పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[7]

కేశవచంద్రసేనుఁడు

49



కలకత్తానగర సమీపమున నొకతోటంకొని తానును విరాగియయి యందుండెను. తరువాత కలకత్తానగరముననే పెద్దయిల్లు నొకదానిఁ గొని 'పద్మకుటీర' మని దానికిం బేరుపెట్టెను. ఆ యింటిలో నొక పెద్దగది బ్రహ్మమతస్థుల నిమిత్తము ప్రత్యేకముగ వదలి వేయఁబడెను. క్రమక్రమమున తనమిత్రులను శిష్యులను దనయింటి సమీపముననే బసలుకొని కాపురముండునట్లు ప్రోత్సాహపఱచి బ్రహ్మమతస్థుల యగ్రహార మొకటి యేర్పరచెను. పద్మకుటీరమున నున్న కాలమున నీతఁడు ధనవంతుఁడు గాకున్నను గొప్పయుద్యోగస్థుఁడు గాకున్నను నెంతెంతవారికి దర్శనము లీయని మహారాజులు గవర్నరులు గవర్నరుజనరలు వానియింటికి స్వయముగా వచ్చి దర్శనముచేసి మాటలాడి పోవుచువచ్చిరి. ఈతఁడేకార్యము చేసినను నది యీశ్వరాదేశమని నమ్మి యట్లు చెప్పుచు వచ్చెను. వయసు ముదిరిన కొలఁది నితనికి లోకమున గౌరవము హెచ్చసాగెను. తాను గావించిన యవివేక కార్యములుగూడ భగవాదేశమున జరిగినవని యతఁడు చెప్పు చుండుటచే నతని యనుచరులలోఁ గొందఱి కతనిపయి నసూయ పొడమెను.

ఇట్లుండ నతఁడు కుమార్తెకుఁ బెండ్లి చేయఁదలంచి కూచిబిహారు మహారాజును వరునిగా నంగీకరించెను. పెండ్లికుమార్తెకు పదునాలుగేండ్లయిన నిండలేదు. పెండ్లికుమారుఁడు రమారమి పదునేడేండ్లవాఁడు. బ్రహ్మమత నిబంధనం బట్టియు కేశవచంద్రుని ప్రోత్సాహముచేతనే దొరతనమువారు నిర్మించిన చట్టముఁ బట్టియుఁ బెండ్లి కూఁతురు పదునారేండ్లకుఁదక్కువగాను పెండ్లికొడుకు నిరువది యేండ్లకు దక్కువగ నుండరాదు. అదియెగాక కూచిబిహారు రాజు బ్రహ్మమతస్థుఁడుకాడు. వివాహము బ్రహ్మధర్మప్రకారము గాక బ్రాహ్మణ ధర్మప్రకారము జరెగవలసివచ్చెను. ఈకారణమునం బట్టి యతని