పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

366

మహాపురుషుల జీవితములు



చతురముగల చెరువేర్పడెను. ఈచెరువువలన నెన్నో యకరముల నేల సాగుబడి యగుచున్నది. ఇవిగాక యీయన యుద్యోగము చాలించుకొనక మునుపు మరియొక పెద్దయెత్తునెత్తెను. కావేరీనది కొండలనుండి క్రిందికి దిగుచోటనుండి యంత్రాది సాధనములవలన నదీజలమును మైసూరు సంస్థానమునకు జక్కగా బ్రవహింప జేయవలయునని యాయన సంకల్పించెను. దీనివలన మైసూరు సంస్థాన మిప్పటికంటె రెట్టింపు భాగ్యవంతమగును. ఈయన మంత్రిగా నుండిన పదునెనిమిది సంవత్సరములలోను నీటు పాఱుదలం గూర్చి యీయన ఖర్చుచేసిన సొమ్ము రమారమి నాలుగుకోట్ల రూపాయలు, కాలమున కనుగుణముగా నుండునట్లు శేషాద్రయ్యరుగూడ నెన్ని యో క్రొత్తడిపార్టుమెంటుల గల్పించి వాటిలో బనిచేయుటకు దన దేశమున సమర్థులు లేనపుడు విదేశములనుండి ప్రకృతి శాస్త్రజ్ఞానము లోకానుభవముంగల సత్పురుషులం బిలిపించుచు వచ్చెను. మునుపున్న డిపార్టుమెంటులంగూడ బై నుండి క్రిందవఱకు సంపూర్ణముగా మార్చివేసెను. మైసూరు సంస్థానమున కోలారు జిల్లాలో బంగారపు గనులు కలవు. ఈగనులను యూరోపియనులు కౌలుకు బుచ్చుకొని పూర్వము సంవత్సరమున కేబది వేల రూపాయల చొప్పున మహారాజువారి కిచ్చుచుండువారు. శేషాద్రయ్య రా గనులను ద్రవ్వుటలో మఱింత ప్రోత్సాహము గలిగించి యిపుడు సంవత్సరమునకు బదునైదులక్షల రూపాయలు రాబడి వచ్చునట్లు చేసెను. ఎంతబుద్ధిశాలియైన నెంతబలవంతుడైన మనుష్యుడుమితజ్ఞుడే కానిసర్వజ్ఞుడుకాడుగదా! అందుచే శేషాద్రయ్యరు రాజ్యపరిపాలనములో బెక్కులోపములు చేసియుండవచ్చు. రైతులకుపయోగకరముగా నుండుటకీయన కృషినిధులను స్థాపించెను. కృషినిధులనగా రైతులకు మిక్కిలి తక్కువ వడ్డిని యప్పులిచ్చెడు బ్యాంకులు. పంట కాపులు