పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్. కె. శేషాద్రి అయ్యరు

363



రెండేండ్లలోనే తాను బ్రతికియున్న పక్షమున జనులకుఁ గలుగు సౌఖ్యము లెట్లుండునో కొంతవఱకు రుచిచూపెను. కాని మైసూరు సంస్థాన వ్యవహారములను నడపుటకు మిక్కిలి గడతేరిన దిట్టరి కావలసిన సమయమందే దేశస్థుల దురదృష్టమున రంగాచార్యుఁడు కాలధర్మము నొందెను. రంగాచార్యుఁడు బ్రతికియున్నప్పుడే శేషాద్రయ్యరు ముందు మిక్కిలి కాగలవాఁడని యాతనిమీఁద నెంతో యాసపెట్టుకొనియుండెను. రంగాచార్యుఁడు పోయిన పిదప శేషాద్రి యాస్థానమున గూర్చుండుట కర్హుడగునా కాఁడా యని గొప్ప సందేహము కలిగెను. కాని కాలమే యెల్ల సందేహములను బాపి శేషాద్రియయ్యరు మొదట జనులనుకొన్న దానికంటె నెక్కువసమర్థుడని నిరూపించెను. 1883 వ సంవత్సరము ఫిబ్రేవరు 12 తారీఖున శేషాద్రయ్యరు మైసూరు సంస్థానమునకు మంత్రిగా నియమింపఁ బడెను.

మంత్రి యగునప్పటికి కతఁడు పడుచువాఁ డగుటచేతను వెనుకటి మంత్రిచేయవలసిన మార్పులవల్ల దారిఁజూపించుటచేత నీతనికి బరిపాలనము సులభమయ్యెను. అప్పటికాయన ముప్పది యెనిమిదియేండ్లవాఁడు. కావున తానుచేసిన మార్పుల ఫలములు కన్నులారఁ జూచుటకు ననుభవించుటకు జిరకాలము జీవించెను. ఆకస్మికముగా గొప్పరాజ్యమును నావయొక్క చుక్కానును ద్రిప్పవలసిన వాఁడగుటచే నతడు క్రొత్తదారులం బోవక రంగాచార్యుడు చూపిన మార్గములనేనడచి యతఁడు వేసినపద్ధతులనే యవలంబించి పరిపాలింపఁ దొడగెను. సంస్థానము మహారాజు కప్పగింపఁబడక పూర్వము 1877 వ సంవత్సరమున దేశమున గొప్పకాటకము సంభవించెను. ఆకఱవుబాధల నివారించుటకు సంస్థానమునకు ముప్పదిలక్షలరూపాయ లప్పయ్యెను. ఈయప్పు నింగ్లీషు దొరతనమువారే యిచ్చిరి. అందు