పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/429

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

362

మహాపురుషుల జీవితములు



ఈయన చేరిన పదమూడేండ్లకు యుక్తవయస్సు ప్రాప్తించి నందున సంస్థానము మహారాజున కప్పగింపఁ బడెను. ఈ పదమూడేండ్లలో శేషాద్రయ్యరు చాల డిపార్టుమెంటులలోఁ బనిచేసి పరిపాలన విధాన మంతయు నేర్చుకొనెను. 1873 వ సంవత్సరమునందు మైసూరులో జ్యూడిషల్ కమీషనరుగానుండిన సర్. జేమ్సు గార్డనుదొర శేషాద్రిని తన కోర్టులోఁ బెద్ద శిరస్తదారుగ నియమించెను. అనంతర మతఁ డాసంస్థానమున నశిష్టాంటు కమీషనరుగా నేర్పరుపఁబడెను. ఆ యుద్యోగమున మూడేండ్లున్న పిదప నాయన మహారాజుగారి మందిరమునకు కంట్రోలరుగా నేర్పరుపఁబడెను. ఈయుద్యోగములో నుండి యతఁడు తుముకూరుజిల్లా డిప్యూటికమీషనరుగారు జిల్లా మేజస్ట్రీటుగాను మార్పఁబడెను. ఈ యుద్యోగమునందు శేషాద్రయ్యరు దేశపరిపాలనమునందు తనకుఁగల సామర్థ్యమును జూపుటకు విశేషముగా నవకాశము గలిగెను. ఆ సామర్థ్యమునుజూచి పై యధికారులు శేషాద్రి జిల్లాకలక్టరు పదవియందేగాక దానికంటె నెక్కువ పదవులయందు నిలుపఁబడఁదగిన వాఁడని గ్రహించిరి.

సంస్థానము మహారాజుగారి కప్పగింపబడిన తరువాత రంగాచార్యులు మంత్రియయ్యెను. మంత్రి యైనతోడనే యాయన చట్టములు శిక్షాస్మృతులు నిబంధనలు మొదలగునవి వ్రాయుటకు బుద్ధిశాలియగు శేషాద్రయ్యరు నేర్పరచెను. రంగాచార్యులు సుఖించుటకు మంత్రి కాలేదు. ఆతఁడు చేయవలసిన కార్యములు విశేషముగా నుండెను. రంగాచార్యుఁడు మిక్కిలి సమర్ధుఁడు. విశేషించి సత్పరిపాలనముఁ జేసి సత్కీర్తి సంపాదింప వలయునను కోరిక కలవాఁడు కావున నెంతోఁ జేయవలయునని కొండంత యాశతోఁ బరిపాలన నారంభించెను. దేశముయొక్క ధనస్థితి బాగుచేయుట కాయన యెన్నో యేర్పాటులఁ జేసెను. మంత్రిగా నున్న