పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్. కె. శేషాద్రి అయ్యరు

371



నెలకు రెండువేల రూపాయ లుపకార వేతనమును దయచేసిరి. మాధవరావు మొదలగువారు తాము మంత్రులై యున్న దేశములలో జీవితకాల శేషమును గడపక స్వదేశములకుఁ బోవుచువచ్చిరి. శేషాద్రయ్య రట్లుచేయక యేదేశపుసొమ్ము తానుతినెనో యాదేశమునందే తన ధనమంతయు ఖర్చుపడవలయునని యుద్యోగమును మానిన వెనక గూడ స్వదేశమునకుఁబోవక మైసూరులోనే గాఁపుర ముండెను. ఈయన గొప్పపరీక్షలయందుఁ దసెఱినను మతవిషయమునఁ బ్రాచీనులలోఁ జేరినవాఁడు. ఇంటివద్ద పరమనిష్ఠుఁడై వ్యాఘ్రచర్మముఁ గప్పుకొని విభూతిపిండికట్లుబెట్టుకొని మహేశ్వరధ్యానము సేయుచుండును. మృతినొందునప్పుడు సయిత మీయన తన శరీరము బులితోలుతోఁగప్పి దహనము జేయుమని బంధువులను బ్రార్థించెనఁట. మతవిషయమునందింత పట్టుదల కలదని యీతఁడు వ్యవహార విషయములలో నెన్నఁడు జాతిమత భేదములను బాటించినవాఁడు కాఁడు. వ్యవహారములలోఁ దురక, క్రైస్తవుఁడు, మాలవాఁడు, బ్రాహ్మణుఁడు గూడ నాయన దృష్టికి సమానులే.