పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[47]

సర్. కె. శేషాద్రి అయ్యరు

369



దెలిసికొనుటకు, తెలిసికొనవలయునెడల దేశకాలపాత్రముల ననుసరించి మార్పులఁ జేయుటకు నవకాశము కలిగెను. రెండవలాభమిది. హిందూ దేశమునందు మంత్రులైన మహానీయులు విద్యావిషయమున ముత్తెగలుగ నున్నారు. అది యెట్లన నాంగ్లేయవిద్యజక్కగానేర్వక మంత్రులై యనంతర మాబాస నేర్చుకొని మొత్తముమీఁద స్వభాషతోనే వ్యవహారము నడిపించినవారుకొందఱు. ఇందులో గ్వాలియరు మంత్రియైన దినకరరావు హైదరాబాదునకు మంత్రియైన సలారుజంగును జేరుదురు. బి. యే. బి. యల్ మొదలగు పరీక్షలయందుఁ గృతార్థులు కాకపోయిన దమ కాలమునాటికున్న యాంగ్లేయవిద్య నభ్యసించి వ్యవహార మింగ్లీషుతోనే కట్టుదిట్టముగ నడిపినవారు కొందఱు మాధవరావు రంగాచార్యులు రామయ్యంగారు మున్నగు వారీ తెగలోనివారు. బి. యే. బి. యల్ మొదలగు పరీక్షలయందు గృతకృత్యులై మంత్రులై నవీన పద్ధతుల ననుసరించి వ్యవహారముల నడిపినవారు కొందఱు. శేషాద్రయ్యరీ తెగలోజేరును. సకృతి శాస్త్రాదుల నేర్చికొన్న ఫలము శేషాద్రయ్యరు తన పరిపాలనమునం గనబఱచెను.

ఎవరి మంత్రిత్వ మేవిధముగనున్నదో పోల్చిచెప్పుట చాల కష్టము కాని శేషాద్రయ్యరుకు దక్కిన మంత్రులకు నెందైన భేదమున్న పక్షమున నది ముఖ్యముగ నొక దానియం దగపడుచున్నది. దినకరరావు మాధవరావు మొదలగు ప్రాచీన మంత్రులు తమ యధికారము క్రిందికివచ్చిన దేశములలో గ్రమస్థితిలేనిచోట్ల గ్రమస్థితి నెలకొలుపుచు జెడియున్న తావులను జక్కజేయుచు వచ్చిరి. శేషాద్రయ్యరన్ననో యతడు వచ్చునప్పటికి దేశము క్రమస్థితిలోనే యున్నందునఁ జేతిపనులు వాణిజ్యము మొదలగునవి వృద్ధిచేసి సంస్థానముయొక్క ధనస్థితి బాగుపఱచి రాజ్యమును ధనవంతముగ జేసెను.