పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

348

మహాపురుషుల జీవితములు



షనరుగా నుండిన గార్డనుదొర రంగాచార్యునిఁ దనకు రివిన్యూ సెక్రటరీగాఁ దీసికొనెను. అది మొదలు వారిరువురు గలసి సంస్థానము నందు జాల మార్పులంజేసి యనేక నూతనపద్ధతులం జొనిపి సంస్థాన వ్యయములు తగ్గించిరి. అదివఱకు కమీషనర్లుగా నున్న ముగ్గురు తెల్లవారినిఁ దొలఁగించి వారిబదు లిద్దఱు స్వదేశస్థుల నియమించిరి. అంతకుమున్ను వేయిరూపాయలు మొదలు పదునాఱువందలవఱకుఁ గల డిప్యూటీకమీషనరు పదవి నిప్పు డేడువందలు మొదలు వేయి రూపాయల వఱకుఁగల యుద్యోగముగఁజేసిరి. ఇరువదియే డసిస్టాంటుకమీషనరు పనులలో నెనిమిది దనావశ్యకమని తగ్గించి యామిగిలిన పందొమ్మిదిపదవులనైన మునుపటివలెఁ దెల్లవారికీయక సమర్థులయిన స్వదేశస్థులకుఁ దక్కువజీతములమీదఁ నిచ్చిరి. ప్రాఁతజీతములమీద నలుగురు డిప్యూటీకమీషనరుల మాత్రమునిలిపి తక్కినయందఱిని దక్కువ జీతములమీద నల్లవారినే వేసిరి. అడవి, చదువులు, రివిన్యూమొదలగు నెల్లడిపార్టుమెంటులలోనుఁ దెలివి తేటలలోఁ సామర్థ్యములోఁ దెల్లవారికి రవ్వంతయుఁ దీసిపోని స్వదేశస్థులు తక్కువ జీతములమీఁద దొరకుచుండగా నెక్కువజీతముల మీఁద దెల్లవారి నేల నియోగింపవలయునను నియమముమీఁద దక్కువజీతముల మీఁద నెక్కువ సామర్థ్యముగల స్వదేశస్థులనే నియోగించుచు వచ్చెను. ఈ మార్పులచేత నీ మితవ్యయముచేత నా సంవత్సరము రెండులక్షల యేఁబదివేల రూపాయలు మొత్తము ఖర్చులో తగ్గెను.

ఈ మహాకార్యములకు వానిని మెచ్చి 1880 వ సం||న దొరతనమువారు వానికి సి. ఐ. ఇ. బిరుదము నొసంగిరి. మైసూరునకు విదేశీయుఁడయి యుండియు నాసంస్థానమున మహోన్నత పదవుల నందుటచే నా దేశస్థులకు రంగాచార్యునిమీఁద నసూయపొడమెను. అందుచేత వారు వానిమీఁద గొన్ని చెడువాడుకలం బుట్టించిరి.