ఉండేవాడు.)


1_3_101 కందము

దేవాసురరణమున గత

జీవితు లగు నసురవరులఁ జెచ్చెర మృతసం

జీవని యను విద్యఁ బున

ర్జీవులఁగాఁ బ్రతిదినంబుఁ జేయుచు నుండెన్‌.

(దేవాసురరణంలో మరణించిన రాక్షసులను మృతసంజీవని విద్యతో పునర్జీవింపజేసేవాడు.)


1_3_102 వచనము

దాని నెఱింగి దేవతలెల్ల నతి భీతులై యసురుల నోర్వనోపక శుక్రువలన మృతసంజీవని వడసి తేనోపునట్టి మహాసత్త్వుం డెవ్వం డగునో యని విచారించి బృహస్పతిపుత్త్రుం డయిన కచుని కడకుం జని యిట్లనిరి.

(ఇది తెలిసి దేవతలు భయపడి, శుక్రుడి దగ్గర మృతసంజీవని నేర్చుకొని రాగల సమర్థుడెవరా అని ఆలోచించి బృహస్పతి పుత్రుడైన కచుడి వద్దకు వెళ్లి ఇలా అన్నారు.)


1_3_103 కందము

పోరను మృతసంజీవని

కారణమున నిహతు లయ్యుఁ గా రసురవరుల్

వారల నోర్వఁగ మన కతి

భారము దుర్వారవీర్యబలయుతు లగుటన్.

(మృతసంజీవనికారణాన చావు లేకుండా ఉన్న రాక్షసులను జయించటం అసాధ్యంగా ఉంది.)


1_3_104 కందము

మనపక్షంబునవా ర

ద్దనుజులచే నిహితులయ్యుఁ దగ మృతసంజీ

వని లేమిఁజేసి యమసా

దనమున కరుగుదురు వీర్యదర్పితు లయ్యున్‌.

(మనపక్షంలో చనిపోయినవారు మృతసంజీవని లేకపోవటం వల్ల యమలోకానికి పోతున్నారు.)


1_3_105 కందము

కావున మృతసంజీవనిఁ

దేవలయును శుక్రువలన ధృతిఁ బడసి తప

శ్శ్రీవిభవ దానిబలమునఁ

గావంగావలయు సురనికాయబలంబున్‌.

(కాబట్టి శుక్రుడి దగ్గర మృతసంజీవనివిద్య నేర్చుకొని దేవగణాలను కాపాడాలి.)


1_3_106 కందము

బాలుండవు నియమవ్రత

శీలుండవు నిన్నుఁ బ్రీతిఁ జేకొని తద్వి

ద్యాలలనాదానముఁ గరు

ణాలయుఁడై చేయు నమ్మహాముని నీకున్.

(బాలుడివైన నీకు శుక్రుడు ఆ విద్యను దానం చేస్తాడు.)


1_3_107 వచనము

దుహితృస్నేహంబునం జేసి యద్దేవయాని పలుకులు శుక్రుం డతిక్రమింపండు గావున నీనేర్చువిధంబున దానిచిత్తంబు వడసి శుక్రు నారాధించిన నీ కిష్టసిద్ధి యగు నని దేవతలు ప్రార్థించి పంచినం గచుండును దేవహితార్థంబు వృషపర్వుపురంబునకుం జని యచ్చట వేదాధ్యయనశీలుం డయి సకలదైత్యదానవగణోపాధ్యాయుం డయి యున్న శుక్రుం గని నమస్కరించి యిట్లనియె.

(దేవయాని కోరికను శుక్రుడు జవదాటడు కాబట్టి ఆమె మనసు లోబరచుకొని శుక్రుడికి శుశ్రూషచేస్తే కార్యసిద్ధి అవుతుంది అని దేవతలు ప్రార్థించారు. కచుడు వారి హితం కోసం వృషపర్వుడి పురానికి వెళ్లి శుక్రుడిని చూసి నమస్కరించి ఇలా అన్నాడు.)


1_3_108 కందము

ఏను గచుం డనువాఁడ మ

హానియమసమన్వితుఁడ బృహస్పతిసుతుఁడన్‌

మానుగ వచ్చితి నీకును

భానునిభా శిష్యవృత్తిఁ బని సేయంగన్‌.

(ఓ మహర్షీ! నేను కచుడిని. బృహస్పతి పుత్రుడిని. మీ దగ్గర శిష్యరికం చేయడానికి వచ్చాను.)


1_3_109 వచనము

అనిన నమ్మునికుమారుని సుకుమారత్వంబును వినయప్రియవచనమృదుమధురత్వంబును ననవరతనియమవ్రతప్రకాశితప్రశాంతత్వంబునుం జూచి శుక్రుం డతిస్నేహంబున వీనిం బూజించిన బృహస్పతిం బూజించిన యట్ల యని యభ్యాగతపూజల వాని సంతుష్టుంగాఁ జేసి శిష్యుంగాఁ జేకొని యున్నంత నక్కచుండు.

(అని పలికిన కచుడి సుకుమారత్వాన్ని, వినయాన్ని, ప్రశాంతతను శుక్రుడు చూసి, ఇతడిని పూజిస్తే బృహస్పతిని పూజించినట్లే అని భావించి శిష్యుడిగా స్వీకరించాడు.)


1_3_110 సీసము

పని యేమి పంచినఁ బదపడి చేసెద

ననక తన్‌ బంచిన యాక్షణంబ

చేయుచు నిజగురుచిత్తవృత్తికిఁ గడు

ననుకూలుఁడై వినయంబుతోడ

మనమునఁ జెయ్వుల మాటలభక్తినే

కాకారుఁడై మఱి యంతకంటె

దేవయానికి సువిధేయుఁడై ప్రియహిత

భాషణములఁ బుష్పఫలవిశేష


ఆటవెలది

దానములను సంతతప్రీతిఁ జేయుచు

నివ్విధమునఁ బెక్కులేండ్లు నిష్ఠ

గురుని గురుతనూజఁ గొలిచి యయ్యిరువుర

నెమ్మి వడసెఁ దనదు నేర్పు పేర్మి.

(శుక్రుడు ఏ పని చెప్పినా తరువాత చేస్తాననకుండా వెంటనే చేస్తూ, దేవయానికి కూడా విధేయుడై ఎంతో నేర్పుతో కచుడు వారి ప్రేమను పొందాడు.)


1_3_111 వచనము

ఇట్లు గురుశుశ్రూషాకౌశలంబునఁ గచుండు శుక్రునకుం బ్రియశిష్యుం డై యున్న నెఱింగి దానవులు సహింపనోపక బృహస్పతితోడి యలుక నక్కచు నొక్కనాఁడు హోమధేనువులం గాచుచు వనంబున నేకతంబయున్న వాని వధియించి విశాల సాలస్కంధంబున బంధించి చని రంత నాదిత్యుం డస్తగిరిశిఖరగతుం డగుడు మగుడి హోమధేనువు లింటికి వచ్చిన వానితోడన కచుండు రాకున్న దేవయాని తనమనంబున మలమల మఱుంగుచుం బోయి తండ్రికిట్లనియె.

(ఇది రాక్షసులు సహించలేక, హోమధేనులను కాస్తున్న కచుడిని చంపి ఒక చెట్టుకు కట్టి వెళ్లిపోయారు. సాయంత్రమైనా కచుడు రాకపోవటంతో దేవయాని కలవరపడి శుక్రుడి దగ్గరకు వెళ్లి ఇలా అన్నది.)


1_3_112 ఉత్పలమాల

వాఁడిమయూఖముల్ గలుగువాఁ డపరాంబుధిఁ గ్రుంకె ధేనువుల్

నేఁ డిట వచ్చె నేకతమ నిష్ఠమెయిన్ భవదగ్నిహోత్రముల్

పోఁడిగ వేల్వఁగాఁ బడియెఁ బ్రొద్దును బోయెఁ గచుండు నేనియున్

రాఁడు వనంబులోన మృగరాక్షసపన్నగ బాధ నొందెనో.


(సూర్యాస్తమయమైనా కచుడింకా తిరిగిరాలేదు. అడవిలో ప్రమాదమేదైనా జరిగిందేమో.)


-:కచుండు దానవహతుం డై మృతసంజీవనిచే బ్రదుకుట:-


1_3_113 వచనము

అనిన విని శుక్రుండు దనదివ్యదృష్టి నసురవ్యాపాదితుండైన కచుం గని వానిం దోడ్కొని తేర మృతసంజీవనిం బంచిన నదియును బ్రసాదం బని యతి త్వరితగతిం జని విగతజీవుం డయిన కచు నప్పుడ సంజీవితుం జేసి తోడ్కొని వచ్చినం జూచి శుక్రుండును దేవయానియు సంతసిల్లి యున్నంతఁ గొన్నిదినంబులకు వెండియు నొక్కనాఁడు.

(శుక్రుడు తన దివ్యదృష్టితో రాక్షసుల వల్ల కచుడు చనిపోయిన విషయం తెలుసుకొని అతడిని మృతసంజీవని విద్యతో తిరిగి జీవింపజేశాడు. తరువాత కొన్ని రోజులకు.)


1_3_114 కందము

అడవికిఁ బువ్వులు దేరఁగ

వడి నరిగినకచునిఁ జంపి వారక దనుజుల్

పొడవు సెడఁ గాల్చి సురతోఁ

దడయక యబ్బూది శుక్రుఁ ద్రావించి రొగిన్.

(పువ్వులకోసం అడవికి వెళ్లిన కచుడిని రాక్షసులు చంపి, అంతటితో ఆగక, అతడిని కాల్చి, ఆ బూడిదను మద్యంలో కలిపి ఆ మద్యాన్ని శుక్రుడి చేత తాగించారు.)


1_3_115 వచనము

శుక్రుండును సురాపానమోహితుండయి యున్నఁ దొల్లింటియట్ల దేవయాని గచుం గానక దుఃఖిత యై నేఁడును గచుండు రాక మసలె నసురుల చేత నిహతుం డయ్యెఁ గావలయు నని శోకించిన దానిం జూచి శుక్రుం డిట్లనియె.

(కచుడు రాకపోవటం చూసి, మళ్లీ అతడిని రాక్షసులు చంపి ఉంటారని దుఃఖిస్తున్న దేవయానితో శుక్రుడు ఇలా అన్నాడు.)


1_3_116 కందము

వగవక సంజీవని పెం

పగణిత గర్వమున నసురు లా కచుతోడం

బగఁ గొని చంపెద రాతఁడు

సుగతికిఁ జనుఁగాక యేల శోకింపంగన్.

(సంజీవని గొప్పతనం తెలియక రాక్షసులు ఆ కచుడిని చంపుతారు. అతడు ఉత్తమగతికి వెళ్లుగాక. దీనికి దుఃఖించటం ఎందుకు?)


1_3_117 వచనము

అనిన దేవయాని యిట్లనియె.

(అది విని దేవయాని ఇలా అన్నది.)


1_3_118 మత్తేభము

మతిలోకోత్తరుఁ డైన యంగిరసుమన్మం డాశ్రితుం డాబృహ

స్పతికింబుత్త్రుఁడు మీకు శిష్యుడు సురూప బ్రహ్మచర్యాశ్రమ

వ్రత సంపన్నుఁ డకారణంబ దనుజవ్యాపాదితుం డైన న

చ్యుతధర్మజ్ఞ మహాత్మ యక్కచున కే శోకింప కెట్లుండుదున్.

(గొప్పవాడైన కచుడిని రాక్షసులు కారణం లేకుండా చంపితే దుఃఖించకుండా ఎలా ఉండగలను?)


1_3_119 వచనము

వానిం జూచి కాని కుడువనొల్ల నని దేవయాని యేడ్చుచున్నఁ బెద్దయుంబ్రొద్దునకుఁ బ్రసన్నుం డై శుక్రుండు దనయోగదృష్టిం జూచి లోకాలోకపర్యంతభువనాంతరంబునఁ గచుం గానక సురాసమ్మిశ్రభస్మమయుండై తన యుదరంబున నున్న యక్కచుం గని సుర సేసిన దోషంబును నసురులు సేసిన యపకారంబును నెఱింగి.

(కచుడిని చూసి కానీ తిననని ఏడుస్తున్న దేవయానిని చూసి శుక్రుడు అనుగ్రహించి, యోగదృష్టితో, మద్యంలో కలిపిన బూడిదరూపంలో కచుడు తన కడుపులో ఉండడం చూసి, మద్యపానం వల్ల కలిగే హానినీ, రాక్షసులు చేసిన అపకారాన్నీ తెలుసుకొని.)


1_3_120 ఆటవెలది

మొదలి పెక్కు జన్మములఁ బుణ్యకర్మముల్

పరఁగఁ బెక్కు సేసి పడయఁబడిన

యట్టి యెఱుక జనుల కాక్షణ మాత్రన

చెఱుచు మద్యసేవ సేయ నగునె.

(ఎంతో కష్టపడి పొందిన జ్ఞానాన్ని క్షణంలో పోగొట్టే మద్యపానం చేయవచ్చా?)