పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామకృష్ణపరమహంస

63

యగ్నియు దీనిని మైలపరచిన మనుష్యుఁడు పరబ్రహ్మస్వరూపములే కదా. నీకీభేదబుద్ధి యేలకలుగవలె? ఆపలుకులు విని యోగి పరమహంసతో "ఇఁకమీఁద నేనెన్నడు నెవరిపైఁ గోపపడ"నని తెలివిం దెచ్చుకొనియె.

రామకృష్ణుఁ డీవిధమున బ్రహ్మజ్ఞానమునేర్చి జ్ఞానమొక దారి నడత యొకదారి గాకుండ నద్వైతసిద్ధి నొంది పిమ్మట యోగాబ్యాసము చేయనారంభించెను. ప్రాణాయామముఁబట్టి యూపిరి బంధించి యాహారంబుఁ దినక యతఁ డొక్కకసారి కొన్నిదినములు గడపుచు వచ్చెను. ఆదినములలో నెక్కడనుండియో యొకసాధువువచ్చి యతనితోఁ గలిసియుండి ప్రాణాయామము బట్టినప్పు డాహారము లేమిచే నతఁడు మృతినొందునేమో యనుభయమున బలవంతముగ నాహారమును మింగించుటకుఁ బ్రయత్నించుచువచ్చెను. ఒకమారు రామకృష్ణున కెంతకు మెలఁకువ రానందున సాధువు దుడ్డుకఱ్ఱతో వానిం గట్టిగా కొట్టి మెలకువ దెప్పించి రెండు కబళములయన్నము నోట గ్రుక్కి బ్రతికించెను. ఈ తెఱంగున నాఱుమాసములు యోగాభ్యాస మగునప్పటికి రామకృష్ణున కాహార నిద్రాసుఖములు లేమి గ్రహణి రోగము సంభవించెను. ఈరోగము యోగమును మాన్పించి వానికి జాల మేలొనరించెను. స్వదేశ వైద్యులు వానిరోగము కొన్నిరోజులలో మాన్పిరి. ఆయభ్యాసముచేత సామాన్యయోగులకు దుర్లభమైన నిర్వికల్పక సమాధిని దాను బ్రవేశింపఁగలిగితిననియు దృఢమయిన మనస్సును శరీరమును గలిగియుండుటచేత తానట్టిసమాధిని ప్రవేశింప మరల బ్రతుకనయ్యెను. కాని సామాన్యులు బ్రతుకుట యరిదియనియు నతఁడిటీవల చెప్పుచువచ్చెను. ఆరోగ్యము కలిగిన నతఁడు వైష్ణవుల భక్తిమార్గము నవలంబింపవలయునని తలంచెను.