పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామకృష్ణపరమహంస

59

నతని నాపనిలోనుండి తప్పించి మధురనాథుఁ డతని మేనయల్లుని నియమించెను.

ఇట్లుండ నెంతకాలమునకుఁ దనకు దేవి ప్రత్యక్షము కాలేదని నిరాశఁజెంది రామకృష్ణుఁడు మృతినొందఁ దలఁచుచుండఁగా నొడలు తెలియక పడిపోయెను. ఇది కొందఱు మూర్ఛయనుకొనిరి. కాని యది మూర్ఛగాక సమాధియయ్యెను. ఈసమాధిలో వానికి కాళికాదేవి ప్రత్యక్షమై వానిననుగ్రహించెను. అంతట నతఁడించుకయూరడిల్లియుండెను. అది మొద లతఁడు మరణమునొందువఱకుఁ బలుమారులు సమాధిప్రవేశముఁ జేయుచునే యుండెను. అతఁడు సమాధిలో నున్నపు డెంతఘనవైద్యులు వచ్చి చేయిచూచినను నాడి గనఁబడదయ్యె. ఈ యద్భుతమున కెవ్వరుఁ గారణముఁ జెప్పజాలరయిరి. సమాధిలోఁ దనకు దేవి తరుచుగాఁ బ్రసన్నురాలగుచుండుట నిజమో లేక తనమనోభ్రమయో యని యొక్కొక్కమారతఁడు సందియంపడుచు దానియదార్థ్యమును గనుంగొనుటకయి యదివఱ కెన్నఁడును జరుగని యొకకార్యము జరిగినచో దేవీప్రత్యక్షముమాట నమ్మెదనని యతఁడు దేవితోఁ చెప్పుచుండును. ఎట్లన రాణి రాసమణియొక్క కొమార్తె లిద్దఱు దమయంతఃపురము విడిచి యాలయము ముందు మఱ్ఱిచెట్టుక్రిందకు వచ్చి తనతో మాటలాడినచో దేవి ప్రత్యక్షమగుట నమ్మెదనని దేవితోఁ బలికెను. రాచమణికూఁతు లిద్ద ఱెన్నఁ డంతఃపురము విడువని గోషాస్త్రీలు అదివఱ కెన్నఁడాలయము త్రొక్కిచూచి యెఱుఁగరు. అది యేమి చిత్రమోకాని యాశుద్ధాంత కాంతలిద్దఱు గుడిచూచుటకుఁ దల్లి యనుమతి నంది యాలయమునకువచ్చి మఱ్ఱిచెట్టునీఁడ నున్న రామకృష్ణుని బలుకరించి "దేవి నిన్ననుగ్రహించెను. భయపడకు" మని