పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

మహాపురుషుల జీవితములు



రూపాయిలఁ దమకు వారిచ్చు నట్లొడంబరచెను. అంతియకాక విలువ గల నగలు గుర్రపుబండ్లు మంచిమేడలు మొదలగునవి విక్రయించి ఋణముఁ దీర్చెను. వేదములఁ జదువుటకు గాశికానగరమునకుఁ బంపిన నలువురు బ్రాహ్మణులను చదువు చాలించి రమ్మనియెను. తాను స్థాపించిన తత్వబోధీనీ పాఠశాలను గట్టిపెట్టి యామందిరమును విక్రయించెను. ఆడువాండ్రెక్కి పోవుటకొక పల్లకి నుంచుకొని తక్కిన సామానులన్నియు విక్రయించి పూర్వవైభవమంతయు గోలుపోయి సామాన్యుఁ డట్లు బ్రతికి యతఁడు ఋణవిముక్తుఁడయ్యె. ఆహాహా! ఎగబెట్టుట కంత వీలున్నప్పుడు తాను కష్టపడుచుఁ దండ్రిచేసిన ఋణములు దీర్చుట యామహానుభావునియందుఁదక్క మఱొక్కనియందు గాంచుట యరిదిగదా, ఋణములఁ దీర్చుటయేగాక ధర్మకార్యముల నిమిత్తము తండ్రి చందాల నిచ్చెదనని వాగ్దానములఁ జేసినవారల కందఱకు వాగ్దత్తధనమును వడ్డీతోఁగూడ నిచ్చి యీ మహాత్ముఁడు పితృవాక్యపరిపాలకుఁ డయ్యెను. ఇట్టియుదారచిత్తుఁడే దేశముననుండు నా దేశము ధన్యమయినదిగదా ! ఋణప్రదాతలు కొంతకాల మితని జమీగ్రామముల స్వాధీనముఁ జేసికొని వ్యవహరించి సరిగా నప్పులు దీర్చుకొనలేక సంస్థానము మరల దేవేంద్రనాథునకే యప్పగించి యతనికిఁదోచినట్లప్పుల దీర్చుమని వేడిరి. అతని సత్యసంధతయందు బ్రజల కెంతనమ్మకముఁగలదో దీనింబట్టి తెలిసికొనుఁడు. వారివలన సంస్థానము మరలఁగైకొని దేవేంద్రనాథుఁడు జాగరూకతతో వ్యవహరించి ఋణములుదీర్చి తన యాస్తి నిలుపుకొనెను.

ఇట్లు కొంతకాలమునకు దేవేంద్రనాథునకును వాని సహకారులకును గొన్ని యభిప్రాయభేదములుఁ గలుగ మనశ్శాంతికై యతండు 1856 వ సంవత్సరమున బూర్వకాల మనేక మహర్షులకు నివాసమైన హిమాలయపర్వతములకుం బోయెను. బోయి యచ్చట